
Blog
-
కమలాప్తకుల.. కలశాబ్ధిచంద్ర…
కమలాప్తకుల
కలశాబ్ధిచంద్ర
కావవయ్యనన్ను
కరుణాసముద్ర
కమలాకళత్ర
కౌసల్యాసుపుత్ర
కమనీయగాత్ర
కామారిమిత్ర
మునుదాసులబ్రోచినదెల్ల చాలా విని
నీచరణాశ్రితుడైతినయ్య
కనికరంబుతో
నాకభయమీయుమయ్య
వనజలోచన
శ్రీత్యాగరాజనుత
కమలాప్తకుల — కమలాలకు ఆప్తుడైన సూర్యునివంశంలో పుట్టినవాడవు
క్వ సూర్యప్రభవో వంశః క్వచాల్పవిషయామతిః
తితీర్షుర్దుస్తరం మోహాదుడుపేనాస్మి సాగరం
నాకేం రాదు.. ఎట్ల చెప్తనో.. అని చెప్పినరు కద..
అదే సూర్యవంశం.. అదే పరిస్థితి..
నెక్స్టు?
కలశాబ్ధిచంద్ర
అబ్ధి అంటే సముద్రం.. కలశం అంటే కుండ.. కలశాబ్ధి అంటే పాలసముద్రమట.. అదెట్ల అనేది ఆలోచిస్తూ ఉన్న.. కలశాబ్ధిచంద్ర అంటే పాలసముద్రంలో ఉండే చంద్రుని వంటి వాడని..
అదేందది పాలసముద్రంలో ఉండే చంద్రుడు??
కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్
ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో ధృఢవ్రతః
అని వాల్మీకివారడిగినపుడు
బహవో దుర్లభాశ్చైవ యే త్వయా కీర్తితా గుణాః
మునే వక్ష్యామ్యహం బుధ్వా తైర్యుక్తః శ్రూయతాం నరః
అని మొదలుపెట్టి నారదులవారు.. క్వాలిటీస్ చెప్తూ…
విష్ణునా సదృశో వీర్యే సోమవత్ ప్రియదర్శనః
కాలాగ్ని సదృశః క్రోధే క్షమయా పృథివీ సమః
అని చెప్తరు..
వీరత్వములో విష్ణువులెక్క..
చూసేటందుకు చంద్రునిలెక్క..
ఉంటడని..
ఆ చంద్రునిలెక్క ఉండేటాయన పాలసముద్రంలో ఉన్నడంట..
అందుకు కలశాబ్ధిచంద్ర…
కావవయ్య నన్ను… ఇది ఈజీగా అర్థమైతది..
కరుణాసముద్ర… సముద్రమంతటి కరుణ కల్గిన వాడా.. కాపాడాల్సింది నువ్వే..
నన్ను కాపాడాలంటే సముద్రమంత కరుణ కావాల్నా అంటే..
నేంజేసే తప్పులట్లుంటై మరి..
యదహ్నాత్ కురుతే పాపం తదహ్నాత్ ప్రతిముచ్యతే
యద్రాత్రియాత్ కురుతే పాపం తద్రాత్రియాత్ ప్రతిముచ్యతే
అని చెప్పినా ఇంకా ఉంటై…
అమర్యాదః క్షుద్రః చలమతిః అసూయాప్రసవభూః
కృతఘ్నః దుర్మానీ స్మరపరవశః వంచనపరః
నృశంసో పాపిష్టః
అని ఓ దగ్గర చెప్తరు…
అట్లాంటి నన్ను ఏం అనకుండ ఉండాలంటే కనీసం సముద్రమంత కరుణ ఐనా ఉండాలి…
ఆల్రెడీ చెప్పినరు కద.. క్షమయా పృథివీ సమః అని…
ఓకే ఓకే.. నెక్స్టేమి?
కమలాకళత్ర.. కళత్ర అంటే భార్య అని.. కమల అంటే లక్ష్మీదేవి అని.. లక్ష్మీదేవిని భార్యగా కల్గినవాడా..
రావణున్ని చంపుదామని ఇద్దరు కలిసి కిందకొస్తిరి… వనవాసానికి పోయినాకైనా ఒచ్చిన పని చేస్తవనుకున్నది.. పదమూడేండ్లు వనవాసం ఐనా ఇంకొన్నేండ్లు నీతోనే ఉంటే బాగుండు అయోధ్య కంటే ఇక్కణ్ణే బాగుంది అంటున్నవు… నువ్ మాట వినవని తానే పోయి రావణుని జైలుల కుచునింది.. అట్ల నీకు ధర్మం గుర్తుచేసిందే… ఆవిడ భర్తవి నువ్వు… కమలాకళత్ర…
ఆయనెవరో కష్టాల్లో ఉన్నరని మీ సహాధ్యాయి అని మీ దగ్గరకొస్తే ఆయన తెచ్చిన అటుకుల మూటమీదనే దృష్టి ఉంచిన మీరు, అవి ఓ గుప్పెడు నోట్ల ఏసుకుని బాగున్నై బాగున్నై అని ఇంకో గుప్పెడు నోట్ల ఏస్కుకోబోతుంటే మీ చేయిపట్కుని ఆపి “ఏతావతాలం విశ్వాత్మన్ సర్వసంపత్సమృద్ధయే” అని మీకు ధర్మం గుర్తుచేసిందే.. ఆవిడ భర్తవి నువ్వు… కమలాకళత్ర…
నెక్స్టేమి??
కౌసల్యాసుపుత్రా.. కౌసల్యకు కొడుకైనవాడా..
అదెందుకట్ల స్పెషల్గా కౌసల్య కొడుకనడం…
పొద్దు పొద్దున రేడియోలో (ఐ మీన్ ఫోన్లో) ఒచ్చేదాన్లో కూడా..
కౌసల్యాసుప్రజా రామ
పూర్వాసంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ఠ నరశార్దూల
కర్తవ్యం దైవమాహ్నికం
అని చెప్తరే..
విశ్వామిత్రునికి, దశరథునికి డిస్కషను జరుగుతున్నపుడు, మా వాడు చిన్నపిలగాడు నేనొస్త మీ యాగ సంరక్షణకి అని దశరథుడి చెప్తున్నపుడు వెనక రూంలో మావాడు క్షేమంగా పోయి పని చేసుకుని రావాలని విహారయాత్రకి కావల్సిన సబ్బు, షాంపూ సర్ది
కృతస్వస్త్యయనం మాత్రా పిత్రా దశరథేన చ
పురోధసా వసిష్ఠేన మంగళైరభిమంత్రిత్రం
నవ్వుకుంటూ పంపించింది..
అని..
అట్ల కొడుకుని నమ్మి నవ్వుకుంటూ పంపిందని గుర్తుచేసుకుంటూ “కౌసల్యా సుప్రజా రామ”..
అది సరే.. కౌసల్యకి ఎట్ల తెలుసు??
అందరు కొడుకులు వారి వారి సకల కళా నైపుణ్యాలని అమ్మల ముందే చూపిస్తరు కద..
సా తత్ర దదృశే విశ్వం జగత్-స్థాస్త్ను చ ఖం దిశః
సాద్రిద్వీపాబ్ధి భూగోళం సవాయ్వగ్నీందుతారకం
అని ఒకాయన వాళ్ళమ్మకి టాలెంటంతా చూపిస్తరు కద.. అట్ల ఈయనా ఎమైన చూపించినరేమో.. అందుకే అంత ధైర్యంగా పంపించిందేమో..
సరే సరే.. చాలాదూరమొచ్చినము కద…మల్ల వెనక్కి పోయి చూద్దము.. ఎక్కడ ఆగింది అని..
కమలా కళత్ర, కౌసల్య సుపుత్ర… తరవాత.. కమనీయగాత్ర.. కామారి మిత్ర…
కమనీయగాత్రం అంటే??
గాత్రం అంటే గొంతని కద… వారు బాగా పాడతరనా??
ఒకాయన ఫ్లూట్ వాయిస్తరని ఉంది కాని, ఈయన పాడతరని ఎక్కడా లేదు..
ఏమో.. ఎక్కడైన ఉండొచ్చును.. నాక్కనపడలేదు..
ఓ సారి కమనీయగాత్రం అనే దానికి ఇంకేమన్న అర్థాలున్నయా, అదే ప్రయోగం ఇంకెక్కడైనా ఉందా అని చూస్తే
సుబ్రహ్మణ్య పంచరత్నంలో..
జాజ్వల్యమానం సురబృందవంద్యం కుమారధారాతటమందిరస్థం
కందర్పరూపం కమనీయగాత్రం బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే
అని…
సో.. కమనీయగాత్ర అనేది బాగపాడతరనే ఉద్దేశంలో కాదని తెలిసింది..
కమనీయ, రమనీయ, పూజనీయ, మహనీయ, విశ్వసనీయ (సారీ) లాంటి పదాలు వినింటరు..
కమనీయ అంటే మనోహరమైన అని గాత్రం అంటే శరీరం అని చెప్తుంది ఆంధ్రభారతి…గచ్ఛతి అనేన గాత్రం అని..
రమనీయ అని ఉన్నా ఠక్కుమని వెలిగేదేమో..
రమంతే సర్వే గుణైః అస్మిన్ ఇతి రామః అని…
బయ్ ద వే రమనీయగాత్ర అని కూడా చాల చోట్ల ప్రయోగం ఉంది…
పవనజస్తుతిపాత్ర
పావనచరిత్ర
రవిసోమవరనేత్ర
రమనీయగాత్ర
అని..
ఊరూరికే డైవర్ట్ ఐతున్నమా?? సరే సరే.. వెనక్కొద్దము…
కమలాకళత్ర, కౌసల్యాసుపుత్ర, కమనీయగాత్ర… నెక్స్టు.. కామారిమిత్ర..
కామున్ని తీసి దిబ్బక్కొట్టి బూడిద చేసినడే ఒకాయన…
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామతత్తుల్యం రామ నామ వరాననే
అని చెప్పినడే ఒకాయన..
ఆయనకి మిత్రుడని..
అద్సరే.. ఏం అడ్డం అండీ కామము…
యస్యసర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః
జ్ఞానాగ్నిదగ్ధకర్మాణాం తమాహుః పండితం బుధాః
అన్నడు కద..
కామాన్ని తీసి దిబ్బక్కొట్టినంకనే నీ మిత్రత్వం కలుగుతదని తెలుసు…
తీసి దిబ్బక్కొట్టిన.. నాక్ చేతనైంది నేన్ చేసిన.. ఇంక నీ ఇష్టం..
అదంతా ఓకేనండీ…కమలాప్తకుల, కలశాబ్ధిచంద్ర, కరుణాసముద్ర, కమలాకళత్ర, కౌసల్యాసుపుత్ర, కమనీయగాత్ర, కామారిమిత్ర…
ఏం చేయాలంట ఇపుడు?
కావవయ్య నన్ను…
కాపాడాలంట..
ఎందుకంట?
నీ చరణాశ్రితుడైతిని…
నీ కాళ్ళు పట్కున్నందుకు కాపాడాలంట..
ఎందుకయ్యా పట్కున్నవు కాళ్ళు??
మునుదాసుల బ్రోచినదెల్ల చాలా విని..
ఏం విన్నవు??
దిక్కులు గెలిచితి నన్నియు
దిక్కెవ్వడు రోరి నీకు దేవేంద్రాదుల్
దిక్కుల రాజులు వేరొక
దిక్కెరుగక కొలుతురితడే దిక్కని నన్నున్అని ఒకాయన చిన్న పిల్లగాన్ని సతాయిస్తుంటే..
దిక్కులు కాలముతోనే
దిక్కునలేకుండుగలుగు దిక్కుల మొదలై
దిక్కుగల లేని వారికి
దిక్కయ్యెడు వాడు దిక్కు మహాత్మాఅని ఆ పిల్లగాడు చెప్పేటంత ధైర్యం ఇచ్చినవే… అది విన్న..
నీ మరిది మీద బాణాల మీద బాణాలు ఇంత గాపు లేకుండ ఏస్తుంటే నీకు సహనం సచ్హిపోయి ఆయన మీదకి చక్రం ఎత్తితే…
కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి
గగనభాగంబెల్ల గప్పికొనగ
ఉరికిననోర్వక ఉదరంబులోనున్న
జగములవ్రేగున జగతిగదల
చక్రంబు చేపట్టి చనుదెంచి రయమున
పైనున్న పచ్చని పటముజార
నమ్మితి నాలావు నగుబాటు సేయక
మన్నింపుమని క్రీడి మరల దిగువకరికి లంఘించు సిమ్హంబు కరణి మెరసి
నేడు భీష్ముని జంపుదు నిన్నుగాతు
విడువుమర్జున అనుచు మద్విశిఖ వృష్టిన్
దెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకుఅని చెప్పినడే… అది విన్న..
ఓ ఏనుగు ఊరికే ఉండకుండ పోయి మొసలితో గొడవపెట్కుని అది తెలుగు సీరియల్ల లాగా సాగి సాగి, దానికి కూసంత జ్ఞానంగల్గి
ఎవ్వనిచేజనించు జగమెవ్వని లోపలనుండు లీనమై
యెవ్వనియందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూలకారణం
బెవ్వడనాది మధ్యలయుండెవ్వడు సర్వముదానైన వా
డెవ్వడు వాని నాత్మభవునీశ్వరునిన్ వేడెదన్లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె ప్రాణంబులున్
ఠావుల్ తప్పెను మూర్ఛ ఒచ్చె తనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్
నీవేతప్ప నితఃపరం బెరుగ మన్నింపతగున్ దీనునిన్
రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మకాఅనంగానే..
సిరికింజెప్పడు శంఖచక్రయుగము చేబూని సంధింపడే
పరివారంబునుజీరడు అభ్రగపతింపన్నింపడాకర్ణికాం
తర ధమ్మిల్లము చక్కనొత్తడు వివాదప్రోత్థిత శ్రీ కుచో
పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియైఒంటి మీద సోయ లేకుండ పరిగెత్తి పోయినవే… అదీ విన్న..
ఇపుడేమంటవైతే?
మును దాసుల బ్రోచినదెల్ల చాలా విని..
విని??
నీ చరణాశ్రితుడనతిని..
ఐతివా..
సరె…
త్యాగరాజనుత… త్యాగరాజు దండం పెట్కునేవాడా…
హా.. వింటున్న…
వనజలోచన.. తామరాకులంత కండ్లున్నవాడా.. నా కష్టాల్ కనిపిస్తలేవ..
కనికరంబుతో నాకభయమీయుమయ్య..
తొందరగా ఒచ్చి అభయమీయి…
నేనెందుకిస్త అభయం అని అనకూడదు నువ్వు..
గుర్తుంది కద అపుడు ఏం చెప్పినవో…
సకృదేవప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే
అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమపలికెడిది భాగవతమట
పలికించెడి వాడు రామభద్రుండట నే
పలికిన భవహరమగునట
పలికెద వేరొండు గాథ పలుకగనేలా
-
మ్యాట్ని!
మ్యాట్ని !((ఈరోజు శనివారం, శెలవు రోజు! ఇంట్లో మ్యాట్ని ప్రోగ్రాం జరగాల్సిందే!))
అంతా చీకటిగా వుంది, ఎక్కడో కాలింగ్ బెల్ మోగుతున్న శబ్దం వినిపించి, లేచి గడియారం చూస్తే తెల్లవారు ఝాము 5 అవుతోంది. మళ్ళీ కాలింగ్ బెల్ రెండు సార్లు వినిపించింది. ఇంత పొద్దున్నే ‘ఎవరా?’ అనుకుంటూ పక్కనే వున్న భర్తని లేపింది. అతను గడియారం చూసి, “తెల్లవారుతోంది కదా, నువ్వే వెళ్ళి చూడు”, అని పక్కకి తిరిగి పడుకున్నాడు.
ఇంకా కాలింగ్ బెల్, దబదబా తలుపులు మార్చి మార్చి మ్రోగుతూనే ఉన్నాయి. ఇక తప్పదు అనుకుంటూ బట్టలు సరిచేసుకుని, జుట్టు ముడి పెట్టుకుంటూ మంచం దిగి హాల్ వైపు అడుగులు వేసింది. కాలింగ్ బెల్ మళ్ళీ మొగింది. “ఎవరూ? వచ్చే, వచ్చే!” హెచ్చు గొంతుతూ అంటూ, హాలులో వున్న దేవుడి పటానికి దణ్ణం పెట్టుకుంటూ గడియ తీసింది.
గుమ్మం ముందు మొహానికి చిన్న ట్రావెల్ బాగ్ అడ్డం పెట్టుకుని నిలుచుని వున్న ఆకారం ఎవరా? అని పరిశీలనగా చూసింది. బాగ్ వెనుకనుండి “అక్కా! నేనే వచ్చా!” అని తమ్ముడు రామకృష్ణ గొంతు వినపడింది. పార్వతికి ఒకింత ఆశ్చర్యంతో, సంతోషంతో తలుపు బార్లా తీస్తూ “ఏరా! వచ్చావా? ఊడి పడ్డావా?” అంటూ తమ్ముడు లోపలికి రావడానికి వీలుగా పక్కకి జ రుగుతూ, “ముందు లోపలికి రా రా! చలిగా వుంది. అయినా వచ్చే ముందు ఫోన్ చెయొచ్చుగా?”.రామకృష్ణ చెప్పులు గుమ్మం బయట పక్కగా విడిచి లోపలికి వస్తూ “బావ గారు లేచారా?”. ‘లేదు’, అన్నట్టుగా తల అడ్డంగా ఊపుతూ తలుపు వేసి గడియ పెట్టింది. సోఫా పక్కనే బాగ్ పెడుతున్న తమ్ముడితో, “బట్టలు మార్చుకుని రా రా! వేడి వేడి కాఫీ ఇస్తాను” అంటూ లోపలికి వెళ్ళింది.
పార్వతి రెండు కప్పులతో కాఫీలు తీసుకుని వచ్చే సరికి, రామకృష్ణ బట్టలు మార్చుకుని, సోఫాలో కూర్చుని వున్నాడు. ఒక కప్పు తమ్ముడికి ఇచ్చి, సోఫా కి దగ్గిరగా కుర్చి లాక్కుని, ఇప్పుడు చెప్పు అన్నట్టు చూసింది. రామకృష్ణ కాఫీని ఆఘ్రాణిస్తూ, “ఆహా! నీ చేతి కాఫీ అధ్బుతం.” కాఫీ రెండు గుక్కలు తాగి, “ఏమీ లేదక్కా! చాలా రోజులు అయ్యింది, ఒక సారి చూసి పోదామని వచ్చా”,
మళ్ళీ కాఫీ కొంచెం ఎక్కువగా తీసుకుంటూ. పార్వతి, “సంతోషం! ఒక్కడివే వచ్చావే?” అని అడిగింది.
రామకృష్ణ తాగుతున్న కాఫీ కప్పు పక్కన పెడుతూ ” ఓ! అదా! నీ మరదలు వాళ్ళ పుట్టింటికి, నేను నా పుట్టింటికి. రేపు నేను అక్కడికి వెళ్ళి, ఎల్లుండి పొద్దునే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాము.”
పార్వతి కుర్చీలో సర్దుకుంటూ, “అయ్యో! తనని కూడా తీసుకువస్తే బావుండేది. నువ్వు వెళ్ళేటప్పుడు, తన జాకెట్లు రెండు ఇక్కడే వుండిపోయాయి, మర్చిఫొకుండా తీసుకు వెళ్ళు.”
రామకృష్ణ మళ్ళీ కాఫీ కప్పు తీసుకుంటూ “ఈ సారి, ఇలా వచ్చి అలా వెళతాములే. ఇంకా ఏంటి అక్కా విశేషాలు?”.
పార్వతి కుర్చిలోంచి లేచి, ఖాళీ అయిన కప్పులు తీస్తూ, “నువ్వు ఆ రెండో బెడ్ రూం లో కాసేపు పడుకో. శనివారమేగా, పని హడావిడి ఏమీ లేదు, తరువా త మాట్లాడు కుందాము”.
అక్కని ఆశ్చర్యంగా చూస్తూ, “పొద్దునే లేచి, దేవుళ్ళకి మేలుకొలుపు పాడే నువ్వా? ఇంకా పడుకో అంటున్నావు, అంతా కాల మహిమ” అంటూ సోఫాలో నుండి లేచాడు.
తమ్ముడిని చూసి, పెదవి విరుస్తూ “ఏం చేస్తాం? కరోనా తర్వాత కొత్తరకం కష్టాలు వచ్చిపడ్డాయి. ఈరోజు వుంటావుగా? నీకే తెలుస్తుంది” అంటూ తన బెడ్ రూం లోకి దారి తీసింది. అక్క వైపు కొంచెం అనుమానంగా చూస్తూ రెండో బెడ్ రూం లోకి దారి తీసాడు.
===== ****** ======
కప్పు భళ్ళున పడిన శబ్దంతో చటుక్కున కళ్ళూ తెరిచాడు రామకృష్ణ. గడియారం 11 గంటలు చూపిస్తోంది. మంచం మీదనుండి లేచి కూర్చుంటూ వుండగా, వంటింట్లోంచి కొంచెం గొంతు తగ్గించి మాట్లాడుకుంటున్నాయి అక్కా బావల గొంతులు.
రామకృష్ణ కిచెన్ వైపు నడుస్తుండగా, పార్వతి గొంతు వినిపించింది “కప్పు పడిన శబ్దానికి వాడు లేచే వుంటాడు. ఇంకా మాట్లాడకండి”. న్యూస్ పేపర్ మడతపెడుతున్న గుసగుసలో బావ గొంతు “ఈరోజు శనివారం, శెలవు రోజు, ఇంట్లో మ్యాట్ని సంగతి ఏంటి?”
పార్వతి భర్తకి దగ్గిరగా జరుగుతూ “చీ ఊరుకోండి. ఈరోజు మ్యాట్ని లేదు, గీటిని లేదు. వాడు ఇంట్లో వుండగా అలాంటి పనులు ఏంటి? అసహ్యంగా?”
అప్పుడే కిచెన్ లోకి వస్తున్న రామకృష్ణ “నమస్కారం బావగారు! ఏదో మాట్ని అంటున్నారు, ఇక్కడ దగ్గిరలో ఏమైనా కొత్త థియేటర్స్ తెరిచారా? చాలా రోజులు అయ్యింది హాల్ లో సినిమా చూసి, నేను కూడా వస్తా పదండి” .
పార్వతి చేతిలో వున్న గరిట భర్త మరియు తమ్ముడి మొహం మీద తిప్పుతూ “సినిమా లేదు, గినిమా లేదు.” అని తమ్ముడి వైపు తిరిగి “ఇక్కడ థియేటర్స్ ఓపన్ చెయ్యలేదు. ఆయన చేప్పేది వినకు.”
పార్వతి భర్త, పేపర్ మడిచి పక్కన పడేసి, భార్యని చూస్తూ, “మ్యాట్ని పడాల్సిందే! .” రామకృష్ణ కొంచెం ఆశ్చర్యంగా ఇద్దరిని చూసాడు. పార్వతి విసుక్కుంటూ “ఏంటండి ఇది. వాడి ముందు ఇలాంటి పనులు చేస్తే మీకే పరువు తక్కువ. ఈ వయసులో మీకు ఇలాంటి వేషాలు ??”
ఇదేదో చిత్రమైనా వ్యవహారాంలా వుందే అనుంకుంటూ, రామకృష్ణ అక్కతో “ఏంటి అక్కా? గంగా మహేష్ అనే పేరుగల బావగారు, ఎవరైనా చిన్న ఇల్లు, ఏమైనా…? “అంటూ నీళ్ళు నమిలాడు.
పార్వతి భర్తను చూస్తూ “నా అదృష్టం కొద్దీ, మీ బావగారి పేరులోనే నాకు సవతి వుంది గాని, వూరిలో లేదు”. అని, భర్తను బయటకు నెట్టుతున్నట్టుగా తోసింది.
తమ్ముడి వైపు తిరిగి “ఒరే, నువ్వు స్నానం చేసి రా, అందరం భోజనం చేసేద్దాం. నీకిష్టమైన గుత్తి వంకాయ కూర!” .
వంటింటి గుమ్మం దాటుతూ పార్వతి భర్త “మరో మాట లేదు, మ్యాట్ని ప్రోగ్రాం జరగాల్సిందే!, ” అని హుకుం జారి చేసి వెళ్ళిపోయాడు. ప్రశ్నార్ధంగా చూస్తున్న తమ్ముడి మొహంలోకి చూడలేక, పార్వతి తలదించుకుంది.
భోజనాలు ముగించేసరికి ఒంటిగంటన్నర అయ్యింది. అంతా భోజనాలు చేసిన తరువాత శుభ్రం చేసే పని వుందని లోపలికి వెళ్ళింది పార్వతి.. బావ మరుదులు ఇద్దరూ పిచ్చా పాటి మాట్లాడు కుంటూ కూర్చున్నారు.
ఇంతలో బావగారి మొబైల్ ఫోన్ మోగింది. ఫోన్ చేతిలోకి తీసుకు, కట్ చేసి రామకృష్ణ ని చూస్తూ ” కాల్ కాదులే, అది అలార్మ్ ! మ్యాట్ని టైం అయ్యింది .”, అని కిచెన్ వైపుకు చూస్తూ “పా రూ! “రెడీనా?”, అంటూ ఉత్సాహంగా కేక పెట్టాడు. గంగామహేష్ ఇప్పుడే వస్తా అని,, అంతకు ముందు రామకృష్ణ రెస్ట్ తీసుకుని వచ్చిన గదిలో వెళ్ళాడు. ఏమీ అర్ధంకాక, పక్కనే వున్న పేపర్ తిరగేస్తూ కూర్చున్నాడు. ఒక పదినిమిషాలా తరువాత గంగామహేష్ బయటకు వచ్చి “రాము, అంతా రెడీ.”, అని కిచెన్ లోకి చూసి “యేయ్ బుక్కింగూ! రెడీనా ?” అని మళ్ళీ గావు కేక పెట్టాడు.
రామకృష్న్ణకి ఇదేమి అర్ధం కాలేదు. గంగా మహేష్ తన బెడ్ రూం లోకి వెళ్ళి, బయటకు వెళ్ళే వాడిలా నీటుగా తయరయి వచ్చాడు. అలా వచ్చిన బావగారిని చూసి, తను కూడా లేస్తూ, “ఒక్క నిమిషం బావగారు, నేను కూడా బట్టలు మార్చుకుని వస్తా” అని లోపలికి వెళ్ళీ జీన్స్ టి షర్ట్ వేసుకుని తల దువ్వుకుని వచ్చాడు.
వేడి నూనేలో శంగపిండి వేగుతున్న వాసన వస్తోంది. చేతిలో గరిటె తో, జిడ్డు కారుతున్న మొఖం తో కిచెన్ లో నుండి వచ్చిన పార్వతి మొఖం చూసి “ఏంట క్కా? నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా?” అన్నాడు రామకృష్ణ అసహనంగా.
ముంజేతి తో మొహం తుడుచుంటూ, తమ్ముడితో, “నువ్వు, మీ బావగారు ఆ ప్రహసనం నడపండి, నాకు వేరే పనుంది”. గంగా మహేష్ ముందుకు వచ్చి భార్యతో, “ఎంటి? మ్యాట్ని మొదలయి పోయిందా? రెండు టికేట్ లు చించు” అన్నాడు. రామాకృష్ణ అక్కా బావలిద్దరిని అయోమయంగా చూసాడు. పార్వతి గంగా మహేష్, రామకృష్ణ ని వుద్దేశించి ” ట్రయిల్ పార్టి నాడుస్తోంది, మీరెళ్ళి కూచోండి, నేను మీ దగ్గరకు వచ్చి టికెట్లు చించుతా!” అంది.
ఈ మాటలు విన్న రామకృష్ణ ఇంకా అయోమయంలో పడిపోయాడు. ఇంతలో గంగా మహేష్, రామకృష్ణ ని “పద, పద” మంటూ తొందరపెడుతూ, ఆ రేండో రూములోకి తీసుకుని వెళ్ళాడు. గదంతా చీకటిగా వుంది, సినిమా థియెటర్ లో లాగ, గోడ మీద ఎల్. ఈ. డీ స్క్రీన్ మీద సూపర్ స్టార్ కృష్ణ నటించిన కౌబాయ్ ఫిల్మ్ ‘మోసగాళ్ళకు మోసగాడూ” టైటిల్ వేసి వుంది. ఆ చీకట్లోనే తడుముకుంటూ, రామకృష్ణ చేతితో లాక్కుంటూ తీసుకెళ్ళి కుర్చిలో కూలేసాడు అతని బావ గంగామహేష్. రిమోట్ తో సినిమా మొదలయ్యింది. రామకృష్ణ కళ్ళు చీకటికి కొద్దిగా అలవాటు పడ్డాయి. టైటిల్స్ పడి, సూపర్ స్టార్ స్క్రీన్ మీద కనపడగానే కయ్యి మని విజిల్ కొట్టాడు, గంగామహేష్. ఆ శబ్దానికి, చెవులో వేలు పెట్టి తిప్పుకుంటూ వుండగా, గది తలుపు మెల్లగా తెరుచుకుంటూ, సన్నని వెలుతురు లోపలికి పడింది. గంగామహేష్, “ఓయ్! తలుపెయ్, తలుపెయ్” అంటూ గట్టిగా అరిచాడు.
తలుపు వేసి లోపలికి వచ్చిన పార్వతి, వీళ్ళిదగ్గిరికి వచ్చి, చీకట్లో కాళ్ళు తొక్కి, గంగామహేష్ అడ్డంగా నిలబడి “టికెట్లకి డబ్బులు తియ్యండి” అంది. గంగామహేష్ పార్వతిని పక్కకితోస్తూ “యెహే! అడ్డం తప్పుకో, ఫైటు మిస్సవుతుంది. కాళ్ళు తొక్కేసి, పైగా అడ్డంగా నిలుచున్నావు” అని విసుక్కుంటూ, ఆమే చేతిలో యాభై రూపాయల నోటు పెట్టాడు, టికెట్లకి డబ్బులు అన్నట్ట్లుగా. ఇప్పుడిప్పుడే, రామకృష్ణ కి కొంచెం కొంచెం అర్ధం అవుతున్నట్లనిపించింది. పార్వతి మెల్లగా తలుపు తీసుకుని వెళ్ళిపోయింది.
రామకృష్ణ కూడా, తన బావగారితో కలిసి సినిమాలో లీనం అయిపోయాడు. పెద్దసౌండుతో, చప్పట్లతో మధ్య మధ్య కామెంట్స్ తో రామకృష్ణ బావగారితో కలిసి సినిమా ఫుల్లుగా ఎంజాయ్ చెయ్యడం మొదలు పెట్టాడు. ఇంకా గంగామహేష్ మరీ రెచ్చిపోయి, “కొట్టు, కాల్చు, దూకు” అంటూ అరుపులతో గదంతా అల్ల కల్లోలం చేస్తున్నడు. రామకృష్ణ కూదా ఉషారెక్కి విజిల్స్ కొట్టడం మోదలు పెట్టాడు. ఏదో పాట వస్తుండగా, తలుపు బార్లా తెరుచుకుంది.
ఉల్లిపాయ పకోడి వాసన గుప్పున కొట్టింది. పార్వతి, “పకోడి, పకోడి, ఉల్లిపాయ పకోడి” అని కేక వెసింది. వీళ్ళీదరికి వచ్చి మొహం మీద అడ్డంగా పకోడిల ప్లేటు పెట్టింది. కమ్మని వాసనకి రామకృష్ణ చెయ్యిపెట్టి తీస్కొబోతే, పళ్ళెం వెనక్కు లాగి “పొట్లం పది రూపాయలు” అంది. మహేష్ రామకృష్ణ తొడ మీద కొట్టి, “ఇరవై ఇచ్చి రెండు పొట్లాలు తీస్కో” అన్నాడు. ఇరవై తీసుకుని, రెండు పొట్లాలు వాళ్ళీదరి చేతిలో పెట్టి, బయటకు వెళుతూ తలుపు కొద్దిగా తెరిచి సినిమా చూడసాగింది. రూం లోపలిని లైటింగ్ పడటంతో ఈ సారి రామకృష్ణ గట్టిగా “తలుపెయ్, తలుపెయ్!” అని అరిచాడు. చుట్టూ చూసుకుని, తనెక్కడ వున్నాడో గ్రహించి సిగ్గుపడ్డాడు.
ఇంకా కొన్ని నిమిషాలలో “విశ్రాంతి” అని స్క్రీన్ మీద చూసి, గంగా మహేష్ లేచి లైటు వేసాడు. ఇద్దరూ కళ్ళూ నులుముటూ బయటకు వచ్చారు. మళ్ళీ సినిఫక్కీలోనే, డబ్బులు ఇచ్చి పార్వతి దగ్గిర ఇలాచి టీ తాగి, లొపలికి వచ్చి కూర్చుని సినిమాలో మునిగిపోయారు. ఒక పదినిమిషాలా తరువాత పార్వతి కూడా చేతిలో పకోడీల పళ్ళెం, టీ వచ్చి వీరితో కలిసి కూరుచుని సినిమా చూడసాగింది. ముగ్గురూ ఫుల్ గా సినిమాలో మునిగిపోయారు.
క్లైమాక్స్ ఫైట్ లో పార్వతి కూడా “ఖయ్యి”మని విజిల్ కొట్టసాగింది. అక్కను అలా చూసి రామకృష్ణ ఆశ్చరపోయాడు. పార్వతి కొంచెం సిగ్గుపడి, మళ్ళీ తేరుకుని విజిల్స్ వెయ్యసాగింది. మహేష్ ఇదేమి పట్టనట్టుగా తన పంధాలో సినిమాని ఎంజాయ్ చేస్తున్నాడు. “శుభం” కార్డు పడినతరువాత, పారతిలేచి లైట్ వేసింది. ముగ్గురూ కళ్ళు నులుముకుంటూ బయటకు వచ్చారు.
ఒకళ్ళని, ఒకళ్ళు చూసుకుని భళ్ళుమని నవ్వుకున్నారు. రామకృష్ణ పారవతి ని చూసి “అక్కా? నువ్వు విజిల్సా? మరీ ఇంత మాస్ గా ఎప్పుడు మారిఫొయావు?.”
.పార్వతి కొద్దిగా సిగ్గు పడుతూ “చిన్నప్పటి కోరిక, ఇలా తీరిందిరా. ” అని భర్తని మురిపెంగా చూస్తూ, మహేష్ చెయ్యిపట్టుకుని, రామకృష్ణని చూస్తూ “రాము! నాకు పుట్టింట్లో చిన్నపుడు సినిమాలు చూసే స్వేచ్చ వుంది కాని, ఒక ఆడ పిల్లకు వుండే కొన్ని కనిపించని కట్టుబాట్లు అలాగే వుండేవి. మగ పిల్లల్లాగా, కేరింతలు కొడుతూ, విజిల్స్ వేస్తూ సినిమా చూడాలని వుండేది. చిన్నాప్పుడు, అమ్మా-నాన్నా తోనె కలిసి వెళ్ళేవాళ్ళం. కాలేజి చదువులప్పుడు, ఇలాంటి సినిమా థియేటర్ వాతావరణం వున్నా, విజిల్స్ కొట్టే స్వేచ్చ వుండేది కాదు. మీ బావగారికి చిన్నప్పుడు ఊరిలో ఇలా చూసినట్టుగా సినిమా చూస్తేనే మజా! మల్టిప్లెక్సులు, వయసు వచ్చాకా, ఆ సరదా పోయింది. అలాగే నాకు కూడా హాల్లో కామెంట్స్ చేస్తూ, విజిల్ కొడుతూ సినిమా చూడాలని ఎప్పటిదో కోరిక. ఈ కరోనా వల్ల థియేటర్స్ మూతబడి, ఇలా ఇంట్లో మ్యాట్నీ అయిడియా వేసారు మీ బావగారు. ఊరిలో ఇలా ఎంజాయ్ చేస్తూ సినిమా చూడాలనే ఆయన సరదా, విజిల్స్ కొట్టాలనే ఎప్పటి నుండో నా తీరని కోరిక, ఇలా మీ బావగారి మ్యాట్ని ప్రోగ్రాం తో వారం వారం తీరుతోంది.” అంటూ హాయిగా నవ్వేసింది.
రామకృష్ణ కూడా తన అక్క నవ్వుతో శృతి కలిపాడు. మ్యాట్ని వీరుడు ముసిముసి నవ్వులు న్యూస్ పేపర్ లోకి దూర్చాడు!(సమాప్తం!)
-
కైలాసం లో కరెంట్ పోతే ఏం జరిగింది?
కైలాసం లో కరెంట్ పోతే ఏం జరిగింది? #ఎవరికైనాతెలుసా?
గజాసుర కుక్షి నుండి, కైలాసం రాబోతున్న శివయ్య కోసం వెణ్ణీళ్ళు రెడి చేద్దామంటే, గీజర్ పనిచెయ్యలేదు. కట్టెల పొయ్యిమీద, ఆ ఐసు కరిగి, వేణ్ణీళ్ళు అయ్యేవరకు టైం ఉంది కదా అని అమ్మవారు ఇక షాంపూ వద్దులే అనుకుని, కుంకుడుకాయలు కొట్టుకుని, నలుగు పెట్టుకుని, ఆ వలిచిన నలుగుతో ఒక పిండిబొమ్మ చేసారు.పిండిబొమ్మ తయారీలో ఇవి ఉన్నాయి – రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, గణితం, వ్యర్థాల నుండి ఉత్తమంగా & కళ. ఇక్కడ “Law of Conversation of Mass”కి మించిన జ్ఞానం వస్తుంది. పిండిబొమ్మను బాలుడిగా మార్చడం – “నిర్జీవంగా నుండి జీవించడం” – అధునాతన వైద్య శాస్త్రం మరియు AI.
ఇప్పుడు. చక్కనైన బాలుడు ముచ్చటగా ఉన్నాడు. చెప్పిన పని తూ.చా. తప్పకుండా పనిచేస్తున్నాడు. ఇకక్కడే వచ్చింది చిక్కంతా. ఎందుకంటే, ఇద్దరి చిప్స్ లో డేటా సెట్ అప్-డేట్ అవ్వలేదు. పిల్లాడి విషయం. శివుడి కి, శివుడి వివరం పిల్లాడికి తెలియక, అబ్బాయి ఇ ఆదరించవలసిన శివుడు, తన ఇఘోస్టిక్ ఆగ్రహంతో పార్వతి దేవి సృష్టిని , ముద్దు బుడ్డడి కుత్తుక ఖండిస్తాడు. ఆ బాలుడి గుర్తింపు తెలియక శివుడు ఇంట్లోకి ప్రవేశించాడు.
ఆది దంపతుల అచ్చట్లు- ముచ్చట్ల మధ్యలో “ది బాయ్, హూ వజ్ బి-హెడెద్ ఎట్ ది డోర్!” టాపిక్ వచ్చింది. పార్వతిదేవి పుత్రశోకంతో వికవిలలాడింది. భార్యకు కలిగించిన మనోక్లేశానికి భర్త కళవళ పడ్డాడు. తానే, ధృవ-మార్కండేయులకి ఆయుష్-ప్రదాత అయిన శివుడిననే స్పృహ తెచ్చుకుని (దట్ మీన్స్, హీ రియలైజ్డ్, హౌ బిగ్ , హౌమాచ్ బిగ్గర్, హిజ్-హైనెస్స్ బిగ్గెస్స్ట్ బియో-సైంటిస్త్ హీ ఈజ్), ఆ గజాసురుని తల ఆ బాలుడికి అమర్చబడి అతన్ని బ్రతికించాడు. ఇదొక మెడికల్. మిరాకీల్, ఆర్గాన్ ఇంప్లాంటేషన్, బ్రెయిన్ ట్రాన్స్ప్లాంటేషన్ అప్-డేట్, – అదే జరిగింది.
ఆపైన జరిగిందంతా మీకు తెలిసినదే.
ప్రతి పురాణం వెనుకా సైన్సు ఉంది.
ఇహ పూజ చేసుకుని, అక్షింతలు జల్లుకుని, పిండి వంటలతో భోజనం చేసి, విశ్రాంతి తీసుకోండి!
సర్వేజనా సుఖినో~హ్భవనంతు!
-
దయ కావు మమ్ము శ్రీవినాయకా

గౌరీ ప్రియసుత శంకర మోదక
షణ్ముఖ భ్రాతా వినాయకా
మూషిక వాహన జనగణ వందన
గజముఖ రాయా వినాయకాశ్రీకర శుభకర త్రిజగోద్ధారక
లోకపాలకా వినాయకా
దుష్ట సంహారక దురిత నివారక
విశ్వరక్షకా వినాయకాప్రథమ పూజితా ప్రాజ్ఞ వందితా
బ్రహ్మాండ నాయక వినాయకా
పాశాంకుశధర పన్నగ భూషిత
సర్వమంగళ కారక వినాయకారావణ బాధక శశాంక విదారక
త్రిగుణ రూపకా వినాయకా
సిద్ధి ప్రసాదక బుద్ధి ప్రచోదక
మోక్షదాయకా వినాయకామోదక భక్షక పరిజన రక్షక
పరతత్వ బోధకా వినాయకా
దుర్జన భంజక దుర్మతి ఘాతక
సకల సిద్ధి ప్రదాయక వినాయకాత్రిభువన అర్చిత అభీష్ట ప్రదాతా
ఆర్త జన రక్షక వినాయకా
విశ్వరక్షాకృత లోకత్రయీ స్తుత
విమల వేద వందితా వినాయకావెన్నెల, #తెలుగు, #అమ్మనుడి, #వినాయకచవితి, #ఆధ్యాత్మికం, #భక్తి, #కవిత
@vennela
-
అతివలు – కలువలు

కొలనంతా తామరలు. ఎర్రవి, తెల్లవి, దట్టంగా అల్లుకుని ఉన్నాయి. కెంపులు, పచ్చలు, రవ్వలు కలిపి చేసిన గుండ్రని పతకం భూదేవి మెడలో వేలాడుతున్నట్టు ఆ చెరువు ఎంత శోభగా ఉందో. అతడికి ఈ దృశ్యం అంత అబ్బురంగా ఏమి తోచలేదు. రోజూ చూసేదే. ఆ కొలనులోని తామరలు చూస్తే అతనికి తన విస్తరాకులోని మెతుకులు గుర్తొస్తాయి.
మధ్యాహ్నం మూడు గంటలకు వెళ్ళి, ఎర్రటి ఎండలో ఆ కోలునులోకి దూకి తామరలను తెంపి తలపైన ఉన్న తట్టలోకి వేసుకోవడం, తట్ట నిండాకా ఒడ్డుకొచ్చి తమరాకులతో కప్పి, దాని పైన ఇంకో తడిపిన తువ్వాలు కప్పి, మళ్ళీ ఇంకో తట్ట తీసుకుని కొలనులోకి దూకడం ఇదే అతని దినచర్య. తెంచుకొచ్చిన పూలను అమ్మా, చెల్లెలు కలిసి గుడి దగ్గర అమ్మేవారు. ఎక్కువ పూలుంటే పక్కూరికి వెళ్ళి మార్కెట్లో ఇంకా ఎక్కువ ధరకి అమ్ముకొచ్చేవాడు.
ఎప్పటిలానే ఆ రోజూ కొలనులోకి దూకాడు. గట్టు మీద నుండి ఎవరో కేకలు పెడుతుంటే తలెత్తి చూశాడు. బుట్టబొమ్మలా నిలబడ్డ ఆమెని చూశాడు. పక్కనే ఉన్న రెండు అరచేతులు పట్టేంత ఉన్న కలువను చూపించి తెంచివ్వమని కోరుతుంది. మాములుగా అయితే మార్కెట్లో ఆ పువ్వుకి వంద తక్కువ రాదు. కానీ ఆలోచించకుండా ఆ పువ్వుని కోసిచ్చాడు. ఆమె మెడలోని లాకెట్ కూడా అచ్చం ఆ కొలను లాగానే కెంపులు, పచ్చలతో మెరిసిపోతుందని మొదటిసారిగా అనుకున్నాడు. ఆమె చిరునవ్వు ముందు ఆ పువ్వు ఎందుకూ పనికిరాదనుకున్నాడు. తెల్లటి కారులో ఆమె వెళ్లిపోతుంటే, లక్ష్మీదేవి చేతిలో తామరను అలంకరించుకుని, ఐరావతాన్ని ఎక్కి వెళ్తున్నట్టుగా ఉంది. ఇంత సంతోషం ఎన్నడూ అతనికి కలగలేదు. ఈ భావనే ఏదో తీయగా ఉందని ఎగిరాడు. అక్కడ పువ్వులు ఇప్పుడు విస్తరాకులోని మెతుకుల్లా కాక, ఆమె అరచేతుల్లా ఆనుతున్నాయి.
రోజూ అదే సమయానికి ఆమె రావడం , పువ్వులను తెంచి ఇవ్వడం, పువ్వులను ఒ చేతిలో పట్టుకుని కారు అద్దం దించి మరో చేతిని వెళ్లొస్తానంటూ ఊపుతూ, సమ్మోహనంగా ఆమె నవ్వే నవ్వు, అతనికి జీవితం మొదటిసారిగా ఓ మధుర కావ్యంలా తోచింది.
ఆ రోజు కూడా పువ్వులను తీసుకోవడానికి ఆమె వచ్చింది. ఎప్పటిలా ఆమె అద్దం దించి చేతిని ఊపలేదు. నోట్ల కట్టను తీసి అందివ్వబోయింది. “ఈ పూలు చాలా ఖరీదు అంటగా. ఇది సరిపోతుందా? ” ఆమె మాటలకు అతను లోపలే కుప్పకూలాడు. “పర్వలేదండీ. కానీ రేపటి నుండి నేను పువ్వులు గుడిలో ఇవ్వాలి. మీకు ఇవ్వడం కుదరదు. మరేమి అనుకోకండి.” “మరేమి ఫర్వాలేదు. మీ కొట్టు గుడి దగ్గరే కదా. అక్కడ ఉంటే కొనుక్కుంటాను.” అతను వెనక్కి చూడకుండా గుడి దారి పట్టాడు.
ఆమె అతన్ని ఇష్టపడుతుందని అనుకోకపోయినా, తన ఇష్టాన్ని స్వీకరిస్తుందని సంబరపడ్డాడు ఇన్నాళ్లు. అందుకే ఆమె ఏనాడూ డబ్బులు ఇవ్వలేదని అనుకున్నాడు. కానీ ఆమె దృష్టిలో అతనేంటో తెలిసాక మనసు విరిగిపోయింది.
గుడి దగ్గరకు వెళ్ళగానే, అమ్మా, చెల్లి ఇద్దరూ కనిపించలేదు. పక్కనే ఉండే తన మరదలైన పూలమ్మి ట్టు బేరాన్ని చూస్తుంది. అతన్ని చూడగానే పూలమ్మి సిగ్గుతో ముడుచుకుపోయింది. “అత్తమ్మకు బాలేదని చెల్లాయిని తోడిచ్చి ఇంటికి పొమ్మన్నా” మనసంతా మధుర భావానేదో నిండిపోయింది అతనికి. ఆమె కళ్ళలోని సిగ్గు, బుగ్గల్లో ఎరుపులు చూస్తుంటే తన బుట్టెడు తామరలు కూడా సరితూగలేవనిపించింది.
ఆమె చేతుల్లో తను ప్రత్యేకంగా ఉంచే ఎర్రటి కలువను పెట్టాడు. “ఏంటిది?” అన్నట్టు చూశాయి ఆమె కళ్ళు. “నా మనసు” అన్నట్లు సైగ చేశాడు. “ఇక ఎప్పటికీ నీదే” అన్నాడు. “ఎన్నడూ లేనిది ఇప్పుడేటి కొత్తగా?” ఆమె కళ్ళలో నీళ్లు జలాజలా కారుతున్నాయి. తాను రోజూ ఈదే కొలను ఈమె కన్నీటి నుండి వచ్చిందేనా!
దేవత కోసం గుడికి రావాలని తెలియలేదు ఇన్నాళ్లు” అతని కంఠం వణికింది. ఆమె చేయిపట్టుకుని మొట్టమొదటిసారిగా ఆ గుడిలోకి అడుగుపెట్టాడు. కుంకుమరంగు చీరలో,తామరపూల దండలతో మెరిసిపోతున్న అమ్మవారు, మాసిన చీర, మట్టిగాజులు, చేతిలో పువ్వుతో ఉన్న ఆమె వేరుగా కనిపించలేదు అతనికి.
-
భాషాకుమారుడి స్వగతం
చేతులతో తన ముఖాన్ని మూసిన వెంటనే ఉన్నట్టుండి మాయమైపోయిందనీ, “బుయ్” అంటూ చేతులు తీసిన వెంటనే ఎలానో తిరిగి ఎదుటన ప్రత్యక్షమైందనీ అమ్మకేసి ఇంతింత చేసుకున్న లేతకళ్లతో చూస్తుండిపోయే ఆశ్చర్యానందాల పాలపాపాయిగా ఉన్నప్పుడే తెలుగు భాష మనల్ని పలుకరించింది. అప్పుడు చెవులతో కాదు, గుండెతో తెలుగును విన్నాం, అమ్మ నోటితో ఏదో చప్పుడు చేస్తోందని అనుకుంటూ. సహజశక్తులు మనలో పేరుకోవడం మొదలై, మనోబుద్ధ్యహంకారాలు విచ్చి, ఒక జీవగ్రంథి ఏర్పడి, తయారైన ముఖయంత్రంతో తెలుగును లలితలలితంగా పలికాం. ఒక్కో మాటనూ నేర్చుకుంటూ గర్వం పొంగులువారిన శుభ్రానందంలో ఓలలాడాం. ఎదుగుతూ ఎదుగుతూ “ఈ బొమ్మ నాది”, “నేను రాను”, “ఇక్కడేదో దెబ్బ తగిలింది”, “కడుపు నెప్పిగా ఉంది”, “పరవాన్నం కావాలి” అని అంటూ లోపలే సుళ్లు తిరుగుతూ ఉండే ప్రాణచైతన్యాన్ని వెలిపెట్టుకోగలిగాం. బంధువుల్ని గుర్తుపట్టాం, కేకవేసాం. మొత్తంగా చెప్పాలంటే బ్రతికాం. మన ఇంటిలో మనకు పరిచయమైన తొలిచెలిమి తెలుగు. మనిషిగా జన్మనెత్తిన తరువాత మనకు లభించిన మొట్టమొదటి గొప్ప సిద్ధి భాషాసాక్షాత్కారం అని ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది నాకు.
పిక్కలను వణికించే భయం కలిగినపుడూ, నూరేళ్ల కలలన్నీ ప్రియుడిగానో ప్రియురాలిగానో ఎదురుగా రూపుకట్టినపుడూ, సప్తవర్ణాల శక్రచాపం ఆకాశంలో విప్పారినపుడూ, మన పాదముద్రలను సముద్రుడనే పెద్దమనిషి తన అలల కండువాతో లోపలికి లాక్కున్నపుడూ, ఆత్మబంధువు హఠాత్తుగా కాలం చేసినపుడూ, ఉషఃకాలపు సువర్ణకాంతికణాలు లోని అచేతనత్వాన్ని ముక్కలు చేస్తున్నపుడూ, అనేకరకాల కష్టాలు పడీ పడీ అనుకున్న లక్ష్యానికి చేరుకున్నపుడూ, నమ్మినవారే మోసం చేసినపుడూ, లాభనష్టాలు సంభవించినపుడూ ఇలా జీవితంలో ఏ అనుభూతి ఎదురైనా నోరు పెగలని సందర్భం ఉన్నదేమో కానీ, మనసులో తెలుగు పెగలని సందర్భం లేదు. ఎదుటివారితో మాటలాడనప్పుడు కూడా మనతో మనం మాటలాడుకుంటూనే ఉన్నాం. సన్నివేశాల్ని, ప్రశ్నల్ని, పురాస్మృతులనీ బయటో లోపలో – తెలుగులో అల్లుకుంటూనే ఉన్నాం. దేవతలనూ, దెయ్యాలనూ తెలుగులోనే పోల్చుకున్నాం. చివరికి అవసరం కొద్దీ వేరే భాషను నేర్చుకునేందుకు కూడా తెలుగుభాషామతల్లినే ఉపయోగించుకున్నాం. తెలివితో ఆమె శరీరాన్ని కోసినా, ఆమెపై రకరకాల ముద్రలు వేసినా, పిడిగుద్దులతో ఆమె అంగాల ఆకారాలను మార్చినా, ఆమెను పూర్తిగా విడిచిపెట్టినా ఆమె మనలను పొదువుకోవడం మానింది లేదు. కించిత్తు విలువనీయకుండా దిగజార్చినపుడు కూడా కినుక వహించి, “ఇకపై నేను నీకు అర్థం కాను” అని తెలుగు మనతో ఒక్కసారీ అన్నది లేదు, మనలను నిరాశపరిచిందీ లేదు. ఆమె సన్నిధిలో ఎప్పుడూ అదే ఊర్జ, అదే ఆర్జవం. కేవలం ఈ నేలమీద, ఈ సంస్కృతిలో పుట్టామన్న ఒకే ఒక కారణంతో లవలేశం ప్రతిఫలం ఆశించకుండా మన జీవంతో పెనవేసుకున్న ఆప్తురాలు తెలుగు. ఆమె గుండెలోతులను కనుక్కోవడానికి ఏ శక్తి సరిపోతుంది?
మనలను నడిపించే ఊపిరి ఆడడం అలవాటై, సాధారణమైపోయినట్లుగా మన లోపలితనానికి ఒక పరిపూర్ణశబ్దాకృతినిచ్చే తెలుగు ఎంతో జటిలమైన అంతఃప్రవాహమైనా కూడా మామూలైపోయింది. తేలికైపోయింది. ఊపిరి తాలూకు ఉనికినీ, విలువనూ గుర్తు చేయడానికా అన్నట్లు ప్రకృతి ముక్కుదిబ్బడను పెట్టింది మానవుడికి. తెలుగు అలా కూడా మనలను ఇబ్బంది పెట్టదలచుకోలేదు. నన్ను గమనించకపోయినా నా పిల్లలే కదా అని అనుకునే మాతృహృదయం ఆమెది.తెలుగులో పుట్టకపోయినా, దూరంనుండి ఈ భాషను చూసి అబ్బురపడినవాళ్లు ఎంతమంది ఉన్నారో, తెలుగులో పుట్టి, ఆ శక్తితో మొలిచిన బుద్ధిరెక్కలతో ఎగిరిపోయి పెడమొహం పెట్టినవారు అంతకన్నా ఎక్కువమందే ఉన్నారనుకుంటాను. సమాజం వ్యక్తులకు వారి వారి అవసరాలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యాన్ని నేర్పడంలో ఇబ్బంది లేదు కానీ, ఆ దృష్టి నుంచి బెసగనీయకుండా బంధించడం అవాంఛనీయం అని నా ఊహ. తెలుగుభాష అంతస్సౌందర్యాన్ని గమనించి అది ఎన్నెన్ని విధాలుగా, ఎన్నెన్ని ప్రాంతాలలో, ఎన్నెన్ని జాతులలో, ఎందరెందరు జీవితాలలో వ్యాపించి ఉందో అన్నదాన్ని అర్థం చేసుకోవడానికి అవసరమైన చూపు లభించడం నేటి కాలలో గగనమైపోయింది.
గ్రాంథికంగా, వ్యావహారికంగా, మాండలికాలుగా, యాసలుగా అనేకరకాలుగా వ్యాపించి ప్రతీ తెలుగుజీవితాన్నీ వెలిగించే తెలుగును ప్రేమించడానికి ఉద్యమాల పెనుగులాటలు తప్ప మరొక దారికేసి చూడలేని చిత్రమైన పరిస్థితి నేటికీ కొనసాగుతూనే ఉంది. మనకన్నా పెద్దవస్తువును ప్రేమించడం మనకెప్పుడూ చిక్కే. అయినా దానిని ఒప్పుకోని అహంకారం మనది. ప్రేమలోకి ప్రశ్నలను చొప్పించి దానిని సమూలంగా నాశనం చేసుకోవడం మనిషికి వెన్నతో పెట్టిన విద్య. “మనిద్దరి భాషాభేదాలలో ఏది పాతది? దేనికి గుర్తింపు ఉంది? నాది కాని నీ మాండలికంలో ఏ లోపాలు ఉన్నాయి? గొప్పతనం నిర్వచనం తెలుసా?” లాంటివే భాషాభిమానానికి తూనికరాళ్లుగా మారాయి. తెలుగు చుట్టూ చేరి తమ జీవితాలను పరిమళింపచేసుకున్న పూర్వీకులకు ఇటువంటి ప్రశ్నలు వేయడం చేతకాక కాదు, అవి నిస్సారమైనవని గ్రహించి మిన్నకున్నారేమో. నేటి పరిస్థితుల దృష్ట్యా “నా భాష ఎటువంటిదైనా నాకు గొప్ప” అనే మొండితనమే తెలుగువారికి ప్రాథమికంగా కావలసింది అనుకుంటాను. కారణాల పునాదులపై కన్నా కూడా అకారణంగా వెలసిన ప్రేమసౌధమే పటిష్ఠమైనది.
సహజత్వాన్ని వీడి, కృత్రిమతకు దగ్గరగా జరుగుతున్న మనం భాష కూడా కృత్రిమతలోకి పరావర్తించినపుడు మాత్రమే దానికి భవిష్యత్తు ఉంటుంది అని నమ్ముతున్నాం. కృత్రిమ ప్రపంచంలోనూ, నిర్జీవప్రపంచంలోనూ ఒక అవసరం, ఒక స్థానం తెలుగుకు ఏర్పడకుంటే దాని ఉనికికి ప్రమాదమని అనుకుంటున్నాం. ఈ హర్షణీయ ప్రయత్నాల వలన తెలుగు తప్పకుండా ఒక కొత్తపుంత తొక్కుతుంది. తెలుగు ఆయా చోటులలో మిగిలి ఉంటుంది కూడా.
అనేకరకాల ప్రవృత్తుల మిశ్రణమైన ప్రపంచంలోకి అర్థవంతమైన శబ్దాలున్న ఒక భాషగా తెలుగు వెలికి వస్తూ అగుపిస్తూ ఉంటుంది. ఇది దాని చరమావరణం. దాని అసలు శక్తి మన చేయి పట్టుకొని జాతి ఉనికికి దగ్గరగా, జీవానికి దగ్గరగా తీసుకొని వెళ్లడంలో ఉంది. ఈ అంతరావరణాలను కనుక్కోవాలంటే తెలుగు దగ్గర త్రికరణశుద్ధితో శ్రద్ధగా కూర్చోవడం ఒకటే మార్గం. ఈ “ఉపవాసం” వల్లనే తెలుగుది హృదయసామ్రాజ్యం అని తెలిసివస్తుంది.
ప్రతీదానినీ ఒక సమస్యగా చేసి, అడ్డం-నిలువు కోతలతో సాధించి ఒక సమాధానాన్ని చూపించడమనే చోట తెలుగు ఒక పరికరం. ఒక జడం. కానీ, వాక్యాలు- పదాలు – అక్షరాలు – వాచ్యార్థం- వ్యంగ్యార్థం- సాంస్కృతికార్థం- తాత్త్వికార్థం- పారమార్థికార్థం – భావనాశక్తి ఇత్యాది ఆవరణలను దాటుకుంటూ పయనింపగలిగితే అక్కడ మన గుండెచప్పుడు అనాహతనాదంగా మనకు వినిపిస్తుంది. ఆ చోట తెలుగు ఒక వెలుగు. ఒక ప్రాకృతికశక్తి. ఆ శక్తిగానే తెలుగు చిన్నతనంలో మనలోకి ప్రవేశించింది. ఇప్పటికీ అలానే ప్రసరిస్తూ ఉంది. అది ఏ మాత్రం గుర్తుకు వచ్చినా దానిని అభిమానించడం, ప్రేమించడం ఒక ప్రత్యేకకర్మగా తోచదు. సహజంగా లోపలనుండి పెల్లుబుకుతుంది. అటువంటి భాషాప్రేమి జీవితానికి ఎల్లలు లేని ఆనందం దొరికి తీరుతుంది. ఆ ఆనందంలో మన నోటి నుండి నాలుగు తెలుగు మాటలు వెలికి వస్తే, ఆ ఆనందంలో లోకాన్ని చూడగలిగితే, ఆ ఆనందంలో జనించే ఐకమత్యంతో సమాజం ఏర్పడితే, అప్పుడు కన్నతల్లిని చూసిన కళ్లకు ఎదుటివాడి తల్లిని చూడడంలో గజిబిజికి తావుండదు కనుక “ఏది తెలుగు?”, “తెలుగు భాష ఎవరిది?” వంటి హక్కుభుక్తాల ప్రశ్నలు పుట్టవు.
ఆచంద్రతారార్కం తెలుగు భాష వర్థిల్లాలి. ఆమె సెలవినవ్వుల కాంతులలో మనిషికి దారిచీకట్లు తొలగాలి.1
తొలితొలి తెల్విలోఁ జవిని దూసి బయల్వడఁ జేయలేని యా
మొలకతనాన, మజ్జనని మోమున మాటగ గోచరించి, లేఁ
జలువను హార్దకుడ్యములఁ జక్కన హత్తి ఫలించినట్టి నా
జిలిబిలి తెల్గుభాష బిగిచేవ నరమ్ములఁ బ్రాకిపోయెడున్.2
ఏ నియమమ్ము లేని, తపమింతయుఁ జేయగ లేని, నోటితో
నైనను ‘రాగదమ్మ’ యని ప్రార్థనగా బ్రతిమాలలేని నా
ప్రాణపుఁ దీరుఁ జూచి, కృప పాఱెడు గుండియతోఁ జలించి, నన్
బూనిన తెల్గుశక్తి యెదమూలలదాఁక వెలింగిపోయెడున్.3
ధమనీసంహతిలోఁ దెలుంగు జవముత్థానమ్ములం దేర, కం
ఠము పొంకించి, తెగించి, లేచి, ఘనఘంటామార్గకేంద్రాల ప
ద్యములన్ బాడి మరొక్కమారున నవాంధ్రాంతఃప్రజాకోటి క
ర్ణములండాగిన త్రుప్పు చిట్లి జలజల్లన్ రాలఁగాఁ జేయనే!4
గొప్ప మరచి తిరుగు తెనుఁగుసింగమ్ము తనను కనుఁగొను దర్పణము నేను
ఆంధ్రీఘనాఽఽచరితానర్ఘమణిని లోదాచిన మంచి మందసము నేను
నవనవీన కవితా నవనీతదోహనీశ్రితియగు పద్యాలశిక్య నేను
భాషాలతాతన్వి ఫాలనామము దిద్ద వెట్టిన పాటీరపేటి నేనుతెలుఁగు మెదడులలో దూరి తెలుఁగు పదము
లను పదేపదే పంపిణీ పొనరుచు నిర
తంపు సత్త్వశక్తిని నేను; తారకాంత
సితపరాగముఁ జేగొన్న ధృతిని నేను.5
నేను పదముల యల్లికను! నవ భావ
తతుల పొందిక నేనే! కవితను వ్రాయు
నపుడు కవి కావ్యధార, వ్రాయనపుడతని
లలితహృదిలోని వహ్నికుధ్రమును నేను.6
వెలుపలి వైపుగా బ్రతుకువెల్లువ మాటున డాఁగివచ్చి, బు
ద్ధుల నరికట్టుకొన్న పరధోరణిమేచక మెంతదాఁక? నా
కలమును తీసి, యాంధ్రమసికారసపూరణఁ జేసి పద్యముం
జిలికెడునంత దాఁక, యది చేరిన గుండె వెలుంగుదాఁకనే!7
కృష్ణరాయల దీవ్యదుష్ణీషముపయిని కుచ్చునూపిన నాటి కోడెగాడ్పు
కాకతీకులకాంత కరకాంత విక్రాంత వైభవోపేతాసి వాఁడి వెలుఁగు
ఖడ్గతిక్కన తల్లి కబళమ్ములోఁ గ్రుక్కి యతనికి వెట్టిన యగ్నిధార
పదునారు ప్రాయంపు బాలచంద్రు ప్రతినలోఁ ద్రుళ్లినట్టి వీరోగ్రకళికశాతకర్ణి విన్న విజయగీతికలు, క
వుల యెదలలో నెగసిన తడుల తరఁగలు,
పరవళుల గౌతమీ, తుంగభద్ర, కృష్ణ –
నాదు పద్యాన పునరనునాదమవుత.8
నాటి యాంధ్రుల హృదయాల మేటి గతులు
వారి యుద్ధ, విలాస , శృంగార, యోగ
సాధనా పటిమలు, మనసైన కళలు
నాదు పద్యాన పునరనునాదమవుత.9
నాఁడు కలదు తెలుగు నేఁడు కలదు; నిర్ధ
న ధనిక జనపాళి నాల్కలందు
నాటివాఁడు తెలుగు నాటించుకొనినాఁడు
నేటివాఁడు తెలుగుమాటవాఁడు.10
పాడిన పాటలే యనెదవా పెడమోమున? నేటి కాలపున్
బోఁడిమి కీ విధమ్ము సరిపోదని తల్చెదవా సహోదరా!
చేడియ మోము దిద్దుకొను చెన్నులు నేటివి మార్చువేళ, తా
నాఁడది యన్న గుర్తునకు నక్కఱఁ దీరునె? ప్రాతవోవునే?11
నాతో రార తెలుంగువాడ! యదిగో, నానామహత్వమ్ములన్
బోతల్వోసిన భవ్యసంస్కృతులతోఁ బొల్పొందె నీజాతి, ఆ
యా తావుల్ నినుఁ జుట్టుముట్టికొననీ! ఆ స్ఫూర్తి నీదై పున
ర్వాతోచ్ఛ్వాసన నంది మేలుకొననీ భాషామహాదేవినిన్.12
పెక్కు వేల్పుల సేవనప్రీతి కన్న
పదవి, సొమ్ముల వెంట ధావనముకన్న
నీవెవఁడ వన్న సద్యష్టినిర్వహణము,
మాతృభాషార్చనము మేలు, మహితమతిని.13
తెలుగుఁ దనము నిండిన గుండె కలిగి, తెలుగు
పదముల నొసగిన వెలది వైపు తిరిగి
ఆ పదమ్ములనామెకే అర్చనమిడి
వచ్చెదము, మిత్రుఁడా! నేడు, వడిని రమ్ము.14
పూర్వప్రజాకోటి పులకించి దిద్దిన ఘనచరిత్రలు తిలకంపు బొట్టు
సర్వంసహాదేవి సర్వోపదీప్తుల పాఁడిపంటలు మేని పట్టుచీర
సంగీతసాహిత్యసౌజన్యశైలులు చేలాంచలాగతచిత్రసృష్టి
తనవారు గుండెతోఁ దనను నోరాడుట లామె మోమున విచ్చు ప్రేమనగవుభావిజాతి నడతలు నవమణిబద్ధ
ఖచిత సింఘాసనమ్ము, యే కల్మషంబు
లేని హృదయములు తొడవులైనయట్టి
తెలుగు యలివేణి! మా రాణి! లలితపాణి!15
నీ కొనగోరు మానికపు నీడన నాదు శిరమ్ము వాల్చి,నీ
సోకుకు తళ్కుటద్దముగ సొక్కిలు నా మన మందజేసి, పూ
రేకనొ, కోకిలమ్మనొ వరించి త్వదీయపదమ్ములం మధూ
ద్రేకత పాడు కోరికను తీర్చిన చాలు, తెలుంగు భారతీ!*
-

పసుపుపచ్చ ‘పచ్చ’ ఎందుకయింది?
“ఆకుపచ్చ, పసుపుపచ్చ రెండూ వేర్వేరు రంగులు కదా మరి రెండిటినీ ‘పచ్చ’ అని ఎందుకు అంటాం?” అని ఓ పడుచుపిల్ల ప్రశ్న. “అవును కదా, ‘పచ్చ’ అనే మాటని మనం ఆకుపచ్చ రంగుకే ఎక్కువగా వాడతాం. మరి పసుపుకి కూడా పచ్చ ఎందుకు చేరుస్తాం?” అని ఈ నవవృద్ధుడికీ విస్మయం కలిగింది. తెలుసుకునే ప్రయత్నం చేస్తే తేలిన విషయమే ఈ టపా.
నిఘంటువులో ‘పచ్చ’ అనే మాటకి బంగారము, సంపద అనే అర్థాలిచ్చారు. రంగులకు వెళ్తే పసరు రంగు, పసుపు రంగు, ఆకుపచ్చ రంగు, పాలిపోయిన రంగు అని ఇచ్చారు. అక్కడే తేలిపోయింది కదా ఈ మాటను ఈ రంగులన్నిటికీ కలిపి వాడేవారని. ఇప్పుడే గుర్తొచ్చింది చిన్నప్పుడు విన్న వాడుక: ఒంటి ఛాయ గురించి చెప్పేప్పుడు తెల్లగా ఉన్నవారిని ‘పచ్చని ఛాయ’ అనేవారు. ఇదే వాడుకలో చికిలింత అనే కథలో మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు ఇలా వ్రాసారు:
ఎదురు గుమ్మంలోకి, ఎవరో అమ్మాయి వచ్చింది. పచ్చగా ఉంది. పది పద్ధెనిమిది
ఏళ్ళుంటాయి.బంగారు, పసుపు రంగుల్లో ఉండే గిజిగాడు పక్షిని ‘పచ్చపిట్ట’ అంటారట. పాలిపోయిన ఎరుపురంగులో ఉండే రాయి ‘పచ్చసుద్ద’. ‘పచ్చగన్నేరు’ పూలు పసుపు రంగులో ఉంటాయి మరి.
‘పచ్చ’ అనే మాట ‘పస’ అనే మూలం నుండి వచ్చింది. దాన్నుండే పసరు, పసపు/పసుపు, పసిడి/పైడి అనే మాటలు వచ్చుంటాయి.సరే, సంస్కృతపు మాటలు చూద్దాం అని ‘హరిత’తో మొదలుపెడితే దానికీ, ‘హరి’ అనే మాటకీ కూడా పసుపు రంగు, పాలిపోయిన ఎరుపు రంగు, ఆకుపచ్చ రంగు అనే అర్థాలున్నాయి. బంగారుకాంతితో ఉండే సింహం అని కూడా ఓ అర్థం. బంగారురంగులో ఉంటుంది కనుక జింకను ‘హరిణం’ అన్నారు. పసుపుని హిందీలో ‘హల్దీ’ అంటారు కదా, (హళిది) దానికీ ‘హరి’ అనే మాటే మూలం. హరీ!
దీన్నిబట్టి మనం తేల్చేదేమిటంటే… మన పూర్వీకుల పూర్వీకులకు పసుపుపచ్చకీ, ఆకుపచ్చకీ భేదం చూపించాల్సిన అవసరం రాలేదేమో!?
(ఇంతాచేసి, ‘పచ్చనోటు’ అనే మాట నోటు రంగు వల్ల కాకుండా ‘పచ్చ’ అనే మాటకి ఉన్న సంపద అనే అర్థాన్ని బట్టే వచ్చివుంటుంది.)

