Category: హాస్యం / Humour

  • 7. కొట్టి లేపాలి!

    7. కొట్టి లేపాలి!

    బబ్లూ గుర్తున్నాడా? అదే మన నంది పాడ్యమి కథలో వచ్చాడు, వాడే. వాళ్ళ బామ్మగారు కూడా గుర్తుండే ఉంటారుగా? మేము ఏడో క్లాసుకి వచ్చినప్పుడు వాళ్ళ బామ్మ బబ్లూకి పూజా విధి, ఓ నాలుగు స్తోత్రాలు, భగవద్గీత శ్లోకాలు నేర్పించాలని సంకల్పించింది.

    ఓ ఆరు నెలలు వాడికి స్కూలవ్వంగానే బామ్మగారు ట్యూషన్ లాగ బెత్తం పుచ్చుకుని మరీ నేర్పించారు. వాడికీ బానే నోటికొచ్చేసాయి శ్లోకాలు. ఆ సంవత్సరం స్కూలులో శ్లోకాల కాంపిటిషన్ లో ప్రైజు కూడా వచ్చింది వాడికి! వాళ్ళ బామ్మగారు ఆ విషయం ఇద్దరికే చెప్పారు — అడిగిన వాళ్ళకి, అడగని వాళ్ళకి.
    “ఏమిటి మీ వాడికి లింగాష్టకం కూడా రాదా?? మా బబ్లూకయితే కాలభైరవాష్టకం కూడా నోటికొచ్చు”.

    బామ్మగారి చిన్న కొడుకు వేరే ఊళ్ళో ఉంటారు. వాళ్ళకి మొన్ననే కూతురు పుట్టిందంట. సహాయానికని ఓ నాలుగునెళ్ళు బామ్మగారు అక్కడికి వెళ్ళారు. వెళ్తూ బబ్లూకి రూలు పెట్టారు — “రోజూ నేను నేర్పించినట్టుగా పూజ చెయ్యాలి. మీ అమ్మని ఫోనులో అడుగుతాను”.

    ఆ సంవత్సరం హాఫ్ యియర్లీ పరీక్షలలో ఎప్పుడూ ఫస్టొచ్చే అనిల్ కన్నా బబ్లూకి ఓవరాల్ గా మూడు మార్కులు ఎక్కువొచ్చేశాయి. మరిహ బబ్లూ ఆనందానికి హద్దులు లేవు. వాడికో కుక్కుంది, గాడ్జిల్లా దాని పేరు. ఆ కుక్కకి ట్రెయినింగ్ ఇచ్చి మరి ఊల పెట్టడం చిన్నప్పుడే నేర్పేశాడు వాడు. దాన్ని పట్టుకుని కాలనీ లో అన్ని సందులలోనీ తిరిగాడు సైకిల్ బెల్లు మ్రోగించుకుంటూ. పక్కనే గాడ్జిల్లా కూడా “ఔ……” అని అరుపులు పెడుతూ. ఎవరయినా బయటకొచ్చి ఎందుకురా గోల చేస్తున్నావు అనడిగితే “నాకు పరీక్షలలో ఫస్టొచ్చింది” అని మరో నాలుగిళ్ళకి వినబడేలా చెప్పడం మొదలెట్టాడు. మేమందరం ఎలానో ఎప్పుడూ ఫస్టు రాలేదు కాబట్టీ మాకు పర్లేదు. అనిల్ గాడికి మాత్రం ఇంట్లో వాయగొట్టేశారు. ఫస్టు రాకపోవడం కన్నా ఎప్పుడూ అల్లరిచేస్తూ తిరిగే బబ్లూకి ఫస్టొచ్చిందని వాళ్ళ బాధ.

    ఓ రోజు వాకింగులో వాళ్ళమ్మగారొచ్చి బబ్లూ వాళ్ళ అమ్మని అడిగారు, “మీ వాడు ఈసారి అదరగొట్టేశాడుగా! బాగా కష్టపడ్డాడా” అని. “ఏమీ లేదండీ, మామూలు గానే చదివాడు, దేవుడి అనుగ్రహం అంతే” అన్నారు. అదేంటని అడిగితే బామ్మగారు బబ్లూకి పూజలు చెయ్యడం నేర్పడం, వాడు రోజూ ఆవిడ చెప్పినట్టు పూజ చేసి స్కూలుకెళ్ళడం గురించి చెప్పారు వాళ్ళమ్మ. అంతే! ఆవిడ మా అమ్మలందరికీ ఈ విషయం చెప్పేశారు.

    మా అమ్మ రాత్రి భోజనం చేస్తున్నప్పుడు మా నాన్నకి చెప్పింది “ఇదుగో ఏదొ గుడుగుడుగుడు శాంతిః అని హడావుడిగా విభూతీ రాసుకుని ఆఫీసుకు పరుగెత్తడం కాదు. బబ్లూకి పరిక్షలలో ఫస్టొచ్చింది. ఫైనల్ ఎగ్జాంస్ లో మనవాడికి కూడా రావాలి. వాడికి వాళ్ళ బామ్మ నేర్పినట్టు మీరు వీడికి నేర్పండి” అంది. తింటున్న ముద్ద గొంతులో ఆగిపోయింది నాన్నకి.

    అందరిల్లళ్ళోనూ ఇదే కథ. నాన్నల దగ్గరా, అమ్మల దగ్గరా ఎందుకని మేమే ఓ మాటనేసుకుని ఇంట్లో చెప్పేశాం — “బబ్లూ చేసిన పూజ మాత్రమే వర్కవుట్ అవుతుంది పరీక్షలకి. మీరు చెప్పేవి దేవుడికి నచ్చకపోతేనో? మంచిమనసుతో బబ్లూ మాకందరికీ వాడి స్పెషల్ పూజ నేర్పుతానన్నాడు. ప్రసాదం కోసం రోజుకో రకం స్వీటు పట్టుకువెళ్తే చాలంట”. ఆ రోజు నుంచీ పదిహేను రోజులు ప్రోగ్రాము. ఒక రోజు సున్నుండలు, ఒక రోజు హల్వా, మరో రోజు బాదం పాలు, అన్నీ దేవుడికే!

    బబ్లూ మాకు లిస్టు రాసిచ్చాడు. ముందు ఆసనం వేసుకోవాలి. తరువాత దేవుడి గూడు తలుపు తియ్యాలి, అలా… వాళ్ళ గూటిలో శ్రీరామ పట్టాభిషేకం పటం ఉంది. తలుపు తియ్యంగానే ముందు ఆ ఫొటోని జాగ్రత్తగా పట్టుకుని రెండు సార్లు ఠకీ ఠకీ మని కింద కొట్టేవాడు. అదేంటి అని అడిగితే “బామ్మ ఇలానే చెప్పింది, ముందు ఫొటో రెండు సార్లు కొడితే దేవుడు నిద్ర లేస్తాడు, మన పూజ వింటాడు. ఈ కిటుకు తెలుసు కాబట్టే నాకు ఫస్టొచ్చింది, నీకు మూడు మార్కులు తక్కొవొచ్చాయి” అని అనిల్ వైపు చూసి రాజనాల నవ్వోటి నవ్వాడు.పూజావిధి బబ్లూకి నేర్పినప్పుడు వాళ్ళ బామ్మగారు ఓ పుస్తకంలో అన్నీ రాసిచ్చారు. జ్వరం తరువాత స్కూలుకి వెళితే నోట్సులు హడావుడిగా కాపీ చేసుకున్నట్టు మేమందరం కొత్త పుస్తకాలలో పూజా విధి ఎక్కించేసుకున్నాం. బబ్లూ ఊరికే ఉండడు కదా? ప్రతీ స్టెప్పుకీ మాకు ఎక్స్ప్లనేషన్ చెప్పి అది కూడా రాయించాడు. వాడో గొప్ప టీచర్! తివాచీ మూడు సార్లు దులపాలి, అగరొత్తు బూడిద పోవడానికి నాలుగు సార్లు కళ్ళుమూసుకుని ఊదాలి, పటం రెండు సార్లు ఠకీ ఠకీ మని కొట్టాలి, ప్రసాదం నివేదనం అవ్వంగానే ఒక్క గుటకలో లాగించేయాలి…..

    పదిహేను రోజుల తరువాత మా అందరికీ థియరీ, ప్రాక్టికల్ పరీక్షలు కూడా నిర్వహించి, మమ్మల్ని పాసు చేశాడు. ఆ ముందురోజే వాళ్ళ బామ్మగారు కూడా ఊరునించీ వచ్చేసి గొప్ప ముచ్చట పడిపోయారు మమ్మల్నందరినీ చూసి.
    ఇహ మరుసటి రోజు నుంచీ మేమూ వాడిలాగే పూజ చెయ్యడానికి డిసైడయ్యాం. మా అమ్మానాన్నలకి విపరీతమయిన పుత్రోత్సాహం ఆ రోజు! మా ఇంట్లో సత్యనారాయణ స్వామి పటం ఉంది. పూజప్పుడు దాన్నో రెండు సార్లు ఠకీ ఠకీ కొట్టాను.

    “ఏంటిరా అది” అని పరిగెత్తుకొచ్చింది మా అమ్మ గరిట చేతితో పట్టుకుని.

    “స్వామివారిని నిద్రలేపుతున్నానమ్మా” అన్నాను. “ఒరేయ్, నిద్ర లేపడం ఏంటి నీ బొంద, ఆయన కుంభకర్ణుడు కాదు; అలా కొట్టేస్తే అద్దం పగిలిపోదూ” అంది!!

    “దీనివళ్ళే బబ్లూకి ఫస్టొచ్చింది” అని చెప్పాను.

    అనిల్ వాళ్ళ ఇంటి పూజా మందిరంలో హరిద్వార్ నుంచీ తెచ్చిన స్ఫటిక లింగం ఉంది. వాడు దాన్ని ఠకీ ఠకీ మని రెండు సార్లు కొట్టాడు. వాడి అమ్మ నాన్న ఒకేసారి అరచిన అరుపుకి ఏంటని అడగడానికి పైపోర్షన్ వాళ్ళు దిగొచ్చేసారు.

    “బబ్లూ రెండు సార్లు కొట్టమన్నాడు” అని వాడూ చెప్పాడు. వాళ్ళ అమ్మ వెంటనే వాడిని వెంటపెట్టుకుని మా ఇంటికొచ్చింది. మా అమ్మ కూడా ఇదేం బేతాళ పూజో కనుక్కుందాం పద అని నన్ను పట్టుకుని బబ్లూ ఇంటికి బయలుదేరింది. బామ్మగారు పూలు కోసుకుంటున్నారు. మమ్మల్ని చూసి బబ్లూ, వాళ్ళ అమ్మ గారు కూడా బయటకొచ్చారు.

    “ఏంటండి మీ వాళ్ళ పూజ చూసి ఆనందిచారా” అనడిగింది బామ్మ.

    “ఆనందించడం ఏంటి, అరిదిపడితేను” అంది మా అమ్మ. “పటాలని రెండు సార్లు నేలకేసి కొట్టడం ఏంటి, ఇదెక్కడి ఆచారం? శోడశోపచారాలలో లేని కొత్త ప్రక్రియ ఇది. పటం పగిలిపోతేనో?”

    “మాఇంట్లో అయితే గంగొడ్డున ఎవరో గొప్ప స్వామీజీ ఇచ్చిన స్ఫటిక లింగం ఉంది, దానికేమయినా……” అని లెంపలేసుకుంది అనిల్ వాళ్ళ అమ్మగారు. నేలకేసి కొట్టడం ఏంటి అని అడిగింది బబ్లూని వాళ్ళ అమ్మ.

    “అవునమ్మా, బామ్మ పూజ నేర్పినప్పుడు నాకు అలానే నేర్పింది” అన్నాడు బబ్లూ.
    అందరం స్లోమోషన్ లో బామ్మ వైపు తిరిగాము.
    పటం కింద కొట్టడం ఏంటిరా అనావిడంటే నువ్వలానే నేర్పించావు అన్నాడు బబ్లూ. కొంచం ఆలోచించిందావిడ.

    “నీ మొహం, ఓ ముదరాష్టపు బల్లి పిల్లల్ని పెట్టింది దేవుడి గూడు వెనకాతల. అందులో ఓ బల్లిపిల్ల ఎప్పుడూ రాముడు పటం వెనకాలే ఉండేది. త్రేతాయుగం లో వానర మూకలో అదీ ఉంటుంటుంది. నువ్వు భయపడతావని ఠకీ ఠకీ మని రెండు సార్లు కొట్టి అప్పుడు పటాలు తుడవడానికి తీసేదాన్ని. అంతే కానీ పటాలని, విగ్రహాలని, లింగాలనీ విరిగిపోయేలాగ బాదెయ్యమని కాదు” అని వాడికో టెంకిజల్ల కొట్టింది.

    అందరం అలాగ బబ్లూ వైపు తిరిగాము. హిహిహి అని చిన్న నవ్వు నవ్వి బుర్ర గోక్కున్నాడు.
    “చేస్తే సరిగ్గా చెయ్యండి, లేకపోతే లేదు. బొమ్మలు విరిగిపోతే అరిష్టం” అంది మా అమ్మ ఇంటికెళ్ళాక.

    సాయంత్రం పార్కులో బబ్లూ చెప్పాడు “ఈ పెద్దోళ్ళకి తెలీదు. మామూలుగా అందరూ పూజ చేస్తారు. నాకే ఎందుకు ఫస్టొచ్చింది? పాటలతో దేవుడు లేచే కాలం అయిపోయింది. ఇప్పుడిలా పటాన్ని కొట్టి లేపాలి” అన్నాడు.

    నిజమే! ఈ లాజిక్కు మా పెద్దోళ్ళు మిస్సయ్యారు.
    మరుసటి రోజునుంచీ నేనూ అనిల్ పూజ కంటిన్యూ చేశాం. కానీ బబ్లూ ఫార్ములా ప్రకారం దేవుడిని లేపడానికి చిన్నగా పటాన్ని తట్టేవాళ్ళం ఇంట్లో వాళ్ళకి వినబడకుండా.
    ఠకీ ఠకీ కాకుండా టకి టకి అన్నమాట.
    ఓ వారానికి పూజలో స్పీడు పెరిగిపోయింది. గుడు గుడు శాంతిః స్థాయికి వచ్చేశాం. మరో వారానికి పూజ ప్రక్రియని అమ్మకి ఔట్ సోర్స్ చేసేశాం.

    ప్రసాదం మాత్రం మాకు.

    _______________________________

    ఈ శీర్షిక లో మరి కొన్ని కాలనీ కథలు 🩷

  • 6. కుంబ్లే ఆవు

    6. కుంబ్లే ఆవు

    చిన్నప్పుడు బిగ్ ఫన్ అనే బబ్బులుగమ్ము వాడు ప్రతీ బబ్బులుగమ్ము కవర్ లోపల ఒక చిన్న పోస్టర్ పెట్టి దానిమీద స్కోరు వేసేవాడు. ఆ రన్స్ కలక్ట్ చేసి ఏదో ఓ గిఫ్టుకి ఎక్స్చేంజి చేసుకోవచ్చు. వాడు మంచి ఆఫర్లు పెట్టేప్పుడు అలాగ ఆవులలాగ నవులుతూనే ఉండేవాళ్ళం!

    ఓసారి వాడొక ఆఫర్ పెట్టాడు. వంద రన్స్ కి బౌలింగ్ బ్యాటింగ్ చార్టులు, ఐదొందల రన్స్ కి కొత్త బ్యాట్, అలాగ. మాకీ వార్త తెలిసినప్పటికి మరో మూడురోజులే ఉంది ఆఫర్ అయిపోడానికి. స్కూలు ఎదురుకుండా హుస్సేన్ కొట్టుండేది. అక్కడికి వెళ్ళి వాడిని బ్రతిమాలి అప్పుగా ఓ పది బబ్బులుగమ్ములు తీసుకుని ఇంటివరకూ నమిలాము. మొత్తం కలిపి పదహారు రన్స్ మాత్రమే వచ్చాయి. ఇంట్లో కిడ్డీ బ్యాంకులు పగలకొట్టి, అమ్మలని అడుక్కుని మూడురోజులు దవడలు వాచిపోయేలాగ నమిలీనమిలీ మొత్తానికి వంద రన్స్ సంపాదించాం. హుస్సేన్ మా రన్స్ తీసుకుని సేల్స్ వాడు వచ్చినప్పుడు వాడికిచ్చాడు. ఓ వారం రోజుల తరువాత మాకు థలథలలాడే బౌలింగు చార్టు ఇచ్చాడాయన. ఆ బౌలింగ్ చార్ట్ చూడంగానే మాలో దెబ్బతిన్న పులి నిద్రలేచింది!

    సారీ! మీకు ఫ్లాష్ బ్యాక్ చెప్పలేదు కదూ……. (రింగులు తిప్పుతూ….)

    క్రికెట్ అంటే అందరిలాగే మాకూ పిచ్చి. ఒకటే బ్యాటుండేది, రన్నర్ కి తాడిమట్ట. అప్పుడప్పుడూ అభయ్ చిన్నప్పటి ప్లాస్టిక్ బ్యాటొకటి తెచ్చేవాడు. ఒంగొని దాన్ని క్రీస్ లో పెట్టి పరిగెత్తేవాళ్ళం. ఆడుతున్నప్పుడు వాకింగుచేసే ఆంటీలకీ తగలకూడదు, ప్రపంచశాంతి కోసం స్టేజీదగ్గర కూర్చుని చర్చిస్తున్న అంకుల్లకీ తగలకూడదు! ఆంటీలైతే తిట్టి బాలిచ్చేస్తారు. అంకుల్లు బాల్ పట్టుకుని క్లాసు పీకుతారు. ఓ ఇద్దరు తాతగార్లుండేవారు. వాళ్ళకి తగిలితే అంతే సంగతులు!! అహ నా పెళ్ళంట సినిమాలో నూతన్ ప్రసాద్ లాగ మూడు తరాల కథ చెప్పేవారు! ఒక్కోసారి బాలు రేపుతీసుకోవచ్చులే అని ఆటకట్టేసి వెళ్ళిపోయేవాళ్ళం! ఇంకేంటి మాకు క్రికెట్టొచ్చేది? ఈ కంగాళీలు లేకపోతే గంగూళీలు అయిపోయేవాళ్ళం!

    మా కాలనీ పేరు ఓజీ నగర్. ఆ పేరెందుకొచ్చిందో మరో కథలో చెప్పుకుందాం. మాకు రెండు సందులవతల గాంధీనగర్ ఉంది. వాళ్ళ పార్కులో స్టేజీలవీ లేవు. మొత్తమంతా క్రికెట్ గ్రౌండే! మధ్యలో ఒక పిచ్ లాంటిది కూడా తయ్యారుచేసుకున్నారు. మాలాగ గోడమీద గీతలు, నాలుగు ఇటుకలు, తుప్పుపట్టిన ఇనప కుర్చీ లాంటివి కాకుండా నిజంగా ఇటు మూడు, అటు మూడు వికెట్లుండేవి! బెయిల్స్ కూడాను!! బ్యాట్స్మాన్ కి, రన్నర్ కి ఇద్దరికీ బ్యాటులు ఉండేవి. వాళ్ళు మాతో నమీబియా టూరెళ్ళిన ఆస్ట్రేలియాలా ప్రవర్తించేవాళ్ళు!

    మ్యాచీలు టీవీలో చూసినప్పుడు ‘అరెరె, వాడు లెఫ్ట్ హ్యాండ్ కాకుండా రైట్ హ్యాండుతో విసిరుంటే రన్నవుటయ్యుండేది, అరౌండ్ ద వికెట్ బౌలింగేస్తే బాగుండేద’ని మరుసటిరోజు స్కూళ్ళో మంజ్రేకర్ కామెంట్రీలాగ చెప్పుకునేవాళ్ళం.
    ఆ గాంధీనగర్ బ్యాచిదీ మాస్కూలే. ఓరోజు మా ఈ అనాలిసిస్ విని ‘ఇంత క్రికెట్ వచ్చు కదా మీకు, మాతో ఆడండి సండే’ అన్నారు.
    జీవితంలో మొదటిసారి మమ్మల్ని మ్యాచి ఆడడానికి పిలిచారెవరైనా! ఆరోజు మాకుఅవధుల్లేని ఆనందం!! సై అన్నాం. ‘మీ గ్రౌండుకి సండే ఏడింటికొచ్చేస్తాం’ అని.

    మరుసటిరోజు రెండో శనివారం. శెలవు. ఉదయం ఐదుగంటలకి వాకింగ్ ఆంటీలతోపాటు మేమూ పార్కులోకెళ్ళిపోయాం ప్రాక్టీసుకి. నేనూ, బబ్లూ, అభయ్, అనిల్, మనోజ్, షాజు, ఒక చెక్క బ్యాటు, ఒక ప్లాస్టిక్ బ్యాటు, ఒక టెన్నిస్ బాలు, ఒక కుర్చీ.
    మూడుగంటలు ప్రాక్టీసు చేశాక బెంచిమీద కూర్చుని స్ట్రాటెజీ వెయ్యడం మొదలెట్టాం. ఎవరు ఓపెనింగెళ్ళాలి, ఎవరు బౌలరు, కీపింగెవరు అని. మాకర్ధమయిన విషయమేంటంటే ఎవరూ స్పిన్నర్లు లేరు మా టీములో. అనిల్ గాడి నాన్నగారు ఒకప్పటి క్రికెట్ ప్లేయర్ అని చెప్పాడు వాడు.

    ‘డాడీని అడిగి మంచి స్పిన్నులు నేర్చుకొస్తా సాయంత్రం’ అన్నాడు.

    నాలుగింటికి మళ్ళీ అందరం కలిసాం. ముందుగా మాకు స్పిన్ అంటే ఏంటని వాళ్ళ నాన్నగారు చెప్పిన క్లాసంతా వినిపించాడు అనిల్! ఆఫ్ స్పిన్ అంటే వేళ్ళెలా ఉండాలి, లెగ్ స్పిన్ అంటే ఏంటి, గూగ్లీ ఎలా వెయ్యాలి, అన్నీ థియరీ చెప్పాడు. మీరటు నించోండి అని వాడు వెన్నక్కెళ్ళి స్పిన్నుతో విసిరాడు. లగాన్ సినిమాలో కచరా లాగ ఇటుపడి నిజంగానే అటువెళ్ళింది! అయితే విసిరితే సరిపోదు కదా.. బౌలింగ్ చెయ్యాలి.. డాడీ నేర్పిన స్పిన్నులతో అనిల్ బౌలింగందుకున్నాడు. వాడు పాల్ ఆడంస్ లాగ ఇటుతిరిగి అటుతిరిగి బుర్రవంచి ఎక్కడికేస్తున్నాడో చూడకుండా వేశాడు బాలు. అది ఆపక్కన వాకింగ్ చేస్తున్న సత్యవతి గారికి తగిలింది!

    ఆవిడ మమ్మల్ని తిట్టేలోపే బబ్లూవెళ్ళి ‘ఆంటీ రేపు మాకు గాంధీనగర్ టీం తో మ్యాచ్. ఆశీర్వదించండి’ అన్నాడు.

    ‘ఆల్ ద బెస్ట్! గెలవాలి రేపు’ అని ఆవిడ తిట్టడం మరచిపోయారు.

    ‘ఒరేయ్ ఏంటీ బౌలింగు? విక్కెట్టెక్కడుంది, నువ్వెక్కడికేశావు’??

    ‘సారీ, డాడీ చెప్పిన స్పిన్ కదా, కొంచం ప్రాక్టీసు చెయ్యాలి, అలవాటయిపోతుందిలే’ అన్నాడు.

    పాలు పొయ్యడానికి ఆవునుతోలుకొచ్చిన సత్తి గోడమీంచీ చూస్తున్నాడు మా ప్రాక్టీసుని. లగాన్ సినిమాలోలా ఫీలయిపోయాము మేము. కచరా లా స్పిన్నువెయ్యడానికి అనిల్ ఉన్నాడు. వేరే ఏరియానుంచీ సర్దార్జీ లాగ సత్తి వచ్చాడు, ఛలే ఛలో!

    మరుసటిరోజు మ్యాచికి వెళ్ళాం. టీములా ఉండాలని వైట్ బట్టలు, స్కూల్ ఫ్రైడే షూసు, టోపీలు, ఆర్భాటానికేం లోటులేదు మాకు. టీముకి ఆరుగురు. సింగిల్ బ్యాటింగు లేదు. అవి రూల్స్. గాంధీనగర్ టీం అయితే పేర్లతో చొక్కాలుకూడా వేయించుకున్నారు! గ్రౌండులోకి వెళ్ళంగానే మనోజు వక్రతుండ మహాకాయ చదివాడు. గ్రౌండుకు దండంపెట్టుకుని లోపకికెళ్ళాం.

    ఓ గంటన్నర తరువాత బయటకొచ్చి వెనక్కి తిరగకుండా మా పార్కుకెళ్ళిపోయాం.

    ‘వాళ్ళది హోం పిచ్ ఎడ్వాంటేజి రా’…
    ‘కొత్త బాలు కదా, స్పిన్‌ను తిరగలేదు’…
    ‘వాళ్ళ బ్యాటులు బరువుగా ఉన్నాయి’…
    ‘పిచ్ మీద పరుగెత్తడం అలవాటులేదు కదా’….

    ఫ్లాష్ బ్యాక్ సమాప్తం. దెబ్బతిన్న పులి లేచిన సమయం……..

    బ్యాగులు ఇంట్లో పడేసి ఆ బౌలింగ్ చార్టు పట్టుకుని పార్కుకి వెళ్ళిపోయాం. చార్టులో పేస్ బౌలింగ్ ఎలా వెయ్యాలి, సీం పొజీషన్ అంటే ఏంటి, రకరకాల స్పిన్నులకి బాల్ పట్టుకునే టెక్నిక్‌లు, అబ్బో… శ్రీనాథ్ కూడా ఈ చార్టు చూశే బౌలింగ్ నేర్చుకున్నాడని క్రింద ఆయన బొమ్మ కూడా వేశారు!
    గత సారి ఆడినప్పుడు డాడి చెప్పిన స్పిన్నులు అని అనిల్ వేసిన బౌలింగుని వాళ్ళు మామూలుగా కొట్టలేదు! ఈసారి వాళ్ళని కుదేలు చెయ్యాలని ఫిక్సయ్యి చార్టుని జాగ్రత్తగా పిట్టగోడమీద పరచి ఎగిరిపోకుండా రాళ్ళు పెట్టాం. అప్పుడే సత్తి వచ్చాడు ఆవుతో. ఒరేయ్, చార్టు ఎగిరిపోకుండా చూడు అని వాడికి చెప్పి ఒక్కొక్క స్పిన్‌ను చూసి తలాఓఓవరూ అందరం బౌలింగ్ వేస్తున్నాం.

    ఓ గంటయ్యేసరికీ అందరం అక్రంలు యూనిస్‌లు ఖాన్లు అయిపోయాం.

    ‘రేపు స్కూళ్ళో గాంధీనగర్ గాళ్ళని మనం చేద్దామురా ఛాలెంజ్! వాళ్ళకి మతి పోవాలి’ అనుకుంటూ రివిజన్ కోసం మళ్ళీ చార్టు చూద్దామని గోడదగ్గరకు వెళ్ళాం.

    చార్టు లేదు.

    ఎక్కడికిపోయిందా అని వెతికాం. రెండు వైపులా కింద లేదు. సత్తి ఎదురింట్లో పాలుపోసి వస్తున్నాడు.

    ‘సత్తీ, మా చార్టేది’ అనడిగాం.

    ‘ఐదు నిముషాల క్రితం గోడమీదే ఉందే… ఇప్పుడే పాలు తీసి ఆవుని కట్టి ఇంట్లో పొయ్యడానికెళ్ళాను’ అన్నాడు.

    చార్టెక్కడికి పోతుంది ఐదునిముషాలలో అని ఆవువైపు చూశాం. చిన్న కాగితం ముక్క మిగిలింగి దాని నోట్లో. మావైపు చూసి తీరికగా నములుతోంది……

    కొన్నాళ్ళకి సత్తిని క్షమించేసాం. మా క్రికెట్టూ పెద్దగా బాగుపడలేదు, మేమా గాంధీనగర్ వాళ్ళని ఛాలెంజూ చెయ్యలేదు. షాజు దగ్గర ఫుట్‌బాల్ ఉండేసరికి అసలు గేమే మార్చేశాం కొన్నాళ్ళు.
    బౌలింగ్ పూర్తిగా జీర్ణించేసుకుంది కాబట్టి ఆరోజు నుంచీ ఆవు పేరు మాత్రం కుంబ్లే ఆవు అయిపోయింది. సత్తీవాళ్ళ ఇంట్లోకూడా ‘కుంబ్లేకి గడ్డేశారా’ అనే అడిగేవారంట.

    _______________________________

    ఈ శీర్షిక లో మరి కొన్ని కాలనీ కథలు 🩷

  • వికృతభోజుని వృత్తాంతము


    పూర్వం నైమిశారణ్యంలో వికృత భోజుడు అనే దానవుడు బ్రహ్మవరం పొందాలని ఘోరమైన తపస్సు చేశాడు. అతని ఘోర తపస్సుకి మెచ్చి ఒక నాడు బ్రహ్మ దేవుడు ప్రత్యక్షమై, “నాయనా, నీ తపస్సును మెచ్చాను, ఏం వరం కావాలో కోరుకో అన్నాడు”. అందుకు ఆ దానవుడు, దేవా నేను భోజన ప్రియుడను. నీ వరం పొందాలని సవిరామ ఉపవాసం చేస్తూ, అనుక్షణం నిన్నే ధ్యానిస్తూ, నేటికి నీ సాక్షాత్కారం పొందాను. నేను కోరబోయే వరం ఏమిటంటే నేను భోజనం చేసిన ప్రతిసారి నా శక్తి హెచ్చింపబడాలి. వార్ధక్యమన్నది నా దారి చేరకూడదు, ఏ మానవుని చేత గాని, దానవుని చేత గాని, కిన్నెర, కింపురుషుల వల్ల గానీ, జలచరాలు, జంతువుల వల్ల గానీ నాకు మరణం సంభవించకూడదు, నాకు ముసలితనం వల్లనే మరణం రావాలి” అని వరం కోరుకున్నాడు.

    అది విన్న బ్రహ్మ దేవుడు, “నాయనా, నీవు భోజన ప్రియుడనంటున్నావు, భోజనం చేసిన ప్రతి సారి నీ శక్తి హెచ్చింపబడాలి, వార్ధక్యమన్నది రాకూడదు అంటున్నావు. మరి నీకు మరణం ఎలా సంభవిస్తుంది ? ఈ సృష్టిలోని ప్రతి ప్రాణి ఏదో ఒక రోజు గిట్టవలసిందే. కానీ నీకు వరమివ్వకుండా వెనుతిరగలేను. నీ తపస్సుకు మెచ్చాను గనుక నీవు ఈ కాలంలో లోకులందరూ యథాప్రకారం తినే ఆహారం తిన్నన్ని రోజులు నీవు కోరినట్లే హెచ్చింపబడిన శక్తితో, యవ్వనంతో జీవించగలవు. ఏనాడైతే సృష్టిలో ఆమోదయోగ్యం కానీ ఆహారం తింటావో ఆ రోజు నీ శక్తి నశిస్తుంది. నీకు మరణం సంభవిస్తుంది” అని వరమొసంగి అంతర్థానమయ్యారు .

    బ్రహ్మ వరం పొందిన ఆ దానవుడు ఆ అడవిలోని ఫలాలన్నిటినీ అమాంతం మింగాడు. బ్రహ్మ వరం వల్లన అతని శక్తి హెచ్చింపబడింది. అతడు మదించి ఆ రాజ్యంలోని పాకశాస్త్ర ప్రవీణులందరినీ తన బందీలుగా చేసుకుని మూడు పూటలా తనకు ఇష్టమైన వంటలు వండించుకుని పొట్ట చెక్కలయ్యేలా భోజనం చేయసాగాడు. దాని వల్ల అతని శక్తి అపారమయ్యింది. అతడు మరింత మదించి సమస్త భూలోకాన్ని ఆక్రమించి లోకులను నానా యాతనలు పెట్టసాగాడు. అతని ఆకలి తీర్చలేక లోకంలోని ప్రాణులందరూ తమ ఆకలిని చంపుకుని అతనికి భోజనం ఏర్పాటు చేయసాగారు.

    తమ ప్రాణాలే నిలుపుకోలేని ప్రజలు దేవతలకు హవిస్సు సమర్పించలేకపోయారు. దేవతలు ఖిన్నులై వికృత భోజుడి మీద దండయాత్ర చేసారు. బ్రహ్మ వరప్రసాదం, తాను రోజూ తినే ప్రసాదం వలన అపరిమిత బల సంపన్నుడైన వికృత భోజుడు యుద్ధంలో దేవతలను ఓడించాడు. అప్పుడు దేవతలు భయకంపితులై శ్రీ హరి శరణుజొచ్చారు. అప్పుడు శ్రీ హరి ఒక ఉపాయమాలోచించి, నారద మహామునిని పిలిచి ఆయన చెవిలో ఒక ఉపాయాన్ని ఉపదేశించారు.

    నారద మహాముని శ్రీ హరి ఆజ్ఞానుసారం వికృత భోజుని కలవడానికి వెళ్లారు. వికృత భోజుడు నారద మహామునికి ఎదురేగి ఆయనను సత్కరించి ఆయన రాకకు కారణమేమని అడిగాడు. నారద మహాముని ఇలా చెప్పారు. “వికృత భోజా నీ రాజ్యంలోని వంటల గూర్చి ముల్లోకాలలో వేనోళ్ల కొనియాడుతుంటే విని, ఆ గొప్పదనమేమో కన్నులారా చూడాలని, నిన్ను ఇంత శక్తివంతుడిని చేసే ఆ భోజనం రుచి చూడాలని. ఆ గొప్పదనమేమో నా అంతట నేనుగా తెలుసుకోవాలని ఇలా వచ్చాను “ అన్నారు. ఎంత మాట మహాముని, ఇప్పుడే మీ కోసం ప్రత్యేకంగా ఈ లోకంలోనే అత్యుత్తమ పాక శాస్త్ర ప్రవీణుల చేత మీకు భోజనం ఏర్పాటు చేయిస్తాను. ఎవరక్కడ” అని తన సేవకులను ఆజ్ఞాపించాడు. కొద్ది సేపట్లోనే పంచ భక్ష్య పరమాణ్ణాలు సిద్ధమయ్యాయి. లోకంలో లభించే ప్రతి కంద మూలము, ఫలము అన్నీ ప్రత్యక్షమైనాయి. ఆరగించండి మహాముని అని తన ఆతిథ్యాన్ని గర్వంగా సమర్పించాడు వికృత భోజుడు.

    ఆహారం రుచి చూసిన నారద మహా ముని అన్ని ఒక సారి నాలుకకు తాకించి అయిష్టంగా పాత్రలోనే విడిచిపెట్టారు. “ఆహారము రుచించ లేదా మునివర్యా అని ఆశ్చర్యపోతూ అడిగాడు”. నారద మహాముని మొహం చిట్లిస్తూ “అయ్యో వికృత భోజా ఇంత భోజన ప్రియుడివి, ఇదా నీవు తినే ఆహారం అని దెప్పి పొడిచారు”. అందుకు వికృత భోజుడు “ఇంత కన్నా రుచికరమైన ఆహారమా !!, అసాధ్యము. ఇంత కన్నా రుచికరంగా ఎవరైనా వండితే నా వంట వారికందరికీ శిరచ్చేదమే శిక్ష” అని కోపంతో ఊగిపోయాడు. అందుకు నారద మహాముని, “ఆవేశ పడకు వికృత భోజ, ఇందులో నీ వంటవారి తప్పు ఏమీ లేదు. బ్రహ్మ దేవుని వరం చేత నేను భవిష్యత్తులోకి కాల ప్రయాణం చేశాను గనుక అక్కడి వంటల ముందు ఇవి తేలిపోయి ఉండవచ్చు” అన్నారు. “ఆ… అంత రుచిగా ఉంటాయా”, అని ఆశ్చర్యపోయాడు వికృత భోజుడు. “మరేమనుకున్నావ్? గులాబీ పూలతో బజ్జీలు, పుచ్చ కాయ ముక్కల్తో పకోడీలు, ఐసు క్రీముతో చేసిన వడియాలు” అని ఏఆర్, వీఆర్‌లో ఒక డజను ఇన్స్టాగ్రామ్ ఫుడ్ బ్లాగర్ రీల్సు చూపారు.

    అది చూసి నోరూరిన వికృత భోజుడు వెంటనే తన వంట వారిని పిలిచి తనకు కూడా బంగాళ భౌ, భౌ. అరటి పండు లంబ లంబా, చాక్లెట్ మాగి, జండూ బామ్ దోస చేసి పెట్టమని ఆదేశించాడు. ఏమీ అర్థం కానీ అతని వంట వారు, ఆ భవిష్యవాణిలోని దృశ్యాలను పదే పదే చూస్తూ పని కానిచ్చారు. వికృత భోజుడు ఆ మల్టీకలర్ మెనూ చూస్తూ వికటానందంతో లొట్టలేస్తూ చేసిన పదార్థాలన్నీ స్వాహా చేశాడు. అతనికి కొద్ది సేపట్లోనే ఉదరంలో అదరడము మొదలైనది. బాధతో మెలికలు తిరుగుతూ నేలకూలి తనను రక్షించమని నారద ముని పాదాల శరణుజొచ్చాడు. నారద ముని అతనికేసి తిరిగి, “నాయనా వికృత, నీవు నీకు బ్రహ్మ దేవులు ఇచ్చిన వర నియమాలు ఉల్లంఘించినందువల్ల నీ శక్తి క్షీణించింది. గులాబీ పూలతో వండిన బజ్జీలు, పుచ్చకాయ ముక్కల్తో చేసిన పకోడీలు, ఐసు క్రీము వడియాలు, బంగాళ భౌ, భౌ. అరటి పండు లంబ లంబా, చాక్లెట్ మాగి, జండూ బామ్ దోస వంటి వికృతాహారము తినడం వల్ల నీవు ఇప్పుడు ఈ తనువు చాలించి నరకలోక వాసము చేయబోతున్నావు”. అని అతనికి బ్రహ్మ దేవుడు విధించిన నియమాలను గుర్తు చేసి అంతర్ధానమయ్యారు. వికృత భోజుడి నిష్క్రమణతో ముల్లోకాల్లో ఆనందం వెల్లివిరిసింది. ఆనాటి నుండి అందరూ పద్ధతిగా పప్పు, ఆవకాయ, పూరీ కూర తింటూ ఆమోదయోగ్యం కానీ ఆహారం అవాయిడ్ చేస్తూ ఆనందంగా జీవించారు.

    కథ కంచికి, మనం ఇంటి భోజనానికి.

    శుభం.

    1
  • మనసు ఛెళ్ళుమంది!

    (నిజ జీవిత సంఘటనల ఆధారంగా)

    కొన్ని సంవత్సరాల క్రిందట, పూనే లో జరిగిన అనుభవం. బైకు మీద ఇంటి నుండి ఆఫీసుకి వెళ్ళే దారిలో, ఒక పెద్ద ఆసుపత్రి ముందు ఉన్న రోడ్డుని రెండుగా చీలుస్తూ ఒక గుడి ఉండేది. నేను రోజు వారిగా, ఆ గుడి ముందు బైకు ఆపి, క్రిందకు దిగకుండా “హలో సార్! / నమస్తే సార్!/ కొంచెం హడావిడిలో ఉన్నా సార్!/ ఏంటి సార్, బావున్నారా?” ఇలా రక రకాల పలకరింపులతో ఆంజనేయస్వామిని పలకరించి పోతూ ఉండే వాడిని.

    ఆ గుడి ముందు, యాధావిధిగా ఒకరిద్దరు యాచకులు ఉండేవారు. ఎప్పుడైనా, ఏమైనా ఇచ్చేవాడిని లేదా మాములుగా, నా పలకరింపులతో సాగిపోయేవాడిని.

    1. కొత్త బిచ్చగాడు – మొదటి సంఘటన

    ఒక రోజు, కుష్టు వ్యాధి తగిలిన ఒక కొత్త బిచ్చగాడు అక్కడ కూర్చుని ఉన్నాడు. అతనిని చూసి జాలి కలిగి నా దగ్గిర ఉన్న లంచ్ బాక్స్ లోది తీసి అతనికి ఇచ్చేసాను. ఒకింత సంతోషంగానే తెస్సుకున్నాడు. అలా రోజూ ఆఫీసుకి వెళ్తూ, అతను కనిపిస్తాడేమోనని చూస్తూ ఉండేవాడిని.

    2. అదే బిచ్చగాడు – రెండో సంఘటన.

    ఈ సారి, మళ్ళీ అతను కనపడగానే, నా దగ్గిర బాక్సు తీసాను. అతను అన్య మనస్కంగా తన ముందు ఉన్న పళ్ళాన్నీ ముందుకు తోసాడు. నా దగ్గిర ఉన్న బాక్సులో ఉన్నది, అతని పళ్ళెం లోకి ఒంపి ముందుకు సాగిపోయాను. అలా రోజులు నడుస్తూ ఉండగా,

    3. బిచ్చగాడు – “అంతా వద్దులే, సగం చాలు”

    మరో సారి, బాక్సు తీసి అతని పళ్ళెం లో వేయబోతుంటే, అతను నోరు తెరిచి, “అంతా వద్దులే, సగం చాలు!”. అతని మాటలు తూచా తప్పకుండా పాటించి, సమన్యాయం పాటించాను. రోజులు నడుస్తున్నాయి…,

    4. మొహం తిప్పుకుంటున్న బిచ్చగాడు.

    ఆ తర్వాత, నేను ఎప్పుడు కనపడినా, అతను మొహం తిప్పుకోవడం మొదలు పెట్టాడు. నా బాక్సు బయటకు రాలేదు, అతను పళ్ళెం ముందుకు చాచలేదు.

    రోజులు నడుస్తున్నాయి,

    5. బిచ్చగాడు – “అంతా నాకే పెడితే, నువ్వేం తింటావ్?”

    ఈ సారి, నేను పట్టు వదలని విక్రమార్కుడిలా, బైకు దిగి బాక్సు తీసుకుని, అతని దగ్గిరకి వెళ్ళాను. అతను పళ్ళెం వెనక్కి లాక్కుంటూ, “అంతా నాకే పెడితే, నువ్వేం తింటావ్?” అని అడిగాడు. నేను, “పర్వా లేదు. నేను ఏదైనా కొనుక్కుని తింటాను.” అతను, “నీ డబ్బా నువ్వే ఉంచుకో. డబ్బు లివ్వు, నేనే వేడి వేడి గా కొనుక్కుని తింటాను. ” “డబ్బులు ఇవ్వను!” అక్కడి నుంది హూంకరిస్తూ నిష్క్రమించాను.

    ఆ తర్వాత,

    6. బిచ్చాగాడి వెక్కిరింత!

    ఆ తర్వాత, అతను నేను ఆ గుడి ముందు ఎప్పుడు తారసపడినా, అతను తన పక్కనే ఉన్న సంచి ఓపెన్ చేసి చూపిస్తూ ఉండేవాడు. దానిలో ఉన్న పళ్ళు, బ్రెడ్, బిస్కట్లు, ఇంకా ఏవో, “ఏమైనా కావాలంటే తీసుకో…”, అంటూ అతని కళ్ళు మాట్లాడుతూ ఉండేవి. “ఫన్నీ గై”, అనుకుంటూ, ఇద్దరం నవ్వులు ఎక్స్చేంజ్ చేసుకుంతూ ఉండేవాళ్ళం.

    7. బిచ్చగాడు తూట్లు పొడిచిన నా అహంకారం.

    ఆలోచించగా, అతనిలో ఏదో విషయం ఉంది అనిపించింది. ఒక సెలవు రోజు పనిగట్టుకుని, అతనిని కలవడానికి వెళ్ళాను. ముందుగా ఒక పదిరూపాయల నోటు చేతిలో పెట్టి, మాట కలిపాను. నేను, “ఫుడ్ ఇస్తే, ఎందుకు తీసుకోవు? డబ్బులే ఎందుకు అడుగుతావు?” అతను, “తిండి ఎవడైన ఫ్రీ గా పెడతాడు. బాత్-రూం కి వెళ్ళంటే డబ్బులు కావాలి. సులభ్ కాంప్లెక్ష్ వాడు, అవసరం తీర్చుకునే అవకాశం బిచ్చం వెయ్యడు.” నా తల గిర్రున తిరిగింది.

    అతను చెప్పిన మిగిలిన విషయాలు ఇలా, “నాకు ఎప్పుడూ చల్లారిన కూడేనా, వేడిగా తినాలనిపిస్తుంది కదా. అది కొనుక్కోవాలంటే డబ్బు కావాలి. జ్వరం వస్తుంది, తగ్గాలంటే, ఒక మందు బిళ్ళ, వేడి వేడి టీ కావాలి. బట్టలు ఇస్తారు, జోలే తప్ప ఇంకేమీ లేను, ఎక్కడా దాచుకోవాలి? అప్పుడప్పుడు స్నానం చెయ్యాలనిపిస్తుంది, మరి దానికి కూడా సబ్బూ కావాలి, డబ్బూ కావాలి. చలిగాలి కొడుతూ ఉంటుంది, వెచ్హగా ఒక బీడినో / సిగరెట్టో దమ్ము లాగాలనిపిస్తుంది. అసలు నువ్వు నన్ను బిచ్చాగాడిగా కాదు, మనిషిగా చూడు, నా అవసరలేమిటో, నాకు డబ్బెందుకు కావాలో తెలుస్తుంది. ఒక్క పూట తిండి పెట్టి, నన్ను జీవితాంతం ఉద్దరించే వాడిలా గర్వపడకు. అసలు నాలాగా డబ్బు లేకుండా, ఒక్క రోజు బ్రతికి చూపించు. చివరగా ఒక విషయం గుర్తుపెట్టుకో, ‘నాకు ఇది ఇచ్చినవాడే, నీకు అది ఇచ్చాడు.”

    నా మనసు ఛెళ్ళుమంది!.

    #అంతర్వాహిని_కథలు

    2
  • 5. నంది పాడ్యమి

    5. నంది పాడ్యమి

    కొన్నాళ్ళకి మా కాలనీకి బబ్లూ వచ్చాడు.

    మా కాలనీ జీవితం రెండు భాగాలుగా చేస్తే బిబి, ఆబి అని విడగొట్టుకోవచ్చు. బిఫోర్ బబ్లూ, ఆఫ్టర్ బబ్లూ.
    లేడీసందరికీ సత్యవతిగారు ఎలాగో మాకు బబ్లూ గాడు అలాగ. అప్పటినుంచీ మేము చేసిన రచ్చకి ఒక క్లాసుండేది. ‘అబ్బ, వీళ్ళేంటిరా ఇంత పద్ధతిగా అల్లరి చేస్తున్నారు’ అనిపించేంత!
    బబ్లూ ఇంట్లో వాళ్ళ అమ్మ, నాన్నగారు, బామ్మ ఉండేవారు. గాడ్జిల్లా అనే నల్ల కుక్క కూడా ఉండేది.

    మా కాలనీలో ముఖ్యమయిన పండుగ వినాయక చవితి. స్టేజీ మీద బొమ్మ పెట్టేవాళ్ళం. సత్యవతిగారి ఆర్గనైజేషన్ మొత్తం. కల్చరల్ ప్రోగ్రాములు, పాటలు, డాన్సులు (మావే), ఆటలు, లైటింగు, పార్కు మొత్తం ఒక పరస వాతావరణం వచ్చేసేది ఆ ఐదురోజులు.

    ఓ సంవత్సరం బబ్లూకి ఓ ప్రశ్నొచ్చింది. ఎన్నో సంవత్సరాలుగా వినాయక చవితి జరుపుకుంటున్నారు కదా, అది ఎవరు మొదలుపెట్టారా అని! వాళ్ల బామ్మ ని అడిగాడు, ఆవిడ “శివుడు మొదలు పెట్టాడు” అంది. నాన్నని అడిగాడు, ఆయన “ఋషులు మొదలెట్టారు” అని చెప్పారు. వీళ్ళలో ఎవరు కరెక్ట్ అని అమ్మని అడిగితే “వ్రత కథ సరిగ్గా వినమన్నాను అందుకే” అనో మొట్టికాయేసింది.
    ఫైనల్ గా వాడు తెలుసుకున్న విషయం ఏంటంటే, ఎవరికీ తెలియదు అని.
    ఐతే వాడికి ఒక ఆలోచన వచ్చింది. మనం కూడా ఒక పండగ కనిపెట్టి దానిని బాగా జరిపితే పాపులర్ అయిపోతాము కదా! ముఖ్యంగా ఓ రెండురోజులు స్కూల్ కి వెళ్ళక్కర్లేదు కదా!

    మమ్మల్నందరినీ కూర్చోబెట్టాడు మరుసటి రోజు. ఐడియా మాకూ బ్రహ్మాండంగా నచ్చింది! మన సొంత పండుగ, మనమే కనిబెడుతున్నాం! ఐతే ఎప్పుడు చెయ్యాలి, ఎవరికి చెయ్యాలి? ప్రతీ వారం ఏదోటి చేస్తూనే ఉంటారుగా మనోళ్ళు. మనోజుని ఏ రోజు ఖాళీగా ఉంటుందో చెప్పు పంచాంగంచూసి అనడిగాము. వాడి జ్ఞానంతో “ఒరేయ్ పాడ్యమి ఏ పండుగలు ఉండవురా” అన్నాడు. ఎండాకాలంలో చెయ్యలేము. మిగిలనిది దీపావళికి సంక్రాంతికి మధ్య రెండు నెలలు. క్రిస్ట్మస్ లోపే అయిపోవాలి. ఫిక్స్ ఐతే!

    ఓ నాలుగురోజులు ప్లాన్ చేసి ఒక ఉదయం వాళ్ళ అమ్మని, నాన్నని లేపి చెప్పాడు, “నాన్నగారు, నాకు నిన్న రాత్రి నిద్రలో నంది వచ్చింది. అది చాలా బాధ పడింది. ఇన్ని యుగాల నుంచి శివుడిని లోకాలన్నీ తిప్పుతున్నాను కదా, నాకు ఒక్క పండగ కూడా లేదా అని కంట తడి పెట్టుకుంది”! బామ్మ గబగబావచ్చి వాళ్ల నాన్నతో అంది “ఒరేయ్ నానీ, నేను చెప్పాను కదా, చిన్నప్పుడు వీడు పుట్టిన నక్షత్రం ఎంతో దివ్యమైనది అని! చూశావా, వీడికి నంది కలలోకి వచ్చిందట!! తరచూ మీ నాన్నగారికి కూడా నంది కలలోకి వచ్చేది రాఆఆఆ!” అని బబ్లూ గాడి ప్లాన్ ని పాస్ చేసేసింది.

    నవంబర్‌లో ఒక సాయంత్రం పిల్లలందరం కలిసి చందా డబ్బాలు పట్టుకుని బయలుదేరాం కాలనీ లో, వానర సేన లంక మీద పడ్డట్టు. ఒక్కొక్క ఇంటి వాళ్ళకీ టెన్షన్! ‘ఇప్పుడే కదా దసరా అయ్యింది, చందాల వాళ్లు ఏమైనా వదిలితే దీపావళి కి కల్చేసామాయే, ఇప్పుడు ఈ కొత్త కలక్షన్ ఏంటిరా భగవంతుడా’ అని!
    మన కాలనీ లో ప్రపంచం లోనే మొదటి సారి గా నంది పాడ్యమి జరుపుకుంటున్నాము, మీ వొంతు చందా ఇవ్వండి అని పాంప్లేట్లు లాగ మేమే రంగురంగు కాగితాలమీద రాసేశాం! ఒక్కొక్కళ్ళ మొహాలూ చూడాలి! నంది పాడ్యమి ఏమిటి, చందా ఏమిటి! పిల్లలు ఇలా రామదండు లాగా బయలుదేరడమేమిటి!
    అందరినీ పట్టుకుని పీడించి ఓ మోస్తరు కలక్షన్ చేశాం.

    అక్కడ వచ్చింది చిక్కు. గణపతి, దుర్గ బొమ్మలు చేసిన బెంగాళీ వాడు “నాకు నంది బొమ్మ నహీ ఆతా” అన్నాడు! మరెలా అంటే “ముఝే బొమ్మ దిఖాయేగా మే బనాయేగా” అన్నాడు. అనిల్ గాడి ఇంట్లో పాత చందన బ్రదర్స్ క్యాలెండర్ ఒకదాంట్లో పెద్ద నంది బొమ్మ కనబడింది. అది చింపుకొచ్చాం. అందులో నవ్వుతున్న నందిని చూపించి, “ఇదిగో, ఇప్పుడు చెయ్యి” అన్నాడు బబ్లూ. గోడకి అంటించాడు బెంగాళి.

    మన గుడి పంతులు ప్రసాదు గారిని “నంది పూజ మీకొచ్చా?” అనడిగితే ఆయన గాబరా పడిపోయి “నాకు రాదు బబోయి” అన్నారు. మరేంచెయ్యాలని అడిగితే “పక్క కాలనీలో అయ్యప్ప దేవాలయం ఉంది కదా, అందులో మలయాళం పంతులు గారొకాయనుంటారు, ఆయన్నడగండి” అన్నారు. ఆయనకూడా “అంబలం పూజయితే చేస్తానుగానీ నంది పూజేమిటి? నేనెప్పుడూ వినలేదు” అన్నారు. బామ్మ అందరినీ భీబత్సమైన తిట్లు తిట్టింది “షోడశోపచార పూజ చేసెయ్యడమే, నందికేశునోము లోవి కొన్ని వాడేస్తాం! అష్టోత్తరం శివుడిది చదివినా పర్లేదు… మిడిమిడి జ్ఞానం గాళ్ళందరూ పంతుళ్ళయిపోయారు, ఇందులో కష్టమేముంది..” అని!

    అయితే మన పంతులుగారి కొడుకు మనోజ్ ఓ ఐడియా ఇచ్చాడు. “మా నాన్నగారు చెయ్యనన్నా మా బాబాయొకాయనున్నారు. చిన్నప్పుడు ఇష్టంలేకపోయినా మా తాతగారు బలవంతంగా స్మార్తం నేర్పించారు. ఏదో సాఫ్ట్వేర్ ఉద్యోగాలని ట్రై చేస్తున్నాడిప్పుడు ఖాళీనే” అన్నాడు. అంతే! “వామ్మో వార్నాయనో” అని విలపిస్తున్నా వినకుండా బామ్మ గారి అజమాయిషీలో పిల్లలు అందరం కలిసి బాబాయిని ఎత్తుకొచ్చాం! “ఎలాగో ఉద్యోగం లేదు కదా రా, నంది పూజ చేస్తే బిల్ గేట్స్ ఉద్యోగం వస్తుంది అని కేనోపనిషత్ లో ఉంది” అని బబ్లూ వాళ్ళ బామ్మ బాబాయిని కన్విన్స్ చేసేసింది. “ఎలాగో ఎవరూ ఇంతకుముందు ఇది చెయ్యలేదు కదా, ఆ పేటెంటు నీదే” అంది! మరేమి మాట్లాడతాడు?

    ఒక వారం అయ్యాక బెంగాళీ దగ్గరనుంచీ ఒక రకంగా చూస్తున్న నంది (లాంటి) బొమ్మని పిల్లలందరం చిన్నారావు ఆటోలో తెచ్చాం. దానికి కూడా కళ్ళకి గుడ్డ కట్టి! మరి పూజ కి ముందు తీయకూడదు కదా! బాబాయి కష్టపడి పంచ కట్టుకుని, (అది జారిపోకుండా లోపల బెల్ట్ పెట్టుకుని) నామాలు పెట్టుకు వచ్చేడు. ఓ మూడురోజులకి సరిపడా ప్రసాదాల లిస్టు, పూజల లిస్టు పట్టుకొచ్చేసారు సత్యవతిగారు. అందరు లేడీసుకి డ్యూటీ వేసేసారు. షాజూ వాళ్ళ అమ్మగారి దగ్గరనుంచీ క్రిస్ట్మస్ లైట్లు పట్టుకొచ్చేసాం నంది స్టేజికోసం. మన మెడికల్ రిప్రజెంటేటివ్ ని పట్టుకుని కాటను థర్మకోలు ఫ్రీగా తెప్పించుకున్నాం. ఒక చిన్న కైలాసం లాగ వాటితో మంచుకొండలు కట్టాం బ్యాక్‌డ్రాప్ లో. అందరం కలిసి ఓ రోజు స్కూలు ఎగ్గోట్టాం.

    ఒహొ! ఏమి పూజలనుకున్నారూ? బాబాయి మంత్రాలు గబ గబా చదివేస్తున్నాడు (మరి …..) నంది పాడ్యమి అన్న విషయం తెలిసేసరికి పక్కన ఉన్న కాలనీ వాళ్ళూ, చుట్టాలూ అందరూ వచ్చేసారు ! కేరళ పంతులు గారు, అయ్యప దీక్షలో ఉన్న ఓ యాభైమంది కలిసొచ్చి ఓ రాత్రంతా కైలాసానికి వినబడేలా భజనలు చేశారు. మూడోరోజు అన్నదానం కూడా సెట్ చేశారు మా పార్కులో. హుండీ నిండింది!

    నిమజ్జనానికి మళ్ళీ చిన్నారావు ఆటో, బాబాయి మంత్రాలు (ఇప్పుడు కొంచం గట్టిగా చదివాడు లెండి — అలవాటు అయ్యింది కదా!), వెనకాల బబ్లూ గాడు ‘మాయదారి మైసమ్మ’ పాటలు, డాన్సులు, భలే అయ్యింది! బీచ్ రోడ్డులో జనాలకి అర్ధం అవ్వలేదు. ఇప్పుడేం నిమజ్జనం అని! అదీను బొమ్మచూస్తే గణపతి కాదు, దుర్గమ్మ కాదు. నంది అని గుర్తుపట్టడానికి వాళ్ళకీ కొంచం కష్టమయ్యుంటుంది.

    సంవత్సరం తిరిగింది. బాబాయికి నిజంగా అమెరికా లో ఉద్యోగం వచ్చింది, బబ్లూ గాడు అన్ని సబ్జక్టులలో మంచిమార్కులు తెచ్చేసుకున్నాడు. కాలనీ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న మంచినీటి పైపు ఇంకొకటి బిగించారు, రోడ్లు మరమ్మతు చేశారు. పార్కు గోడలకి మునిసిపాలిటీ వాళ్ళే రంగులేసారు.
    “అంతా నంది పాడ్యమి మహిమ” అని బామ్మగారు మొత్తం చాటేసారు. ఈ సారి చందా డబ్బా తియ్యకుండానే అందరూ ముందుకొచ్చారు!

    మరుసటి సంవత్సరం బెంగాళీ బొమ్మలో నంది నవ్వింది 😊

    _______________________________

    ఈ శీర్షిక లో మరి కొన్ని కాలనీ కథలు 🩷

    _______________________________

    ఈ పేరుతో ఓ కథ పన్నెండేళ్ళ క్రితం గంభోళజంబ అనే నా పాతబ్లాగులో రాసుకున్నాను. దాన్ని రీరైట్ చేసి మన కాలనీలోకి పట్టుకొచ్చాను.

  • 4. గులేబకావళి పూలు

    4. గులేబకావళి పూలు

    ఎనిమిదో క్లాసులో షాజు అని ఓ ఫ్రెండుండేవాడు. మళయాళి. పూర్తి పేరు షాజు జోస్ అబ్రహం కైపన్ప్లాకల్. ఆ స్పెలింగు నేర్చుకోడానికే మాకు సగం సంవత్సరం పట్టింది. క్లాసుకి కొత్త టీచర్ వస్తే భలే ఉండేది అటెండన్సప్పుడు! వాళ్ళ నాన్నగారు ఫెడరల్ బ్యాంకు ఆఫీసర్. ట్రాన్స్ఫర్ మీద ఇక్కడికొచ్చారు.

    మేమందరం పగలూ రాత్రీ క్రికెట్టాడుతూంటే వాడు ఫుట్‌బాల్ పట్టుకుని పార్కుకొచ్చేవాడు. మొదట్లో నవ్వేవాళ్ళం — ఫుట్బాలేంటిరా అని. లగాన్ సినిమాలో పల్లెటూరోళ్ళలాగ రూల్సన్నీ నేర్చుకుని ఆడేమనుకోండి….

    అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది షాజు వాళ్ళ అమ్మగారి గురించి. లైఫ్ లో మొదటిసారి , ‘పద్ధతి’ అనే పదానికి అర్ధం ఆవిడ దగ్గర చూశాం. అంటే మేము కూడా కొద్దోగొప్పో నీటుగానే ఉండేవాళ్ళమనుకోండి, కానీ ఆవిడ భయంకరం! షాజు గాడు ఎప్పుడూ ఇస్తిరీ చేసిన బట్టలు మాత్రమే వేసుకొచ్చేవాడు. కనీసం ఆడుకోడానికి కూడా ఇస్తిరీ లేని బట్టలలో వాడిని మేమెప్పుడూ చూడలేదు. షూస్ లేకుండా ఇంటి బయటకు వచ్చేవాడే కాదు. స్కూలు యూనీఫార్మ్ మెడ దగ్గర పైబటన్ ఎప్పుడూ పెట్టుకునే వచ్చేవాడు. ఎంత ఎండాకాలం అయినా, క్లాసులో ఫ్యాన్ తిరగకపోయినా ఆ గుండీ మాత్రం తీసేవాడుకాదు. బ్రేకు పీరియడ్ లో మేము చొక్కాలు చింపేసుకుని, జుట్టు రేపేసుకుని మట్టిలో దొర్లుతున్నాకూడా వాడు నీటుగా టక్కుతోనే ఉండేవాడు!

    వాళ్ళ ఇల్లుకూడా ఓ హోటల్ లాగ మైంటైన్ చేసేవారు ఆంటి. అంటే మనింటికి బాగా డబ్బున్న చుట్టాలొచ్చినప్పుడు అమ్మ ఇళ్ళంతా మనచేత దులిపించి, లోపలినుంచీ మంచి ఇస్తిరీ దుప్పట్లుతీసి పరిచి, పెళ్ళికి గిఫ్టొచ్చిన కాస్ట్లీ కప్పులసెట్టు తీసి, ర్యాకులో మంచి పుస్తకాలు మాత్రమే కనబడేలా సర్ది…. వాళ్ళిల్లు ఎప్పుడూ అలానే ఉండేది! ఇల్లు చిన్నదే, లోపల మాత్రం కార్పెట్టు, ఛాండెలియరు, అద్భుతమయిన పుస్తకాల ర్యాకు, పింగానీ కప్పులు, డిమ్ము లైటింగు, తెల్ల టేబుల్ క్లాతు, కప్పుల కింద కోస్టర్లు, ఏది తెచ్చినా కింద ట్రే కంపల్సరీ, బయట మొక్కలు, మొత్తం గోడంతా పాకేసిన మనీప్లాంటు, ఆవిడే గీసి ఫ్రేము కట్టించిన బొమ్మలు, క్రాఫ్టులు, గ్లాసు పెయింటింగులు…. ఒక మూల జెరుసలేంలో జీసస్ పుట్టిన దృశ్యం మొత్తం పర్మనెంటుగా ఇంట్లో కట్టేసారు — మట్టి, కాటన్, గడ్డీ, లైట్లు వాడి. (రాత్రంతా అందులో లైటు వెలుగుతూనే ఉంటుందట!)

    అవకాశం వస్తే వాడి ఇంట్లోకి వెళ్ళడానికి చూసేవాళ్ళం — కొత్తగా ఏమి పెట్టారో అని! ఆడుకునేటప్పుడు మంచినీళ్ళు కావాలని దూరమయినా అక్కడికి వెళ్ళి అడిగేవాళ్ళం. గ్రౌండు పక్కనున్న అనిల్ గాడి ఇంటికెళ్తే ఉత్తి నీళ్ళొచ్చేవి, నాలుగు తిట్లుకూడా పడేవి “ఇంకా ఎంతసేపురా” అని! అదే షాజు వాళ్ళింట్లోంచైతే నీళ్ళడిగితే రస్నా వచ్చేది మరి! అదీ కాక ఒక ప్లేటులో పసుపు రంగులో ప్రపంచంలోకళ్ళా గొప్ప చిప్స్ వచ్చేవి! అసలు అరటికాయతో చిప్స్ చెయ్యొచ్చని ఐడియా వచ్చినవాడికి నోబుల్ బహుమతి ఇవ్వాలి వెంటనే. ఆ ఉప్పుడు టేస్టు నాలుకమీద ఉన్నంతసేపూ మైమరుపే! ఎక్కడయిపోతాయో అని మెల్లగా చప్పరించి తినేవాళ్ళం. కానీ పక్కోడు మనకన్నా ఎక్కడ లాగించేస్తాడా అని అదో టెన్షను!

    షాజు పుట్టినరోజు క్రిస్ట్మస్ కి మూడురోజుల తరువాత. అయితే చిన్నప్పటినుంచీ రెండూ కలిపేసి ఒకేరోజు జరిపేవారట. ఆ సంవత్సరం పర్టీకి మమ్మల్ని కూడా పిలిచారు. మామూలుగా కాదు, ఓ అందమైన డెకరేషన్లున్న లెటర్ ప్రింటుతీసి ఎన్వలప్ లో పెట్టి మరీ పిలిచాడు! ఆ కవరు చాలారోజులు దాచుకున్నాం. షాజు వాళ్ళింటికని మా అమ్మలు మమ్మల్నందరినీ నీటుగా తయ్యారుచేసి, పాపిడితీసి దువ్వి, షూసేసిమరీ పంపించారు. అందరం తలో పెద్ద గిఫ్టూ ప్యాకింగుచేసి తెచ్చాం. అప్పట్లో ఎవరిది పెద్ద పెట్టైతే వాడిదే గొప్ప గిఫ్టు మరి! మామూలుగానే క్షణక్షణం సినిమాలో ‘ఐబాబోయి గదా ఇది, స్వర్గమేమో కదా ఇది’ అన్నట్టుంటుంది వాళ్ళిళ్ళు. క్రిస్ట్మస్, ఒకే కొడుకు పుట్టినరోజు అనేసరికీ మరీ డెకరేట్ చేసేశారు! సోఫా కవర్లు కూడా కొత్తవేసి, ఎక్కడచూసినా సీరియల్ లైట్లుపెట్టి, ఓ అద్భుతమయిన రెండంతస్థుల కేకు చేయించి, అసలు భీబత్సం! కేకు, కేరళ చిప్సు, సమోసా, కూల్ డ్రింక్సు (రస్నా కాదు, నిజమైనవి), మ్యూజికల్ చెయిర్సు, హౌసీ, గొప్ప సందడయ్యింది!

    మూడేసి గ్లాసుల కూల్ డ్రింకులు లాగించేశాం, ట్యాంకు ఫుల్లయిపోయింది. షాజు గాడిని పక్కకి పిలిచి చిటికినవేలు చూపించి ఒరేయ్ ఎక్కడ అని అడిగాడు అభయ్. షాజు తీసుకెళ్ళాడు. వాడో నిమిషం తరువాత వెనక్కొచ్చి ఒరేయ్ బయటకిరండి అని మమ్మల్ని తీసుకెళ్ళి జేబులోంచీ ఓ బ్రౌను రంగు పువ్వు లాంటిది చూపించాడు. “ఇవేవో బాత్రూం లో గిన్నెలో పెట్టారురా, వాసన చూడండి” అన్నడు. భలే వాసన! ఇది పువ్వు లాగ మెత్తగాలేదు, ఈ వాసన ఎప్పుడూ ఏ పువ్వుకి మేము చూడలేదు, అందరం లోపలిదాకా పీల్చుకుని వాసన చూసేశాం! మనోజు వాళ్ళ ఇంట్లో ఓ బామ్మగారున్నారు. ఎప్పుడూ పాత సినిమాలు చూసేవారు. వాడు చెప్పాడు — “అన్నయ్య, గులేబకావళి అని ఒక పువ్వుంది, దాని వాసన ఇలాగే ఉంటుంది” అని. “నువ్వెప్పుడు చూశావురా” అనడిగితే “వాసన చూడలేదు గానీ సినిమాలో చూపించినప్పుడు ఇలాగే ఉందా పువ్వు” అన్నాడు. వెంటనే లోపలికెళ్ళి ముందు నేను తరువాత అనిల్, మనోజ్, మరోసారి అభయ్, అందరం లైనులో బాత్రూంలోకి వెళ్లిపోయాం. తలో పువ్వు జేబులోపెట్టుకొచ్చేసాం, గిన్నె ఖాళీ! పార్టీ అయిపోయింది, ఇంటికెళ్ళిపోయాం, జేబులోంచి జాగ్రత్తగా తీసి స్కూలు బ్యాగులో పెట్టేశానది. ఓ నాల్రోజులు సూపర్ వాసనొచ్చింది బ్యాగంతా, అలా తగ్గిపోయింది. మమ్మల్ని మరుసటిరోజు అదోలా చూశాడు షాజు.

    సంక్రాంతి సెలవులలో ఆడుకుంటున్నప్పుడు అభయ్ కి ఐడియా వచ్చి వాళ్ళ ఇంటిదగ్గర సైకిల్ ఆపి “ఒరేయ్ అర్జెంట్, ఒక్కసారి”… అన్నాడు. అలాగే అని లోపలికి తీసుకెళ్ళాడు షాజు. బాత్రూములో ఈ సారి గిన్నెలేదు, పువ్వులు లేవు.

    చాలా ఏళ్ళతరువాత తెలిసింది ఇవి టాయిలెట్లలో మంచి వాసన కోసం ఉంచుతారని, వీటి పేరు గులేబకావళి పూలు కాదని, మేము వాళ్ళకి బాత్రూములో వాసనకోసం పెట్టిన పూలు, కలరా ఉండలు పట్టుకుపోయేవాళ్ళ లాగ కనిపించుంటామని 🤭

    ___________________________________

    ఈ శీర్షిక లో మరి కొన్ని కాలనీ కథలు 🩷

  • వింజమూరి కధలు – 2 – నేల టిక్కెట్టు


    “మోవ్… నీకు ఎన్నిసార్లు చెప్పాలి. నాకు సైడ్ క్రాఫ్ వద్దు, పైకి దువ్వు” అరిచాడు తిరుమల. పక్కకి దువ్వితే బావుంటావు రాజా.. నవ్వుతూ తల దువ్వింది అమ్మ. తిరుమల అప్పుడే ఆరో క్లాస్ లోకి వచ్చాడు. ఎలిమెంటరీ బడి నుంచి ప్రమోషన్ వచ్చి జెడ్పీపీఎస్ బాయ్స్ హైస్కూల్ లో చేరాడు. చిరంజీవి, సినిమా, ఫ్రెండ్స్, క్రికెట్, అదే ఒక చిన్న ప్రపంచం. చిరంజీవిలా క్రాఫు కావాలి, చిరంజీవిలా డాన్స్ వేయాలి.

    డాడాని నా పుట్టినరోజు డ్రెస్ టైలర్ దగ్గరనుంచి తీసుకురమ్మని చెప్పు, బ్యాగీ ప్యాంటు, ఫ్లవర్ డిజైన్ షర్ట్ వేసుకుంటే చిరంజీవిలా ఉంటాను అని ఊహించుకుంటూ… పుస్తకాల సొరుగులో భద్రంగా దాచుకున్న స్టేట్ రౌడీ సినిమా పాటల పుస్తకాన్ని జేబులో పెట్టుకుని బయటకు పరిగెత్తాడు. డాడా అంటే నాన్న. డాడా పినాకినీ గ్రామీణా బ్యాంకు లో క్లర్కు. తిరుమల వాళ్ళ అమ్మ, తిరుమల, తిరుమల చెల్లి, ఒక చిన్న ఇల్లు, టీవీఎస్ ఫిఫ్టీ. అదే డాడా చిన్న ప్రపంచం

    మా ఊళ్ళో అందరికీ సినిమా అంటే పండగ. కొత్త సినిమా అంటే పెద్ద పండగ. చిన్నా, చితకా, ఆడా మగా , ఉన్నవాళ్లు, లేనివాళ్ళు, అందరికీ సినిమా అంటే పండగే. చిరంజీవికి ఫ్యాన్స్ ఉంటారు, విజయశాంతికి ఫాన్స్ ఉంటారు, రాజనాలకి, రాజశేఖర్ కి, సుమన్ కి, సుమలతకి, భానుచందర్ కి, భానుప్రియ కి, అరుణ్ పాండ్యన్ కి, ముచ్చర్ల అరుణ కి, అందరికీ ఫాన్స్ ఉంటారు.

    మా ఊళ్ళో అప్పట్లో రెండు సినిమా హాళ్లు, పాత హాలు, కొత్త హాలు. కొత్త హాల్లో బాల్కనీ ఉండేది. సినిమా మారింది అంటే, ఒక బండి మీద పెద్ద పోస్టర్ పెట్టి ఊరంతా తిరుగుతూ మైక్ లో అరుస్తూ చెప్పేవాళ్ళు. రచ్చబండ అంకుల్స్ అప్పటికప్పుడు నైజం, సీడెడ్ కలెక్షన్స్ లెక్కలేసేవాళ్ళు. బోరింగ్ పంపు దగ్గర ఆడవాళ్లు ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ, మొదటి ఆటకి వెళ్ళడానికి మొగుళ్లను ఎలా ఒప్పించాలో ప్లాన్లు వేసేవాళ్ళు.

    కొత్త సినిమా ఎప్పుడూ కొత్త హాల్ లోనే వచ్చేది. మాయాబజార్, గుండమ్మ, మిస్సమ్మ… అన్నీ పాత హాల్లోనే. కొత్త సినిమా వచ్చిందంటే ఊరంతా కదిలి వచ్చేది. నేల టికెట్ అంటే, నేల మీద సినిమా చూసే టికెట్. బెంచీ టికెట్ అంటే చెక్క బెంచీలు. కుర్చీ టికెట్ అంటే కుషన్ కుర్చీలు. బాల్కనీ అంటే మెట్లు ఎక్కి పైకి వెళ్లి మెత్తటి కుర్చీల్లో కూర్చుని చూడటం. ఇంటర్వెల్ వచ్చిందంటే బాల్కనీ లో ఉన్నవాళ్లు స్టైల్ గా కిందకి చూసేవాళ్ళు. నేల టికెట్ వాళ్ళు ఆశగా పైకి చూసేవాళ్ళు. టికెట్ ధర రెండు రూపాయల దూరం, కానీ చూపులో తేడా ఆకాశానికి నేలకి ఉన్నంత దూరం.

    కొన్నిరోజుల్లో తిరుమల పుట్టిన రోజు వస్తోంది. కొన్నిరోజుల్లో చిరంజీవి సినిమా కూడా వస్తోంది. మొదటిదానికి డాడా హడావుడి. రెండోదానికి తిరుమల హడావుడి.

    బయట సినిమా బండి. రేపే విడుదల మీ అభిమాన హీరో చిరంజీవి నటించిన ‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’ సినిమా మన కొత్త హాల్లో.

    పుట్టిన రోజుకు కొనిచ్చిన కొత్త బట్టలు కట్టుకుని చిరంజీవి సినిమాకి ఫ్రెండ్ తో వెళ్దాం అని తిరుమల ప్లాన్. రేపు మొదటిరోజు మొదటి ఆట సాయంత్రం షో. డాడా జేబులో నుంచి లేపేసిన ఒక రూపాయి బిళ్ళ భద్రంగా నిక్కర్ జేబులో దాగుంది. ప్లాన్ అంతా సెట్.

    “రేపు పక్కూరికి వెళదాంరా తిరుమలా, ఒక పని ఉంది.” డాడా అరిచాడు.

    ప్లాన్ షేక్. షేక్ అంటే షాక్. తిరుమలకి షాక్.

    “లేదు డాడా సోమవారం నుంచి నాకు క్వార్టర్లీ. ఫ్రెండ్ తో చదువుకోవాలి, నేను రాలేను. మీరు వెళ్ళండి.”

    కొంచెంసేపు డాడా – తిరుమల ఇద్దరూ కదనరంగంలో రెండు టీముల్లా ఒక పద్యం, ఒక బాణం, ఒక పద్యం ఒక బాణంలా సమరశంఖాలు పూరించి కొట్టేసుకున్నారు. చివరకి తిరుమల కన్నీటి ప్రవాహానికి డాడా కరిగి కొట్టుకుపోయాడు.

    గెలిచిన తిరుమల కళ్ళు తుడుచుకుని ఈ గెలుపులో భాగమైన మన చిరంజీవికి గాల్లో ఒక కిస్ వేసి జేబులోని రూపాయి బిళ్ళని తడుముకుని రేపటి సినిమా ప్లాన్ మరోసారి మననం చేసుకున్నాడు.

    రేపు…

    మొదటి ఆట సాయంత్రం ఏడున్నర కి మొదలవుతుంది. హాలు తలుపులు ఆరున్నరకే తెరిచేస్తారు. తిరుమల ఆరుకే వెళ్లి గేట్ దగ్గర నిలబడ్డాడు. ఫ్రెండ్ గాడికి వాళ్ళ నాన్న గంజి పెట్టి ఉతికి ఆరేయడం వల్ల హాలుకు రాలేకపోయాడు పాపం.

    గేటు ముందంతా జనాలే. టీచర్ పాఠం చెప్పేటప్పుడు తలకెక్కకపోతే నోటుపుస్తకం లాస్ట్ పేజీలో పెన్ను పెట్టి పిచ్చి గీతలు గీకుతూ ఉంటే ఎలా ఉంటుందో, ఇక్కడ జనాలు కూడా అంతే గజిబిజిగా ఉన్నారు. మన చిన్న చిరంజీవి మొత్తానికి ఎలాగోలా నేల టిక్కెట్టు కొనుక్కుని హాలులో గోడకు అనుకుని కూర్చున్నాడు.

    హీరో ఎంట్రీ అయ్యేసరికి హాలు అంతా విజిల్స్, అరుపులు. స్క్రీన్ మీద రంగురంగుల లోకం. తిరుమల కళ్ళల్లో కలల కాంతి. “నేనే చిరంజీవి ఫ్యాన్! ఇదే నా స్వర్గం!” అనుకున్నాడు.

    ఇంటర్వెల్. లైట్లు వెలిగాయి. మళ్ళీ గజిబిజి. సమోసాలు, సుగంధ వాటర్, సుగంధ పాలు, గొట్టాలు, నానా గడ్డీ. అమ్మడం, కొనడం, తినడం, తాగడం అంతా ఒక పద్ధతీ పాడూ లేకుండా జరిగిపోతోంది. తెచ్చుకున్న రూపాయిలో పావలా మిగిలింది. దాంతో కొన్ని గొట్టాలు కొనుక్కున్నాడు.

    నేల మీద కూర్చున్న వాళ్లంతా ఆశగా బాల్కనీ వైపు చూస్తున్నారు. మన చిన్న చిరంజీవి కూడా చూసాడు. ఎప్పట్లానే నింగి-నేల కాన్సెప్ట్. పైన కూర్చున్న వాళ్ళు కూడా క్రిందకు చూస్తున్నారు. ఇంతలో పైనుంచి అరుపు. ఎవరో తిరుమల వైపు వేలు పెట్టి చూపిస్తూ అరుస్తున్నారు. తిరుమల కళ్ళు చికిలించి చూసాడు. చెల్లి. బాల్కనీలో. పక్కనే అమ్మ, డాడా. సమోసాలు తింటూ లిమ్కా తాగుతున్నారు.

    “డాడా ! అన్నయ్య కింద కూర్చున్నాడు!”

    తిరుమలకి ఒక్కసారిగా గాబరా. అబద్దం చెప్పి దొరికిపోయానన్న బాధ ఒకవైపు, బాల్కనీ లో చెల్లి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అనే కుళ్ళుమోతుతనం మరోవైపు.

    “ఇప్పుడు డాడా ఏం చేస్తాడో…” అనుకుంటూ గుండె దిటవు చేసుకుంటూ దిక్కులు చూస్తున్నాడు.

    డాడా కిందికి వచ్చాడు. మొహంలో కోపం లేదు. గేటు దగ్గరున్న కీపర్‌ని పక్కకి పిలిచి, “మా బాబుకి బాల్కనీ టిక్కెట్టు తీసుకున్నాం రా, ఆలస్యంగా వచ్చేశాడు. లోపలికి పంపించు.” అని చెప్పి, చేతిలో ఒక అర్ధరూపాయి పెట్టాడు. తర్వాత తిరుమల భుజం మీద చేయి వేసి, బాల్కనీకి తీసుకెళ్లాడు.

    ఆలోచిస్తే తిరుమలకి అర్థమైంది. డాడా ఊరికి వెళ్దాం అన్నది అబద్దం అని, తనకు తెలియకుండా తనకోసం సినిమా ప్లాన్ చేసాడు అని, తనే చిరంజీవి పైత్యం వల్ల ఇలా జరిగిందని అనుకుంటూ బాల్కనీ లో కూర్చుని, చెల్లి ఇచ్చిన గోలి సోడా తాగుతూ, అమ్మ పంచిన పల్లీలు నములుకుంటూ ఆలోచించాడు.

    “నాన్న ప్రేమ అర్ధం కాదు. నాన్న అనేవాడు కూడా అర్ధం కాదు. కానీ నాన్న చెప్పింది వింటే మంచి జరుగుతుంది, నాన్న చెప్పేది, చేసేది నా మంచి కోసమే, ఈ నేల టిక్కెట్టు నా మనసులో ఎప్పటికీ చెదరని ఒక అమూల్య జ్ఞాపకం” అనుకుంటూ తిరుమల మిగిలిన సినిమా అందరితో కలిసి చూసాడు.

    “మా డాడానే చిరంజీవి! ఇదే నా స్వర్గం!”

    సమాప్తం

    1
  • టిఫిన్ ఏమిటీ

    “టిఫిన్ ఏం చెయ్యను” అంటూ వంటగది నుండి వస్తూనే అడిగింది సతీమణి.
    “ఉప్మా” తడుముకోకుండా జవాబు చెప్పాడు ఇంటాయన, హాల్లో మధ్యాహ్నం కూరకి ఉల్లిపాయలు కోస్తూ.
    తమ గదిలో కూర్చొని కాలక్షేపం చేస్తున్న పిల్లలిద్దరూ తమమీద పిడుగేదో పడినట్టు ఊలుక్కిపడి హాల్లోకి పరిగెత్తుకుంటూ వచ్చి “ఉప్మాయా” అన్నారు దీనంగా.
    “ఏమైంది అమ్ము, మీ అమ్మ ఉప్మా చాలా బాగా చేస్తాది కదా, మీ కోసం జీడిపప్పు ఎక్కువేయిస్తా లెండి” అంటూ ప్రేమగా అన్నాడు అతను వీళ్ళను ఒప్పించడానికి ప్రయత్నం చేస్తూ.
    “ఆదివారం ఉప్మా ఏమిటి నాన్న” అంటూ గారాలు పోయారు ఇద్దరు.
    “ఏ బంగాళాదుంప కూరతో పూరినో, టమాటో పచ్చడితో అట్లొ బాగుంటుంది కదా” అంటూ వారి వారి అభిప్రాయాలూ చెప్పారు.
    “బాగుంటుంది కానీ, అమ్మకి పనెక్కువ అవుతుంది కదమ్మా” అన్నాడు.
    “మెం సాయం చేస్తాం” అన్నారు కూడబలుక్కొని.
    “అలా కాదమ్మా, ఉప్మా ఎంత గొప్పదో మీకు తెలుసా అసలు ” అంటూ ఉప్మా గొప్పలు చెప్పడం మొదలు పెట్టాడు.
    “ఉప్మా మనం గోధుమ సన్న రవ్వతో లేదా దుడ్డు రవ్వతోనైనా చెయ్యొచ్చు, బియ్యం నూక అదే వరి నూకతో కూడా చెయ్యొచ్చు, బియ్యం నూక ఉప్మా కిందన మాడు భలే రుచిగా ఉంటుంది, ఇంకా మీ అందరి ఫేవరేట్ సేమ్యా ఉప్మా. ఇన్ని ఆప్షన్స్ ఎక్కడ ఉంటాయి చెప్పండి” అంటూ ఊరుకోలేదు “ఉప్మా పూర్వం ఋషులు పార్వతి దేవి కూడా చేసుకొని తిన్నారని ఎక్కడో పురాణాల్లో చెప్పారట, అదే ఒక పెద్దాయన ట్విట్టర్లో చెబితే చదివాను. ఈ ఉప్మా రుచికరంగా చెయ్యగలిగిన వారు ఏ వంటనైనా మహా అద్భుతంగా చెయ్యగలరు తెలుసా” అంటూ సతీమణి వైపు చూసాడు.
    ఆవిడ కురులను సవరిస్తూ వయ్యారంగా నడుముపై చెయ్యవేసి పక్కనే ఉన్న గోడ పై వాలి అయన మాటలను వింటూ ఓ చిరునవ్వు వదిలింది.
    మళ్ళీ అతను “మీ ఫేవరేట్ హీరో పోకిరిలో ఉప్మా తిన్నాడు చూసారా, పెసరట్టులోకి నేస్తం ఉప్మా, చుట్టాలు వచ్చినప్పుడు సులువుగా చెయ్యగలిగేదే ఉప్మా, పెళ్లిలో అందరి కడుపు నింపేదే ఉప్మా, ఏ పచ్చడి చట్నీ తోడు లేకున్నా మనల్ని ఆదుకునే అమృతమే ఉప్మా. శాకాంబరీ ప్రసాదం ఈ ఉప్మా , అసలు
    వంకాయ వంటి కూరయు
    పంకజముఖి సీతవంటి భామా మణియున్
    శంకరుని వంటి దైవము
    లంకాధిపు వైరి వంటి రాజును గలడే
    అన్నాడే కానీ ఉప్మా వంటి అల్పాహారం అని మధ్యలో కలపాలి, వాళ్ళ ఆవిడా వంకాయ కూర అంత బాగా ఉప్మా చెయ్యలేదేమో అందుకే పెట్టలేదు ఆ కవి గారు” అని గాలి పీల్చుకొని మల్లి ఉప్మాద్గతం అందుకున్నాడు “చిరంజీవి డాన్స్ వంటిది ఉప్మా, బాలకృష్ణ డైలాగ్ వంటిది ఉప్మా, వెంకీ సైలెంట్ ప్రేమ వంటిది ఉప్మా, నాగార్జున చార్మ్ వంటిది ఉప్మా, మహేష్ అందం వంటిది ఉప్మా, ప్లాప్ లో కూడా పవన్ కళ్యాణ్ క్రేజ్ వంటిది ఉప్మా” అంటూ గలగలా మాట్లాడుతూ ఉప్మా గుణగణాలు వర్ణిస్తుంటే పిల్లలు ఏఱ్ఱి మొహాలు వేసి “అమ్మ ఉప్మా అంటే నాన్నకు ఇష్టం, దాని కోసం ఎన్ని కథలైనా చెబుతారు, ఈరోజుకి మనకు ఉప్మా ఏ గతి అంటూ గదిలోకి వెళ్తుంటే సతీమణి వారిని అన్నపూర్ణాదేవిలా ఆపి “సర్లే పూరీలోకి ఏ కూర కావాలో చెప్పండి” అంది, అయన వైపు కొంచం జాలిగా చూస్తూ.
    “శనగపిండి, ఉల్లిపాయ కూర కూడా పర్లేదు” అన్నారు ఆనందంగా.

    3
  • 3. సైజ్ జీరో

    3. సైజ్ జీరో

    రమణారావు అంకుల్ భార్య పేరు సత్యవతి గారు. ఉత్తిగా సత్యవతి అని ఎవరూ పిలవడం మేమెప్పుడూ వినలేదు. ఎప్పుడూ సత్యవతిగారే. అంకుల్ కూడా ఇంట్లో అలానే పిలుస్తారేమోనని మా డౌటు. ఆవిడ మా కాలనీకి ఎలక్షన్ లేని లీడర్. గూర్ఖా దగ్గరనుంచీ కూరలవాళ్ళ దాకా, పనిమనుషుల దగ్గర్నుంచీ మునిసిపాలిటీ వాళ్ళదాకా, ఎవరయినా కాలనీలో ఏ పనికయినా సత్యవతిగారిని కలవాల్సిందే. ఆవిడ కూడా గొప్ప ఎఫీషియెంటు. ఒక్కరోజు చెత్తబండి రాకపోతే సానిటరీ ఇన్స్పెక్టర్ కి చచ్చేచావు! పార్కులో గడ్డెక్కువయినా భూమిలో నీరుతక్కువయినా ఆవిడే ఇంచార్జు. గత ముప్పయ్యేళ్ళుగా కాలనీకి బాసు.

    కాలనీలో ఆడవాళ్ళది ఒక సూపర్ గ్రూపుంది. దానికీ సత్యవతిగారే లీడరు. మా అమ్మలందరూ అందులో సభ్యులే. ఉద్యోగాలుచేసే సుశీలా టీచర్, బ్యాంకు క్యాషియర్ నళిని గారు కూడా మార్నింగ్ వాకులు, శెలవురోజు ప్రోగ్రాములు మిస్సవ్వకూడదని రూలు. కాలనీలో పని జరగాలంటే వీళ్ళవళ్ళే జరిగేది. అంకుల్లందరూ మాలాంటోళ్ళే. ఎప్పుడు తిండిపెడతారా అని ఎదురుచూస్తూ ఎక్కడెక్కడి వార్తలో చూసుకుంటూ ఉండేవాళ్ళు ఉద్యోగాలనుంచీ వచ్చాక. ఆరున్నరయితే ఇంకా ఆంటీ ఇంటికి రాలేదు, వంటెప్పుడు మొదలెడతారు, మనకెప్పుడు పెడతారు అని గేటు వైపు మాటిమాటికీ చూస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ గురించి వేరే కధ ఉంది లెండి.

    సత్యవతిగారి గ్రూపులో ఓ పది-పన్నెండు సభ్యురాల్లుండేవారు. రోజూ వాకింగుకి వెళ్ళేవాళ్ళు, మధ్యాహ్నాలు తోటపని చేశేవాళ్ళు, డాబాలమీద కూరలు, పూలు పండించేవాళ్ళు, కలిసి షాపింగులకెళ్ళేవాళ్ళు, ఇంటికొచ్చిన చీరల పండాలని మొత్తం మూడు సంచులు టీవీయస్-50 మీదనుంచీ తెచ్చి ఒక్కొక్క చీరా పూర్తిగా తీసి చూపించేదాకా వదిలేవాళ్ళుకాదు, ఒక చీటీ వేసుకునేవాళ్ళు, నెలకొకింట్లో కిట్టీ పెట్టుకునేవాళ్ళు, గొప్ప సందడుండేది. వాళ్ళళ్ళో దాదాపు అందరూ అరముప్పైలు దాటినవాళ్ళే. కొందరు నలభైలు యాభైలు కూడా ఉండేవాళ్ళు కానీ బాల్యవివాహం అని దబాయించేవాళ్ళని ఓరోజు మా అమ్మ ఇంట్లో చెప్తూంటే విన్నాను.

    సత్యవతిగారి ఈంట్లో పైన పోర్షన్లో ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ కుర్రాడు అద్దెకుండేవాడు. టిప్పుటాపుగా తయ్యారయ్యి బైకుమీద రోజూ ఉదయాన్నే బయటకెళ్ళిపోయేవాడు, రాత్రి ఎనిమిది తరువాత వచ్చేవాడు. మాకు మంచి ఫ్రెండు. హాల్స్ బిల్లలు దబ్బాడుండేవి ఆయనదగ్గరెప్పుడూను. మేమెప్పుడు ఎదురొచ్చినా మాకు ఓ గుప్పెడు ఇచ్చి వెళ్ళిపోయేవాడు. ఎవరిదయినా పుట్టినరోజు అని తెలిస్తే డెయిరీనో మంచి పెన్నో స్క్రిబులింగ్ ప్యాడో గిఫ్టు ప్యాకింగులో ఇచ్చేవాడు. ఇంట్లో ఎప్పుడూ ఇవి ఎందుకు ఉండేవా అని మాకు అప్పట్లో పెద్ద డౌటుండేది. ఓరోజు ఆయనకి పెళ్ళయ్యింది. అన్నవరంలో చేసుకుని వాళ్ళావిడని తీసుకుని కాలనీకి వచ్చాడు. సత్యవతి గారు, మిగితా బృందం దిష్టి తీసి గుమ్మడికాయ కొట్టి లోపలికి తీసుకెళ్ళారు. మేమందరం పార్కు గోడమీంచీ చూశాం. ఓ రెండుమూడు వారాలయ్యాక కొత్త పెళ్ళికూతురుని కూడా గ్రూపులో కలిపేసుకున్నారు సత్యవతిగారు. వాకింగులలో తెగ ఇకఇకలు పకపకలు ఉండేవి. వాళ్ళు బాతాఖాని కొట్టుకునే చోట మేముంటే “అటువైపు వెళ్ళి ఆడుకోండి” అనేవారు మమ్మల్ని. రిప్రజెంటేటివ్ కూడా ఐదూ ఆరు అయ్యెసరికీ ఇంటికి వచ్చేసేవాడు. మాతో మామూలుగా కన్నా ఎక్కువ నవ్వుతూ మాట్లాడేవాడు, ఓ కొత్త బైకు కూడా కొనుక్కున్నాడు …

    వాకింగుకి కాలనీ ఆంటీలందరూ చీరలే కట్టుకొచ్చేవాళ్ళు. అప్పుడప్పుడూ ఎవరయినా పంజాబీ డ్రెస్సులు వేసుకునేవాళ్ళు. అయితే కొత్తమ్మాయి డ్రెస్సులే వేసుకునేది. అప్పుడప్పుడూ ట్రాక్ ప్యాంటులు కూడా వేసుకునేది. ఓసారి టీషర్టు వేసుకొచ్చింది కూడాను. “చిన్నపిల్ల కదా పర్లేదులే” అని మా నాన్నన్నారు అమ్మతో. నడుస్తున్నప్పుడు అందరు ఆంటీల మధ్యలో నిజంగానే చిన్నపిల్లలానే ఉండేది ఆవిడ.

    ఈ విషయం ఆంటీలు కొందరికి నచ్చలేదు. సత్యవతిగారి ఇంట్లో ఓ మీటింగు పెట్టి ఏదోటి చెయ్యాలని తీర్మానించుకున్నారు. మరుసటిరోజు ఇంట్లో అలార్ము నాలుగున్నరకి మోగింది. ఏంటా అని లేచి చూస్తే మా అమ్మ గబగబ లేచి, “నువ్వు పడుకో పర్లేదు” అని స్పీడుగా తయ్యారయ్యి తలుపు బయిటనుంచీ గొళ్ళెంవేసుకుని వెళ్ళిపోయింది. మరుసటిరోజూ అంతే. ఇలా కాదని నేనూ ఓరోజు లేచి ఐదునిమిషాల తరువాత వెనక తలుపులోంచీ వెళ్ళి డాబా ఎక్కాను. పక్కడాబా మీద అనీల్ గాడు కూడా కనబడ్డాడు. వాడింట్లో కూడా ఇదే పరిస్థితి. పార్కులో కమ్యూనిటీ హాలు, ఓ స్టేజీ ఉండేవి. ఆ స్టేజీ మీద ఆంటీలందరూ కనబడ్డారు. ఒకాయన తెల్ల కుర్తా వేసుకుని ప్రాణాయామం చేయిస్తున్నారు వాళ్ళచేత. ఐదున్నరకి ఆసనాలు వేయించడం మొదలెట్టారు. ఆంటీలు అందరూ డ్రెస్సులే వేసుకొచ్చారు. ఎప్పుడూ మేము సత్యవతిగారిని, మరికొందరిని అలా చూడలేదు. మాకు స్కూల్లో నేర్పిన ఆసనాలు కొన్ని వేయించాక మాష్టారో క్లిష్టమయిన ఆసనం వెయ్యమన్నారు. మా అమ్మల పాట్లుచూసి నేనూ అనిల్ గాడు ఒకరి మొహాలు ఒకరం చూసుకున్నాం నవ్వు ఆపుకుంటూ!

    ఆరున్నరవరకూ విపరీతమయిన వాకింగు, యోగా, ఎక్సర్సైజులు చేసేసారు. తువ్వాల్లు, నీళ్ళసీసాలు, మధ్యమధ్యలో పార్కు చుట్టూ జాగింగూ… స్కూల్లో కాలనీ పిల్లలందరం ఆలోచించాం — ఏమయింది మన అమ్మలకి అని. కొన్నాళ్ళు ఇలానే గడిచింది. ఉదయం మాత్రమే కాదు, సాయంత్రం కూడా వాకింగు మొదలెట్టారు కొందరు. ఇంట్లో మా అమ్మ చిన్న గిన్నెలో గోధుమన్నం వండుకోవడం మొదలెట్టింది. అంతే తినేది. కూరలవాడు ఉదయాన్నే కాలనీకి వచ్చినప్పుడు స్పెషల్ గా కవర్లలో కొమ్ముశనగలు, పెశలు లాంటివన్నీ ఇచ్చేవాడు, ఇంట్లో వాటిని మొలకెత్తించి తినేవాళ్ళు ఆంటీలు. కక్కడి దోసకాయలు, క్యారెట్లు, మురీలు స్నాక్స్ అయిపోయాయి. బజ్జీలు, పునుగులు మానేశారు. మా నాన్నలు మరీ ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళిపోయారు! బిరియానీలు లేవు, స్వీట్లు లేవు, మా నాన్న ఏమయినా అంటే “పొట్ట చూసుకోండి, ఇదంతా మీ మంచికే, మీకోసమే మేమూ త్యాగం చేశాం” అని చెప్పేది మా అమ్మ!

    కొన్నాళ్ళ తరువాత సత్యవతి గారి ఇంటిపైన ఉన్న కొత్త పిల్ల వాకింగుకి వెళ్ళడం తగ్గించేసింది. కొంచం బొద్దుగా అయ్యిందేమో అనిపించింది మాకు. ప్యాంటులు టీషర్టులు తగ్గించి డ్రెస్సులే వేసుకునేది. “ఆరో నెల” అని పనిమనిషికి సత్యవతిగారు చెప్పారని మా ఇంట్లో చెప్పింది. కొన్నాళ్ళకి రిప్రజెంటేటివ్ వాళ్ళ ఇంట్లో ఓ ఫంక్షన్ చేశారు. మొత్తం అరేంజుమెంట్లన్నీ కాలనీ ఆంటీలే చేశారు సత్యవతిగారి డైరెక్షన్లో. డెకరేషను, చీరలు, పువ్వులు, టెంటుహౌసు, మొత్తం. చుట్టాలొచ్చి భోజనాలు చేసి చీరలు పువ్వులు ఇచ్చారు అమ్మాయికి. అదయ్యాక వాళ్ళ అమ్మానాన్నా అమ్మాయిని తీసుకెళ్ళిపోయారు.

    మళ్ళీ రిప్రజెంటేటివ్ ఉదయాన్నే వెళ్ళి రాత్రికి వచ్చేవాడు.
    మరో నాలుగు రోజులకి యోగా, జాగింగూ, సాయంత్రం వాకింగూ ఆగిపోయాయి. అలార్ము ఇంతకుముందు లాగే ఐదుంపావుకి మోగింది. అమ్మ మళ్ళీ మామూలు అన్నానికి మారిపోయింది.

    “నువ్విలాగే బాగుంటావు” అన్నారు నాన్న.

    “మీకూ పెద్ద పొట్టేం లేదులెండి” అంది అమ్మ.

    __________________________________

    ఈ శీర్షిక లో మరి కొన్ని కాలనీ కథలు 🩷

  • రాశి ఫలాలు – డిస్కౌంట్ సేల్

    అట్లాంటా , ఆమెరికా 

    2019 డిసెంబర్ 24 – రాత్రి 11:00

    శతాబ్ధం లో ఒక్కసారి ఆకాశం లో జరిగే అద్భుతం – షష్ట గ్రహ కూటమి….

    మరి కొన్ని ఘడియల్లో జరగబోతుంది. వృశ్చిక రాశి కి రెండవ స్థానం ధనూ రాశి లో ఆరు గ్రహాల కలయిక… 

    అదే సమయం లో చేతిలో మెగా మిలియన్ లాటరీ టికెట్ తో ఆత్రుతగా టివి వైపు చూస్తున్నా.

    గురుడు స్వస్థానం ధనూ రాశి లో అడుగు పెడుతూ , అక్కడ ఏడేళ్ల నుండి ఉన్న శని వైపు చూసి చిద్విలాసం గా నవ్వాడు. టివి లో యాంకర్ చెప్పిన మొదటి నంబర్ 18… నా టికెట్ లో ఉంది. 

    ఇంతలో బుధుడు కూడా  ధనూ రాశి లో  అడుగు పెట్టాడు. రెండో నంబర్ 27 కూడా మ్యాచ్ అయ్యింది. కాస్తా ఉద్వేగం గా తరువాతి నంబర్ కోసం చూస్తున్నా.

    కుజుడూ ధనూ రాశి లో అడుగు పెట్టాడు. మూడో నంబర్ 36. మళ్ళీ మ్యాచ్. హృదయ వేగం పెరిగిపోతుంది.

    చందుడి చల్లని చూపు అలా ధనూ రాశి మీద పడి పడగానే నాలుగో నంబర్ 54. ఎప్పుడు లేని బీపి వచ్చిందా అన్నట్టు వళ్లంతా చెమటలు. 

    ఇక చివరి ఒక్క నంబర్ కలిస్తే 251 మిలియన్ డాలర్లు.. నా మెదడు వేగం గా లెక్కల్లు కట్టేస్తుంది. ఒక్కసారి క్యాష్ తీసుకుంటే  200 మిలియన్ డాలర్లు. అన్ని పన్నులు పోను 125 మిలియన్లు. 

    ఇంకా చివరి నంబరు చెప్పదు ఏంటి అనుకుంటుండగా, అష్టమ స్టానం  లో నుండి కేతువు వక్ర దృష్టి  తో ఒక నవ్వు నవ్వినట్టనిపించింది.. 

    టివి లో బొమ్మ కదలటం లేదు.. ఏమైందా అని రిమోట్ కోసం అటు ఇటు చూస్తున్నా..

    ఇంతలొ ఈ డ్రెస్ ఎలా ఉంది అని ఒక వాయిస్.. నంబర్ చెప్పకుండా ఈ అసందర్భపు ప్రశ్న ఏంటి .. అయినా అమెరికా టివి యాంకర్ తెలుగు లో మాట్లాడటం ఏంటి నాన్సెన్స్.. అనుకునే లోపు.. మళ్ళీ అదే ప్రశ్న.. “ఈ డ్రెస్ ఎలా ఉంది చెప్పు. అప్పుడే నిద్ర పోయావా ?” 

    అయిపోయింది..అంతా అయిపోయింది.. లాటరీ జాక్‌పాట్ కల చెదిరిపోయింది.. ఆ వాయిస్ శ్రీమతి ది.. 

    నూట పాతిక మిలియన్ డాలర్లు అంటే 900 కోట్లు .. మొత్తం కల పాలైపోయింది..   

    లేచి టైం చూశా.. ఇంకా 10 కూడా అవలా.. అంటే లాటరీ ఫలితాలు ఇంకా రాలేదు.. కల నిజం అవుతుందేమో అనుకుంటుండగా.. 

    మళ్ళీ శ్రీమతి.. ఈ డ్రెస్ బాగుందా..  

    నేను – ఎంతా ?

    శ్రీమతి – 90 డాలర్లు

    నేను అంతా అనే లోపు.. 

    శ్రీమతి – 15 % + 10 % + ఎంప్లాయి డిస్కౌంట్ 35 % ఆఫ్ ఉంది.. 

    మళ్ళీ మెదడు లో క్యాలుకులేటర్..  60 % ఆఫ్ అంటే 36 డాలర్లు ..

    నేను – మంచి డీల్ ఏ.. 

    శ్రీమతి – అందుకే ఇంకా పిల్లలకి కొన్ని డ్రెస్ లు , షూస్ కొంటున్నా, నీకేమన్నా కావాలా..

    నేను – నెల ముందే కదా Thanksgiving అప్పుడు ఆ ఆఫర్ , ఈ ఆఫర్ అని  బోలెడు బట్టలు కొన్నావ్, మళ్ళీ అవసరమా.. 

    శ్రీమతి – ఇంత మంచి ఆఫర్ మళ్ళీ దొరకదు.. అందుకే..   

    ఆఫర్లు, షాపింగ్ విషయం లో శ్రీమతి తో వాదించి గెలవటం కన్నా అమెరికా ప్రెసిడెంట్ గా గెలవటం ఈజీ అని తెలిసి మిన్నకుండి పోయా. 

    మళ్ళీ లాటరీ టికెట్ గుర్తుకు వచ్చి ఆలోచనలో కి వెళ్ళిపోయా..

     గత వారం నుండి, యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు… ప్రతి వీడియో పైనా, షష్ట గ్రహ కూటమి గురించే.. ‘వృశ్చిక రాశి వారికి కలగపోయే అదృష్టం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు.. ‘ , ‘వృశ్చిక రాశి వారికి రాజయోగం.. ‘ , ‘వృశ్చిక రాశి వారికి డిసెంబర్ 25 నుండి పట్టిందల్లా బంగారమే.. ‘ ఇలా రక రకాలు గా వూరించే వీడియోలు.. కానీ ఎప్పుడు ఆ వీడియోలు చూడలేదు.. 

    కానీ ఈ రోజు సాయంత్రం ఆఫీసు నుండి వస్తూ ఉన్నప్పుడు కార్ ప్లే లొ యూట్యూబ్ ఆటో ప్లే నుండి ఒక వీడియో.. క్లుప్తం గా సారాంశం ఏంటంటే ‘ ఈ షష్ట గ్రహ కూటమి వల్ల వృశ్చిక రాశి వారికి అన్ని కష్టాలు పోయి, బోలెడు ధన లాభం అనినూ, మరియూ నెలలో తొలగిపోయే ఏలిన్నాటి శని వల్లా, శని చివర్లో లాభం చేకూరుస్తాడు, అందుకు ఇదే తగిన సమయం  అని తెలియచేయటం కాకుండ..మీరు వూహించనత ధన లాభం అని సెలవిచ్చారు. ఇంకా ఏదో చెప్పేలోపు వీడియో ఆగిపోయింది.. 

    అదృష్టం అన్ నోన్ నంబర్ నుండి కాల్ చేస్తే స్పాం అనుకొని సైలెన్స్ లో పెడుతున్నానేమో ఇన్ని రోజులు అనిపించింది, ఆ వీడియో ని ఎందుకో నమ్మాలి అనిపించింది..  రాశి ఫలాలు అంటే అంత గురి కుదరటానికి మూలం  ఒక సంఘటన మరో పోస్టు లో.. 

    మన వుద్యోగం లో అంత డబ్బులు వచ్చే అవకాశం లేదు. లేదా పూర్వీకులు ఏదన్నా గుప్త నిధి తాలూకూ మ్యాప్ ఏదీ వదలి వెళ్లలేదు.. ఇక హటాత్తు గా ఎలా వస్తుంది అని ఆలోచిస్తూ ఉండగా ఎదురుగా పెద్ద హోర్డింగ్ .. మెగా మిలియన్ 255 మిలియన్ జాక్‌పాట్, పవర్ బాల్ 201 మిలియన్ జాక్‌పాట్ అని..  ఈ రోజు రాత్రి (అంటే ఇండియా కాలమానం ప్రకారం 25 ఉదయం  షష్ట గ్రహకూటమి జరిగే టైం లో ) లాటరి జాక్‌పాట్ గ్యారెంటి అని ఫిక్స్ అయిపోయా.. దాని ఫలితమే కల.. 

    ఆ ఆలోచన నుండి బయట పడే లోపు శ్రీమతి ఆన్లైన్ షాపింగ్ అయిపోయినట్టుంది.. 

    నేను – మొత్తం ఎంత ?

    శ్రీమతి – 350 డాలర్లు. 

    నా మెదడు యధావిధి గా లెక్కలు – 350 లొ 60 % పోతే 140 డాలర్లు.. పర్లేదూ చిన్న బ్యాండ్ ఏలే అనుకునే లోపు , ఫోన్ లో క్రెడిట్ కార్డు అలెర్ట్ మెసేజి.  ..’Your Credit Card has been used at … for 350 $…  ‘ అని 

    నేను – అదేంటి డిస్కౌంట్ చూపించట్లేదు, 350 లో 40 % 140 ఏ కదా.. 

    శ్రీమతి – డిస్కౌంట్ తరువాతే 350 ..

    నేను – అంటే 875 డాలర్ల కి బట్టలా ? ఎన్ని కొన్నావ్ ఏంటి ? 

    ఆర్డర్ డీటైల్స్ చూసా.. ఒక డ్రెసు, 4 పిల్లల జీన్స్, 4 పిల్లల నైట్ డ్రెస్ , 1 జత షూస్.. ఈ మాత్రం కే 850 ఆ ?

    శ్రీమతి – 350 ఏ, డిస్కౌంట్ వచ్చింది గా.. 

    నేను – ఆఫర్లు లేని టైలో కొన్నా కూడా ఇవన్నీ 300 కూడా దాటవు గా. 300 వందలు కుడా విలువ చెయ్యని వాటిని 350 కి అమ్మి సేల్స్ పెంచుకుంటూ లాభం తెచ్చుకున్న స్టోర్ వాడి కి ఆఫర్, మనకు కాదు.. 

     అందుకే ఆఫర్ల పేరు చెప్పి ఇలా అవసరం లేనివి కొనద్దు అని చెప్పాలనుకున్నా. ఇంతలో లాటరి గుర్తు వచ్చి , అంత పెద్ద జాక్‌పాట్ కొడితే 350 ఓ లెక్కా.. ఇదంతా జుజుబీ అనుకొని సైలెంట్ అయిపోయా.. 

    ఇంతలో 11 అవనే అయ్యింది.  ఫోన్ లో మెగా మిలియన్ టికెట్ ని స్కాన్ చేసా..

    చాలా టెన్షన్ గా అనిపించింది.. అంత డబ్బులు ఏం చెయ్యాలో.. ఓ  90 మంది ఎమెల్యే లని కొని ఆంధ్రా సిఎం అయిపోదామా.. వద్దులే.. తెలంగాణా అయితే బెటర్.. 

    అంతలో  “You Didn’t win any.. ” అని మెసేజ్.. నమ్మ లేక పోయా..మళ్ళీ చూసా.. సేం.. ఏమీ రాలేదు.. ఇదెలా జరిగింది.. 

     నంబర్స్ చూసా.. ఒక్కటంటే ఒక్క నంబర్ కూడా మ్యాచ్ కాలేదు.. 

    రాశి ఫలాలు తప్పటానికి ఆస్కారం లేదే.. మళ్ళీ ఒక్కసారి వీడియో చూద్దాం అని ప్లే చేసా.. ఉదయం వీడియో ఆగినంత వరకు బాగానే వుంది..  ఆ తరువాతే అసలు విషయం ..  ” .. అన్ని గ్రహాలూ అనుకూలం గా ఉన్నా, వృశ్చిక రాశి వారికి అష్టమ స్తానం లో ఉన్న కేతువు వక్ర దృష్టి వల్ల అనుకున్నవన్నీ జరగవు.. ” 

    సరిపోయింది.. 

    ఇందులో నీతి ఏంటయ్యా అంటే  

    యూట్యూబ్ రాశి ఫలాలు చూసి లాటరి కొన్న మగాడు, ఆఫర్లు చూసి షాపింగు చేసిన ఆడది , లాభపడినట్టు చరిత్ర లో లేదు.. 

    సర్సరే అనుకున్నవన్నీ అవుతాయా ఏంటి.. ?  

    ఉంటా మరి.. మునుముందు ఎలా ఉంటుందో యూట్యూబ్ లో  రాశి ఫలాలు వీడియో చూడాలి.. ..

    బ్యాక్‌గ్రౌండ్ లో.. 

    శ్రీమతి – ఆష్లే లో ఫర్నిచర్ పైన 50 % ఆఫ్ అంట, చూద్దామా ?  

    1