Blog

  • మళ్ళీ పెళ్లా ..


    ధాతా నామ సంవత్సరం, శ్రావణ మాసం.

    శ్రావణ మాసం అంటే పెళ్లిళ్ల కాలం. నేను ఐదో తరగతి చదువుతున్న రోజులు. కాకినాడలో ఉన్న మా బామ్మా వాళ్ళ చెల్లెలి మనవరాలు పెళ్లి. అమ్మా నాన్న, బామ్మ తాతయ్య, నేను తమ్ముడు, అందరం పెళ్ళికి బయలుదేరాం. రెండు బల్ల రిక్షాలు మాట్లాడుకుని, కుటుంబమంతా కొత్త బట్టలు, దారిలోకి మరెయ్యడానికి చిరుతిళ్ళు, ఆనక నిద్ర పట్టడానికి సరిపడా భోజన సరంజామా అంతా సర్దుకుని రైల్వే స్టేషనుకు బయలుదేరాం. బాపట్ల ఆతిధ్యం ఎప్పుడైనా పొందిన వారికి బల్ల రిక్షాలు బాగా ఎరుక ఉంటుంది. వెనక రెండు చక్రాల మీద ఒక నాలుగు అడుగుల పొడవు మూడు అడుగుల వెడల్పు ఉన్న చెక్క బల్ల మీద నలుగురు నాలుగు మూలలకి కూర్చుంటారన్నమాట. పొద్దున్నే బామ్మ పెట్టిన మల్లె పువ్వు లాంటి ఇడ్లీలు మీద మంచులా కరిగిపోయే వెన్న వేసుకుని , అంత కొబ్బరి చట్నీ, ఇంత కారప్పొడి కలిపి కొట్టి, గొంతుని బఱ్ఱె పాలతో కాచిన కమ్మటి కాఫీ గుటకేసి ఆ బల్ల రిక్షా ఎక్కి కూర్చున్నాక, సూర్యలంక సముద్ర తీరం నుంచి వీచే గాలి దేహమంతా తడుముతుంటే అదొక అనిర్వచనీయమైన అనుభూతి. పెళ్లి లేదు, పెటాకులు లేదు ఇంటికెళ్లి మా పాత నవ్వారు మంచం వేసుకుని హాయిగా ఇంకాసేపు కునుకు తీస్తే బాగుణ్ణు అనిపించింది .

    మా తాతగారు సమయ పాలనలో ఠంఛనుగా ఉండే వ్యక్తి. రైలు తొమ్మిదింటికంటే ఇంట్లో ఏడున్నరకే బయలుదేరదీసేవారు. అంత ముందు పోయి ఏమి చేస్తాం? అని నాన్న అంటే ఒక అరగంట ముందు పోతే పోయేదేముంది. ఈ ఇంట్లో కూర్చుని చేసే కాలక్షేపం ఏదో ఆ రైల్వే ప్లాట్ఫారం మీదే చేయవచ్చు కదా అనే వారు. అందరం ప్లాట్ఫారం మీదకు చేరి కాకినాడ పాసెంజర్ కోసం వేచి చూస్తున్నాం. రేయ్, ఆ ప్లాట్ఫారం చివరికి నిలబడకు వెనక్కి రా అని అరవడమే సరిపోతోంది తాతయ్యకి. నాన్నేమో, ప్రయాణంలో చదువుకోవడానికి నవలలు ఏమన్నా కొందాం అని హిగ్గిన్ బోథమ్స్కి వెళ్లారు. మా బాపట్ల రైల్వే స్టేషన్ చాలా అందంగా ఉండేది. పొద్దున్నంతా ఉద్యోగులతో, సాయంత్రమంతా విద్యార్థులతో సందడి సందడిగా ఉండేది. స్టేషన్ చుట్టూ కాగితం పూల చెట్లు, ప్లాట్ఫారం మీద పూలమ్మి అమ్మే మల్లె, మరువం, కనకాంబరాలు. చాలా ఆహ్లాదకరంగా ఉండేది వాతావరణం, ముఖ్యంగా శీరుడు శాంతి వహించే శ్రావణంలో. అందరం కూర్చుని రైలు కోసం ఎదురుచూస్తుంటే అయిదేళ్ల క్రితం రిటైర్ అయిన తాతయ్య తన ఉద్యోగానుభవాలు బామ్మకి, అమ్మకి చెప్తున్నారు. నాన్న నవలాపఠనంలో మునిగిపోయారు.

    తాతయ్య నలుపు తెలుపు సినిమా కథనానికి బ్రేకులు వేస్తూ, ట్రైన్ నెంబర్ ఒకటి రెండు మూడు నాలుగు మరి కొద్దిసేపట్లో ప్లాట్ఫారం నెంబర్ ఒకటి మీదకు వస్తుంది అని మూడు సార్లు మూడు భాషల్లో నొక్కి వక్కాణించింది అశరీరవాణి.

    రైలులో పెద్దగా రద్దీ లేదు, మా అందరికీ కాళ్లు జాపుకోవడానికి వీలైనన్ని ఆసనాలు దొరికాయ్. రైలు కదిలిన కాసేపటికి, హడావుడిగా పరిగెత్తుతూ వచ్చి లోపలికి ఒక్క ఉదుటున ఎక్కాడు ఒక పొడవాటాయన. మంచి నీళ్ల సీసా, మూడు గిన్నెల స్టీలు కారియరు తీసుకుని రైలు పెట్టెలో నడక దారికి అటు వైపు ఉన్న సీటులో వచ్చి కూర్చున్నాడు. మా నాన్న వయసు ఉంటుంది అనుకుంటా ఆయనకి. తెల్ల చొక్కా, నల్ల ప్యాంటు, చేతికి హెచ్.ఎం.టి వాచీ. జేబులో రైల్వే సీజన్ పాస్, కళ్ళజోడు. నుదుటిన ఎర్రటి బొట్టు. పరిగెత్తడం వల్ల పట్టిన చెమట తడికి కరిగిపోతున్న త్రిపుండ్రాలు. వచ్చి తన సీట్లో సర్దుకున్నాక ఏ దేవుడికో బాగా దణ్ణం పెట్టుకున్నాడు, రైలు తప్పిపోనందుకు. కాసిని మంచి నీళ్లు తాగి, వాచీ చూసుకుని అటుగా పోతున్న కాఫీ అబ్బిని కేకేసి పిలిచాడు. చక్కర తక్కువ వేసిన వేడి వేడి కాఫీ చల్లగా జుర్రుతూ, కాఫీ.. మరీ మంచి నీళ్ల కన్నా హీనమై పోయిందండి రైళ్లలో. ఈ నీళ్ల కాఫీ రూపాయిన్నరా!! మరీ దోపిడీ అయిపొయింది సార్ అన్నాడు మా నాన్నకేసి చూస్తూ. తెనాలి స్టేషన్లో కాస్త పర్వాలేదండీ. ఈ రైళ్లల్లో ఇంతే నాసిరకం కాఫీ అన్నాడు నాన్న ఆయనకి వంత పాడుతూ. కాఫీకి ఎక్కువ సేపు ఆగలేను సార్ అన్నాడు పొడవాటాయన, నేను అంతే లెండి అన్నాడు నాన్న నవ్వులు చిందిస్తూ. ఇంతలో నాన్న దగ్గర ఉన్న సితార సినీ వార పత్రిక , పొడవాటాయన దగ్గర ఉన్న ఈనాడు దిన పత్రిక చేతులు మారాయి. తాతయ్య జిల్లా ఎడిషన్, నాన్న మెయిన్ ఎడిషన్. తరువాత తాతయ్య మెయిన్ ఎడిషన్, నాన్న జిల్లా ఎడిషన్ పారాయణ చేశారు. నాన్న మళ్ళీ పేపర్ మొత్తం చక్కగా సర్ది తిరిగి పొడవాటాయనకు అప్పజెప్పారు. ఇటు నాన్న అప్పగింతలు పూర్తవ్వకుండా అటు వాళ్ళ అమ్మాయి పెళ్ళి చూపులు కోసం పెళ్లి పందిరి కావాలంటూ పేపర్ అడిగి తీసుకున్నాడు పొడవాటాయన పక్కన కూర్చున్న పెద్దాయన. ఆ తరువాత పెద్దాయన దగ్గర నుంచి మూడవ పేజీ అడిగి తీసుకున్నాడు ముసలాయన. మిగతా పేజీలు సీటు నెంబరు అయిదు, ఆరు, ఎనిమిదిలో కూర్చున్న వాళ్ళు పట్టుకుపోయారు. నాన్నకి సితార తిరిగిచ్చేసి ఇద్దరూ రాష్ట్రీయ, జాతీయ రాజకీయ చర్చ మొదలెట్టారు. బాపట్ల, తెనాలి, బెజవాడ రాజకీయాలు ఇలా పది నిమిషాలకొక ఊరు మారుతూ వారి చర్చ మా కాకినాడ పాసెంజర్ కన్నా వేగంగా రాజధాని ఎక్సప్రెస్లా హస్తిన చేరింది. వాళ్ళ చర్చ ముగిసే సమయానికి మా రైలు బెజవాడ చేరింది. పొడవాటాయన రైలు పెట్టెలో పది చోట్లకు చేరిన తన దినపత్రిక పోగేసుకుని మా నాన్న దగ్గర శెలవు తీసుకున్నాడు.

    బెజవాడ గాలికో అక్కడ త్రాగిన నీళ్ళకో బాగా ఆకలి మొదలయ్యింది. బామ్మా ఆకలి అంటే, ఆ భోజనాల సంచి పైన్నుంచి దింపమని తాతయ్యకి ఆర్డరు వేసింది బామ్మ. మా పెరట్లో అరిటాకులు ఒక చిన్న పళ్ళెమంత కోసి భోజనాల సంచిలో వేసింది బామ్మ. పులిహోరతో మొదలెట్టి, పూరీ కూరతో పొట్టను కొంచెం పూరించి, దద్ధోజనంతో ముగించాం అనిపించాం. మంచి భోజనం చేసి రైలు కిటికీలోంచి చూస్తుంటే పచ్చటి పంట పొలాల నుంచి వీచే స్వచ్ఛమైన గాలి చెంపలు తడిమి ఊరుకుంటుందా, నిద్ర పుచ్చింది. కలలైపోయాయి, కాకినాడ వచ్చింది.

    మమ్మల్నందరిని ఇంటికి తీసుకువెళ్ళడానికి మా మావయ్య అంబాసిడరు కారు తీసుకుని వచ్చాడు రైల్వే స్టేషన్‌కి . పెద్దవాళ్లందరిని కుశల ప్రశ్నలడిగాడు , నా బుగ్గ మీద చిటికేసి నువ్వెంట్రోయ్ కు. ని. పోస్టర్లో బొమ్మలా, పుల్లలా తయారయ్యావ్, తింటున్నావా లేదా అసలు ? అన్నాడు. కారు పెళ్లింటి ముందు ఆగింది. విద్యుద్దీపాల అలంకారాలు , కొబ్బరాకులతో అల్లిన పందిళ్లు, పందిరి చూరు నుంచి వేలాడుతున్న బంతి, చామంతి దండలు. పన్నీరు, సంపంగి , అగరొత్తుల పరిమళాలు. మల్లె పువ్వులాంటి నవ్వులతో స్వాగతం చెప్తున్న మా ఇంటి ఆడపడుచులు. ప్రయాణ బడలిక తెలియనే లేదు మాకెవ్వరికీ. కబుర్లు, కౌగిలింతలలో కరిగిపోయారు అంతా. అందరం స్నానాలు, భోజనాలు చేసి మేడ మీదకి చేరాం. చాలా రోజుల తరువాత కలిసిన మా బామ్మ వాళ్ళ చెల్లెలు, మా అమ్మా నాన్న, మా అత్తయ్య మావయ్య, మా తాతలు, బాలల వానర సైన్యం అందరమూ చాపలు, దుప్పట్లు, దిండ్లు వేసుకుని కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకున్నాం.

    కాకులు, కోకిలలు, కిశోతరుడు కూడబలుక్కుని పాడె మేల్కొలుపు. మేము లేచే సరికే పెద్దవాళ్ళు అంతా చక్కగా అలంకరించుకుని సందడి సందడిగా ఉన్నారు. అందరూ స్నానాలు చేసి రండి టిఫిన్లు చేద్దురుగాని అని క్రింద నుంచి కేక వేసింది అమ్మ. అందరం స్నానాలు చేసి కొత్త బట్టలు వేసుకుని రామా సప్లయర్స్ వాళ్ళ బులుగు బల్లల ముందు చెక్క కుర్చీలు, పైన విస్తరాకులు వేసుకుని టిఫిన్ కోసం ఆవురావురమని వేచి చూస్తున్నాం. ఉప్మానా, ఇడ్లీన అడిగింది మా అత్త. పూరి లేదా అత్తా ? పూరి చెయ్యలేదు నాన్నా. ఇడ్లీ తింటావా కారప్పొడి నెయ్యి వేసుకుని అని ప్రేమగా అడిగింది మా అత్త. కారప్పొడా !! అదేంటి చట్నీ లేదా ? లేదురా.. మీరు లేచేసరికె అయిపొయింది. వద్దులే అత్తా, ఉప్మా పెట్టు అని దీనంగా చెప్పాను. అందుకే రాత్రి పూట పడుకోబోయే ముందు దేవుడికి దణ్ణం పెట్టుకు పడుకోవాలి, లేకపోతే పొద్దునే టిఫిన్‌లో ఇలా కనీసం నీళ్ల చట్నీ కూడా లేని గట్టి ఇడ్లీ లేదా గడ్డలు కట్టిన ఉప్మా తినాల్సి వస్తుంది. ప్చ్.

    బయల్దేరండి, బయల్దేరండి అంటూ అందరూ కళ్యాణ మండపానికి హడావుడిగా బయల్దేరారు. పేద్ధ.. కళ్యాణ మండపం. పూలు, తళుకుల కాగితాలతో మెరిసిపోతోంది . లోపలికి అడుగుపెట్టగానే పన్నీటి జల్లు చల్లగా చల్లుతున్న యాంత్రిక వింజామరలు.పట్టు చీరల మెరుపులు, స్వర్ణాభరణాల ధగ ధగలు, అత్తరు, అగరొత్తుల గుభాళింపులు. డోలు, సన్నాయి మేళాలు. ఆనందం అంబరాన్నంటే లోగిళ్ళు తెలుగు పెళ్లి పందిళ్లు.

    పెళ్లి మండపం చుట్టూ మేడ పైన విడిది గదులు. గదుల బయట నుంచుంటే పిట్టగోడ మీద నుంచి పెళ్లంతా చూడొచ్చు. నేనూ, తమ్ముడు పైన గది ముందర ఆడుకుంటున్నాం. క్రిందకి రమ్మని అమ్మ చెయ్యి ఊపింది. మా బొమ్మలు గదిలో పెట్టి, మా బొమ్మలు ఎవరూ ఎత్తుకు పోకుండా తలుపు బయట గొళ్ళెంపెట్టి కిందికి పరిగెట్టాం. భోజనాలు చేసి ఆడుకోండి అని చెప్పింది అమ్మ. పొద్దున్నే నీరసంగా తిన్న వంద గ్రాముల ఉప్మా మా ఆటలకి హారతి కర్పూరంలా కరిగిపోయింది. కడుపు నక నక లాడుతుంటే చక చకా అడుగులు వేస్తూ భోజనాల దగ్గరికి చేరాం. మంచు వేసిన మంచి నీళ్లతో గొంతు తడిపి రాబోయే పదార్ధాలకి మార్గం సుగమం చేశాం, తేనెలూరుతున్న జాంగ్రీ, ఒంటి నిండా చక్కర చిలకరించుకొచ్చిన బూందీ లడ్డు, పొత్రం కింద నలిగి, పచ్చి శెనగపప్పు, ఎండు కొబ్బర్లతో చేరి, బెల్లం ముద్ద పొట్ట నిండా నింపుకు వచ్చిన వేడి వేడి పూర్ణం బూరెలు, తోడుగా నేతి ప్రవాహం, తీపి ఎక్కువై వెగటు పుట్టగానే అరటికాయ బజ్జి, వంకాయ బజ్జి. పెళ్లి భోజనం అని గుర్తు చేస్తూ ముద్ద పప్పు, దోసావకాయ, పక్కనే నంజుకోవడానికి ఊర మిరపకాయలు, గుమ్మడి కాయ, సొరకాయ, ములక్కాడ, టొమాటో , ఇంగువా దట్టించిన సాంబారు, పళ్ళకింపుగా కర కర లాడే అప్పడాలు, ఊర మిరపకాయలు, దొండకాయ, బెండకాయ వేపుళ్ళు. ఆనక , చారు పోస్తాం అంటే తాగలేక, పులిహోర తినే ఖాళీ లేక, గడ్డ పెరుగు, విస్తరాకులో మిగిలి ఉన్న దోసావకాయతో భోజనం ముగించి, కిళ్ళీ జేబులో పెట్టుకుని నేనూ తమ్ముడు భోజనాల నుంచి బయటపడ్డాం.

    అమ్మ ఎదురొచ్చి తాతయ్యని చూశారా అని అడిగింది. లేదు అని తలూపి ఆడుకోవడానికి పరిగెట్టాం. కాసేపటికి నాన్న కనిపించి తాతయ్య కనిపించారా అని అడిగాడు, లేదని చెప్పాం. సరే, ఎక్కడున్నాడో చూడండి ముహూర్తం దగ్గర పడుతోంది. కనిపిస్తే వెంటనే పెళ్లి పందిరి దగ్గరికి రమ్మని చెప్పండి. మేము ఆట ఆపేసి తాతయ్య కోసం వెతుకుతున్నాం. అమ్మా, నాన్న కూడా చెరో దిక్కు వెతుకుతున్నారు. భోజనాల దగ్గర, పెళ్లి మండపం దగ్గర, వాకిట్లో, వీధిలో అన్ని చోట్లా వెతికారు. ఏరా, నాన్న కనిపించారా ? అని అడిగింది బామ్మ నాన్నని. లేదమ్మా, ఎక్కడా లేరు. చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్లారు ముహూర్తం దగ్గర పడుతుంటే ఈ మనిషి అని నసిగింది బామ్మ. సరే నేను మళ్ళీ ఒక సారి చూసి వస్తాను అని తాతయ్యని వెతకడానికి బయలుదేరాడు నాన్న. పెళ్లి పందిరిలో లేని తాతయ్య, ఆయనను వెతకడానికి వెళ్లిన అమ్మా, నాన్న, నేనూ, తమ్ముడు అందరము ముహూర్త సమయానికి పెళ్లి పందిరిలో లేకుండా పోయాం. పెళ్లి అయిపొయింది. కోలాహలం కొద్దిగా సద్దుమణిగింది.

    కాసేపటికి అమ్మ, బామ్మ రక్తపోటు మాత్రలు తీసుకురావడానికి మేడ పై గదిలోకి వెళ్ళింది. కాసేపటికి చేతిలో మాత్రలతో బాటు తాతయ్యని వెంటబెట్టుకొచ్చింది. తాతయ్యను చూడగానే బామ్మకి ఆనందం, ఆశ్చర్యం, ఆవేశం అనే త్రిగుణాలు పెల్లుబికాయి.

    ఇక్కడ పెళ్లి పెట్టుకుని ఏ రాచకార్యాలు వెలగబెట్టడానికి వెళ్లారు ? అలా తడిసిపోయారు ఏంటి ? అని తాతయ్య మీద ఇంతెత్తున లేచింది.

    తాతయ్య తాపీగా టర్కీ టవల్‌తో మొహం తుడుచుకుంటూ, సరే, ముందు ఆ మాత్ర వేసుకో. నేను ఎక్కడికి వెళ్లానో ఈ కుంకలిద్దరిని అడుగు చెప్తారు అని మా వైపు చూపించారు. మేము ఏమీ అర్ధం కానట్టు తెల్ల మొహాలు వేశాం.

    వాళ్ళా !! వాళ్ళేమి చేశారు ?

    అడుగు వాళ్లనే..అడుగు ..అన్నారు.

    మాకు ఏమీ అర్ధం కానట్టు అడ్డంగా తలాడించాం.

    నన్ను పైన ఆ గదిలో పెట్టి గొళ్ళెం వేసింది మీరేనా ? అని అడిగారు నా వంక తమ్ముడి వంకా చూస్తూ.

    అప్పటికి వెలిగింది మా కపి మస్తిష్కంలో కార్తీక దీపం, తాతయ్య స్నానాల గదిలో ఉన్నారన్న సంగతి మర్చిపోయి మేము బొమ్మలు లోపల పెట్టి తలుపుకి బయట గొళ్ళెం పెట్టాం.

    వీళ్ళు తలుపు వెయ్యడం నాకు వినిపించింది, నేను గదిలోంచి అరుస్తూనే ఉన్నాను. వీళ్లు గొళ్ళెం వేసి తుర్రుమన్నారు. రెండున్నర గంటల నుంచి ఆ తలుపు బాదుతూనే ఉన్నాను. ఈ మేళాలకి, కోలాహలానికి ఎవ్వరికి వినిపించినట్లు లేదు. అరిచి అరిచి గొంతు నొప్పి పుట్టింది. ఇహ విసుగు, నీరసం వచ్చేసి అలా అక్కడే కూర్చుండిపోయాను, ఇదుగో ఇప్పుడు కోడలు వచ్చి తలుపు తీస్తే మళ్ళీ ఊపిరి పీల్చుకున్నాను. ఇంతకీ పెళ్లి బాగా జరిగిందా ?

    బానే జరిగింది కానీ, ఇంత దూరము వచ్చి ఎవ్వరమూ పెళ్లి సరిగా చూడనైనా లేదు అని వాపోయింది బామ్మ. మరుసటి రోజు అందరం కలిసి అన్నవరం సత్యనారాయణ స్వామి దగ్గరికి బయలుదేరాం. స్వామి దర్శనం చేసుకుని, అక్కడి కమ్మటి ప్రసాదంతో కడుపు నింపుకుని, బంధువులందరికీ వీడ్కోలు పలికి తిరిగి బాపట్ల బయలుదేరాం.

    అన్నవరం రైల్వే స్టేషన్ బాగా రద్దీగా ఉంది. రైలు రావడానికి ఇంకా అరగంట సమయం పడుతుందని చెప్పింది శబ్దప్రసారిణి. చెవులదిరిపోయేలా కూత వేస్తూ, తన దారికి దూరం దూరం జరగమంటూ, రైలు పట్టాలు పట పటలాడిస్తూ, కీచుమంటూ ప్లాట్ఫారం మీద ఆగింది రత్నాచల్ ఎక్సప్రెస్. దండేనికి ఆరేసిన బట్టల్లా రైలు తలుపుల దగ్గర వ్రేలాడుతున్న పుణ్యాత్ములందరూ క్రిందకి దిగి చక్రాల మీదున్న రత్నాచల స్వర్గంలోకి దారి ఇచ్చారు. బాగా రద్దీగా ఉంది అని మోము దీనంగా పెట్టుకుని రైలెక్కింది బామ్మ. అలా అలా అందరిని జరుపుకుని ఎలాగొలా సామాను అటకెక్కించాం. ద్వారానికి దగ్గర ఉండే బెర్తుల మధ్య అందరం తలా ఒక రెండు అడుగులు చోటు చేసుకుని నిలబడ్డాం. ఎవరో కర్ణ సగోత్రీకుడు మా బామ్మ అవస్థ చూసి జాలిపడి తన ఆసనం మా బామ్మకు దానమిచ్చాడు. బామ్మ అతనిని ఆశీర్వదించి కాస్త కుదుట పడింది. దొరికిన సౌకర్యంతో మనసు కుదుట పడుతుందా. పై బెర్తు వంకీ పట్టుకు వ్రేలాడుతున్న తాతయ్యకేసి దీనంగా చూసింది. పర్లేదులే, వచ్చే స్టేషన్లో ఖాళీ అవుతుందిలే అని అభయ హస్తం చూపాడు తాతయ్య . ఇదంతా చూస్తున్న ఎదురు సీట్లో కూర్చున్న బుర్రు మీసాలాయన, రాజమండ్రిలో రైలు మొత్తం ఖాళీ అయిపోతుందని మా అందరికి భరోసా ఇచ్చాడు.

    ఒక గంటన్నర నిలబడ్డాక హమ్మయ్య రాజమండ్రి వచ్చేస్తోందన్న ఆనందం మొదలయింది. రెండు రోజుల నుంచి అతిశయించిన ఆటల వల్ల నేనూ తమ్ముడు, ఆ రోజు సత్యనారాయణ స్వామి సన్నిధిలో కలియ తిరగడం వల్ల పెద్దవాళ్ళు బాగా అలిసిపోయారు. కాళ్ళు జాపుకోవడానికి ఒక అడుగు, కూర్చోవడానికి ఒక అడుగు, వీపు ఆనించుకోవడానికి ఒక అడుగు ఇవ్వమని వామనుడు బలి చక్రవర్తిని కోరినట్టు ఆ దక్షిణ మధ్య రైల్వే దక్షిణామూర్తికి దణ్ణం పెట్టుకున్నాం. రాజమండ్రి రానే వచ్చింది, తోపులాట మొదలయ్యింది దడ దడమని ఒక పాతిక మంది పెట్టెలోకి తోసుకువచ్చారు. ఆ తోపుడికి నేను మా తమ్ముడు దూరం జరిగిపోయాం. జనాల మధ్యన కలిసిపోయి నాకు నాన్న గానీ, తాతయ్యగానీ కనిపించడం లేదు. ఈ రద్దీకి నేను తమ్ముడు తప్పిపోయి మళ్ళీ పదిహేనేళ్ల తరువాత వాడు ఏ రెస్టారెంట్లోనో పాట పాడుతున్నప్పుడు తిరిగి కలుస్తామేమో అని భయమేసింది నాకు. రాజమండ్రిలో ఖాళీ అవుతుందని అభయమిచ్చిన ఆ బుర్రు మీసాలాయన కనిపిస్తే గాట్టిగా మీసాలు పట్టుకు లాగుదామన్నంత కోపమొచ్చింది.

    రైలు కదిలినా గాలి ఆడటం లేదు. నాకు రెండు పక్కలా ఒక వీరబాహుడు, ఒక ఘనోదరుడు నిలబడ్డారు. బూడిద గుమ్మడికాయలాంటి బొజ్జలతో నా టమాటా అంత తలకాయని ఒత్తి పారేస్తున్నారు. తలెత్తితే తిరగలేక తిరుగుతున్న రైల్వే వీవెన, మిణుకు మిణుకుమంటున్న విద్యుద్దీపం తప్పితే ఏమీ కనిపించడం లేదు. వీరబాహుడు, ఘనోదరులతో ఒక గంట శిరోదర యుద్ధం సలిపాక, నా కన్నీరు ఆపడానికి ఏలూరు వచ్చింది. రద్దీ తగ్గింది మా అందరికీ కూర్చోవడానికి ఇంత చోటు దొరికింది. అందరం కూర్చుని కాస్త ఊపిరి పీల్చుకున్నాం. కానీ పీలుస్తున్న గాలి చుట్ట కంపు కొట్టసాగింది.

    ముక్కుకి పేద్ద సత్తు ముక్కు పుడక, ముందే పచ్చ పొడిచిన నుదుటి మీద పేద్ద బొట్టు, చేతికి మట్టి గాజులు , కాళ్ళకి సత్తు వంకీలు, ఎర్రంచు ఆకుపచ్చ చీర కట్టుకుని కిటికీ దగ్గర కూర్చుని ధూమశకటానికి పోటీ ఇచ్చేలా గుప్పుగుప్పున చుట్టకి కొరివి పెడుతోంది మమతల… అసిరితల్లి. మా ప్రక్కనే కూర్చున్న బాధ్యత గల పౌరుడు భావపురి భావన్నారాయణ గారు పూనుకుని ఏవమ్మా రైలులో చుట్ట తాగకూడదు అన్నాడు. రైలు కిటికీలోంచి వదిలేసిన కాగితపు కాఫీ కప్పు ఎగిరిపోయేంత వేగంగా కళ్ళెర్రజేసుకుని గిర్రున తల తిప్పింది అసిరితల్లి.

    పొగపోయేది పెట్టి బయటకి కాదేటి ? అని విసురుగా అడిగింది.

    బాధ్యత కంటే బ్రతుకు తియ్యనైనదని తెలుసుకున్న భావన్నారాయణ మిన్నకున్నాడు.

    ఒక రెండు నిమిషాల పాటు అక్కడ అలుముకున్న నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ అసిరితల్లి పౌత్రుడు పైడితల్లి ఏడుపు లంఖించుకున్నాడు. పిల్లగాడు ఏడుస్తుంటే సూస్తూ కూకుంటావేమియా సింహాచలిమియా అని పెనిమిటిని గదిమింది పైడితల్లి వాళ్ళ నాయనమ్మ. సింహాచలం ఒకటో నెంబరు బెర్తు నుంచి అరవై నాలుగో బెర్తు దాకా ఒక ఆరు భ్రమణాలు చేసాక పైడితల్లి కునుకేశాడు. మూడో నెంబరు బెర్తు నుంచి ఆరో నెంబరు బెర్తుకి తన ఎర్ర కాటన్ చీరతో ఉయ్యాల వేసింది అసిరితల్లి. చల్లగాలికి కళ్ళు మూతపడుతుంటే ఏదో నీళ్లు ఒలుకుతున్న శబ్దం అయ్యింది. చీరతో కట్టిన ఉయ్యాలలోంచి పైడితల్లి పెట్టెని పావనం చేస్తున్నాడు. అదాట్టున లేచిన అసిరితల్లి పైడితల్లిని తీసుకుని శౌచాలయంలోకి పరుగెట్టింది. ఏమ్యా, ఇట్రా ఈణ్ణి తీస్కుపో అని అరిచింది.కడిగిన ముత్యంలాంటి పైడితల్లిని ఎత్తుకుని తిరిగివచ్చాడు సింహాచలం. పావనమైన చీరని పిండుకుని వచ్చి, గట్టిగా ఒక విదిలింపు విదిలించింది. చల్లటి చిరు జల్లు తగిలిన భావన్నారాయణ నిద్రలోంచి ఉలిక్కిపడి లేచాడు. చీరారేస్తున్న అసిరిని విసుగుగా చూసి ఏమీ అనలేక అటు తిరిగి పడుకున్నాడు భావన్నారాయణ.

    అసిరి ఆకలేస్తోందంటే ఉడకబెట్టిన వేరుశెనగ కాయలు, ఉప్పూకారం పూసిన జామకాయలు తెచ్చాడు సింహాచలం. రెండు జామకాయలు తెస్తే ఇద్దరికీ చెరోటీ తెచ్చాడు అనుకున్నా గానీ రెండూ అసిరే మేసింది. ఎదురు బెర్తు మీద కాళ్ళు జాపుకుని ఒళ్ళో వేరుశెనగల పొట్లం పెట్టుకుని నిదానంగా ఒక్కొక్క శెనగకాయ తిని తొక్కలు తిరిగి కాగితంలో ఒక పక్కకి వేసింది. నీళ్లు నములుతున్న సింహాచలాన్ని చూసి జాలేసి ఒక నాలుగు వేరుశెనగ కాయలు అతని దోసిట్లో పోసింది. అతిగా తినడం వల్ల అజీర్తి చేస్తుందేమో అని సింహాచలం దీనంగా చూశాడు. ఏపాకు పచ్చడి తిన్నోడిలా అలా ఎర్రి మొహం ఏసావేందియా, నేను తినొద్దా అని కసురుకుంది అసిరితల్లి. అయ్యో అట్ట నేనెందుకంతను అసిరి ?, ఆజుమోలా గుళిక ఇయ్యమందువా !! ఆ … నువ్వు తినుమీ ఆజుమోలా నాకు బానే అరుగుతాది అని ఒళ్ళో పోసుకున్న వేరుశెనగ తొక్కలు కిటికీలోంచి విసిరికొట్టింది. ఎదురుగాలికి తొక్కలు ఎగిరి నా మొహం మీద పడ్డాయ్. మా బామ్మకి కోపం నషాళానికి అంటింది. ఏవమ్మోవ్, అలా పిల్లాడి మొహం మీద వేస్తావేంటి అని గద్దించింది. ఆ…గాలికి ఎగిరొచ్చి పడితే నానేటి సేతును అని చిరాకు పడుతూ లేచి తలుపు దగ్గరికి పోయింది. తిరిగి వస్తూ దారిలో ఉన్న మా బామ్మ కాలు తొక్కింది. ఓసి మీ అమ్మ కడుపు బంగారం గానూ, కాలు విరగగొట్టేశావు కదే అని బాధతో పెద్దగా అరిచింది బామ్మ. నాన్న పట్టరాని ఆవేశంతో అసిరి మీద కసిగా లేచాడు. సింహాచలం, తాతయ్య మధ్యలో కలగజేసుకుని నాన్నని శాంతింపజేశారు. సింహాచలం క్షమార్పణ చెప్పి, మన్నించమని కోరాడు. కొంత మందికి ఇల్లుకి, రైలుకి తేడా తెలియదులెండి అన్నాడు భావన్నారాయణ కొద్దిగా ధైర్యం కూడదెచ్చుకుని. అసిరి భావన్నారాయణ వంక చుర చురా చూసింది. ఈ కోలాహలం పూర్తయ్యే సరికి బెజవాడ చేరాం. కాలి నొప్పిని పంటి బిగువున దాచుకుని మాతో పాటు బాపట్ల బస్సు దాకా నడిచింది బామ్మ.

    బాపట్లలో దిగి శంకర్రావు సోడా బండి దగ్గర అందరం తలా ఒక గోలీ సోడా తాగాం. అమ్మా, నాన్న , తమ్ముడు బల్ల రిక్షాలో. బామ్మా , తాతయ్య, నేను గూడు రిక్షాలో ఇంటికి బయలుదేరాం. చల్ల గాలికి నిదుర తూగుతుంటే, ఠా…ప్పని పెద్ద శబ్దం అయ్యింది. సగం దూరం చేరేసరికి బామ్మా వాళ్ళ గూడు రిక్షా టైరుకి పంచరు పడింది. బామ్మని, తాతయ్యని బల్ల రిక్షా ఎక్కించి నేను, నాన్న ఇంటికేసి నడవనారంభించాం. బాగా పొద్దు పోయింది నిద్దుర తూగుతోంది. క్రమం లేని అడుగులు వడి వడిగా వేసుకుంటు ఇంటికి చేరి స్నానాలు చేసి మంచాల మీద కూలబడ్డాం.

    పొద్దునే లేచే సరికి బామ్మ కోపంగా ఉంది. ఏమిటా సంగతి అని ఆరా తీస్తే పెళ్ళిలో వాళ్ళ చెల్లెలు కట్టించిన లడ్లు, అరిసెలు, జాంగ్రీలూ , కారప్పూస, చెక్కలు ఉన్న సంచి నిన్న కోలాహలంలో రైలులో మర్చిపోయాముట. ఆ అసిరికి దొరికే ఉంటుంది, ఆ అరిసెలన్నీ లొట్టలేసుకుంటూ తిని ఉంటుందని కాలికి కొబ్బరి నూనె రాసుకుంటూ తిట్టిపోసింది బామ్మ. సుష్టుగా భోంచేసి మధ్యాహ్నం మంచి నిద్దుర వేశాం అందరం. నిద్ర లేచాక అందరికి పెద్ద గాజు గ్లాసుల్లో బఱ్ఱె పాలతో చిక్కటి ఫిల్టర్ కాఫీ పెట్టింది మా అత్త. పోస్ట్ అంటూ కేకేశారు మా పోస్టుమాన్ కోటేశ్వరరావు గారు. కార్డు చదువుతూ వస్తున్న తాతయ్యను చూసి ఎక్కడి నుంచి ఉత్తరం ? అని అడిగింది బామ్మ.

    ఆ.. ఉత్తరమా. రాజమండ్రిలో మన సత్యనారాయణ గారు లేరూ.. వాళ్ళ పెద్దబ్బాయి పెళ్ళిట రెండు వారాల్లో ఇంటిల్లిపాదిని రమ్మని ఆహ్వానపత్రిక పంపారు అని పెళ్లి కబురు చల్లగా చెప్పారు తాతయ్య.

    ఆ.. ఏవిటీ !!! మళ్ళీ పెళ్లా !!!.

  • ఏ జన్మ ఋణమో


    సీతాపురంలోని రామాలయం వీధిలో రామలక్ష్మమ్మగారు అనే ఆవిడ తన ఒక్కగానొక్క కొడుకూ ఉంటుండేవారు. రామలక్ష్మమ్మగారి భర్త కొన్నాళ్ల క్రితమే కాలం చేశారు. కట్నంగా ఆవిడ తెచ్చిన పొలం కౌలుకిచ్చి, పాలు, పెరుగు అమ్ముకుంటూ బ్రతుకు బండి లాక్కొచ్చేవారు. భర్త పోయినప్పటి నుంచి రామలక్ష్మమ్మగారు రాముని సేవలో కాలం గడిపేవారు. గుడి, పాడి తప్ప వేరే లోకం ఎరుగదు. గుడి నుంచి వస్తూ వస్తూ ప్రసాదంగా ఇచ్చిన అరటి పళ్ళు, కొబ్బరి ముక్కలు అక్కడున్న ఒక కోతికి పెట్టేది. ఆ కోతిని ముద్దుగా మారుతి అని పిలిచుకునేది.

    మారుతి కూడా రామలక్ష్మమ్మగారు ఎప్పుడు వస్తారా, ఎప్పుడు ప్రసాదం పెడతారా అని ఎదురుచూస్తూ ఉండేవాడు. ఎప్పుడైనా రామలక్ష్మమ్మ గారికి సుస్తీ జేసి గుడికి వెళ్లకపోతే మారుతి, రామలక్షమ్మగారి ఇంటి గుమ్మం దగ్గర దిగాలుగా కూర్చునే వాడు.రామలక్షమ్మ గారు ఓపిక చేసుకుని ఏమన్నాపెడితే తిని కాసేపు అక్కడే కూర్చుని వెళ్లిపోయేవాడు.

    రామలక్షమ్మగారబ్బాయి సత్యం ఆ కోతిని ఎక్కువ చేరదీయవద్దని విసుక్కుంటూ ఉండేవాడు. ఎప్పుడైనా అలా గుమ్మం దగ్గర కూర్చుని ఉంటే గదిమి తరిమేసేవాడు. ఆ నోరులేని జీవం నిన్నేమి చేసిందని సత్యానికి నచ్చజెప్ప జూసేది రామలక్ష్మమ్మ. మారుతి ఏనాడు ఇంట్లోకి అడుగుపెట్టేవాడు కాదు. గుమ్మం దగ్గర, గుడి మెట్ల దగ్గరే తన పడిగాపులు. వాళ్ళ స్నేహం ఊళ్ళో వాళ్ళందరికీ చూడటానికి బహు ముచ్చటగా ఉండేది. ఎప్పుడైనా రామలక్ష్మమ్మ గుళ్ళోకి కొబ్బరికాయ తీసుకువెళ్లడం మర్చిపోతే మారుతి పరుగు పరుగున పోయి, పూలకొట్లో చెంగున కొబ్బరికాయ పట్టుకొచ్చేవాడు.

    కొన్నాళ్ళకి రామలక్ష్మమ్మగారికి బాగా జబ్బు చేసి మంచం పట్టింది. ఎన్ని వైద్యాలు చేయించినా ప్రయోజనం లేకపోయింది. రామలక్ష్మమ్మగారి ఆఖరి ఘడియలనీ, చూసుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కబురు పెట్టమన్నారు ధన్వంతరిగారు. కొడుక్కి మంచి మాటలు చెప్పింది రామలక్ష్మమ్మ. చుట్టాలు చుట్టూజేరారు. ఎవరి కోసమో ఎదురు చూస్తున్నాయి ఆవిడ కళ్ళు. గుడి నుంచి తీర్ధంలో వేసిన తులసాకులు పట్టుకొచ్చాడు మారుతి. చెమ్మగిల్లిన కళ్ళతో సత్యానికి తులసాకులు అందించాడు మారుతి. నారాయణ మంత్రం చదువుతూ తీర్ధం రామలక్ష్మమ్మ అంగిట్లో పోసాడు సత్యం. ఒకసారి మారుతికేసి, చివరిసారిగా సత్యానికేసి చూసి కన్నుమూసింది.

    మారుతి రోజూ దిగాలుగా రామలక్ష్మమ్మ గారి ఇంటి ముందు కూర్చునేవాడు. సత్యానికి జాలేసి రోజూ ఏదో ఒకటి పెడుతుండేవాడు. కొన్నాళ్ళకి సత్యం మారుతిని పట్టించుకోవడం మానేసాడు. మారుతి మాత్రం ఇంట్లో ఉన్న రామలక్ష్మమ్మ గారి పటంకేసి చూస్తూ గుమ్మం దగ్గరే పడిగాపులు కాసేవాడు. వ్యాపారంలో నష్టం రావడంతో సత్యం బాగా చికాకుగా ఉండేవాడు. దారికడ్డంగా ఉన్న మారుతిని కసురుకుని, కోపంగా కర్ర విసిరాడు. మారుతికుంటుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఆ ఇంటి ముందు ఎప్పుడూ కనిపించలేదు.

    కొన్నాళ్ళకి సత్యానికి కూతురు పుట్టింది. తన తల్లే తిరిగి తన కడుపున పుట్టిందని రామలక్ష్మి అని పేరు పెట్టుకున్నాడు. రాముడు అని ప్రేమగా పిలుచుకునేవాడు. అల్లారు ముద్దుగా పెంచుకునేవాడు. రాముడు ఆడింది ఆట పాడింది పాట. వీధిలో పిల్లలందరితో కలిసి రాముడు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. తన ముద్దు మాటలతో, చిలిపి చేష్టలతో సత్యానికి సమయం తెలిసేది కాదు. తన అల్లరి పడలేక అమ్మ కేకలేస్తే ఊరుకునే వాడు కాదు. ఎవరైనా ఫిర్యాదులు చేస్తే “పసి పిల్ల కదండీ” అని నవ్వుతూ దాట వేసేవాడు.

    ఒక రోజు సత్యం రాముడిని రామాలయానికి తీసుకు వెళ్ళాడు. పూజారి గారు శఠారి పెట్టి ఇద్దరినీ ఆశీర్వదించారు. సత్యం జేబులోంచి నోట్లు తీసి లెక్కపెడుతన్నాడు. రాముడు పుసుక్కున చేతిలో ఉన్నదంతా లాక్కుని పూజారి గారి పళ్లెంలో వేసేసింది.

    “ప్రేమ, దక్షిణ రెంటికీ కొలతలుండకూడదు నాన్నా” అని కిలకిలా నవ్వింది.

    “అమ్మాయిదంతా అమ్మగారి పోలికే సత్యం. ఆవిడలాగే పెద్ద చెయ్యి”. దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదించారు పూజారిగారు. మురిసిపోతూ మెట్లు దిగాడు సత్యం.

    “ఆ సత్యం.. అమ్మాయికి ఆయుష్ హోమం సంగతి” అని గుర్తు చేశారు పూజారిగారు.

    “గుర్తుంది పూజారి గారు” అని ఇంటికి బయలుదేరాడు సత్యం.

    ఒక రోజు రాముడిని బళ్ళో దింపి వ్యాపార నిమిత్తమై పొరుగూరు ప్రయాణమయ్యాడు సత్యం. “రాముడూ నీ స్నేహితులతో కలిసి ఇంటికి వచ్చేస్తావుగా ? నువ్వు ఆలస్యంగా ఇల్లు జేరితే అమ్మ ఖంగారు పడుతుంది” అని కూతురికి హిత బోధ చేసాడు సత్యం. సరే అన్నట్టు తలూపింది రాముడు.

    సత్యం ఊరు దాటగానే కుంభవృష్టి మొదలయ్యింది. ఎడతెరపి లేకుండా ఆ రోజు సాయంకాలం దాకా కురుస్తూనే ఉంది వర్షం. చాలా వరకు దారులన్నీ వాన నీటితో నిండి పోయాయ్. చెట్లు విరిగిపడ్డాయ్. కరెంటు తీగలు తెగి పడ్డాయ్. ముసలి వాళ్లంతా అలో లక్ష్మణ అని చలికి చివురుటాకుల్లా వణికిపోతుంటే, నడివయస్కులంతా ఎడతెరపిలేని వాన మీద చికాకు పడుతున్నారు, పసివాళ్ళకి మాత్రం ఆ పొంగిపొర్లుతున్న నీళ్లలో దూకడం, కాగితం పడవలు వేయడం మహా సరదాగా ఉంది. కనిపించిన ప్రతి నీటి గుంటలో చిందులేస్తూ అల్లరి చేస్తూ తడుస్తూ తుళ్ళుతూ ఇంటి బాట పట్టారు రాముడు, రాముడి మిత్రబృందం.

    రామాలయం వీధి చివర తిరగ్గానే ఒక ముసలాయన రాముడి మిత్రబృందంకేసి చూస్తూ మేడ మీద నుంచుని పెద్ద పెద్దగా అరుస్తూ చేతులు ఊపుతున్నాడు. రాముడు వాళ్ళకి అతను ఏం చెప్తున్నాడో వినపడటం లేదు. ఆ ముసలాయన అరిచే అరుపులు స్పష్టంగా వినపడటం లేదు. వాళ్ళు ఆయన్ను పట్టించుకోకుండా ముందుకు సాగారు. ఆ ముసలాయన ఇంకా బిగ్గరగా అరుస్తూ వాళ్ళకేసి రాళ్లు రువ్వసాగాడు. పిల్లలు భయపడి దారికి ఆ మూలన చేరి బిక్కు బిక్కుమంటూ ముందుకు నడవసాగారు. ముసలాయన పెద్దగా ఏడుస్తూ తలబాదుకుంటున్నాడు. అతనికి పిచ్చేమో అనుకుంది రాముడు. వడి వడిగా ముందుకు సాగింది. ఇంతలో పిడుగుపాటు లాంటి పెద్ద శబ్దమయ్యింది. అందరూ ఉలిక్కిపడి ఉన్న చోటనే పిడచకట్టుకుపోయారు. ఆ శబ్దానికి చుట్టూ పక్కన వాళ్ళు ఇళ్లలోంచి బయటకు వచ్చారు. ముసలాయన మెల్లగా మేడ దిగి కిందకి వచ్చాడు. ఇరుగు పొరుగు చుట్టూ చేరారు. పిల్లలు ముసలాయన్ను చూసి భయపడిపోతున్నారు.

    ‘భయపడకండమ్మా, భయపడకండి’. ఆ నీళ్లలో కరెంటు తీగ తెగి పడిందమ్మా. నేను మేడ ఎక్కి చూడగానే మా కోడి ఆ నీళ్లలో చచ్చిపడి ఉంది. మీరు ఆ నీళ్లకేసి వెళుతున్నారన్న ఖంగారులో కేకలేసి రాళ్లురువ్వాను ఏమి అనుకోకండి అని చెప్పాడు. ఇంక మీకు ప్రమాదం లేదు. అక్కడ ట్రాన్స్‌ఫారమ్ పేలినట్టుంది. ఇప్పుడిప్పుడే కరెంటు రాదు మీరు ఇంటికి వెళ్ళండి అని సాగనంపాడు.

    ఆ రాత్రంతా కరెంటు లేదు. మరుసటి రోజు ఉదయాన్నే ఇంటికి జేరి కూతురికి తప్పిన ప్రమాదం గురించి తెలుసుకుని తనని గట్టిగా కావలించుకున్నాడు సత్యం. ఇంటి ముందర కోలాహలం గమనించి బయటకు వచ్చి చూసాడు. జనం ట్రాన్స్ఫార్మర్ కేసి పరుగిడుతున్నారు. సత్యం, సత్యం భార్య, రాముడు కూడా జనం వెంటనడిచారు.

    ఆమ్మో… ఎంత పెద్ద ప్రమాదం తప్పింది ఆ దేవుడే కాపాడాడు అనుకుంటున్నారు. అక్కడ గుమిగూడిన జనాన్ని పక్కకి తోస్తూ ముందు వరసకు చేరారు. విద్యుత్‌శాఖా ఉద్యోగులు ట్రాన్స్ఫార్మర్ కి చిక్కుకున్న ఒక కోతిని తీసి కింద పడేసారు.

    ఆ కోతే లేకపోతే మన పిల్లలు మనకి దక్కేవాళ్ళు కాదు, దానికి ఏ జన్మలో ఋణమో ఈ పిల్లలని కాపాడి అది కాస్తా తీర్చేసుకుంది ! అన్నాడు ముసలాయన.

    విగతజీవిగా పడి ఉన్న మారుతిని చూసి సత్యం కళ్ళు చెమర్చాయి. అక్కడే దూరంగా కూర్చుని ఏడుస్తున్న కోతి పిల్లని చేరదీసింది రాముడు. మీ నాన్న చనిపోయాడా ? ఏడవకు నీకు నేనున్నాను అంజి అని గట్టిగా తన గుండెలకు హత్తుకుంది.

  • శివోఽహమ్

    శివోఽహమ్

    ఏంది నాసుట్టు నేనేంది ఈడని
    రోజు సదమద మైతరొ శివిగా
    సదువూ గురువూ ఎరగని జీవిర
    ఇవరం నివ్వే దెలుపరొ శివిగా

    యాడ నీ ఇల్లు యేది నీ కొలువంట
    బగు ఆత్రము ఆగమైతరో శివిగా
    పురుగు బుట్రకే నీ ఆదరమాయెన
    నేనీడ నీ నీడ గోరి అల్లాడగ శివిగా

    సేదుకో నన్నని అడిగినంతనే
    అదుకుంటవని పేరుర శివిగా
    శివ శివాయంటె సెవికినపడదా
    నీకు సెవుఁడా ఏందిర శివిగా

    నిన్ను దలపకుండ నా దినమేడుందిర
    గుండె సెలమ జేసి అబిసేకము శివిగా
    మరి నే ఓయని పిలిసితే కోయనవేందిర
    బక్తసులబుడంట ఎచ్చులేందిర శివిగా

    కరువు దీర నిను రెండు కండ్ల జూడ
    నా కండ్లు జాలవంట గద శివిగా
    నీ దరిసెనమానని సూపు నాకేల
    నీ అగ్గికన్ను దెరుసు నాదిక్కుర శివిగా

    ఆట నీది ఆటగాడు నీవటర
    నీమనిబందము నీ మాయట శివిగా
    నీ కుశాలు నువు జూసుకుంటవా
    ఇందిల నా తపన ఎంచవా శివిగా

    నివ్వే సత్యము నివ్వే నిత్యము
    సకలము నివ్వేనంటగ శివిగా
    అంతా నివ్వే అయ్యిన కాడికి
    నేనెవురన్న కౌతు నాకేలర శివిగా

    ఎవ్వురు నివ్వని ఎదికిన దంకా
    ఎన్నెన్ని ప్రశ్నలు నివ్వుర శివిగా
    ఎఱిక దెలియుకై ఎదను తడిమితే
    నా ఉనికి నీవని అరసిర శివిగా

    పలుకు, #తెలుగు #అమ్మనుడి, #శివోహం #ఆధ్యాత్మికం, #భక్తి, #కవిత 

    @vennela

    1
  • SILENCE

    He alighted Uber and  strode into the hotel to attend a 2 day tech conference for SBU senior managers starting the following day.

    Next day 9 am he walked into the conference hall in the same hotel and saw her.

    He was unsure initially but walked to her hesitatingly and said hello to her.

    They met again after twenty years, and learnt  that neither of them intended to attend the conference.
    He wore the same shy smile, though his hair had greyed.

    She carried herself with the same grace in a beautiful saree , but her eyes had deepened—more like hiding a storm than sparkle.

    They weren’t lovers, never had been. The feelings they shared  defied normal definitions.

    A coffee turned into lunch. Lunch became a slow walk in the hotel’s quiet garden.
    They spoke like old friends, and yet there were pauses, long ones, filled with something unsaid. Both wanted to talk but an awkward silence descended between them.

    After a while, he  asked, “Do you ever wonder… if we missed something?”
    She looked away, “Only on cold nights… and when I hear old ghazals.”

    Ghazals were his favourite past time then .

    His hand brushed hers, and neither moved away. It’s not affection. Not desire. It’s something quieter and inexplicable.

    They spoke of marriages—both enduring, both lonely in places neither spouse would see. Then they fell silent.

    She laughed softly, “We’re loyal to lives we never fully chose.”

    He simply nodded .

    At the edge of the garden, he picked a Rose  flower and gave it to her.
    It wasn’t romantic. And yet, her fingers trembled slightly as she took it.

    They met for dinner and  in his room later, they sat facing each other on two separate chairs.

    No wine. Just silence, and the soft hum of the air conditioner.

    No one dared to breach the bond of silence.

    She said :“You remember that rain in Delhi where we got drenched to our bones?”

    He smiled. “I remember how you didn’t carry an umbrella… and didn’t care.”

    They laughed, and then it faded, replaced by silence of million words.

    She said, “We could kiss. It would mean something. Or maybe nothing at all.”

    She is sightly trembling as emotions are ravaging inside her mind and heart.

    He looked at her in eyes and  whispered, “But we won’t.”

    After a while, she nodded. “Because we’d lose this.”
    “This?” he asked.
    “This ache. This what-if. This poetry between us destined to be like this.”

    She controlled her emotions and felt serene now.

    They sat there, eyes locked, as if listening to those sweet nothings of yesteryears- may be reading an unwritten book by them.

    Time passed. The light changed. No one moved.

    After a while she looked at her watch and  rose to leave, he stood too.

    Neither reached for a hug. Yet something lingered, electric and magnetic.

    At the door, she turned. “Some people write chapters. Others… stay at footnotes that lay wayside.” Melancholy dripping from her words.

    “And yet,” he said haltingly -not looking at her directly, “some footnotes mean more than the story.”

    He was fighting to contain tears.

    With a feeble smile and  mist-eyed she said . “Goodbye, then.”
    He didn’t say goodbye. Just watched her walk away.

    Not every love ends in embrace.
    Some live in glances. Some in paused sentences. Some in silence.
    Some in memories neither dared to create—But never quite forget.

     ======

  • మిన్నేటి కలువ

    మిన్నేటి కలువని నేను
    ప్రేమ సుమగంధ కైరవిని నేను
    జ్ఞాన స్వప్రకాశిత కుముదిని నేను
    చారుశేఖర స్మిత ఇందీవరను నేను

    2
  • మా పనిమనిషి పనితనం ..

    మా పనిమనిషి పనితనం ..

    ఇది నేను ఇదివరకు తెలుగు కోరా పరంగా షేర్ చేసుకున్న విషయమే

    నేను ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ లో (REC రూర్కెలా ) ఉండగా మా కాలేజీ కి సైన డై (Sinedie) ప్రకటించారు (ఇది 1987 లో జరిగిన విషయం)

    ఇంకా కాలేజీ మొదలు పెట్టి పూర్తిగా ఒక నెల కూడా గడవకముందే జరిగింది

    (అప్పుడేదో కాలేజీ లో ఫైనల్ ఇయర్ కి థర్డ్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ గొడవల్లో రక్తాలు వచ్చేలా కొట్టేసుకోవడం వలన వ్యవహారం చాలా సీరియస్ అయ్యిపోయి – నిరవధిక సెలవలు (Sinedie) ప్రకటించేసారు )

    College డిస్సిప్లినరీ కమిటీ మాత్రం చాలా సీరియస్ గా పనిచేస్తూ – కొంత మంది స్టూడెంట్స్ ని ఒక సంవత్సరం పాటు డిటైన్ చేసారు

    ఇంతకీ జరిగిన విషయం ఏంటంటే ఇంజనీరింగ్ కాలేజీ కి కాలరెత్తుకుని మరీ వెళ్లిన నేను – 30 రోజుల్లోనే తిరుగు టపా కట్టాను – ఎంత కాలం ఇంట్లో ఉండాలో అన్న విషయం మీద ఏ మాత్రం క్లారిటీ లేదు

    అది చివరకు దాదాపు 45 రోజుల పాటు పొడిగింపబడింది

    రోజంతా ఖాళీ – అది ఆగష్టు నెల అనుకుంటా -బయట బలాదూర్ గా తిరగడానికీ అంత అనువైన సమయం కాదు

    కంప్యూటర్ సైన్స్ అన్న బ్రాంచ్ లో చేరాను – కానీ ఇంకా ఏమీ కంప్యూటర్ సబ్జెక్టు లు చదవలేదు అప్పటికి

    నాన్నగారు కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కి టైపింగ్ మంచిగా వస్తే మంచిది అన్న ఉద్దేశం తో ఒక టైపింగ్ మెషిన్ ని అద్దెకు తెప్పించి వుంచారు, ఇంట్లో హాల్ లో ఒక మూల ఉంచారు ( నా కోసం)

    దాన్ని అప్పుడప్పుడు టక్కు ఠక్కు మని కొట్టే వాణ్ని 😉

    ఒక రోజు మా ఇంట్లో పనిమనిషి అమ్మతో అంటూంటే నా చెవిన పడింది

    అబ్బాయిగారు చదువు మానేసి ఇప్పుడు ఇంట్లో టైపింగ్ నేర్చుకుంటున్నారా అని ?

    ఉక్రోషం పొడుచుకొచ్చింది –

    ఇక టైపు నేర్చుకోవడం మానేసాను

    కానీ ఆ 15 రోజుల టైపింగ్ కాస్తా నా స్పీడ్ ని సగటు స్టూడెంట్ స్పీడ్ కంటే బాగానే పెంచింది. క్రమ క్రమంగా వివిధ రకాలైన రైటింగ్ నా జీవితంలో ఒక ముఖ్య పాత్ర వహిస్తుంది అని తెలిసి ఉంటే ఇంకాస్త టైపింగ్ ప్రాక్టీస్ చేసేవాణ్ణేమో ?

    అలా ఒక్క మాటలో నాలో అంత పరివర్తన బహుశా ఇంకెప్పుడూ కూడా జరగలేదు అంటే అతిశయోక్తి కాదేమో 😉

  • నా అమెరికా యాత్ర-2

    నా అమెరికా యాత్ర-2

    వాళ్ళు వచ్చి నన్ను చుట్టుముట్టారు. కొంచెం దూరం లో బెంచ్ మీద ఉన్న నా బాగ్ చూపించి నీదేనా అని అడిగి, అవునని చెప్పిన తర్వాత దాన్ని శల్య పరీక్ష చేసి అప్పుడు ఇలా ఎక్కడ పడితే అక్కడ బాగ్ వదలవద్దు అని ఒక సలహా ఇచ్చి వేను తిరిగారు.

    AMERICAN AIRLINES ఒక సుత్తి ఎయిర్‌లైన్. అందులో బిజినెస్ క్లాసు కి ఎమిరేట్స్ కు నో పోలిక. . రాత్రి8 గంటలకు లండన్ చేరాను. మర్నాడు పొద్దున్నే10 గంటలకు ప్రపంచంలో పేరున్న లా ఫర్మ్ CLIFFORD CHANCE లో మీటింగ్. నా Arbitration Final statement/brief. చాలా క్రిటికల్ కేసు.

    ఆ కేసు 3 ఏళ్ళ నుండి నలుగుతూ ఉంది.

    సరే సరిగ్గా 9.45 కు వాళ్ళ రిసెప్షన్ లోకి అడుగు పెట్టాను. నన్ను మీటింగ్ రూమ్ లో కూర్చోబెట్టారు. అక్కడ టీ/కాఫీ percolater/జ్యూసులు/కుకీస్/ఇంకా రకరకాల పండ్లు అన్నీ పెట్టారు. పెట్టరూ మరి? గంటకు 500 పౌండ్లు వసూలు చేస్తారుగా! నలుగురు తెల్ల లాయర్లు టేబుల్ కు అటు వైపు, నేనొక్కడినే ఇటువైపు.నా దగ్గర 5 ఫైల్స్. వాళ్ళు అడిగిన అన్ని ప్రశ్నలకు జవాబులు టకటకా. Files ను చాల తక్కువ గా రిఫర్ చేస్తూ..దుబాయ్ to NY ఫ్లైట్ లో ఔపోసన పట్టిన సంగతులు అన్ని నెమరు వేసుకుంటూ 3 గంటలు ( అరగంట బ్రేక్ కాకుండా) ఏక ధాటిగా ఆన్సర్ చేసాను.

    మూడు గంటల తర్వాత ఆ నలుగురు లాయర్లు లేచి నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి , మేము 5 గంటలు అవుతుంది , దానికి అనుగుణం గా ఛార్జ్ చేద్దామని అనుకొన్నాం. మీరేమో 3 గంటల్లో ముగించారు అని నవ్వుతూ చెప్పారు. నేను బయట పడి, కెనరా బ్యాంకు లో పనిచేస్తున్న నా ఫ్యామిలీ ఫ్రెండ్ కి ఫోన్ చేశా.తను తొందరగా వచ్చాడు. ఇద్దరం కలిసి అక్కడ చికెన్ కర్రీ -రైస్ తిన్నాము. ప్రాణం లేచి వచ్చింది. అతను ఉండేది ఈస్ట్ లండన్. ఇంటికి రమ్మన్నాడు. నన్ను పెద్ద అన్నయా అని పిలుస్తాడు. చిన్నప్పటి నుండి ఎరుగుదును.సరే అని చెప్పి, హోటల్ కు వెళ్లి, మూట ముల్లె సర్దుకొని టాక్సీ లో వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళతో ఆ రాత్రి డిన్నర్ /నెక్స్ట్ డే బ్రేక్ ఫాస్ట్ చేసి Heathrow కు మర్నాడు బయలు దేరాను.

    నా టాక్సీ ను నడిపిన వ్యక్తి కి 65 ఏళ్ళు ఉంటాయి. నా బరువైన సూటుకేసు ను తానే డిక్కి లో పెట్టాడు. ఎయిర్పోర్ట్ దగ్గర తనే దింపాడు నేను వద్దు అని చెప్పినా కూడా..పైగా ఇది నా డ్యూటీ అన్నాడు. నేను 10 పౌండ్లు టిప్ ఇస్తే he felt so happy. నాకు అతని కళ్ళలో సంతోషం చూసి లిప్త కాలం ఎందుకో మనస్సు మూలిగింది. మనుషులకు డబ్బు అంత అవసరమా అనిపించింది.

    దుబాయ్ చేరాను.ఇంటికి వచ్చి పప్పు చారు, వంకాయ తాలింపు చేసిపెట్టమని హుకుం జారి చేసాను. శ్రీమతి ఓ నవ్వు. మీరు ఎప్పుడు ఓవర్సీస్ ట్రిప్ కు వెళ్ళినా అర్ధాకలి తో ఎందుకు వస్తారు? అక్కడి ఫుడ్ కడుపు నిండదు అనే నా సమాధానం లో మన తెలుగుతనం కనబడుతుందని చెప్పేది తను.

    మర్నాడు ఆఫీస్ లో మా ఓనర్ +నా బాసు ఇద్దరు నాతో ఒక పెద్ద మీటింగ్ పెట్టి ఆ లాయర్ల arbitration గురించి అడిగారు. వాళ్ళకు అంతకు ముందే లాయర్లు ఫీడ్‌బ్యాక్ ఇచ్చిన సంగతి నాకు తెలియదు. ఇలా క్రాస్ చెక్ చెయ్యటం మా ఓనర్ కు వెన్నతో పెట్టిన విద్య. ఓ రెండు నెలల తర్వాత మా కంపని ఆ arbitration గెలిచింది.

    అ సంవత్సరం లో నాకు వచ్చిన కాష్ బోనస్ మరే సంవత్సరం లో రాలేదు !!!

  • నా అమెరికా యాత్ర -1

    నా అమెరికా యాత్ర -1

    ట్విట్టూరి లో ఉన్న పిల్లల్లా తుర్రు మంటే అమెరికా వెళ్ళే ఉద్యోగాలు కావు మావి.

    2006 మే. న్యూయర్క్ sugar week కు నన్ను తీసుకొని వెళ్ళమని మా ఓనర్ నా బాసు కు చెప్పారు. అప్పుడే నేను షుగర్ ఫ్యూచర్స్ డిపార్ట్మెంట్ కు ట్రాన్స్ఫర్ అయ్యాను. నన్ను అంతర్జాతీయ షుగర్ ఫ్యూచర్స్ బ్రోకర్స్ కు పరిచయం చేయాలని ఐడియా. రిటర్న్ ట్రిప్ లో ఓ arbitration బ్రీఫింగ్ లండన్ లో లాయర్లతో ఫిట్ చేశాడు బాసు.

    సరే, పదమూడు గంటల ప్రయాణం కదా, ఎకానమీ ఎలా వెళ్తావు అని బిజినెస్ క్లాసు కు పర్మిట్ చేసాడు. తనేమో ఫస్ట్ క్లాసు లో.

    నేను ఎమిరేట్స్ బిజినెస్ క్లాసు లో సెటిల్ అయ్యి, ఒక చిన్న కునుకు తీసా.నా భుజాన్ని ఎవరో కుదుపుతున్నారు. గబుక్కున కళ్ళు తెరిచా. బాసు డ్రెస్ చేంజ్ చేసుకొని,ఎమిరేట్స్ వాళ్ళ ట్రాక్ ప్యాంటు/టీ షర్టు వేసుకొని ఉన్నాడు. పడుకొంటున్నావా? చాల టైం ఉంది కదా arbitration ఫైల్స్ అవీ ప్రశాంతం గా చదువు అని చెప్పి వెళ్లి పోయాడు. నేను అబ్బా అని మూలిగి, తెచ్చుకున్న ఆరు ఫైల్స్ రెండు దఫాలుగా తిరగేసా. మొత్తానికి మధ్య మధ్య లో వచ్చి యోగ క్షేమాలు ( పడుకోన్నానా లేదా ??) చూసి వెళ్ళాడు.

    JFK లో దిగాము. చూడగానే నాకు అంతా ఇంప్రెసివ్ గా అనిపించలేదు. అసలు దుబాయ్ ఎయిర్పోర్ట్ సుపీరియర్. బాసు +నేను బయటపడ్డాం. బయట ఎమిరేట్స్ కాంప్లిమెంటరీ కార్లు సిద్దం. నాకేమో MERC, బాసు కేమో బెంట్లీ. వెళ్ళేది ఒకే హోటల్ కి కదా, బెంట్లీ లో వెళ్దాం అని వేరే కారుని అక్కరలేదని Manhattan కు బయలుదేరాం.

    గంటన్నర తర్వాత హోటల్ waldrof astoria చేరుకున్నాం. It’s a very famous hotel with history of royalty and presidents of nations signing treaties etc.. నాకు ఒక వింగ్ లో suit, బాసు కు ఇంకో వింగ్ లో suit. బాసు నాతో, తొందరగా రెడీ అవ్వు. ఫస్ట్ మీటింగ్ 45 నిమిషాల్లో అని చెప్పాడు. నేను నా లగేజ్ తీసుకుంటున్నప్పుడు అక్కడి వియత్నాం పోర్టర్, దారి మరిచి పోతారు, నాతో రండి అని దారి చూపిస్తూ suit లో నన్ను తీసుకొచ్చి టిప్ తీసుకొని వెళ్ళిపోయాడు.40 నిమిషాల తర్వాత క్రిందకు వెళ్ళాను. It’s a huge property. నాలుగు వైపులా నుండి ఎంట్రన్స్. నాలుగు వైపులా పెద్ద పెద్ద రోడ్లు.ఫెంటాస్టిక్ లొకేషన్ .. సరిగ్గా 45 నిమిషాలకు మీటింగ్ స్టార్ట్. లాబీ లో హలో హాయ్ చెప్పుకుంటూ 2 మీటింగ్‌లు ముగించుకొని బయట ఉన్న ఏదో చైనీస్ తిని లోపకి వచ్చి రేపు 9 గంటలకు రెడీ అయ్యి కిందకు వచ్చేయి అని చెప్పి తన suit కు వెళ్లి పోయాడు. నేను సూటు బూటు మార్చుకొని లుంగీ ట్ షర్టు వేసుకొని ఏదో పరధ్యానం గా అలోచిస్తూ suit బయటకు వచ్చాను. అప్పుడు డోర్ పడిపొయింది. Access కార్డు లోపల ఉండిపోయింది. హేండిల్ ను నేను రెండు మూడు సార్లు కదిపాను. అంతే ఈలలు వేస్కొంటూ,ఇద్దరు ఆజాన బాహులు(సెక్యూరిటీ నల్ల వాళ్ళు)రెండు కుక్కలతో పరిగెత్తుకొని వచ్చి నన్ను చుట్టు ముట్టేసారు.

    నేను కంగారు పడ్డా. నువ్వు డోర్ హేండిల్ ను ఎందుకు ట్రై చేస్తున్నావు. అసలు నువ్వు ఎవరూ? అని ప్రశ్నలు. ఓపిగ్గా చెప్పాను.. నా ఫింగర్ ప్రింట్స్ ఒక handheld పై తీసుకొని, రిసెప్షన్ తో వాకీ టాకీ లో మాట్లాడి ఫ్లోర్ supervisor కార్డు గీకి చేసి suit ఓపెన్ చేసాడు. అమ్మయ్య అనుకొన్నా.. అప్పుడు వాడిని అడిగా- ఎందుకు ఇంత హడావుడి అని? మీరు చూడలేదా? మీ పక్క రూమ్ లో ఒక చిన్న ఆఫ్రికన్ దేశపు ప్రెసిడెంట్ ఉన్నారు.. వాళ్ళు ఆయన బాడీ గార్డ్స్. కాబట్టి ఈ ఫ్లోర్ లో ఎక్కువ సెక్యూరిటీ అని సెలవిచ్చాడు.

    అ తర్వాతి 5 రోజులు భయంకరమైన బిజీ . మీటింగు లే మీటింగులు.- ట్రేడర్ లు/బ్యాంకర్ లు/కాన్ఫరెన్స్ పేపర్లు/ బాస్ presentation వగైరా…

    ఒక సారి మోర్గాన్ స్టాన్లీ షుగర్ డెస్క్ హెడ్ తో లంచ్. పక్కన ఏదో రెస్టారెంట్ కు వెళ్ళాం, అతను steak మీడియం rare ఆర్డర్ ఇచ్చాడు. మెనూ లో నేను తినదగ్గది కనబడలేదు, నా బాస్ కాఫీ చాలు అని ఊరుకున్నాడు. నేను ఆనియన్ రింగ్స్ చెప్పాను. వాడు సర్వ్ చేసిన పోర్షన్ ఒక కిలో కంటే ఎక్కువ గా ఉన్నాయి. మా గెస్ట్ steak ఒక కిలో ఉంటుంది. వామ్మో..ఇంత సైజా అని నోరు వెళ్ళ బెట్టా.

    ఆ మర్నాడు వెతికి వెతికి ఇండియన్ రెస్టారంట్ ని పట్టుకొని దాల్ తడక,భెండి ఫ్రీ -తందూరీ రోటి తిని బ్రేవ్ మని త్రేన్పు వచ్చిన తర్వాత కాని ఆత్మా రాముడు శాంత పడలేదు.

    నెక్స్ట్ డే GALA డిన్నర్.

    డ్రెస్ కోడ్: gents : TUX లేడీస్: Black Gown ..

    బాసు:: మొహిద్దిన్ జీ, మీ tux ఎక్కడ అన్నాడు.

    నేను: నాకు tux లేదు అన్నాను.

    బా: సరే మీరు వెళ్లి concierge ను అడగండి .ఎక్కడ దొరుకుతుందో చెప్తాడు. అన్నాడు.

    వాడిని అడిగితే, వాడు అడ్రస్ ఇచ్చాడు.

    నేను నడుచుకుంటూ వెళ్ళాను..

    అక్కడ ఓ 50 మంది ఉన్నారు లైన్ లో. ఇంతకు అది రెంటల్ షాప్. వాళ్ళు చాలా చురుకు గా పని చేస్తున్నారు. పది నిమిషాల్లో నా టర్న్ వచ్చింది. Tux/Cummerband/ఫ్రిల్ షర్టు వేసుకొని చూసా. టైలర్ కొన్ని మార్పులు నోట్ చేసుకొని హోటల్ కు పంపుతానని రూమ్ నెంబర్ తీసుకొని $150 ఛార్జ్ చేసాడు (ఒక రోజు కోసం). సమర్పించుకొని హోటల్ కి వచ్చాను.

    ఆ రోజు NYMEX కు వెళ్లి జూలై షుగర్ ఫ్యూచర్స్ ఓపెనింగ్ సెషన్ కు బెల్లు కొట్టాము. Felt thrilled.

    మొదటి సారి TUX తో డిన్నర్ ఈవెంట్. స్పీకర్స్ పోడియం దగ్గర గా ఉన్న కార్గిల్ టేబుల్ వాళ్ళు నన్ను లాక్కుపోయారు. షుగర్ ట్రేడ్ లో మాది పెద్ద కంపెనీ కదా..అందరూ తమ తమ టేబుల్స్ దగ్గరకు రమ్మని పోరు.

    ఫిక్స్డ్ మెనూ. చదివితే తినగలిగేది నిల్లు. సరే తర్వాత చూద్దాం అని కబుర్ల లో పడ్డా. టేబుల్ చుట్టూ 10 మంది. అందరూ పానీయాలు స్టార్ట్ చేసారు. నేను కోక్ అన్నా.బేరర్ వచ్చి టిన్ నా మొహన కొట్టి పోయాడు.

    ఇంతలో ఒకతను పందెం కాద్దామా అని అడిగాడు . ఏమిటంటే ఫలానా స్పీకర్ ఎన్ని నిమిషాలు మాట్లాడుతాడని? ఒక హాట్‌షాట్ స్పీకర్ పై బెట్ . ఫస్ట్ టైం లైఫ్ లో డబ్బు పెట్టి పందెం కాయటం. సరే అని 10 డాలర్లు టేబుల్ పై వేసి.. 12 నిముషాలు కంటే తక్కువ గా మాట్లాడుతాడని చెప్పా. Interestingly 11 నిమిషాల్లో ముగించాడు. $ 90 గెలుచుకొన్నా..

    డిన్నర్ స్టార్ట్ అయింది. నేను బేరర్ ని పిలిచి వెజ్ తెమ్మన్నా . వాడు వింతగా చూసి, ఏదో పాలక్ లాంటిది 4 ఆకులు, ఒక కారట్ ఉడక బెట్టింది తేచ్చాడు. కక్కలేక తినలేక ఇబ్బంది పడ్డాను.

    ఆ 5 రోజులు 2 km దూరం లో ఉన్న empire state bldg ను కూడా చూడలేక పోయా.. అంతలా మీటింగ్ లు ఫిట్ చేసాడు బాసు. దుర్మార్గుడు అవన్నీ ఎప్పుడో చూసేసాడు.

    పొద్దున్నే లేచి మూట ముల్లె సర్దుకొని లండన్ వెళ్ళాలి కదా , La Guardia airport కు పయనమయ్యా.. హోటల్ కు బై చెప్పి.

    Check ఇన్ చేసాను..Business class AA.

    పొద్దున్నే కదా ..ఏదైనా తిందాం అని వెయిటింగ్ ప్లేస్ దగ్గర గా ఉన్న స్మూతీ కౌంటర్ కి వెళ్ళాను. 2 నిమిషాలైంది.

    ఇంతలో ఏదో కలకలం. ఇద్దరు సెక్యూరిటీ వాళ్ళు నా వైపు పరిగెత్తుకొని రావటం చూసాను.

    సశేషం

  • నిశ్రేణి పై నీలవేణి


    ఈ కథలోని పాత్రలు కొందరిని పోలి ఉండవచ్చు, ప్రదేశాలు చూసినవిలా ఉండవచ్చు, వస్తువులు ఎప్పుడో వాడినవిలా ఉండవచ్చు. చేసుకున్న వాడికి చేసుకున్నంత ప్రభుదేవా అని, వారి చేతలే నా చిట్టి కథలు.

    ఆనందో బ్రహ్మ గోవిందో హార్ … నా పేరే ప్రేమ నీ పేరే ప్యార్…. అని పక్కింట్లో కఱ్ఱ బిళ్ళ ఆడుకుంటున్న కుర్రాడికి వినిపించేలా పెద్ద పెద్ద గా పాట పాడుకుంటున్నారు అమల, నాగార్జున. ఆ పాట అంటే ఆ కుర్రవాడికి ప్రాణం. అసలే యవ్వనాశ్రమానికి అద్దె కట్టలేక ఆపసోపాలు పడుతున్నాడు. ఇక ఇటువంటి పాటలు అతనిని కుదురుగా ఉండనిచ్చేవి కావు. ఆట మానేసి ఆ ఇంటి ప్రహరీ గోడకు ఆనుకుని నిలబడి కళ్ళు మూసుకుని ఆ పాటె తన్మయత్వంతో వింటున్నాడు. తలకి తగిలిన బిళ్ళ తన్మయత్వానికి గండి కొట్టింది. ప్రహరీ గోడకు వేసిన నిచ్చెన పై నిలబడి వాళ్ళ ఆట వీక్షిస్తున్న నీలవేణి పగలబడి నవ్వింది. కిలకిలా నవ్వుతూ ముత్యాలవాన కురిపిస్తున్న ఆ కన్నెకేసి కళ్ళార్పకుండా చూస్తుండిపోయాడు.

    రేయ్ సెంది, బిళ్ళ సరిగ్గా చూసి పట్టుకోరా, బుర్ర ఇక్కడ పెట్టి ఆడకపోతే అలాగే బుర్ర పగులుతుంది అని ఒక వెటకారపు వాల్తేరు నవ్వు నవ్వాడు సెంది స్నేహితుడు ఆదిత్య.

    రాత్రి భోజనాలు ముగించి పెరట్లో నులక మంచం మీద పడుకుని చల్లగాలి, చందమామతో, తనను చూసి నవ్విన, ఆ నిచ్చెన పై నీలవేణి గురించి కబుర్లు చెప్తున్నాడు. తన గురించి తెలుసుకోవాలని, తనతో మాట్లాడాలని కుతూహలం మొదలయ్యింది యువ సెందిర సేగరన్లో. బోర్లా తిరిగి నీలవేణి, సెందిల ఇళ్ల మధ్య ప్రహరీ కేసి చూశాడు. ఒక పది అడుగులు పైనే ఉంటుంది. గోడ ఎక్కి చూస్తే తను కనపడుతుందేమో, చూడనా, వద్దా !! తను ఏమన్నా అనుకుంటుందా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చూస్తే ? వచ్చి నాన్నకి చెప్తే ? తన కోసం ఎన్ని తన్నులైనా తినచ్చు. తన క్రీగంటి చూపులతో ఒక సారి చల్లగా చూస్తే ఎంతటి ఖేదమైన మోదమే కదా. తన నవ్వే నొప్పి నివారించే ఝన్డు బామ్ కదా అని శంకలకు శెలవు పలికి పెరట్లో మామిడి చెట్టు కింద ఉన్న వెదురు నిచ్చెన తీసుకుని ప్రహరి గోడకేసి బయలుదేరాడు. చుట్టూ పక్కల కలయజూసుకుని, ఎవరూ చూడటం లేదని రూఢి చేసుకుని నిచ్చెన ఎక్కి నీలవేణి ఇంట్లోకి తొంగి చూశాడు.

    తల నిండా సన్నజాజులు, వెండి వెన్నెల పడి తళ తళలాడుతున్న వెండి పట్టీలు, పెరట్లో మల్లె తీగల పందిరి కింద మల్లె సువాసనలను గ్రోలుతూ, తన నుదుటిని మణికట్టుకు దిండుని చేసి అర్ధ నిద్రలో ఉన్న అలివేణిని చూస్తూ ఉండిపోయాడు. రోజూ రాత్రి భోం చెయ్యడం ఇంట్లో వాళ్ళందరూ నిద్ర పోయారో లేదో చూసుకుని ప్రహరీ గోడకు నిచ్చెన వెయ్యడం, సెంది దినచర్యలో భాగం అయిపొయింది. ఒకానొక రోజున ఆ వెధవ వెదురు నిచ్చెన కూసిన కూని రాగానికి ఉలిక్కి పడి లేచింది నీలవేణి. అర్ధరాత్రి వేళ ఆ గోడ మీద గుర్ఖాని చూసి కెవ్వున కేకేసింది. ఆ అరుపులకి భయపడి నిచ్చెన మీంచి నేలజారాడు సెందిర సేగరన్. పాపం కాలు విరిగి నడుము కదిలి బతుకు జీవుడా అంటూ నిచ్చెన తిరిగి చెట్టు కింద పడేసి, నులక మంచం పై జేరి, తలను దుప్పట్లో, బాధను పంటి కింద దాచుకున్నాడు.

    మరుసటి రోజు కుంటుతూ కాలేజీకి బయలుదేరిన సెందికి, దారిలో గానుగ చెట్టు కింద వేచి చూస్తున్న నీలవేణి కనపడింది. అయిపోయాను, నిన్న రాత్రి జరిగిన విషయం గురించేనేమో. ఇప్పుడు ఏమి చెప్పాలి ? నేను కాదని చెప్పాలా ? ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పేసిందేమో, ఇహ ఇవ్వాళ నాకు తన్నులు తప్పేలా లేవు అనుకుంటూ తిరిగి మెల్లగా నడవనారంభించాడు. ఇంతలో సెందికి ఎదురుగా వచ్చి నిలబడింది నీలవేణి. సెంది గొంతు తడారిపోయింది, ఏదో చెప్పాలి అనుకుంటున్నాడు గానీ నోరు పెగలడం లేదు. ఒళ్ళంతా చల్లబారిపోయింది. శరీరం వణుకుతోంది.

    క్షమించండి, మీరని తెలియక పెద్దగా అరిచాను. రాత్రి మీరు గోడ మీద నుంచి భళ్ళున పడ్డ శబ్దం వినిపించింది. మీకు ఏమయ్యిందో అని రాత్రంతా మనసు మనసులో లేదు. ఎందుకంత సాహసం చేశారు. నా కోసమేనా ?

    అవునన్నట్టు తల ఊపాడు సెంది.

    ఇంకెప్పుడు అలా చెయ్యకండి, మీకు నన్ను చూడాలనిపిస్తే ఏదో ఒక శబ్దం చెయ్యండి. నేను వచ్చి కనబడతాను. మీకు ఏమన్నా అయితే నాకు చాలా బాధ వేస్తుంది.

    సెంది గుండె చప్పుడు నెమ్మదించింది. మనసు వర్ణించలేని స్థితిలో నిశ్చలంగా నిలిచిపోయింది.

    సరేనండి, ఎవరైనా చూస్తారు, నేను బయలుదేరుతాను. మీరు జాగ్రత్త అని వెనుదిరిగింది.

    నీలవేణి గారు, వణుకుతున్న స్వరాన్ని సరి చేసుకుంటూ పిలిచాడు సెంది.

    చెప్పండి, ఏమని చెయ్యమంటారు ?

    హా, అర్ధం కానట్టు చూసింది నీలవేణి.

    అదేనండి, మిమ్మల్ని చూడాలనిపిస్తే ఏదో శబ్దం చెయ్యమ్మన్నారు కదా. ఏమి శబ్దం చెయ్యమంటారు ?

    మీ ఇష్టమండి, నవ్వుతూ చెప్పింది నీలవేణి.

    కాకిలా అరవమంటారా ?

    అర్ధ రాత్రి కాకిలా అరిస్తే అనుమానమొస్తుందేమోనండి. మా ఇంట్లో ఎలాగూ ఒక గండు పిల్లి తిరుగుతోంది మీకు పిల్లిలా అరవడం వచ్చా ?

    ఓహ్, దానికేం భేషుగ్గా వచ్చండీ. పిల్లి నవ్వినట్లు, ఏడ్చినట్లు కూడా చెయ్యగలను.

    సరేనండి, మీరు ఈ రోజు రాత్రి గోడ దగ్గరకి వస్తే శబ్దం చెయ్యండి నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను అని చెప్పి నడుము తిప్పుతూ నడిచిపోయింది నీలవేణి.

    ఈ విస్తారానందంలో విరిగిన కాలు గురించి మరచి వడి వడిగా తన వెనుక అడుగులు వెయ్యబోయి వెల్లకిల్లా పడ్డాడు సిల్లీ సేగరన్.

    ఒకానొక ఆదివార సూర్యోదయ సమయాన, నీలవేణి జన్మదిన పర్వదినాన, తనకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసి బహుమతి ఇవ్వాలని గోడ దగ్గర చేరాడు. మియావ్. మియావ్ అని గండు పిల్లిలా రెండు సార్లు శబ్దం చేశాడు. పెరట్లో దంతావధానం చేసుకుంటున్న నీలవేణి వాళ్ళ బామ్మగారు ఎల్. విజయలక్ష్మిగారు అది విని, ఈ మాయదారి పిల్లి పీనుగకి మరీ వేళా పాళా లేకుండా పోయింది, దీని పిండం పిచ్చుకలు తిన అని కసురుకుంటూ చేతిలో ఉన్న కర్ర విసిరేసింది. ఆవిడ గురి వెంట్రుకవాశిలో తప్పి సెంది బుర్ర రామ కీర్తన తప్పించుకుంది. బామ్మగారి గురి తప్పినా నీలవేణి నాన్న గురి తప్పలేదు. పిల్లిలా అరవగలడు గానీ పిల్లిలా కనబడలేడు కదా. మేడ మీద నుండి సెందిర సేగరన్ నిచ్చెన బాగోతం అంతా నీలవేణి వాళ్ళ నాన్న రాజనాల చూసేసాడు.

    ఒక రోజు సెంది కాలేజీకి వెళుతుండగా గానుగ చెట్టు కింద కాపు కాసి, సైకిలుకి అడ్డు నిలుచున్నాడు. ఒరేయ్ అబ్బాయ్, ఇదే చెప్తున్నాను విను, ఇంకొకసారి మా అమ్మాయికేసి చూసిన మా ప్రహరీ గోడకి నిచ్చెన వేసిన నూటారో గడిలో పాము మింగినట్టు మింగేస్తాను ఏమనుకుంటున్నావో. జాగ్రత్త అని చెప్పి అంతర్ధానమయ్యాడు.

    ఆ భయంతో సెంది గోడ జోలికి పోలేదు. రాజనాల గారి ఇంటి ముందు తల ఎత్తేవాడు కాదు. బామ్మగారు పిల్లిని ఏ కుంకబోడి కుక్కో నోటకరుచుకు పోయింది అనుకున్నారు. నీలవేణి, సెంది మాత్రం అభినందన సినిమాలో కార్తీక్, శోభనలా విరహ గీతాలతో కాలం గడిపేస్తున్నారు.

    ఒక రోజు పక్క ఊరిలో పెళ్లికని బామ్మగారు ఎల్. విజయలక్ష్మి గారు, నీలవేణి వాళ్ళ అమ్మ బాల సరస్వతి గారు, నీలవేణి బయలుదేరారు. సెందిర వాళ్ళ చుట్టాలు ఇంటికి చూరు వేసుకుంటున్నాం నిచ్చెన పట్రమ్మని కబురు చేశారు. నిచ్చెనను సైకిలుకి కట్టుకుని బయలుదేరాడు సెంది. పక్క ఊరికి వెళ్లాలంటే సన్నని పంట కాలువ దాటి పోవాలి, అడ్డంగా బద్దలుగా నరికిన తాటిచెట్లే ఆ ఊరికి ఈ ఊరికి వారధి. నీలవేణి, బామ్మగారు వంతెన దాటుతుండగా చెక్క చీకి పోవడం వలన విరిగి ఇద్దరు కాలువలో పడిపోయారు. అది చూసి, బాల సరస్వతిగారు భయంతో కాపాడండి కాపాడండి అని కేకలు పెట్టారు. అటుగా వెళ్తున్న సెందిర సేగరన్ ఆ కేకలు విని పరిగెత్తుకు వచ్చాడు. నీటి ఉధృతికి బామ్మగారు, నీలవేణి కొట్టుకుపోతూ కనిపించారు. నీళ్ళ లోకి దూకి వాళ్ళని కాపాడదామని రెండు అంగలు వెనక్కి వేసాడు. ఒక అడుగు ముందుకు వెయ్యగానే తనకు ఈత రాదన్న సంగతి జ్ఞప్తికి వచ్చింది. ఇప్పుడు ఎలా ? నీలవేణిని, బామ్మగారిని ఎలా కాపాడుకోవాలి ? ఇంతలో అతని బుర్రలో ఒక ఆలోచన మెరుపులా మెరిసింది. తన సైకిల్ వైపు పరుగెత్తాడు. సైకిలుని తీసుకుని వేగంగా బామ్మగారిని, నీలవేణిని దాటుకుని ముందుకు పోయాడు. సైకిలుకి కట్టి ఉన్న నిచ్చెన తీసి పంట కాలువకు అడ్డంగా వేసి దాని మీద పడుకున్నాడు. తన చేతిని బామ్మ గారికి కాలిని నీలవేణికి చాపి గట్టిగా పట్టుకోమని చెప్పాడు. సెంది కాలు పట్టుకుని నీలవేణి నిచ్చెన పైకి ఆ పై ఒడ్డుపైకి చేరింది. బామ్మ గారిని సెంది క్షేమంగా బయటకు లాగాడు. దూరంగా ఇదంతా చూస్తున్న బాల సరస్వతి గారు ఊపిరి పీల్చుకున్నారు.

    బాల సరస్వతి ద్వారా విషయం తెలుసుకున్న రాజనాల సెందికి కృతజ్ఞతలు చెప్పి తన CA ఫైనల్ పరీక్షలు ఫస్టు క్లాసులో పాస్ అయ్యాక వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి తన మాగాణి వాళ్ళకి అప్పజెప్తానని ప్రమాణం చేశాడు .

    పెళ్ళికి ఇంకొక వారం రోజులుందనగా….

    వరి పైరు గాలి వాటానికి కొండపల్లి బొమ్మలా కదులుతోంది. పొలం మధ్యలో పదడుగుల ఎత్తున వెచ్చటి గడ్డిపై ధవళ వర్ణ దుప్పటితో అమరిన మంచె సేద తీరుస్తోంది, వివిధ భారతిలో వస్తున్న జార్జ్ మైఖేల్ కేర్లెస్ విస్పర్ పాట వీనుల విందు చేస్తోంది. నీలవేణి ఒళ్ళో తల పెట్టుకుని తను చుట్టిచ్చిన చిలకలు తింటూ అధరాలు పండించుకున్నారు..ఇద్దరు.

    ( డ్రోన్ కెమెరా మంచె నుంచి దూరంగా జూమ్ అవుట్ షాట్ తీసింది ).

    కథ కంచికి మనం నిచ్చెన కిందికి. మళ్ళీ కలుద్దాం.

    అంత వరకు,

    సే-లవ్.

  • నా ఇరాన్ యాత్ర -2

    నా ఇరాన్ యాత్ర -2

    నా ఇరాన్ యాత్ర -2

    గత సంచిక తరువాయి.

    లోపలికి ఎంటర్ అయ్యాము. ఒక పెద్ద టేబులు . imposing సెట్ అప్. డైరెక్టర్ కు ఇంగ్షీషు రాదు . మాకు ఫార్శి రాదు .

    మా లాయర్ తర్జుమా చేయాలి. అతడు 30 సెకండ్లు విని మాకు రెండు ముక్కలు చెప్పేవాడు. నాకు చిరాకు. అంతసేపు విని మాకు రెండు ముక్కలు చెప్తే మిగతావి మింగేసాడా అనే అనుమానం. చివరాఖరకి పోర్ట్ కు బయలు దేరాం.

    పెద్ద పెద్ద గోడౌన్ లలో గోధుమలు బియ్యం నిల్వలు చూసాను . మన FCIగోడౌన్లు లాగే ఉన్నాయి. తలుపులు సరిగ్గా మూయకుండా, ఎలుకలు , పంది కొక్కులు వగైరా స్వైర విహారం etc . మొత్తం పని కానిచ్చి పోర్ట్ నుండి బయట పడ్డాము.. వాళ్ళ రైల్వే వ్యాగన్లు వేరే గా ఉన్నాయి. మన వాగన్ లు నయమని పించాయి. మాతో వచ్చిన లాయర్ ఇక్కడే మా కజిన్ ఉన్నారు. వెళ్ళి టి తాగి అక్కడనుండి Mashaad కు వెళ్లిపోదాం ఆనాడు. మేము సరే అన్నాము. 20 నిమిషాల వెళ్ళిన తర్వాత ఓ ఇంటి ముందు ఆగాము. పెద్ద ఇల్లు. లోపలికి వెళ్ళగానే చాలా పెద్ద డ్రాయింగ్ రూమ్. 60 x 40 ఫీట్. చుట్టూతా గోడలకు ఆనించి చక్కటి కుర్చీలు. మధ్యలో సోఫాలు. చివరన పెద్ద tv . లోపల ఓ పది మంది ఆడ లేడీసులు tv లో ఏదో చూస్తున్నారు. నేను ఏదో తేడా గా ఉంది అని పసి కట్టా. ఇంతలో మమ్ములను చూసి వాళ్ళందరు లోపలికి వెళ్లిపోయారు.. వాళ్ళు ఏక్తా కపూర్ సీరియల్ స్టార్ tv లో, పార్శీ డబ్బింగ్ లో చూస్తున్నారు అని తెలిసింది ..

    ఆహా! ఏక్తా కపూర్ కీర్తి ఖండాంతరాలకు పాకి పోయిందని.. నా ఛాతీ ఉప్పొంగి పోయింది .

    టి తాగిన తర్వాత, మా లాయర్ ఇక్కడే 10 కిమీ లో ఇరాక్ బోర్డర్ ఉంది . అక్కడ షాపింగ్ బాగుంటుంది . క్రాస్ చేసి వెళ్ళి వద్దాము . ఇక్కడ మామూలే అని అన్నాడు. నేను సరే అన్నా. మా బాసు.. వద్దు మోహిద్దీన్ జి .. ఏదైనా అయితే కష్టం. Passport లు అవీ confiscate అయిపోతాయి అని వారించాడు. నేను కూడా నిజం కదా అని అలోచించి సాయంత్రం 6 కల్ల మషాద్ చేరుకొని, మళ్ళా ఆ తుక్కు బోయింగ్ లో టెహరాన్ చేరాం.

    మర్నాడు ఒక పెన్షన్ ఫండ్ టీం ను కలిసాము. ఒక అజర్‌బైజానీ, ఒక కజఖ్, ఒక ఇరానీ. వాళ్ళకు ఇంగ్షీషు రాదు . మాకు ఇంగ్షీషు తప్పించి ఏది రాదు. ఎలాగోలా మీటింగ్ అవ్వగోట్టి లంచ్ కోసం టెహరాన్ క్లబ్ లో ఉన్న ఒక exclusive restaurant కు వెళ్ళాము. Chello కబాబ్ , saffron రైస్. అక్కడ అందరు డ్రై గా తింటున్నారు. మనకా గ్రేవీ లు కావాలి. కబాబ్ లు టేస్టీ గా ఉన్నాయి.

    మర్నాడు 4 గంటలకు చెక్ అవుట్. ఈవెనింగ్ ఫ్లయిట్ కు దుబాయి.

    హోటల్ నుండి బయలుదేరి ఎయిర్‌పోర్టు కు బయలుదేరాము. ట్రాఫిక్ జామ్‌లు. . ఒక్క పోలీసు లేడు . హైదరాబాద్ లో అందరు సిగ్నల్ లేని చోట గుమి గూడతారే అలాగే అక్కడ కూడా. ఎయిర్‌పోర్టు చేరు తుండగా డ్రైవరు మీరు cip టెర్మినల్ కు వెళ్ళాలా లేక general టెర్మినల్ కా అని అడిగాడు. నేను బాసు మొఖాలు చూసుకొన్నాం. నేను emirates first క్లాస్ అని చెప్పా. ఓహో ! మీరు cip అన్నాడు. Vip విన్నాను. Cip అంటే ఏమిటి అన్నా ? commercially important person ఆట. తెగ నవ్వాము. టెర్మినల్ వచ్చింది . చక్కటి ఇరానీ అమ్మాయిలు మమ్మల్ని గ్రీట్ చేసి మా passports + సామాన్లు లాక్కొని మాకు ఒక అమ్మాయిని తోడిచ్చి lounge కు పంపారు . అక్కడ తిండి తిని కబుర్లు చెప్పుకొంటూ ఉండగా .. చివరన ఆ అమ్మాయి వచ్చి మమ్ములను తోడుకొని పోయి అప్పటికే అక్కడ ఉన్న ఇమ్మిగ్రేషన్ లో స్టాంప్ అయిపోయిన మా passports +టిక్కెట్లు ఇచ్చి, ఇమ్మిగ్రేషన్ లో special passage గుండా బయటకు తీసుకొని వచ్చింది. ఏదో వాకీ టాకీ లో చెప్పింది .S క్లాస్ బెంజ్ కారు మా ముందు ఆగింది. నేను ఎంటబ్బా అని చూస్తున్నా ! అమ్మాయి కార్ తలుపు తీసి మమ్ములను ఎక్క మంది.. సర్రున కారు tarmac పై దూసుకొని వెళ్ళి emirates ఫ్లయిట్ మెట్ల దగ్గిర ఆగింది. అమ్మాయి కారు దిగి , తల వంచి అభివందనం చేసింది. Come again to Iran అని చెప్పి, మేము plane లోపలి కి వెళ్ళిన తర్వాత వెళ్లిపోయింది. Tarmac పై ఉన్న ప్లేన్ వరకు కార్లో అంటే మాటలా! రియల్ vip ల్లా ఫీల్ అయ్యాము.

    మొత్తానికి అలా జరిగింది నా ఇరాన్ యాత్ర!

    Ps : టెహరాన్ ప్రతి రోడ్డు జంక్షన్ లో చూడ చక్కని గులాబీ మొక్కలు, గులాబీ creepers.