Blog

  • “…శివా రుద్రస్య భేషజీ…”

    కాల,దురితాల నడుమ నలిగి,
    ఈతి బాధలు పడుతు చెలగి,
    తనవారికి తక్క, పరులమేలు తలవక
    ఇహపరాల తలపు పొసగక
    మాయ మాటున ఉబుసుపోక,
    కాయమున హంస పైకెగరగ..

    కట్టెతోబాటు కాటికేగి
    తోబుట్టువులు సైతం
    తోడరాని పయనం
    రుధిర,దేహ బాంధవులైనా
    చేష్టలుడిగి చూడగా

    తను బతికిన గతమున
    సలిపిన గమనమున
    మరలిన పలుమలుపుల
    కలిగిన తలపుల నెమరి
    భ్రాంతి పెరిగి విలవిలలాడి
    తనవారి చుట్టు తనకలాడి..

    కర్మ వాసనలు మూటకట్టి
    బొటనవేలంత జీవుడింక
    మది నిలబడిన చింతనలబట్టి
    ఆ తోలుతిత్తి నుండి
    తోచిన బొఱ్ఱ నుండి
    బయటపడు వైనముల

    ఆరునాల్కల అగ్గిబ్రాహ్మడు
    కట్టెను సమిధగ కాల్చేయ
    పుర్రె పగుల్చూసి
    మరుభూమి నుండి మరలి
    నా అనుకున్న వారు తరలి
    వెళ్ళిపోవుట చూసి

    ఛిద్రమయ్యే జీవుడికై
    రుద్రుడక్కడే నిలిచెను
    జీవాత్మ గుండె పగలనీక
    పరమాత్మ నిండుగ నవ్వెను.

  • నా ఇరాన్ యాత్ర:

    నా ఇరాన్ యాత్ర:

    2015 లో మా ఓనర్ కు ఇరాన్ లో ఒక పోర్ట్ లో sugar ని స్టోర్ చేసి లోకల్ గా అమ్మితే ఎలా ఉంటుందో అని ఐడియా వచ్చింది. లేడి కి లేచిందే పరుగు లా నన్ను, నా బాసును ఇరాన్ పొమ్మన్నాడు. ఇరాన్ /ఇరాక్ సరిహద్దు లో ఉన్న “బందర్ ఇమాం ఖొమేని” అనే పోర్ట్ కు వెళ్ళాలి. మాకు ఇరాన్ లో ఉన్న ఒక లాయర్ ను కాంటాక్ట్ చేసి అక్కడ మీటింగ్ ఏర్పాట్లు చేయమని చెప్పి ఒక శుభ ముహూర్తం లో బయలు దేరాము.

    EK లో నేను + బాసు FC. నేను మూట ముల్లి తో దుబాయ్ ఎయిర్పోర్ట్ చేరాను.చెకిన్ చేసి అమ్మయ్య అని ఊపిరిపీల్చుకున్నా. వెనక నుండి మొహిద్దిన్ జి అని బస్సు పిలుపు.. పదండి లౌంజ్ కు అన్నాడు. . ఏమి తిందాం అన్నాడు. నేను మీ ఇష్టం అన్నాను.

    Caviar తిందాం అన్నాడు. సరే దాంతో పాటు నేను foie gras ఆర్డర్ చేసాను. what is this మొహిద్దిన్ జి? అన్నాడు. నేను చెప్పా… ఇది french delicacy. Fattened గూస్ liver అని. మొఖం ఇబ్బంది గా పెట్టాడు. సరే ట్రై చేద్దాం అన్నాడు. Caviar రుచి చేసిన తర్వాత ఆ డబ్బా ను పరీక్షగా చూస్తే అది కాస్పియన్ సముద్రపుది అని తేలింది. ప్రీమియం క్వాలిటీ.(నాకు నచ్చలేదు) తర్వాత foie gras. కొంచెం రుచి చేశాము. slipperyగా , అంగుటికి అతుక్కునే లా అనిపించి పక్కన పెట్టేసి, Buffet లో ఏదో తిన్నాము. The way Emirates pampers FC passengers is unbelievable.

    ప్రయాణం చేసి టెహ్రాన్ లో దిగాము. కార్ లో టెహ్రాన్ లో The Parsian Azadi Hotel కు వెళ్ళాం. Check ఇన్ లో నేను నా క్రెడిట్ కార్డు ఇచ్చాను. హోటల్ వాడు చీ పో అన్నాడు. కాష్ –యూరోస్ or డాలర్స్ అన్నాడు. బాసు జేబులో నుండి ఓ కట్ట తీసి అందులో నుంచి కట్టి రూమ్స్ కు వెళ్ళాం. రూమ్స్ లో ac పని చేయటం లేదు. ఏమిటిరా అంటే పవర్ కట్ మరియు జనరేటర్ రిపేర్ అన్నాడు. నాకు ఇండియా లో చిన్న ఊర్లలో హోటల్స్ గుర్తుకోచ్చాయి. కిటికీలు తెరిచి పడుకొన్నాను.( చాల రోజుల తర్వాత). పొద్దున్నే 11 గంటలకు డొమెస్టిక్ ఫ్లైట్ తో మషాద్ కు వెళ్ళాలి. , టాక్సీ లో డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కు వెళ్లాం. ఆ ప్లేన్ చూస్తే భయం వేసింది. లోపల సీట్లు చినిగి పోయి, లగేజ్ రాక్స్ లో లైనింగ్ ఊడిపోయి carpet లో చిరుగులు తో స్వాగతం పలికింది గగన కన్య with black robe with hijab .

    Boeing stopped providing spare parts to all Iranian planes since 20 years అని పక్కన ఉన్న లాయర్ చెప్పాడు,. గుండె పోటు వచ్చినంత పని. ఓరి దేవుడా.. ఇది ఏమి పనిష్‌మెంట్ రా బాబు అని గుండె అరచేత్తో పట్టుకొని అలాగే 2 గంటలు బిగుసు కొని ఉండి పోయా. మషాద్ లో దిగాము. ప్లేన్ దిగి 30 అడుగులు వేస్తే టెర్మినల్. చిన్న సైజు రైల్వే స్టేషన్ లా ఉంది. బయట పడ్డాము. వెంటనే కార్ లు కూర్చొన్నాం. పోర్ట్ ఎంత దూరం అని అడిగా. అబ్బే 2 గంటలే అని అన్నాడు మా కాంటాక్ట్ . మధ్యలో ఏదో చిన్న హోటల్ లో chelo kabaab తిన్నాము. అది వాళ్ళ జాతీయ వంటకం అట.4 గంటలకు పోర్ట్ కు చేరాం. పోర్ట్ ఎంట్రీ లో మా పాస్పోర్ట్ లు లాక్కొని, మా ఫోటోలు తీసి , పది సంతకాలు చేయించుకొని లోపలి వదిలారు. వెళ్లి డైరెక్టర్ ను కలవాలి అంటే, అప్పాయింట్మెంట్ ఉంది అని confirm చేసుకొని ఫోన్ లో సెక్యూరిటీ ని తోడిచ్చి లోపలి పంపారు. ఆ సెక్యూరిటీ వ్యక్తి

    Is from Iran revolutionary guards ( elite force of iran) అని మా లాయర్ చెప్పాడు. నాకు చెమటలు పట్టాయి.

    సరే డైరెక్టర్ ఆఫీసు లోపలికి ఎంట్రీ.

    ( సశేషం)

  • ఆకొన్న కూడె యమృతము

    పూర్వం ధారా నగరంలో ఒక నిరుపేద బ్రాహ్మణుడు కాపురముండేవాడు. భుక్తి గడచేది కాదు. కుటుంబపోషణార్థం యాచకవృత్తి నవలంబించినవాడు. రాజాశ్రయం పొందితే ధనధాన్యాలకు లోటుండదని ఎవరో సలహా ఇస్తే, ఆ ప్రయత్నం చేయాలని ఆశ. కానీ ఏమంత చదువు సంధ్యలున్నవాడు కాదు. అపండితుడు. మరి రాజ దర్శనమెలా? అదీ తాను చేరవలసింది మహారాజు భోజుని దర్బారు!

    ఏదైనా కవిత్వం రాసుకెళ్ళి భోజరాజును మెప్పించమని మార్గాంతరం సూచించాడుట, ఆ సలహా ఇచ్చినాయన. ఇక మన కథానాయకుడు ఆ పనిలో పఢ్డాడు. సరే, వెళ్ళేది మహారాజ సముఖానికి. పక్కింటి బకాసుర చయన్లుగాడిని పలకరించినట్లు అరే ఒరే అంటే తలకీ మిగిల్న శరీరానికీ తెగతెంపులైపోవూ. అంచాత మర్యాదగా పిలవాలి.

    ఎలా?
    ఓ రాజా, అంటే ఏమంత బాగు? అదే, ఇంద్రుడితో సముడవైన ఓ రాజా అంటే ఎంత ఘనంగా వుండూ! కాబట్టి అదే సరైన సంబోధన. రాజేంద్ర, అన్న పిలుపు స్థిరమైంది. ఇక ప్రభువులవారి ఎదరపడి ఆయనని రాజేంద్రా అని పిలిస్తే చాలదే! మనం అక్కడికి వెళ్ళిందే మన కోరిక తెలియ చేయాలని. మరి మనం కోరేదేమిటీ?

    కాలే కడుపుక్కావలసింది కబళమే కదండీ. నలుగురి ముందు చేయి చాచి దేహీ అనటమే నిత్యకృత్యమైన వాడు ఇంకేం అడగగలడు? అతగాడూ అదే అడిగాడు. అలా పద్యంలోని మొదటి పాదంలో సగభాగం – భోజనం దేహి రాజేంద్ర అని సాధ్య పడింది.

    మరా భోజనంలోనికి ఏం కావాలయ్యా? ఏ స్టఫ్డ్ పీకాక్ అనో, ఖడ్గమృగం కబాబులనో ఆడిగితే ఏమనుకుంటారో. ఆపైన కులం కర్మం కలిసిరాక ఈమాట ఊరిలో పొక్కితే సాటి బ్రాహ్మణ సమాజం ఎంత ఆక్షేపించునో, కేలండరు మారి ఏ మనేకా గాంధీగారో మింస్టరైపోతే, ఇంకేమగునో! అందుకని ట్రైడండ్టెస్టెడ్ వెజిటేరియన్ ఫుడ్డీజ్వెరీగుడ్డనుకున్నాడుట.

    ఆ ప్రకారం అన్నంలోకి కాస్తంత పప్పు, ఆపై కమ్మని నెయ్యి – రోజూ కలగనేదిదే కదా, ఇంతే చాలనుకుని వీటినే సంసృతంలోకి తర్జుమా చేసుకున్నాడో, చేయించుకున్నాడో – ఏదో తంటాలు పడ్డాడు.
    శుభం! మొదటి పద్యపాదం తయార్.
    “భోజనం దేహి రాజేంద్ర ఘృత సూప సమన్వితం..”

    సరేనయ్యా. కానీ, రెండు వాయలు పప్పన్నం లాగించినా, అరిచేతిలో నాలుగు చుక్కలు నీళ్ళుంచుకు అపసవ్యంగా చెయితిప్పి ఆకు మడిచే ముందు, పెరుగన్నం ఒక్ఖ వాయ తగిలించకపోతే అదేం తిన్నట్టూ!! మరదెలాగా అడగటం??
    దానికేం భాగ్యం, “మాహిషంచ దధీ” అనేస్తే పోలా?! చిక్కని గేదె పాలతో తయారైన కమ్మని పెరుగు కదూ అడగటం…

    హమ్మయ్య! ఇక రాజాస్థానంలోకి అడుగు పెట్టటం, రాజుగారు మెచ్చి అన్నం పెట్టటం, అంతే.
    తగ్గవోయ్, తగ్గూ…
    ఏం? కవిత్వమంటిరే? రాసాం కదా?
    ఏవిటీ రాసిందీ? వీపు గుంజకేసా??
    ఇదేం పితలాటకం మహానుభావా? ఇంకా ఏముందనీ?
    ఊరుకోవయ్యా… రాసావుటనే మహా! ఏదీ ఆ రెండో పద్యపాదం పూర్తి కానిదే!?
    “భోజనం దేహి రాజేంద్ర ఘృత సూప సమన్వితం
    మాహిషంచ దధీ..” (!?)
    ఇదిటయ్యా పద్యం? ఇదా కవిత్వం? కాయంలో ప్రాణం మిగలాలనే??
    చచ్చాం పో. చంపేసావు కదయ్యా… మరిప్పుడేం దారీ?
    గోదారి. కొండుభొట్లవారి అనుజ్ఞ పుచ్చుకు నదీప్రవేశం చైడవేఁ.
    బాబ్బాబు. అలా అనకయ్యా. ఏదేనీ ఉపాయం చెపుదూ. అసలే బహు సంతానం, ఏకైక సంతానవతితో నిరంతరం సతమతం సంకులం జీవితం!

    ఇదో, ఇలా ఇక్కడ చిక్కడిపోయాడు పాపమా యాచక బ్రహ్మ. చదువు రాదు. పాండిత్య ప్రకర్ష లేదు. భోజరాజు మెప్పు లేక జఠరాగ్ని చల్లారదు. వేరేమీ తోచక తనకు తోచిన ఆ పద్యభాగమే ఒక తాటియాకు మీదికెక్కించి వీధిన పడ్డాడు.

    కనపడిన ప్రతివారినీ అడిగాడు. పరిచయమున్న పండితులందరి ముందూ ప్రణమిల్లాడు. తెలియని వారైనా, కవి అని వింటే చాలు కైమోడ్చాడు. తను వ్రాసుకొన్న మాటలకు పద్యరూపమిమ్మని అభ్యర్ధించాడు. ఎవరికీ వశం కాలా. ఏ ఊర్వశి ఊరువులో, సానివాడ సరసిజాక్షి సాంగత్య సౌఖ్యమో అంటే కవనం కదను తొక్కుతుంది కానీ, కళ్ళలో ప్రాణం పెట్టుకున్న బీద బాపడి ఆకలి అరుపులంటే కలం కదలాడదే!

    విసిగి వేసారినా, అణగారుతున్న ఆశ తప్ప ఆధారం లేని ఆ బ్రాహ్మణుడి కాళ్ళు దారి వెతుక్కుంటూ ఊరి చివరి సత్రంలో అడుగు పెట్టాయి. ఏదో జరుగుతుందని కాదు, ఏదోకటి జరిగినా అదే చాలని!
    ఊరికి దూరంగా. ఎప్పటిదో పాతకాలంనాటి సత్రమేమో. పెద్దగా పరదేశీలెవ్వరూలేని చోటు. అలసిన కాళ్ళు ఆగిపోయాయి. అలసిన ఒళ్ళు చతికిలబడింది. అలసిన మనసు అయ్యోమని విలపించింది. అలసిన కళ్ళు చెలమలయాయి. తన ఈ దౌర్భాగ్యానికి నింద ఎవరు మోయాలో, తన దుస్థితి తొలగే ఉపాయం ఎక్కడ వెదకాలో తెలియని నిస్సహాయ స్థితిలో ఆ పేద బ్రాహ్మడు!
    ఎవరవయ్యా నీవు? ఏలనీ వగపు? ఎందుకిలా చింతిస్తున్నావంటూ ఎవరిదో పిలుపు.
    తల ఎత్తి చూస్తే ఎదుటన ఒక ఆగంతకుడు. ఎవరో అపరిచితుడు.
    ఒక్క ఉదుటన తన గోత్రనామాలు, ప్రవర వల్లించాడు బాపడు. అహం భో అభివాదయే అని ఊపిరి తీసుకున్నాడు, ఉపనయనంనాడు వల్లె వేసిన నాలుగు ముక్కలూ ఎలాగో గుర్తు చేసుకుని.
    తమరెవరంటూ ఎదుటి వ్యక్తిని పరిచయం కోరాడు.

    అయ్యా, తమరు కవులా? సంస్కృత పండితులా?
    ఏదో తోచిన నాలుగు మాటలు రాసుకుంటూ వుంటానండీ. గొప్ప కవినైతే కాదు. ఇక సంస్కృతమంటారూ, శబ్దమంజరినుండీ రామ శబ్దం, మరో నాలుగితరములేవో చెప్పుకొన్నానంతే.
    ప్రవాహంలో కొట్టుకుపోతున్నవాడు తను. ఎదుటనున్నది గడ్డిపరకేనేమో. ఏమో.. అదే ఒడ్డుకు చేరిస్తేనో? ఆనూతన వ్యక్తికి తన కథంతా చెప్పుకున్నాడు. తన రాసిన పద్యపాదం చూపాడు. ఆ మిగిలిన భాగం పూర్తిచేసిపెట్టగలరేమో చూడమని అర్థించాడు.
    ఏదీ, చూడనిమ్మని ఆ తాటియాకు అందిపుచ్చుకున్నాడా కొత్తమనిషి. అందుమీదనున్న పద్యపాదం చదవగానే ఒక చిత్రమైన నవ్వు… చేత గంటం పుచ్చుకుని ఆ పద్యాన్నేదో సరిచేసి తిరిగిచ్చాడు. మహారాజుగారి ఆదరణ పొందుమని ఆశీర్వదించాడు.
    ఎట్టకేలకు పద్యం పూర్తయినదన్న సంతోషం నేలను నిలువనీలేదా యాచకస్వామిని. తనూ తన కుటుంబం పిడికెడు కూటి కొకింత చేరువయ్యామన్న ఆలోచన అతడికి కొత్త బలాన్నిచ్చింది. తనను వీడకుండా నిలచిపొమ్మని ప్రతి రాత్రీ నిశీధికన్యను ప్రాధేయపడే అతడు, ప్రభాతకాంత గాఢపరిష్వంగ భాగ్యమెపుడెపుడా అని ఉవ్విళ్ళూరాడు.

    సకల చైతన్యమునకూ కారణభూతుడు తానేనని విర్రవీగే మేల్ప్రొద్దు మొనగాడు ఉదయాద్రిపైన అచేతనుడైనాడు. తెలవారిందిక లేవండొక్కొక్కరొకో అంటూ రోజూ కూసే కోడి కూసింత కంగారు పడింది. ఏళ్ళ తరబడి సూర్యోదయాన్నీ కోడికూతనీ పట్టించుకోని మన విప్రుడు వాటికే స్వాగతం పలుకుతూ గుమ్మం మొగదల!!
    భార్య ఎదురురాగా, చిరకాల స్నేహితులైన జంకు భయములు తోడుగా, ఎందుకైనా మంచిదని ధైర్యము గాంభీర్యాలను కూడా బతిమాలి వెంటదోడ్కొని ఇంటినుండి రాజాస్థానం కడకు సాగిందతడి ప్రస్థానం.

    ఎట్టకేలకు ప్రభువులు కొలువుతీరి వుండగానే వారి సముఖంలో, మహారాజ రాజమార్తాండ డాండడడాండ.. అంటూ మునుపెన్నడూ లేని, రాజావారికే తెలీని మరో రెండు బిరుదులంటించి, మరి తమ శలవైతే… అని ప్రభువును చూసాడు ఆశగా.

    చినిగిన గావంచా. చింకిపాత చీరొకటి తలపాగా. చేతనొక తాటాకు బద్ద! ఆహా, ఊడిపడ్డాడయ్యా కవి మార్తాండుడు, అనుకుంటూ మొగాలు చిట్లించారు సభాసదులు. ఆస్థాన శోభయైన నవరత్నాలు నవ్వుకున్నాయి: ఒకింత జాలిగా, కించిత్ వేడుకగా. సభంతా నిశ్శబ్దంగా నిరాసక్తంగా వుండటం గమనించి కంగుతిన్నాడా యాచకుడు. భయపడుతూనే ప్రభువులాజ్ఞ కొరకు ఆశగా చూసాడు.

    మందహాసంతో తల పంకించాడు భోజుడు. రసికుడైన శ్రోత/పాఠకుడు కవి అంతరంగ మధనంలోనుండీ పుట్టే రచనామృతం బిందుమాత్రమే లభ్యమైనా సింధువంతగా భావించి ఆస్వాదిస్తాడే కానీ, రత్నఖచిత పానపాత్రలో నింపలేదని ఆ రససుధను తిరస్కరించడు కదా. మరి భోజుడు కవిరాజు కూడానయే!

    హమ్మయ్య!! ఆజ్ఞ అయింది.

    “భోజనం దేహిరాజేంద్ర, ఘృతసూప సమన్వితం”

    పద్యం మొదటి పాదం వింటూనే భోజుడి మొహంలో ఒకింత వైకల్యం, ఒకింత వినోదం! ఐనా కడుపు నిండిన వాడికి కళలూ కవితలూ కానీ, ఆకలితో అలమటించే అడుగు తరగతి కుటుంబీకుడికి కడుపాశే తప్ప కవిత్వం మీదనా ధ్యాస! వాడింకేం చెప్పగలడు!?
    ఏమో… వాడింకా ఏం చెప్పగలడో!!

    “మాహిషంచ శరచ్చంద్ర చంద్రికా ధవళం దధి.”

    భయపడుతూనే తడబడుతూనే రెండవ పాదం చదివి పద్యం ముగించాడో లేదో ఆ అన్నార్తి, సభలో సంభ్రమం. భోజుడి మొహంలో విభ్రమం. తన సింహాసనం వీడి వడి వడిగా అతడిని సమీపించాడా రాజు.
    అయ్యా, ఈ పద్యం తమరి స్వీయమేనా, వేరెవరైనా రాసి ఇచ్చారా? నిజం చెప్పండి. మీకే ఆపదా లేదు!

    వణికిపోయాడా బ్రాహ్మణుడు. గ్రాసం మీది ఆశ కంఠం మీద పాశమౌతుందన్న భయం. బహుమానం పీడాపోయే, బలుసాకు దక్కితే బతికిపోయామన్నట్లే అనుకున్నాడు మనసులో. చేతులు జోడించి, మహారాజా మన్నించండి. భుక్తి గడచే మార్గం లేక తమరి ఆశ్రయం పొంది భార్యా బిడ్డల పోషణ చేసుకుందామన్న దురాశ తప్ప మరో పాపం ఎరుగను. పద్యం లోని మొదటి పాదం మాత్రమే నాది. పూరణ ఎవరో పరదేశి; కవి వలెనే వున్నాడు. నాకథ విని, రెండవపాదం అవలీలగా అలవోకగా రాసి ఇచ్చి, తమరికి వినిపించమన్నాడు

    ఓహో. విధివశాత్తూ, ఆ అపరిచితుడు ఈనాటి సభలో కాలూనాడేమో. మీరు అతడిని గుర్తించగలరేమో, చూడండి. ఆ అగంతకుడు ఈ కాళిదాసమహాకవిని పోలి ఉంటాడేమో పరికించండి!

    ఈసారి తెల్లబోవటం ఆ బ్రాహ్మడి వంతు. ముందునాటి సంధ్యాసమయంలో తాను కలిసిన వ్యక్తి రాజాస్థానంలోనా? కాళిదాసంతటి మహాకవి తానే స్వయంగా తనకు పద్యపూరణ చేసి ఇవ్వటమా. ఆహా… అవును కదా. అతడీ మహాకవే నిస్సందేహంగా. ముందునాడు తానున్న మానసిక స్థితి, ఎదుట సామాన్యుడివలె ఉన్నది సాక్షాత్తూ కాళీవరప్రసాదుడని పోల్చుకోనివ్వలేదు.

    నా అపచారం మన్నించండి మహాకవీ. మాన్యులను సామాన్యులనుకొన్నాను. పరుషంగా, దూకుడుగా భాషించానేమో కూడా… అంటూ పాదాలంటబోయాడు. వద్దు వద్దు, నీయందు ఏమాత్రం దోషం లేదంటూ వారించాడా కవిచంద్రుడు.

    విప్రుడి వినయ విధేయతలకూ సంస్కారానికీ సంతసిల్లిన భోజుడు, అతడికి, అతడి కుటుంబానికీ ఆజన్మమూ భోజన లేమి కలుగకుండునట్లు సదుపాయము చేసి సాగనంపాడు. తదనంతరం కాళిదాసును ఘనంగా సత్కరించి అది తానే పొందిన గౌరవమని గర్వించాడు.

    ఇంటికి మనం చేరేందుగ్గానూ, కంచికి కథను సాగనంపే ప్రాచీన ప్రథ ఇక్కడ పాటించేసాం.

    ఇక ఈపద్య విశేషం గమనించిట్లైతే, ఒక సామాన్యమైన అభ్యర్థనకి అతి విశిష్టమైన సౌందర్యం కల్పించిన కవి కల్పనా చాతుర్యం ఎంత అద్భుతమో తెల్లమౌతుంది.

    భోజనం దేహి రాజేంద్ర ఘృత సూప సమన్వితం
    మాహిషంచ శరచ్చంద్ర చంద్రికా ధవళం దధి

    “అన్నం, పప్పు, నెయ్యి, ఆఖర్న ఒకింత పెరుగుతో కూడిన భోజనం దయచేయించవయ్యా, మహారాజా!” స్థూలంగా ఇదీ శ్లోకార్థం. కానీ అది ఎటువంటి పెరుగై వుండాలయ్యా అంటే, శరదృతువులో పౌర్ణమినాడు కురిసే చంద్రుని వెన్నెల అంత తెల్లగా, చల్లగా వుండాలట. ఇదీ ఆ కవి చమత్కృతి.

    సహజంగా వెన్నెల అన్న తలంపే ప్రతివారికీ ఆహ్లాదకరమైన అనుభూతినందిస్తుంది. ఆపై శరత్కాలమంటే చల్లదనం, ఉల్లాసం. భావోద్వేగ తరంగాలు పెల్లుబికే సమయం. అదే వెన్నెలఱేడి దరహాసం మరి ఆ శరత్కాలంలో అనుభవమైనవారు ఇక మరెంతగా ఆనంద పరవశులవాలి!? అదేవిధంగా, క్షుధార్తుడైనవాడికి, భోజన సమాప్తి వేళ శరద్పూర్ణిమనాటి చందమామ వంటి కమ్మని గడ్డపెరుగు లభ్యమైతే ఆ సంతోషం చెప్పనలవా?!

    కాళిదాస మహాకవి ఎంతటి రసరమ్యమైన పద్యం తీర్చిదిద్దాడో. ఇంతటి మనోహరమైన కల్పన సాధారణ మేధకు సాధ్యమా! అందుచేతనే,
    “అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతిః
    యధాస్మై రోచతే విశ్వం తధేదం పరి వర్తతే”
    అని దణ్ణం పెట్టుకు మరీ, ఆ సుకవులను కీర్తించుకోవటం, మనం.

    #పలుకు, #వెన్నెల, #తెలుగు, #అమ్మనుడి, #సాహిత్యం #పద్యం

  • హృదయ పలకం

    ఇవి పలక, బలపాలు.
    అంటే, మనం ఒద్దూ, నా మనస్తత్వానికది పడదూని ఎంత మంచితనంగా చెప్పినా, కాదూ, నువ్వు వెళ్ళాలమ్మా, ప్లీజ్‌రా అని మనల్ని మొండితనంగా చీపురుకట్టతోటో, మూల కాడున్న కర్రతోటో, ఏడ్చి పోతూంటారే? బడి. అందుకోసం.

    ఆ బళ్ళో పడిపొయ్యాక, మన పేరూ, నాన్న పేరూ, ఎన్ని రాసినా అయిపోని తెలుగష్చరాలూ, క కొమ్ము దీర్గమిస్తే కూ చుక్ చుక్… గుడింతాలూ, ఏబీసీడీ ఇంగ్లీషు బర్లూ ఇవ్వన్నీ రుద్దుకోనీకి ఉండేదే, పలక.

    అసలు బడికి పొయ్యేకంటే ముందు మనకి ఆషాబ్యాసం చేస్తారు. మనవేమో నాన్నో, తాతో ఎవురో ఒళ్ళో కూచుని వనమోహినీ, షీ వాజ్‌ హియర్, షీ ఈజ్ ధమాల్ అని చక్కగా దిద్దబట్టేదన్నమాట. ముంగట్నే ఇవ్వన్నీ బాగా నేర్చేసుకుంటే రేపు బడికి పోయాక ఇంక ఇట్టాంటివి తెలుసుకునేది శానా తేలిక.

    ఈ పలకలు పెద్దబజార్లో సుబ్బారావు దుకాణంలో కొనుక్కోవాలి. నాన్నతో కంటే చిన్నన్నతో పోయింది మేలు. అడగకుండానే పెద్ద పలక కొనిపెడతాడు. అమ్మా నాన్నయితే, చిన్నవాడివి కదా, చిన్న పలక చాలు అంటారు. పొద్దునేమో పెద్దయినావు, రేపట్నుండీ బడికి పోవాలన్నదీ వాళ్ళే. ఇప్పుడేమో చిన్నవాళ్ళకి చిన్నపలక అనేదీ వాళ్ళే. అంతా మోసం.

    పలకలు పలు రకాలు. మనం మామూలు రకం కొనుక్కుంటాం. నాలుగు పక్కల చెక్కలు, మజ్జన పలక. మట్టితో చేస్తారంట. నునుపుగా ఉంటాయి. నువ్వు పలక పైమీదని తూ అని ఉమ్మూస్తే అది చక్కంగా కింది దాకా కారుకుంటూ రావాలిమాట. మనది మంచి పలక అవునో కాదో తెలిసిపోతుంది. ముందే చూసి పెట్టుకోవాలి. మనం చిన్న పిల్లలు, ఏం తెలీదని సుబ్బారావు పిచ్చి పలకలు మనకి అమ్మి, మంచివన్నీ అట్టే పెట్టుకుంటాడు. చింతాగాడు చెప్పాడు నాకు.

    కానీ, నేను కొనుక్కునేప్పుడు తూ అనబోతే, చిన్నన్న ఏం పన్రా వెధవా, అని నెత్తిమీద ఒక్కటిచ్చి పలక లాక్కుంటాడే! తెలీపోతే అడగాలి కానీ… నేనే ఇంకా చెప్పా. నువ్వు కూడా దబ దబా రెండు పలకలమీద ఉమ్మేమని. ఏడిశావులే. నోరుమూసుక్కూచో, అని నన్నే అనటం, పైగా.
    ఈ పెద్దవాళ్ళకసలకేం తెలీదురా. మనకే ఎక్కువ తెలుసని మనం చెప్పినా వినరు. ఎందుకంటే, కుళ్ళు! ఎట్లన్నా, చింతాగాడికి ఇట్లావన్నీ చాలా విషయాలు తెల్సు. తరవాత వాడే ఉమ్మేసి చూసి, పరవాలేదురా, మంచి పలకే అన్నాడు.

    వేరేవాళ్ళ పలకలు రేకువి. అవి అస్సలే బరువే ఉండవు. ఇంకానేం, వాటిలకి ఒక పక్క నలుపు, రొండో పక్క ఇటికి రంగు, ఆకు పచ్చ రంగు ఇట్లా. ఒక్కోవాళ్ళు ఫ్లాష్టీకు పలక కూడా తెచ్చుకుంటారు. దానికి చుట్టూ కూడా ప్లాష్టీకే. పైన బొమ్మలు కూడా ఉంటాయి. కొన్నిటికైతే కొద్దిగా చోటు వరకూ పలక ఉండదు. ఆ ఖాళీలో సువ్వలు పెట్టుంటాయి, వాటికి రంగుల్రంగుల పూసలు. ఒక సువ్వకి ఒక పూస, రెండోదానికి రెండు పూసలు, మూడోకి మూడు… పది దాకా. పలక ఊపితే పైకి కిందికీ ఎగుర్తా, పిచ పిచమని చప్పుడు కూడా. బలేగుంటాయిలే. సుశీలా టీచరుగారబ్బాయి సామియలు ప్రెసాదుకుండేది.
    మనింట్లో అవన్నీ కొని పెట్రుగా అయినా.

    సరే పలక కొనుక్కున్నాక బలపాల పొట్లం కూడ కావాలగా. మర్లేకుంటే రాసేదానికి ఎట్లా? పొడూగ్గా మన మోచెయ్యలో సంగమంతుంటాయి. వీటిల్ని కూడా మట్టితోనే చేసేది. పలకలేమో తారునీళ్ళల్లో ముంచుతారు. అందుకే నల్లగా ఉంటాయి. బలపాలు ముంచరు. అందుకే అవి మట్టిరంగు!

    ఇక్కడ బొమ్మలో ఉన్నాది పాల బలపం! ముగ్గు బలపం, తెల్ల బలపం… అన్నీ ఇదే. వీటిట్లోనే పిండి బలపం, సుద్ద బలపం అని ఇంకొద్దిగ ఫైనర్ క్వోల్టీ. పట్టుకునేదానికి, రాసేదానికి మెత్తటివి. తినేదానిగ్గుడక ఇవే బాగుంటయి. కాస్త ఉన్నోళ్ళ షోకు పిల్లులు, ఇట్టాంటివి తెచ్చుకునేవాళ్ళు.

    రంగు బలపాలు మళ్ళా ఇంకో వేరే రకం. ఒక్కోమారు ఒకే బలపంలో రెండు రంగులు; ఎరుపు, తెలుపు. అట్లే నాలుగు కూడా. రంగు పలకలూ, రంగు బలపాలూ ఇట్టాంటివి శానా రిచ్చిఇండ్ల పిల్లల దగ్గరనే అవుపడేది. రిచ్చంటే, పిర్రకతుక్కునే స్టెచ్చి నిక్కరూ, పచ్చచారల మెరుపు చొక్కా తొడుక్కోని కాలరు దగ్గరి పైగుండీ కూడా పెట్టుకునేవాళ్ళు ఉంటారే. వాసన నూనె, బెల్టు బూట్లు…

    ఒక్కో ఊర్లో వేరే పిల్లగాళ్ళు మన బలపాల్నే కణికెలంటారు.ఇంకోవాళ్ళు పలకపుల్లలంటారు. నాకు అప్పుట్లో బలే కోపం. మన బలపాన్ని ఎవుడిష్టం వొచ్చినట్లు పిలిచేందుకు వాళ్ళెవరూ? మన్ని అడిగే పనిగూడ లేకుండా?!

    నేనూ, గురవారెడ్డీ, చింతాగాడూ, గోలీ, జమాలూ, ఇంకా మావన్నీ మామూలు పలకలు, బలపాలే. బళ్ళో డిక్కేషన్ చెప్పినప్పుడూ, ఛ ఛా ఛి ఛీ అనుకుంటూ గుడింతం రాయటం, ఏడో ఎక్కం, అన్నీ పలక మీదే. ఒక్కోసారి వొంద ఒంట్లు ఇంటికాడ రాసుకరామనేవాళ్ళు. అన్నీ రాసి పొద్దున బడికి పోయి టీచరుగారి బల్లమీద పెట్టేప్పుడు చూస్తే సగం చెరిగి పోయో, అలికిపోయో ఉండేవి. పలకమీద తెలుగు వాచకం, ఎక్కాలబుక్కులన్నీ పెట్టి భుజం మీద పెట్టుకు పోయినప్పుడు రాసినవన్నీ తుడుపుకు పోయినాయన్నమాట.

    మళ్ళీ టీచరుగారు కొట్టకుండానే ఏడ్చుకుంటూ అవన్నీ తిరిగి రాయటం! అన్నీ చూసాక టిక్కులు పెట్టినవి మానేసి, ఇంటూలు పెట్టినవి మళ్ళీ ఒకోటీ పదిమాట్లు రాసి చూపీటం. వేళ్ళు నెప్పి పుట్టిందాకా ఇదే పని. బళ్ళో వేరే కూడా రాసేదుండేది. అందరూ పలకలు బాగా తుడిచేండ్రా అనేవాళ్ళు. ఉట్టుట్టినే తుడుపుతే పోదుగా? చేతిమీదా, కాలిమీదా చెమట పడితే, పలకకి రుద్ది తుడపొచ్చు. కొంతమందేమో తెలీక పలకమీద ఉమ్మేసి తుడిచేవాళ్ళు.

    రవణగాడు కూడా అలా చేస్తే నేనే చెప్పా. పలక సరస్పతీదేవిరా, కళ్ళు పోతాయి. దేవుడి మీద ఉమ్మేసి తుడుస్తే చదువురాదు నీకని. వాడు ఏడ్చాడు. చదూకోపోతే మా అమ్మ తంతానందిరా… పలక తుడవటానికే చేసా, ఇప్పుడెలా అని? కళ్ళకద్దుకోని, దణ్ణం పెట్టుకోని, చెంపలేసుకో వెదవాయా, ఇంకెప్పుడూ చైనని తల్లితోడని ఒట్టెయ్యి. పలకమీద ఉమ్మకూడదు. మన చొక్కా మీద ఇలా ఉమ్మేసి, దాంతో తుడుచుకోవాలి. నేను చూడు ఎలా చేస్తానో, పాపం తలగకుండా అని నేర్పిచ్చా. వాడికివాళ ఏ కాస్తో కూస్తో చదువబ్బినా, నా పేరు చెప్పుకు దీపం పెట్టుకుంటుంటాడు, సన్నాసి.

    ఒకసారేమైందో తెలుసూ? ఒంటి బెల్లప్పుడు అందరూ బైటికి ఉరుకుతున్నాం. గురవారెడ్డిగాడు వాడి పలక కాస్తా తొక్కాడు. ఏం కాలా. ఒక మూల మీద ఆకాశంలో జీడిపప్పు చందురుడల్లే కొంచం పగిలింది. టీచారు కూడా కొట్లే. గుడ్డి వెధవా, చూసుకో నడవలేవూ అనన్నారంతే. అమ్మ అరుస్తుందిరా అని బయపడ్డాడు కానీ వాడికే బాగైంది. రేపు బడికొచ్చేప్పుడులా, ఒక చేత్తో కంతలో వేళ్ళుపెట్టి పలక, రొండో చేత్తో పుస్తకాలు పట్టుకొచ్చాడు. అసలు భుజం మీద నెప్పే పుట్టలే. ఇంటో రాసుకొచ్చింది చెరిగి పోలే కూడా!! భలేగయింది కదా?

    వీడిని చూసి చింతాగాడు మనం కూడా చేద్దాంరా అన్నాడు. ఇంటో చూస్తే తంతారని నే వొద్దన్నా. ఒకరోజు వాడే రాయి తీసుకుని పలక మీద ఠాప్పున కొట్టాడు. పలక సగానికి పగిలింది. వాడి వీపు కూడా. బళ్ళో టీచరు గారి చేతిలో సగం, ఇంటో వాళ్ళమ్మ చేతిలో మిగిలిన్సగం! కానీ చూడు, వాడి పనే హాయి. ఊరికి పోతే పెట్టె పట్టుకున్నట్టు, ఆ పగిల్న పలకే ఊపుకుంటూ బడికొచ్చాడు. ముప్పయ్యో, డెబ్బయ్యో పట్టినన్ని ఒంట్లే రాసుకొచ్చాడు. బుక్కు చూసి పాటం రాయమంటే, మేం వొగుర్చుకుంటూ మొత్తం రాయటం. వాడికి సగం పలకేగా. సగం పాటమే రాయటం! జీతాలొచ్చాక కొత్తది కొనిస్తా, అందాకా దీంటోనే రాస్కోమన్నాడండీ మా నాన్న, అని చెప్పాడు టీచరుగారికి. అప్పుడు వాడిని మళ్ళీ కొట్టలా.

    నేను మాత్రం గుడింతాలూ, ఏడో ఎక్కం ఐదుసార్లూ అన్నీ పూర్తిగా రాసా, కానీ ఎక్కాలసైడు చెరిగిపోయింది. ఆవాళ బడి దగ్గర తాయెత్తులమ్మేవాడు పాములాడిస్తుంటే చూసి, పరిగెత్తి పోయినా బడికి ఆలీసెం అయింది. టీచరుగారేమో పలక తీసుకురామని, ఎక్కాలేవిరా అన్నారు.

    ఒట్టండీ, తుడుపుకుపోయినాయండీ అని నిజం చెప్పా. ఏరా, వీళ్ళందర్తో తిరిగి తోక పెరిగి పోతోందా నీకూ? ఇంటికొచ్చి అమ్మకి చెప్పమన్నావా? తోక కత్తిరించేస్తాను, రాస్కెల్, అని స్కేలుతో రెండు పీకారు.

    మిగిలిన మట్టి పలక
    పగిలిన హృదయ పలక
    నేను
    ఆరోజు

    #పలుకు, #వెన్నెల, #తెలుగు, #అమ్మనుడి, #బాల్యం #హాస్యం

    @Chandu1302

    2
  • నాన్న టీ షర్ట్

    నాన్న టీ షర్ట్

    నేను పూనే లో వ్యవసాయ కళాశాలలో చదివేరోజుల్లో, లక్ష్మీ బజార్ లో నాన్న కోసం ఒక టీ షర్ట్ కొన్నాను.ముదురు ఆకుపచ్చ టీ షర్ట్, ముందు IMPACT అని ఇంగ్లీషులో పెద్ద అక్షరాలల్లో ప్రింట్ ఉండేది. కొన్నది పెద్ద దుకాణం లో కాదు, వెచ్చించింది ఎక్కువ ఖరీదూ కాదు. ఎందుకంటే అప్పుడు నాది, చవకబారు రీసైకల్డ్ పేపర్, 10 రూపాయలకు నాలుగు వచ్చే use and throw పెన్లు,వన్ బై టూ చాయిల తో గడిచే బడ్జెట్ బ్రతుకు — స్టూడెంట్ బ్రతుకు.

    నాన్నకి టీ షర్ట్ ఇచ్చిన వెంటనే సరదా పడ్డారు, IMPACT అన్న మాట చూసి IAF కి సంబంధించి ఏదో విషయం గుర్తు చేసుకున్నారు. ఆ రోజు సాయంత్రం badminton ఆడటానికి అదే టీ షర్ట్ వేసుకొని వెళ్ళారు, స్నేహితులంతా కాంప్లిమెంట్స్ ఇచ్చారని మురిసిపోయారు. నాన్నలు ❤

    ఆ తర్వాత పై చదువులు, ఉద్యోగం, పెళ్ళి అనే గళ్ళన్నీ టిక్ కొట్టేసరికి మరో 5–6 ఏళ్ళు గడిచాయి. దరిమిలా నేనెప్పుడు ఇంటికి వెళ్ళినా, నేను ఉన్నన్నాళ్ళలో ఏదో ఒక రోజు ఆ టీ షర్ట్ వేసుకొనే వారు. నేను రెండు మూడు సార్లు చెప్పాను, ‘నాన్న, ఈ టీ షర్ట్ రంగు వెలిసిపోయింది. బాగా పాతది కూడా అయిపోయింది. నేను మరోటి ఇలాంటిదే కొనిస్తాను, ఇది వేసుకొవద్దు నాన్న’ అని.

    నాన్న మాత్రం,’లేదమ్మ, చాలా మంచి టీ షర్ట్, చాలా సౌకర్యంగా ఉంటుంది’ అని మాట దాటేసేవారు.
    అప్పుడు అమ్మ, ‘అవునమ్మ, ఎక్కడ కొన్నావో గాని, చాలా మంచి క్వాలిటి. ఇన్ని సంవత్సరాలలో మీ నాన్న బొజ్జపెరుగుతూనే ఉంది, అది పాపం సాగుతునే ఉంది’ అనటం.
    ‘నువ్వు ఇంతేసి నూనే పోసి వంట చేస్తే పొట్ట రాక ఏమవుతుంది?

    ‘అవును మరి, అన్నీ తగ్గించి వండితే అర్థాకలితో లేస్తారు కంచం ముందు నుంచి, ఆ బాధ చూడలేకే మీకు నచ్చినట్టు చేస్తున్నాను. అయినా ఆ టీ షర్ట్ లైఫ్ అయిపొయింది, నాకిస్తే, చక్కగా కిచెన్ కౌంటర్ తుదుచుకుంటా, మెత్తని బట్ట ఇమ్మంటే ఇవ్వట్లేదు మీ నాన్న.’

    ‘నువ్వు ఇలాంటిదేదో చేస్తావనే ఇంకా వేసుకుంటున్నాను. ఇచ్చే సమస్యే లేదు.’ నాన్నలు ❤

    బాబు పుట్టి నాలుగేళ్ళు. వాడి బారసాలకి వెళ్ళినప్పుడు వేసుకున్నారు, వాడి మొదటి పుట్టిన రోజు వైజాగ్ లో జరుపుకునేందుకు వెళ్ళినప్పుడు వేసుకున్నారు, వాడి మూడో దశరాకి వెళ్ళినప్పుడు వేసుకున్నారు. ఈ వేసవికి వెళ్ళుంటే ఖచ్చితంగా వేసుకునే వారేమో. ఈ సారి ఎలాగైన వేరే టీ షర్ట్ ఇచ్చి, ఆ పాత దాన్ని దాచేయమని అమ్మకు చెప్దామని గట్టిగా నిర్ణయించుకున్నా. కానీ….. తలచినదే జరిగినదా దైవం ఎందులకు?

    కొరోనా వచ్చి నా ప్లాన్, పెద్ద బడ్జెట్, అంతకంటే పెద్ద హీరోని పెట్టి తీసిన మల్టీ స్టారర్ కు అర స్టార్ రేటింగ్ వచ్చినంత పెద్ద ఫ్లాప్ అయ్యింది. అయితే ఈ సారి ఎలాగైనా నాన్నకు కొత్త టీ షర్ట్ కొనిస్తాను, లేదా పంపిస్తాను.అయినా సరే, మళ్ళీ నేను వైజాగ్ వెళ్ళినప్పుడు నాన్న IMPACT టీ షర్టే వేసుకుంటారు.

    అది నా మనసుకు తెలుసు.

    ఎందుకంటే………. నాన్నలు ❤

    2
  • మరుపురాని అనుభూతి!!

    మరుపురాని అనుభూతి!!

    1985. కర్ణాటకలో పని చేస్తున్నప్పుడు, నేను డిపాజిట్ల సేకరణలో కొంచెం చురుకు. అప్పుడు హైదరాబాద్ లో ఉన్న నిజాం ట్రస్ట్ నుండి deposit తీసుకోవాలని ఒక మొండి పట్టుదల మనసులో. 

    ఎలా అబ్బా? 

    సరే హైబా లో ఒక పెద్ద వ్యక్తిని పట్టా. ఆయనేమీ చెప్పారంటే,decisions అన్ని his highness  తీసుకొంటారు. 

    కాబట్టి మనం ట్రై చేద్దాం అన్నారు.

    His highness అంటే ఎవరూ అని అడిగా? దివంగత నిజాంగారి కుమారుడు..ముకరం జా అని చెప్పారు. ఇంకా ఐనట్టేలే అని నిరాశ పడ్డా. నేను ఆ విషయం మర్చి పోయా.

    ఆరు నెలల తర్వాత ఒక రోజు అ సదరు వ్యక్తి నుండి ఫోన్. ఆస్ట్రేలియా నుండి వచ్చారు ముకరంజా గారు. ఎల్లుండి అప్పాయింట్మెంట్ 11 గంటలకు అని అన్నారు. ఇదేమిటని విస్తుపోయా. అప్పుడు తెలిసింది ఆరు నెలల ముందే అప్పాయింట్మెంట్ తీసుకున్నారని. నేను హైబా బయలు దేరాను.

    మధ్యవర్తి గారు నా వేషం చూసి కొంచెం నిరాశ పడ్డారు. నేను మామూలుగా షర్ట్ టక్ . నో జాకెట్. నాకు జాకెట్ లేదు అప్పుడు. ఈ వ్యక్తి షేర్వాని లో రెడి. మేము కారులో బయలు దేరాము.

    ఏదో పాలస్ లో ఉండేవారు ఆ రోజుల్లో ముకర్రంజా. కారు బయలు దేరిన తర్వాత నాతో ఉన్న వ్యక్తి ” ముకరం జా గారి సమయం విలువైనది. Precise గా మాట్లాడు. extra మూవ్మెంట్స్ అవీ చేయవద్దు. He is a prince అని భయపెట్టాడు”.

    కారు గేటు లోకి ఎంట్రీ. అక్కడ ఉన్న వారు మమ్మల్ని చెక్ చేసి confirm చేసుకొని లోనికి వెళ్ళమని చెప్పారు . కారు సర్కులర్ డ్రైవ్ వే దాటి పాలస్ గుమ్మం ముందు ఆగింది. కారు ఆగిన చోట నాలుగు మెట్లు ఉన్నాయి.అక్కడ ఒక 55 ఏళ్ళ సాదా సీదా వ్యక్తి మా కారు ఆగగానే కారు తలుపు తీసాడు. నాతో వచ్చిన వ్యక్తి ఆయనకు రెండు మూడు సార్లు సలాం చేసాడు . నేను కారు అటువేపు నుండి దిగి ఇటు వచ్చేటప్పుడు తను మెల్లగా చెప్పాడు ..ఆయనే ముకరంజా అని. నాకు నోట మాట రాలేదు. అంతా పెద్ద వ్యక్తి మా కారు డోర్ తెరవడమేమిటి ? ఇంత సాదా సీదా గా ఉన్నాడేమిటి అనుకుంటూ సలాం చేసాను.

    లోపలి వెళ్ళగానే కళ్ళు జిగేల్ మన్నాయి. Rare wall to wall carpets . బ్యూటిపుల్ లైటింగ్. Priceless పెయింటింగ్స్. ఒక మ్యూజియం కు వచ్చానా అనిపించింది. లోపలికి అంటే ఒక ఆరు గదులు దాటి ఓ పెద్ద హాల్లో మూడు సోఫాల్లో ఆశీనులయ్యాం.నేను షాక్ నుండి తేరుకోలేదు. ముకరం జా గారు అది గుర్తించారు లా ఉంది.

    నా పక్కన వచ్చి కూర్చొన్నారు. నన్ను కుశల ప్రశ్నలు వేసారు. ఆ తర్వాత ఆయన నా పుట్టు పూర్వొత్హరాలు, నా చదువు అవి కనుక్కున్నారు. ఉద్యోగం ఎలా వచ్చింది అని అడిగారు. నేను అల్ ఇండియా కాంపిటిటివ్ పరీక్ష అని చెప్పాను. రాంక్ వచ్చిందా అని అడిగారు. తొమ్మిదో రాంక్ అని చెప్పాను. అప్పుడు ఆయన నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి వెరీ గుడ్ అన్నారు.నా భుజాన్ని తట్టారు. ఇంతలో అనూహ్యమైన సంఘటన జరిగింది. ఆయన బట్లర్ ఒక ట్రాలీ తోసుకొంటూ టీ సరంజామా తీసుకొని వచ్చాడు. He was immaculately dressed.

    ముకరంజా గారు చటుక్కున సోఫా నుంచి లేచి కార్పెట్ మీద కూర్చొని నన్ను చూసి షుగర్ ఎంత కావాలి అని అడిగారు. నాతో వచ్చిన ఆయనను కూడా అడగి తానే చక్కర కలిపి స్వహస్తాలతో టీ కప్పులు మా కిద్దరికి ఇచ్చారు. నా అనుభూతి వర్ణనాతీతం.

    Old traditions,hospitality అంటే ఇదేనేమో అనిపించింది.

    నాకు కళ్ళు తిరిగాయి. నిజాం బిడ్డ నాకు టీ సర్వ్ చేయటం ..I can not define that feeling.

    నేను మెల్లగా వచ్చిన పని చెప్పాను. ఒకే అని చెప్పి ఒక పెద్ద మొత్తం డిపాజిట్ ఇమ్మని ఆయన ఫైనాన్స్ పర్సన్ కు intercom లో చెప్పారు. నేను ధన్యవాదాలు తెలిపాను. He Brushed them aside. అప్పటికే 25 నిమిషాలైంది. సరే మేము సెలవు తీసుకుంటాం అని చెప్పాము. ఆయన అత్తరు తెచ్చి మా ముంజేతులకు పూసి ఖర్జూరం ఆఫర్ చేసారు. ఆయన మాతో బాటు బయటకు వచ్చారు. నేను కారు ఎక్కబోతుంటే ముకరంజా గారు ఒక అడుగు ముందుకేసి నేనెక్క బోతున్న కార్ డోర్ తీసి పట్టుకున్నారు. నాకు ఎలా ఫీల్ అవ్వాలో తెలియరాలేదు. ఆయనే డోర్ క్లోజ్ చేసి మమ్మల్ని సర్కులర్ డ్రైవ్ చివరి వరకు వెళ్ళే దాక గుమ్మం లోనే నిలబడి చూస్తూ ఉండిపోయారు.

    ఆ రోజు నేను పొందిన అనుభూతి మరువలేనిది.

    నన్ను ఇంటర్వ్యూ కు తీసుకొని వెళ్ళిన వ్యక్తి ఇంపార్టెన్స్ was the key.

  • 1. అది కాఫీ ఎలా అయ్యింది?

    1. అది కాఫీ ఎలా అయ్యింది?

    “ఏంటోయి, కే ఏ యూ పీ హెచ్ వై కాఫీ ఎలా అయ్యింది?” అనడిగారు ముల్లపొద ఇంట్లో ఉండే రమణారావు అంకుల్.
    “ఏం అభిషిక్త వర్మ గుర్తులేరా బావా బావా పన్నీరు సినిమా నుంచీ? నరేష్ ని ఇంటర్వ్యూకి పిలుస్తారు, ఏం ప్రశ్నలకీ జవాబులు తెలియకపోయినా తండ్రి రికమెండేషన్ కాబట్టి ఎలాగోలా ఉద్యోగం ఇవ్వాలని కాఫీ స్పెలింగ్ అడుగుతారు?
    మనది అదే బాపతు. అలాగే ప్రనౌన్స్ చెయ్యాలని ఎవరు చెప్పారు? ఇలా రాస్తే చదివినప్పుడు కాఫీ అవ్వదా?”

    ఒకలా రాస్తేనే కధలవుతాయా? మనవీ కధలే. మనకి నచ్చినట్టు చెప్పుకుంటాం.”
    “అవును కానీ తెలుగులో రాయడం కష్టం కదా మరి?”
    “నిజమే. కానీ మన తెలుగులో పండినట్టు ఇంగ్లీషులో భావం పండదే మరి! ఇంగ్లీషులో మనకధలు చెప్పుకుంటే డిస్నీ చానెళ్ళో లయన్ కింగ్ తెలుగులో చూసినట్టుంది.”
    “నీ ఖర్మ. ఏదోటి ఏడు!” అంటూ తాడుమీదున్న తుండుగుడ్డ తీసుకుని లోపలకి వెళ్ళిపోయారాయన.
    కానీ వెళ్తున్నపుడు ఒక చిన్న చిరునవ్వుంది పెదాల మీద. ఎలా అఘోరించినా మనకధేకదా చెబుతున్నాడు అని కాబోలు. బయటకి కరుసుగా ఉన్నా మనిషి మంచోడే. చిన్నప్పుడు ఆఫీసునుంచీ ప్రియా స్కూటర్ మీద వస్తున్నప్పుడు మేము రోడ్డుమీద క్రికెట్ ఆడుకుంటుంటే రాళ్ళతో పెట్టిన వికెట్లు తియ్యక్కర్లేకుండా పక్కనుంచీ మెల్లగా వెళ్ళి మా ఫీల్డింగుకి అడ్డురాకుండా కొంచం దూరంగా పార్కింగు చేసేవారు. నవ్వేవారుమాత్రం కాదు. అలాగ సీరియస్గానే ఇంట్లోకి వెళ్ళిపోయేవారు. ఈ మధ్యనే మనవరాలితో ఆడుకుంటూ నవ్వడం నేర్చుకున్నట్టున్నారు. అప్పుడప్పుడూ రాత్రుళ్ళు కుక్కని తిప్పుతున్నప్పుడు డాబామీద మనవరాలిని ఆడిస్తూ ఆయన నవ్వడం చూస్తుంటాను. నేనూ నవ్వుకుంటూ అంకుల్ మంచోడే అని సైలెంటుగా వెళ్ళిపోతాను.
    ఆ, ఇంతకీ మన ఇంట్రడక్షన్కి వెనక్కి వస్తే మన కధలే. పేరు తెలుగులో రాస్తే కష్టమవుతుందని ఇంగ్లీషులో పెట్టా.

    సులువుగా ఉంటుంది, బుక్మార్కు చేసుకోండి — కంట్రోల్+డీ, మీకు నచ్చినపేరుతో సేవ్ చేసేసుకోండి. వెతుక్కోనక్కర్లేకుండా తిరిగిరావచ్చు.

    ________________________________

    ఈ శీర్షిక లో మరి కొన్ని కాలనీ కథలు 🩷

    1
  • ఎంత కష్టం.. ఎంత కష్టం

    ఎంత కష్టం.. ఎంత కష్టం

    జంట ఎద్దుల అరకగట్టీ
    ఎద్దువోలే ఒల్లరగదీసీ
    నెత్తురోడ్సీ సెమట గార్సీ
    రేయిపొగులూ నేలతల్లికి
    దీటుగానూ *పొగులుకుంటా (1)
    ఎండవానల దుక్కిదున్నీ
    కొద్దిగైనా గింజ పండితే
    పట్టెడంతా కూటి కొరకై
    పుట్ల పంట దళారికమ్మితే
    చేతికందిన ఒక్క డబ్బూ
    జేబు దంకా చేర్చబోతే
    జాలి చూపక అప్పులయ్య
    ఒడిసిపుచ్చుకు ఎల్లిపోతే
    ఇంటిల బుడ్డోడి ఆకలి
    ఆసగా నిన్నెదుకుతుంటే
    ఎండుపానం నీదు పెండ్లము
    కన్నీరె సన్నుగ గుడుపుతుంటే
    కండ్ల ఎదటన చేను తల్లి
    సుక్క నీటికి అలమటిస్తే
    కుప్ప నూర్సిన కొత్త ధాన్యం
    వరద తాకి బురదలైతే
    జోరు వానకి *కొట్టమెల్లా (2)
    కుప్పకూలీ *తొక్కటైతే (3)
    తాలలేకా గొడ్డు గోదా
    ఊపిరొదిలే *కాయిలైతే (4)
    తాత తండ్రుల ఒక్క సెక్కా
    కబ్జదారుడు నూకుతుంటే
    సాయమడిగితె నేతలంతా
    ఓట్లునొక్కీ మాయమైతే
    నాయమిచ్చే కోరట్ల జడ్డిలు
    కుంబకర్నుని నిదరలైతే
    అడగబోతే లాటీల కొడుకులు
    సదునుగా ఒల్లిరగదీస్తే
    *బొంకులమ్మే వార్తవదినెలు (5)
    వెతల కతలను అమ్ముతుంటే
    పడ్డ కస్టము పాడెగట్టుక
    పొలములోనే హరీమంటే
    ఆస కరవై బతుకు బరువై
    *ఒలికిమిట్టే నెలకువైతే (6)
    ఏడ జూసిన యాడె జీవుడు
    నెర్రెలిచ్చిన నేల అయితే
    గడసిపోయిన నిన్న *కల్లై (7)
    ఎదురూ చూసే రేపు కలయై
    ఉన్న నిజమీ ఒక్క దినమూ
    వొల్లకాడుల సిందులైతే
    కడుపు నించని గొడ్డుశాకిరి
    *కొడిగట్టు దీపపు *యాతనైతే (8, 9)
    దినము రేతిరి ఒక్క తీరుగ
    *మనికి మంటల కొలిమిలైతే (10)
    నిన్ను తలుసుకు నీలో *నివ్వే (11)
    *యాసిరై సీ గొట్టుకుంటే (12)
    *ఉడ్డుకుడుసుకుపోయి జీవము (13)
    *సాయనీకే *ఎదుకాడుతుంటే (14, 15)
    ఎంత కష్టం ఎంత కష్టం ||

    చెమటలోడ్చుకు రక్తమార్చుకు
    నాకు నీకూ కంచాలు నింపీ
    పట్టెడన్నం కంట చూడని
    సేద్యగాడికి ఏది లాభం
    రైతు డొక్కకి ఏది అన్నం
    కడుపు నింపే ధరణి పుత్రా
    ఎవరు నీకిక దన్ను ధైర్యం
    ఎంత కష్టం ఎంత కష్టం ||

    **** **** **** **** ****

    కొన్ని పదాలు తికమక పెడుతున్నవని మిత్రుల ద్వారా విని ౼
    1. పొగులు = తీవ్రమైన బాధ
    2. కొట్టము = గుడిసె
    3. తొక్కట = తొక్కిసలాట, తొక్కిడి
    4. కాయిలా = రోగము, జబ్బు
    5. బొంకు = అబద్ధము
    6. ఒలికిమిట్ట = శ్మశానము
    7. కల్ల = అబద్ధము
    8. కొడిగట్టు = ఆరిపోవు
    9. యాతన = కష్టము
    10. యాతన = కష్టము
    11. నివ్వు = నీవు
    12. యాసిర, యాసరిక = విసుగు, చీకాకు
    13. ఉడ్డుకుడుచు = ఊపిరాడక
    14. సాయనీకె = చావుట కొరకు
    15. ఎదుకాడు = వెతుకులాడు
    **** **** **** **** **** ****
    #పలుకు, #వెన్నెల, #తెలుగు, #అమ్మనుడి, #బతుకుభారం #పేదరికం

    @Chandu1302

  • ‘మిడిల్’క్లాస్

    ‘మిడిల్’క్లాస్

    మొన్నో, ఇంకేదో ఈమధ్యనో ట్విట్టర్‌లో ఒక మెసేజ్ చూసా. నువ్వు చిన్నప్పుడు టూత్‌పేస్టు ట్యూబు చివరికంటా నొక్కి వాడావా, సబ్బంతా అరగదీసాక మిగిల్న ముక్క కొత్త సబ్బుకతికించావా, బొగ్గుల బాయిలర్లో వేణ్ణీళ్ళు కాచుకున్నావా, సరుకుల కొట్లో బెల్లం ముక్కడిగావా, కిరసనాయిలు కోసం క్యూలో నించున్నావా… ఇలా. ఇవన్నీ చేసుంటే నువ్వు డెబ్భైలు ఎనభైల్నాటి మిడిల్ క్లాసు తెలుగోడని అర్థం! నవ్వొచ్చింది. ఆశ్చర్యం కూడా!
    ఏడిసినట్టుంది. ఇవన్నీ చెయ్యనోడూ, సినిమాల్చూడనోడూ తెలుగు నేల మీద పుట్టటమెందుకూ?

    అసలు వీటన్నిటికన్నా మిడిలెస్టు క్లాసు కథ అప్పట్లో ఇంకోటుంది, చెప్పనా..? పండగనో, బళ్ళు తెరుస్తుండంగాన్నో కొత్త లాగూ చొక్కాలు కుట్టీటం. దీ వరస్టంటే అదే!

    ఎదిగే వయసు, ఊరూర్కెనే బట్టలు చిన్నవైపోతాయని, బాఘా దిట్టంగా ఐదులో తొడుక్కున్న లాగూయే ఎనిమిదిలో కూడా సరిపోయేట్టు; మోకాళ్ళకి నాలుగించీలు కిందికీ, నడుం ఎనిమిదంగుళాలు ఎక్కువుండేట్టు ఇంత పెద్దగా లుడంగం మోస్తరు కుట్టీటం.

    ఈ విషయంలో అమ్మలన్నీ ఉత్తర కొరియా నియంతలకన్నా కనాకష్టం! ఇదిగో, తీరా షాపుదాకా వెళ్ళాక ఈ బడుద్ధాయి గునిసాడనో, ఫాషనుగా లేదన్నాడనో రెడీమేడు లాగూల్లాగా తొడల్దాకా టైటుగా కుట్టిచ్చేరు గనక. అయినా అంతంత పోసి కొని, సంక్రాంతిక్కుట్టిచ్చినవి శివరాత్రికే పొట్టివైపోతే ఏవిట్సుఖం? బట్ట దండగా కుట్టుకూల్దండగా తప్పిచ్చీ, అని పెద్దంతరం చిన్నంతరం యంతమాత్రవూ పాటిచ్చకుండా, యావండీగారంటే శ్రీ. ప్రత్యక్ష D అన్న సంగతి కూడా పట్టిచ్చుకోకుండా తమ యజమానిగారిమీన్నే ధాష్టీకం! ఇక మనకీ మనోబీగార్లనేకవుంటాయనీ, సాటి మనిషిగా మన చొక్కాలాగూలు ఎలా వుండాలన్నది మన పెరసన్లనీ విషయం అసలు ఎరగనట్టే ఉంటాయవి. (అవంటే మొత్తంగా అమ్మలన్నీ అంతే!) చిన్నవయసులోనే జై ఆంధ్ర ఇంకిలాబ్ జిందాబాద్ అని గట్టిగా మనసులోనే అరిచావంటే, అందులో నీ తప్పేం లేదన్నమాటే.

    సరే, ఎంతేనా మననాన్న కదా మన పక్షం వుంటారన్నమ్మేవో, ఖాళీయే. ఆయనేవోఁ, కుట్టీమన్నదొకరూ, కుట్టేవాడింకొకడూ, తొడుక్కుతిరిగే చెవలాయ వీడొకడూ, మజ్ఝిన మనకేలన రొష్టనే మెట్టవేదాంతం మాటునో, లేక మొన్న హాఫెర్లీకి లెక్కల్లో పంతొమ్మిది మార్కులే వొచ్చాయిగనుక వీడికీ శాస్తి జరిగి తీరాల్సిందనే అన్‌డాడీ లైక్ నిర్దాక్షిణ్యం వల్లనో, మన్ని దీ న్యూ ఫాషన్ టైలర్స్ అనబడే వీరయ్య కొట్లోకి తీసుకెళ్ళి ఇదిగో చొక్కా లాగూ గుడ్డలని వాడికిచ్చేసి, మన్ని వాడి ముందుకు తోసేసి, ఏదో రేపే దాఖల్చెయ్యాల్సిన యమర్జెంటు కోర్టు కాయితాల్చదూతున్నంత పోజుగా నిన్నటి ఆంధ్రప్రభో, మొన్నటి ఈనాడు సంపాదకీయం వెనకో దాక్కోటం!

    ఈవీరయ్యగాడున్నాడే.. పరమ నాస్టీఫెలో. అసలు వీడో టైల్రే కాదు నన్నడిగితే. చెవులో ఒకేపు నీలం ఇంకో వైపు ఎరుపూ ఉంటాయే, అట్టాంటి రెండు రంగుల పెన్సిలు, మెళ్ళో కండవా రీతిన టేపూ తగిలిచ్చుకోని, వెధవ పోజు మళ్ళీ! మనం, చొక్కా నడుంకి ఒక్క అంగుళం కిందికీ, లాగూ మోకాలుకి రెండంగుళాలు పైకీ ఉంచాల్రా అని ముందే సీక్రెట్టుగా ఇన్ట్రష్షన్ ఇస్తామా, ముందంతా పరమ నైసుగా, నాకు తెల్సు కదా బాబూ అంతా కొత్త ఫాషనుగా కుట్టి పెడతాగా, లాగూ ఎనికిట జోబు కూడా ఉంటాది నీకెందుకు చూడంటాడా, నాన్నొచ్చి మరీ అంత పైకేంటయ్యా ఎదిగే పిల్లాడు కదా అనంగాల్నే టేపు ఏడంగుళాలు సర్రున కిందికి జారుస్తాడు… మాట నిలకడలేని కుంక!! ఇంక లాగూ కొలతలు. రామ రామ! అది వాడి నడుమూ మన్నడుమూ కలిపి కొలిచేసి, ఈ మాత్రం చాల్లెండి అయగారూ, కాళ్ళకాడ మాత్రం ఒక రెండంగుళాలు ఇదిగో ఈ మాత్రముంచీ, ఇంకొంచం లోపటికి మడిచి కుట్టేస్తా. నడుమూ, కాళ్ళూ ఇంకా ఎక్కువ కొలతైతే బాగా లూజయిద్దని మనేపు చూసి కన్నుమలపటం, అక్కడికేదో మనల్ని ఉద్ధరిచ్చినట్టు. డబ్బు కోసం గడ్డితింటవంటే ఇది కదూ… దొంగ భడవ.

    రెండోసారి కూడా మనం వెళ్ళి అడిగిన ఆర్రోజులకి ఆ లాగూలు మన్చేతికి రావటం. ఎలా ఉన్నా, ఇవి కొత్తవీ అచ్చంగా మనవీనన్న ఆదర వాత్సల్య సంతోషాది భావాలతో చిరునవ్వు మన మొహాన విరబూస్తుండగా, ఇంటికెళ్ళి ఆ కొత్త వలువలు తొడుక్కునే ప్రయత్నం!
    అద్గద్దీ విషయం… సరిగ్గా అక్కడొస్తుంది, శాక్యమునికొచ్చినంత జ్ఞానం, మనకి కూడా!

    జేబులో చేతులు పెట్టుకున్నా సరే, నీపాదాల చెంత నాకు చోటివ్వు దేవదా అని కాళ్ళంటుకున్న పారోకిమల్లే, ఆ లాగూ లంపటం మనం నించున్నకాడి దక్షిణం వెంపు జారిపోటమే కాని పైకిరాన్దే!! మరిహను దాన్తోటి జనబాహుళ్యంలోకి మనవంటి సిగ్గరి, పరూగల్లా మోమాటస్తుడుగారెలా రాడవంటే, దానికి మరో నీచతుచ్ఛత్యంతమర్రేత్తక్కూపాయవోటి మనం గుడ్లనీళ్ళు కక్కుకుంటూ డెబ్భైమార్లు ఛీయన్చిందుల్తొక్కినా సరే, ఏడిశావులే కుంకాయా, చొక్కాకిందనుండేదానికెలా ఏడుస్తే ఏం, దానికింతేడుపేవిటనంటూ, అటో రెండూ ఇటో రెండూ పిన్నీసులు పెట్టడం!

    దీనికన్నా అధ్వాన్నం మనకంటే ఓ రెండేళ్ళో మూడేళ్ళో ముందు పుట్టినందుకు అదో పేద్ధ అక్కగారైనట్లు మనమీద అక్ఖలేని అధికారజులుం ప్రదర్శించే అక్కరాక్షసిలుంటాయే, వాటి వెలిసిపోయిన పచ్చరిబ్బనో, మాసిపోయిన తెల్ల పీటీ యూనీఫాము రిబ్బనో మన లేని నడుం నెప్పెట్టీదాకా బిగిచ్చీ, ఇహపో వెధవాయా అని మనల్నే కసురుకోని బడికి పంపీటం!

    వీటన్నిటికంటే అతి దారుణ పరమభయంకర ఒవరికీ చెప్పుకోలేని మజ్ఝాతిమజ్జతరగతి ఓటుంటుంది. అంటే, నీ లాగూ జారిపోతుంటుంది కదా. దాని కోసం, నీ మొల్తాడిప్పి దానికి ఒక నులకతాడు ముడేసి లాగూ బిగిచ్చటం. లాపోతే మీ అన్నయ్య పైజామానో అక్కయ్య పరికీణీయో చిరిగిపోయేకా ఆ బొందు (చదూరానోళ్ళు నాడా అంటార్లే..) దాచి పెడుతుందిగా మీ అమ్మ! బట్టల బీరువాలో ఏ మూల్నించో దాన్ని తెచ్చి గుండ్రాయితో నాలుగు మోది ఓ మూరెడు ముక్క తెగ్గొట్టి అదేసి నడుంకి కట్టటం!

    నువ్వొళ్ళు పొగర్తోనో, శ్ట్రాటజీ ప్లానింగుల్లో వీకు అయినందువల్ల అగ్నానంకొద్దీ ముందస్తుగా ఒకటో కాసినో అక్కల్నీ అన్నల్నీ సంపాయిచ్చుకున్నాక వెళ్ళితే ఒక్కగానొక్క ఆఖరి కొడుకన్న మర్యాదా గౌరవం గారాబం దక్కుతాయన్న రాంగ్కాల్క్లేషన్తో తాపీగా మరికాస్త సోమరసం, మరొక్క రంభ డాన్సు అనుకుంటూ లేటు చేసావో, తరవాత అతి తీవ్ర దుఃఖద పరిణామాలుంటయి. తస్మాజ్జాగర్త.

    నీ జారిపోయే లాగూక్కట్టిన రిబ్బనూ, నులకతాడూ చూసి నీ మీదాళ్ళెవ్వరూ నీమీద్జాలి పడరు. మొహం గంభీరంగా పెట్టటం అంతా వుట్టుట్టి నటన. అటుతిరిగి ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ, ఏదో పుట్టిములిగిపోతున్నట్లు పెరట్లోకి ఉరికి కసిగా నవ్వుతుంటారు. పాపం వెర్రి వెధవ, మరీ ఏంటమ్మా, లాంటి ఒకటో అరో వాక్యం వినిపించినా దాంట్లో హానెష్టీ శాతం ఎంతన్నది, ఆవెంట వినపడే వికటాట్టహాసాల తీవ్రతను కూడా పరిగణనలోకి తీసుకుని నిర్ణయించుకో.

    మజ్ఝతరగతి మిడిలు క్లాసిళ్ళల్లో ఏకైక చివరాఖరి మగపిల్లడై పుట్డవంత దుర్భర భయానక సీను అగ్గిరాముడు సినిమాలో కూడా ఉండదు! మగాడై పుట్టేకంటే అడవిలో మానై పుట్టటం మేలన్న సామెత విన్లా? యజ్జాగ్ట్లీ ఇందుకే!

    #వెన్నెల, #తెలుగు, #అమ్మనుడి #బాల్యం #హాస్యం

    @vennela

  • లక్కీ డ్రా

    లక్కీ డ్రా

    నగరాల్లో ఉండేవారికి తెలిసే ఉంటుంది.. తెలీని వారికోసం, చాలా యధార్థ సంఘటనల ఆధారంగా..

    సరదాగా ఒక ఆదివారం అలా మాల్లో షాపింగ్ అని వెళ్ళారనుకోండి, పేకముక్కల్లాంటి కొన్ని కార్డుల కట్ట, కొన్ని పెన్నులు పట్టుకొని కొంతమంది తిరుగుతూ ఉంటారు.. సార్/ మేడమ్ లక్కీ డ్రా ఉందండి మీ పేరు ఫోన్ నంబర్ రాసివ్వండి చాలు అంటారు. ఆ ఇక్కడ పోయేదేముందిలే అని పేరు, ఫోన్ నంబర్ రాసి ఇచ్చేశారనుకోండి, కొన్ని రోజులకి, అంటే మరుసటి రోజు, లేదా వారం తర్వాత, ఒక నెల తర్వాతైనా.. ఒక ఫోన్ వస్తుంది.. మేం ఫలానా దగ్గర్నుంచి ఫోన్ చేస్తున్నాం.. మీరు అప్పుడు మాల్ లో వేసిన కార్డుకి లక్కీడ్రాలో గిఫ్ట్ వచ్చిందని. అది విని ఉబ్బితబ్బిబ్బైపోయి “అవునా ఏమొంచింది?” అని అడిగిఅడగగానే, ఒక 1 గ్రామ్ గోల్డ్ కాయిన్ అనో, ఒక మిక్సీ అనో ఏదోటి చెప్తారు. మీరు మా అడ్రెస్ కి వచ్చి గిఫ్ట్ కలెక్ట్ చేసుకోండి అని కూడా చెప్తారు… ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, మీరిచ్చిన ఫోన్ నంబర్, పేరు కాకుండా మిగతా వివరాలు కూడా అడుగుతారు.. అంటే పెళ్లైందా, పిల్లలున్నారా, ఎక్కడుంటారు అలా అని.. గిఫ్ట్ తీసుకెళ్తానికి వచ్చినప్పుడు తప్పకుండా కుటుంబ సమేతంగా రమ్మంటారు.. అది కండిషన్.. కుటుంబ సమేతంగా రాకపోతే గిఫ్ట్ ఇవ్వలేం అంటారు.. వాళ్ల ఆఫీస్ లోని లేదా ఏదైనా బాంక్వెట్ హాల్లోని ఇలాంటి సమావేశాలు పెడతారు.. సరేలే సెలవు రోజే కదా అందరం వెళ్లి తెచ్చుకుందాం అని కుటుంబ సమేతంగా వెళ్తే.. అందరినీ కూర్చోపెట్టి కాఫీలు, టీలు, జూసులు గట్రా ఇచ్చి మాంచి ఏసీ రూంలో ప్రెసెంటేషన్ మొదలెడతారు..

    ఇక్కడ గిఫ్ట్ కోసం వస్తే ప్రెసెంటేషన్ ఏంటని అనుకోవచ్చు కానీ ఇప్పటిదాకా సరిపెట్టుకున్న ప్రాణం మళ్ళీ సరేలే ఇంత దూరం వచ్చాం ఏంటో చూసెళ్దాం అనుకుంటే.. అనర్గళంగా వాళ్ళ బిజినెస్ లో పెట్టుబడి పెట్టండనో, మల్టీలెవల్ మార్కెటింగ్లో జాయిన్ అవ్వమని, ఇంత డబ్బు పెడితే ఇన్సూరెన్సులో 10 ఏళ్ల తర్వాత అంతొస్తుందని, అలా ఏదొక వ్యాపార లావాదేవీలు చెప్తారు.. తర్వాత ఒక్కొక్క ఫ్యామిలీనీ ఒక్కొక్క టేబుల్ దగ్గర కూర్చోపెట్టుకుని ఎంత కడతారు.. ఏ ప్లాన్లో చేరుతారు అని మొదలు పెడతారు.. ఎంత మొండివారైనా, వాళ్లు చూపించే ఆదరాభిమానాలు(?) చూసి ముచ్చట పడతారు… కుటుంబ వివరాలనుబట్టి, కులమో, ప్రాంతమో లేదా మరేదైనా రూపంలో లంకెలు కూడా వేస్తారు.. అంటే వీళ్లు మన వాళ్లే, లేదా మనలాంటి వాళ్లే అనే భావన తీసుకు రావటానికి. సంభాషణల్లో మన ఇష్టాయిస్తాలని గుర్తించి వాటి దిశగా మనల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు.. ఇక్కడ పెద్ద విషయం ఏంటంటే, మన కుటుంబం ఎదుట మనతో మాట్లాడటం, అంతా మంచే మాట్లాడటం, సానుకూల ధోరణిలో ఉండటంతో మనం సహజంగా వ్యతిరేక దిశగా వెళ్లలేం.. మొహమాటంతోనో, మనవాళ్లముందు మన కుటుంబానికి మంచి చెబితే, చెడు నిర్ణయం తీసుకోవటం తప్పనో, ఏదో రూపంలో మభ్యపెట్టి మనచేత వాళ్లు కావాలనుకున్న దాంట్లో చేరుస్తారు.. ఇక్కడ ఎవ్వరూ ఎవ్వరినీ బెదిరించో చేసింది కాదు.. స్వతహాగా నవ్వుతూ పులిబొనులో చెయ్యి పెట్టినట్టు.. సంతకాలు అంతా అయ్యాక ఆ ఇచ్చే 1గ్రామ్ నాణమో, మిక్సీయో ఇచ్చి పంపుతారు.. ఇంటికి చేరి ఒంటరిగా ఆలోచిస్తాకాని మనం అంత నిస్సహాయంగా ఎలా అయిపోయాం అనిపించక మానదు.. రెండు మూడు వేలకోసం వెళ్లి కొన్నివేలో, లక్షలో తగలేసి వచ్చాం అని మబ్బులిడిపోతాయ్.. కుటుంబం ముందే చేయటంతో వాళ్లతో అంటే వాళ్లేమనుకుంటారనో బయటికి చెప్పుకోలేక లోపల లోపల మథనపడిపోతాం. మన కుటుంబం ఆ రోజుని ఎప్పుడో మర్చిపోతుంది, మనకి మాత్రం అదొక తీరని వేదనలా మిగిలిపోతుంది.

    అ వ్యాపారం మంచిదై ఉండొచ్చుకదా, కొన్ని మంచివే ఉంటాయేమో, వాళ్లు మనుషులే, వాళ్లకి అదొక ఉద్యోగం అనుకునే వాళ్లకి.. ఒక లక్కీడ్రా అనే అబద్ధంతో మొదలైన ఏ వ్యాపారమైనా అనైతికం… పైగా కుటుంబం ఎదుట బలహీనతలతో నిస్సహాయుల్ని చేసి చేసే వ్యాపారం చేయటం వంచన, మోసం.

    జీవితంలో ఏదీ ఉచితంగా రాదు.. అందులోనూ డబ్బు అసలు రాదు… కష్టమో, సమయమో, డబ్బో ఏదొక ఖర్చు లేకుండా ఏదీ రాదు.. ఈ సారి లక్కిడ్రా అంటే మళ్లీ ఆ కార్డు ముక్క నింపిస్తే, ఒకవేళ నింపినా, వాళ్లు పిలిచినా చోటుకి కుటుంబ సమేతంగా వెళ్తే, ఒకవేళ వెళ్ళినా జూస్లు గట్రా తాగేసి రాకుండా ఏదైనా స్కీంలో చేరితే మీకొక వీరతాడు!