Blog

  • ఆర్ట్స్ కాలేజి కబుర్లు -2

    రెండో సంవత్సరం లో అడుగిడిన ఆ రోజుల్లో మా ప్రిన్సిపాల్ మేజర్ నదిముల్లా (ఆయనకు ముందు ప్రిన్సిపాల్ హబీబుల్లా). Ex Military.బాగా టెర్రర్. నేను NCC NSS ఎగ్గొట్టిన రోజులు.నాది పొరుగూరు కదా..కుదరదు.

    రోజూ కాలేజి నుండి సాయంత్రం ఇంటికి ట్రైన్ లో వచ్చేవాడిని.రాజమండ్రి స్టేషన్ కు కు రాగానే చిల్లర లెక్క పెట్టి 80 పైసలు ఉంటే,చపాతీ ఆలు కూర 40పైసలు,మా పెద్ద చెల్లాయి కి Coats ఎంబ్రాయిడరీ దారం 40 పైసలు. ఎంత సంతోషమో తనకి ఆ చిన్ని వస్తువు తెచ్చి నందుకు.!

    ఓ నెల తర్వాత కాలేజి నోటీసు బోర్డు లో తెలుగు వ్యాస రచన పోటీ.

    నేను గారు కూడా బరిలోకి దుమికారు. ఓ 50 మంది హాజరు. రెండు గంటల వ్యాసం.” శాస్త్రీయ విజ్ఞానం” గురించి. అప్పుడే ఇచ్చారు టాపిక్.రెండు గంటలు కూర్చునే ఓపిక ఎక్కడ.. గంట లో వ్రాసి బయట పడ్డా..

    రెండు రోజుల తర్వాత క్లాసులందర్ని సమావేశ పరిచి విజేతల ప్రకటన.నేను గారికి మొదటి బహుమతి.నా పేరు విని చాలా మంది నా వైపు తేరిపారా చూసారు. నేను గిల్లుకొన్నా. తెలుగు భాషకు కల్చరల్ కాణాచి అయిన రాజమండ్రీ లో నాకు ఫస్ట్ ప్రైజ్. విశ్వనాథ వారి దంతపు దువ్వెన పుస్తకం ఇచ్చారు.

    ఈలోగా సినిమాలు చూసే జోరు పెరిగింది.హిందీ సినిమాలు అప్సర లో, ఇంగ్లీష్ సినిమాలు(జాంపేట లో ఉన్న మూడు హాళ్ళలో ” లక్ష్మి “అనుకొంటా ).

    అన్నట్టు ఆ రోజుల్లో ” అప్సర హోటల్ ” కి వెళ్ళటం ఓ రేంజి. రెండు నెలల కో సారి వెళ్ళి ఇడ్లీ తిని పావలా వేసి జుక్ బాక్స్ లో Billy vaghun come sept వింటే ఎవరెస్ట్ ఎక్కినంత సంబరం.

    ఒక సారి ఇద్దరు ఫ్రెండ్స్( భద్రరావు +రామారావు ) లతో శ్యామల టాకీస్ లో “పగ్ల కహిక” సినిమా కు వెళ్ళాం.ఫస్ట్ న్ లాస్ట్ టైం క్లాస్ ఎగ్గొట్టటం. నాతో వచ్చిన ఇరు మర్కటాలు,కిచ కిచా అని సుత్తి కామెంట్లు. ఇంటర్వల్ లో లైట్ లు వెలిగాయి.

    వెనక నుండి ఎవరో తట్టారు.వెనక్కి చూసా..అమ్మ+నాన్న. కాలేజి లేదా? నేను నా ఫ్రెండ్స్ ఏదో చెప్పాం.

    నెక్స్ట్ half లో కిక్కురు మంటే ఒట్టు.ఇంటికి వెళ్ళిన తర్వాత తీవ్రమైన తలంటు.

    ఇలా జరుగుతుండగా,నేను ట్రైన్ మానేసి రోజూ మా ఇంటి నుండి 1.5 km నడిచి కడియం వంతెన దగ్గరికి వెళ్ళి రెండో నంబర్ బస్సు ఎక్కేవాడిని.అది జాంపెట లో దింపేది.అక్కడ నుండి నడక.

    సత్య అనే దోస్తు మాతో బాటే బస్సు మేట్.నా క్లాస్ మేట్ కూడా. అతను వేమగిరి లో బాగా పలుకుబడి ఉన్న వారి అబ్బాయి. వాళ్ళ పాలేరు రోడ్డు మీద నుంచుని బస్సు ఆపిన తర్వాత మూడు నాల్గు నిముషాలకు లోపలినుండి హడావుడి గా వస్తాడు.చొక్కా బొత్తాలు రెండు పెట్టుకొని, పాలేరేమో పుస్తకాలు, వీడి చేతిలో కర్చీఫ్,పెన్ను,డబ్బులు గుప్పిట్లో,వచ్చి బస్ ఎక్కుతాడు. తీరిగ్గా బొత్తాలు పెట్టుకొని సెటిల్ అవుతాడు. జిగ్రీ దోస్త్.మంచి మనసు.డబ్బు అహంకారం లేదు.

    వీడు వెనకాల త్రీ సీటర్ లో కూర్చుంటాడు. నేను అదే లైన్ లో సింగిల్ సీటర్ లో. అంటే కడియం starting point లో ఎక్కుతాము కదా. అలా రోజూఅక్కడ నుండి ఎక్కేవారి రేంజ్ వేరు. ఓసారి ఒరే సత్య నీ సీట్ దగ్గర ఒక అమ్మాయి నించుని ముందుకు కదలదు.ఆ అమ్మాయి ఐదుబళ్ళ మార్కెట్ దగ్గర బస్సు ఎక్కుతుంది అని చెప్పా!

    (సశేషం)

  • ఆర్ట్స్ కాలేజీ కబుర్లు -1

    1968 జూన్.

    RJY Govt.ఆర్ట్స్ కాలేజీ లో చేరిక.నా అదృష్టం అనుకుంటా,బందరులో నేను చదివిన నోబుల్ స్కూల్ ది వంద ఏళ్ల చరిత్ర+ రాజమండ్రి లో వంద ఏళ్ళ పైబడి చరిత్ర గల కాలేజి. Imposing bldg.బయట గేటు నుండి ఓ 500మీటర్లు తారు రోడ్డు.నడుస్తుంటే,ఒక వైపు పేద్ద గ్రౌండ్,మరో వైపుఇంకో గ్రౌండ్ . దాని కి ఆనుకొని దూరంగా Metcalf hostel.

    ముందుకు వెళ్ళగానే ఒక చిన్న సెమీ సర్కిల్,మధ్యలో ఒక పైలాన్.రైట్ సైడు సైన్సు బ్లాక్.లెఫ్ట్ సైడు ఆర్ట్స్, కామర్స్ బ్లాక్లు. పెద్ద పెద్ద క్లాస్ రూంలు.బెంచీలు సెమీసర్కిల్ గా ఉండి పైకి వెళ్ళే కొద్దీ ఎత్తు పెరుగుతాయి.చివరి బెంచీ లో కూర్చున్నా సరే correct Line of sight for lecturer.

    నాది 1968-71, BSc MPC.A1 SEC.RollNo73.(కృష్ణ మోహన్ IPS .పోకిరి డైలాగ్ లాగ). అటు బిక్కవోలు నుండి ఇటు నిడదవోలు వరకు రోజూ ట్రైన్ లో వచ్చేవారు నాలా చాలా మంది మా కాలేజి కి . అంత పేరున్న కాలేజి. రోజూ కడియం లో ట్రైన్ ఎక్కటం, రాజమండ్రి స్టేషన్ లో దిగటం,సిటీ బస్సు ఎక్కి,జాం పేట దాటి Y Junction లో దిగి నడక. ఎప్పుడో గానీ రిక్షా ఎక్కే సౌలభ్యం. ఎప్పుడూ పుస్తకాలు,టిఫిన్లు,రిటర్న్ ట్రైన్ లు.ఇవే ధ్యాస.పొరుగూరు కదా.!!

    జీవితం లో మొదటిసారి కాఫీ . Nescafé కాఫీ క్యాంటీన్ లో. ఖరీదు 20 పైసలు. దీన్ని బట్టి మీరు ఊహించుకోవచ్చు నేనెంత సీదా సాదా నో !!

    సరే కాలం గడుస్తూ ఉండగా.. ఓ సుదినం నేను రాజమండ్రి స్టేషన్ దగ్గర ద్వారపూడి వెళ్లే బస్ ఎక్కా.మధ్యలో కడియం రైల్వే స్టేషన్ స్టాప్ లో దిగాలి. పుస్తకాలు, టిఫిన్ బాక్స్, హాఫ్ చొక్కా, ప్యాంట్. బస్సు లో నించుని ఉన్నా. అప్పటికి పదిహేనవ పుట్టిన రోజు అయి 3 నెలలు..(అంటే కేకులూ అవి ఉండేవి కావు.ఉత్తినే పుట్టిన రోజన్న మాట.)

    బొద్దుగా పొట్టిగా ఉండేవాడిని. వెనక పొడవాటి సీట్లో నలుగురు అమ్మాయిలు కూర్చొని ఉన్నారు.

    అందులో చాలా అందంగా ఉన్న ఓ అమ్మాయి నుండి బాబు ఇలారా అని పిలుపు . వెళ్ళాను.

    అ: ఏం చదువుతున్నావు

    నే: BSc ఫస్ట్ఇయర్

    అ:నిజం చెప్పు అని గద్దించింది

    నే:నిజమే.నేను ఆర్ట్స్ కాలేజి. నా రికార్డ్ బుక్ చూడండి అని చెప్పా.

    అ: నే ఏజ్ ఎంత?

    నే: మొన్ననే 15th birthday వెళ్ళింది.

    అ: రా..నా పక్కన కూర్చో.

    నే: వద్దండీ.నిల్చుంటాను.

    అ: చెయ్యి పట్టి లాగి పక్కన కూర్చోబెట్టుకొంది.నారికార్డ్ చూసింది.దస్తూరి మెచ్చుకుంది.నేను BSC CBZ final.నన్ను చూసావా కాలేజీలో?

    నే:లేదండి.

    అ: నేనెవరో తెలియదా? నన్ను కాలేజి బ్యూటీ అంటారు.నా పేరు…….

    నే: అలాగా.

    చాలా చక్కగా,నవ్వుతూ ఓ అరగంట మాట్లాడి, కాలేజీ లో ఏదైనా అవసరం వస్తే తప్పకుండా కలవమని చెప్పి ఎదో స్టాప్ లో దిగిపోయింది తన సఖులతో….

    కొస మెరుపు: నాది1953 ఆగస్ట్ పుట్టుక.ఏవో కొంపలు మునిగి పోయినట్టు మూడేళ్లకే ఒకటో క్లాసు.అప్పటి నుండి యూనివర్సిటీ నుండి బయటకు వచ్చేవరకు..నేను గారు అన్ని క్లాసుల్లో youngest.

    అదన్నమాట.

    సశేషం

  • కడియం కబుర్లు

    1967మే.కవుతరం నుండి కడియం చేరాము. సామాన్లు అవీ గూడ్స్ ట్రైన్ లో వచ్చాయి. నేను 12వ క్లాస్ లో చేరటానికి రాజమండ్రీ లో స్కూళ్లకు వెళ్లాను. చోద్యంగా అప్పుడు రాజ మండ్రీ లో ఇంగ్లీష్ మీడియం లేదు.ఎలా?

    మా సొంతూరు(గూడూరు)లో ఉన్న మా పెద్దమ్మ వాళ్లకు టెలిగ్రామ్ కొట్టాం. వాళ్లు మాథ్స్&సైన్స్ ఇంగ్లీష్ medium. social Telugu medium అని reply కొట్టారు.అక్కడ ముగ్గురు మేనమామలు ఉండేవారు.రెండో మావయ్య కూడా స్టేషన్ మాస్టర్ కాబట్టి మా నాన్నగారు వాళ్ళ ఇంట్లో ఉండి ఓ సంవత్సరం చదువుకో అని డిసైడ్ చేసారు. సరే గూడూరు కు బయలు దేరాం.

    ZPHS లో అడ్మిషన్ అయింది. అప్పట్లో ఉన్నది ఆ ఒకే high school .అప్పుడే నాకు 2 ఖాకీ ప్యాంట్ లు, 2 తెల్ల చొక్కా లు కుట్టించారు. అది uniform.

    మా ఫిజిక్స్ మాస్టారు..నాగేశ్వరరావు గారు పరమ స్ట్రిక్ట్.ఎప్పుడూ మీటర్ స్కేల్ ఆయన చేతిలోనే! ఓ రోజు లాబ్ లో ప్రశ్న.ఎవరూ చెప్పలా..నేను గారు చెప్పారు. అపుడు ఆయన ఓ ఇద్దర్నీ నించోబెట్టి “ ఒరే మీరు చదవటానికి వచ్చారా లేకపోతే సుందర్ మహల్ దగ్గర అడుక్కు నూకటానికి వచ్చారా”..అని క్లాస్ పీకుడు + మీటర్ స్కేల్ వాతలు అరచేతిలో.. ఆయన అంటే హడల్.

    ఇక తెలుగు మాస్టారు..ఆయన MS Reddy గారి ఫ్రెండ్.భార్య చిత్రానికి మాటలు రాశారు. రాగానే, బాబు సినిమా ట్రంక్ రోడ్ టాక్ ఎలావుందీ అని ఆరా! (నెల్లూరు trunk road)..

    ఇకపోతే ఇంగ్లీష్ మాస్టారు మిల్టన్.నేను వచ్చే దారిలో ఆయన ఇల్లు..గౌస్ ఆగు..నేను వస్తున్నా అని నాతో బాటు స్కూల్ కు రోజూ..ఆయన పోయెట్రీ ” sword of Excalibur” భలే చెప్పేవారు.

    నా బెంచ్ లో సుబ్రమణ్యం టెక్స్టబుక్ లో కొమ్మూరి సాంబశివరావు డిటెక్టివ్ నవలలు పెట్టి చదివేవాడు.వాడు సూపర్ బ్రిలియంట్ . వాడు అలా పుస్తకాల్లో నవలలు చదవటం నాకు గుండె దడ పుట్టేది.

    రెగ్యులర్ గా మా పెద్ద మామయ్య ఇంటికి వెళ్ళేవాడిని.వాళ్ళ పెద్ద అమ్మాయి 9 క్లాస్ చదివేది.ఆ అమ్మాయే నా జీవితం లో కి వస్తుందని అప్పటికి తెలియదుగా…?

    ఇలా ఉండగా పబ్లిక్ పరీక్షలు ముంచుకొచ్చాయి.. హెడ్మాస్టర్ పిలిచి..ఒరేయ్ నీకు ఏజ్ తక్కువ..పరీక్షకు అనుమతి లేదు అన్నారు.మా నాన్న గారికి లెటరు రాశా.ఆయన నన్ను పెద్ద మామయ్య కు చెప్పు అన్నారు. మా పెద్ద మామయ్య డిప్యూటీ తహశీల్దార్. గవర్నమెంట్ డాక్టర్ దగ్గర శారీరకం గా, మానసికం గా ఫిట్ అని సర్టిఫికెట్ రాయించుకొని ఇస్తే కానీ కుదర్లా.

    సైన్సు పబ్లిక్ పరీక్షలో భలే సంఘటన. మెయిన్ పేపర్ లో నేను మెయిన్ ఆన్సర్ బుక్లెట్ వ్రాసిన తర్వాత అడిషనల్స్ తీసుకొని రాస్తూ,మెల్లగా మెయిన్ షీట్ వెనక వాడికి ఇవ్వాలని ముందే పథకం. పరీక్ష కు ముందరే వాడు నా కాళ్లా వేళ్ళా పడ్డాడు.సరే అని పాస్ చేశా.నేనేమో తెగ అడిషనల్సు రాసేస్తున్నా.మెయిన్ బుక్లెట్ ఎంతకూ రాదే! వెనక ఫ్రెండ్ నా దగ్గర లేదు.ఇంకో ఫ్రెండ్ కి ఇచ్చా .. వస్తుందిలే అన్నాడు . నాకు గొంతు తడి ఆరిపొతోంది. మెయిన్ బుక్లెట్’లేదంటే మటాష్.పరీక్ష ఫెయిల్. వాళ్లంతా వణుకు.ఇంకొక 20 నిమిషాలు ఉందనగా అది నాకు చేరింది.అన్నీ సవ్యంగా గానే ఉన్నాయి.బయటకు వచ్చి వాణ్ణి ఈడ్చి కొట్టా. వాడు sorry చెప్పాడు.

    ఇక పోతే నెక్స్టడే బిట్ పేపర్.ఒప్పందం ఆరుగురి మధ్య. నేను గబగబ రాసేసి దగ్గుతా. అందరూ నా వైపు చూడాలి..చెంప మీద నేను చేయి ఆనించి వేళ్ళు చూపించే వాడిని. చెంప మీద ఒక వేలు ఉంటే answer A. రెండు వేళ్ళు ఉంటే B. అలాగా.. ఇది నేను ముందు సీట్ లో ఉంటేనే ఇది సాధ్యం. ఇలా రకరకాల సరదాలు,కుయుక్తుల తో 12 క్లాస్ పరీక్షలు వ్రాసి కడియం పయనమయ్యా.

    రిజల్ట్స్ మామూలే. చాల మంచి మార్కులు..

    కొసమెరుపు : ఆ హైస్కూల్ లో నే మా నాన్నగారు , మామయ్యలు చదువుకున్నారు. పేరెంట్స్ చదివిన స్కూల్ లో చదవటం rare కదూ!!!

    (సశేషం)

  • బాల్యం కబుర్లు -4

    కవుతరం – కృష్ణ జిల్లా..నాన్నగారు స్టేషన్ మాష్టర్ గా చేరారు. మేమూ వెనకాలే వచ్చాము.

    రైల్వే క్వార్టర్స్. మాకు ఒక పక్క కేరళ వాస్తవ్యులు(రైల్వే ఉద్యోగం వాళ్ళ ఆంధ్ర లో ఉండిపోయారు)

    మరో పక్క గుంటూరు జిల్లా వాళ్లు.

    10క్లాసులో నేను, పెద్ద చెల్లాయి 5 , తమ్ముడు 4, చివరి చెవలాయి 2 క్లాసు లో చేరాము.

    నాది zp high school. రోజు 2 km నడవాలి స్కూల్ కోసం.తాడి తోపులు,పెసర,మినుము చేలు దాటి వెళ్ళాలి. సరిగ్గా 9 గంటలకు వచ్చే ట్రైన్ లో ఓ 20 మంది పిల్లలు + 4/5 టీచర్లు వచ్చే వారు. అందులో నా క్లాస్ టీచర్+ క్లాస్ అమ్మాయిలు కూడా. వాళ్ళందరూ మా ఇంటి ముందు నుంచి వెళ్ళాలి.వాళ్లు అక్కడకు రాగానే, నేను కూడా వాళ్ళతో చేరేవాడిని.

    క్లాస్ టీచర్ మేడం కు నేను గారు ప్రియ శిష్యుడిని కాబట్టి నా భుజం మీద మేడం చెయ్యి వేసేవారు. అందరూ ఈర్ష్య గా చూసేవారు.స్కూల్ తర్వాత ట్రైన్ లేట్ అయితే వాళ్ళలో ఓ పదిమంది మా ఇంట్లోనే మజిలీ.

    13 ఏళ్ళ ఆ వయసులో నాకు అమ్మాయిలంటే సిగ్గు,బిడియం,గాభరా అన్ని కలబోసిన ఫీలింగ్. ఎంతంటే, వాళ్లు మా అమ్మతో మాట్లాడుతుంటే నేను పుస్తకం మొఖానికి అడ్డు పెట్టుకొని లోపలికి వెళ్ళేపోయే వాడిని. మా అమ్మ ” అదేమిట్రా అలా వెళ్లి పోతావు?నీ క్లాస్ వాళ్ళేగా “అంటూ నవ్వేది.. అదేమిటో క్లాసు లో నా కంటే పొడవైన అమ్మాయిలుండేవారు. పైగా నేను క్లాసు లో కనిష్ట వయస్కుడిని.

    అలా స్కూల్ రోజులు సాగిపోతూ ఉండగా.. ఆ రోజుల్లో మేము ఆంధ్ర ప్రభ వీక్లీ తెప్పించే వాళ్ళం.మా పక్కింటి వాళ్లకు ఇద్దరు అబ్బాయిలు.పెద్ద అబ్బాయి నా క్లాస్.చిన్నవాడు నా తమ్ముడి క్లాస్.

    వీక్లీ ఇస్తున్నప్పుడు ఆ ఆంటీ అక్కడ పెట్టి వెళ్ళమనేవారు..వెనక్కి ఇస్తున్నప్పుడు చేయి పట్టమని పుస్తకాన్ని పడేసేవారు.నాకు అర్ధం కాలేదు. నేను ఆంటీనీ అడిగాను. ఆవిడ అంటు బాబు.నేను మీరు ఇచ్చే వస్తువుల్ని ముట్టుకోకూడదు అని చెప్పారు.నేను మా ఇంటికి వచ్చి ఇంక వాళ్లకు పుస్తకాలు ఇవ్వొద్దు అని అమ్మతో పోట్లాట.

    అమ్మ పోనిలేరా.అది వాళ్ళ నమ్మకం. వదిలేయ్ అంది.

    వాళ్ళ ఇంటికి వెళ్తే వరండా లోనే కూర్చోబెట్టి మాట్లాడి పంపేసే వాళ్ళు. అమ్మ తో నేను అసలు వాళ్ళతో ఫ్రెండ్షిప్ వద్దు అనే వాడిని. అమ్మ నవ్వి ఊరుకొనేది.

    10 క్లాస్ అన్ని సెక్షన్ల లో ప్రతి సబ్జెక్టు ఫస్ట్. టోటల్ ఫస్ట్. మా తమ్ముడు+ చెల్లాయి ఎన్ని సార్లు నేను స్టేజీ ఎక్కానో లెక్క పెట్టేవారు. heady feeling కదా. పక్కింటి అబ్బాయి స్పోర్ట్స్ లో ఫస్ట్.

    11 క్లాసు లో ఎంట్రీ. కొత్తగా ఇంగ్లీష్ మీడియం.(సోషల్ స్టడీస్ తప్ప). లెక్కల మాస్టారు నాగేశ్వరరావు గారు.హిట్లర్ మీసాలు.నన్ను ఆయన దగ్గర ప్రైవేట్ కు పెట్టారు. రాత్రి వెళ్ళి అక్కడే పడుకొని పొద్దున్నే ఇంటికి వచ్చి స్కూల్ కి వెళ్ళాలి. ఆయన పొద్దున్నే 11+12 క్లాసులకు కలిపి లెక్కలు మల్టిపుల్ ఛాయస్ ప్రశ్నలు ఇచ్చేవారు. నేను గబగబా చేసేసేవాడిని.నావైపు మెచ్చుకోలుగా చూసేవారు.

    నాకు కప్పలంటే అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ భయమే!నన్ను ప్రైవేట్ మాస్టారు ఇంటి దగ్గర దిగ బెట్టడానికి లాంతరు తో నా పెద్ద చెల్లి+తమ్ముడు తోడు వచ్చేవారు. 11 వ క్లాసు కూడా నేను గారు టోటల్ ఫస్ట్.

    మా తమ్ముడు ఇంటి ఎదురుగుండా పెసర+మినుపచేల్లోకి వెళ్ళి దొంగతనంగా కాయలు తెంపుకోవటానికి టైం సరిపోక మొక్కలు పీక్కొచ్చే వాడు. వాటిని మంటల్లో కాల్చి తినేవాళ్ళం.

    నాకు మెల్ల మెల్లగా బెరుకు తగ్గి క్లాస్ లో ఉన్న అమ్మాయిలకు నా నోట్స్ ఇచ్చే స్థాయికి ఎదిగాను..

    మా ఇంట్లో రేడియో ఉండేది కాదు.పక్కన కేరలోళ్ళ ఇంట్లో ఉండేది. కామెంటరీ, పాటలు నాటికలు అక్కడ వినేవాళ్ళం.

    1967 మే లో నాన్నగారికి కడియం(తూ.గో) ట్రాన్స్ఫర్.మేమందరం మూట ముల్లి తో కడియం షిఫ్ట్ అయ్యాము.

    సశేషం

  • బాల్యం కబుర్లు -3

    తొమ్మిదవ తరగతి లో చేరాను పెడన జడ్పీ హైస్కూల్ లో. ఇంటికి దగ్గరే స్కూల్. అన్ని పూరి పాకలు. స్కూల్లో HM గారిది మాత్రమే పెంకుటింటి బిల్డింగ్.

    పెడన లో దేవాంగులు ఎక్కువ గా ఉండేవారు. మేము శేషగిరి గారి కుటుంబం తో చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళం. నేను వాళ్ళ ఇంటికి రెగ్యులర్ గా వెళ్లి, చీర అంచులు, చీర డిజైన్లు ఎలా చేస్తారు, యార్న్ పై గంజి ఎలా పెడతారు, కండెలు ఎలా రాట్నం లో తిప్పుతారు, మగ్గం లోకి ఎలా ఎక్కిస్తుంటారు వగైరా అంత క్షుణ్ణం గా తెలుసుకొన్నా.

    ఒక సారి మగ్గం గుంటలో కూర్చొని నేయటం ట్రై చేసాను.. సరిగ్గా కాళ్ళు కదపలేక పోయినందువల్ల షటిల్ నా మోకాలి చిప్పని రాసుకొంటూ వెళ్ళింది.. రక్తం చాలానే కారింది. మళ్ళీ మగ్గం గుంటలో కూర్చుంటే ఒట్టు..

    స్కూల్ లో అన్ని సబ్జక్ట్స్ లో నేను గారు ఫస్టు. నా తెలుగు వ్యాకరణం నోట్ బుక్ ను క్లాస్ అందరూ చూసి రాసుకోమని తెలుగు మాస్టారి హుకుం. ఆ రోజుల్లో ఆ లెవెల్ మనది.

    ఇలాంటి ఆట పాటల మధ్య, 8 క్లాస్ లో ఫస్ట్ వచ్చిన సందర్భం లో నా కాష్ బహుమతి, oxord ఇంగ్లీష్ డిక్షనరీ వచ్చి తీసుకోమని బందర్ నోబుల్ స్కూల్ నుండి ఉత్తరం.స్కూల్ లైబ్రరీ కి డొనేట్ చెయ్యమని నాన్నగారు చెప్పారు.అలాగే నేను ఉత్తరం రాసాను.

    అవగాహన లేని సగటు నిమ్న మధ్య తరగతి జీవితాలు. ఎంత దూరం ? 10 కిమీ. వెళ్లి తీసుకొంటే ఎంతటి అనుభూతో కదా. ఆ రోజులు అలా ఉండేవి.

    ఇలా ఉండగా.. మరల 10 కిమీ దూరం లో ఉన్న కవుతరం కు ట్రాన్స్ఫర్. ఇంకో స్కూల్ లో 10 వ తరగతి చేరాలి.

    మూట ముల్లె సర్దుకొని బయలు దేరాం.

    • సశేషం
  • బాల్యం కబుర్లు -2

    మచిలీపట్నం/బందరు చేరాము .రైల్వే క్వార్టర్స్ఇవ్వక ముందు అద్దె ఇంట్లో మకాం..

    ఇంటి ఓనరు జ్ఞాన సుందరం గారు.నోబుల్ హైస్కూల్ డ్రిల్ మాస్టారు.నేను కూడా నోబుల్ హైస్కూల్ లో చేరాను. 1963 లో.

    నేను అంత పెద్ద హైస్కూల్ చూడలేదునేటివరకు.3 ఫుట్ బాల్ గ్రౌండ్ లు, అతి పెద్ద బిల్డింగ్ లు, పెద్ద పెద్ద క్లాస్ రూములు, ఓ chapel+ హై స్కూల్ కు ప్రిన్సిపాల్. ఆయన పేరు Mr Fox. ఆజానబాహుడు . ఆస్ట్రేలియన్ .రోజు ఛాపెల్ లో నీల్డౌన్ ప్రేయర్ . It was an ఎక్స్పీరియన్స్ .7th class లో చేరాను.

    ఒక రోజు English ఎస్సే(చిన్న సైజ్) హోమ్ వర్క్ రాసుకొని క్లాసుకు వెళ్లాను. English మాస్టారు అందరివీ చూసి,నాది పక్కన పెట్టి నువ్వు రాసావా ఎవరైనా చెప్పారా అని అడిగారు.నేనే రాసాను అన్నాను.

    తన బాగ్ నుండి ఆ రోజు English పేపర్ తీసి నన్ను బోర్డు దగ్గరకు పిలిచి headlines చదివి తెలుగు లో అర్థం చెప్పమన్నారు. నేను చెప్పా. ఇంకో పేజీ లో ఒక పేరా చదవి ప్రతి వాక్యం తెలుగు లో అర్ధం చెప్పమని ఆజ్ఞ. పాలించాను.

    క్లాస్ ను సైలెంట్ గాఉండమని చెప్పి నన్ను ప్రిన్సిపాల్ దగ్గరకు తీసుకొని వెళ్ళారు.నేను బయట నించున్నా.మాస్టారు లోపలికి వెళ్ళి కొన్ని క్షణాల తర్వాత నన్ను పిలిచారు.

    నేను వెళ్లి ప్రిన్సిపాల్ దగ్గర నిల్చున్నా.Mr Fox ఇంకో ఇంగ్లీష్ పేపర్ లోని కొన్ని పెద్ద వాక్యాలు చూపి , చదివి అర్థం చెప్పమన్నారు నేను చెప్పా.మా మాస్టారు ప్రిన్సిపాల్ తో ఎదో మాట్లాడారు. ప్రిన్సిపాల్ కుర్చీ నుండి లేచి, నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి, well done అని చెప్పి,భుజం మీద చెయ్యి వేసి, నన్ను తోడ్కొని నాతో రూం బయటకు వచ్చి అప్పుడు మరల షేక్ హ్యాండ్ ఇచ్చి పంపారు. పదేళ్ల అబ్బాయికి out of the world experience కదూ !!

    మూడవ అంతస్తు ఎక్కి దూరాన్న ఉన్న ఓడలు చూసే వాడిని.స్కూల్ గంట church గంట లా ఉండేది. తాళ్లతో లాగితే గంట మోగుతుంది..ఎంత పెద్దదో అది.

    స్కూల్ ఆవరణ లో huge మర్రిచెట్లు అనుకుంటా ఉండేవి.

    ఆ సంవత్సరం నేను క్లాస్ ఫస్ట్.annual day నాడు నాకు ఇచ్చిన బహుమతి టాగోర్ PostMan &Rs30 క్యాష్ ప్రైజ్. Huge sum those days.

    ఇంతలో 8వ క్లాస్ లోకి ప్రవేశం.

    ఈ లోగా మాకు రైల్వే క్వార్టర్స్ ఇచ్చారు. దూరంగా ఉండేది ఇల్లు..చాలా పెద్దది.ఎంత పెద్దది అంటే వరండా లో నేను తమ్ముడు చెల్లి బెచ్చాలు ఆడే వాళ్ళం. అప్పుడే మా ఇంట్లో ఆంధ్ర ప్రభ వీక్లీ ద్వారా యద్దనపూడి,కోడూరి రంగప్రవేశం.అమ్మ వంట చేసుకొంటూ నన్ను చదవ మనేది.

    నెలకో ఆదివారం నాన్నతో బృందావన్ లో ఇంగ్లీష్ సినిమా..బెంహుర్ ,కింగ్ ఆఫ్ కింగ్స్, శాంసన్ వగైరా..స్నేహితులతో అగ్గిబరాటా,బందిపోటు etc., చీకు చింతా లేని వయసు. వేసవి పరీక్షలు అవ్వగానే నాన్నగారికి ట్రాన్స్ఫర్..

    ఎక్కడనుకొన్నారు? పెడన 10 కి.మీ. లోపు.

    పేరెంట్స్ కు మంచి స్కూల్ లో వదల కుండ చదివిద్దాం అనే ఊహ లేని రోజులు. ప్రిన్సిపాల్ అంత లా morale పెంచిన స్కూల్ ఎవరైనా వదులుకొంటారా? పిల్లలు ఎదో స్కూల్ లో చదువుకుంటారులే అనే భావన అమ్మ నాన్నలది. మధ్య తరగతి బతుకులు అంతవరకే ఆలోచనలను పరిమితం చేస్తాయి కాబోలు. ఆ రోజులు అలా ఉండేవి.

    TC తీసుకొని పెడన కు షిఫ్ట్ అయ్యాము….

    సశేషం

  • బాల్యం కబుర్లు -1

    నాది 1953 ఆగస్ట్21 జననం.

    ఇక్ష్వాకుల కాలం అనిలెక్కలు వేసు కొంటున్నారా? అవును …అదే కాలం.!!

    మీలో చాలామంది పుట్టిఉండరు. ఆ రోజుల్లో నర్సరీలు యూకేజీ లు లేవు.

    మూడవ సంవత్సరమే ఒకటో క్లాస్ లో ప్రవేశం.నాకైతే 1,2,3,4క్లాసుల కబుర్లు గుర్తు లేవు. అంటే ముదుసలి అయిపోయాగా..grey cells తగ్గిపోయాయి.

    5,6తరగతులు కావలి లో చదివా. నాన్నగారు కావలి రైల్వే స్టేషన్ లో బుకింగ్ క్లర్క్.రోజూస్కూల్ కు వెళ్లి రావడం గుర్తుంది.చెప్పులు లేని రోజులు.ఓ రోజు ఇంటికి వస్తుంటే ఎవరి రేడియో లోనో ఒక పాట కొంచెం విన్నా.రోజూ అదే టైం కు వస్తుందని నమ్మిన సత్తెకాలపు జీవిని.

    6 నెలల పరీక్షల సెలవల్లో పొద్దున్నే ఇంట్లో తరవాణి అన్నం తిని జిల్లా గ్రంధాలయ సంస్థ వాళ్ళ లైబ్రరీ కు వెళ్లి ఇంటికి భోజనానికి వచ్చి మరల నాలుగు గంటలకు వెళ్లి చీకటి పడే వేళకు వచ్చేవాడిని. అందరూ నన్ను వింతగా చూసేవారు.ఈ బుడతడు రోజు వస్తున్నాడని.కనబడ్డ పుస్తకాలు తిరగేసేవాడిని.

    అలా ఉన్న రోజుల్లో హైస్కూల్ కు ఎంట్రన్స్ పరీక్ష పెట్టారు.పలక పై రాయాలి(ఎలా అని అనుకొంటున్నారా? those were the days).ఎంట్రన్స్ పరీక్ష లో” నేను గారు” ( ఈ పదం పై పూణే పెద్దాయన గుత్తాధిపత్యం లేదని గ్రహించ గలరు! ) టాప్ . కావలికి ఒకటే హైస్కూల్. నాకు 6 క్లాసు లో ఎంట్రీ.

    ఒక రోజు గ్రౌండ్ లో football అడుకొంటున్నా అందరితో కలిసి. హైస్కూల్ గంట కొట్టే అతను వచ్చి హెడ్మాస్టర్ రమ్మంటున్నారు అని పిలుచుకొని పోయాడు. HM రూం లోకి ఎంట్రీ. అక్కడ మా నాన్నగారు కూర్చొని ఉన్నారు. HM మా నాన్న గారిని “ఒరేయ్.నే కొడుకు ఫస్ట్ వచ్చాడు.ప్రభుత్వం వీడిని ఉచితం గా చదివిస్తుంది. హైబా పంపుతావా“అని అడిగారు.నాన్నగారు లేదు sir అని చాలా వినమ్రంగా చెప్పారు.

    నేను ఆ రాత్రి నాన్నగారితో మా HM గారు మిమ్ములను ఒరేయ్ అని ఎందుకన్నారు? అని అడిగా.మా నాన్నగారు “ఆయన నాకు బాగా తెలిసిన మాస్టారు అని చెప్తూ ఎంత పెద్ధ వాడివి అయినా మాస్టార్లతో ఎప్పుడూ వినమ్రంగా మాట్లాడాలని చెప్పారు. ఏ విషయం నాలో బలంగా నాటుకు పోయింది.(ఒక సందర్భం లో 25 ఏళ్ళ తర్వాత బ్యాంకు మేనేజర్ గా ఉన్నప్పుడు నేను చాలా వినమ్రనంగా ప్రవర్తించిన తీరు నా సహా ఉద్యోగుల్ని ఆశ్చర్య పరిచింది, ఆ ముచ్చట మరో సారి !)

    కొన్నాళ్ళకు మా నాన్నగారు ASM(Asst Stn Master) గా పదోన్నతి పొంది మచిలీపట్నం బదిలీ అయ్యారు.

    == సశేషం

  • నా టర్కీ యాత్ర

    నా టర్కీ యాత్ర

    2012. జూన్.

    ఇరాన్ నుంచి 30 కోట్ల యూరోల చక్కెర బిజినేస్ కన్ఫర్మ్ అయింది . ఇరాన్ బ్యాంక్ వాళ్ళు లెటర్ ఆఫ్ క్రెడిట్ (LC) మా కంపెనీ పేరు మీద ఇష్యూ చేస్తారు. కానీ ఇరాన్ పై ఆంక్షలున్నాయి కదా.. ఎలా అని మా ఓనర్ హైదరాబాద్ లో సెలవు లో ఉన్న నన్ను అడిగారు. నేను ససేమిరా కుదరదు అన్నా.

    మా ఓనర్ మర్నాడు మళ్ళీ ఫోన్ చేసి వెంటనే రమ్మని హుకుం జారీ చేశారు. సరే దుబాయి లో వాలాను. ఏమి చేస్తావో తెలియదు.. ఈ ట్రాన్సాక్షన్ చేయాల్సిందే అన్నారు. నాకు పాలు పోలేదు.

    ఇక తప్పదని స్విస్ , సింగపూర్ లలో ఉన్న బ్యాంకర్ ఫ్రెండ్స్ అందరికి ఫోన్లు/సమాలోచనలు. ఒక జేనీవా బ్యాంక్ మిత్రుడు, ఆరే భాయి ఫలానా బ్యాంక్ ఇస్తాంబుల్ లో ఉంది. వాళ్ళకు ఇరాన్ తో లావాదేవీలకు temporary waiver ఉంది అన్నాడు. నేను మా ఓనర్ కు చెప్పా. వెంటనే ఇస్తాంబుల్ కు వెళ్ళు అన్నారు. సరే ఇస్తాంబుల్ ప్రయాణం.

    ఇస్తాంబుల్ లో ఎయిర్పోర్టు నుండి హోటల్ వెళ్ళటానికి 2 గంటలు పట్టింది.. మధ్యలో బోస్ఫోరౌస్ బ్రిడ్జి ఆసియా/యురోప్ లను కలుపుతుంది. ఎంత బావుంటుందో!

    మర్నాడు సూటు బూటు వేసుకొని ఆ బ్యాంక్ కు వెళ్ళా.

    బ్యాంక్ వాళ్లకు ఇంగ్లీష్ రాదు. మనకు టర్కిష్ రాదు. యు నో ఇట్ ఇస్ నరకం . నా బాధ వర్ణనాతీతం.

    అక్కడ ఒక అందమైన అమ్మాయి నన్ను నా బాధ రెంటిని చూసి నవ్వింది. నవ్వింది మల్లె చెండు అనుకోని వెళ్లి నా బాధ చెప్పా ఇంగ్లీష్ లో. ఆ అమ్మాయి కి కొంచెం ఇంగ్లీష్ వచ్చు. అమ్మయ్య అనుకోని ఆ అమ్మాయిని బ్రాంచ్ హెడ్ దగ్గరకు తీసుకని వెళ్ళాను. అ బ్రాంచ్ హెడ్ ఒక వెర్రి నవ్వు నవ్వి ఎక్కడో దుబాయ్ కంపెనీ అకౌంట్ మేము తెరవం. పో..ఆన్నాడు. ఈసురో మంటూ హిల్టన్ హోటల్ ( నా బస ) కు వచ్చి బాగా ఆలోచించా..

    మర్నాడు మళ్ళి వెళ్లా. ఆ అమ్మాయి ని కలిసి పాపా, ఈ బ్రాంచ్ హెడ్ గాడి బాస్ దగ్గరకు నన్ను తీసుకొని పో అని అడిగా. ఆ అమ్మాయి వద్దు ఉండండి అని వెళ్లి ఏదో చెప్పింది ఆ మానేజర్ తో. అతను నన్ను చూసి ఇక్కడ రిజిస్టర్అయిన కంపని అయితే ఓకే. వెంటనే కంపనీ రిజిస్టర్ చేయించు అన్నాడు. అది కుదరని పని.

    మర్నాడు వస్తానని చెప్పి హోటల్ కు వెళ్లి పడకేసా.దుబాయ్ నుండి ఫోన్ ల మీద ఫోన్లు.

    మర్నాడు మళ్ళి హాజరు. సార్ కంపనీ రిజిస్ట్రేషన్ వగైరా కు టైం లేదు. మీరు ఎలాగైనా చేయండి అన్నా. ఆ అమ్మాయి కూడా ఏదో చెప్పింది. ఆ దొంగ వెధవ కుదరదు పొమ్మన్నాడు.

    ఎలారా భగవంతుడా అని మధన పడ్డా.

    ఇక లాభం లేదని మాది చాలా పెద్ద కంపెనీ అని చెప్పా.సపోర్ట్ కోసం దుబాయ్ నుండి కంపని బాలన్స్ షీట్స్ తెప్పించా. అవి ఆ మానేజర్ కు చూపించా. తను నన్ను వెయిట్ చెయ్యమన్నాడు. సాయంత్రం అయింది.. ఎంతకు పిలవడే? బ్రాంచ్ మూసే టైం కు వచ్చాడు. ఆ అమ్మాయి వాడి తో నా వెయిటింగ్ గురించి చెప్పింది. ఆతను మీ ఇండియన్స్ తోనే మీటింగ్ అంటూ విజిటింగ్ కార్డు చూపెట్టాడు. మన దేశపు పెట్రోలియం సెక్రటరీ -వాళ్ళు కూడా ఇరాన్ ఆయిల్ బిజినెస్ కోసం వచ్చారట.

    నా పని రేపు చూద్దాం ఆన్నాడు. నేను మరల హిల్టన్ కేళ్లి పడకేసా..

    మర్నాడు, నా పోరు పడలేక ఎకౌంటు ఓపెనింగ్ ఫారమ్స్ ఇచ్చి అకౌంటు ఓపెనింగ్ ఫండ్స్ $ 250K అన్నాడు. సరే అని , ఎక్కడెక్కడ సంతకాలు తీసుకోవాలో మార్క్ చేసుకొని దుబాయ్ కు బయలు దేరాను.

    ఆఫీసు కు వచ్చి $ 250K రెడి చేసి, నేను చెప్పగానే మా కంపనీ అకౌంటుకు అక్కడికి పంపండి అని పురమాయించి, మా ఓనరు సంతకాలు తీసుకొని, అది ఇది అని లేకుండా అన్ని పేపర్లు, పాస్పోర్ట్ కాపీలు వగైరా తీసుకొని మరల మూడు రోజుల్లో ఇస్తాంబుల్ లో వాలాను.

    మళ్ళీ సూటు బూట్లు వేసుకొని వెళ్ళాను. ఆ మేనేజర్ ఏ కళలో ఉన్నడో కాని అకౌంటు ఓపెన్ చేస్తాను..కాని కొన్ని షరతులు ఉన్నాయి అన్నాడు. నాకు చిర్రెత్తు కొచ్చింది. కోపం తమాయించుకొని ( వాడి గొంతు పిసికేయాలనిపించింది) ఏమిటి ఆ షరతులు అని అడిగా:

    1. బ్యాంకు చార్జీలు డబు ల్

    2. $ 250k min balance

    3. ఇరాన్ నుంచి వచ్చే డబ్బు ఒక వారం కూలింగ్ పీరియడ్ తర్వాత పంపుతాం..

    4. రిమైన్దర్లు,ఫోనులు నిషిద్ధం.మేమే అన్ని సవ్యంగా చేస్తాము. తొందర పెట్టకండి.

    అన్నిటికి సరే అని తల ఊపిన తర్వాత , ఒక వారం తర్వాత రమ్మన్నాడు, సరే నేను దుబాయ్ కు వచ్చి, ఓ వారం తర్వాత ఇస్తాంబుల్. అకౌంట్ ఓపెన్ చేసి నెంబర్ ఇచ్చాడు.

    నేను వెంటనే మా ఆఫీస్ కు ఫోన్ చేసి $ 250K ట్రాన్స్ఫర్ చేయించా. ఆ మర్నాడు ఆ ట్రాన్స్ఫర్ కాపీ వాడికి ఇచ్చాను.. డబ్బు చేరిన తర్వాత ఓకే అన్నాడు. నేను మర్నాడు రాత్రికి నా రిటర్న్ బుక్ చేయమని మా ఆఫీస్ కు ఫోన్ చేశా.

    నేను ఆరోజు ఒక ఖరీదైన బ్రాండెడ్ పెర్ఫ్యూమ్ బాటిల్ కొని మర్నాడు బ్యాంక్ కు వెళ్లి ఆ అమ్మాయికి ఇచ్చాను. వద్దు అంది. నేను తనకు ఇచ్చేసా.

    ఆ మేనేజర్ ను డిన్నర్ కు ఆహ్వానించాను.సున్నితంగా తిరస్కరించాడు.

    ఇస్తాంబుల్ లో చూడవలసినవి ఒక రెండు గంటల్లో టాక్సీ లో తిరిగి చూసేసి ( నా బొంద — ఏది సరిగ్గా చూడలేదు) రాత్రికి దుబాయ్ ప్రయాణం.

    ఇరాన్ బిజినెస్ కన్ఫర్మ్ అయింది. వాళ్ళు LC ఆ టర్కిష్ బ్యాంక్ కు పంపారు. ఆ టర్కిష్ బ్యాంక్ వాళ్ళు 2 రోజుల తర్వాత మాకు పంపారు. మేము యమ స్పీడ్ గా ఆ కాంట్రాక్టు ను పూర్తి చేసాం.నాలుగు నెలలు పట్టింది. 2/3 రోజుల గ్యాప్ తో టర్కి బ్యాంక్ వాళ్ళు చెప్పినట్టు, డబ్బు ఒక వారం అట్టే పెట్టుకొని పంపించే వాళ్ళు.

    మొత్తానికి ఒక యజ్ఞం లా ఆ ట్రాన్సాక్షన్ ను, ట్రేడ్ ఫైనాన్స్ హెడ్ గా ఎటువంటి అడ్డంకులు లేకుండా పూర్తి చేసాను. అమ్మయ అని ఊపిరి పీల్చుకున్నా.

    ఇంతలో మా ఓనరు పిలిచి , టర్కి వెళ్లి బ్యాంక్ వాళ్ళకు థాంక్స్ చెప్పి, అకౌంటు క్లోజ్ చేయించి రమ్మని చెప్పారు. పేపర్లు అవీ తీసుకొని మరల ఇస్తాంబుల్ చలో. అ బ్యాంక్ వాళ్ళకు థాంక్స్ చెప్పా. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. మరల డిన్నర్ /లంచ్ కు పిలిచినా సరే ఆ బ్యాంక్ మేనేజర్+ఆ అమ్మాయి సున్నితంగా తిరస్కరించారు. అకౌంట్ క్లోజ్ చేయించి నేను బయట పడ్డా.

    ఆ రోజంతా ఇస్తాంబుల్ తిరుగుడే.

    గ్రాండ్ బజార్: 14 వ శతాబ్దం లో కట్టిన అతి పెద్ద బజార్. దొరకని వస్తువు ఉండదు

    హగియా సోఫియా : మసీదు/చర్చి/మసీదు గా రూపాంతరం చెందిన ఒక అద్బుత కట్టడం.

    భోస్ఫోరుస్ సముద్రపు పాయ ను ఫెర్రీ లో అటు ఇటు దాటటం .డాల్ఫిన్స్ ఫెర్రి తో పోటి పడటం కనువిందు.

    ఎక్కడ బడితే అక్కడ మన టీ బంకుల మాదిరి ఆరంజ్ జ్యుసుల తోపుడు బండ్లు.

    ఓల్డ్ సిటీ లో cobbled స్త్రీట్స్ లో నడక.

    అక్కడ ఒక ఫ్యాక్టరింగ్ ( ఒక రకమైన ఇన్వాయిస్ financing) మీటింగ్ కు వెళ్ళాను.సీఈఓ అమ్మాయి, ఎంత అందం గా ఉన్నదంటే ,అంత అందం rarity.. బ్యూటీ విత్ బ్రైన్స్.-మేలు కలయిక. అరగంట మాట్లాడి వాళ్ళ చార్జీలు ఎక్కువనిపించి థాంక్స్ చెప్పి బయట పడ్డా.

    చివరాఖరికి దుబాయ్ ప్రయాణం.

    ఇస్తాంబుల్ బిజినెస్ క్లాసు లౌంజ్ out of the world. ఎంత పెద్దదో! పది భాగాలు గా రకరకాల cuisines.కళ్ళు చెదుర్స్.

    ఈ టర్కీ ప్రహసనం లో నేను 4 నెలల్లో 9 సార్లు ఇస్తాంబుల్ వెళ్లాను. అన్ని సార్లు హిల్టన్ లోనే.అక్కడ రిసెప్షన్ లో ఒకతను నన్ను చూసి మళ్ళి వచ్చారా అని నవ్వేవాడు.

    అవ్విధంబుగా నా టర్కి యాత్ర పరిసమాప్తమైనది.

    =====

    2
  • ‘గల్ఫ్’ ఇంతగా మలయాళీ మయం ఎలా అయ్యింది?

    ‘గల్ఫ్’ ఇంతగా మలయాళీ మయం ఎలా అయ్యింది?

    ఇది ఒకప్పుడు తెలుగు కోరా లో నేను రాసిన ఆన్సర్ లలో అత్యధిక వీక్షణలు అందుకున్న పోస్ట్

    దీని మూలం 35+ ఏళ్ళ క్రితం నా ఇంజనీరింగ్ కాలేజీ నేపధ్యమే (REC రూర్కెలా) – ఒకానొకస్నేహితుడు (బాంబే వాస్తవ్యుడు అయిన వ్యక్తి నోట విన్నాను)

    ఇది ఒక విధంగా “నవ్విన నాపచేనే పండింది” అని చెప్పడానికి ఒక మంచి ఉదాహరణ కూడా

    ఇది ఒక చిట్టి కధ రూపంలో ఉంటుంది ఒక సగటు మలయాళీ జీవిత చరిత్ర (కట్టే – కొట్టే – తెచ్చే శైలి లో అన్నమాట)

    ఒక కేరళీయుడు (అంటే మలయాళీ) గల్ఫ్ దేశం చేరుకున్న తర్వాత ఇంటికి కేవలం మూడు ఉత్తరాలు మాత్రమే రాస్తాడు

    1. మొదటిది క్షేమంగా చేరాను అని

    2. రెండోది ఉద్యోగంలో స్థిరపడ్డాను అని

    3. మూడోది చంద్రన్ లేదా ఆరిఫ్ లేదా జోసెఫ్ ని అర్జెంటుగా పంపమని

    అంటే ఇది ఒక గొలుసుకట్టు కధ అన్న మాట

    (గమనిక : ఇక్కడ ఉద్దేశం అన్ని కంమ్యూనిటీస్ కి చెందిన కేరళీయులు గల్ఫ్ దేశాలకి వలస వెళ్లారు అని చెప్పడం మాత్రమే )

    గల్ఫ్ దేశాల్లో పెట్రోలియం నిల్వలు కనుగొన్నప్పడి నించి (1970s/80s) ఈ ప్రహసనం ఏదో విధంగా బలపడుతూనే వుంది

    కేరళ లో అక్షరాస్యత ఎక్కువ – ఉద్యోగ అవకాశాలు తక్కువ (కొంతవరకు కమ్యూనిజం కారణం అని అంటారు) , అక్కడ వ్యక్తుల్లో వేరే దేశాలకి వెళ్లి సెటిల్ కాగల చొరవ కూడా ఎక్కువే (అటు డ్రైవర్, మెకానిక్, మెయిడ్ ఉద్యోగాలకైనా – ఇటు టీచర్ నర్స్ ఉద్యోగాలకైనా) – నాకు తెలిసి ఇవి ముఖ్య కారణాలు

  • అంతరాత్మ – కటీఫ్!

    ఈ మధ్యన నాకు నా అంతరాత్మకి చిన్ని చిన్ని ఘర్షణలు తరుచుగా జరుగుతూండడంతో నాకు విసుగొచ్చి దానికి కటీఫ్ చెప్పేసా. అప్పటినించీ మా ఇద్దరికీ మధ్య మాటల్లేవు. ఇప్పుడు ప్రాణం హాయిగా, ప్రశాంతంగా ఉంది.

    ఇంతకీ గొడవలెందుకంటారా? వస్తున్నా అక్కడికే.

    అది తెలుసుకోవాలంటే అధమపక్షం ఓ మూడు, నాలుగు దశాబ్దాలు వెనక్కి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోవాలి. పదండి మరిహ అలీసం దేనికి? అక్కడే ఉంచేస్తానని భయపడకండి. ఇలా వెళ్లి అలా వచ్చేద్దాం. ఆబ్బె అది కాదు. అలా వెళ్లి ఇలా వచ్చేద్దాం.

    అవి నేను బ్రహ్మచారిగా ఎంచక్కా చిన్ని ఉద్యోగం చేసుకుంటూ హాయిగా కాలం గడిపేస్తున్న రోజులు. ఏంటో గురూ ఆ రోజులే వేరు.

    సరే రోజూ బైటికి వెళ్తున్నప్పుడు ఈ అంతరాత్మ నేను కూడా వస్తానని ఓ తెగ గొడవ చేసేది. సర్లే ఇంట్లో ఒక్కర్తికి భయమేమో నాక్కూడా కాస్త కంపెనీ ఇచ్చినట్టు ఉంటుందని దాన్ని వెనకేసుకుని అంటే సంకనెత్తుకుని ఊరంతా బలాదూర్ తిరిగేవాడిని. అప్పుడు మార్కెటింగ్ ఉద్యోగం వెలగపెట్టాను లెండి.

    అలా తిరిగినప్పుడు ఇదిగో ఈ అంతరాత్మ ఉందే నా మానాన్న నన్ను ఉండనిచ్చేది కాదు. రోజంతా ఒకటే నస. చెవిలో జోరీగలా!

    “ఏమిటీ ఆ అమ్మాయివైపు అంత సేపు చూస్తున్నావు” – పెళ్లికాని ప్రసాదు అమ్మాయిల వేపు చూడక ఆంటీ లని చూస్తాడా దాని పిచ్చి కానీ.
    ఏమిటీ. ఈ మధ్య రాత్రి రోజూ పాను వేసుకుంటున్నావు?! అరే. పాన్పు సుఖం లేదు కనీసం పాను సుఖం కూడ దూరం చేసుకోవాలా?
    “ఈ మజ్జెన సిగరెట్లు ఎక్కువ కాలుస్తున్నావు” – చస్తున్నాను దీంతో. ఓ పక్కన సేల్స్ ఎందుకు అవ్వటం లేదని రోజూ బాస్ తలంటు పోస్తున్నాడు. ఎలా ఎక్కువ అమ్మాలో తెలీక, బాస్ చెప్పక, వాడికి సమాధానం చెప్పలేక, ఇంకో బోడి ఉజ్జోగం దొరక్క టెన్షన్ తో ఓ నాలుగు సిగరెట్లు ఎక్కువ కాలిస్తే అర్ధం చేసుకోవడం పోయి ఈ ఇంటరాగేషన్ ఏమిటి?

    “అసయ్యంగా ఆ బీడీలు కాల్చడం ఏమిటి” – దానికేం తెలుసు గొర్రెతోక బెత్తెడని చిరుద్యోగి జీతం ఇరవయ్యో తారీఖు కల్లా శివార్పణమ్ అని అప్పటిదాకా దర్జాగా గోల్డ్ ఫ్లేక్ సిగరెట్టేలు కాల్చినా చివరి వారంలో బీడీలతోనే సరిపెట్టుకోవాలని!

    “నీకొచ్చే తొక్కలో జీతానికి నువ్వు ప్రతి ఆదివారం రెండు సినిమాలు చూడాలా?” – మా జీతానికి మా బ్రతుక్కి మందా మాకా? కనీసం సినిమాలు చూసే కనీస అదృష్టం కూడా లేదన్న మాట ఈ ఎదవ జీవితానికి

    ఇలా దానికి అక్కరలేని విషయం లేదు. ప్రతి దాంట్లో వేలెట్టడమే… కాదు కాదు పుల్లలు పెట్టడమే.

    అనకూడదు కానీ మనలో మన మాట పెళ్లయ్యాక నా బ్రతుకు ఎలా ఉంటుందో 70 mm సినిమాస్కోప్ లో నాకు ట్రైలర్ చూపించేసింది. ఇహ దీంతో ఇలా లాభం లేదని పెళ్లయ్యాక దాన్ని ఇంట్లోనే వదిలేసి బైటికి పోతున్నాను ఇన్ని సంవత్సరాలుగా

    కానీ మీకు తెలీనిది ఏముంది సాయంత్రం ఆఫీస్ నించి ఇంటికి రాగానే మళ్ళీ ఇంటరాగేషన్ మొదలు. “ఏమిటి ఇంతాలీసం అయ్యిందివాళ” – అరే చిన్న కంపెనీల్లో పెద్ద ఉద్యోగం వెలగ పెడుతున్నప్పుడు రోజూ కొత్తగా పెళ్లయిన వాడిలా ఏడింటికల్లా ఇంట్లో వాలాలంటే ఎలా – అవతల బోల్డు పనులు, కధలు, కమామీషులు.

    “ఈ మజ్జెన ఆదివారం ఇంటి పట్టునుండకుండా ఆ వెధవాఫీసు పట్టుకు వెళ్లాడకపోతే ఇంట్లో పెళ్ళాం పిల్లలతో గడపచ్చుగా ” – నేను ఇంటికంటే ఆఫీస్ పదిలం అని వెళ్తున్నానని ఎప్పటికి అర్ధం చేసుకుంటుందో ఏమిటో

    “ఈ మధ్య పార్టీలు ఎక్కువయ్యాయి నీకు. ఛాన్స్ దొరికితే చాలు ఏదో వంకతో పార్టీ అని జంప్ అయ్యిపోతావు” – అమ్మా తల్లీ నీకేం తెలుసు మగాళ్ల సోషల్ రెస్పాన్సిబిలిటీస్. ఆఫీసన్నాకా బోల్డు మంది సహోద్యోగులుంటారా? నలభై ఏళ్లుగా హైదరాబాద్ లో పడుంటే బోల్డు మంది ఫ్రెండ్స్ కూడా ఉంటారుగా?

    మరి ఒకడికి కొత్త ఉద్యోగం వస్తుంది. పార్టీ.

    ఇంకోడి కొడుక్కి ఎంసెట్ లో మంచి రాంక్ వచ్చింది. పార్టీ.

    ఇంకోడు ఇల్లు బుక్ చేసాడు. పార్టీ. దాని గృహప్రవేశం అయ్యాక పార్టీ.

    ఇంకోడి కూతురికి పెళ్లి కుదిరింది. పార్టీ. ఎంగేజ్మెంట్ పార్టీ. పెళ్లయ్యాక రిసెప్షన్ పార్టీ. నాలుగు రోజులయ్యాక ఆప్త మిత్రులందరికీ సినిమా వాళ్ళు సక్సెస్ మీట్ చేసుకున్నట్టు పార్టీ.

    ఇంకోడు కొత్త కారు కొంటాడు. పార్టీ.

    ఇంకోడి కొడుక్కి అమెరికా వీసా వచ్చింది. పార్టీ.

    ఆఫీసులో ఒకడికి ప్రమోషన్. పార్టీ.

    ఇలా పార్టీ పార్టీ పార్టీ. ఏది అటెండ్ అవ్వకపోతే వాడికే కోపం. అటెండ్ అయితే అంతరాత్మకి, దాంతో పాటు ఆవిడ గారికి కోపం. మీరెన్ని చెప్పండి. మన దేశంలో మగాడి పరిస్థితి బహు అధ్వానం.

    ఈ ఈతి బాధలు పోలీసోడి దెబ్బల్లాంటివి. చెప్పుకోలేం. చూపించుకోలేం. పడ్డ వాడికే తెలుస్తుంది నొప్పి

    ఇక్కడితో ఫ్లాష్ బ్యాక్ సమాప్తం

    ఈ అంతరాత్మలు సామాన్య మానవుడినే కాదు సినిమాల్లో హీరోలని కూడా విసిగించేవి పాత సినిమాల్లో! పాపం హీరో ఏదో విషమ పరిస్థితుల్లో ప్రియురాలికి టాటా చెప్పేసి ఇంకో సుందరిని పెళ్లి చేసుకుందామనుకున్నాడనుకోండి.

    ఆ వదిలేసిన ప్రియురాలు “ఎక్కడ ఉన్నా ఏమైనా నీ సుఖమే నే కోరుతున్నా” అని క్షమిస్తుందేమో కానీ ఈ అంతరాత్మ ఛస్తే క్షమించదు. వదలదు. పీక్కు తింటుంది వాడ్ని.

    ఇలా పీక్కు తినడాన్ని ఆ నాడు దర్శకులు చాలా బాగా చూపించేవాళ్ళు.

    హీరో పెద్ద నిలువుటద్దం ముందు నిలపడి ఉంటాడు. అద్దంలో అంతరాత్మ. ఇద్దరికీ వేర్వేరు బట్టలేసేవాళ్ళు లేపోతే మనం కన్ఫ్యూషన్ అవుతామని. ఇహ చూస్కోండి వాళ్లిద్దరూ ఓ తెగ డిషుమ్! డిషుమ్! ! సివరాకరికి హీరోకి ఒళ్ళు మండిపోయి పక్కనే ఉన్న ఓ పెద్ద ఫ్లవర్ వాజ్ ని ఆ అద్దం మీదకి మాంఛి కోపంతో విసిరేస్తాడు. దాంతో అద్దం ముక్కలు ముక్కలు అయ్యి గదినిండా పడిపోతుంది.

    అక్కడితో అవ్వలేదండోయ్. ఆ ప్రతి అద్దం ముక్కలో ఈ అంతరాత్మ మొహం భీకరంగా పెట్టి వికటాట్టహాసం చేస్తూంటుంది. హీరో కి ఇంకేం చెయ్యాలో తెలీక అంటే ఆ ముక్కలని తన చెయ్యి కోసుకు పోకుండా ఇంకా చిన్న చిన్న ముక్కలు ఎలా చేయాలో తెలీక, ఒహ వేళ తెలిసినా అలా చేస్తే ఇప్పుడు ఓ డజను ముక్కల్లో ఉన్న అంతరాత్మ ఇంకో రెండు డజను ముక్కల్లో కనిపిస్తుందన్న విషయం అర్ధమయ్యి ఆ గదిలోంచి విసురుగా బైటికి వెళ్ళిపోతాడు.

    ఇప్పుడు ఇప్పడికి వస్తే ఎందుకు నాకు నా అంతరాత్మకీ గొడవలయ్యాయంటే ఇన్నాళ్లు ఉద్యోగం, సద్యోగం పుణ్యమా అని అధమ పక్షం వారంలో ఆరు రోజులు బైటికి పోయేవాడిని. ఈ కొరోనా పాపమా అని నేను మూడు నెలలుగా ఇంటిపట్టునే పడుండడంతో వచ్చింది చిక్కంతా!

    గత మూడు దశాబ్దాల పై చిలుకు నేను బైట, అంతరాత్మ లోపల (ఇక్కడో పన్ ఏడిసింది) ఉండేవాళ్ళం. ఇప్పుడో పొద్దున్న లేచిందగ్గరినించీ ఇద్దరం మొహామొహాలు చూసుకోవడం. అలవాటు లేని పనాయె. దాంతో ఇద్దరికీ చెప్పలేని చిరాకొచ్చి రోజూ చీటికీ మాటికీ కీచులాటలు. మాట మాట అనుకోవడం మొహం ముడుచుకోవడం .

    మీరు కూడా అలా ఓ నదరుగా ఉన్న ఓ అద్దం పగలకొట్టేయచ్చుగా అంటారేమో. ఎంత కోపం వచ్చినా కాస్త వెనకా ముందు చూసుకుని రెచ్చిపోయే టైపు నేను., అలా అద్దం పగలకొడితే మళ్ళీ నాకే పడుతుంది దాని బడ్జెట్.
    ఎవరి మీదన్నా కోపమొస్తే చేతిలో ఉంది కదా అని నలభై వేలు పోసి కొన్న వన్ ప్లస్ 7 విస్సిరి కొడతామా ఏమిటి? మహా అయితే దగ్గర్లో ఏదన్నా న్యూస్పేపర్ లేదా మ్యాగజైన్ ఉంటె దాన్ని విసురుతాం. ఎంతైనా బతక నేర్చిన బడ్జెట్ పద్మనాభాలం కదా

    అయినా మనసు కవి ఆత్రేయ గారు ఎప్పుడో చెప్పారు “మనసున్న మనసుకి సుఖము లేదంతే” అని. ఈ మనసు, అంతరాత్మ వేర్వేరని నా అంతరాత్మ ఛీ ఛీ ఛీ నేను చెప్తున్నా.

    సరే మళ్ళీ అసలు కధలోకొస్తే దాని బాధ ఇలా రోజూ పడడం నావల్ల కాక మొన్నా మధ్య కటీఫ్ చెప్పేశా. అప్పటినించీ ప్రాణం హాయిగా. జీవితం ప్రశాంతంగా!

    అదీ మా ఆవిడా చెవులు కొరుక్కుంటూంటారు నా గురించి. నాకేం భయమా?

    చూద్దాం ఎన్నాళ్ళు సాగుతుందో.