Category: హాస్యం / Humour

  • మ్యాట్ని!


    మ్యాట్ని ! 

    ((ఈరోజు శనివారం, శెలవు రోజు! ఇంట్లో మ్యాట్ని ప్రోగ్రాం జరగాల్సిందే!))

    అంతా చీకటిగా వుంది, ఎక్కడో కాలింగ్ బెల్ మోగుతున్న శబ్దం వినిపించి, లేచి గడియారం చూస్తే తెల్లవారు ఝాము 5 అవుతోంది. మళ్ళీ కాలింగ్ బెల్ రెండు సార్లు వినిపించింది. ఇంత పొద్దున్నే ‘ఎవరా?’ అనుకుంటూ పక్కనే వున్న భర్తని  లేపింది.   అతను గడియారం చూసి, “తెల్లవారుతోంది కదా, నువ్వే వెళ్ళి చూడు”,   అని పక్కకి తిరిగి పడుకున్నాడు.

    ఇంకా కాలింగ్ బెల్, దబదబా తలుపులు మార్చి మార్చి మ్రోగుతూనే ఉన్నాయి.  ఇక తప్పదు అనుకుంటూ బట్టలు సరిచేసుకుని, జుట్టు ముడి పెట్టుకుంటూ మంచం దిగి హాల్ వైపు అడుగులు వేసింది. కాలింగ్ బెల్ మళ్ళీ మొగింది. “ఎవరూ? వచ్చే, వచ్చే!” హెచ్చు గొంతుతూ అంటూ,  హాలులో వున్న దేవుడి పటానికి దణ్ణం పెట్టుకుంటూ గడియ తీసింది.

    గుమ్మం ముందు మొహానికి చిన్న ట్రావెల్ బాగ్ అడ్డం పెట్టుకుని నిలుచుని వున్న    ఆకారం ఎవరా?  అని పరిశీలనగా చూసింది.   బాగ్ వెనుకనుండి “అక్కా! నేనే వచ్చా!” అని తమ్ముడు రామకృష్ణ గొంతు వినపడింది.   పార్వతికి ఒకింత ఆశ్చర్యంతో, సంతోషంతో తలుపు బార్లా తీస్తూ “ఏరా! వచ్చావా? ఊడి పడ్డావా?” అంటూ తమ్ముడు లోపలికి రావడానికి వీలుగా  పక్కకి జ రుగుతూ,  “ముందు లోపలికి రా రా! చలిగా వుంది. అయినా వచ్చే ముందు ఫోన్ చెయొచ్చుగా?”.  

    రామకృష్ణ చెప్పులు గుమ్మం బయట పక్కగా విడిచి లోపలికి వస్తూ “బావ గారు లేచారా?”.  ‘లేదు’,  అన్నట్టుగా తల అడ్డంగా ఊపుతూ తలుపు వేసి గడియ పెట్టింది. సోఫా పక్కనే బాగ్ పెడుతున్న తమ్ముడితో, “బట్టలు మార్చుకుని రా రా! వేడి వేడి కాఫీ ఇస్తాను” అంటూ లోపలికి వెళ్ళింది.

    పార్వతి రెండు కప్పులతో కాఫీలు తీసుకుని వచ్చే సరికి, రామకృష్ణ బట్టలు మార్చుకుని, సోఫాలో కూర్చుని వున్నాడు.  ఒక కప్పు తమ్ముడికి ఇచ్చి, సోఫా కి దగ్గిరగా కుర్చి లాక్కుని, ఇప్పుడు చెప్పు అన్నట్టు చూసింది.   రామకృష్ణ కాఫీని ఆఘ్రాణిస్తూ, “ఆహా! నీ చేతి కాఫీ అధ్బుతం.”    కాఫీ రెండు గుక్కలు తాగి,  “ఏమీ లేదక్కా! చాలా రోజులు అయ్యింది, ఒక సారి చూసి పోదామని వచ్చా”,

    మళ్ళీ కాఫీ కొంచెం ఎక్కువగా తీసుకుంటూ. పార్వతి, “సంతోషం! ఒక్కడివే వచ్చావే?” అని అడిగింది.

    రామకృష్ణ  తాగుతున్న కాఫీ కప్పు పక్కన పెడుతూ ” ఓ! అదా! నీ మరదలు వాళ్ళ పుట్టింటికి, నేను నా పుట్టింటికి.  రేపు నేను అక్కడికి వెళ్ళి, ఎల్లుండి పొద్దునే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాము.”

    పార్వతి కుర్చీలో సర్దుకుంటూ, “అయ్యో! తనని కూడా తీసుకువస్తే బావుండేది. నువ్వు వెళ్ళేటప్పుడు, తన జాకెట్లు రెండు ఇక్కడే వుండిపోయాయి, మర్చిఫొకుండా తీసుకు వెళ్ళు.”

    రామకృష్ణ మళ్ళీ కాఫీ కప్పు తీసుకుంటూ “ఈ సారి, ఇలా వచ్చి అలా వెళతాములే. ఇంకా ఏంటి అక్కా విశేషాలు?”.

    పార్వతి కుర్చిలోంచి లేచి, ఖాళీ అయిన కప్పులు తీస్తూ,  “నువ్వు ఆ రెండో  బెడ్ రూం లో కాసేపు పడుకో.  శనివారమేగా, పని హడావిడి ఏమీ లేదు, తరువా త మాట్లాడు కుందాము”.

    అక్కని ఆశ్చర్యంగా చూస్తూ, “పొద్దునే లేచి, దేవుళ్ళకి మేలుకొలుపు పాడే నువ్వా? ఇంకా పడుకో అంటున్నావు, అంతా కాల మహిమ”  అంటూ సోఫాలో నుండి లేచాడు.

    తమ్ముడిని చూసి, పెదవి విరుస్తూ “ఏం చేస్తాం? కరోనా తర్వాత కొత్తరకం కష్టాలు వచ్చిపడ్డాయి. ఈరోజు వుంటావుగా? నీకే తెలుస్తుంది” అంటూ తన బెడ్ రూం లోకి దారి తీసింది.  అక్క వైపు కొంచెం అనుమానంగా చూస్తూ రెండో బెడ్ రూం లోకి దారి తీసాడు.

       ===== ******  ======
    కప్పు భళ్ళున పడిన శబ్దంతో చటుక్కున కళ్ళూ తెరిచాడు రామకృష్ణ. గడియారం 11 గంటలు చూపిస్తోంది.  మంచం మీదనుండి లేచి కూర్చుంటూ వుండగా, వంటింట్లోంచి కొంచెం గొంతు తగ్గించి మాట్లాడుకుంటున్నాయి అక్కా బావల గొంతులు.

    రామకృష్ణ కిచెన్ వైపు నడుస్తుండగా, పార్వతి గొంతు వినిపించింది “కప్పు పడిన శబ్దానికి వాడు లేచే వుంటాడు. ఇంకా మాట్లాడకండి”. న్యూస్ పేపర్ మడతపెడుతున్న గుసగుసలో బావ గొంతు “ఈరోజు శనివారం, శెలవు రోజు, ఇంట్లో మ్యాట్ని సంగతి ఏంటి?”

    పార్వతి భర్తకి దగ్గిరగా జరుగుతూ “చీ ఊరుకోండి. ఈరోజు మ్యాట్ని లేదు, గీటిని లేదు. వాడు ఇంట్లో వుండగా అలాంటి పనులు ఏంటి? అసహ్యంగా?”

    అప్పుడే కిచెన్ లోకి వస్తున్న రామకృష్ణ “నమస్కారం బావగారు! ఏదో మాట్ని అంటున్నారు, ఇక్కడ దగ్గిరలో ఏమైనా కొత్త థియేటర్స్ తెరిచారా? చాలా రోజులు అయ్యింది హాల్ లో సినిమా చూసి, నేను కూడా వస్తా పదండి” .

    పార్వతి చేతిలో వున్న గరిట భర్త మరియు  తమ్ముడి మొహం మీద తిప్పుతూ “సినిమా లేదు, గినిమా లేదు.” అని తమ్ముడి వైపు తిరిగి “ఇక్కడ థియేటర్స్ ఓపన్ చెయ్యలేదు. ఆయన చేప్పేది వినకు.”

    పార్వతి భర్త, పేపర్ మడిచి పక్కన పడేసి, భార్యని చూస్తూ,  “మ్యాట్ని పడాల్సిందే! .”  రామకృష్ణ కొంచెం ఆశ్చర్యంగా ఇద్దరిని చూసాడు. పార్వతి విసుక్కుంటూ “ఏంటండి ఇది. వాడి ముందు ఇలాంటి పనులు చేస్తే మీకే పరువు తక్కువ. ఈ వయసులో మీకు ఇలాంటి వేషాలు ??”

    ఇదేదో చిత్రమైనా వ్యవహారాంలా వుందే అనుంకుంటూ, రామకృష్ణ అక్కతో “ఏంటి అక్కా? గంగా మహేష్ అనే పేరుగల బావగారు, ఎవరైనా చిన్న ఇల్లు, ఏమైనా…? “అంటూ నీళ్ళు నమిలాడు.

    పార్వతి భర్తను చూస్తూ “నా అదృష్టం కొద్దీ, మీ బావగారి పేరులోనే నాకు సవతి వుంది గాని, వూరిలో లేదు”. అని, భర్తను బయటకు నెట్టుతున్నట్టుగా తోసింది.

    తమ్ముడి వైపు తిరిగి “ఒరే, నువ్వు స్నానం చేసి రా, అందరం భోజనం చేసేద్దాం.  నీకిష్టమైన గుత్తి వంకాయ కూర!” .

    వంటింటి గుమ్మం దాటుతూ పార్వతి భర్త “మరో మాట లేదు, మ్యాట్ని ప్రోగ్రాం జరగాల్సిందే!, ” అని హుకుం జారి చేసి వెళ్ళిపోయాడు.   ప్రశ్నార్ధంగా చూస్తున్న తమ్ముడి  మొహంలోకి చూడలేక, పార్వతి తలదించుకుంది.
     

    భోజనాలు ముగించేసరికి ఒంటిగంటన్నర అయ్యింది.  అంతా భోజనాలు చేసిన తరువాత శుభ్రం చేసే పని వుందని లోపలికి వెళ్ళింది పార్వతి.. బావ మరుదులు ఇద్దరూ పిచ్చా పాటి మాట్లాడు కుంటూ కూర్చున్నారు.

     ఇంతలో బావగారి మొబైల్ ఫోన్ మోగింది. ఫోన్ చేతిలోకి తీసుకు, కట్ చేసి రామకృష్ణ ని చూస్తూ ” కాల్ కాదులే, అది అలార్మ్ ! మ్యాట్ని టైం అయ్యింది .”,   అని కిచెన్ వైపుకు చూస్తూ “పా రూ! “రెడీనా?”,  అంటూ ఉత్సాహంగా కేక పెట్టాడు.  గంగామహేష్ ఇప్పుడే వస్తా  అని,, అంతకు ముందు రామకృష్ణ రెస్ట్ తీసుకుని వచ్చిన గదిలో వెళ్ళాడు.  ఏమీ అర్ధంకాక, పక్కనే వున్న పేపర్ తిరగేస్తూ కూర్చున్నాడు.  ఒక పదినిమిషాలా తరువాత గంగామహేష్ బయటకు వచ్చి “రాము, అంతా రెడీ.”,  అని కిచెన్ లోకి చూసి “యేయ్ బుక్కింగూ! రెడీనా ?”  అని మళ్ళీ గావు కేక పెట్టాడు.

    రామకృష్న్ణకి ఇదేమి అర్ధం కాలేదు. గంగా మహేష్ తన బెడ్ రూం లోకి వెళ్ళి, బయటకు వెళ్ళే వాడిలా నీటుగా తయరయి వచ్చాడు. అలా వచ్చిన బావగారిని చూసి, తను కూడా లేస్తూ, “ఒక్క నిమిషం బావగారు, నేను కూడా బట్టలు మార్చుకుని వస్తా” అని లోపలికి వెళ్ళీ జీన్స్ టి షర్ట్ వేసుకుని తల దువ్వుకుని వచ్చాడు.

    వేడి నూనేలో శంగపిండి వేగుతున్న వాసన వస్తోంది.  చేతిలో గరిటె తో, జిడ్డు కారుతున్న మొఖం తో కిచెన్ లో నుండి వచ్చిన పార్వతి మొఖం చూసి “ఏంట క్కా? నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా?”  అన్నాడు రామకృష్ణ అసహనంగా.

    ముంజేతి తో మొహం తుడుచుంటూ, తమ్ముడితో, “నువ్వు, మీ బావగారు ఆ ప్రహసనం నడపండి, నాకు వేరే పనుంది”.  గంగా మహేష్ ముందుకు వచ్చి భార్యతో,  “ఎంటి? మ్యాట్ని మొదలయి పోయిందా? రెండు టికేట్ లు చించు” అన్నాడు. రామాకృష్ణ అక్కా బావలిద్దరిని అయోమయంగా చూసాడు. పార్వతి గంగా మహేష్, రామకృష్ణ ని వుద్దేశించి ” ట్రయిల్ పార్టి నాడుస్తోంది, మీరెళ్ళి కూచోండి, నేను మీ దగ్గరకు వచ్చి టికెట్లు చించుతా!” అంది.  

    ఈ మాటలు విన్న రామకృష్ణ ఇంకా అయోమయంలో పడిపోయాడు.  ఇంతలో గంగా మహేష్, రామకృష్ణ ని “పద, పద” మంటూ తొందరపెడుతూ, ఆ రేండో రూములోకి తీసుకుని వెళ్ళాడు. గదంతా చీకటిగా వుంది,   సినిమా థియెటర్ లో లాగ, గోడ మీద ఎల్. ఈ. డీ స్క్రీన్ మీద సూపర్ స్టార్ కృష్ణ నటించిన కౌబాయ్ ఫిల్మ్ ‘మోసగాళ్ళకు మోసగాడూ” టైటిల్ వేసి వుంది. ఆ చీకట్లోనే తడుముకుంటూ, రామకృష్ణ చేతితో లాక్కుంటూ తీసుకెళ్ళి కుర్చిలో కూలేసాడు అతని బావ గంగామహేష్.   రిమోట్ తో సినిమా మొదలయ్యింది. రామకృష్ణ కళ్ళు చీకటికి కొద్దిగా అలవాటు పడ్డాయి. టైటిల్స్ పడి, సూపర్ స్టార్ స్క్రీన్ మీద కనపడగానే కయ్యి మని విజిల్ కొట్టాడు, గంగామహేష్. ఆ శబ్దానికి, చెవులో వేలు పెట్టి తిప్పుకుంటూ వుండగా, గది తలుపు మెల్లగా తెరుచుకుంటూ, సన్నని వెలుతురు లోపలికి పడింది.  గంగామహేష్, “ఓయ్! తలుపెయ్, తలుపెయ్” అంటూ గట్టిగా అరిచాడు.

    తలుపు వేసి లోపలికి వచ్చిన పార్వతి, వీళ్ళిదగ్గిరికి వచ్చి, చీకట్లో కాళ్ళు తొక్కి, గంగామహేష్ అడ్డంగా నిలబడి “టికెట్లకి డబ్బులు తియ్యండి” అంది.  గంగామహేష్ పార్వతిని పక్కకితోస్తూ “యెహే! అడ్డం తప్పుకో, ఫైటు మిస్సవుతుంది. కాళ్ళు తొక్కేసి, పైగా అడ్డంగా నిలుచున్నావు” అని విసుక్కుంటూ, ఆమే చేతిలో యాభై రూపాయల నోటు పెట్టాడు, టికెట్లకి డబ్బులు అన్నట్ట్లుగా. ఇప్పుడిప్పుడే, రామకృష్ణ కి కొంచెం కొంచెం అర్ధం అవుతున్నట్లనిపించింది.  పార్వతి మెల్లగా తలుపు తీసుకుని వెళ్ళిపోయింది.

    రామకృష్ణ కూడా, తన బావగారితో కలిసి సినిమాలో లీనం అయిపోయాడు. పెద్దసౌండుతో, చప్పట్లతో మధ్య మధ్య కామెంట్స్ తో రామకృష్ణ బావగారితో కలిసి సినిమా ఫుల్లుగా ఎంజాయ్ చెయ్యడం మొదలు పెట్టాడు. ఇంకా గంగామహేష్ మరీ రెచ్చిపోయి, “కొట్టు, కాల్చు, దూకు” అంటూ అరుపులతో గదంతా అల్ల కల్లోలం చేస్తున్నడు. రామకృష్ణ కూదా ఉషారెక్కి విజిల్స్ కొట్టడం మోదలు పెట్టాడు.  ఏదో పాట వస్తుండగా, తలుపు బార్లా తెరుచుకుంది.

    ఉల్లిపాయ పకోడి వాసన గుప్పున కొట్టింది. పార్వతి, “పకోడి, పకోడి, ఉల్లిపాయ పకోడి” అని కేక వెసింది. వీళ్ళీదరికి వచ్చి మొహం మీద అడ్డంగా పకోడిల ప్లేటు పెట్టింది. కమ్మని వాసనకి రామకృష్ణ చెయ్యిపెట్టి తీస్కొబోతే, పళ్ళెం వెనక్కు లాగి “పొట్లం పది రూపాయలు” అంది. మహేష్ రామకృష్ణ తొడ మీద కొట్టి, “ఇరవై ఇచ్చి రెండు పొట్లాలు తీస్కో” అన్నాడు. ఇరవై తీసుకుని, రెండు పొట్లాలు వాళ్ళీదరి చేతిలో పెట్టి, బయటకు వెళుతూ తలుపు కొద్దిగా తెరిచి సినిమా చూడసాగింది. రూం లోపలిని లైటింగ్ పడటంతో ఈ సారి రామకృష్ణ గట్టిగా “తలుపెయ్, తలుపెయ్!” అని అరిచాడు. చుట్టూ చూసుకుని, తనెక్కడ వున్నాడో గ్రహించి సిగ్గుపడ్డాడు.

    ఇంకా కొన్ని నిమిషాలలో “విశ్రాంతి” అని స్క్రీన్ మీద చూసి, గంగా మహేష్ లేచి లైటు వేసాడు. ఇద్దరూ కళ్ళూ నులుముటూ బయటకు వచ్చారు. మళ్ళీ సినిఫక్కీలోనే, డబ్బులు ఇచ్చి పార్వతి దగ్గిర ఇలాచి టీ తాగి, లొపలికి వచ్చి కూర్చుని సినిమాలో మునిగిపోయారు. ఒక పదినిమిషాలా తరువాత పార్వతి కూడా చేతిలో  పకోడీల పళ్ళెం, టీ వచ్చి వీరితో కలిసి కూరుచుని సినిమా చూడసాగింది. ముగ్గురూ ఫుల్ గా సినిమాలో మునిగిపోయారు.

     క్లైమాక్స్ ఫైట్ లో పార్వతి కూడా “ఖయ్యి”మని విజిల్ కొట్టసాగింది. అక్కను అలా చూసి రామకృష్ణ ఆశ్చరపోయాడు. పార్వతి కొంచెం సిగ్గుపడి, మళ్ళీ తేరుకుని విజిల్స్ వెయ్యసాగింది.  మహేష్ ఇదేమి పట్టనట్టుగా తన పంధాలో సినిమాని ఎంజాయ్ చేస్తున్నాడు. “శుభం” కార్డు పడినతరువాత, పారతిలేచి లైట్ వేసింది.  ముగ్గురూ కళ్ళు నులుముకుంటూ బయటకు వచ్చారు.

    ఒకళ్ళని, ఒకళ్ళు చూసుకుని భళ్ళుమని నవ్వుకున్నారు. రామకృష్ణ పారవతి ని చూసి “అక్కా? నువ్వు విజిల్సా? మరీ ఇంత మాస్ గా ఎప్పుడు మారిఫొయావు?.”  

    .పార్వతి కొద్దిగా సిగ్గు పడుతూ “చిన్నప్పటి కోరిక, ఇలా తీరిందిరా. ” అని భర్తని మురిపెంగా చూస్తూ, మహేష్ చెయ్యిపట్టుకుని, రామకృష్ణని చూస్తూ “రాము! నాకు పుట్టింట్లో  చిన్నపుడు సినిమాలు చూసే స్వేచ్చ వుంది కాని, ఒక ఆడ పిల్లకు వుండే కొన్ని కనిపించని కట్టుబాట్లు అలాగే వుండేవి. మగ పిల్లల్లాగా, కేరింతలు కొడుతూ, విజిల్స్ వేస్తూ సినిమా చూడాలని వుండేది. చిన్నాప్పుడు, అమ్మా-నాన్నా తోనె కలిసి వెళ్ళేవాళ్ళం. కాలేజి చదువులప్పుడు, ఇలాంటి సినిమా థియేటర్ వాతావరణం వున్నా, విజిల్స్ కొట్టే స్వేచ్చ వుండేది కాదు. మీ బావగారికి చిన్నప్పుడు ఊరిలో ఇలా చూసినట్టుగా సినిమా చూస్తేనే మజా! మల్టిప్లెక్సులు, వయసు వచ్చాకా, ఆ సరదా పోయింది. అలాగే నాకు కూడా హాల్లో కామెంట్స్ చేస్తూ, విజిల్ కొడుతూ సినిమా చూడాలని ఎప్పటిదో కోరిక. ఈ కరోనా వల్ల థియేటర్స్ మూతబడి,  ఇలా ఇంట్లో మ్యాట్నీ అయిడియా వేసారు మీ బావగారు.  ఊరిలో ఇలా ఎంజాయ్ చేస్తూ సినిమా చూడాలనే ఆయన సరదా, విజిల్స్ కొట్టాలనే ఎప్పటి నుండో నా తీరని  కోరిక,  ఇలా మీ బావగారి మ్యాట్ని ప్రోగ్రాం తో వారం వారం తీరుతోంది.” అంటూ హాయిగా నవ్వేసింది.

    రామకృష్ణ కూడా తన అక్క నవ్వుతో శృతి కలిపాడు.  మ్యాట్ని వీరుడు ముసిముసి నవ్వులు న్యూస్ పేపర్ లోకి దూర్చాడు!

    (సమాప్తం!) 

    1
  • కైలాసం లో కరెంట్ పోతే ఏం జరిగింది?

    కైలాసం లో కరెంట్ పోతే ఏం జరిగింది? #ఎవరికైనాతెలుసా?

    గజాసుర కుక్షి నుండి, కైలాసం రాబోతున్న శివయ్య కోసం వెణ్ణీళ్ళు రెడి చేద్దామంటే, గీజర్ పనిచెయ్యలేదు. కట్టెల పొయ్యిమీద, ఆ ఐసు కరిగి, వేణ్ణీళ్ళు అయ్యేవరకు టైం ఉంది కదా అని అమ్మవారు ఇక షాంపూ వద్దులే అనుకుని, కుంకుడుకాయలు కొట్టుకుని, నలుగు పెట్టుకుని, ఆ వలిచిన నలుగుతో ఒక పిండిబొమ్మ చేసారు.పిండిబొమ్మ తయారీలో ఇవి ఉన్నాయి – రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, గణితం, వ్యర్థాల నుండి ఉత్తమంగా & కళ. ఇక్కడ “Law of Conversation of Mass”కి మించిన జ్ఞానం వస్తుంది. పిండిబొమ్మను బాలుడిగా మార్చడం – “నిర్జీవంగా నుండి జీవించడం” – అధునాతన వైద్య శాస్త్రం మరియు AI.

    ఇప్పుడు. చక్కనైన బాలుడు ముచ్చటగా ఉన్నాడు. చెప్పిన పని తూ.చా. తప్పకుండా పనిచేస్తున్నాడు. ఇకక్కడే వచ్చింది చిక్కంతా. ఎందుకంటే, ఇద్దరి చిప్స్ లో డేటా సెట్ అప్-డేట్ అవ్వలేదు. పిల్లాడి విషయం. శివుడి కి, శివుడి వివరం పిల్లాడికి తెలియక, అబ్బాయి ఇ ఆదరించవలసిన శివుడు, తన ఇఘోస్టిక్ ఆగ్రహంతో పార్వతి దేవి సృష్టిని , ముద్దు బుడ్డడి కుత్తుక ఖండిస్తాడు. ఆ బాలుడి గుర్తింపు తెలియక శివుడు ఇంట్లోకి ప్రవేశించాడు.

    ఆది దంపతుల అచ్చట్లు- ముచ్చట్ల మధ్యలో “ది బాయ్, హూ వజ్ బి-హెడెద్ ఎట్ ది డోర్!” టాపిక్ వచ్చింది. పార్వతిదేవి పుత్రశోకంతో వికవిలలాడింది. భార్యకు కలిగించిన మనోక్లేశానికి భర్త కళవళ పడ్డాడు. తానే, ధృవ-మార్కండేయులకి ఆయుష్-ప్రదాత అయిన శివుడిననే స్పృహ తెచ్చుకుని (దట్ మీన్స్, హీ రియలైజ్డ్, హౌ బిగ్ , హౌమాచ్ బిగ్గర్, హిజ్-హైనెస్స్ బిగ్గెస్స్ట్ బియో-సైంటిస్త్ హీ ఈజ్), ఆ గజాసురుని తల ఆ బాలుడికి అమర్చబడి అతన్ని బ్రతికించాడు. ఇదొక మెడికల్. మిరాకీల్, ఆర్గాన్ ఇంప్లాంటేషన్, బ్రెయిన్ ట్రాన్స్ప్లాంటేషన్ అప్-డేట్, – అదే జరిగింది.

    ఆపైన జరిగిందంతా మీకు తెలిసినదే.

    ప్రతి పురాణం వెనుకా సైన్సు ఉంది.

    ఇహ పూజ చేసుకుని, అక్షింతలు జల్లుకుని, పిండి వంటలతో భోజనం చేసి, విశ్రాంతి తీసుకోండి!

    సర్వేజనా సుఖినో~హ్భవనంతు!

    2
  • స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

    స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

    దేశమంటే మట్టి కాదోయ్! దేశమంటేo మనుషులోయ్!! ఇవాళ మన దేశం పుట్టినరోజు. దేశమంటే మనమే కాబట్టి ఇవాళ మనందరి పుట్టినరోజు!

    మరంచేత పొద్దున్నే పరకడుపునే ఇక్కడ కాలక్షేపం చెయ్యకుండా అర్జెంటుగా వెళ్లి తలంటు పోసుకోండి! ఆనక శుభాకాంక్షలు గట్రా తీరిగ్గా చెప్పుకుందాం. వీలయితే ఒక స్వీట్ తినండి ఆనందంగా. డయాబెటిస్ ఉన్నవాళ్లు కూడా ఓ చిన్ని చాక్లెట్ తినచ్చు!

    ఇహ సీనియర్ సిటిజెన్కి ఉండేవి జ్ఞాపకాలే కాబట్టి ఓపాలి రింగులు రింగులు ఫ్లాష్ బ్యాక్!

    నా స్కూలాభ్యాసం (ఎవరూ పుట్టించకపోతే భాష ఎలా పెరుగుతుంది. అంచేత ఈ తూరికి ఈ మాట నా కోటాలో వేయండి!) అంతా 60’s లోనే! అప్పట్లో మాకు ఇప్పటి పిల్ల పిడుగులంత తెలివితేటలూ, అపార లోక జ్ఞానం లేవు. బోల్డు అమాయకులం. ఆ వయస్సులో మనకి దేశం స్వాతంత్రము లాంటి పెద్ద పెద్ద మాటలకి అర్ధాలు తెలీకపోయినా పంద్రాగస్టు అంటే సెలవని, ఇస్కూల్ కెళ్తే జెండా ఎగరేసి, జనగణమన పాడించేసి చాక్లేట్లు ఇస్తారని మాత్రమే తెలుసు!

    అప్పట్లో ఫుడ్ ఫర్ వర్క్ అని పెద్ద పేరు పెట్టలేదు కానీ ఆ బుజ్జి చాక్లేట్లకి ముందు రోజంతా చిన్ని చిన్ని పిల్లలమనైనా చూడకుండా బోల్డు చాకిరీ చేయించేవాళ్ళు పంతుళ్లు!

    ఆ మధ్య ఇలాగే ఏదో రాస్తూ పంతుళ్లు అని రాసినందుకు ఒకాయన తీవ్రంగా అభ్యంతరం చెప్పారు. ఎందుకో నాకిప్పటికీ తెలీదు.

    హింతకీ మ్యాటర్ లోకొస్తే ముందు రోజు రంగురంగుల త్రికోణాకారం కాగితాలకి చివర మైదాతో రాసి పెద్ద పురికొసకి అంటించేవాళ్ళం. తదుపరి ఆ తాళ్లని స్కూల్ కాంపౌండ్ అంతా జిగ్ జాగ్ గా, తరగతి గదుల గుమ్మలకి తోరణాల్లా కట్టేవాళ్ళం. తర్వాత జెండా కొయ్యకి కూడా ఆ రంగు కాగితాలు కొయ్య కనిపించకుండా ఈ చివరి నించి ఆ చివరిదాకా అంటించి పైన జెండా కట్టేవాళ్ళం. అప్పటికి ఆ వయసులోనే నడుం పడిపోయినంత పనయ్యేది. కానీ ఏదో భారీగా సాధించిన తృప్తి.

    ఈ కార్యక్రమం అంత అయ్యేటప్పటికి సాయంత్రం ఏ నాలుగో అయ్యేది. అప్పుడు ఓసారి స్కూల్ కాంపౌండ్ నాలుగు మూలలకి వెళ్ళి మేము కట్టిన రంగురంగుల తోరణాలని చూసి మాకు మేమే శభాష్ అని సర్టిఫికెట్ ఇచ్చుకొనేవాళ్ళం. ఇప్పటి యూత్ కి అర్ధం అయ్యేలా చెప్పాలంటే బాహుబలి కోట భారీ సెట్ మొత్తం వేసాక రాజమౌళిగారు వచ్చి నడుం మీద రెండు చేతులు పెట్టుకుని పైనించి కిందకీ, కిందనించి పైకీ, కుడినించి ఎడమకీ, ఎడమనించి కుడికీ చూసి యూనిట్ వాళ్ళ వేపు చూసి వెల్ డన్ బాయ్స్ అనో లేదంటే మోహంలో ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చినట్టో, మేము కూడా మా పనికి మేమే మురిసిపోయేవాళ్ళం. హై ఫైవ్లు అప్పట్లో తెలీవు లేకపోతే అవిచ్చుకునేవాళ్ళం.

    హంత రోజు మొత్తం భారీ చాకిరీకీ చివరికి దక్కేది ఓ చాక్లేట్! కానీ కామ్రేడ్స్ దేశం మనకేమిచ్చిందని కాదు మనం దేశానికి ఏం ఇచ్చాం అన్నది, అదెవరన్నారో తెలీకపోయినా, అసలు ఎవరో అన్నట్టు కూడా తెలీకపోయినా, మనసా వాచా నమ్మిన మన దేశ భక్తులం అలనాడు!

    కాలేజీకి వచ్చాక ఇలా చాకిరీ చేసిన గుర్తు లేదు. గుర్తు లేదంటే చేసామేమో అని మీరు భ్రమ పడాలని. గట్టిగా అడిగితే చేయలేదని బాగా గుర్తుంది. ఎందుకంటే నిక్కర్ల నించి ప్యాంట్లకి ఎదగగానే ఏదో పెద్దమనుషులం అయిపోయిన ఫీలింగ్ మరి. పెద్ద మనుషులు పని చేయరు కదా? అందుకని మేము కూడా పంద్రాగస్టుకి ఎన్నడూ కాలేజీలో ఎలాంటి సేవ చేయలేదని సభా ముఖంగా డిక్లేర్ చేస్తున్నా. చేయని మంచి పనులు చేసినట్టు, చేసిన వెధవ పనులు చేయనట్టు చెప్పుకోవడం మా వంశంలోనే లేదు.

    రింగులు రింగుల ఫ్లాష్ బ్యాక్ నించి ఇప్పటి రోజులకొస్తే స్కూల్లో పంద్రాగస్టు చేస్తున్నారు కానీ పిల్లల చేత మేం చేసినట్టు డెకొరేషన్స్ చేయిస్తున్నారా?

    ఇహపోతే అందరికీ మన దేశ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

    మన దేశంలో ఉన్నంత స్వతంత్రం చాలా దేశాల్లో లేదని మనవి. అంచేత మనం భారతదేశంలో పుట్టినందుకు ఫీల్ గుడ్. అండ్ ఎంజాయ్.

    4
  • ఆడవాళ్ళూ! లా పాయింట్లు!!

    నిన్నటి నుంచీ ఒక్క రవ్వ నడుం నొప్పి! అయినా నా 4 కిమీ మార్నింగ్ వాక్ చేశాను అనుకోండి. ఎందుకంటే నాది సైనికుడి డిసిప్లిన్. నడుం నొప్పని సైనికుడు మార్నింగ్ డ్రిల్ కి డుమ్మా కొడతాడా? కొట్టడు. నేను సేమ్ పించ్!

    ఇవాళ కాస్త మాములు మనిషినవ్వాలని వంటింట్లోకెళ్ళి “తప్పుకో మా అమ్మకి చుక్కకూర పచ్చడి చేయమంది. చేసి పారేస్తా” అన్నా

    మా ఆవిడ “ఓవర్ ఆక్షన్ చేయకండి. అసలే నడుం నొప్పి అంటున్నారు. వెళ్లి రెస్ట్ తీసుకోండి. లేకపోతే ఉన్నాయిగా టీవీ నిండా చెత్త వెబ్ సిరీస్! వెళ్లి అవి చూసుకోండి” అంది

    నేను “హై ఫీవర్ తో సచిన్ క్రికెట్ మ్యాచ్ ఆడాడు. అతనే నా ఇన్స్పిరేషన్. తప్పుకో” అని ఈ హైదరాబాద్ వాతావరణానికి ఒకింత గాత్ర సౌలభ్యానికి అభ్యంతరం ఏర్పడినా అలాగే పోయిన గొంతుతో గొంతు చించుకు అరిచా.

    మా ఆవిడ చలిస్తేనా? “సచిన్ వయసులో ఉన్నప్పుడు అలా ఆడాడు. మీలా సీనియర్ సిటిజెన్ అయ్యాక కాదు” అని ఓ లా పాయింట్ లాగింది.

    (రామాయణంలో పిడకల వేట: అసలు లాయర్లలో ఆడవాళ్లు ఎందుకు ఎక్కువ ఉండరు. వాళ్ళు లాగినన్ని, పీకినన్ని లా పాయింట్లు ఇంకెవరూ పీకలేరు కదా?)

    నాకో సందేహం. సచిన్ అలా హై ఫీవర్ తో క్రికెట్ మ్యాచ్ ఆడుతూంటే వాళ్ళావిడ అభ్యంతరం చెప్పలేదా? అసలు ఫీవర్ ఉన్నట్టు ఆవిడకి తెలుసా? తెలిసి, చెప్పినా సచిన్ ఆమె మాటని తోసి పుచ్చి మ్యాచ్ ఆడాడా? చరిత్రలో ఇలాంటి ఇంపార్టెంట్ చిన్న చిన్న పాయింట్స్ రాయకపోవడంతో నాబోటి వాడికి అలాంటి ప్రఖ్యాత ప్రముఖుల్ని ప్రేరణగా తీసుకుని అలా ఆ విధంగా ముందుకి వెళ్లే సదవకాశాలు ఉండవు.

    ఇదేటిది? మనం ప్రముఖుల్ని గురించి, విని, చదివి, వీడియోలు చూసిన వెంటనే తర్వాత వచ్చిన మొట్టమొదటి అవకాశం వాళ్ళ ఇన్స్పిరేషన్ తో చేసేస్తాం కదా? చెయ్యాలి కదా? కానీ మా ఆవిడ థియరీ ప్రకారం KFC ఓనర్ (ఆయన పేరేంటో? అయినా ప్రేరణకి పేరుతొ ఏం పని లెండి!) తన 65 ఏట KFC స్టార్ట్ చేసాడు కాబట్టి మనకి చిన్న వయసులో ఏదన్నా వ్యాపారం మొదలెట్టాలన్న ఇన్స్పిరేషన్ వచ్చినా 65 ఏళ్ళు వచ్చేదాకా ఆగాలన్న మాట!

    నాకస్సలు నచ్చలేదు ఈ థియరీ!

    కానీ ఇంట్లో పురుషుడికి కనీస హక్కులే ఉంటాయి. ఏతా వాతా వంటింటి సర్వ హక్కులు ఆడవాళ్లవే కాబట్టి ఈ పూటకి నాకు వంటింటి ప్రవేశం నిషిద్ధం!

    నేనేదో ఇలా నడుం నొప్పితో వంట చేసి నా జీవిత చరిత్రలో ఏదో ఒక చాప్టర్ చివర ఓ చిన్ని బాక్స్ లో ఇలాంటి టిడ్ బిట్స్ పెట్టుకునే ఓ మహత్తర అవకాశం పోగొట్టుకున్నా!

    ఐ డోంట్ లైక్ ఇట్ యార్!

  • న ఓంఢ్ర గార్ధభ!

    న ఓంఢ్ర గార్ధభ!

    “ఓంఢ్ర పెట్టడం మానేస్తున్నాను!” పత్రికా ముఖంగా ప్రకటన చేసింది “న ఓంఢ్ర గార్ధభ”! ఇలా ఒక గార్ధభం ప్రకటన చెయ్యడం మొదటిసారి అవడంతో జనావళిలో కలకలం రేగింది. సహగార్ధభాలన్నీ ఈ నిర్ణయానికి విస్తుబోయాయి. కొన్ని యుగాలుగా ఇటువంటి వైపరీత్యం ఎరుగని జంతుజాలం అంతా కలిసి అసలు ఈ విషయం అంతు చూడాలని బయలుదేరాయి.

    ఒక పెద్ద మైదానంలో సభ కొలువు తీరారు. సభావేదిక మీద, “నఓంఢ్ర ప్రతిజ్ఞా పాలన చేస్తున్న గార్ధభం గారు ” మాత్రమే ఉన్నారు. ఎదురుగా ఎడమ ప్రక్క స్వజాతి గుంపు, కుడి ప్రక్కగా నానాజాతుల సంఘటిత గుంపులు కూడి ఉన్నారు. స్వజాతి గుంపు ఆతృత గా ఎదురు చూస్తుంటే, మిగిలిన జాతులన్నీ ఇప్పుడు జరగబోయే సభలో తమ ధృక్పధం ఎలా తెలియచెయ్యాలో మంతనాలు చేస్తున్నాయి.స్వజాతి గార్ధభాలు కొన్ని, ఈ నఓంఢ్ర గార్ధభకి బేషరతుగా మద్దతు పలకాలా? లేక అంశాలావారీగా మద్దతు తెలియచెయ్యాలా అని తర్జన భర్జన పడుతున్నాయి.

    కొన్ని పెద్దరికం గార్ధభాలు గుంపు, గంభీరంగా తోకలు ఊపుతూ, మెజారిటీ ఎటు ఉంటే అటు దూకే ఆలోచన బయటపడనివ్వకుండా 30 డెసిబల్స్ మించకుండా ఓంఢ్రిస్తున్నాయి. పరువంలో ఉన్న పిల్ల గార్ధభాలు, “ఓంఢ్ర పెట్టడం తమ జన్మహక్కు, దానికి త్యజించడం అంటే జాతి అస్థిత్వం కోల్పోవడమే” పెద్ద ప్లకార్డులు తోకలకు కట్టుకుని అటుఇటు ఊపుతున్నాయి. “సభా మర్యాద, సభా మర్యాద?”, అంటూ వాటిని హెచ్చరించబోయిన గంభీర గార్ధభాలని వారించాయి కొన్ని సమయస్పూర్తి గార్ధభాలు, “ఈ సభ అయిపోయేవరకు వాటిని అలా ఊపుతూ ఉండనివ్వండి, ఈ గుంపులో కొద్దిగా గాలాడుతుంది” అంటూ.

    వారు ఇవ్వబోయే సందేశం కోసం ఎదురు చూసి చూసి, శోషవచ్చ్చి సోలిపోయిన కొన్ని అర్భక గార్ధభాలు, పక్కనే ఉన్న సోడా కొట్టుని ఆశ్రయించాయి.

    నానాజాతి గుంపులలో కొన్ని జంతువులు అక్కడికి వినోదం కోసం వస్తే, కొన్ని వేట కోసం వచ్చాయై. బాగా ట్రెయిండ్ అయినవి కొన్ని వేగుల్లా పనిచేయడానికి, కొన్నేమో ఊరికే ఆరుబయట తిరగే బదులు, ఇక్కడకొస్తే ఏమైనా చిరుతిండి దొరకచ్చేమో అన్న ఆశతో, కొన్నేమో మావాటితో మేము, మాకు అజెండా ఏమీ లేదు మా జాతి జెండానే ముఖ్యం అనుకుంటూ ఈ సభలో దూరిపోయాయి.

    గలగలలు, గొణగొణలు, గుసగుసలు, కీచుగొంతులు, మౌనముద్రలు, హుంకరింపులు, అదిలింపులు, బెదిరింపులు, లాలింపులు, కేరింతలు, గావుకేకలు, పెడబొబ్బలు, ఘర్జనలు, వెక్కిరింతలు, పలకరింపులు, చీత్కరింపులు, అలా అలా అన్ని రకాల ఇంపులులో స్టేజీ మీద ఉన్న “న ఓంఢ్ర గార్ధభ” ని పట్టించుకునేవాళ్ళే లేకపోయారు.

    ప్రేక్షకులందరి దృష్టి తనవైపు మరల్చుకోవాలనుకున్న తపనతో “సైలెన్స్” అని మైకులో అరవాలనుకున్నా కానీ, ఆ ఓంఢ్రింపు కూడా వ్రతభంగమే అవుతుందని, ఏమీ చెయ్యాలో తెలియని దిక్కుతోచక దిక్కులు చూస్తూ ఉండిపోయారు “న ఓంఢ్ర గార్ధభ” గారు.

    నీతి: ప్రతిజ్ఞ కంటే ప్రచారం ముఖ్యం!

    #అంతర్వాహిని_కథలు

    2
  • ఈ ప్రపంచమే మహా స్మశానం!

    ఈ ప్రపంచమే మహా స్మశానం, చావులు-పుటకలే ఉన్నాయి ఇక్కడ!

    జారిపోవడానికో జాతి,

    కుళ్ళిపోవడానికో కులం,

    మోసపోవడానికో మతం,

    విడిపోవడానికో వర్గం,

    గందరగోళానికో గుంపు,

    అవే ఉన్నాయి ఇక్కడ, మనిషి అస్థిత్వం స్థిరం నాస్తి!

    ఈ ప్రపంచమే మహా స్మశానం, చావులు-పుటకలే ఉన్నాయి ఇక్కడ,

    మితృ-మితృ-శతృవుల్లెవ్వరూ లేరిక్కడ,

    అవసరాలేమి లేవిక్కడ, ఆకలి, వాంఛల అవకాశాలు మాత్రం ఉన్నాయిక్కడ

    ఆకలి కేకలి ఆలోచన్లు , వాంఛల ప్రకోపాలు అవే ఉన్నాయి ఇక్కడ,

    పూడ్చిపెడితే మట్టైపోతావు,

    తగలబెడితే మసైపోతావు,

    నీదేం ఆలోచన?, నీదేం ప్రకోపం?

    స్మశానంలో యుద్ధమూ ఉండదూ, శాంతీ ఉండదూ!

    ఈ ప్రపంచమే మహా స్మశానం, చావులు-పుటకలే ఉన్నాయి ఇక్కడ!

    #అంతర్వాహిని

    1
  • 2. ఓం నమో భగవతే రుద్రాయ

    2. ఓం నమో భగవతే రుద్రాయ

    ఎండాకాలం వస్తే కాలనీ సందడి భలే ఉంటుంది. ఇంట్లోకన్నా పిల్లలందరూ బయటే ఉంటారుగామరి. పిల్లలేకాదు, కుర్రాల్లు పిట్టగోడమీదే వేళ్ళాడతారు. పెద్దవాళ్ళు వాకింగులు టాకింగులు అంటూ పార్కు కమ్యూనిటీ హాలులో సగం రోజు గడిపేస్తారు. రిటైరుడు ఏఈ శోభన్ బాబు గారు ఇన్ఫ్లుయెన్సుతో అక్కడికి ఓ కరంటు కనెక్షన్ తెప్పించారు కొన్నేళ్ళకిందట. ఓ రెండు సీలింగు ఫ్యాన్లూ, రెండు పెడస్టల్ ఫ్యాన్లూ రియలెస్టేటు మోహన్ చేత ‘స్పాన్సర్’ చేయించారు — ఆయన కంపెనీ పేరు రాసే అనుకోండి. మామూలురోజుల్లో పిల్లలు ఐదున్నరయ్యేసరికి ఇంటికి రాకపోతే బాల్కనీలలోకి, అరుగులమీదకి వచ్చి పెద్ద అరుపులు అరిచే తల్లులందరూ ఎనిమదయినా ఏం పర్లేదు ఈ చుట్టుపక్కలే ఎక్కడో ఉండుంటారని హాయిగా అరుగు బాతాఖానీ కొట్టుకుంటూ ఉండిపోతారు. రెండునెళ్ళ సెలవలు — అందరికీను.

    పార్కు వెనకవైపు గోడ అవతల హెచ్చైజీ ఇల్లు సుదర్శనంకుల్ ది. వాళ్ళబ్బాయి ఇంగ్లాండొ ఫిన్లాండో ఎక్కడో ఆన్సైటులో ఉన్నాడు కొన్నాళ్ళుగా. ఈ సంవత్సరం అంకుల్, ఆంటిని అక్కడికి రమ్మని టికెట్లు తీసాడు. తిరగడానికి కాదులెండి. ఆరోనెల కడుపుతో ఉంది కోడలుమరి. ఆల్రెడీ ఇంట్లో నాలుగేళ్ళ పిల్లోడున్నాడు. తప్పదుగా! కొరియర్ కంపెనీలో పచ్చడ్లు ప్యాకింగు చేయించేసుకుని, మూన్నెళ్ళకి సరిపడా మందులు పట్టేసుకుని, బొంతల కుట్టడానికి పాత చీరలు పట్టుకుని రెడీ అయ్యి ఫ్లైటెక్కేశారు ఇద్దరూను.

    ఇంతకీ మనకి ఇందులో ఇంట్రెస్టేమిటంటే ఆ ఇంటి లోపల గోడకానుకుని ఆసియాఖండంలోకల్లా గొప్ప మామిడిచెట్టు ఉంది. అది బంగినపల్లని కొందరూ, కాదు ఆల్ఫన్సోనో లంఘడానో కొబ్బరిమామిడీ అని మరికొందరూ ప్రతీఏడాదీ ఆర్గ్యూచేసుకోవడం ఆనవాయుతీ. ఏదయితేనేం ప్రతీ సంవత్సరం మే నెలలో పండేది, ప్రతీ ఇంటికి ప్రసాదంగా రెండో మూడో సాంక్షన్ అయ్యేవి. ఆ కోటాకోసం సంవత్సరమంతా అంకుల్ కి గుడ్మార్నింగూ గుడీవినింగూ చెప్పేవాళ్ళం. మరేపండు టేస్టూ దానికి సాటిలేదు. ఎందరో ట్రై చేశారు. కలకత్తనుంచీ అని, అలమండనుంచీ అని, సింగపూరునుంచీకూడాను. ఏ డబ్బాకొన్నా, ఎంతపోసినా ఆ టేస్టు నభూతో నభవిష్యత్!

    ఈ ఏడాది ఊరెళ్ళడంతో ఆంటీ మావయ్య ఒకాయన్ని ఇంటికాపు పెట్టి వెళ్ళారు. ఆయన స్వచ్చమయిన తెల్లపంచతో పెద్దమీసాలుపెట్టుకుని భలే ఉండేవారు. విజయనగరం దగ్గరేదో అగ్రహారమంటాయనది. ఉదయాన్నే లేచి పార్కు చుట్టుపక్కలున్న పూలు కోసుకొని మంచి గొంతుతో గట్టిగా రోజూ చాలాసేపు పూజచేసేవారు. మేము పార్కుచుట్టూ సైకిల్ తొక్కుకుంటుంటే రౌండు రౌండుకీ అష్టోత్తరాలు సహస్రాలూ వినబడేవి. తాతగారికి బయట స్నానం చెయ్యడం అలవాటు. ఊర్లో ఇంట్లో బావో తొట్టో ఉండుంటుంది. ఇక్కడలాంటి అవకాశం లేదుకాబట్టీ గార్డెన్ పైపు దగ్గరో బక్కెట్టుపెట్టుకుని అక్కడ స్నానం చేశేవారు. ఆ స్నానంచేస్తున్నంతసేపూ రుద్రం గట్టిగా చదివేవారు. ఆ రుద్రం అయ్యేవరకు స్నానం అవ్వదు.

    ఇదంతా మేము మా డిటెక్షన్ తెలివితేటలతో తెలుసుకోవడానికి కారణం ఆసియాలో బెస్టు మామిడికాయలు.

    అంకుల్ ఇల్లు పార్కు వెనకుండడంతో అటుపక్క పెద్దగా ఎవరూ వెళ్ళే పనుండదు. అందుకు ఇంటిగోడకి ఇవతలిపక్క ప్రతీ సమ్మర్లో కంచె కట్టించేవారు సుదర్శనం గారు. ఈ ఏడాదికూడా ఫారెనెళ్ళే ముందే కట్టించేసారు. గోడ ఎడ్జిదగ్గర కాలవ పారడానికి మాత్రమే అందులో గ్యాపుండేది. మిగితాదంతా ముళ్ళు. దాదాపు అందరమూ ఆ ముళ్ళకి చొక్కాలు చింపుక్కున్నవాళ్ళమే. ఈ సంవత్సరం మాత్రం పెద్ద స్కెచ్చేసి మేలో వచ్చే రెండుపళ్ళ ప్రసాదంకాదు ఓ డజను కాయలు కోసేసి ఉప్పు కారం నంచుకుని తినేయాలని నలుగురం నిశ్చయించుకున్నాము. అయితే తాతగారు రోజంతా తోటలో ఏదో పని చేస్తూనే ఉండేవారు. పూజకూడా వరండాలోనే చేసుకునేవారు. పడుకోవడం కూడా అక్కడే. ఒక్క స్నానం చేసినప్పుడుమాత్రమే ఓ పదిహేనిరవై నిమిషాలు సేఫు అని డిసైడయ్యాము.

    మాలో సన్నంగా ఉండేది టింకు. పార్కులో ఉన్న చెట్లన్నీ ఎక్కించేశం వాడిచేత ప్రాక్టీసుకి. ఓ అశోకా చెట్టుంటే అది కూడా ఎక్కించాం. మధ్యలో కాకొకటి గూడు కట్టుకుంది. దాని దగ్గరకెళ్ళేసరికి గుండుమీద గుచ్చేసింది పాపం వాడికి. లక్కీగా పెద్ద రక్తమేం రాలేదులెండి. మిగితా ముగ్గురం ఒక్కో డ్యూటీ వేసుకున్నాం. అనిల్ గాడు పార్కుగోడమీదనుంచీ తాతగారిని చూసి మాకు పొజీషన్ చెప్పాలి. అభయ్ గాడు సైకిలేసుకుని గేటు దగ్గరే తిరుగుతూ ఎవరొచ్చినా సిగ్నల్ ఇవ్వాలి. నేనేమో టింకుగాడికి గైడెన్సు కిందనుంచీ ఎలాఎక్కాలి, పళ్ళెలాకొయ్యాలి అని. ఒక గెస్టునికూడా తెచ్చుకున్నాం. మా గణపతి టెంపుల్ పూజారి ప్రసాదుగారి కొడుకు మనోజుని. వాడు మాకన్నా ఏడాది చిన్న. కానీ వాడికప్పుడే జూనియర్ పంతులుగా ట్రయినింగ్ ఇచ్చేస్తున్నారు వాళ్ళ నాన్నగారు. రుద్రం ఎప్పుడయిపోతోందే చెప్పే డ్యూటీ వాడిది.

    సాయంత్రం ఐదయ్యింది. తుండుగుడ్డ తెచ్చుకుని తాతయ్య స్నానానికి బయలుదేరారు. గేటుదగ్గరనుంచీ అభయ్ సిగ్నల్ ఇచ్చాడు, ఆపరేషన్ మొదలు అని. గోడమీద అనిల్ కన్ఫర్మ్ చేశాడు, “కనబడుతున్నారు, బకెట్లో నీళ్ళు నింపుతున్నారు, ఓవర్” అని. మొదటి మగ్గు నెత్తిమీంచీ పోసుకోంగానే టింకుని కంచెపక్కన కాలవలోంచీ లోపలికి తోసేశాం. చేతిమీద ఓ రెండు గీతలతో తప్పించుకుని అటుపక్కకెళ్ళిపోయాడు. వెంటనే గోడెక్కి చెట్టెక్కడం మొదలెట్టాదు.

    ఓం నమో భగవతే రుద్రాయ….

    మొదటి కొమ్మ మీదనుంచీ సౌండుచెయ్యకుండా పాక్కుంటూ చెట్టు మధ్యకి చేరాడు.

    నమో హిరణ్య బాహవే…

    మూడోకొమ్మ పట్టుకుని పళ్ళున్నచోటకి చేరిపోయాడు. మామీదమాకు భలే గర్వమేసింది. భలే ట్రెయినింగ్ ఇచ్చామురా అని. గేటు దగ్గర, గోడమీద మన వేగులు అన్నీ క్లియర్గా ఉన్నాయని సంకేతమిచ్చారు.
    ఆ పైన ఒక బ్రహ్మాండమయిన పచ్చరంగులో ఆరుకాయలు గుత్తు చూపించాను టింకుకి. మనోజుని అడిగాము — “ఎంతవరకు వచ్చారాయన” అని.

    శంకరాయచ మయస్కరాయచ నమఃశివాయచ శివతరాయచ….

    సగంపైన అయిపోయింది తొందరపడండన్నాడు. చిన్న ఈళవేసి “తొందరగారా” అని టింకూకి చెప్పాం, వాడు పాక్కుంటూ ఆ ఆరుకాయలున్న కొమ్మని విరిచేసాడు, కానీ వాడి ఊపుడులో బరువుకి అది ముల్లమధ్యకి పడిపోయింది. అయ్యో అని బుర్రపట్టుకున్నాం అందరం!

    ద్రాపే అంధసస్పతే…

    “తొందరగా! అయిపోవచ్చింది” అన్నాడు మనోజు. వెనక్కి తిరుగుతూ పక్కనున్న మరో రెండు చిన్న కాయలు కోసుకుని జేబులో కుక్కేసి పాక్కుంటూ దిగడం మొదలెట్టాడు.

    త్ర్యంబకం యహామహేసుగంధిం…

    “అయిపోయింది, తొందరగా” అని మా చిన్నపంతులు చెప్పేసరికీ గాబరాకి రెండో కొమ్మమీదనుంచీ దూకేసాడు. మాకు ఆ సౌండు ఏదో దీపావళికి లక్ష్మీ బాంబు పేలినట్టు వినిపించింది! అనిల్ గాడు వెంటనే తాతగారివైపు చూశాడు. కానీ బక్కెట్టెత్తి నెత్తిమీదనుంచీ నీళ్ళుపోసుకుంటున్నారాయాన “శంభో శంకర” అని. ఊపిరి పీల్చుకున్నాం. గభేలున గోడెక్కేసి ముల్లకంచెకి అటువయిపు దూకూశాడు టింకు. “వచ్చేయి, వచ్చేయి” అని ముగ్గురం పిలిచాం, “తాతగారొచ్చేస్తారు” అని. వరండాకి మామిడిచెట్టు పక్కనుంచే రావాలి మరి. కానీ మా టింకూగాడేం ఆశామాషీవాడు కాదు! ఎలాగోలా ముళ్ళమధ్యలోంచీ ఆరుకాయలున్న కొమ్మని పట్టుకుని కాలవ సందులోకి పడేశాడు. అది నేను తీసేసి అభయ్ సైకిల్ ముందున్న బుట్టలో పెట్టేశాను. దానిమీద గుడ్డకూడా కప్పేసాం. ప్లానింగలాంటిది మరి! పాక్కుంటూ మరో రెండు గీతలు గీకించుకుని టింకు బయటపడ్డాడు. “పద, పద పార్కులోకి వెళ్ళిపోదాం” అని సైలెంటుగా మేము పరిగెడుతుంటే,

    ఓం నమో భగవతే రుద్రాయ …

    అని మళ్ళీ వినిపించింది! అందరం స్లోమోషన్ లో మనోజు వైపు తిరిగాము. వాడొకసారి ఆలోచించి “ఒరేయి, ఇవాళ మాసశివరాత్రి, సోమవారం, అందుకని మరో సారి చదువుతున్నట్టున్నారు” అన్నాడు. టింకు వాడిని కొట్టినంతపనిచేశాడు! “ముందు చెప్పొద్దా పెద్ద పంతులన్నావు…”
    “నాకెలా తెలుస్తుందిరా” అని కంట్లో నీళ్ళు పెట్టేసుకున్నాడు మనోజ్. “సర్లే పదండ”ని పార్కులోకెళ్ళి పంపుదగ్గర కడిగేసుకుని తలో కాయ తీసాం. ఇంట్లోంచీ అందరం ఉప్పు కారం పొట్లం కట్టుకొచ్చాం ముందే. అది తీసి ఎక్కడ అయిపోతాయో అని చిన్న చిన్న ముక్కలు కొరుక్కుంటూ తినేశాం. తిన్నంతసేపూ రుద్రం వినబడుతూనే ఉంది. మూడుసార్లు చదివారంట తాతగారు, మనోజ్ చెప్పాడు. ఎక్కువ కష్టపడినందుకు టింకుగాడికి ఒక కాయ ఎక్స్ట్రా.
    ఆ సంవత్సరం మరో రెండుమూడుసార్లు ఇలా సెట్ చేశాం. మాకు కోటాకింద తలా ఒకటో రెండూ పళ్ళుమాత్రమే వచ్చాయాసంవత్సరం.
    ఆ తరువాత చాలారోజులు మాకు ఎక్కడ రుద్రం వినబడినా ఆ మామిడిపళ్ళే గుర్తొచ్చేవి.

    ఆ టేస్టలాంటిది మరి!😍🥭

    ____________________

    ఈ శీర్షిక లో మరి కొన్ని కాలనీ కథలు 🩷

  • సత్య పెళ్లి

    ఒక సారి 1972 మొదట్లో అనుకుంటా..సత్య ఇంటికి వెళ్లా.

    హాల్లో కూర్చుని తన కోసం వెయిటింగ్.ఇంతలో ఇంకెవరో వచ్చారు.అప్పటికే చూసి సంవత్సరం పైన అయిందేమో ఓ క్షణం తటపటాయించి గుర్తు పట్టి అరే..మీ మొటిమలు ఏమైపోయాయి అని అడిగా ఆ అమ్మాయిని ..నాకు అక్కడ అలా చూసే సరికి involuntary గా వచ్చేసింది. మొటిమలు అలా ఉండి పోతాయా?అంటూ రుసరుసలు.

    వాడు వచ్చి మీట్ …. అని పరిచయం. ఓసోస్ అనుకొని నాకు తెలుసులే అన్నా. కొంచెం సేపు ఎదో మాట్లాడి వెళ్ళిపోయింది. నేను వాణ్ణి .. ఏరా..మాకు తెలియకుండా కథ నడుపుతావా ?అని క్లాసు పీకా ! ..అది కాదు అని కవర్ డ్రైవ్.

    సరే. నేను మరల ఆ అమ్మాయిని కలవ లేదు. 1972 జూన్ లో వాడు Sagar univ/నేను Nagpur univ వెళ్ళి పోయాము. బతుకు దారులు వేరయ్యాయి. 1974 లో నా పెళ్లి. నా JNU ఆశ అడియాశ అయిపోయింది.ఇంతలో సత్య కు JNU లో సీట్.నేను సంతోషపడ్డా. వాడు JNU లో PhD చేశాడు.

    నేను 1977 లో బ్యాంకు ప్రొబేషనరీ ఆఫీసర్ గా సెలెక్ట్ అయ్యాను.

    ఒక సారి సెలవల్లో నేను Delhi నుండి కొవ్వూరు కు వచ్చా. వీరభద్ర రావు అప్పటికి SI గావెలగబెడుతున్నాడు. వాడు,నేను,సత్య కలిశాం. రాజమండ్రి హోటల్ రూం లో సత్య పెద్ద ఎత్తున డ్రామా చేసి, నేను ఆ అమ్మాయినే చేసుకుంటాను. ఇంకెవ్వరూ వద్దు. ఇంట్లో ఒప్పుకుంటం లేదు. అంతస్తులు వేరట అని వాపోయాడు.

    మీరు తప్ప నాకు దిక్కు లేదు అని నల్ల mail చేశాడు. నేను.. ఒరే దొంగ వెధవ..మాకు చెప్పకుండా ఇంత తతంగం నడిపి ఇప్పుడు అంటే ఎలా? అని తిట్టి పోసాను.

    వీడి బాధ చూడలేక నేను భద్రం వాళ్ళ ఇంటికి వెళ్ళాం.వాళ్ళ నాన్న గారు (దత్తత తీసుకున్నారు వీణ్ణి )నన్ను,భద్రాన్ని భయంకరంగా తిట్టి,ఎందుకయ్యా మీరు స్నేహితులు..మీరు వాడికి నచ్చ చెప్పలేరా? అని క్లాసు పీకి భయంకరమైన 4 తిట్ల సెషన్ల తర్వాత ఒప్పుకున్నారు. నేను ఢిల్లీ వెళ్ళి పోయాను .

    సత్య పెళ్లి పిలుపు చేరింది. కాన్పూర్ నుండి సతీ సమేతంగా వచ్చాను. కొన్నాళ్ళకు ఇంట్లోవాళ్ళు సమాధాన పడ్డారు. ఆ అమ్మాయి PhD చేసి,Prof అయింది. వీడు కూడా Prof. అలా మాకేవ్వరికి తెలియకుండా రహస్యం గా 6 ఏళ్లు నడిపాడు కథ… ప్రేమకథలు గమ్మత్తు గా జరిగి పోతాయి…

    (సశేషం)

  • ఆర్ట్స్ కాలేజీ కబుర్లు -3

    అన్నట్టు చెప్పటం మరిచా- మా దోస్తు సత్య DNA — పసిమి వన్నె అందగాడు.మడత నలగని బట్టలు,చెదరని క్రాఫ్.

    సరే నేను ఆట పట్టిస్తున్నానని గుర్రుగా చూసాడు.మర్నాడు మళ్ళీ అదే పాప అక్కడ నుండి కదలటం లేదు.కండక్టర్ అదిలించినా అక్కడే. కదిల్తే గా?

    నేను సత్యతో”ఆ మొటిమల అమ్మాయి గత 4 రోజుల నుండి నీదగ్గరే తచ్చాడుతుంది. అసలు కథ ఏమిటో కనుక్కో”అన్నా. వాడు ఓ రెండు రోజుల తర్వాత ధైర్యం కూడదీసుకొని hello అని మాట కలిపాడు.(ఆ రోజుల్లో బస్సు సీట్లల్లో ఆడ మగ కలిసి కూర్చునే వారు కాదు ). మాట మాట పెరిగి ఫ్రెండ్స్ అయ్యారు వారిరువురు.

    బస్సులో తెగ అల్లరి చేసే వాళ్ళలో వీరభద్రరావు ప్రథముడు. ధవళేశ్వరం SI గారి అబ్బాయి. నా సింగిల్ సీట్ లో ఇరికి నా ముఖానికి ఎదురుగా, ముందు సీట్ కు వీపు ఆన్చి కూర్చునే కళ ఎవరి అబ్బదు.దేవ్ ఆనంద్ Jewel Theif కాలరు,రాజేష్ ఖన్నా guru షర్టులు,గళ్ళ చొక్కాలు వాడి స్పెషాలిటీ.ఒక్క క్షణం ఊర్కొడు.హాస్యానికి మారుపేరు. సభ్యత గిరి లో ఇమిడి కామెడీ చేసేవాడు.అందరికీ ఇష్టుడు.అమ్మాయిల టిఫిన్ బాక్సుల్లో ఉప్మా ఓపెన్ గా అడిగి తినేవాడు.

    ఒకసారి, ఒరే గౌసూ “ఇష్క్ పర్ జోర్ నహి” అంటే అర్ధం ఏంట్రా? అని నన్ను అడిగాడు. నేను చెప్పబోయా. వాడు నన్ను ఉద్దేశించి ఆ మాత్రం తెలియదా ? “ఇసుక మీద జోరుగా పరుగెత్త వద్దు” అని అర్థం అన్నాడు . ఆడ మగ అందరూ గట్టిగా నవ్వారు.. పైగా జనాంతికంగా “మా గౌస్ కు ఏమీ తెలియదు. Atomic energy తప్పించి “ అని చెప్పాడు. అందరూ మళ్ళీ నవ్వులు. ఇలా సరదాగా నడిచేది నా కాలేజి యాత్ర. ఇంతకూ బస్సులో వచ్చే అమ్మాయిలు ఆర్ట్స్ కాలేజ్ వాళ్లు కాదు. విమెన్స్ కాలేజి బాపతు.

    మొత్తానికి చివరి సంవత్సరం లో ప్రవేశం. .

    డైరెక్ట్ గా కడియం నుండి ఆర్ట్స్ కాలేజీకి బస్సు పడింది. 3A నంబర్. సరదాలు,స్నేహితులు,సినిమాల మధ్య కాలం పరుగిడిన వైనం.

    కొన్నాళ్ళు సత్య గాడి జావా పై కాలేజి కి. ఆ రోజు ఫైనల్ year valedictory function. సత్య డ్రెస్ విషయంలో చాలా పర్ఫెక్ట్ .సాయంత్రం ఫంక్షన్ కు ఇస్త్రీ చేసిన white pant,white Shirt సంచి లో పెట్టుకొని ( అప్పుడే వేసుకొంటే నలిగి పోతాయని, కాలేజీలో వేసుకోవాలని తలంచి ) జావా హ్యాండిల్ కు తగిల్చి రయ్యిన వేమగిరి నుండి వైయా బొమ్మూరు కాలేజి బయలు దేరాం. కాలేజీ చేరిన తర్వాత నేను ఒరే సత్యా..ఏదో వాసన వస్తుంది అన్నా. గబుక్కున హ్యాండిల్ కున్న బాగ్ లో చూస్తే , బాగ్ తో బాటు లోపలున్న పాంటు కూడా కాలిపోయింది. సైలెన్సర్ కు తగిలింది కాబోలు. చాలా మధనపడ్డాడు ఇస్త్రీ బట్టలు లేవని. నేను పోనీలేరా అంటే ఫైనల్ ఫంక్షన్ నాడు ఎలా, ఇస్త్రీ బట్టలు లేకుండా ? వెనక్కి వెళ్దామంటే టైం లేదు అని తెగ ఇదై ఫీల్ అయిపోయాడు.( 1971 అంటే –Rapido లు , మొబైల్ లు లేని కాలం).

    (సశేషం)

  • ఆర్ట్స్ కాలేజి కబుర్లు -2

    రెండో సంవత్సరం లో అడుగిడిన ఆ రోజుల్లో మా ప్రిన్సిపాల్ మేజర్ నదిముల్లా (ఆయనకు ముందు ప్రిన్సిపాల్ హబీబుల్లా). Ex Military.బాగా టెర్రర్. నేను NCC NSS ఎగ్గొట్టిన రోజులు.నాది పొరుగూరు కదా..కుదరదు.

    రోజూ కాలేజి నుండి సాయంత్రం ఇంటికి ట్రైన్ లో వచ్చేవాడిని.రాజమండ్రి స్టేషన్ కు కు రాగానే చిల్లర లెక్క పెట్టి 80 పైసలు ఉంటే,చపాతీ ఆలు కూర 40పైసలు,మా పెద్ద చెల్లాయి కి Coats ఎంబ్రాయిడరీ దారం 40 పైసలు. ఎంత సంతోషమో తనకి ఆ చిన్ని వస్తువు తెచ్చి నందుకు.!

    ఓ నెల తర్వాత కాలేజి నోటీసు బోర్డు లో తెలుగు వ్యాస రచన పోటీ.

    నేను గారు కూడా బరిలోకి దుమికారు. ఓ 50 మంది హాజరు. రెండు గంటల వ్యాసం.” శాస్త్రీయ విజ్ఞానం” గురించి. అప్పుడే ఇచ్చారు టాపిక్.రెండు గంటలు కూర్చునే ఓపిక ఎక్కడ.. గంట లో వ్రాసి బయట పడ్డా..

    రెండు రోజుల తర్వాత క్లాసులందర్ని సమావేశ పరిచి విజేతల ప్రకటన.నేను గారికి మొదటి బహుమతి.నా పేరు విని చాలా మంది నా వైపు తేరిపారా చూసారు. నేను గిల్లుకొన్నా. తెలుగు భాషకు కల్చరల్ కాణాచి అయిన రాజమండ్రీ లో నాకు ఫస్ట్ ప్రైజ్. విశ్వనాథ వారి దంతపు దువ్వెన పుస్తకం ఇచ్చారు.

    ఈలోగా సినిమాలు చూసే జోరు పెరిగింది.హిందీ సినిమాలు అప్సర లో, ఇంగ్లీష్ సినిమాలు(జాంపేట లో ఉన్న మూడు హాళ్ళలో ” లక్ష్మి “అనుకొంటా ).

    అన్నట్టు ఆ రోజుల్లో ” అప్సర హోటల్ ” కి వెళ్ళటం ఓ రేంజి. రెండు నెలల కో సారి వెళ్ళి ఇడ్లీ తిని పావలా వేసి జుక్ బాక్స్ లో Billy vaghun come sept వింటే ఎవరెస్ట్ ఎక్కినంత సంబరం.

    ఒక సారి ఇద్దరు ఫ్రెండ్స్( భద్రరావు +రామారావు ) లతో శ్యామల టాకీస్ లో “పగ్ల కహిక” సినిమా కు వెళ్ళాం.ఫస్ట్ న్ లాస్ట్ టైం క్లాస్ ఎగ్గొట్టటం. నాతో వచ్చిన ఇరు మర్కటాలు,కిచ కిచా అని సుత్తి కామెంట్లు. ఇంటర్వల్ లో లైట్ లు వెలిగాయి.

    వెనక నుండి ఎవరో తట్టారు.వెనక్కి చూసా..అమ్మ+నాన్న. కాలేజి లేదా? నేను నా ఫ్రెండ్స్ ఏదో చెప్పాం.

    నెక్స్ట్ half లో కిక్కురు మంటే ఒట్టు.ఇంటికి వెళ్ళిన తర్వాత తీవ్రమైన తలంటు.

    ఇలా జరుగుతుండగా,నేను ట్రైన్ మానేసి రోజూ మా ఇంటి నుండి 1.5 km నడిచి కడియం వంతెన దగ్గరికి వెళ్ళి రెండో నంబర్ బస్సు ఎక్కేవాడిని.అది జాంపెట లో దింపేది.అక్కడ నుండి నడక.

    సత్య అనే దోస్తు మాతో బాటే బస్సు మేట్.నా క్లాస్ మేట్ కూడా. అతను వేమగిరి లో బాగా పలుకుబడి ఉన్న వారి అబ్బాయి. వాళ్ళ పాలేరు రోడ్డు మీద నుంచుని బస్సు ఆపిన తర్వాత మూడు నాల్గు నిముషాలకు లోపలినుండి హడావుడి గా వస్తాడు.చొక్కా బొత్తాలు రెండు పెట్టుకొని, పాలేరేమో పుస్తకాలు, వీడి చేతిలో కర్చీఫ్,పెన్ను,డబ్బులు గుప్పిట్లో,వచ్చి బస్ ఎక్కుతాడు. తీరిగ్గా బొత్తాలు పెట్టుకొని సెటిల్ అవుతాడు. జిగ్రీ దోస్త్.మంచి మనసు.డబ్బు అహంకారం లేదు.

    వీడు వెనకాల త్రీ సీటర్ లో కూర్చుంటాడు. నేను అదే లైన్ లో సింగిల్ సీటర్ లో. అంటే కడియం starting point లో ఎక్కుతాము కదా. అలా రోజూఅక్కడ నుండి ఎక్కేవారి రేంజ్ వేరు. ఓసారి ఒరే సత్య నీ సీట్ దగ్గర ఒక అమ్మాయి నించుని ముందుకు కదలదు.ఆ అమ్మాయి ఐదుబళ్ళ మార్కెట్ దగ్గర బస్సు ఎక్కుతుంది అని చెప్పా!

    (సశేషం)