హిందీ పాటల్లో నాకు నచ్చిన కొన్ని పాటల అర్ధాలు,వర్ణనలు పరిచయం చేద్దామనే తలంపుతో, నాకు వీలైనప్పుడు మీతో పంచుకొందామనే ప్రయత్నం ఇది. ఇది కేవలం నాకు నచ్చిన పాటల గురించే.
మొదటగా అబ్దుల్లా చిత్రం లోని ఈ పాట.
అతివ వర్ణన కి పరాకాష్ట,
LYRICS:
मैंने पूछा चाँद से कि देखा है कहीं मेरे यार सा हसीं? चाँद ने कहा, “चाँदनी की क़सम नहीं, नहीं, नहीं”
నా సఖి లాంటి అందగత్తె ను చూసావా అని చంద్రుణ్ణి అడిగా..
అబ్బే , వెన్నెల మీద ఒట్టేసి చెప్తున్నా – చూడలేదని అన్నాడు.
-వెన్నెల జగమంతా కురుస్తుంది కదా. కాబట్టి .. మొత్తం జగత్తు లో తన సఖి లాంటి అందగత్తె లేదని భావం.
मैंने ये हिजाब तेरा ढूँढा हर जगह शबाब तेरा ढूँढा कलियों से मिसाल तेरी पूछी फूलों में जवाब तेरा ढूँढा
मैंने पूछा बाग़ से फ़लक हो या ज़मीं ऐसा फूल है कहीं? बाग़ ने कहा, “हर कली की क़सम नहीं, नहीं, नहीं”
హైదరాబాద్ . ఇండియన్ బ్యాంక్ నల్లకుంట బ్రాంచ్ మేనేజర్ గా ఉన్నప్పుడు,ఒక సీనియర్ సిటిజన్ ఏదో పనిమీద బ్యాంక్ కు వచ్చారు. నేను లోపలక్యాబిన్ లో ఉన్నా. ఆయన కొంచెం ఎక్కువ సేపు కౌంటర్ దగ్గర నిల్చుని ఉంటే నేను బయటకు వచ్చి, సంగతి ఏమిటో కనుక్కొందామని వెళ్ళాను. ఆయన్ను ఎక్కడో చూసినట్టు లీలగా గుర్తు.కౌంటర్ లో పేరు కనుక్కొన్నా. ఆయన Retd ప్రో.శేషాద్రి, JNU Head of Pol Sc. నేను వెంటనే కౌంటర్ బయటకు వెళ్లి, ఆయనను తోడ్కొని నా క్యాబిన్ లో కూర్చోబెట్టి కాఫీ అదీ ఇచ్చాను.
నేను: సార్. మీరు 1975 నా ఢిల్లీ ట్రిప్ లో తీన్మూర్తి లైబ్రరీ temp card కోసం రికమండేషన్ లెటర్ ఇచ్చారు. దానివల్ల నాకు 1947 Aug 15 న్యూస్ పేపర్లు+కాశ్మీర్ హరిసింగ్,నెహ్రూ,పటేల్ ఉత్తరాల కాపీలు వగైరా చదివే భాగ్యం కలిగింది. అని చెప్పాను
ప్రో: బ్యాంక్ ఉద్యోగం లో చేరావా? PhD చేసి అకడమిక్స్ choose చేసుకోవాల్సింది అన్నారు.
నే: అంత అదృష్టం లేదు సార్ అన్నాను. ఆయన పని నేను స్వయం గా చేసి పెట్టి సాగనంపాను.
ఒక వారం తర్వాత పని గట్టుకొని వచ్చి నన్ను వాళ్ళ ఇంటికి భోజనానికి తీసుకొని వెళ్లారు. ఇంట్లో చాల పెద్ద లైబ్రరీ. పై అరలో పుస్తకాల కోసం ఒక చెక్క నిచ్చెన. నిజంగా ఒక ప్రో.గారి ఇల్లు అనిపించింది. చక్కటి భోజనం చాల ఆప్యాయంగా వడ్డించారు మేడం.
మీరు ఆయన దగ్గర అంత వినయంగా ఎందుకు ప్రవర్తించారు అని స్టాఫ్ అడిగితే… నాకు తెలిసినప్పుడు అయన (JNU HOD )గురువు గారు. గురువుల దగ్గర వినయంగా ఉండాలి కదా అన్నాను. (నేనేదో చాదస్తపు వాడిని అని అనుకొని ఉంటారు)
కొన్ని ప్రశ్నలు మన పరిధి కి మించినవి ఉంటే వాటిని అంచలంచలుగా address చెయ్యాలి అన్న మాట నాకు నేను చెప్పుకునే సూత్రం – ఈ సమాధానం నేను బహుశా 4/5 ఏళ్ళ క్రితం తెలుగు కోరాలో మొదటి సారి వివరించే ప్రయత్నం చేశాను. ఆ తర్వాత పునఃసమీక్ష ఎలాగూ 15/18 నెలల్లో తిరిగి జరుగుతూ ఉంటుంది
“కోతీ కొమ్మచ్చి” మొదటి భాగంలో అనుకుంటా (బాపు) రమణ గారి ఉపోద్ఘాతం గుర్తుకు వచ్చింది
జీవితంలో తియ్యనిది ఏది ?
అన్న ప్రశ్నని వేసి దానికి బహుసామరస్యంగా రసభరితమైన జవాబు ఇస్తారు అయన
స్నేహం అని, ఆలా ఆన్సర్ ఇవ్వగానే దాన్ని ఆల్రెడీ తీసాం అని ఇంకో జవాబు
అంటే సినిమాగా హిందీ లో ఆల్రెడీ తీసేసారు అంటూ పలు పలు విధాలుగా
తియ్యనైన విషయం ఏది అన్న మాటని బహు విధాలుగా నవరసాలతో చమత్కరించి
దాటేసిన రేవు ; గడిచిపోయిన కష్టాలు బహు తీపి అని ఒక అభిప్రాయాన్ని వెలుబుస్తారు
ఈ మాట ప్రకారంగానే పడిన కష్టాలలో నే ఇష్టాలు వెతుక్కున్న జీవితం నాది
కష్టాలు అంటే సినిమా కష్టాలు మాత్రం కావు
చెప్పాలంటే ఒక విధమైన ప్రివిలెజ్డ్ జీవితమే మొదటి ముప్పై ఏళ్ళు
ఒక టిపికల్ మిడిల్ క్లాస్ జీవితం బాధ్యత గల తల్లితండ్రులు మేము మొత్తం ముగ్గురం – ఒక అక్క ఒక తమ్ముడు మధ్యలో నేను – అందరం చదువులు బాగానే చదివి అక్క డాక్టర్ – మేమిద్దరం ఇంజినీర్లం అంతా బాగానే ఉండేది
నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వడం వలన ఫామిలీ మొత్తంలో మొదటి విదేశ యాని ఒక
నాలుగు ఏళ్ళు లండన్ మరియి అమెరికాలలో తాత్కాలిక వర్క్ పర్మిట్ లతో
కానీ నా పెళ్లి అయ్యిన రెండు ఏళ్లలోనే అమ్మకి కలిగిన తీవ్ర మోకాటి నొప్పులతో కలిగిన ఆరోగ్య సమస్య, ఆ తరువాత మోకాళ్ల ఆపరేషన్ అది అప్పటికి సక్సెస్ అయినప్పటికీ కొన్ని నెలల కు అమ్మ / నాన్నగారు విడిగా వైజాగ్ లో వుంటున్నప్పడు అమ్మ ఇంట్లో జారి కాలు విరగడం, ఆ తర్వాత ఆమె అతి కష్టం మీద నడుస్తూ ఉండడం, ఇంక ఇలా కాదని అందరమూ కలిస్తే ఉందాం అని అమ్మ / నాన్నగారు ఇరువురు నా ఇమ్మీడియేట్ కుటంబంతోనే కలిసి ఉందాం అని హైదరాబాద్ కి షిఫ్ట్ అయిపోవడం, aggressive arthritis ఇంకా ఇంకా వృద్ధి చెంది క్రమ క్రమంగా అమ్మ ఎక్కువగా వీల్ చైర్ లోనే శేషజీవితం గడపాల్సి రావడం)
ఈ ప్రహసనం ఫామిలీ మొత్తం సమగ్రంగా ఎదుర్కొనే కష్టం అది చాలా కాలం సాగడం వలన క్రమ క్రమంగా మా ఫామిలీ రకరకాలుగా రూపాతరం చెందింది అని చెప్పాలి
అందులో ముఖ్యమైనది నేను సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మరియు మానేజ్మెంట్ ట్రాక్ లని వీడి ట్రైనింగ్ వైపు పయనించడం (లైఫ్ బాలన్స్ కోసం అని నా భావన)
దాన్నించి ఇంకోళ్ళకి పాఠాలు (సాఫ్ట్ స్కిల్స్) నేర్పే బాటలో పాట్లు పొరపాట్లు దాన్నించి కొత్త పాఠాలు అది ఒక ప్రహసనం నించి ఇంకో ప్రహసహనం వైపు వెడుతూ గడుపుతున్న జీవితం (Transitions)
ఒక కార్పొరేట్ జాబ్ వదలాల్సిన పరిస్థితి వచ్చిన తర్వాత కొంచం కష్టాలు పెరిగాయి – సామర్ధ్యం కూడా పెరిగింది కానీ కావాల్సిన మేరకు ఇంకా పెంచుకొనే కష్టం మరియు దాంతో మిళితమైన ఇష్టం లో ప్రస్తుతం నేను
అమ్మ 2010 లోనే భౌతికంగా వెళ్ళిపోయుంది కానీ నాన్నగారి సాంగత్యం మాత్రం Jan 2025 వరకు ఒకే చూరు క్రింద కొనసాగడం ఒక విధంగా నా అదృష్టం.
ఆయన పాతిక ఏళ్ళ రిటైర్డ్ లైఫ్ లో సింహభాగం ఒకేచూరు క్రింద కలిసి ఉండడం – ఇది వేరే లెవెల్ కి చెందిన ప్రివిలేజ్ తరచి చూస్తే
ఆయన పదాల్లో పదనిసలు / పెడసరాలు / పద నషాలు అధ్యయనం చేసే అవకాశం కాస్త సావధానంగా లభించడం, వాటిలో అన్యాపదేశం గా వున్న సందేశాల్ని వడిసిపట్టడం నాకు వ్యక్తిగతంగా లభించడం, ఆయనకు వివరించి చెప్పే అలవాటు లేదు (తరచి తరచి అడిగితే కానీ), నాది కాస్త మట్టి బుర్ర కాబట్టి నేను వెంఠనే ఆకళింపు చేసేసుకునే ప్రతిభ అంతంత మాత్రమే కాబట్టి విషయాన్ని క్రమ క్రమంగా వివరించే ప్రయత్నం చేసే రాత మాధ్యమం ఎన్నుకోవడం, దాన్ని అప్పుడడప్పుడు పునఃసమీక్ష చేసుకోవడం – ఇదంతా చాలా కాలం నడిచిన ప్రహసనం.
వెరసి ఆయన వలన గ్రహించిన wisdom లెసన్స్ వాటిని Will, Skill & Chill (Clues for overcoming your “Transition” Blues) గా మలచడం జరిగాయి ( first time in Sept 2019)
కరోనా సమయంలో మళ్ళీ దాదాపు రెండేళ్ల పాటు నిర్వహించిన మధ్యంతర పాలేరు (mid rung మానేజ్మెంట్ రోల్ in a mid level org) జీవితం కూడా చెట్టు ఎక్కింది
కావున గత రెండేళ్ల సమయంలో నేను ఈ మధ్య కాలంలో ఎక్కవగా వినవస్తూ వున్న SAD అంటే స్ట్రెస్ / ఆంక్సిఏటీ / డిప్రెషన్ అన్న విషయాలపై కాస్త అవగాహన పెంచుకుని CBT (కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ) అన్న విషయంలో కౌన్సిలింగ్ సర్టిఫికెట్ ని తీసుకుని నా లైఫ్ కోచింగ్ అన్న విషయంతో పాటు అవసరమైనప్పుడు కౌన్సిలింగ్ చేయడం అన్న విషయం లో అధ్యయనం మరియు ఆచరణ (ప్రాక్టీస్) పెంచుకుంటూ సాగుతున్నా
దాదాపు 6 ఏళ్ళ తర్వాత ఈ పుస్తకాన్ని (Will, Skill & Chill – Clues for overcoming your “Transition” Blues) మరి కొంత కంటెంట్ మరియు ఇంకో టాగ్ లైన్ (In a Post Covid and AI-first world) జోడించి విడుదల చేయడం జరిగింది.
The mentioned is Both Amazon & Flipkart listed – check with my full name (Jagan Mantha – if interested)
ఇవాళ పొద్దున్నే పెద్ద తప్పు జరిగిపోయింది! అంటే నాలాంటి పెద్ద మనిషి చేసే తప్పు అని చిత్రీకరించచ్చు!
నా దృష్టిలో తప్పు చిన్నదే కానీ మా ఆవిడ దృష్టిలో చాలా పెద్దది.
పొద్దున్నే నాలుగున్నరకి కాకికంటే ముందు లేచి మా ఆవిడ నిద్ర లేచే సమయానికి సర్ప్రైజ్ ఇద్దామని ఒక బర్నర్ మీద పాలు కాస్తూ ఇంకో బర్నర్ మీద నీళ్లు వేడి చేసి కాఫీ ఫిల్టర్లో పోస్తుండగానే, పక్కనే ఉన్నా కదా అని స్టవ్ హై లో పెట్టా అందుకని ఉన్నట్టుండి ఒక్క క్షణంలో పాలు పొంగిపోయి వరదలా పారాయి! చూడుడు మొదటి ఫోటో!
పాలు పొంగితే తర్వాత జరిగే శుభం మాటేమో కానీ ఇంకాసేపట్లో మా ఆవిడ నిద్ర లేచాక…
అమ్మో తలుచుకుంటేనే…
వెంటనే నా తక్షణ కర్తవ్యం ఏమిటి అని ఆలోచించాను. ఏముంది హంతకుడు హత్య చేసిన వెంటనే రక్తం మరకలని శుభ్రంగా తుడిచేసినట్టు పొంగిపోయిన పాలని తుడిచేసేయడమే.
వెంటనే ఒక పాత గుడ్డ తీసుకొచ్చి పాలని సుబ్బరంగా తుడి చేశాను. స్టవ్ ఎత్తి దాని కింద ఉన్న పాలను కూడా. పొంగిన పాలన్నీ ఓ గిన్నెలో పిండితే గిన్నె మొత్తం నిండిపోయింది. చూడుడు రెండవ ఫోటో!
పొంగిన పాలని తుడిచాను గాని పాలు కొంచెం తక్కువ ఉన్నట్టుగా ఉందేమిటని మా ఆవిడకి అనుమానం రాకుండా ఎన్ని పాలు పొంగాయో అన్ని నీళ్లు పాలలో కలిపేసాను. ఆవు పాలు ఎటు తిరిగి పల్చగానే ఉంటాయి కదా? అయినా మీ పిచ్చి కానీ పాలల్లో నీళ్లు కలిపే అమ్ముతారుగా?
తర్వాత మా ఆవిడ కాఫీ ఇచ్చినప్పుడు మన మీద అస్సలు అనుమానం రాకుండా “ఏమిటో ఈమధ్య పాలు మరి పల్చగా ఉంటున్నాయి? కొంపతీసి ఆవులు నీళ్లు ఎక్కువ తాగుతున్నాయా ఏమిటి?” అని ఓ కుళ్ళు జోక్ వేస్తే సరి.
హత్య అనంతరం అన్నీ శుభ్రంగా తుడిచేసి హంతకుడు చల్లగా జారుకున్నట్టు నేను కూడా మార్నింగ్ వాక్ కి వెళ్ళిపోయాను మా ఆవిడ ఇంకా నిద్ర లేవడానికి ముందే.
రోడ్డు మీద నడుస్తున్నానే కానీ ధ్యాసంతా మా ఆవిడ మీదే! ప్రేమతో కాదండోయ్! ఎందుకో విజ్ఞులైన పాఠకులకు ఈపాటికి తెలిసే ఉంటుంది.
సరే మొత్తానికి ఓ గంట పాటు కాళ్ళీడ్చుకుంటూ నడిచి ఇంటికొచ్చి హాల్లో సోఫాలో యధావిధిగా కూలపడ్డాక మా ఆవిడ కూడా యధావిధిగా కాఫీ ఇచ్చింది. హమ్మయ్య ఆవిడ కంట పడలేదు మనం చేసిన వాళ్ళ దృష్టిలో గోహత్యా సమాన అపరాధం.
నింపాదిగా కాఫీ అలా తాగడం మొదలెట్టానో లేదో క్యూములోనింబస్ మబ్బు బరస్ట్ అయినట్టు హఠాత్తుగా ED ఎంక్వయిరీ మొదలయ్యింది.
“ఏమిటి. పొద్దున్నే పాలు పొంగించినట్టున్నారు?” పాలు పొంగినట్టున్నాయి అని అడగలేదు. నోట్ దిస్ ఫైన్ పాయింట్ యువర్ హానర్! అంటే మనల్ని అపరాధిగా నిర్ధారించేసినట్టే. ఇదేం అన్యాయం. కాస్త ఇన్వెస్టిగేషన్. కూసింత ఇంటరాగేషన్ అయ్యాక వాదోపవాదాలు విన్నాక సాక్షాధారాలు పరిశీలించాక చేయాల్సింది ఇలా వెంటనేనా.
హతవిధీ! రక్తపు మరకలు, వేలిముద్రలు లేకుండా హంతకుడు తుడిచినట్టు శుభ్రంగా తుడిచానే. ఇలా ఎలా దొరికిపోయాను. ఎంత పెద్ద మేధావి అయినా చిన్న తప్పు చేసి పోలీసులకి దొరికిపోతాడని విన్నా! కానీ నేను చేసిందే చిన్న తప్పు! అది దొరక్కుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నానే? కొంపతీసి అలా వంటింటి గట్టు తుడిచిన పాత గుడ్డ అక్కడే కంగారులో వదిలేసానా ఏమిటి? అలవాటు లేనివాడు మొదటిసారి హత్య చేస్తే ఇట్లాగే దొరికిపోతాడు!
ఇక్కడే ఇంకో చిన్న తప్పు జరిగింది.
అదేమిటంటే నేర ప్రవృత్తి ఉన్నవాడు ఇంటరాగేషన్ లో సమాధానాలు చెప్పే విధానం వేరే ఉంటుంది. “తెలీదు. గుర్తులేదు. మర్చిపోయాను” అలా అన్నమాట! కానీ నాలాంటి పెద్ద మనుషులు, పెద్ద మనసున్నవాళ్ళు ఎప్పుడో ఓ చిన్న తప్పు చేస్తే ఇంటరాగేషన్ మొదలవ్వక ముందే తప్పు ఒప్పేసుకుంటారు. గిల్టీ ఫీలింగ్ మరి.
అందుకని ఆవిడ అలా ప్రశ్న వేయగానే కరుడుకట్టిన నేరస్థుడు అయితే “పాలు పొంగడం ఏమిటీ” అనో లేదా “పాలు పొంగాయా? నాకు తెలీదే?” అని ఎదురు ప్రశ్న వేస్తాడు. అఫెన్స్ ఈజ్ ది బెస్ట్ డిఫెన్స్ అన్నట్టు. మనబోటి వాడు దొరికిపోతామేమోనని గంట నుంచి పైకి కనిపించకుండా లోపల్లోపల వణుకుతున్నప్పుడు ఇలా భార్య నిలదీస్తే కరచరణాలు ఆడక బుర్ర పని చేయక పుసుక్కున దొరికిపోతాం. ఎలా అంటే ఇదిగో ఇలా!
“ఎలా తెలిసింది” అన్నా “ఎలా తెలుసుకున్నావు” అని మనసులో అనుకున్నా. ఈ ఆడవాళ్ళకున్న అతీంద్రియ శక్తులు అనంతం!
నేనలా జవాబివ్వగానే తేలిపోయిందిగా మనం భారీగా పాలు వంటిల్లంతా వరదలా పొంగించామని.
ఇహ తప్పు తేలిపోయాక ఏముంది కోర్టులో అయితే జడ్జిమెంట్! ఇక్కడో “జన్మానికో శివరాత్రి అన్నట్టు అమావాస్యకో పౌర్ణమికో పాలు కాస్తే పొంగాల్సిందే! చిన్నపని కూడా సరిగ్గా చేయలేరు కదా….. …. ” అంటూ జాతిని ఉద్దేశించి ప్రసంగం!
అన్నట్టు ఇవాళ కాకతాళీయంగా పౌర్ణమి!
కాసేపయ్యాక ఎలా దొరికానో ఏవన్నా ఆనవాలు దొరుకుతుందేమోనని ఆవిడ లేని సమయంలో వంటింట్లోకి వెళ్లి పాల గిన్నె, పరిసరాలు అపరాధ పరిశోధకుడిలా పరీక్షించా! వెంటనే దొరికింది. నేనెలా దొరికానో అన్న దానికి నిదర్శనం. గట్టు, స్టవ్ అతి జాగ్రత్తగా తుడిచాను కానీ పాల గిన్నె చుట్టూ పొంగిన పాలు చేసిన మరకలు మరిచా! చూడుడు మూడవ ఫోటో!
ఇంత చిన్న తప్పు చేసి అన్ని మాటలు పడ్డాక కనీసం సాయంత్రం లోపల ఏమన్నా శుభవార్త వింటే బాగుండును. క్లయింట్ నుంచి రావాల్సిన పెద్ద చెక్ వస్తుందా ఏమిటి? అప్పుడు ఎంచక్కా ధైర్యంగా మా ఆవిడతో “చూసావా? పొద్దున్నే పాలు పొంగించానని ఆడిపోసుకున్నావు. ఇప్పుడు చూడు ఏం జరిగిందో? మొగుళ్ళు కూడా అప్పుడప్పుడూ కూసింత మంచి పనులు చేస్తూంటారు. మీరు గమనించరు అంతే” అని నేను పగ తీర్చుకోవచ్చు!
ఎండాకాలం వస్తే కాలనీ సందడి భలే ఉంటుంది. ఇంట్లోకన్నా పిల్లలందరూ బయటే ఉంటారుగామరి. పిల్లలేకాదు, కుర్రాల్లు పిట్టగోడమీదే వేళ్ళాడతారు. పెద్దవాళ్ళు వాకింగులు టాకింగులు అంటూ పార్కు కమ్యూనిటీ హాలులో సగం రోజు గడిపేస్తారు. రిటైరుడు ఏఈ శోభన్ బాబు గారు ఇన్ఫ్లుయెన్సుతో అక్కడికి ఓ కరంటు కనెక్షన్ తెప్పించారు కొన్నేళ్ళకిందట. ఓ రెండు సీలింగు ఫ్యాన్లూ, రెండు పెడస్టల్ ఫ్యాన్లూ రియలెస్టేటు మోహన్ చేత ‘స్పాన్సర్’ చేయించారు — ఆయన కంపెనీ పేరు రాసే అనుకోండి. మామూలురోజుల్లో పిల్లలు ఐదున్నరయ్యేసరికి ఇంటికి రాకపోతే బాల్కనీలలోకి, అరుగులమీదకి వచ్చి పెద్ద అరుపులు అరిచే తల్లులందరూ ఎనిమదయినా ఏం పర్లేదు ఈ చుట్టుపక్కలే ఎక్కడో ఉండుంటారని హాయిగా అరుగు బాతాఖానీ కొట్టుకుంటూ ఉండిపోతారు. రెండునెళ్ళ సెలవలు — అందరికీను.
పార్కు వెనకవైపు గోడ అవతల హెచ్చైజీ ఇల్లు సుదర్శనంకుల్ ది. వాళ్ళబ్బాయి ఇంగ్లాండొ ఫిన్లాండో ఎక్కడో ఆన్సైటులో ఉన్నాడు కొన్నాళ్ళుగా. ఈ సంవత్సరం అంకుల్, ఆంటిని అక్కడికి రమ్మని టికెట్లు తీసాడు. తిరగడానికి కాదులెండి. ఆరోనెల కడుపుతో ఉంది కోడలుమరి. ఆల్రెడీ ఇంట్లో నాలుగేళ్ళ పిల్లోడున్నాడు. తప్పదుగా! కొరియర్ కంపెనీలో పచ్చడ్లు ప్యాకింగు చేయించేసుకుని, మూన్నెళ్ళకి సరిపడా మందులు పట్టేసుకుని, బొంతల కుట్టడానికి పాత చీరలు పట్టుకుని రెడీ అయ్యి ఫ్లైటెక్కేశారు ఇద్దరూను.
ఇంతకీ మనకి ఇందులో ఇంట్రెస్టేమిటంటే ఆ ఇంటి లోపల గోడకానుకుని ఆసియాఖండంలోకల్లా గొప్ప మామిడిచెట్టు ఉంది. అది బంగినపల్లని కొందరూ, కాదు ఆల్ఫన్సోనో లంఘడానో కొబ్బరిమామిడీ అని మరికొందరూ ప్రతీఏడాదీ ఆర్గ్యూచేసుకోవడం ఆనవాయుతీ. ఏదయితేనేం ప్రతీ సంవత్సరం మే నెలలో పండేది, ప్రతీ ఇంటికి ప్రసాదంగా రెండో మూడో సాంక్షన్ అయ్యేవి. ఆ కోటాకోసం సంవత్సరమంతా అంకుల్ కి గుడ్మార్నింగూ గుడీవినింగూ చెప్పేవాళ్ళం. మరేపండు టేస్టూ దానికి సాటిలేదు. ఎందరో ట్రై చేశారు. కలకత్తనుంచీ అని, అలమండనుంచీ అని, సింగపూరునుంచీకూడాను. ఏ డబ్బాకొన్నా, ఎంతపోసినా ఆ టేస్టు నభూతో నభవిష్యత్!
ఈ ఏడాది ఊరెళ్ళడంతో ఆంటీ మావయ్య ఒకాయన్ని ఇంటికాపు పెట్టి వెళ్ళారు. ఆయన స్వచ్చమయిన తెల్లపంచతో పెద్దమీసాలుపెట్టుకుని భలే ఉండేవారు. విజయనగరం దగ్గరేదో అగ్రహారమంటాయనది. ఉదయాన్నే లేచి పార్కు చుట్టుపక్కలున్న పూలు కోసుకొని మంచి గొంతుతో గట్టిగా రోజూ చాలాసేపు పూజచేసేవారు. మేము పార్కుచుట్టూ సైకిల్ తొక్కుకుంటుంటే రౌండు రౌండుకీ అష్టోత్తరాలు సహస్రాలూ వినబడేవి. తాతగారికి బయట స్నానం చెయ్యడం అలవాటు. ఊర్లో ఇంట్లో బావో తొట్టో ఉండుంటుంది. ఇక్కడలాంటి అవకాశం లేదుకాబట్టీ గార్డెన్ పైపు దగ్గరో బక్కెట్టుపెట్టుకుని అక్కడ స్నానం చేశేవారు. ఆ స్నానంచేస్తున్నంతసేపూ రుద్రం గట్టిగా చదివేవారు. ఆ రుద్రం అయ్యేవరకు స్నానం అవ్వదు.
ఇదంతా మేము మా డిటెక్షన్ తెలివితేటలతో తెలుసుకోవడానికి కారణం ఆసియాలో బెస్టు మామిడికాయలు.
అంకుల్ ఇల్లు పార్కు వెనకుండడంతో అటుపక్క పెద్దగా ఎవరూ వెళ్ళే పనుండదు. అందుకు ఇంటిగోడకి ఇవతలిపక్క ప్రతీ సమ్మర్లో కంచె కట్టించేవారు సుదర్శనం గారు. ఈ ఏడాదికూడా ఫారెనెళ్ళే ముందే కట్టించేసారు. గోడ ఎడ్జిదగ్గర కాలవ పారడానికి మాత్రమే అందులో గ్యాపుండేది. మిగితాదంతా ముళ్ళు. దాదాపు అందరమూ ఆ ముళ్ళకి చొక్కాలు చింపుక్కున్నవాళ్ళమే. ఈ సంవత్సరం మాత్రం పెద్ద స్కెచ్చేసి మేలో వచ్చే రెండుపళ్ళ ప్రసాదంకాదు ఓ డజను కాయలు కోసేసి ఉప్పు కారం నంచుకుని తినేయాలని నలుగురం నిశ్చయించుకున్నాము. అయితే తాతగారు రోజంతా తోటలో ఏదో పని చేస్తూనే ఉండేవారు. పూజకూడా వరండాలోనే చేసుకునేవారు. పడుకోవడం కూడా అక్కడే. ఒక్క స్నానం చేసినప్పుడుమాత్రమే ఓ పదిహేనిరవై నిమిషాలు సేఫు అని డిసైడయ్యాము.
మాలో సన్నంగా ఉండేది టింకు. పార్కులో ఉన్న చెట్లన్నీ ఎక్కించేశం వాడిచేత ప్రాక్టీసుకి. ఓ అశోకా చెట్టుంటే అది కూడా ఎక్కించాం. మధ్యలో కాకొకటి గూడు కట్టుకుంది. దాని దగ్గరకెళ్ళేసరికి గుండుమీద గుచ్చేసింది పాపం వాడికి. లక్కీగా పెద్ద రక్తమేం రాలేదులెండి. మిగితా ముగ్గురం ఒక్కో డ్యూటీ వేసుకున్నాం. అనిల్ గాడు పార్కుగోడమీదనుంచీ తాతగారిని చూసి మాకు పొజీషన్ చెప్పాలి. అభయ్ గాడు సైకిలేసుకుని గేటు దగ్గరే తిరుగుతూ ఎవరొచ్చినా సిగ్నల్ ఇవ్వాలి. నేనేమో టింకుగాడికి గైడెన్సు కిందనుంచీ ఎలాఎక్కాలి, పళ్ళెలాకొయ్యాలి అని. ఒక గెస్టునికూడా తెచ్చుకున్నాం. మా గణపతి టెంపుల్ పూజారి ప్రసాదుగారి కొడుకు మనోజుని. వాడు మాకన్నా ఏడాది చిన్న. కానీ వాడికప్పుడే జూనియర్ పంతులుగా ట్రయినింగ్ ఇచ్చేస్తున్నారు వాళ్ళ నాన్నగారు. రుద్రం ఎప్పుడయిపోతోందే చెప్పే డ్యూటీ వాడిది.
సాయంత్రం ఐదయ్యింది. తుండుగుడ్డ తెచ్చుకుని తాతయ్య స్నానానికి బయలుదేరారు. గేటుదగ్గరనుంచీ అభయ్ సిగ్నల్ ఇచ్చాడు, ఆపరేషన్ మొదలు అని. గోడమీద అనిల్ కన్ఫర్మ్ చేశాడు, “కనబడుతున్నారు, బకెట్లో నీళ్ళు నింపుతున్నారు, ఓవర్” అని. మొదటి మగ్గు నెత్తిమీంచీ పోసుకోంగానే టింకుని కంచెపక్కన కాలవలోంచీ లోపలికి తోసేశాం. చేతిమీద ఓ రెండు గీతలతో తప్పించుకుని అటుపక్కకెళ్ళిపోయాడు. వెంటనే గోడెక్కి చెట్టెక్కడం మొదలెట్టాదు.
ఓం నమో భగవతే రుద్రాయ….
మొదటి కొమ్మ మీదనుంచీ సౌండుచెయ్యకుండా పాక్కుంటూ చెట్టు మధ్యకి చేరాడు.
నమో హిరణ్య బాహవే…
మూడోకొమ్మ పట్టుకుని పళ్ళున్నచోటకి చేరిపోయాడు. మామీదమాకు భలే గర్వమేసింది. భలే ట్రెయినింగ్ ఇచ్చామురా అని. గేటు దగ్గర, గోడమీద మన వేగులు అన్నీ క్లియర్గా ఉన్నాయని సంకేతమిచ్చారు. ఆ పైన ఒక బ్రహ్మాండమయిన పచ్చరంగులో ఆరుకాయలు గుత్తు చూపించాను టింకుకి. మనోజుని అడిగాము — “ఎంతవరకు వచ్చారాయన” అని.
శంకరాయచ మయస్కరాయచ నమఃశివాయచ శివతరాయచ….
సగంపైన అయిపోయింది తొందరపడండన్నాడు. చిన్న ఈళవేసి “తొందరగారా” అని టింకూకి చెప్పాం, వాడు పాక్కుంటూ ఆ ఆరుకాయలున్న కొమ్మని విరిచేసాడు, కానీ వాడి ఊపుడులో బరువుకి అది ముల్లమధ్యకి పడిపోయింది. అయ్యో అని బుర్రపట్టుకున్నాం అందరం!
ద్రాపే అంధసస్పతే…
“తొందరగా! అయిపోవచ్చింది” అన్నాడు మనోజు. వెనక్కి తిరుగుతూ పక్కనున్న మరో రెండు చిన్న కాయలు కోసుకుని జేబులో కుక్కేసి పాక్కుంటూ దిగడం మొదలెట్టాడు.
త్ర్యంబకం యహామహేసుగంధిం…
“అయిపోయింది, తొందరగా” అని మా చిన్నపంతులు చెప్పేసరికీ గాబరాకి రెండో కొమ్మమీదనుంచీ దూకేసాడు. మాకు ఆ సౌండు ఏదో దీపావళికి లక్ష్మీ బాంబు పేలినట్టు వినిపించింది! అనిల్ గాడు వెంటనే తాతగారివైపు చూశాడు. కానీ బక్కెట్టెత్తి నెత్తిమీదనుంచీ నీళ్ళుపోసుకుంటున్నారాయాన “శంభో శంకర” అని. ఊపిరి పీల్చుకున్నాం. గభేలున గోడెక్కేసి ముల్లకంచెకి అటువయిపు దూకూశాడు టింకు. “వచ్చేయి, వచ్చేయి” అని ముగ్గురం పిలిచాం, “తాతగారొచ్చేస్తారు” అని. వరండాకి మామిడిచెట్టు పక్కనుంచే రావాలి మరి. కానీ మా టింకూగాడేం ఆశామాషీవాడు కాదు! ఎలాగోలా ముళ్ళమధ్యలోంచీ ఆరుకాయలున్న కొమ్మని పట్టుకుని కాలవ సందులోకి పడేశాడు. అది నేను తీసేసి అభయ్ సైకిల్ ముందున్న బుట్టలో పెట్టేశాను. దానిమీద గుడ్డకూడా కప్పేసాం. ప్లానింగలాంటిది మరి! పాక్కుంటూ మరో రెండు గీతలు గీకించుకుని టింకు బయటపడ్డాడు. “పద, పద పార్కులోకి వెళ్ళిపోదాం” అని సైలెంటుగా మేము పరిగెడుతుంటే,
ఓం నమో భగవతే రుద్రాయ …
అని మళ్ళీ వినిపించింది! అందరం స్లోమోషన్ లో మనోజు వైపు తిరిగాము. వాడొకసారి ఆలోచించి “ఒరేయి, ఇవాళ మాసశివరాత్రి, సోమవారం, అందుకని మరో సారి చదువుతున్నట్టున్నారు” అన్నాడు. టింకు వాడిని కొట్టినంతపనిచేశాడు! “ముందు చెప్పొద్దా పెద్ద పంతులన్నావు…” “నాకెలా తెలుస్తుందిరా” అని కంట్లో నీళ్ళు పెట్టేసుకున్నాడు మనోజ్. “సర్లే పదండ”ని పార్కులోకెళ్ళి పంపుదగ్గర కడిగేసుకుని తలో కాయ తీసాం. ఇంట్లోంచీ అందరం ఉప్పు కారం పొట్లం కట్టుకొచ్చాం ముందే. అది తీసి ఎక్కడ అయిపోతాయో అని చిన్న చిన్న ముక్కలు కొరుక్కుంటూ తినేశాం. తిన్నంతసేపూ రుద్రం వినబడుతూనే ఉంది. మూడుసార్లు చదివారంట తాతగారు, మనోజ్ చెప్పాడు. ఎక్కువ కష్టపడినందుకు టింకుగాడికి ఒక కాయ ఎక్స్ట్రా. ఆ సంవత్సరం మరో రెండుమూడుసార్లు ఇలా సెట్ చేశాం. మాకు కోటాకింద తలా ఒకటో రెండూ పళ్ళుమాత్రమే వచ్చాయాసంవత్సరం. ఆ తరువాత చాలారోజులు మాకు ఎక్కడ రుద్రం వినబడినా ఆ మామిడిపళ్ళే గుర్తొచ్చేవి.
స్ఫూర్తి కలిగించే గానమే కానీ ఈ పాట అంతా ప్రకృతి గురించి వర్ణన కదా (This is all about Nature)
కానీ మీరడిగిన ప్రశ్నకి సమాధానం మాత్రం వేగవంతంగా రూపాంతరం చెందుతున్న పోటీ ప్రపంచంలో అటు మార్కెట్లు దాంట్లో పోటీ పడే కంపెనీలు (తాటిచెట్టు అంత వాడు ఉంటే దాని తల తన్నే వాడు వేరే వాడు ఉన్నట్లు) అందులో పని చేసే వివిధ స్థాయిలకు చెందిన ఉద్యోగులు ఉద్యోగినులు బృందనాయకత్వ్యం ప్రవృత్తి పై ఆధారపడే విషయం (This is all part of Culture you and I are participating in and shaping everyday)
నా ఆన్సర్ కొంచం వేదాంత ధోరణిలో కనపడచ్చు – కానీ ఈ ( ఇలాంటి) పరిస్థితులు ఎంతోకాలంగా ఎదుర్కొన్నాను, ఇంకా ఎదుర్కొంటూనే వున్నాను – కాబట్టి నేను ఈ విషయంలో చెప్పగలిగేది ఏంటి అంటే
బాగా ముగ్గిన పళ్ళని ప్రకృతి లో చెట్టు కూడా అంటి పెట్టుకోదు(అవి ఎప్పుడో అప్పుడు రాలి పోతాయి) కాబట్టి అలాంటి విషయం మనం ప్రైవేట్ కంపెనీ లలో ఒక స్థాయి కి మించి ఆశించలేము. మనం గవర్నమెంట్ ఉద్యోగాలతో ఈ విషయం ఎంత కంపేర్ చేసుకుంటే అంతే ఆశాభంగం మనకు ఎదురు అవుతుంది.
కాబట్టి మనం ప్రైవేట్ కంపెనీ ఎదుగుదల కి అవసరమయ్యే విషయాలలోనే మన క్రియాశీల వ్యవహారాలు ముడిపడి ఉండేలా చూసుకోవాలి
మన ఎక్సపీరిన్స్ ఇంకొరికి ఏ విధంగా ఉపయోగపడగలదు అనే కన్నా
అది ఉపయోగపడేలా నేను నన్ను ఎలా మలచుకోగలను అన్న ఆలోచనే మీకు మీ షెల్ఫ్ లైఫ్ (Shelf Life) పెంచే సాధనం (ఆయా కంపెనీ లోనే కాకపోయినా మొత్తం ఇండస్ట్రీని ఒక ప్లాట్ఫారం గా మీరు భావించగలిగితే )
ఇది చాలా సులువుగా అయిపోతుంది అని మాత్రం అనను – ఎవరి దారి వారు వెతుక్కోవాల్సిందే (It is definitely an important TRANSITION to make during mid life/career stages)
నేను 2019 సెప్టెంబర్ లో అమెజాన్ కిండిల్ లో సొంతంగా ప్రచురించిన పుస్తకం (Self Published Self help book) విల్, స్కిల్ అండ్ ఛిల్ల్ (క్లూస్ ఫర్ ఓవర్ కమింగ్ యువర్ ట్రాన్సిషన్ బ్లూస్) (Will, Skill & Chill – Clues for overcoming your transition blues) అన్న పుస్తకం కొంత ముడి సరుకుని అందించగలదేమో? దాదాపు 6 ఏళ్ళ తర్వాత ఈ విషయంలో మరొక అప్డేటెడ్ ఎడిషన్ with over 30% more content (జులై 2025) లో విడుదల చేయడం జరిగింది కూడా
“ఆరోజు అలా చేసి ఉంటే…ఈరోజు ఇలా ఉండేది కాదు, అని మీరు అనుకునే సంఘటన ఏంటి?” పొద్దున్న ట్విట్టర్లో వచ్చిన పై ప్రస్తావనకు నా సమాధానం నా పెళ్ళి అని ఇచ్చాను.
దానికి వివరణ అని కాదు కానీ, కొన్ని భావాలు, అనుభవాలు పంచుకోవడానికే ఈరోజు ఈ రాత.
చిన్నప్పట్నుంచీ కూడా పెళ్ళి అంటే సదభిప్రాయం లేని మాట వాస్తవం. దానికి తోడు, ఇంట్లో దైవభక్తి, అందుకు సంబంధించిన ఆచార వ్యవహారాలు ఎక్కువగా ఉండడం చేత అసలు పెళ్ళి కంటే దైవభక్తి మార్గమే చాలా గొప్పదీ, ఉపయోగమైనదీ, మానవ జన్మను సార్థకపరచేదీ అని ఇలా రకరకాల అభిప్రాయాలు కలగడమూ, కొండొకచో, కొన్నింటిని కొంతమంది బుర్రలోకి జొప్పించడం కూడా జరిగింది.
పెళ్ళి అంటే కేవలం పిల్లలూ, సంసారం, బరువూ, బాధ్యతా తప్పించి అందులో మరే ఇతర ఉపయోగమూ లేదని బాగా గట్టిగా అల్ట్రాటెక్ సిమెంటు ముద్రలు బుర్రలో బాగానే పడ్డాయి. పైగా, అటువంటి అభిప్రాయాలకు బలం చేకూరుస్తూ పద్ధెనిమిదో యేటనుంచే ఉద్యోగం చేయవలసి రావడం, కుటుంబ భారం కాస్తంత నెత్తిన పడడం లాంటివి కూడా జరిగాయి. అందువల్ల పెళ్ళి ప్రసక్తి తెచ్చినపుడల్లా అమ్మ మీద కోపం తెచ్చుకునేవాణ్ణి.
కానీ, “ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులో జరగాలిరా” – “నాకు ఓపిక ఐపోతోంది నేను పూర్తిగా మూల పడితే నువ్వు ఇబ్బంది పడతావురా” ఇవి మా అమ్మ రికార్డులు అరిగిపోయేదాకా వాడగా వాడగా, నిజంగా ఒకానొక సమయంలో ఆవిడ అనారోగ్యం చూసి, ఓహో, తల్లిదండ్రులు పెద్దవాళ్ళవుతూ ఉన్న సమయంలో నేను ఉద్యోగానికి వెళ్ళిపోతే వారికి సహకరించడానికైనా ఇంకొక మనిషిని నేను నమ్మి నా జీవితంలోకి తెచ్చుకోవాలని నాకు కలిగిన ఆలోచన ద్వారా, నేను పెళ్ళికి ఒప్పుకోవలసి వచ్చింది.
నిజానికి నా ప్రణాళిక ఏమిటంటే, ఉద్యోగం చేసుకుంటూనే దేశం మొత్తం తిరగాలనీ, అందులోని సర్వ జీవరాశులనూ పరికించి, పరిశీలించి, పరిశోధించి అర్థం చేసుకుని, మిగతా ప్రజలందరికీ నన్ను నేను ఉపయోగించే అవకాశాలు వెతుక్కుంటూ, పనిలో పనిగా దేశంలో ఉన్న అన్ని క్షేత్రాలూ, చారిత్రక ప్రదేశాలూ కూడా చూసేసి సంతృప్తి చెందిన పిమ్మట, చివరగా అంత్యకాలంలో, శేషజీవితాన్ని అరుణాచలంలో గడిపివేయాలని నేను నా ఇరవై రెండవ యేట 1995లో నిర్ణయించుకున్నాను.
అయితే, ఆ నిర్ణయం తీసుకునే సమయానికి, పెళ్ళి అనే విషయంలో భార్యాభర్తల మధ్య గొడవలే కాక ప్రేమలు, త్యాగాలు కూడా ఉంటాయనీ, పిల్లలు అనే రత్నాలు, మోయగలిగే బరువునే కాకుండా మరువలేనంత ప్రేమను కూడా ఇస్తారనీ, టోకు మొత్తంగా చేదు గుళికలే కాక చాలా తీపి జ్ఞాపకాలు కూడా ఉంటాయనీ తెలియదు (మేం ముగ్గురు పిల్లలమూ మా తల్లిదండ్రుల పట్ల అలానే ఉన్నా కూడా, స్వీయానుభవమే గురువు కాబట్టి). తెలిపేందుకు ఇంట్లో ఆ వాతావరణమూ లేదు.
తర్వాత, పైన చెప్పుకున్న విధంగా పెళ్ళి అయిపోయిన తర్వాత, ఏమేమి ఉంటాయని తెలియదో అవన్నీ ఉంటాయని అర్థమైన తర్వాత, పెళ్ళి కూడా అవసరమేనూ, మనిషి జీవితంలో లెక్కించదగ్గ అనుభవమే అని అర్థమైంది. పెళ్ళి కాకుండా ఉండి ఉంటే, నేను అనుకున్న ప్రకారమే నా జీవితం ఉండేదో లేదో తెలియదు కానీ, పెళ్ళి అయిన తర్వాత కూడా అప్పటి లక్ష్యాలను కొద్దిగా అటూ ఇటుగా సాధించుకోవచ్చని మాత్రం స్పష్టంగా అర్థమైంది.
నా తమ్ముడు ఆదిత్య ఇంగ్లీష్ లో వ్రాసిన Struggle for Acceptance అనే బ్లాగుపోస్టు కూడా https://twitter.com/vizagobelix/status/1250325190493368321?s=09 ఈరోజే రావడం కేవలం యాదృచ్ఛికమే అయినా కూడా చాలా సమయానుకూలంగా వచ్చిందని సంతోషిస్తూ, జీవితంలో ఎలా వచ్చినదాన్ని అలా అనుభవిస్తూ అనుభూతి చెందడంలోని సంతృప్తిని సంతృప్తిగా స్వీకరిస్తూ..
ఈరోజు ఈ బ్లాగుపోస్టు వ్రాసేటందుకు కారణమైన https://twitter.com/avasaramledu/status/1249898596712845312?s=09 ఈ ప్రశ్న అడిగినవారికి కృతజ్ఞతలతో..