RJY Govt.ఆర్ట్స్ కాలేజీ లో చేరిక.నా అదృష్టం అనుకుంటా,బందరులో నేను చదివిన నోబుల్ స్కూల్ ది వంద ఏళ్ల చరిత్ర+ రాజమండ్రి లో వంద ఏళ్ళ పైబడి చరిత్ర గల కాలేజి. Imposing bldg.బయట గేటు నుండి ఓ 500మీటర్లు తారు రోడ్డు.నడుస్తుంటే,ఒక వైపు పేద్ద గ్రౌండ్,మరో వైపుఇంకో గ్రౌండ్ . దాని కి ఆనుకొని దూరంగా Metcalf hostel.
ముందుకు వెళ్ళగానే ఒక చిన్న సెమీ సర్కిల్,మధ్యలో ఒక పైలాన్.రైట్ సైడు సైన్సు బ్లాక్.లెఫ్ట్ సైడు ఆర్ట్స్, కామర్స్ బ్లాక్లు. పెద్ద పెద్ద క్లాస్ రూంలు.బెంచీలు సెమీసర్కిల్ గా ఉండి పైకి వెళ్ళే కొద్దీ ఎత్తు పెరుగుతాయి.చివరి బెంచీ లో కూర్చున్నా సరే correct Line of sight for lecturer.
నాది 1968-71, BSc MPC.A1 SEC.RollNo73.(కృష్ణ మోహన్ IPS .పోకిరి డైలాగ్ లాగ). అటు బిక్కవోలు నుండి ఇటు నిడదవోలు వరకు రోజూ ట్రైన్ లో వచ్చేవారు నాలా చాలా మంది మా కాలేజి కి . అంత పేరున్న కాలేజి. రోజూ కడియం లో ట్రైన్ ఎక్కటం, రాజమండ్రి స్టేషన్ లో దిగటం,సిటీ బస్సు ఎక్కి,జాం పేట దాటి Y Junction లో దిగి నడక. ఎప్పుడో గానీ రిక్షా ఎక్కే సౌలభ్యం. ఎప్పుడూ పుస్తకాలు,టిఫిన్లు,రిటర్న్ ట్రైన్ లు.ఇవే ధ్యాస.పొరుగూరు కదా.!!
జీవితం లో మొదటిసారి కాఫీ . Nescafé కాఫీ క్యాంటీన్ లో. ఖరీదు 20 పైసలు. దీన్ని బట్టి మీరు ఊహించుకోవచ్చు నేనెంత సీదా సాదా నో !!
సరే కాలం గడుస్తూ ఉండగా.. ఓ సుదినం నేను రాజమండ్రి స్టేషన్ దగ్గర ద్వారపూడి వెళ్లే బస్ ఎక్కా.మధ్యలో కడియం రైల్వే స్టేషన్ స్టాప్ లో దిగాలి. పుస్తకాలు, టిఫిన్ బాక్స్, హాఫ్ చొక్కా, ప్యాంట్. బస్సు లో నించుని ఉన్నా. అప్పటికి పదిహేనవ పుట్టిన రోజు అయి 3 నెలలు..(అంటే కేకులూ అవి ఉండేవి కావు.ఉత్తినే పుట్టిన రోజన్న మాట.)
బొద్దుగా పొట్టిగా ఉండేవాడిని. వెనక పొడవాటి సీట్లో నలుగురు అమ్మాయిలు కూర్చొని ఉన్నారు.
అందులో చాలా అందంగా ఉన్న ఓ అమ్మాయి నుండి బాబు ఇలారా అని పిలుపు . వెళ్ళాను.
అ: ఏం చదువుతున్నావు
నే: BSc ఫస్ట్ఇయర్
అ:నిజం చెప్పు అని గద్దించింది
నే:నిజమే.నేను ఆర్ట్స్ కాలేజి. నా రికార్డ్ బుక్ చూడండి అని చెప్పా.
అ: నే ఏజ్ ఎంత?
నే: మొన్ననే 15th birthday వెళ్ళింది.
అ: రా..నా పక్కన కూర్చో.
నే: వద్దండీ.నిల్చుంటాను.
అ: చెయ్యి పట్టి లాగి పక్కన కూర్చోబెట్టుకొంది.నారికార్డ్ చూసింది.దస్తూరి మెచ్చుకుంది.నేను BSC CBZ final.నన్ను చూసావా కాలేజీలో?
నే:లేదండి.
అ: నేనెవరో తెలియదా? నన్ను కాలేజి బ్యూటీ అంటారు.నా పేరు…….
నే: అలాగా.
చాలా చక్కగా,నవ్వుతూ ఓ అరగంట మాట్లాడి, కాలేజీ లో ఏదైనా అవసరం వస్తే తప్పకుండా కలవమని చెప్పి ఎదో స్టాప్ లో దిగిపోయింది తన సఖులతో….
కొస మెరుపు: నాది1953 ఆగస్ట్ పుట్టుక.ఏవో కొంపలు మునిగి పోయినట్టు మూడేళ్లకే ఒకటో క్లాసు.అప్పటి నుండి యూనివర్సిటీ నుండి బయటకు వచ్చేవరకు..నేను గారు అన్ని క్లాసుల్లో youngest.
1967మే.కవుతరం నుండి కడియం చేరాము. సామాన్లు అవీ గూడ్స్ ట్రైన్ లో వచ్చాయి. నేను 12వ క్లాస్ లో చేరటానికి రాజమండ్రీ లో స్కూళ్లకు వెళ్లాను. చోద్యంగా అప్పుడు రాజ మండ్రీ లో ఇంగ్లీష్ మీడియం లేదు.ఎలా?
మా సొంతూరు(గూడూరు)లో ఉన్న మా పెద్దమ్మ వాళ్లకు టెలిగ్రామ్ కొట్టాం. వాళ్లు మాథ్స్&సైన్స్ ఇంగ్లీష్ medium. social Telugu medium అని reply కొట్టారు.అక్కడ ముగ్గురు మేనమామలు ఉండేవారు.రెండో మావయ్య కూడా స్టేషన్ మాస్టర్ కాబట్టి మా నాన్నగారు వాళ్ళ ఇంట్లో ఉండి ఓ సంవత్సరం చదువుకో అని డిసైడ్ చేసారు. సరే గూడూరు కు బయలు దేరాం.
ZPHS లో అడ్మిషన్ అయింది. అప్పట్లో ఉన్నది ఆ ఒకే high school .అప్పుడే నాకు 2 ఖాకీ ప్యాంట్ లు, 2 తెల్ల చొక్కా లు కుట్టించారు. అది uniform.
మా ఫిజిక్స్ మాస్టారు..నాగేశ్వరరావు గారు పరమ స్ట్రిక్ట్.ఎప్పుడూ మీటర్ స్కేల్ ఆయన చేతిలోనే! ఓ రోజు లాబ్ లో ప్రశ్న.ఎవరూ చెప్పలా..నేను గారు చెప్పారు. అపుడు ఆయన ఓ ఇద్దర్నీ నించోబెట్టి “ ఒరే మీరు చదవటానికి వచ్చారా లేకపోతే సుందర్ మహల్ దగ్గర అడుక్కు నూకటానికి వచ్చారా”..అని క్లాస్ పీకుడు + మీటర్ స్కేల్ వాతలు అరచేతిలో.. ఆయన అంటే హడల్.
ఇక తెలుగు మాస్టారు..ఆయన MS Reddy గారి ఫ్రెండ్.భార్య చిత్రానికి మాటలు రాశారు. రాగానే, బాబు సినిమా ట్రంక్ రోడ్ టాక్ ఎలావుందీ అని ఆరా! (నెల్లూరు trunk road)..
ఇకపోతే ఇంగ్లీష్ మాస్టారు మిల్టన్.నేను వచ్చే దారిలో ఆయన ఇల్లు..గౌస్ ఆగు..నేను వస్తున్నా అని నాతో బాటు స్కూల్ కు రోజూ..ఆయన పోయెట్రీ ” sword of Excalibur” భలే చెప్పేవారు.
నా బెంచ్ లో సుబ్రమణ్యం టెక్స్టబుక్ లో కొమ్మూరి సాంబశివరావు డిటెక్టివ్ నవలలు పెట్టి చదివేవాడు.వాడు సూపర్ బ్రిలియంట్ . వాడు అలా పుస్తకాల్లో నవలలు చదవటం నాకు గుండె దడ పుట్టేది.
రెగ్యులర్ గా మా పెద్ద మామయ్య ఇంటికి వెళ్ళేవాడిని.వాళ్ళ పెద్ద అమ్మాయి 9 క్లాస్ చదివేది.ఆ అమ్మాయే నా జీవితం లో కి వస్తుందని అప్పటికి తెలియదుగా…?
ఇలా ఉండగా పబ్లిక్ పరీక్షలు ముంచుకొచ్చాయి.. హెడ్మాస్టర్ పిలిచి..ఒరేయ్ నీకు ఏజ్ తక్కువ..పరీక్షకు అనుమతి లేదు అన్నారు.మా నాన్న గారికి లెటరు రాశా.ఆయన నన్ను పెద్ద మామయ్య కు చెప్పు అన్నారు. మా పెద్ద మామయ్య డిప్యూటీ తహశీల్దార్. గవర్నమెంట్ డాక్టర్ దగ్గర శారీరకం గా, మానసికం గా ఫిట్ అని సర్టిఫికెట్ రాయించుకొని ఇస్తే కానీ కుదర్లా.
సైన్సు పబ్లిక్ పరీక్షలో భలే సంఘటన. మెయిన్ పేపర్ లో నేను మెయిన్ ఆన్సర్ బుక్లెట్ వ్రాసిన తర్వాత అడిషనల్స్ తీసుకొని రాస్తూ,మెల్లగా మెయిన్ షీట్ వెనక వాడికి ఇవ్వాలని ముందే పథకం. పరీక్ష కు ముందరే వాడు నా కాళ్లా వేళ్ళా పడ్డాడు.సరే అని పాస్ చేశా.నేనేమో తెగ అడిషనల్సు రాసేస్తున్నా.మెయిన్ బుక్లెట్ ఎంతకూ రాదే! వెనక ఫ్రెండ్ నా దగ్గర లేదు.ఇంకో ఫ్రెండ్ కి ఇచ్చా .. వస్తుందిలే అన్నాడు . నాకు గొంతు తడి ఆరిపొతోంది. మెయిన్ బుక్లెట్’లేదంటే మటాష్.పరీక్ష ఫెయిల్. వాళ్లంతా వణుకు.ఇంకొక 20 నిమిషాలు ఉందనగా అది నాకు చేరింది.అన్నీ సవ్యంగా గానే ఉన్నాయి.బయటకు వచ్చి వాణ్ణి ఈడ్చి కొట్టా. వాడు sorry చెప్పాడు.
ఇక పోతే నెక్స్టడే బిట్ పేపర్.ఒప్పందం ఆరుగురి మధ్య. నేను గబగబ రాసేసి దగ్గుతా. అందరూ నా వైపు చూడాలి..చెంప మీద నేను చేయి ఆనించి వేళ్ళు చూపించే వాడిని. చెంప మీద ఒక వేలు ఉంటే answer A. రెండు వేళ్ళు ఉంటే B. అలాగా.. ఇది నేను ముందు సీట్ లో ఉంటేనే ఇది సాధ్యం. ఇలా రకరకాల సరదాలు,కుయుక్తుల తో 12 క్లాస్ పరీక్షలు వ్రాసి కడియం పయనమయ్యా.
రిజల్ట్స్ మామూలే. చాల మంచి మార్కులు..
కొసమెరుపు : ఆ హైస్కూల్ లో నే మా నాన్నగారు , మామయ్యలు చదువుకున్నారు. పేరెంట్స్ చదివిన స్కూల్ లో చదవటం rare కదూ!!!
కవుతరం – కృష్ణ జిల్లా..నాన్నగారు స్టేషన్ మాష్టర్ గా చేరారు. మేమూ వెనకాలే వచ్చాము.
రైల్వే క్వార్టర్స్. మాకు ఒక పక్క కేరళ వాస్తవ్యులు(రైల్వే ఉద్యోగం వాళ్ళ ఆంధ్ర లో ఉండిపోయారు)
మరో పక్క గుంటూరు జిల్లా వాళ్లు.
10క్లాసులో నేను, పెద్ద చెల్లాయి 5 , తమ్ముడు 4, చివరి చెవలాయి 2 క్లాసు లో చేరాము.
నాది zp high school. రోజు 2 km నడవాలి స్కూల్ కోసం.తాడి తోపులు,పెసర,మినుము చేలు దాటి వెళ్ళాలి. సరిగ్గా 9 గంటలకు వచ్చే ట్రైన్ లో ఓ 20 మంది పిల్లలు + 4/5 టీచర్లు వచ్చే వారు. అందులో నా క్లాస్ టీచర్+ క్లాస్ అమ్మాయిలు కూడా. వాళ్ళందరూ మా ఇంటి ముందు నుంచి వెళ్ళాలి.వాళ్లు అక్కడకు రాగానే, నేను కూడా వాళ్ళతో చేరేవాడిని.
క్లాస్ టీచర్ మేడం కు నేను గారు ప్రియ శిష్యుడిని కాబట్టి నా భుజం మీద మేడం చెయ్యి వేసేవారు. అందరూ ఈర్ష్య గా చూసేవారు.స్కూల్ తర్వాత ట్రైన్ లేట్ అయితే వాళ్ళలో ఓ పదిమంది మా ఇంట్లోనే మజిలీ.
13 ఏళ్ళ ఆ వయసులో నాకు అమ్మాయిలంటే సిగ్గు,బిడియం,గాభరా అన్ని కలబోసిన ఫీలింగ్. ఎంతంటే, వాళ్లు మా అమ్మతో మాట్లాడుతుంటే నేను పుస్తకం మొఖానికి అడ్డు పెట్టుకొని లోపలికి వెళ్ళేపోయే వాడిని. మా అమ్మ ” అదేమిట్రా అలా వెళ్లి పోతావు?నీ క్లాస్ వాళ్ళేగా “అంటూ నవ్వేది.. అదేమిటో క్లాసు లో నా కంటే పొడవైన అమ్మాయిలుండేవారు. పైగా నేను క్లాసు లో కనిష్ట వయస్కుడిని.
అలా స్కూల్ రోజులు సాగిపోతూ ఉండగా.. ఆ రోజుల్లో మేము ఆంధ్ర ప్రభ వీక్లీ తెప్పించే వాళ్ళం.మా పక్కింటి వాళ్లకు ఇద్దరు అబ్బాయిలు.పెద్ద అబ్బాయి నా క్లాస్.చిన్నవాడు నా తమ్ముడి క్లాస్.
వీక్లీ ఇస్తున్నప్పుడు ఆ ఆంటీ అక్కడ పెట్టి వెళ్ళమనేవారు..వెనక్కి ఇస్తున్నప్పుడు చేయి పట్టమని పుస్తకాన్ని పడేసేవారు.నాకు అర్ధం కాలేదు. నేను ఆంటీనీ అడిగాను. ఆవిడ అంటు బాబు.నేను మీరు ఇచ్చే వస్తువుల్ని ముట్టుకోకూడదు అని చెప్పారు.నేను మా ఇంటికి వచ్చి ఇంక వాళ్లకు పుస్తకాలు ఇవ్వొద్దు అని అమ్మతో పోట్లాట.
అమ్మ పోనిలేరా.అది వాళ్ళ నమ్మకం. వదిలేయ్ అంది.
వాళ్ళ ఇంటికి వెళ్తే వరండా లోనే కూర్చోబెట్టి మాట్లాడి పంపేసే వాళ్ళు. అమ్మ తో నేను అసలు వాళ్ళతో ఫ్రెండ్షిప్ వద్దు అనే వాడిని. అమ్మ నవ్వి ఊరుకొనేది.
10 క్లాస్ అన్ని సెక్షన్ల లో ప్రతి సబ్జెక్టు ఫస్ట్. టోటల్ ఫస్ట్. మా తమ్ముడు+ చెల్లాయి ఎన్ని సార్లు నేను స్టేజీ ఎక్కానో లెక్క పెట్టేవారు. heady feeling కదా. పక్కింటి అబ్బాయి స్పోర్ట్స్ లో ఫస్ట్.
11 క్లాసు లో ఎంట్రీ. కొత్తగా ఇంగ్లీష్ మీడియం.(సోషల్ స్టడీస్ తప్ప). లెక్కల మాస్టారు నాగేశ్వరరావు గారు.హిట్లర్ మీసాలు.నన్ను ఆయన దగ్గర ప్రైవేట్ కు పెట్టారు. రాత్రి వెళ్ళి అక్కడే పడుకొని పొద్దున్నే ఇంటికి వచ్చి స్కూల్ కి వెళ్ళాలి. ఆయన పొద్దున్నే 11+12 క్లాసులకు కలిపి లెక్కలు మల్టిపుల్ ఛాయస్ ప్రశ్నలు ఇచ్చేవారు. నేను గబగబా చేసేసేవాడిని.నావైపు మెచ్చుకోలుగా చూసేవారు.
నాకు కప్పలంటే అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ భయమే!నన్ను ప్రైవేట్ మాస్టారు ఇంటి దగ్గర దిగ బెట్టడానికి లాంతరు తో నా పెద్ద చెల్లి+తమ్ముడు తోడు వచ్చేవారు. 11 వ క్లాసు కూడా నేను గారు టోటల్ ఫస్ట్.
మా తమ్ముడు ఇంటి ఎదురుగుండా పెసర+మినుపచేల్లోకి వెళ్ళి దొంగతనంగా కాయలు తెంపుకోవటానికి టైం సరిపోక మొక్కలు పీక్కొచ్చే వాడు. వాటిని మంటల్లో కాల్చి తినేవాళ్ళం.
నాకు మెల్ల మెల్లగా బెరుకు తగ్గి క్లాస్ లో ఉన్న అమ్మాయిలకు నా నోట్స్ ఇచ్చే స్థాయికి ఎదిగాను..
మా ఇంట్లో రేడియో ఉండేది కాదు.పక్కన కేరలోళ్ళ ఇంట్లో ఉండేది. కామెంటరీ, పాటలు నాటికలు అక్కడ వినేవాళ్ళం.
1967 మే లో నాన్నగారికి కడియం(తూ.గో) ట్రాన్స్ఫర్.మేమందరం మూట ముల్లి తో కడియం షిఫ్ట్ అయ్యాము.
తొమ్మిదవ తరగతి లో చేరాను పెడన జడ్పీ హైస్కూల్ లో. ఇంటికి దగ్గరే స్కూల్. అన్ని పూరి పాకలు. స్కూల్లో HM గారిది మాత్రమే పెంకుటింటి బిల్డింగ్.
పెడన లో దేవాంగులు ఎక్కువ గా ఉండేవారు. మేము శేషగిరి గారి కుటుంబం తో చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళం. నేను వాళ్ళ ఇంటికి రెగ్యులర్ గా వెళ్లి, చీర అంచులు, చీర డిజైన్లు ఎలా చేస్తారు, యార్న్ పై గంజి ఎలా పెడతారు, కండెలు ఎలా రాట్నం లో తిప్పుతారు, మగ్గం లోకి ఎలా ఎక్కిస్తుంటారు వగైరా అంత క్షుణ్ణం గా తెలుసుకొన్నా.
ఒక సారి మగ్గం గుంటలో కూర్చొని నేయటం ట్రై చేసాను.. సరిగ్గా కాళ్ళు కదపలేక పోయినందువల్ల షటిల్ నా మోకాలి చిప్పని రాసుకొంటూ వెళ్ళింది.. రక్తం చాలానే కారింది. మళ్ళీ మగ్గం గుంటలో కూర్చుంటే ఒట్టు..
స్కూల్ లో అన్ని సబ్జక్ట్స్ లో నేను గారు ఫస్టు. నా తెలుగు వ్యాకరణం నోట్ బుక్ ను క్లాస్ అందరూ చూసి రాసుకోమని తెలుగు మాస్టారి హుకుం. ఆ రోజుల్లో ఆ లెవెల్ మనది.
ఇలాంటి ఆట పాటల మధ్య, 8 క్లాస్ లో ఫస్ట్ వచ్చిన సందర్భం లో నా కాష్ బహుమతి, oxord ఇంగ్లీష్ డిక్షనరీ వచ్చి తీసుకోమని బందర్ నోబుల్ స్కూల్ నుండి ఉత్తరం.స్కూల్ లైబ్రరీ కి డొనేట్ చెయ్యమని నాన్నగారు చెప్పారు.అలాగే నేను ఉత్తరం రాసాను.
అవగాహన లేని సగటు నిమ్న మధ్య తరగతి జీవితాలు. ఎంత దూరం ? 10 కిమీ. వెళ్లి తీసుకొంటే ఎంతటి అనుభూతో కదా. ఆ రోజులు అలా ఉండేవి.
ఇలా ఉండగా.. మరల 10 కిమీ దూరం లో ఉన్న కవుతరం కు ట్రాన్స్ఫర్. ఇంకో స్కూల్ లో 10 వ తరగతి చేరాలి.
మచిలీపట్నం/బందరు చేరాము .రైల్వే క్వార్టర్స్ఇవ్వక ముందు అద్దె ఇంట్లో మకాం..
ఇంటి ఓనరు జ్ఞాన సుందరం గారు.నోబుల్ హైస్కూల్ డ్రిల్ మాస్టారు.నేను కూడా నోబుల్ హైస్కూల్ లో చేరాను. 1963 లో.
నేను అంత పెద్ద హైస్కూల్ చూడలేదునేటివరకు.3 ఫుట్ బాల్ గ్రౌండ్ లు, అతి పెద్ద బిల్డింగ్ లు, పెద్ద పెద్ద క్లాస్ రూములు, ఓ chapel+ హై స్కూల్ కు ప్రిన్సిపాల్. ఆయన పేరు Mr Fox. ఆజానబాహుడు . ఆస్ట్రేలియన్ .రోజు ఛాపెల్ లో నీల్డౌన్ ప్రేయర్ . It was an ఎక్స్పీరియన్స్ .7th class లో చేరాను.
ఒక రోజు English ఎస్సే(చిన్న సైజ్) హోమ్ వర్క్ రాసుకొని క్లాసుకు వెళ్లాను. English మాస్టారు అందరివీ చూసి,నాది పక్కన పెట్టి నువ్వు రాసావా ఎవరైనా చెప్పారా అని అడిగారు.నేనే రాసాను అన్నాను.
తన బాగ్ నుండి ఆ రోజు English పేపర్ తీసి నన్ను బోర్డు దగ్గరకు పిలిచి headlines చదివి తెలుగు లో అర్థం చెప్పమన్నారు. నేను చెప్పా. ఇంకో పేజీ లో ఒక పేరా చదవి ప్రతి వాక్యం తెలుగు లో అర్ధం చెప్పమని ఆజ్ఞ. పాలించాను.
క్లాస్ ను సైలెంట్ గాఉండమని చెప్పి నన్ను ప్రిన్సిపాల్ దగ్గరకు తీసుకొని వెళ్ళారు.నేను బయట నించున్నా.మాస్టారు లోపలికి వెళ్ళి కొన్ని క్షణాల తర్వాత నన్ను పిలిచారు.
నేను వెళ్లి ప్రిన్సిపాల్ దగ్గర నిల్చున్నా.Mr Fox ఇంకో ఇంగ్లీష్ పేపర్ లోని కొన్ని పెద్ద వాక్యాలు చూపి , చదివి అర్థం చెప్పమన్నారు నేను చెప్పా.మా మాస్టారు ప్రిన్సిపాల్ తో ఎదో మాట్లాడారు. ప్రిన్సిపాల్ కుర్చీ నుండి లేచి, నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి, well done అని చెప్పి,భుజం మీద చెయ్యి వేసి, నన్ను తోడ్కొని నాతో రూం బయటకు వచ్చి అప్పుడు మరల షేక్ హ్యాండ్ ఇచ్చి పంపారు. పదేళ్ల అబ్బాయికి out of the world experience కదూ !!
మూడవ అంతస్తు ఎక్కి దూరాన్న ఉన్న ఓడలు చూసే వాడిని.స్కూల్ గంట church గంట లా ఉండేది. తాళ్లతో లాగితే గంట మోగుతుంది..ఎంత పెద్దదో అది.
స్కూల్ ఆవరణ లో huge మర్రిచెట్లు అనుకుంటా ఉండేవి.
ఆ సంవత్సరం నేను క్లాస్ ఫస్ట్.annual day నాడు నాకు ఇచ్చిన బహుమతి టాగోర్ PostMan &Rs30 క్యాష్ ప్రైజ్. Huge sum those days.
ఇంతలో 8వ క్లాస్ లోకి ప్రవేశం.
ఈ లోగా మాకు రైల్వే క్వార్టర్స్ ఇచ్చారు. దూరంగా ఉండేది ఇల్లు..చాలా పెద్దది.ఎంత పెద్దది అంటే వరండా లో నేను తమ్ముడు చెల్లి బెచ్చాలు ఆడే వాళ్ళం. అప్పుడే మా ఇంట్లో ఆంధ్ర ప్రభ వీక్లీ ద్వారా యద్దనపూడి,కోడూరి రంగప్రవేశం.అమ్మ వంట చేసుకొంటూ నన్ను చదవ మనేది.
నెలకో ఆదివారం నాన్నతో బృందావన్ లో ఇంగ్లీష్ సినిమా..బెంహుర్ ,కింగ్ ఆఫ్ కింగ్స్, శాంసన్ వగైరా..స్నేహితులతో అగ్గిబరాటా,బందిపోటు etc., చీకు చింతా లేని వయసు. వేసవి పరీక్షలు అవ్వగానే నాన్నగారికి ట్రాన్స్ఫర్..
ఎక్కడనుకొన్నారు? పెడన 10 కి.మీ. లోపు.
పేరెంట్స్ కు మంచి స్కూల్ లో వదల కుండ చదివిద్దాం అనే ఊహ లేని రోజులు. ప్రిన్సిపాల్ అంత లా morale పెంచిన స్కూల్ ఎవరైనా వదులుకొంటారా? పిల్లలు ఎదో స్కూల్ లో చదువుకుంటారులే అనే భావన అమ్మ నాన్నలది. మధ్య తరగతి బతుకులు అంతవరకే ఆలోచనలను పరిమితం చేస్తాయి కాబోలు. ఆ రోజులు అలా ఉండేవి.
ఇక్ష్వాకుల కాలం అనిలెక్కలు వేసు కొంటున్నారా? అవును …అదే కాలం.!!
మీలో చాలామంది పుట్టిఉండరు. ఆ రోజుల్లో నర్సరీలు యూకేజీ లు లేవు.
మూడవ సంవత్సరమే ఒకటో క్లాస్ లో ప్రవేశం.నాకైతే 1,2,3,4క్లాసుల కబుర్లు గుర్తు లేవు. అంటే ముదుసలి అయిపోయాగా..grey cells తగ్గిపోయాయి.
5,6తరగతులు కావలి లో చదివా. నాన్నగారు కావలి రైల్వే స్టేషన్ లో బుకింగ్ క్లర్క్.రోజూస్కూల్ కు వెళ్లి రావడం గుర్తుంది.చెప్పులు లేని రోజులు.ఓ రోజు ఇంటికి వస్తుంటే ఎవరి రేడియో లోనో ఒక పాట కొంచెం విన్నా.రోజూ అదే టైం కు వస్తుందని నమ్మిన సత్తెకాలపు జీవిని.
6 నెలల పరీక్షల సెలవల్లో పొద్దున్నే ఇంట్లో తరవాణి అన్నం తిని జిల్లా గ్రంధాలయ సంస్థ వాళ్ళ లైబ్రరీ కు వెళ్లి ఇంటికి భోజనానికి వచ్చి మరల నాలుగు గంటలకు వెళ్లి చీకటి పడే వేళకు వచ్చేవాడిని. అందరూ నన్ను వింతగా చూసేవారు.ఈ బుడతడు రోజు వస్తున్నాడని.కనబడ్డ పుస్తకాలు తిరగేసేవాడిని.
అలా ఉన్న రోజుల్లో హైస్కూల్ కు ఎంట్రన్స్ పరీక్ష పెట్టారు.పలక పై రాయాలి(ఎలా అని అనుకొంటున్నారా? those were the days).ఎంట్రన్స్ పరీక్ష లో” నేను గారు” ( ఈ పదం పై పూణే పెద్దాయన గుత్తాధిపత్యం లేదని గ్రహించ గలరు! ) టాప్ . కావలికి ఒకటే హైస్కూల్. నాకు 6 క్లాసు లో ఎంట్రీ.
ఒక రోజు గ్రౌండ్ లో football అడుకొంటున్నా అందరితో కలిసి. హైస్కూల్ గంట కొట్టే అతను వచ్చి హెడ్మాస్టర్ రమ్మంటున్నారు అని పిలుచుకొని పోయాడు. HM రూం లోకి ఎంట్రీ. అక్కడ మా నాన్నగారు కూర్చొని ఉన్నారు. HM మా నాన్న గారిని “ఒరేయ్.నే కొడుకు ఫస్ట్ వచ్చాడు.ప్రభుత్వం వీడిని ఉచితం గా చదివిస్తుంది. హైబా పంపుతావా“అని అడిగారు.నాన్నగారు లేదు sir అని చాలా వినమ్రంగా చెప్పారు.
నేను ఆ రాత్రి నాన్నగారితో మా HM గారు మిమ్ములను ఒరేయ్ అని ఎందుకన్నారు? అని అడిగా.మా నాన్నగారు “ఆయన నాకు బాగా తెలిసిన మాస్టారు అని చెప్తూ ఎంత పెద్ధ వాడివి అయినా మాస్టార్లతో ఎప్పుడూ వినమ్రంగా మాట్లాడాలని చెప్పారు. ఏ విషయం నాలో బలంగా నాటుకు పోయింది.(ఒక సందర్భం లో 25 ఏళ్ళ తర్వాత బ్యాంకు మేనేజర్ గా ఉన్నప్పుడు నేను చాలా వినమ్రనంగా ప్రవర్తించిన తీరు నా సహా ఉద్యోగుల్ని ఆశ్చర్య పరిచింది, ఆ ముచ్చట మరో సారి !)
కొన్నాళ్ళకు మా నాన్నగారు ASM(Asst Stn Master) గా పదోన్నతి పొంది మచిలీపట్నం బదిలీ అయ్యారు.
ఈ మధ్యన నాకు నా అంతరాత్మకి చిన్ని చిన్ని ఘర్షణలు తరుచుగా జరుగుతూండడంతో నాకు విసుగొచ్చి దానికి కటీఫ్ చెప్పేసా. అప్పటినించీ మా ఇద్దరికీ మధ్య మాటల్లేవు. ఇప్పుడు ప్రాణం హాయిగా, ప్రశాంతంగా ఉంది.
ఇంతకీ గొడవలెందుకంటారా? వస్తున్నా అక్కడికే.
అది తెలుసుకోవాలంటే అధమపక్షం ఓ మూడు, నాలుగు దశాబ్దాలు వెనక్కి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోవాలి. పదండి మరిహ అలీసం దేనికి? అక్కడే ఉంచేస్తానని భయపడకండి. ఇలా వెళ్లి అలా వచ్చేద్దాం. ఆబ్బె అది కాదు. అలా వెళ్లి ఇలా వచ్చేద్దాం.
అవి నేను బ్రహ్మచారిగా ఎంచక్కా చిన్ని ఉద్యోగం చేసుకుంటూ హాయిగా కాలం గడిపేస్తున్న రోజులు. ఏంటో గురూ ఆ రోజులే వేరు.
సరే రోజూ బైటికి వెళ్తున్నప్పుడు ఈ అంతరాత్మ నేను కూడా వస్తానని ఓ తెగ గొడవ చేసేది. సర్లే ఇంట్లో ఒక్కర్తికి భయమేమో నాక్కూడా కాస్త కంపెనీ ఇచ్చినట్టు ఉంటుందని దాన్ని వెనకేసుకుని అంటే సంకనెత్తుకుని ఊరంతా బలాదూర్ తిరిగేవాడిని. అప్పుడు మార్కెటింగ్ ఉద్యోగం వెలగపెట్టాను లెండి.
అలా తిరిగినప్పుడు ఇదిగో ఈ అంతరాత్మ ఉందే నా మానాన్న నన్ను ఉండనిచ్చేది కాదు. రోజంతా ఒకటే నస. చెవిలో జోరీగలా!
“ఏమిటీ ఆ అమ్మాయివైపు అంత సేపు చూస్తున్నావు” – పెళ్లికాని ప్రసాదు అమ్మాయిల వేపు చూడక ఆంటీ లని చూస్తాడా దాని పిచ్చి కానీ. ఏమిటీ. ఈ మధ్య రాత్రి రోజూ పాను వేసుకుంటున్నావు?! అరే. పాన్పు సుఖం లేదు కనీసం పాను సుఖం కూడ దూరం చేసుకోవాలా? “ఈ మజ్జెన సిగరెట్లు ఎక్కువ కాలుస్తున్నావు” – చస్తున్నాను దీంతో. ఓ పక్కన సేల్స్ ఎందుకు అవ్వటం లేదని రోజూ బాస్ తలంటు పోస్తున్నాడు. ఎలా ఎక్కువ అమ్మాలో తెలీక, బాస్ చెప్పక, వాడికి సమాధానం చెప్పలేక, ఇంకో బోడి ఉజ్జోగం దొరక్క టెన్షన్ తో ఓ నాలుగు సిగరెట్లు ఎక్కువ కాలిస్తే అర్ధం చేసుకోవడం పోయి ఈ ఇంటరాగేషన్ ఏమిటి?
“అసయ్యంగా ఆ బీడీలు కాల్చడం ఏమిటి” – దానికేం తెలుసు గొర్రెతోక బెత్తెడని చిరుద్యోగి జీతం ఇరవయ్యో తారీఖు కల్లా శివార్పణమ్ అని అప్పటిదాకా దర్జాగా గోల్డ్ ఫ్లేక్ సిగరెట్టేలు కాల్చినా చివరి వారంలో బీడీలతోనే సరిపెట్టుకోవాలని!
“నీకొచ్చే తొక్కలో జీతానికి నువ్వు ప్రతి ఆదివారం రెండు సినిమాలు చూడాలా?” – మా జీతానికి మా బ్రతుక్కి మందా మాకా? కనీసం సినిమాలు చూసే కనీస అదృష్టం కూడా లేదన్న మాట ఈ ఎదవ జీవితానికి
ఇలా దానికి అక్కరలేని విషయం లేదు. ప్రతి దాంట్లో వేలెట్టడమే… కాదు కాదు పుల్లలు పెట్టడమే.
అనకూడదు కానీ మనలో మన మాట పెళ్లయ్యాక నా బ్రతుకు ఎలా ఉంటుందో 70 mm సినిమాస్కోప్ లో నాకు ట్రైలర్ చూపించేసింది. ఇహ దీంతో ఇలా లాభం లేదని పెళ్లయ్యాక దాన్ని ఇంట్లోనే వదిలేసి బైటికి పోతున్నాను ఇన్ని సంవత్సరాలుగా
కానీ మీకు తెలీనిది ఏముంది సాయంత్రం ఆఫీస్ నించి ఇంటికి రాగానే మళ్ళీ ఇంటరాగేషన్ మొదలు. “ఏమిటి ఇంతాలీసం అయ్యిందివాళ” – అరే చిన్న కంపెనీల్లో పెద్ద ఉద్యోగం వెలగ పెడుతున్నప్పుడు రోజూ కొత్తగా పెళ్లయిన వాడిలా ఏడింటికల్లా ఇంట్లో వాలాలంటే ఎలా – అవతల బోల్డు పనులు, కధలు, కమామీషులు.
“ఈ మజ్జెన ఆదివారం ఇంటి పట్టునుండకుండా ఆ వెధవాఫీసు పట్టుకు వెళ్లాడకపోతే ఇంట్లో పెళ్ళాం పిల్లలతో గడపచ్చుగా ” – నేను ఇంటికంటే ఆఫీస్ పదిలం అని వెళ్తున్నానని ఎప్పటికి అర్ధం చేసుకుంటుందో ఏమిటో
“ఈ మధ్య పార్టీలు ఎక్కువయ్యాయి నీకు. ఛాన్స్ దొరికితే చాలు ఏదో వంకతో పార్టీ అని జంప్ అయ్యిపోతావు” – అమ్మా తల్లీ నీకేం తెలుసు మగాళ్ల సోషల్ రెస్పాన్సిబిలిటీస్. ఆఫీసన్నాకా బోల్డు మంది సహోద్యోగులుంటారా? నలభై ఏళ్లుగా హైదరాబాద్ లో పడుంటే బోల్డు మంది ఫ్రెండ్స్ కూడా ఉంటారుగా?
మరి ఒకడికి కొత్త ఉద్యోగం వస్తుంది. పార్టీ.
ఇంకోడి కొడుక్కి ఎంసెట్ లో మంచి రాంక్ వచ్చింది. పార్టీ.
ఇంకోడు ఇల్లు బుక్ చేసాడు. పార్టీ. దాని గృహప్రవేశం అయ్యాక పార్టీ.
ఇంకోడి కూతురికి పెళ్లి కుదిరింది. పార్టీ. ఎంగేజ్మెంట్ పార్టీ. పెళ్లయ్యాక రిసెప్షన్ పార్టీ. నాలుగు రోజులయ్యాక ఆప్త మిత్రులందరికీ సినిమా వాళ్ళు సక్సెస్ మీట్ చేసుకున్నట్టు పార్టీ.
ఇంకోడు కొత్త కారు కొంటాడు. పార్టీ.
ఇంకోడి కొడుక్కి అమెరికా వీసా వచ్చింది. పార్టీ.
ఆఫీసులో ఒకడికి ప్రమోషన్. పార్టీ.
ఇలా పార్టీ పార్టీ పార్టీ. ఏది అటెండ్ అవ్వకపోతే వాడికే కోపం. అటెండ్ అయితే అంతరాత్మకి, దాంతో పాటు ఆవిడ గారికి కోపం. మీరెన్ని చెప్పండి. మన దేశంలో మగాడి పరిస్థితి బహు అధ్వానం.
ఈ ఈతి బాధలు పోలీసోడి దెబ్బల్లాంటివి. చెప్పుకోలేం. చూపించుకోలేం. పడ్డ వాడికే తెలుస్తుంది నొప్పి
ఇక్కడితో ఫ్లాష్ బ్యాక్ సమాప్తం
ఈ అంతరాత్మలు సామాన్య మానవుడినే కాదు సినిమాల్లో హీరోలని కూడా విసిగించేవి పాత సినిమాల్లో! పాపం హీరో ఏదో విషమ పరిస్థితుల్లో ప్రియురాలికి టాటా చెప్పేసి ఇంకో సుందరిని పెళ్లి చేసుకుందామనుకున్నాడనుకోండి.
ఆ వదిలేసిన ప్రియురాలు “ఎక్కడ ఉన్నా ఏమైనా నీ సుఖమే నే కోరుతున్నా” అని క్షమిస్తుందేమో కానీ ఈ అంతరాత్మ ఛస్తే క్షమించదు. వదలదు. పీక్కు తింటుంది వాడ్ని.
ఇలా పీక్కు తినడాన్ని ఆ నాడు దర్శకులు చాలా బాగా చూపించేవాళ్ళు.
హీరో పెద్ద నిలువుటద్దం ముందు నిలపడి ఉంటాడు. అద్దంలో అంతరాత్మ. ఇద్దరికీ వేర్వేరు బట్టలేసేవాళ్ళు లేపోతే మనం కన్ఫ్యూషన్ అవుతామని. ఇహ చూస్కోండి వాళ్లిద్దరూ ఓ తెగ డిషుమ్! డిషుమ్! ! సివరాకరికి హీరోకి ఒళ్ళు మండిపోయి పక్కనే ఉన్న ఓ పెద్ద ఫ్లవర్ వాజ్ ని ఆ అద్దం మీదకి మాంఛి కోపంతో విసిరేస్తాడు. దాంతో అద్దం ముక్కలు ముక్కలు అయ్యి గదినిండా పడిపోతుంది.
అక్కడితో అవ్వలేదండోయ్. ఆ ప్రతి అద్దం ముక్కలో ఈ అంతరాత్మ మొహం భీకరంగా పెట్టి వికటాట్టహాసం చేస్తూంటుంది. హీరో కి ఇంకేం చెయ్యాలో తెలీక అంటే ఆ ముక్కలని తన చెయ్యి కోసుకు పోకుండా ఇంకా చిన్న చిన్న ముక్కలు ఎలా చేయాలో తెలీక, ఒహ వేళ తెలిసినా అలా చేస్తే ఇప్పుడు ఓ డజను ముక్కల్లో ఉన్న అంతరాత్మ ఇంకో రెండు డజను ముక్కల్లో కనిపిస్తుందన్న విషయం అర్ధమయ్యి ఆ గదిలోంచి విసురుగా బైటికి వెళ్ళిపోతాడు.
ఇప్పుడు ఇప్పడికి వస్తే ఎందుకు నాకు నా అంతరాత్మకీ గొడవలయ్యాయంటే ఇన్నాళ్లు ఉద్యోగం, సద్యోగం పుణ్యమా అని అధమ పక్షం వారంలో ఆరు రోజులు బైటికి పోయేవాడిని. ఈ కొరోనా పాపమా అని నేను మూడు నెలలుగా ఇంటిపట్టునే పడుండడంతో వచ్చింది చిక్కంతా!
గత మూడు దశాబ్దాల పై చిలుకు నేను బైట, అంతరాత్మ లోపల (ఇక్కడో పన్ ఏడిసింది) ఉండేవాళ్ళం. ఇప్పుడో పొద్దున్న లేచిందగ్గరినించీ ఇద్దరం మొహామొహాలు చూసుకోవడం. అలవాటు లేని పనాయె. దాంతో ఇద్దరికీ చెప్పలేని చిరాకొచ్చి రోజూ చీటికీ మాటికీ కీచులాటలు. మాట మాట అనుకోవడం మొహం ముడుచుకోవడం .
మీరు కూడా అలా ఓ నదరుగా ఉన్న ఓ అద్దం పగలకొట్టేయచ్చుగా అంటారేమో. ఎంత కోపం వచ్చినా కాస్త వెనకా ముందు చూసుకుని రెచ్చిపోయే టైపు నేను., అలా అద్దం పగలకొడితే మళ్ళీ నాకే పడుతుంది దాని బడ్జెట్. ఎవరి మీదన్నా కోపమొస్తే చేతిలో ఉంది కదా అని నలభై వేలు పోసి కొన్న వన్ ప్లస్ 7 విస్సిరి కొడతామా ఏమిటి? మహా అయితే దగ్గర్లో ఏదన్నా న్యూస్పేపర్ లేదా మ్యాగజైన్ ఉంటె దాన్ని విసురుతాం. ఎంతైనా బతక నేర్చిన బడ్జెట్ పద్మనాభాలం కదా
అయినా మనసు కవి ఆత్రేయ గారు ఎప్పుడో చెప్పారు “మనసున్న మనసుకి సుఖము లేదంతే” అని. ఈ మనసు, అంతరాత్మ వేర్వేరని నా అంతరాత్మ ఛీ ఛీ ఛీ నేను చెప్తున్నా.
సరే మళ్ళీ అసలు కధలోకొస్తే దాని బాధ ఇలా రోజూ పడడం నావల్ల కాక మొన్నా మధ్య కటీఫ్ చెప్పేశా. అప్పటినించీ ప్రాణం హాయిగా. జీవితం ప్రశాంతంగా!
అదీ మా ఆవిడా చెవులు కొరుక్కుంటూంటారు నా గురించి. నాకేం భయమా?
శ్రావణ మాసం అంటే పెళ్లిళ్ల కాలం. నేను ఐదో తరగతి చదువుతున్న రోజులు. కాకినాడలో ఉన్న మా బామ్మా వాళ్ళ చెల్లెలి మనవరాలు పెళ్లి. అమ్మా నాన్న, బామ్మ తాతయ్య, నేను తమ్ముడు, అందరం పెళ్ళికి బయలుదేరాం. రెండు బల్ల రిక్షాలు మాట్లాడుకుని, కుటుంబమంతా కొత్త బట్టలు, దారిలోకి మరెయ్యడానికి చిరుతిళ్ళు, ఆనక నిద్ర పట్టడానికి సరిపడా భోజన సరంజామా అంతా సర్దుకుని రైల్వే స్టేషనుకు బయలుదేరాం. బాపట్ల ఆతిధ్యం ఎప్పుడైనా పొందిన వారికి బల్ల రిక్షాలు బాగా ఎరుక ఉంటుంది. వెనక రెండు చక్రాల మీద ఒక నాలుగు అడుగుల పొడవు మూడు అడుగుల వెడల్పు ఉన్న చెక్క బల్ల మీద నలుగురు నాలుగు మూలలకి కూర్చుంటారన్నమాట. పొద్దున్నే బామ్మ పెట్టిన మల్లె పువ్వు లాంటి ఇడ్లీలు మీద మంచులా కరిగిపోయే వెన్న వేసుకుని , అంత కొబ్బరి చట్నీ, ఇంత కారప్పొడి కలిపి కొట్టి, గొంతుని బఱ్ఱె పాలతో కాచిన కమ్మటి కాఫీ గుటకేసి ఆ బల్ల రిక్షా ఎక్కి కూర్చున్నాక, సూర్యలంక సముద్ర తీరం నుంచి వీచే గాలి దేహమంతా తడుముతుంటే అదొక అనిర్వచనీయమైన అనుభూతి. పెళ్లి లేదు, పెటాకులు లేదు ఇంటికెళ్లి మా పాత నవ్వారు మంచం వేసుకుని హాయిగా ఇంకాసేపు కునుకు తీస్తే బాగుణ్ణు అనిపించింది .
మా తాతగారు సమయ పాలనలో ఠంఛనుగా ఉండే వ్యక్తి. రైలు తొమ్మిదింటికంటే ఇంట్లో ఏడున్నరకే బయలుదేరదీసేవారు. అంత ముందు పోయి ఏమి చేస్తాం? అని నాన్న అంటే ఒక అరగంట ముందు పోతే పోయేదేముంది. ఈ ఇంట్లో కూర్చుని చేసే కాలక్షేపం ఏదో ఆ రైల్వే ప్లాట్ఫారం మీదే చేయవచ్చు కదా అనే వారు. అందరం ప్లాట్ఫారం మీదకు చేరి కాకినాడ పాసెంజర్ కోసం వేచి చూస్తున్నాం. రేయ్, ఆ ప్లాట్ఫారం చివరికి నిలబడకు వెనక్కి రా అని అరవడమే సరిపోతోంది తాతయ్యకి. నాన్నేమో, ప్రయాణంలో చదువుకోవడానికి నవలలు ఏమన్నా కొందాం అని హిగ్గిన్ బోథమ్స్కి వెళ్లారు. మా బాపట్ల రైల్వే స్టేషన్ చాలా అందంగా ఉండేది. పొద్దున్నంతా ఉద్యోగులతో, సాయంత్రమంతా విద్యార్థులతో సందడి సందడిగా ఉండేది. స్టేషన్ చుట్టూ కాగితం పూల చెట్లు, ప్లాట్ఫారం మీద పూలమ్మి అమ్మే మల్లె, మరువం, కనకాంబరాలు. చాలా ఆహ్లాదకరంగా ఉండేది వాతావరణం, ముఖ్యంగా శీరుడు శాంతి వహించే శ్రావణంలో. అందరం కూర్చుని రైలు కోసం ఎదురుచూస్తుంటే అయిదేళ్ల క్రితం రిటైర్ అయిన తాతయ్య తన ఉద్యోగానుభవాలు బామ్మకి, అమ్మకి చెప్తున్నారు. నాన్న నవలాపఠనంలో మునిగిపోయారు.
తాతయ్య నలుపు తెలుపు సినిమా కథనానికి బ్రేకులు వేస్తూ, ట్రైన్ నెంబర్ ఒకటి రెండు మూడు నాలుగు మరి కొద్దిసేపట్లో ప్లాట్ఫారం నెంబర్ ఒకటి మీదకు వస్తుంది అని మూడు సార్లు మూడు భాషల్లో నొక్కి వక్కాణించింది అశరీరవాణి.
రైలులో పెద్దగా రద్దీ లేదు, మా అందరికీ కాళ్లు జాపుకోవడానికి వీలైనన్ని ఆసనాలు దొరికాయ్. రైలు కదిలిన కాసేపటికి, హడావుడిగా పరిగెత్తుతూ వచ్చి లోపలికి ఒక్క ఉదుటున ఎక్కాడు ఒక పొడవాటాయన. మంచి నీళ్ల సీసా, మూడు గిన్నెల స్టీలు కారియరు తీసుకుని రైలు పెట్టెలో నడక దారికి అటు వైపు ఉన్న సీటులో వచ్చి కూర్చున్నాడు. మా నాన్న వయసు ఉంటుంది అనుకుంటా ఆయనకి. తెల్ల చొక్కా, నల్ల ప్యాంటు, చేతికి హెచ్.ఎం.టి వాచీ. జేబులో రైల్వే సీజన్ పాస్, కళ్ళజోడు. నుదుటిన ఎర్రటి బొట్టు. పరిగెత్తడం వల్ల పట్టిన చెమట తడికి కరిగిపోతున్న త్రిపుండ్రాలు. వచ్చి తన సీట్లో సర్దుకున్నాక ఏ దేవుడికో బాగా దణ్ణం పెట్టుకున్నాడు, రైలు తప్పిపోనందుకు. కాసిని మంచి నీళ్లు తాగి, వాచీ చూసుకుని అటుగా పోతున్న కాఫీ అబ్బిని కేకేసి పిలిచాడు. చక్కర తక్కువ వేసిన వేడి వేడి కాఫీ చల్లగా జుర్రుతూ, కాఫీ.. మరీ మంచి నీళ్ల కన్నా హీనమై పోయిందండి రైళ్లలో. ఈ నీళ్ల కాఫీ రూపాయిన్నరా!! మరీ దోపిడీ అయిపొయింది సార్ అన్నాడు మా నాన్నకేసి చూస్తూ. తెనాలి స్టేషన్లో కాస్త పర్వాలేదండీ. ఈ రైళ్లల్లో ఇంతే నాసిరకం కాఫీ అన్నాడు నాన్న ఆయనకి వంత పాడుతూ. కాఫీకి ఎక్కువ సేపు ఆగలేను సార్ అన్నాడు పొడవాటాయన, నేను అంతే లెండి అన్నాడు నాన్న నవ్వులు చిందిస్తూ. ఇంతలో నాన్న దగ్గర ఉన్న సితార సినీ వార పత్రిక , పొడవాటాయన దగ్గర ఉన్న ఈనాడు దిన పత్రిక చేతులు మారాయి. తాతయ్య జిల్లా ఎడిషన్, నాన్న మెయిన్ ఎడిషన్. తరువాత తాతయ్య మెయిన్ ఎడిషన్, నాన్న జిల్లా ఎడిషన్ పారాయణ చేశారు. నాన్న మళ్ళీ పేపర్ మొత్తం చక్కగా సర్ది తిరిగి పొడవాటాయనకు అప్పజెప్పారు. ఇటు నాన్న అప్పగింతలు పూర్తవ్వకుండా అటు వాళ్ళ అమ్మాయి పెళ్ళి చూపులు కోసం పెళ్లి పందిరి కావాలంటూ పేపర్ అడిగి తీసుకున్నాడు పొడవాటాయన పక్కన కూర్చున్న పెద్దాయన. ఆ తరువాత పెద్దాయన దగ్గర నుంచి మూడవ పేజీ అడిగి తీసుకున్నాడు ముసలాయన. మిగతా పేజీలు సీటు నెంబరు అయిదు, ఆరు, ఎనిమిదిలో కూర్చున్న వాళ్ళు పట్టుకుపోయారు. నాన్నకి సితార తిరిగిచ్చేసి ఇద్దరూ రాష్ట్రీయ, జాతీయ రాజకీయ చర్చ మొదలెట్టారు. బాపట్ల, తెనాలి, బెజవాడ రాజకీయాలు ఇలా పది నిమిషాలకొక ఊరు మారుతూ వారి చర్చ మా కాకినాడ పాసెంజర్ కన్నా వేగంగా రాజధాని ఎక్సప్రెస్లా హస్తిన చేరింది. వాళ్ళ చర్చ ముగిసే సమయానికి మా రైలు బెజవాడ చేరింది. పొడవాటాయన రైలు పెట్టెలో పది చోట్లకు చేరిన తన దినపత్రిక పోగేసుకుని మా నాన్న దగ్గర శెలవు తీసుకున్నాడు.
బెజవాడ గాలికో అక్కడ త్రాగిన నీళ్ళకో బాగా ఆకలి మొదలయ్యింది. బామ్మా ఆకలి అంటే, ఆ భోజనాల సంచి పైన్నుంచి దింపమని తాతయ్యకి ఆర్డరు వేసింది బామ్మ. మా పెరట్లో అరిటాకులు ఒక చిన్న పళ్ళెమంత కోసి భోజనాల సంచిలో వేసింది బామ్మ. పులిహోరతో మొదలెట్టి, పూరీ కూరతో పొట్టను కొంచెం పూరించి, దద్ధోజనంతో ముగించాం అనిపించాం. మంచి భోజనం చేసి రైలు కిటికీలోంచి చూస్తుంటే పచ్చటి పంట పొలాల నుంచి వీచే స్వచ్ఛమైన గాలి చెంపలు తడిమి ఊరుకుంటుందా, నిద్ర పుచ్చింది. కలలైపోయాయి, కాకినాడ వచ్చింది.
మమ్మల్నందరిని ఇంటికి తీసుకువెళ్ళడానికి మా మావయ్య అంబాసిడరు కారు తీసుకుని వచ్చాడు రైల్వే స్టేషన్కి . పెద్దవాళ్లందరిని కుశల ప్రశ్నలడిగాడు , నా బుగ్గ మీద చిటికేసి నువ్వెంట్రోయ్ కు. ని. పోస్టర్లో బొమ్మలా, పుల్లలా తయారయ్యావ్, తింటున్నావా లేదా అసలు ? అన్నాడు. కారు పెళ్లింటి ముందు ఆగింది. విద్యుద్దీపాల అలంకారాలు , కొబ్బరాకులతో అల్లిన పందిళ్లు, పందిరి చూరు నుంచి వేలాడుతున్న బంతి, చామంతి దండలు. పన్నీరు, సంపంగి , అగరొత్తుల పరిమళాలు. మల్లె పువ్వులాంటి నవ్వులతో స్వాగతం చెప్తున్న మా ఇంటి ఆడపడుచులు. ప్రయాణ బడలిక తెలియనే లేదు మాకెవ్వరికీ. కబుర్లు, కౌగిలింతలలో కరిగిపోయారు అంతా. అందరం స్నానాలు, భోజనాలు చేసి మేడ మీదకి చేరాం. చాలా రోజుల తరువాత కలిసిన మా బామ్మ వాళ్ళ చెల్లెలు, మా అమ్మా నాన్న, మా అత్తయ్య మావయ్య, మా తాతలు, బాలల వానర సైన్యం అందరమూ చాపలు, దుప్పట్లు, దిండ్లు వేసుకుని కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకున్నాం.
కాకులు, కోకిలలు, కిశోతరుడు కూడబలుక్కుని పాడె మేల్కొలుపు. మేము లేచే సరికే పెద్దవాళ్ళు అంతా చక్కగా అలంకరించుకుని సందడి సందడిగా ఉన్నారు. అందరూ స్నానాలు చేసి రండి టిఫిన్లు చేద్దురుగాని అని క్రింద నుంచి కేక వేసింది అమ్మ. అందరం స్నానాలు చేసి కొత్త బట్టలు వేసుకుని రామా సప్లయర్స్ వాళ్ళ బులుగు బల్లల ముందు చెక్క కుర్చీలు, పైన విస్తరాకులు వేసుకుని టిఫిన్ కోసం ఆవురావురమని వేచి చూస్తున్నాం. ఉప్మానా, ఇడ్లీన అడిగింది మా అత్త. పూరి లేదా అత్తా ? పూరి చెయ్యలేదు నాన్నా. ఇడ్లీ తింటావా కారప్పొడి నెయ్యి వేసుకుని అని ప్రేమగా అడిగింది మా అత్త. కారప్పొడా !! అదేంటి చట్నీ లేదా ? లేదురా.. మీరు లేచేసరికె అయిపొయింది. వద్దులే అత్తా, ఉప్మా పెట్టు అని దీనంగా చెప్పాను. అందుకే రాత్రి పూట పడుకోబోయే ముందు దేవుడికి దణ్ణం పెట్టుకు పడుకోవాలి, లేకపోతే పొద్దునే టిఫిన్లో ఇలా కనీసం నీళ్ల చట్నీ కూడా లేని గట్టి ఇడ్లీ లేదా గడ్డలు కట్టిన ఉప్మా తినాల్సి వస్తుంది. ప్చ్.
బయల్దేరండి, బయల్దేరండి అంటూ అందరూ కళ్యాణ మండపానికి హడావుడిగా బయల్దేరారు. పేద్ధ.. కళ్యాణ మండపం. పూలు, తళుకుల కాగితాలతో మెరిసిపోతోంది . లోపలికి అడుగుపెట్టగానే పన్నీటి జల్లు చల్లగా చల్లుతున్న యాంత్రిక వింజామరలు.పట్టు చీరల మెరుపులు, స్వర్ణాభరణాల ధగ ధగలు, అత్తరు, అగరొత్తుల గుభాళింపులు. డోలు, సన్నాయి మేళాలు. ఆనందం అంబరాన్నంటే లోగిళ్ళు తెలుగు పెళ్లి పందిళ్లు.
పెళ్లి మండపం చుట్టూ మేడ పైన విడిది గదులు. గదుల బయట నుంచుంటే పిట్టగోడ మీద నుంచి పెళ్లంతా చూడొచ్చు. నేనూ, తమ్ముడు పైన గది ముందర ఆడుకుంటున్నాం. క్రిందకి రమ్మని అమ్మ చెయ్యి ఊపింది. మా బొమ్మలు గదిలో పెట్టి, మా బొమ్మలు ఎవరూ ఎత్తుకు పోకుండా తలుపు బయట గొళ్ళెంపెట్టి కిందికి పరిగెట్టాం. భోజనాలు చేసి ఆడుకోండి అని చెప్పింది అమ్మ. పొద్దున్నే నీరసంగా తిన్న వంద గ్రాముల ఉప్మా మా ఆటలకి హారతి కర్పూరంలా కరిగిపోయింది. కడుపు నక నక లాడుతుంటే చక చకా అడుగులు వేస్తూ భోజనాల దగ్గరికి చేరాం. మంచు వేసిన మంచి నీళ్లతో గొంతు తడిపి రాబోయే పదార్ధాలకి మార్గం సుగమం చేశాం, తేనెలూరుతున్న జాంగ్రీ, ఒంటి నిండా చక్కర చిలకరించుకొచ్చిన బూందీ లడ్డు, పొత్రం కింద నలిగి, పచ్చి శెనగపప్పు, ఎండు కొబ్బర్లతో చేరి, బెల్లం ముద్ద పొట్ట నిండా నింపుకు వచ్చిన వేడి వేడి పూర్ణం బూరెలు, తోడుగా నేతి ప్రవాహం, తీపి ఎక్కువై వెగటు పుట్టగానే అరటికాయ బజ్జి, వంకాయ బజ్జి. పెళ్లి భోజనం అని గుర్తు చేస్తూ ముద్ద పప్పు, దోసావకాయ, పక్కనే నంజుకోవడానికి ఊర మిరపకాయలు, గుమ్మడి కాయ, సొరకాయ, ములక్కాడ, టొమాటో , ఇంగువా దట్టించిన సాంబారు, పళ్ళకింపుగా కర కర లాడే అప్పడాలు, ఊర మిరపకాయలు, దొండకాయ, బెండకాయ వేపుళ్ళు. ఆనక , చారు పోస్తాం అంటే తాగలేక, పులిహోర తినే ఖాళీ లేక, గడ్డ పెరుగు, విస్తరాకులో మిగిలి ఉన్న దోసావకాయతో భోజనం ముగించి, కిళ్ళీ జేబులో పెట్టుకుని నేనూ తమ్ముడు భోజనాల నుంచి బయటపడ్డాం.
అమ్మ ఎదురొచ్చి తాతయ్యని చూశారా అని అడిగింది. లేదు అని తలూపి ఆడుకోవడానికి పరిగెట్టాం. కాసేపటికి నాన్న కనిపించి తాతయ్య కనిపించారా అని అడిగాడు, లేదని చెప్పాం. సరే, ఎక్కడున్నాడో చూడండి ముహూర్తం దగ్గర పడుతోంది. కనిపిస్తే వెంటనే పెళ్లి పందిరి దగ్గరికి రమ్మని చెప్పండి. మేము ఆట ఆపేసి తాతయ్య కోసం వెతుకుతున్నాం. అమ్మా, నాన్న కూడా చెరో దిక్కు వెతుకుతున్నారు. భోజనాల దగ్గర, పెళ్లి మండపం దగ్గర, వాకిట్లో, వీధిలో అన్ని చోట్లా వెతికారు. ఏరా, నాన్న కనిపించారా ? అని అడిగింది బామ్మ నాన్నని. లేదమ్మా, ఎక్కడా లేరు. చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్లారు ముహూర్తం దగ్గర పడుతుంటే ఈ మనిషి అని నసిగింది బామ్మ. సరే నేను మళ్ళీ ఒక సారి చూసి వస్తాను అని తాతయ్యని వెతకడానికి బయలుదేరాడు నాన్న. పెళ్లి పందిరిలో లేని తాతయ్య, ఆయనను వెతకడానికి వెళ్లిన అమ్మా, నాన్న, నేనూ, తమ్ముడు అందరము ముహూర్త సమయానికి పెళ్లి పందిరిలో లేకుండా పోయాం. పెళ్లి అయిపొయింది. కోలాహలం కొద్దిగా సద్దుమణిగింది.
కాసేపటికి అమ్మ, బామ్మ రక్తపోటు మాత్రలు తీసుకురావడానికి మేడ పై గదిలోకి వెళ్ళింది. కాసేపటికి చేతిలో మాత్రలతో బాటు తాతయ్యని వెంటబెట్టుకొచ్చింది. తాతయ్యను చూడగానే బామ్మకి ఆనందం, ఆశ్చర్యం, ఆవేశం అనే త్రిగుణాలు పెల్లుబికాయి.
ఇక్కడ పెళ్లి పెట్టుకుని ఏ రాచకార్యాలు వెలగబెట్టడానికి వెళ్లారు ? అలా తడిసిపోయారు ఏంటి ? అని తాతయ్య మీద ఇంతెత్తున లేచింది.
తాతయ్య తాపీగా టర్కీ టవల్తో మొహం తుడుచుకుంటూ, సరే, ముందు ఆ మాత్ర వేసుకో. నేను ఎక్కడికి వెళ్లానో ఈ కుంకలిద్దరిని అడుగు చెప్తారు అని మా వైపు చూపించారు. మేము ఏమీ అర్ధం కానట్టు తెల్ల మొహాలు వేశాం.
వాళ్ళా !! వాళ్ళేమి చేశారు ?
అడుగు వాళ్లనే..అడుగు ..అన్నారు.
మాకు ఏమీ అర్ధం కానట్టు అడ్డంగా తలాడించాం.
నన్ను పైన ఆ గదిలో పెట్టి గొళ్ళెం వేసింది మీరేనా ? అని అడిగారు నా వంక తమ్ముడి వంకా చూస్తూ.
అప్పటికి వెలిగింది మా కపి మస్తిష్కంలో కార్తీక దీపం, తాతయ్య స్నానాల గదిలో ఉన్నారన్న సంగతి మర్చిపోయి మేము బొమ్మలు లోపల పెట్టి తలుపుకి బయట గొళ్ళెం పెట్టాం.
వీళ్ళు తలుపు వెయ్యడం నాకు వినిపించింది, నేను గదిలోంచి అరుస్తూనే ఉన్నాను. వీళ్లు గొళ్ళెం వేసి తుర్రుమన్నారు. రెండున్నర గంటల నుంచి ఆ తలుపు బాదుతూనే ఉన్నాను. ఈ మేళాలకి, కోలాహలానికి ఎవ్వరికి వినిపించినట్లు లేదు. అరిచి అరిచి గొంతు నొప్పి పుట్టింది. ఇహ విసుగు, నీరసం వచ్చేసి అలా అక్కడే కూర్చుండిపోయాను, ఇదుగో ఇప్పుడు కోడలు వచ్చి తలుపు తీస్తే మళ్ళీ ఊపిరి పీల్చుకున్నాను. ఇంతకీ పెళ్లి బాగా జరిగిందా ?
బానే జరిగింది కానీ, ఇంత దూరము వచ్చి ఎవ్వరమూ పెళ్లి సరిగా చూడనైనా లేదు అని వాపోయింది బామ్మ. మరుసటి రోజు అందరం కలిసి అన్నవరం సత్యనారాయణ స్వామి దగ్గరికి బయలుదేరాం. స్వామి దర్శనం చేసుకుని, అక్కడి కమ్మటి ప్రసాదంతో కడుపు నింపుకుని, బంధువులందరికీ వీడ్కోలు పలికి తిరిగి బాపట్ల బయలుదేరాం.
అన్నవరం రైల్వే స్టేషన్ బాగా రద్దీగా ఉంది. రైలు రావడానికి ఇంకా అరగంట సమయం పడుతుందని చెప్పింది శబ్దప్రసారిణి. చెవులదిరిపోయేలా కూత వేస్తూ, తన దారికి దూరం దూరం జరగమంటూ, రైలు పట్టాలు పట పటలాడిస్తూ, కీచుమంటూ ప్లాట్ఫారం మీద ఆగింది రత్నాచల్ ఎక్సప్రెస్. దండేనికి ఆరేసిన బట్టల్లా రైలు తలుపుల దగ్గర వ్రేలాడుతున్న పుణ్యాత్ములందరూ క్రిందకి దిగి చక్రాల మీదున్న రత్నాచల స్వర్గంలోకి దారి ఇచ్చారు. బాగా రద్దీగా ఉంది అని మోము దీనంగా పెట్టుకుని రైలెక్కింది బామ్మ. అలా అలా అందరిని జరుపుకుని ఎలాగొలా సామాను అటకెక్కించాం. ద్వారానికి దగ్గర ఉండే బెర్తుల మధ్య అందరం తలా ఒక రెండు అడుగులు చోటు చేసుకుని నిలబడ్డాం. ఎవరో కర్ణ సగోత్రీకుడు మా బామ్మ అవస్థ చూసి జాలిపడి తన ఆసనం మా బామ్మకు దానమిచ్చాడు. బామ్మ అతనిని ఆశీర్వదించి కాస్త కుదుట పడింది. దొరికిన సౌకర్యంతో మనసు కుదుట పడుతుందా. పై బెర్తు వంకీ పట్టుకు వ్రేలాడుతున్న తాతయ్యకేసి దీనంగా చూసింది. పర్లేదులే, వచ్చే స్టేషన్లో ఖాళీ అవుతుందిలే అని అభయ హస్తం చూపాడు తాతయ్య . ఇదంతా చూస్తున్న ఎదురు సీట్లో కూర్చున్న బుర్రు మీసాలాయన, రాజమండ్రిలో రైలు మొత్తం ఖాళీ అయిపోతుందని మా అందరికి భరోసా ఇచ్చాడు.
ఒక గంటన్నర నిలబడ్డాక హమ్మయ్య రాజమండ్రి వచ్చేస్తోందన్న ఆనందం మొదలయింది. రెండు రోజుల నుంచి అతిశయించిన ఆటల వల్ల నేనూ తమ్ముడు, ఆ రోజు సత్యనారాయణ స్వామి సన్నిధిలో కలియ తిరగడం వల్ల పెద్దవాళ్ళు బాగా అలిసిపోయారు. కాళ్ళు జాపుకోవడానికి ఒక అడుగు, కూర్చోవడానికి ఒక అడుగు, వీపు ఆనించుకోవడానికి ఒక అడుగు ఇవ్వమని వామనుడు బలి చక్రవర్తిని కోరినట్టు ఆ దక్షిణ మధ్య రైల్వే దక్షిణామూర్తికి దణ్ణం పెట్టుకున్నాం. రాజమండ్రి రానే వచ్చింది, తోపులాట మొదలయ్యింది దడ దడమని ఒక పాతిక మంది పెట్టెలోకి తోసుకువచ్చారు. ఆ తోపుడికి నేను మా తమ్ముడు దూరం జరిగిపోయాం. జనాల మధ్యన కలిసిపోయి నాకు నాన్న గానీ, తాతయ్యగానీ కనిపించడం లేదు. ఈ రద్దీకి నేను తమ్ముడు తప్పిపోయి మళ్ళీ పదిహేనేళ్ల తరువాత వాడు ఏ రెస్టారెంట్లోనో పాట పాడుతున్నప్పుడు తిరిగి కలుస్తామేమో అని భయమేసింది నాకు. రాజమండ్రిలో ఖాళీ అవుతుందని అభయమిచ్చిన ఆ బుర్రు మీసాలాయన కనిపిస్తే గాట్టిగా మీసాలు పట్టుకు లాగుదామన్నంత కోపమొచ్చింది.
రైలు కదిలినా గాలి ఆడటం లేదు. నాకు రెండు పక్కలా ఒక వీరబాహుడు, ఒక ఘనోదరుడు నిలబడ్డారు. బూడిద గుమ్మడికాయలాంటి బొజ్జలతో నా టమాటా అంత తలకాయని ఒత్తి పారేస్తున్నారు. తలెత్తితే తిరగలేక తిరుగుతున్న రైల్వే వీవెన, మిణుకు మిణుకుమంటున్న విద్యుద్దీపం తప్పితే ఏమీ కనిపించడం లేదు. వీరబాహుడు, ఘనోదరులతో ఒక గంట శిరోదర యుద్ధం సలిపాక, నా కన్నీరు ఆపడానికి ఏలూరు వచ్చింది. రద్దీ తగ్గింది మా అందరికీ కూర్చోవడానికి ఇంత చోటు దొరికింది. అందరం కూర్చుని కాస్త ఊపిరి పీల్చుకున్నాం. కానీ పీలుస్తున్న గాలి చుట్ట కంపు కొట్టసాగింది.
ముక్కుకి పేద్ద సత్తు ముక్కు పుడక, ముందే పచ్చ పొడిచిన నుదుటి మీద పేద్ద బొట్టు, చేతికి మట్టి గాజులు , కాళ్ళకి సత్తు వంకీలు, ఎర్రంచు ఆకుపచ్చ చీర కట్టుకుని కిటికీ దగ్గర కూర్చుని ధూమశకటానికి పోటీ ఇచ్చేలా గుప్పుగుప్పున చుట్టకి కొరివి పెడుతోంది మమతల… అసిరితల్లి. మా ప్రక్కనే కూర్చున్న బాధ్యత గల పౌరుడు భావపురి భావన్నారాయణ గారు పూనుకుని ఏవమ్మా రైలులో చుట్ట తాగకూడదు అన్నాడు. రైలు కిటికీలోంచి వదిలేసిన కాగితపు కాఫీ కప్పు ఎగిరిపోయేంత వేగంగా కళ్ళెర్రజేసుకుని గిర్రున తల తిప్పింది అసిరితల్లి.
పొగపోయేది పెట్టి బయటకి కాదేటి ? అని విసురుగా అడిగింది.
బాధ్యత కంటే బ్రతుకు తియ్యనైనదని తెలుసుకున్న భావన్నారాయణ మిన్నకున్నాడు.
ఒక రెండు నిమిషాల పాటు అక్కడ అలుముకున్న నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ అసిరితల్లి పౌత్రుడు పైడితల్లి ఏడుపు లంఖించుకున్నాడు. పిల్లగాడు ఏడుస్తుంటే సూస్తూ కూకుంటావేమియా సింహాచలిమియా అని పెనిమిటిని గదిమింది పైడితల్లి వాళ్ళ నాయనమ్మ. సింహాచలం ఒకటో నెంబరు బెర్తు నుంచి అరవై నాలుగో బెర్తు దాకా ఒక ఆరు భ్రమణాలు చేసాక పైడితల్లి కునుకేశాడు. మూడో నెంబరు బెర్తు నుంచి ఆరో నెంబరు బెర్తుకి తన ఎర్ర కాటన్ చీరతో ఉయ్యాల వేసింది అసిరితల్లి. చల్లగాలికి కళ్ళు మూతపడుతుంటే ఏదో నీళ్లు ఒలుకుతున్న శబ్దం అయ్యింది. చీరతో కట్టిన ఉయ్యాలలోంచి పైడితల్లి పెట్టెని పావనం చేస్తున్నాడు. అదాట్టున లేచిన అసిరితల్లి పైడితల్లిని తీసుకుని శౌచాలయంలోకి పరుగెట్టింది. ఏమ్యా, ఇట్రా ఈణ్ణి తీస్కుపో అని అరిచింది.కడిగిన ముత్యంలాంటి పైడితల్లిని ఎత్తుకుని తిరిగివచ్చాడు సింహాచలం. పావనమైన చీరని పిండుకుని వచ్చి, గట్టిగా ఒక విదిలింపు విదిలించింది. చల్లటి చిరు జల్లు తగిలిన భావన్నారాయణ నిద్రలోంచి ఉలిక్కిపడి లేచాడు. చీరారేస్తున్న అసిరిని విసుగుగా చూసి ఏమీ అనలేక అటు తిరిగి పడుకున్నాడు భావన్నారాయణ.
అసిరి ఆకలేస్తోందంటే ఉడకబెట్టిన వేరుశెనగ కాయలు, ఉప్పూకారం పూసిన జామకాయలు తెచ్చాడు సింహాచలం. రెండు జామకాయలు తెస్తే ఇద్దరికీ చెరోటీ తెచ్చాడు అనుకున్నా గానీ రెండూ అసిరే మేసింది. ఎదురు బెర్తు మీద కాళ్ళు జాపుకుని ఒళ్ళో వేరుశెనగల పొట్లం పెట్టుకుని నిదానంగా ఒక్కొక్క శెనగకాయ తిని తొక్కలు తిరిగి కాగితంలో ఒక పక్కకి వేసింది. నీళ్లు నములుతున్న సింహాచలాన్ని చూసి జాలేసి ఒక నాలుగు వేరుశెనగ కాయలు అతని దోసిట్లో పోసింది. అతిగా తినడం వల్ల అజీర్తి చేస్తుందేమో అని సింహాచలం దీనంగా చూశాడు. ఏపాకు పచ్చడి తిన్నోడిలా అలా ఎర్రి మొహం ఏసావేందియా, నేను తినొద్దా అని కసురుకుంది అసిరితల్లి. అయ్యో అట్ట నేనెందుకంతను అసిరి ?, ఆజుమోలా గుళిక ఇయ్యమందువా !! ఆ … నువ్వు తినుమీ ఆజుమోలా నాకు బానే అరుగుతాది అని ఒళ్ళో పోసుకున్న వేరుశెనగ తొక్కలు కిటికీలోంచి విసిరికొట్టింది. ఎదురుగాలికి తొక్కలు ఎగిరి నా మొహం మీద పడ్డాయ్. మా బామ్మకి కోపం నషాళానికి అంటింది. ఏవమ్మోవ్, అలా పిల్లాడి మొహం మీద వేస్తావేంటి అని గద్దించింది. ఆ…గాలికి ఎగిరొచ్చి పడితే నానేటి సేతును అని చిరాకు పడుతూ లేచి తలుపు దగ్గరికి పోయింది. తిరిగి వస్తూ దారిలో ఉన్న మా బామ్మ కాలు తొక్కింది. ఓసి మీ అమ్మ కడుపు బంగారం గానూ, కాలు విరగగొట్టేశావు కదే అని బాధతో పెద్దగా అరిచింది బామ్మ. నాన్న పట్టరాని ఆవేశంతో అసిరి మీద కసిగా లేచాడు. సింహాచలం, తాతయ్య మధ్యలో కలగజేసుకుని నాన్నని శాంతింపజేశారు. సింహాచలం క్షమార్పణ చెప్పి, మన్నించమని కోరాడు. కొంత మందికి ఇల్లుకి, రైలుకి తేడా తెలియదులెండి అన్నాడు భావన్నారాయణ కొద్దిగా ధైర్యం కూడదెచ్చుకుని. అసిరి భావన్నారాయణ వంక చుర చురా చూసింది. ఈ కోలాహలం పూర్తయ్యే సరికి బెజవాడ చేరాం. కాలి నొప్పిని పంటి బిగువున దాచుకుని మాతో పాటు బాపట్ల బస్సు దాకా నడిచింది బామ్మ.
బాపట్లలో దిగి శంకర్రావు సోడా బండి దగ్గర అందరం తలా ఒక గోలీ సోడా తాగాం. అమ్మా, నాన్న , తమ్ముడు బల్ల రిక్షాలో. బామ్మా , తాతయ్య, నేను గూడు రిక్షాలో ఇంటికి బయలుదేరాం. చల్ల గాలికి నిదుర తూగుతుంటే, ఠా…ప్పని పెద్ద శబ్దం అయ్యింది. సగం దూరం చేరేసరికి బామ్మా వాళ్ళ గూడు రిక్షా టైరుకి పంచరు పడింది. బామ్మని, తాతయ్యని బల్ల రిక్షా ఎక్కించి నేను, నాన్న ఇంటికేసి నడవనారంభించాం. బాగా పొద్దు పోయింది నిద్దుర తూగుతోంది. క్రమం లేని అడుగులు వడి వడిగా వేసుకుంటు ఇంటికి చేరి స్నానాలు చేసి మంచాల మీద కూలబడ్డాం.
పొద్దునే లేచే సరికి బామ్మ కోపంగా ఉంది. ఏమిటా సంగతి అని ఆరా తీస్తే పెళ్ళిలో వాళ్ళ చెల్లెలు కట్టించిన లడ్లు, అరిసెలు, జాంగ్రీలూ , కారప్పూస, చెక్కలు ఉన్న సంచి నిన్న కోలాహలంలో రైలులో మర్చిపోయాముట. ఆ అసిరికి దొరికే ఉంటుంది, ఆ అరిసెలన్నీ లొట్టలేసుకుంటూ తిని ఉంటుందని కాలికి కొబ్బరి నూనె రాసుకుంటూ తిట్టిపోసింది బామ్మ. సుష్టుగా భోంచేసి మధ్యాహ్నం మంచి నిద్దుర వేశాం అందరం. నిద్ర లేచాక అందరికి పెద్ద గాజు గ్లాసుల్లో బఱ్ఱె పాలతో చిక్కటి ఫిల్టర్ కాఫీ పెట్టింది మా అత్త. పోస్ట్ అంటూ కేకేశారు మా పోస్టుమాన్ కోటేశ్వరరావు గారు. కార్డు చదువుతూ వస్తున్న తాతయ్యను చూసి ఎక్కడి నుంచి ఉత్తరం ? అని అడిగింది బామ్మ.
ఆ.. ఉత్తరమా. రాజమండ్రిలో మన సత్యనారాయణ గారు లేరూ.. వాళ్ళ పెద్దబ్బాయి పెళ్ళిట రెండు వారాల్లో ఇంటిల్లిపాదిని రమ్మని ఆహ్వానపత్రిక పంపారు అని పెళ్లి కబురు చల్లగా చెప్పారు తాతయ్య.
ఇది నేను ఇదివరకు తెలుగు కోరా పరంగా షేర్ చేసుకున్న విషయమే
నేను ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ లో (REC రూర్కెలా ) ఉండగా మా కాలేజీ కి సైన డై (Sinedie) ప్రకటించారు (ఇది 1987 లో జరిగిన విషయం)
ఇంకా కాలేజీ మొదలు పెట్టి పూర్తిగా ఒక నెల కూడా గడవకముందే జరిగింది
(అప్పుడేదో కాలేజీ లో ఫైనల్ ఇయర్ కి థర్డ్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ గొడవల్లో రక్తాలు వచ్చేలా కొట్టేసుకోవడం వలన వ్యవహారం చాలా సీరియస్ అయ్యిపోయి – నిరవధిక సెలవలు (Sinedie) ప్రకటించేసారు )
College డిస్సిప్లినరీ కమిటీ మాత్రం చాలా సీరియస్ గా పనిచేస్తూ – కొంత మంది స్టూడెంట్స్ ని ఒక సంవత్సరం పాటు డిటైన్ చేసారు
ఇంతకీ జరిగిన విషయం ఏంటంటే ఇంజనీరింగ్ కాలేజీ కి కాలరెత్తుకుని మరీ వెళ్లిన నేను – 30 రోజుల్లోనే తిరుగు టపా కట్టాను – ఎంత కాలం ఇంట్లో ఉండాలో అన్న విషయం మీద ఏ మాత్రం క్లారిటీ లేదు
అది చివరకు దాదాపు 45 రోజుల పాటు పొడిగింపబడింది
రోజంతా ఖాళీ – అది ఆగష్టు నెల అనుకుంటా -బయట బలాదూర్ గా తిరగడానికీ అంత అనువైన సమయం కాదు
కంప్యూటర్ సైన్స్ అన్న బ్రాంచ్ లో చేరాను – కానీ ఇంకా ఏమీ కంప్యూటర్ సబ్జెక్టు లు చదవలేదు అప్పటికి
నాన్నగారు కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కి టైపింగ్ మంచిగా వస్తే మంచిది అన్న ఉద్దేశం తో ఒక టైపింగ్ మెషిన్ ని అద్దెకు తెప్పించి వుంచారు, ఇంట్లో హాల్ లో ఒక మూల ఉంచారు ( నా కోసం)
దాన్ని అప్పుడప్పుడు టక్కు ఠక్కు మని కొట్టే వాణ్ని 😉
ఒక రోజు మా ఇంట్లో పనిమనిషి అమ్మతో అంటూంటే నా చెవిన పడింది
అబ్బాయిగారు చదువు మానేసి ఇప్పుడు ఇంట్లో టైపింగ్ నేర్చుకుంటున్నారా అని ?
ఉక్రోషం పొడుచుకొచ్చింది –
ఇక టైపు నేర్చుకోవడం మానేసాను
కానీ ఆ 15 రోజుల టైపింగ్ కాస్తా నా స్పీడ్ ని సగటు స్టూడెంట్ స్పీడ్ కంటే బాగానే పెంచింది. క్రమ క్రమంగా వివిధ రకాలైన రైటింగ్ నా జీవితంలో ఒక ముఖ్య పాత్ర వహిస్తుంది అని తెలిసి ఉంటే ఇంకాస్త టైపింగ్ ప్రాక్టీస్ చేసేవాణ్ణేమో ?
అలా ఒక్క మాటలో నాలో అంత పరివర్తన బహుశా ఇంకెప్పుడూ కూడా జరగలేదు అంటే అతిశయోక్తి కాదేమో 😉
ఈ కథలోని పాత్రలు కొందరిని పోలి ఉండవచ్చు, ప్రదేశాలు చూసినవిలా ఉండవచ్చు, వస్తువులు ఎప్పుడో వాడినవిలా ఉండవచ్చు. చేసుకున్న వాడికి చేసుకున్నంత ప్రభుదేవా అని, వారి చేతలే నా చిట్టి కథలు.
ఆనందో బ్రహ్మ గోవిందో హార్ … నా పేరే ప్రేమ నీ పేరే ప్యార్…. అని పక్కింట్లో కఱ్ఱ బిళ్ళ ఆడుకుంటున్న కుర్రాడికి వినిపించేలా పెద్ద పెద్ద గా పాట పాడుకుంటున్నారు అమల, నాగార్జున. ఆ పాట అంటే ఆ కుర్రవాడికి ప్రాణం. అసలే యవ్వనాశ్రమానికి అద్దె కట్టలేక ఆపసోపాలు పడుతున్నాడు. ఇక ఇటువంటి పాటలు అతనిని కుదురుగా ఉండనిచ్చేవి కావు. ఆట మానేసి ఆ ఇంటి ప్రహరీ గోడకు ఆనుకుని నిలబడి కళ్ళు మూసుకుని ఆ పాటె తన్మయత్వంతో వింటున్నాడు. తలకి తగిలిన బిళ్ళ తన్మయత్వానికి గండి కొట్టింది. ప్రహరీ గోడకు వేసిన నిచ్చెన పై నిలబడి వాళ్ళ ఆట వీక్షిస్తున్న నీలవేణి పగలబడి నవ్వింది. కిలకిలా నవ్వుతూ ముత్యాలవాన కురిపిస్తున్న ఆ కన్నెకేసి కళ్ళార్పకుండా చూస్తుండిపోయాడు.
రేయ్ సెంది, బిళ్ళ సరిగ్గా చూసి పట్టుకోరా, బుర్ర ఇక్కడ పెట్టి ఆడకపోతే అలాగే బుర్ర పగులుతుంది అని ఒక వెటకారపు వాల్తేరు నవ్వు నవ్వాడు సెంది స్నేహితుడు ఆదిత్య.
రాత్రి భోజనాలు ముగించి పెరట్లో నులక మంచం మీద పడుకుని చల్లగాలి, చందమామతో, తనను చూసి నవ్విన, ఆ నిచ్చెన పై నీలవేణి గురించి కబుర్లు చెప్తున్నాడు. తన గురించి తెలుసుకోవాలని, తనతో మాట్లాడాలని కుతూహలం మొదలయ్యింది యువ సెందిర సేగరన్లో. బోర్లా తిరిగి నీలవేణి, సెందిల ఇళ్ల మధ్య ప్రహరీ కేసి చూశాడు. ఒక పది అడుగులు పైనే ఉంటుంది. గోడ ఎక్కి చూస్తే తను కనపడుతుందేమో, చూడనా, వద్దా !! తను ఏమన్నా అనుకుంటుందా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చూస్తే ? వచ్చి నాన్నకి చెప్తే ? తన కోసం ఎన్ని తన్నులైనా తినచ్చు. తన క్రీగంటి చూపులతో ఒక సారి చల్లగా చూస్తే ఎంతటి ఖేదమైన మోదమే కదా. తన నవ్వే నొప్పి నివారించే ఝన్డు బామ్ కదా అని శంకలకు శెలవు పలికి పెరట్లో మామిడి చెట్టు కింద ఉన్న వెదురు నిచ్చెన తీసుకుని ప్రహరి గోడకేసి బయలుదేరాడు. చుట్టూ పక్కల కలయజూసుకుని, ఎవరూ చూడటం లేదని రూఢి చేసుకుని నిచ్చెన ఎక్కి నీలవేణి ఇంట్లోకి తొంగి చూశాడు.
తల నిండా సన్నజాజులు, వెండి వెన్నెల పడి తళ తళలాడుతున్న వెండి పట్టీలు, పెరట్లో మల్లె తీగల పందిరి కింద మల్లె సువాసనలను గ్రోలుతూ, తన నుదుటిని మణికట్టుకు దిండుని చేసి అర్ధ నిద్రలో ఉన్న అలివేణిని చూస్తూ ఉండిపోయాడు. రోజూ రాత్రి భోం చెయ్యడం ఇంట్లో వాళ్ళందరూ నిద్ర పోయారో లేదో చూసుకుని ప్రహరీ గోడకు నిచ్చెన వెయ్యడం, సెంది దినచర్యలో భాగం అయిపొయింది. ఒకానొక రోజున ఆ వెధవ వెదురు నిచ్చెన కూసిన కూని రాగానికి ఉలిక్కి పడి లేచింది నీలవేణి. అర్ధరాత్రి వేళ ఆ గోడ మీద గుర్ఖాని చూసి కెవ్వున కేకేసింది. ఆ అరుపులకి భయపడి నిచ్చెన మీంచి నేలజారాడు సెందిర సేగరన్. పాపం కాలు విరిగి నడుము కదిలి బతుకు జీవుడా అంటూ నిచ్చెన తిరిగి చెట్టు కింద పడేసి, నులక మంచం పై జేరి, తలను దుప్పట్లో, బాధను పంటి కింద దాచుకున్నాడు.
మరుసటి రోజు కుంటుతూ కాలేజీకి బయలుదేరిన సెందికి, దారిలో గానుగ చెట్టు కింద వేచి చూస్తున్న నీలవేణి కనపడింది. అయిపోయాను, నిన్న రాత్రి జరిగిన విషయం గురించేనేమో. ఇప్పుడు ఏమి చెప్పాలి ? నేను కాదని చెప్పాలా ? ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పేసిందేమో, ఇహ ఇవ్వాళ నాకు తన్నులు తప్పేలా లేవు అనుకుంటూ తిరిగి మెల్లగా నడవనారంభించాడు. ఇంతలో సెందికి ఎదురుగా వచ్చి నిలబడింది నీలవేణి. సెంది గొంతు తడారిపోయింది, ఏదో చెప్పాలి అనుకుంటున్నాడు గానీ నోరు పెగలడం లేదు. ఒళ్ళంతా చల్లబారిపోయింది. శరీరం వణుకుతోంది.
క్షమించండి, మీరని తెలియక పెద్దగా అరిచాను. రాత్రి మీరు గోడ మీద నుంచి భళ్ళున పడ్డ శబ్దం వినిపించింది. మీకు ఏమయ్యిందో అని రాత్రంతా మనసు మనసులో లేదు. ఎందుకంత సాహసం చేశారు. నా కోసమేనా ?
అవునన్నట్టు తల ఊపాడు సెంది.
ఇంకెప్పుడు అలా చెయ్యకండి, మీకు నన్ను చూడాలనిపిస్తే ఏదో ఒక శబ్దం చెయ్యండి. నేను వచ్చి కనబడతాను. మీకు ఏమన్నా అయితే నాకు చాలా బాధ వేస్తుంది.
సెంది గుండె చప్పుడు నెమ్మదించింది. మనసు వర్ణించలేని స్థితిలో నిశ్చలంగా నిలిచిపోయింది.
సరేనండి, ఎవరైనా చూస్తారు, నేను బయలుదేరుతాను. మీరు జాగ్రత్త అని వెనుదిరిగింది.
నీలవేణి గారు, వణుకుతున్న స్వరాన్ని సరి చేసుకుంటూ పిలిచాడు సెంది.
చెప్పండి, ఏమని చెయ్యమంటారు ?
హా, అర్ధం కానట్టు చూసింది నీలవేణి.
అదేనండి, మిమ్మల్ని చూడాలనిపిస్తే ఏదో శబ్దం చెయ్యమ్మన్నారు కదా. ఏమి శబ్దం చెయ్యమంటారు ?
మీ ఇష్టమండి, నవ్వుతూ చెప్పింది నీలవేణి.
కాకిలా అరవమంటారా ?
అర్ధ రాత్రి కాకిలా అరిస్తే అనుమానమొస్తుందేమోనండి. మా ఇంట్లో ఎలాగూ ఒక గండు పిల్లి తిరుగుతోంది మీకు పిల్లిలా అరవడం వచ్చా ?
ఓహ్, దానికేం భేషుగ్గా వచ్చండీ. పిల్లి నవ్వినట్లు, ఏడ్చినట్లు కూడా చెయ్యగలను.
సరేనండి, మీరు ఈ రోజు రాత్రి గోడ దగ్గరకి వస్తే శబ్దం చెయ్యండి నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను అని చెప్పి నడుము తిప్పుతూ నడిచిపోయింది నీలవేణి.
ఈ విస్తారానందంలో విరిగిన కాలు గురించి మరచి వడి వడిగా తన వెనుక అడుగులు వెయ్యబోయి వెల్లకిల్లా పడ్డాడు సిల్లీ సేగరన్.
ఒకానొక ఆదివార సూర్యోదయ సమయాన, నీలవేణి జన్మదిన పర్వదినాన, తనకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసి బహుమతి ఇవ్వాలని గోడ దగ్గర చేరాడు. మియావ్. మియావ్ అని గండు పిల్లిలా రెండు సార్లు శబ్దం చేశాడు. పెరట్లో దంతావధానం చేసుకుంటున్న నీలవేణి వాళ్ళ బామ్మగారు ఎల్. విజయలక్ష్మిగారు అది విని, ఈ మాయదారి పిల్లి పీనుగకి మరీ వేళా పాళా లేకుండా పోయింది, దీని పిండం పిచ్చుకలు తిన అని కసురుకుంటూ చేతిలో ఉన్న కర్ర విసిరేసింది. ఆవిడ గురి వెంట్రుకవాశిలో తప్పి సెంది బుర్ర రామ కీర్తన తప్పించుకుంది. బామ్మగారి గురి తప్పినా నీలవేణి నాన్న గురి తప్పలేదు. పిల్లిలా అరవగలడు గానీ పిల్లిలా కనబడలేడు కదా. మేడ మీద నుండి సెందిర సేగరన్ నిచ్చెన బాగోతం అంతా నీలవేణి వాళ్ళ నాన్న రాజనాల చూసేసాడు.
ఒక రోజు సెంది కాలేజీకి వెళుతుండగా గానుగ చెట్టు కింద కాపు కాసి, సైకిలుకి అడ్డు నిలుచున్నాడు. ఒరేయ్ అబ్బాయ్, ఇదే చెప్తున్నాను విను, ఇంకొకసారి మా అమ్మాయికేసి చూసిన మా ప్రహరీ గోడకి నిచ్చెన వేసిన నూటారో గడిలో పాము మింగినట్టు మింగేస్తాను ఏమనుకుంటున్నావో. జాగ్రత్త అని చెప్పి అంతర్ధానమయ్యాడు.
ఆ భయంతో సెంది గోడ జోలికి పోలేదు. రాజనాల గారి ఇంటి ముందు తల ఎత్తేవాడు కాదు. బామ్మగారు పిల్లిని ఏ కుంకబోడి కుక్కో నోటకరుచుకు పోయింది అనుకున్నారు. నీలవేణి, సెంది మాత్రం అభినందన సినిమాలో కార్తీక్, శోభనలా విరహ గీతాలతో కాలం గడిపేస్తున్నారు.
ఒక రోజు పక్క ఊరిలో పెళ్లికని బామ్మగారు ఎల్. విజయలక్ష్మి గారు, నీలవేణి వాళ్ళ అమ్మ బాల సరస్వతి గారు, నీలవేణి బయలుదేరారు. సెందిర వాళ్ళ చుట్టాలు ఇంటికి చూరు వేసుకుంటున్నాం నిచ్చెన పట్రమ్మని కబురు చేశారు. నిచ్చెనను సైకిలుకి కట్టుకుని బయలుదేరాడు సెంది. పక్క ఊరికి వెళ్లాలంటే సన్నని పంట కాలువ దాటి పోవాలి, అడ్డంగా బద్దలుగా నరికిన తాటిచెట్లే ఆ ఊరికి ఈ ఊరికి వారధి. నీలవేణి, బామ్మగారు వంతెన దాటుతుండగా చెక్క చీకి పోవడం వలన విరిగి ఇద్దరు కాలువలో పడిపోయారు. అది చూసి, బాల సరస్వతిగారు భయంతో కాపాడండి కాపాడండి అని కేకలు పెట్టారు. అటుగా వెళ్తున్న సెందిర సేగరన్ ఆ కేకలు విని పరిగెత్తుకు వచ్చాడు. నీటి ఉధృతికి బామ్మగారు, నీలవేణి కొట్టుకుపోతూ కనిపించారు. నీళ్ళ లోకి దూకి వాళ్ళని కాపాడదామని రెండు అంగలు వెనక్కి వేసాడు. ఒక అడుగు ముందుకు వెయ్యగానే తనకు ఈత రాదన్న సంగతి జ్ఞప్తికి వచ్చింది. ఇప్పుడు ఎలా ? నీలవేణిని, బామ్మగారిని ఎలా కాపాడుకోవాలి ? ఇంతలో అతని బుర్రలో ఒక ఆలోచన మెరుపులా మెరిసింది. తన సైకిల్ వైపు పరుగెత్తాడు. సైకిలుని తీసుకుని వేగంగా బామ్మగారిని, నీలవేణిని దాటుకుని ముందుకు పోయాడు. సైకిలుకి కట్టి ఉన్న నిచ్చెన తీసి పంట కాలువకు అడ్డంగా వేసి దాని మీద పడుకున్నాడు. తన చేతిని బామ్మ గారికి కాలిని నీలవేణికి చాపి గట్టిగా పట్టుకోమని చెప్పాడు. సెంది కాలు పట్టుకుని నీలవేణి నిచ్చెన పైకి ఆ పై ఒడ్డుపైకి చేరింది. బామ్మ గారిని సెంది క్షేమంగా బయటకు లాగాడు. దూరంగా ఇదంతా చూస్తున్న బాల సరస్వతి గారు ఊపిరి పీల్చుకున్నారు.
బాల సరస్వతి ద్వారా విషయం తెలుసుకున్న రాజనాల సెందికి కృతజ్ఞతలు చెప్పి తన CA ఫైనల్ పరీక్షలు ఫస్టు క్లాసులో పాస్ అయ్యాక వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి తన మాగాణి వాళ్ళకి అప్పజెప్తానని ప్రమాణం చేశాడు .
పెళ్ళికి ఇంకొక వారం రోజులుందనగా….
వరి పైరు గాలి వాటానికి కొండపల్లి బొమ్మలా కదులుతోంది. పొలం మధ్యలో పదడుగుల ఎత్తున వెచ్చటి గడ్డిపై ధవళ వర్ణ దుప్పటితో అమరిన మంచె సేద తీరుస్తోంది, వివిధ భారతిలో వస్తున్న జార్జ్ మైఖేల్ కేర్లెస్ విస్పర్ పాట వీనుల విందు చేస్తోంది. నీలవేణి ఒళ్ళో తల పెట్టుకుని తను చుట్టిచ్చిన చిలకలు తింటూ అధరాలు పండించుకున్నారు..ఇద్దరు.
( డ్రోన్ కెమెరా మంచె నుంచి దూరంగా జూమ్ అవుట్ షాట్ తీసింది ).