Tag: #తెలుగు

  • చీకటి, నిశ్శబ్దం

    పెళ్ళైన వారానికి ఇంటాయన నన్ను, ఆ ఇంటిపైన పడకగది మధ్యలో ఉన్న దూలానికి ఓ రెండు ఇనుప పట్టీలతో నట్టు బోల్ట్‌లతో బిగించారు. అది నా జీవితానికి నాంది. మొదట్లో, రాత్రి 8 గంటలకు తిరగడం మొదలుపెడితే ఉదయం 5 కల్లా ఆగిపోయేదాన్ని.

    కొత్తగా పెళ్లైన జంట వారి మధుర క్షణాలను, చెవుల్లో గుసగుసలను, చెమటతో తడిసిన శరీరాలను, నా గాలిని ఆస్వాదిస్తూ నిట్టూర్పులను చూస్తూ నేను మురిసిపోయాను. దాదాపు 7-8 నెలలు ఆ గది కళకళలాడింది. ఆ తర్వాత ఒక నిశ్శబ్దం అలుముకుంది.

    కొన్ని రోజులకు, ఆ ఇంట్లో భార్య ఓ చిన్న పిల్లాడిని పట్టుకొని ఆ గదిలోకి వచ్చింది. అప్పటి నుండి నేను ఇంచుమించు రోజంతా తిరుగుతూనే ఉన్నాను. మళ్ళీ ఆ గది వారి గుసగుసలు, పిల్లాడి ఏడుపులతో కళకళలాడటం మొదలుపెట్టింది. వాడికి రెండు సంవత్సరాలు వచ్చేసరికి మళ్ళీ గదికి నిశ్శబ్దం అలముకుంది.

    అప్పుడప్పుడు ఒంటరిగా ఉన్న ఆ ఇంటి యజమాని కోసం నేను తిరుగుతూ, లేదా ఎవరూ లేని ఆ గదిలో నిశ్శబ్దంగా కాలం గడిపాను. ఆ గదే ఒక ఇల్లా లేక ఇల్లే ఒక గదా నాకు తెలియదు. నాకు తెలిసిందంతా ఆ గదిలోకి వచ్చి వెళ్లిన కొన్ని ప్రాణులు మాత్రమే. వారు తిరగమన్నప్పుడు తిరగడం, ఆగమన్నప్పుడు ఆగడం.

    ఇలా మరికొంత కాలానికి, ఆ గదిలోకి ఇంకో చిన్న ప్రాణి వచ్చింది. అందరూ దానిని ఇంటి లక్ష్మి అన్నారు. మళ్ళీ నేను రోజంతా తిరగడం మొదలుపెట్టాను. నేను తిరుగుతూనే ఉన్నాను, వీళ్ళు పెరిగి పెద్దవాళ్ళవుతున్నారు. మునుపటి గుసగుసలు, ముద్దుముచ్చట్లు ఇప్పుడు కొంచెం కరువయ్యాయి. వాటి బదులు “డబ్బులు, బరువులు, బాధ్యతలు” అన్నవి చాలా వినిపించాయి. కొత్తలో చిన్నచిన్నగా మాట్లాడే వీరు ఇప్పుడు అప్పుడప్పుడు అరుపులు, కేకలు వేసుకోవడం, ఎడమొహం పెడమొహం పెట్టుకోవడం, అటువైపు తిరిగి పడుకోవడం లాంటివి జరుగుతున్నాయి. నా పని నేను తిరుగుతూ చేస్తూనే ఉన్నాను.

    మొదట్లో నన్ను తరుచూ శుభ్రం చేస్తుండే వారు, ఇప్పుడు కొంచం వ్యవధి పెరుగుతూ వస్తుంది.

    అప్పుడప్పుడు ఆ గదిలోకి ఇంకో వ్యక్తి వస్తూ ఉండేవాడు. పిల్లలు అతన్ని ‘మావయ్య’ అనేవారు. సరదాగా నవ్వుతూ నవ్విస్తూ ఉండేవాడు. పిల్లలు కూడా చాలా ఆనందంగా అతనితో ఉండేవారు. ఒకసారి ఎప్పుడో ఆ అమ్మాయికి 8-9 సంవత్సరాలప్పుడు, ఆ వ్యక్తి ఒక్కడే ఆ అమ్మాయితో గదిలోకి వచ్చాడు. ఆ అమ్మాయిని ఎక్కడెక్కడో తాకుతూ మాట్లాడుతున్నాడు. అమ్మాయి ఎందుకో అసహనంగా కదులుతోంది. నాలోనుండి ఎందుకో ఒక మూగ అరుపు వచ్చింది. అది ఇప్పటికీ ఉంది. అలాంటివి ఓ నాలుగైదు సార్లు జరిగినట్టు గుర్తు. తరువాత ఇంకెప్పుడూ చూడలేదు. మధ్యలో నాకు కెపాసిటర్ పోయిందని, బేరింగ్ పోయిందని బయటకు తీసుకువెళ్లి మార్చారు. కానీ ఆ మూగ అరుపు మాత్రం పోలేదు. నేను అరుస్తూనే ఉన్నాను కానీ ఎవ్వరికీ వినబడలేదు.

    ఈ మధ్యనే ఆ అమ్మాయికి పెళ్ళైతే ఆ గది అమ్మాయికి, అబ్బాయికి ఇచ్చారు. మళ్ళీ మొదట్లో లా గుసగుసలు వినిపించాయి, చెమటతో తడిసిన శరీరాలు, నా గాలిని ఆస్వాదిస్తూ నిట్టూర్పులు వచ్చాయి. అది కూడా ఒక మూడునాళ్ళ ముచ్చటే. మళ్ళీ వాళ్ళను చూడటం అరుదు. అబ్బాయికి కూడా పెళ్లయిందని విన్నాను కానీ వారిని చూసింది లేదు. వీరికి పిల్లలు పుట్టినప్పుడు మళ్ళీ నాకు ఎక్కువ పని పడింది కానీ అది కూడా మూడునాళ్ళ ముచ్చటే.

    కాలం గడుస్తోంది, నేను తిరుగుతూనే ఉన్నాను. నేను నెమ్మది అవుతుంటే నాకు ఒక కెపాసిటర్ మారుస్తూనే ఉన్నారు. ఆ ఇంటి యజమాని ఇప్పుడు డబ్బులు, బరువులు, బాధ్యతలు గురించి మాట్లాడటం మాని ఏదో దేవుడు, పూజలు, పునస్కారాలు అంటున్నాడు. ఆవిడ కూడా ఇంచుమించు అలాగే. మనవలు, మనవరాళ్లు, పిల్లలు వచ్చినప్పుడు నా గది కొంచెం కళకళలాడుతుంది, మళ్ళీ కొన్నాళ్ళకు నిశ్శబ్దం.

    ఈ మధ్యన ఆ ఇంటి యజమాని, ఆవిడ కనిపించడం మానేశారు. ఓ ఆరు నెలల తరువాత నా గదికి సున్నాలేస్తూ నన్ను తీసి ఓ డబ్బాలో పెట్టి కొట్టు గదిలో పడేశారు. ఇలా ఇక్కడ ఎన్ని రోజులు ఉన్నానో తెలియదు, ఎన్ని రోజులు ఉంటానో తెలియదు. చుట్టూ చీకటి, నిశ్శబ్దం.

  • ఉగాది మేల్తలపు

    తీపీ కారం చేదూ వగరూ
    ఉప్పూ పులుపూ కలగలుపూ
    కష్టం నష్టం బాధల వెంటే
    సుఖసంతోషాలు; కొసమెరుపు

    గడచిన కాలం ఇక్కట్లు
    కాలం తీరిన ముచ్చట్లు
    నేడు రేపు ముందునాళ్ళు
    ఆశల పూతల పొదరిళ్ళు

    బతుకు భారమని వెఱవకు నేస్తం
    సుఖం నీదంటు మురియకు నిత్యం
    వెతలు వేదనల ఆటుపోటులను
    దాటుకు చేరగ సుఖశాంతుల తీరం

    సుఖము శాంతి వ్యధ ఆశాంతి
    భోగం భాగ్యం కోపం తాపం
    విస్తరి నిండుగ విందు భోజనం
    ఎరిక తెలియగా అనుభవ సారం
    జగతికి నేడిది ఉగాది సందేశం
    ఓడి గెలవమని ‘పరాభవ’ పాఠం

    #వెన్నెల, #తెలుగు, #అమ్మనుడి, #ఉగాది, #పండుగలు, #పరాభవనామసంవత్సరాది

    @vennela

    1
  • హోలీ పండగ

    మన తెలుగు లోగిళ్ళలో సుప్రసిద్ధం కానప్పటికీ, మన ప్రాంతాలలో కూడా ఈ పౌర్ణమినాడు కొందరు ‘హోలికా దహనం’ పేరిట ఇళ్ళముందు భక్తితో చితుకులు పేర్చి మంట చేయటం, నరసింహ స్వామిని కొలవటమనే ఆచారమున్నదంటారు, ఎరిగిన పెద్దలు.

    ఉత్తరాది రాష్ట్రాల వారిలోనూ, గత ముప్ఫైఐదు ఏళ్ళుగా నన్ను ఆదరించిన మహారాష్ట్రులకూ కూడా ఇది ఒక ముఖ్యమైన పండగ. సాధారణంగా వీధులన్నింటా ప్రతి వంద, రెండువందల అడుగుల దూరంలోనూ, ఆయా చుట్టుపక్కల వారు సామూహికంగా హోలికా దహన వేడుకలు జరుపుకోవటం చూడగలం.

    సాయంత్రం వేళలో చిన్న చిన్న కట్టెపుల్లలు, కర్రలు, పిడకలను ఎత్తుగా పేర్చి మంట చేస్తారు. ఆ మంట చుట్టూ నీళ్ళు వదులుతూ ప్రదక్షిణలు చేసి, మంట చల్లారిన తరువాత మిగిలిన మసి/బూడిదను నుదుటిపై బొట్టుగా ధరిస్తారు.

    సాధారణంగా వినపడే ఐతిహాసిక గాథ ప్రకారం, హోలిక ఒక రాక్షస స్త్రీ. హిరణ్యకశిపుని చెల్లెలు; ప్రహ్లాదుడికి మేనత్త. శ్రీమన్నారాయణుని పేరైనా వినరాదని శాసించిన హిరణ్యకశిపునికి చివరకు, హరినామ స్మరణే సర్వమూ అయిన తన పేగుబంధం ప్రహ్లాదుడు కూడా శతృవే. నయానా భయానా కూడా హరి భక్తి వీడని ప్రహ్లాద కుమారుని మట్టు పెట్టాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవగా, అతడిని మంటలలో పడవేయటమే మార్గమని, అందుకూ సిద్ధమౌతాడా రాక్షసరాజు. అయితే పాము కాటు, కొండపైనుండి త్రోసివేయటం వంటి దారుణాలకు కూడా చెక్కుచెదరని బాలుడు మంటలకు అంతమౌతాడా అన్న సంశయం అతడిని వేధిస్తుంది. అప్పుడతడి సోదరి హోలిక ప్రహ్లాదుడిని తన ఒడిలో కూర్చుండబెట్టి, తమ ఇద్దరినీ అగ్నిలో దగ్ధం చేయమని అన్నకు సలహా ఇస్తుంది. ఈమె వద్ద ఒక మాయా వస్త్రం ఉంటుంది. అది శరీరంపై ఉన్నంతవరకూ ఏ మంటలూ ఆమెనేమీ తాకలేవు. ఆ. కారణంగా, ప్రహ్లాదుడు అంతమొందినా, తాను సురక్షితమేనని, అన్నగారికి నచ్చచెపుతుంది.

    ఈ ఉపాయం మెచ్చిన దానవుడు ఆవిధంగానే, కొడుకుని హోలిక ఒడిలో కూర్చుండ చేసి, వారిరువురినీ అగ్నికి ఆహుతి చేయబూనుతాడు. కానీ దైవీకంగా, మంటలు ప్రజ్వరిల్లే సమయంలో హోలిక కప్పుకున్న పైతొడుగు జారి ప్రహ్లాదునిపై పడుతుంది. పైవాడిదే భారమన్న భక్తుడికి అగ్గి సోకదు. భగవంతుడి మాయాజాలం ముందు మరే మాయలూ పని చేయవని ఎరుగని రాక్షసి అనలుడి ఆకలి తీర్చే ఆహారమౌతుంది.

    ఈ కథ ఏ ఇతిహాసంలోనిది, దీని ప్రామాణికత ఏమాత్రమన్నది నాకు తెలియదు. ఇక్కడి నేస్తుల ద్వారా నేను విన్నదిది.

    అలాగే, అంతగా భ్రాతృప్రేమ కనపరచి, అన్నకి సేవ, సహాయం చేసే ప్రయత్నంలో తన ప్రాణం కూడా పోయినా లెక్కచేయని త్యాగమూర్తిగా హోలికని అభిమానించే వారు, జాలి కురిపించే వారెవరితోనూ నాకేమీ వివాదం లేదు. దుర్యోధనుడు, కర్ణుడు, ఏకలవ్యుడు, రావణాసురుడు, శూర్ఫణఖ… వీరందరికీ వేలకొద్దీ అభిమానులు ఉండగా, హోలికకు మాత్రం ఎందుకుండకూడదు!? ఎవరి ముచ్చట వారిది.

    ఈరోజు ఒక స్నేహితుడితో ఈ పండగ గురించి, పోతనగారి భాగవతామృతం గురించి మాట్లాడుతుండగా, నాకు తోచిన మరొక ఆలోచన,

    ప్రహ్లాదుడు జీవాత్మ. అనిత్యము, అస్థిరమైన దేహంలో కొట్టాడుతూ, ఇహపరమైన కోర్కెల వలయాలను ఛేదించుకుని పరమాత్మలో లీనమయేందుకు పరితపించే స్థితి.

    చంచలమైన మనసును దారి మళ్ళించి పరమాత్మపై కేంద్రీకరించటం ఎలాగో ఎరుగక భౌతికమే శాశ్వతమనే భ్రమలో కాలచక్రానికి ఎరయై తపించే జీవుడే హిరణ్యకశిపుడు.

    హోలిక భవబంధాలు, మాయామోహాలతో మనసును కట్టి పడవేసే పాశం.

    ఐహికం నుండి ఆముష్మికం వైపు నడిపించే జ్ఞానమే అగ్ని.

    మాయకు వెఱువక మనోనిగ్రహంతో పరమాత్మ అనే జ్ఞానార్జన కోసం అగ్ని పరీక్షకు సిద్ధమవటమే భక్తి.

    మోహమాయలన్నీ జ్ఞానాగ్నిలో దగ్ధం కాగా ఇహము విడచి పరములో మనసు నిక్కమైననాడు జీవాత్మ పరమాత్మ అభేద్యాలనే సత్యం గ్రహించటమే ముక్తి.

    అదే ప్రహ్లాద చరితం. అందుకే నరసింహావతారం.

    “సంసార మిది బుద్ధిసాధ్యము గుణకర్మ

    గణబద్ధ మజ్ఞానకారణంబుఁ

    గలవంటి దింతియ కాని నిక్కము గాదు సర్వార్థములు మనస్సంభవములు

    స్వప్నజాగరములు సమములు గుణశూన్యుఁ

    డగు పరమునికి గుణాశ్రయమున

    భవవినాశంబులు వాటిల్లి నట్లుండుఁ

    బట్టి చూచిన లేవు బాలులార”

    “కడఁగి త్రిగుణాత్మకము లైన కర్మములకు

    జనకమై వచ్చు నజ్ఞాన సముదయమును

    ఘనతర జ్ఞానవహ్నిచేఁ గాల్చి పుచ్చి

    కర్మవిరహితు లై హరిఁ గనుట మేలు”

    ప్రహ్లాద చరిత్రము, బమ్మెర పోతనామాత్య విరచిత శ్రీమద్భాగవత పురాణ సప్తమ స్కంధము. 🙏

    **** ****

    ముందునాళ్ళన్నీ మీకు, మీవారందరికీ అనేక రంగుల సొబగై, అనునిత్యం దేదీప్యమానమై వెలుగొందాలని మనసారా కోరుకుంటూ, మీ అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. 🤗💙

    #వెన్నెల, #తెలుగు, #అమ్మనుడి, #పండగలు, #హోలీ, #భక్తి, #ఆధ్యాత్మికం.

    @vennela

    5
  • శివోఽహమ్

    ఎదికి ఎదికి ఇక యాసిరికాయెర
    జీవము పులిసిపాయెయో శివిగా
    అలసి సొలసి నే కునుకుల బడితో
    కలలల కలవరమాయయొ శివిగా

    నేను నేనంట బెమ్మము ఇస్నువు
    ఆమట్న తన్నకలాడిరంటనే శివిగా
    నీ మొదులూసివర జూసిరామని
    లింగ రూపిగ వొస్తివంటయో శివిగా

    పుట్టిల్లు నాదని నీయాలి బోవగా
    సతికి అగమానమాయెనే శివిగా
    కచ్చగట్టి నువు జడను పెరికితే
    దక్స యగ్గెము ద్వంసమ శివిగా

    సురాసురులు దేవసుర కోసము
    ఆగము ఆగమయిరంటనే శివిగా
    కడలి చిలుకంగ సిరినీ సిరులను
    హరి నూక్కపాయనంటనే శివిగా

    దాయాదులు అట కయ్యమాడితే
    హాలాహలము నీ విందట శివిగా
    సకల లోకాలు సల్లగుండమని
    సర్వమంగల పుస్తెల ఆనట శివిగా

    బాగ్యలశ్మి నీ సెల్లెలు వొరసట
    దిసెమొల తిరుగుడేంది మరి శివిగా
    అన్నపూర్నమ్మ నింటిల బెట్టుకు
    అడక్కదినుడు అదేందయో శివిగా

    బ్రెమ్మగారి మునిమనవడడిగెతే
    పెండ్లాము నంపుడేందిరో శివిగా
    గజాసురుడు ఒగతూరి పిలుసుతే
    ఇలు వాకిలి గానవంటనే శివిగా

    ప్రెతి అడిగిన కొడుకుల కోరిక దీర్సుట
    నీ కొంపకు కొరివిర శివిగా
    దేవరవెంతో ఎర్రి నీకంత
    నిను ఒంటిగ బాయుదెట్లరో శివిగా

    కిరిని గొట్టిన దొరను నేనంట
    కిరీటితో యుద్దమబద్దమ శివిగా
    దరమము సత్తెము నిలపనీకె
    పాశుపతము వరమీయవె శివిగా

    కాలమైంది ఇగ రామని కాలుడు
    మార్కొండేలును ఇగ్గబోతెనూ శివిగా
    ఆ పొట్టెగాడు నా రక్సనలోనని
    నివు రచ్చ జేసుడు వయనమ శివిగా

    ఎన్ని తూర్లు నువు గూడు దెంపినా
    సాలీడు నిను ఇడసకుండుటే శివిగా
    సొల్పజీవమది బక్తి లావు జూడని
    నీతాన సోటు దొరకబెడితివే శివిగా

    సర్వము సకలము బర్త నీవట
    కరమలన్నింటి కర్తవంటయో శివిగా
    మనికి మశానం మిత్త పిశాచం
    నీ కత అయోమయమయో శివిగా

    సత్చము శివము సుందరమంటా
    నీకడ సాగిల బడతము శివిగా
    కన్నులు మూసుకు నీలో నువ్వే
    సిలక నవ్వు లెవురికోసమె శివిగా

    ఎన్ని కతలు నీవెన్ని మాయలుర
    శాన సిత్రాపు రాయుడవు శివిగా
    శివరాత్రి ఈపొద్దు ఇనవె నాసుద్దు
    నను నీకాడ నుంచుకోగదే శివిగా

    8
  • రాజమ్మ

    “ముసలిది ఇంకా ఎంత కాలం బ్రతుకుతాదో, చెయ్యలేక చస్తున్నా” అంటూ పక్క ఎక్కింది సుమిత్ర. ఏమమనకుండా మౌనంగా విన్నాడు పరమేశం. ఆ ముసలిదీ ఆయనకు నానమ్మ పేరు రాజమ్మ, గత ముప్పై ఐదు ఏళ్ళుగా మంచాన పట్టి ఉంది. మాట రాదు, ఎవ్వరిని గుర్తుపట్టదు, ఒంట్లో ఏ అవయవం కదల్దు. 


    ఒరిస్సాలో జయపూర్లో మెయిన్ రోడ్కు కుడి పక్క తెలుగు వారు, ఎడమ పక్క ఒరియా వారు ఎక్కువగా ఉంటారు. కుడిపక్క మెయిన్ మార్కెట్ దగ్గర మహారాణిపేటలో రాజమ్మ ఉంటుంది. వడ్డీవ్యాపారం ఆవిడా చేసినంత పద్దతిగా ఎవ్వరు ఉండరేమో. ప్రతీ పని లెక్క ప్రకారమే జరగాలి, వంట కూడా లెక్క ప్రకారమే, మనిషికి ఒక వంకాయ అంటే ఒక్కటే రెండోది కావాలి అని అడిగినా దొరకదు, గరిటెడు పప్పు మనిషికి అంటే గరిటెడే.

    రాజమ్మ భర్త పేరు ఎవ్వరికీ తెలియదు, అందరు అతన్ని రాజమ్మ మొగుడనే పిలుస్తారు. వారికి ఐదుగురు పిల్లలు మొదట ముగ్గురు కొడుకులు తరువాత ఇద్దరు కూతుళ్లు. మొదటివాడు కోదండరామయ్య, రెండోవాడు జానకిరామయ్య, మూడోవాడు అచ్చుతరామయ్య, కూతుళ్లు కౌసల్య, జానకి.

    ఊరిలో మెయిన్ మార్కెట్లో ఓ కొట్టులో తన దగ్గర వడ్డీకి డబ్బులు తీసుకొని కట్టలేని ఓ ఆసామి దగ్గర తీసుకొని పెద్దవాడిచేత కిరానా వ్యాపారం పెట్టించింది రాజమ్మ. మిగతా ఇద్దరినీ వేరే రెండు కోట్లలో పనికి పెట్టి, పని నేర్చుకోమంది. కూతుళ్ళకు తన వడ్డీ వ్యాపారం మెళుకువలు నేర్పింది.చదువులేవి పెద్దగా అబ్బక పోయినా వ్యాపారం మాత్రం అందరికి నరనరాల్లో జీర్ణమైనట్టు చూసింది.

    మొదటివాడికి రాజాం, రెండోవాడికి విజయనగరం, మూడోవాడికి గరివిడి, ఆడపిల్లలికి ఒరిస్సాలో నవరంగపూర్, మత్తిలి సంబంధాలు చేశారు. కూతుళ్లు అత్తవారింటికి వెళ్లిపోగా రెండోవాడు, మూడోవాడు ఇక్కడ ఉంటె పెద్దోడికి మళ్ళి ఎదురొస్తారు అని చెప్పి విజయనగరం, గరివిడి పక్కన చీపురుపల్లిలో వ్యాపారాలు పెట్టించింది రాజమ్మ.

    పెద్దోడు రోజూ రాజమ్మకు లెక్కలు చెప్పాల్సిందే, మిగతా ఇద్దరు మొదట్లో నెలకొకసారి జయపూర్ ఇంటికి వచ్చి లెక్కలు అప్పచెప్పేవారు. ఇంకా వారు రాజమ్మ పెట్టిన పెట్టుబడి తిరిగిచ్చిన తరువాత నెమ్మదిగా ఏదో ఒక సాకుతో రాకపోకలు తగ్గించేశారు.

    కోడలికి వండవలసిన పప్పు, ఉప్పు, నూనె అన్నీ కొలత ప్రకారం ఇచ్చి మిగతావి ఓ అల్మెరలో పెట్టి తాళం వేసి, తాళం తన దగ్గర పెట్టుకునేది. కోదండరామయ్య భార్య వరలక్ష్మికి అత్తగారి పద్ధతులు కొలతలు మొదట్లో కొంచం కష్టమనిపించినా నెమ్మదిగా సర్దుకు పోయింది.

    ఓరోజు రాజమ్మకి ఒంట్లో నలతగా ఉంటె ఊరిలో డాక్టర్కి చూపిస్తే, వైజాగ్ తీసుకెళ్లి పరీక్షలు చేయించామన్నారు.

    “డాక్టర్లు అలాగే అంటారు పర్లేదులేరా, అదే సర్దుకుపోతుంది” అన్నాది రాజమ్మ.

    అది జరిగిన వారం రోజులకు పక్షవాతం వచ్చి కాలు చేతులు నోరు పడిపోయింది. అది మొదలు ఆవిడ మంచం దిగింది లేదు. ఇంట్లో అన్ని పనులు వారలక్ష్మే చూసుకొనేది. ఇంట్లో సాయానికి మనిషిని పెట్టుకున్న ఒప్పుకునేది కాదు రాజమ్మ. నోరు లేకపోయినా ఏదో ఒకటి అరుస్తూనే ఉండేది. నెమ్మదిగా ఆ అరుపులు కూడా నోటి నుండి రావడం ఆగిపోయింది.

    కోదండరామయ్య, వరలక్ష్మి దంపతులకు ఇద్దరు పిల్లలు కొడుకు, కూతురు.


    “చచ్చి ఏ లోకన్నా ఉందో కానీ మా అత్తమ్మ బ్రతికున్నతకాలం ఈవిడకి సేవలు చేస్తూ పోయింది ఆ మహాతల్లి” అంటూ అత్తగారిని గుర్తుచేసుకుంది సుమిత్ర. 

    వరలక్ష్మిగారు కాలం చేసి ఇప్పటికీ ఆరేళ్ళు. అప్పటినుండి రాజమ్మ సేవ అంతా సుమిత్ర, పరమేశం పైనే పడింది. కోదండరామయ్య వయసు కూడా డబ్బై పైనే. ఆయనకి కొంత దిగులుగానే ఉంటుంది, తల్లికి తలకొరివి పెట్టకుండా వెళ్ళిపోతానేమో అని. సొంత ఊళ్ళో వ్యాపారం, తాతలనాటి ఇంట్లో ఉన్నందుకు తల్లిని చూసుకునే బాధ్యత మొత్తం పెద్దకొడుకు పైన పడింది. మిగతా ఇద్దరూ తల్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటారే కానీ ఆవిడని మాత్రం ఒక్క వారం రోజులు కూడా తమ దగ్గర ఉంచుకోరు. 

    “పెద్ద కుటుంబం, అవసరానికి అందరూ సాయం ఉంటారు అని ఈ సంబంధం చేశారు మా నాన్నా. ఏం సాయం ఒక్కరు అక్కరకు రారు” అంది 

    “ఇరువరెండేళ్లు అయింది అది జరిగి, ఇంకా తవ్వుతావా ఆ విషయాన్ని. మనకీ ఓ కొడుకు, కూతురు ఉన్నారు, వాళ్ళు కాలేజీకి వెళ్తున్నారు” అన్నాడు పరమేశం కొంచం బాధగా. 

    “అదే కదా నా బాధ, పదేళ్ళైంది ఇంట్లోనుండి బయటకు వెళ్ళి. ఓ గృహప్రవేశానికి కానీ, పెళ్లికి కానీ, ఫంక్షన్ కానీ వెళ్ళి ఒక పూట మావాళ్ళతో గడిపింది లేదు. ఎప్పుడూ ఇల్లు ముసలిది, అదే గొడవ అదే తంతు” అంటూ వాపోయింది. 

    “మా అత్తమ్మ వెళ్తూ వెళ్తూ నా గుదిబండ నీకు తగిలిస్తున్నానే అని పాపం ఎంత బాధ పడ్డాదో.” వరలక్ష్మమ్మ కోడల్ని కన్నకూతురుకన్నా ఎక్కువగా చూసింది. కూతురు కన్నా ముందు కోడలికి పెట్టేది అందుకేనేమో అత్తగారు, అత్తయ్య బదులు అత్తమ్మా అంటాది సుమిత్ర. 

    “మన చేతిలో లేనిది మనం ఏం చేస్తాం చెప్పు, గట్టిగా అనకు నాన్న వింటే బాధపడతారు” అన్నాడు.

    “ఇంకో విషయం రేపు నర్స్ రాదట. అదో ఎక్స్ట్రా డ్యూటీ మనకి. ఎన్ని అనుకున్న ఏమౌతుంది జంగపోడు నానమ్మకు ఇల్లు కట్టినట్టే, షరా మామూలే, పడుకోండి” అంటూ లైట్ ఆపేసింది.

    వరలక్ష్మమ్మ అత్తగారు నడిచినంత కాలం కోడల్ని బాగానే సాధించుకు తిన్నాదని, నడవలేక పోయినా కూడా బాగానే సేవ చేయించుకుంది అనే వారు కోడలితో. 


    ఇంకా కొన్నాళ్ళు ఆ సేవ, తిట్లు కార్యక్రమం జరిగిన తరువాత, ఒక రోజు రాజమ్మ ఉలకలేదు పలకలేదు. డాక్టర్ వచ్చాడు పోయినట్టే అని తేల్చేశాడు. అందరికీ కబురులు వెళ్ళాయి, కొడుకులు కూతుళ్లు కోడళ్ళు అల్లుళ్ళు మనవళ్ళు మనవరాళ్లతో ఇల్లు చాన్నాళ్లకి కళకళలాడింది. అది చావింటి కన్నా పెళ్ళింటి లా ఉంది. ఒక్క కొండదరామయ్యగారు కొంత బాధలో ఉన్నా తమ్ముళ్లు చెల్లెల్లు మాటలతో కొంత తేలిక పడ్డారు. 

    మొత్తానికి శవాన్ని శ్మశానం చేర్చారు. కట్టెలమీద కన్నా ఎలెక్ట్రిక్ ఐతే సులభం ఇంకా తొందరగా అయిపోతుంది అని అందరూ నిర్ణయం తీసుకొని దానికి సంబంధించిన బల్ల మీద పడుకోబెడుతుంటే ఏదో మూలుగులా వినిపించింది. 

    పరమేశం సుమిత్ర కళ్లలో తను ఉదయం చూసిన ప్రశాంత గుర్తుకు వచ్చి ఏం మాట్లాడలేదు

    మిగతావారు కూడా మళ్ళీ సెలవులు పెట్టాల్సి వస్తుందేమో అని సైలెంట్గా ఉండిపోయారు. 

    దూరంగా కూర్చున్న కొండందరంమయ్యగారితో ఎవ్వరు ఏది అనలేదు. అది ఎవ్వరు మాట్లాడుకొని చర్చించని ఒప్పందంలా ఉండిపోయింది. 

    కొంత సేపటికి రాజమ్మ బూడిదతో బయటపడ్డారు. 

  • అభీ నజావో ఛోడ్ కర్

    అభీ నజావో ఛోడ్ కర్

    అలెక్సాలో “అభీ నజావో ఛోడ్ కర్” అన్న పాట వస్తోంది. ఆ పాట విన్నపుడల్ల తనకు ఎక్కడ లేని పులకింత వస్తుంది. జయదేవ్నీ రఫీనీ ఆషాని మెచ్చుకోకుండా ఉండలేడు. అంత మధురంగా ఉంటుంది, గ్లాస్ లో సింగల్ మాల్ట్ వేసుకొని స్టూడియోలోని కుర్చీలో కూర్చొని ఆ ఆరు పెయింటింగ్స్ వైపే చూస్తున్నాడు.

    గిరీశం ఇప్పటికి 6 సార్లు వెయ్యటానికి ప్రయత్నించాడు ఆ పోర్ట్రయిట్, అన్ని సార్లు ఆవిడ మొహం పోలికలు వస్తున్నాయి కానీ ఫొటోలో ఆవిడలా అనిపించడం లేదు. “తనకు ఏమైంది ఎంత సులువుగా వేస్తాడు మొహాలని, అటువంటిది 6 ప్రయత్నాలా” అని ఆలోచిస్తూ కూర్చున్న గిరీశానికి గతం ఒక్క సారిగా గుర్తుకు వచ్చింది.


    గిరీశం నాన్నగారికి ఉద్యోగరీత్యా తరుచూ ట్రాన్స్ఫర్లు అవుతుండేవి, ఆలా పది రోజుల క్రితం ఆ కొత్త ఊరు చేరుకున్నారు. కొత్త ఇల్లు కొత్త ప్రదేశం, కొత్త స్కూలు. అన్నయ్య అక్క ఇద్దరూ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటూ చదువుకునేవారు. ఊరికి ఒక వైపు గోదావరి ఇంకో వైపు పచ్చని పొలాలు. గిరీశానికి ఈ ఊరు ఎంతగానో నచ్చేసింది, చిన్నప్పటి నుండి బొమ్మలు వెయ్యడం అంటే ఎంతో సరదా, బొమ్మలు వేస్తూ చుట్టూ లోకం మర్చిపోయేవాడు.

    ఓ రోజు సాయంత్రం డ్రాయింగ్ బుక్ పక్కన పెట్టి పెరట్లో ఉన్న పచ్చని పైరులు చూస్తూ మైమరచి పోతున్న టైములో పక్క డాబా మీదకి సన్నజాజుల వాసనతో పాటు, “కన్నె పిల్లవని కన్నులున్నవని” పాట హుమ్మింగ్ వినపడడంతో తిరిగి చూసాడు, లంగా వోణి వేసుకొని మేడ పైన ఆరవేసిన బట్టలు తీస్తూ ఓ అమ్మాయి. ఆలా ఎంతసేపు చూశాడో తెలియదు కానీ, ఆ అమ్మాయి తన పని తానూ చేసుకొని వెళ్ళిపోయింది.

    కింద నుండి అమ్మ పిలుపుతో ఈ లోకానికి వచ్చాడు. కింద పిట్టగోడ దగ్గర పక్కింటివాళ్లతో మాట్లాడుతూ అమ్మ పిలుస్తోంది. పరిగెత్తుకుంటూ కిందకు వెళ్ళంగానే “వీడేనండి మా మూడో వాడు గిరీశం, ఈ సంవత్సరమే 10వ క్లాసులోకి వచ్చాడు” అని పరిచయం చేసింది. అక్కడున్న వారికి నమస్కారం చేసి లోపలి వెళ్లబోతుండగా ఆ అమ్మాయి వచ్చింది. “మా రెండో అమ్మాయి నాగవల్లి, ఇంటర్ ఎంపీసీ రెండో సంవత్సరం చదువుతుంది ” అంటూ పరిచయం చేసారు. “మావాడికి లెక్కలు, సైన్స్ లో చాలా తక్కువ మార్కులు వస్తాయి, కొంచం చెప్పమ్మా నీకు పుణ్యం ఉంటాది ” అంటూ అమ్మ అప్పుడే నా కోసం మొత్తం చెబుతూ ఉంటె, “అమ్మా ” అంటూ లోపలి వెళ్ళిపోయాడు.

    లోపలి వేళ్ళాడే కానీ ఆలోచనల్లన్ని నాగవళ్లి పైనే, తాను పుస్తకాల్లో చూసిన వాపా, బాపు బొమ్మలా ఉంది. (వాపా పూర్తి పేరు మొన్న మొన్నటి వరకు తనకు తెలియదు, బాపు అంటే గాంధీ చుట్టమేమో అనుకునేవాడు చిన్నప్పుడు) ఆ నవ్వు ఆ కళ్ళు, ఆ నడక వర్ణించలేడు. అప్పుడే రేడియోలో “రవి వర్మకే అందని ఒకే ఒక అందానివో” పాట వచ్చింది. బాలసుబ్రహ్మణ్యం అంట పాట పాడింది. భలే అనిపించింది మొదటి సారిగా.

    పొద్దున్నే రేడియోలో సంస్కృత వార్తలు వచ్చే సమయానికి లేవడం, అన్ని కానిచ్చి చద్దన్నం తిని భక్తిరంజని వచ్చే సమయానికి భుజాన స్కూల్ సంచి వేసుకొని స్కూల్కి వెళ్లడం ఏ వూరు వెళ్లిన ఇదే తన దినచర్య. ఈరోజు కొత్త వూరిలో కొత్త బడి బయటకు వెళ్తూ పక్కింటి వైపు చూసాడు నాగవల్లి ఏమైనా ఈ టైములో కాలేజీకి వెళ్తుందా అని. ఎవ్వరు కనబడకపోవడంతో నెమ్మదిగా స్కూల్ వైపు అడుగులు వేసుకుంటూ వెళ్ళాడు. సాయంత్రం తెలిసింది ఏమిటంటే నాగవళ్లి ఉదయం ఏడింటికే బాక్స్ పట్టుకొని బుస్సుకి పక్క ఊరిలో కాలేజీకి వెళ్తుందని. రేడియోలో “చిలక సిలికా” అన్న పాత పాట ఏదో వస్తుంది. (నా పాట నీ నోట పలకాల సిలకా నీ బుగ్గలో సిగ్గు లోలకాల సిలకా – ఘంటసాల సుశీలగారు పాడిన పాట)


    ఇంతలో అన్నయ్య ఫోన్ వస్తే ఈ లోకంలోకి వచ్చాడు గిరీశం. “ఎరా US నుండి నీకు ఏమైనా కావాలా ” అని అడుగుతుంటే తనకి కావలసిన ఓ రెండు వస్తువులు చెప్పి, మిగతా విషయాలు మాట్లాడి ఫోన్ పెట్టేసాడు. ఓ గుడ్డని టర్పెంటైన్లో ముంచి పెల్లెట్ పైన మిగిలి ఉన్న పెయింట్స్, ఆయిల్ పెయింట్ బ్రష్లు శుభ్రం చేస్తూ, గ్లాస్ పట్టుకు  కూర్చున్నాడు. అలెక్సాలో “హుస్న్ వాలే తేరా జవాబు నహి” రవి రఫీ కంబినేషన్లో పాట వస్తుంది. మళ్ళి గతంలోకి జారుకున్నాడు.

    నెమ్మదిగా నాగవల్లికి దగ్గరైయ్యాడు. ఫిజిక్స్ మాథ్స్ చెప్పించుకుంటున్నాడు. ఆదివారం సాయంత్రం వచ్చే సినిమా వాళ్ళ ఇంట్లోనే చూస్తూఉంటారు తాను అమ్మా, ఇప్పటికింకా టీవీ కొనలేదు నాన్న. సినిమా చూస్తూ అప్పుడప్పుడు అక్కడే పడుకుండిపోయేవాడు. చందమామ, స్వాతి, ఆంధ్రభూమి జ్యోతిలో వచ్చే బొమ్మలని కూర్చొని వేయటం ఒక అలవాటు తనకు. ఆలా వేసి నాగవల్లికి వెళ్లి చూపించేవాడు, తనను ఎంతో మెచ్చుకొని పొగిడితే భలే ఆనందంగా ఉండేది.

    ఓ రోజు రేడియోలో “నీలాలు కారేనా, కాలాలు మారేనా” ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వస్తుంటే కూర్చొని నాగవల్లి మొహం వెయ్యటానికి చాలా ప్రయత్నాలు చేసాడు తను. అది ఎంతకీ రావటంలేదు. ఇన్నాళ్లు బొమ్మలైతే వెయ్యడం నేర్చుకున్నాడు కానీ మొహాలు వెయ్యడం నేర్చుకోలేదు. అవి ఎలా వెయ్యాలో తెలియదు. అదే విషయం నాగవల్లికి చెబితే “ముందు నేర్చుకో, నువ్వు బాగా వెయ్యగలిగేటప్పుడు నీతోనే వేయుంచుకుంటాను లే ” అన్నాది.

    నెమ్మదిగా 10th నాగవల్లి సహాయంతో 2nd క్లాసులో పాసైయ్యాడు.

    రోజులు గడుస్తున్న కొద్దీ నాగవల్లితో స్నేహం బాగా బలపడింది. రేడియోలో “వ్రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళి నవరసమురళి ఆనందన మురళి ఇదేనా” పాట ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీలగారు పాడిన పాట వస్తుంటే ఇంటర్ రెండో సంవత్సరంలో “నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఐ లవ్ యు ” అని చెప్పాడు దానికి నాగవల్లి డిప్పమీద ఒక్కటి కొట్టి “పని చూసుకోరా, చదువు ముందు” అంది.

    “ఇంటర్ ఐన తరువాత ఫైన్ ఆర్ట్స్ నేర్చుకుంటా” అంటే నాన్నకు తనకు పెద్ద గొడవైంది. అప్పుడు నాగవల్లి వచ్చి మన ఇష్టాలు వేరు పెద్దల ఇష్టాలు వేరు నచ్చచెప్పాలి అన్నాది. అయినా తనకు కోపం తగ్గక అలిగి అమ్మమ్మ ఇంటికి వెళ్లి వస్తాను అని మారం చేసి అమ్మమ్మ ఊరు వెళ్ళాడు.

    అన్నయ్య అక్క అమ్మమ్మలతో టైం స్పెండ్ చేసి ఓ 20 రోజులకు తిరిగి ఇంటికి రాత్రి బస్సుకి వచ్చి ఉదయానే కాలేజీకి వెళ్లిన తనకు నాగవల్లి కనిపించలేదు. సాయంత్రం ఇంటికి వచ్చిన తరువాత కూడా కనిపించలేదు. పక్కింటికి వెళ్లి చూస్తే తాళం వేసి ఉంది. “ఏమైంది” అని అమ్మని అడిగితే “నాగవల్లికి పెళ్లి కుదిరింది వాళ్ళ సొంత ఊరిలో పెళ్ళంట, పెళ్ళైన తరువాత అటునుండి అటే అమ్మాయిని తీసుకువెళ్లిపోతాడట అబ్బాయి” అని ఏవో చెబుతుంది అమ్మ. తనకు దుఃఖం ఆగలేదు. వెక్కి వెక్కి ఏడ్చాడు అమ్మ ఏమైంది అని అడిగితె ఏమి చెప్పకుండా ఏడుస్తూనే ఉన్నాడు ఆ రాత్రంతా. ఎక్కడో దూరంగా “కంచికి పోతావా కృష్ణమ్మా” ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వస్తుంది. తరువాత తను నాన్నని ఒప్పించి బెనారస్ వెళ్లి ఫైన్ ఆర్ట్స్ నేర్చుకోవడం, జీవితం సాగిపోవడం అన్ని జరిగిపోయాయి. ఇది జరిగి ఇప్పటికి ఓ 35 ఏళ్ళు అయిఉంటుంది.


    ఆ ఆరు పోట్రైట్స్ ని చూస్తూ ఫోన్ తీసాడు గిరీశం. వాట్సాప్ ఓపెన్ చేసి మెసేజ్ టైపు చెయ్యడం మొదలు పెట్టాడు “హాయ్, మీ అమ్మగారి ఫోటో వెయ్యటం కుదరడం లేదు, వచ్చి ఆవిడా ఫోటో తీసుకోండి. మళ్ళి నా దగ్గర ఉంటె పాడైపోతుంది” అని. మెసేజ్ పంపి అలెక్సాలో తలత్ మహమూద్ పాట నౌషాద్ స్వరపరిచిన “తస్వీర్ బనాతా హూన్, తస్వీర్ నహి బంతి” పాట వింటూ అక్కడే నిద్ర పోయాడు. ఉదయం ఎప్పుడో చూసుకుంటే “OK” అన్న మెసేజ్ వచ్చింది.

    ఓ రెండు రోజుల తరువాత ఆ ఫోటో తీసుకువచ్చిన అమ్మాయి తో పాటు అమ్మాయి తమ్ముడు కూడా వచ్చారు. అమ్మాయి తమ్ముడిని పరిచయం చేసింది అతని పేరు కూడా గిరీశమట. తనని ఎంతగానో బ్రతిమిలాడ ప్రయత్నించారు, “మా అమ్మగారి చివరి కోరిక మీతో బొమ్మ వేయుంచుకోవాలి” అని. తన సమస్య కూడా వారికి చెబుతూ వేసిన ఆరు పెయింటింగ్స్ చూపించాడు . ఇద్దరు బొమ్మల్లా ఆలా నించుండి పోయారు. ఇద్దరి కళ్ళలో నీళ్లు, ఏమైందో అర్ధంకాలేదు, కొంచం సేపు వారిని కుదుట పడనిచ్చి అడిగాడు “ఏమైంది” అని. ఈ ఆరు మా అమ్మగారు మా చిన్నప్పుడు ఎలా ఉండేవారో ఆలా వేశారు, ఇంత అందంగా అమ్మని చూసి చాలా ఏళ్లయింది” అంటూ ఏడుస్తూనే ఉన్నారు. ఇంతకీ “మీ అమ్మగారి పేరు” అన్నాడు “నాగవల్లి” అన్నారు ఇద్దరు.

    అలెక్సాలో “ఇన్ ఆంఖోఖి మస్తీ కె మస్తానే హజారో హై” ఆషా పాడిన పాట ఖయ్యాం స్వరకల్పన వస్తోంది.

  • బావుడి

    బావుడి

    ఆరుకు నుండి జేయపూర్ వెళ్లే దారిలో ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో మేఘాలను అందుకుంటూ పచ్చని కొండల మధ్య దాక్కున్న ‘పాడువా’ అనే చిన్న గ్రామం. ఆ గ్రామపు చుట్టూ కొండకోనల్లో నిండుగా గిరిజన గూడేలు. ఆ గూడాల్లో ఎందరో పిల్లలు, వారిలో ఒకర్తి ‘చొంపా’. అడవిలో పెరిగిన సంపంగి మొగ్గలాగా సన్నగా నాజూగ్గా, నవ్వుతూ ఎక్కడికి వెళ్లినా చెలాకీగా మాట్లాడుతూ ఉండేది చొంపా.

    పగలంతా ఆటతో పాటు చింత చెట్టు దగ్గర చిగురు, కాయలు కోయటం, లేతపోతే లేత వెదురు బొంగులు కొయ్యటం, గుమ్మడి పాదు చుట్టూ తిరిగి మంచి గుమ్మడికాయ కోయడం, పొలం గట్ల దగ్గర ముళ్ల తోటకూర ఏరడం, ఇలా ఇంటికి కావలసిన కూరలు ఆకులు తెచ్చేది.

    “బొవూ ఆకలేస్తుంది” సాయంత్రం చీకటి పడకముందే తల్లి దగ్గరకెళ్ళి అన్నం పెట్టమని మారం చెయ్యడం మొదలు పెట్టింది.

    “నీకు చీకటి పడకముందే ఆకలేమిటీ?”

    ప్రతిరోజూ సాయంత్రం మందు తాగి వచ్చే తండ్రి తల్లిపై చేసే అత్యాచారం చూస్తే చొంపాకి చచ్చెంత భయం. తల్లిని జుట్టు పట్టుకుని ఈడ్చి కొట్టడం, తన్నడం, నానా మాటలు అనడం. కేవలం చొంపా వాళ్ళ బాబా ఒక్కడే కాదు, ఆ గూడెంలో చాలామంది మగవాళ్ళది అదే తీరు. ఆ దెబ్బలు, ఆ అరుపులు…ఆడవాళ్లపై మగవాళ్ల ఆధిపత్యం…అదంతా ఆ గూడెం జీవితంలో ఒక భాగంలా, ఒక అలవాటులా అనిపించేది. ఎవరూ ఎదురుతిరగకపోయేసరికి, బహుశా బ్రతుకంటే ఇదేనేమో అనుకునేది.

    “అయినా పగలంతా అంత ప్రేమగా ఉండే బాబా, ఆ మందు తాగితే ఎందుకలా అయిపోతాడు?” అమాయకంగా అడిగింది

    ఏం సమాధాం చెప్పాలో తెలియక పళ్లెంలో ఇంత వండింది పెట్టి నోరు మూయించింది ఆవిడ. పెట్టింది తిని బుద్దిగా తండ్రి వచ్చేలోపు గుడిసెలోకి వెళ్లి పడుకుంది.

    ఇలా ఆట, భయం మధ్య ఊగుతూ సమయం గడచిపోయింది. చొంపా పదహారేళ్లు వయసు వచ్చేసరికి విరిసిన సంపంగి పువ్వులా అడవిలో పెరిగిన నల్లటి కలువల్లా, దట్టమైన నల్లని జుట్టు, పౌర్ణమి చంద్రునిలాంటి ముఖం, అందులో జింక పిల్లలాంటి పెద్దపెద్ద కళ్ళు. ఆమె అందానికి చుట్టుపక్కల యువకుల గుండెలు గల్లంతయ్యేవి.

    అడవిలో పుట్టి పెరిగిన శరీరం, కొండలు, గుట్టలు, వాగులు ఇలా ఎక్కటం దిగటం ఈదటం, యౌవనంలో ఉన్నాడేమో ‘డొంబురు’ది దృఢమైన నల్లని శరీరం, చూడగానే ఆకట్టుకునే మొహం, చలాకీగా ఉంటాడేమో పక్క గూడేమైనా చొంపాకి చాలా నచ్చేసాడు. డొంబురుకి కూడా చొంపా అంటే చాలా ఇష్టం.

    ఇద్దరూ పక్షుల్లా స్వేచ్ఛగా అడవంతా తిరుగుతూ, వాగుల్లా గలగలా పారుతూ, గాలిలా గుసగుస లాడుతూ రోజులు గడిచిపోయేవి.

    ఓ రోజు అడవిలో పూచే జాజులు కోసుకు వచ్చి మాల కట్టి చొంపా కొప్పులో పెడుతుండగా “నువ్వు మందు తాగానని మాట ఇస్తావా?” అని ముద్దుగా అడిగింది.

    “చూద్దాంలే” అన్నాడు

    “చూద్దాం కాదు, మాట ఇవ్వు” అంది

    “సరే తాగను” అన్నాడు నవ్వుతూ

    వారి ప్రేమ పెద్దల చెవిదాకా పాకింది. పెద్దలు కూడా వారి పెళ్ళికి సమ్మతం చెప్పారు.

    ప్రతీ ఏడు పంటలు చేతికి వచ్చే సమయంలో ఆ చుట్టుపక్కల గూడెల యువకులంతా కలిసి వేటకు వెళ్లడం ఒక అవసరం, ఆనవాయితి. వ్యవసాయాన్ని, పంటలను రక్షించాలంటే అడవి పందులను వేటాడాలి. ఒకరోజు రాత్రి రెండు బృందాలు వేటకు బయలుదేరాయి. వాటిలో డొంబురు కూడా ఉన్నాడు.

    మరుసటి ఉదయం రెండు పెద్ద అడవి పందులతో వేట బృందాలు తిరిగి వచ్చాయి. వేట విజయంలో గూడేమంతా ఉత్సవంగా మారింది. గూడెంలో జాతర అంటే మందు ఉండాల్సిందే. వేట పందులను భాగాలు వేసుకుంటున్నారు.

    “మేము కొట్టిన పందే పెద్దది, చూశారా ఎన్ని ముక్కలు వచ్చాయో” అన్నాడు డొంబురు తమ బృందం వైపు గర్వాంగా చూస్తూ.

    “చాల్లే, ఇలాంటి ఎలుకల్ని ఎన్ని చూసామో, ఎన్ని కొట్టామో” అని మరో బృందం యువకుడు అందుకున్నాడు.

    “అవునురా, మీరు ఎలుకనే కొట్టింది. ఎంతమంది తింటార్రా దానిని” డంబురు బృందంలో వేరొకడి నోరు లేచింది.

    మందు మత్తు ఎక్కుతున్న కొద్దీ మాటలు పెరిగాయి, పౌరుషాలు పెరిగాయి. అక్కడ జనమంతా రెండు భాగాలుగా చీలిపోయారు. పెద్దలు ఏం చెప్పినా ఎవ్వరి చెవులకూ ఎక్కడం లేదు.

    చినికి చినికి గాలివానై, క్షణికావేశంలో ఆ కుర్రాడు చేతిలోని గొడ్డలితో డొంబురుపై ఒక్క వేటు వేశాడు. ఆ దెబ్బకు డొంబురు అక్కడికక్కడే ప్రాణం వదిలేసాడు.

    ఆ ఒక్క గొడ్డలి దెబ్బ డొంబురు ప్రాణాన్ని మాత్రమే కాదు, చొంపా జీవితపు ఆశాలపైనా వేటుపడింది.

    ప్రియుడి మృతదేహాన్ని చూసిన చొంపా ప్రపంచం శూన్యమైపోయింది. నెలల తరబడి గుడిసె, గూడేం దాటి బయటకు రాలేదు. ఎవరితోనూ మాట్లాడలేదు. ఎంతమంది పెళ్లి చేసుకుంటామని వచ్చినా ఆమె తిరస్కరించింది.

    తన జీవితాన్ని ధ్వంసం చేసిన మద్యం పట్ల, దానిని తాగిన మనుషులన్నా ఆమెలో అసహ్యం, భయం పెరుగుతూ వచ్చాయి. ఓదార్చడానికి తల్లి కూడా లేదు. ఇక తండ్రి అమానుషానికి ఎలాంటి అవరోధం లేకుండా పోయింది.

    “ఏమే ముండా పెళ్లి చేసుకోవా, నా మీద పది ఏడుస్తూ నన్ను తినవే. నన్ను కూడా చంపేస్తే, నీకు సుఖంగా ఉంటాదా” అంటూ రోజు తాగి వచ్చి వేధించేవాడు.

    పెళ్లి చేస్తే, మగపెళ్లి వారు ఇచ్చే కానుకులతో ఇంకొన్ని రోజులు తాగొచ్చు అని ఓ కోరిక ఒక పక్క. అది చేసుకోవటం లేదు అని మరీ క్రూరంగా తయారయ్యాడు. కూతురనే కనికారం లేకుండా కొట్టేవాడు, తన్నేవాడు.

    ఆ హింస, ఆ నరకం భరించలేని చొంపా నిద్రలేని ఎన్ని రాత్రులు గడిపిందో. భయం, బాధ, విరక్తి అన్నీ కలిపి చావాలి అన్న కోరిక పుట్టింది, కానీ చావడానికి ధైర్యం సరిపోలేదు. ఈ నరకం నుండి బయటకు వెళ్ళాలి అని ఒక్కటే ఆలోచనతో నిద్రలేని రాత్రులన్నీ గడిపింది.

    ఒకరోజు తండ్రి కొడుతుండగా మూర్ఛపోయింది, మరుసటి ఉదయం నుంచి వింతగా మారిపోయింది. కళ్ళల్లో శూన్యం, మాటల్లో అర్థం లేదు. పిలిస్తే స్పందించదు, ప్రశ్న అడిగితే వింతగా నవ్వుతుంది. భూతవైద్యులు, వైద్యులు ఎవరికీ అర్థం కాలేదు.అందరూ ఆమె తండ్రి కొట్టిన దెబ్బలకు పిచ్చిదైపోయిందని నిర్ధారించుకున్నారు. అదే చొంపాకి కావలసినది.

    పిచ్చి అయితే నటించొచ్చు కానీ, పదిహేడేళ్ల అందం దాయడం కష్టం. మందు తాగే మనుషులకు పిచ్చితో పనేంటి. ఎంతమందిని చూడలేదు గూడెంలో పెళ్ళాన్ని మైకంలో కొట్టి, తన్ని, మల్లి దాని పక్కకి మత్తు దిగాక దూరినోళ్ళని.

    తనను తాను కాపాడుకోవాలని, క్రూర మృగాల వంటి మనుషుల నుండి రక్షించుకోవాలని ఒక వింత కవచాన్ని తయారు చేసుకుంది. నెలల తరబడి స్నానం చేయడం మానేసింది. శరీరం నుండి వచ్చే దుర్వాసన, వంటికి పట్టిన మురికి, ఒక రక్షణ కవచంగా మార్చుకుంది. అలాగే గుండెమంతా తిరిగేది. ఎవరైనా పెడితే తినేది, లేకపోతె ఏదో ఓ మూల కూర్చునేది.

    విరిసి విరవకుండా సంపంగి మొగ్గలా ఉండే చొంపా ఇప్పుడు మాడిపోయి వాడిపోయి మూగబోయింది.

    మనిషి మనసు చాలా వింతది. దృఢ నిశ్చయం ఉంటే ఎంత కష్టమైన పని అయినా సాధ్యమవుతుంది. పిచ్చిగా తిరిగే చొంపా గూడేం వదిలి పాడువా చేరుకుంది. అక్కడ నుండి పొట్టకు సరైన తిండి లేకుండా, కేవలం ఆశలను ఆధారంగా చేసుకుని దాదాపు డెబ్భై కిలోమీటర్లు కాలినడకన ‘బోయిపరిగూడ’ అనే ఊరు చేరుకుంది.

    ఒక్కప్పటి చొంపా కొండల్లో వాగులా గలగలా పారేది, ఇప్పుడు సరైన తిండి లేక, పిచ్చితనం నటించి, కట్టుకోడానికి సరైన బట్ట లేక అదే వాగు పక్కన పడివున్న ఎండి పుల్లలా ఉంది. అక్కడ ఒ రెండు మూడు ఇళ్లలో పాచి పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది.

    ఆవిడనే అందరు “బావుడి” అని పిలుస్తారు.

    బావుడి అంటే పిచ్చిది అని అర్ధం.

    1
  • గమనం

    గమనం

    అనిత, సుజాత, ప్రమీల, శైలజల  స్నేహం చాలా బలమైనది. వాళ్ళ నలుగురి స్నేహాం ఆరో తరగతి విజయనగరంలో మొదలైంది. ఒకే బెంచ్ మీద నలుగురు కూర్చునేవారు. ఒకేసారి మధ్యాహ్నం భోజనానికి డబ్బాలు తెరిచేవారు, వారు తెచ్చుకున్న వాటిని పంచుకొని తినేవారు. ఆస్తిపాస్తుల్లో తేడాలు ఉన్నప్పటికీ పెద్దగా అభిప్రాయాలూ కానీ వాటి బేధాలు కానీ ఏమి లేవు వారిలో. పదో తరగతిలో ఓ రోజు క్లాసులో ఖాళీగా కూర్చొని భవిష్యత్తు కోసం మాట్లాడుకుంటున్నారు.

    “నేను డాక్టర్ అవుదామని అనుకుంటున్నా” అన్నాది అనిత

    “నువ్వు అవుతావే, మీ ఇంట్లో అందరు డాక్టర్లే కదా” అన్నాది ప్రమీలా, “అందరు కాదు, మగవాళ్ళు మాత్రమే. ఆడవాళ్ళూ డాక్టర్లు అవ్వలేరు అంటారు మా తాతయ్య. అందుకైనా నేను డాక్టర్ని అవుతాను” అన్నాది పంతంగా.

    “నేను టీచర్ అవుదామని అనుకుంటున్నా” అన్నాది సుజాత

    “ఏమే, సెలవులు ఎక్కువ వస్తాయి అనా” ఉడికిస్తూ అడిగింది శైలజ. “ఆలా కాదె, ఏమో చిన్నప్పటి నుండి టీచర్స్ అంటే ఒక అభిమానం” అంది.

    “నేను త్వరగా పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నా” అన్నాది ప్రమీల

    మిగతా ముగ్గురు వింతగా చూసారు. “నా చదువు, పెళ్లి, తమ్ముళ్ల చదువులు ఇవన్నీ కష్టమట. మా అమ్మ ఎప్పుడూ అంటూంటాది” అన్నాది ప్రమీల కొంచం బాధగా.

    “నాకు పెద్ద కోరికలు ఏమి లేవు, ఏమౌతానో నాకు ఏమి తెలియదు” అంటూ శైలజ నవ్వింది.

    “ఏమౌతావో తెలియకుండా ఎలాగే” అడిగింది సుజాత. “ఏమో, అంతే”

    నలుగురు టెన్త్లో మంచి మర్క్స్ వచ్చాయి, తరువాత అందరు ఒకే కాలేజీలో ఇంటర్ సైన్స్ తీసుకున్నారు. అనిత, ప్రమీల బైపీసీ తీసుకోగా సుజాత, శైలజ ఎంపీసీ తీసుకున్నారు.

    ఇంటర్ రెండో సంవత్సరం వచ్చేవరకు ఎక్స్ట్రా కోచింగ్ కోసం అనిత వెళ్లడం మొదలు పెట్టింది, ప్రమీలాని కూడా రమ్మంది. అమ్మ నాన్న దగ్గర అంత డబ్బులు లేవు తాను రాలేను అని చెప్పేసింది. అనిత మిగతా ఇద్దరి స్నేహితురాళ్ళని వెంట పెట్టుకొని కష్టం మీద ప్రమీల అమ్మ నాన్నలను కోచింగ్ కి వేరేగా డబ్బులు కట్టనవసరంలేదు అని ఒప్పించింది. ఆ డబ్బులు కూడా తన పాకెట్ మనీ నుండి కట్టింది.

    నలుగురూ ఎంసెట్ కోసం బాగానే కాదు చాలా బాగా చదివారు. పరీక్షలు సమయం రావడం, వ్రాయడం, ఫలితాలు రావడం కూడా నెమ్మదిగా జరిగిపోయింది.

    అనితాకి చాలా పెద్ద రాంక్ వచ్చింది. ప్రమీలాకి మంచి రాంక్ వచ్చింది, ఎంత మంచిది అంటే ఫ్రీ సీట్ వచ్చేటంత. సుజాతకి వ్రాయకుండా ఉండడమే మంచిదేమో అనిపించేటంత వచ్చింది. ఇక శైలజాకి కూడా పర్లేదు అనుకునే రాంక్ వచ్చింది.

    శైలజకు ఎక్కడో వేరే ఊరిలో సీట్ వచ్చింది, పంపించడం కష్టమన్నారు శైలజ అమ్మానాన్న. సుజాత కూడా బుద్దిగా శైలజతోపాటు ఊరిలోనే డిగ్రీలో చేరింది.

    ఫ్రీ సీట్ వచ్చినా మెడికల్ అంటే మళ్ళి పెళ్లి, కట్నాలు ఎక్కువ ఇచ్చుకోవాలి తమ్ముళ్లు చదువులు ఎలా అని ఆలోచనలో పడిపోయారు ప్రమీల తల్లితండ్రులు. అనిత అమ్మానాన్న వచ్చి “ఇటువంటి మంచి అవకాశం మళ్ళి మళ్ళి రాదు, ఆర్ధికంగా సహాయం కావాలి అంటే చూసుకుంటాం” అన్నారు. “ఇంకా పెళ్లి కట్నాలు కోసం చింత వద్దు అవన్నీ తానే సొంతంగా చదువయ్యాక చూసుకుంటాది, మీరు వాటికోసం అంతగా ఇప్పుడు పట్టించుకోవద్దు” అని నచ్చచెప్పారు.

    మళ్ళి లాంగ్ టర్మ్ చేస్తాను అంటే వద్దని అనిత నాన్నగారు తన పరపతి వాడి మేనేజ్మెంట్ సీట్ సంపాదించారు.

    ఆలా ఇద్దరు ఒక ఊరిలో మరో ఇద్దరు వేరే వేరే ఊళ్లలో పై చదువులు మొదలయ్యాయి.

    కాలంతో పాటు చదువులు పూర్తవుతూ వచ్చాయి. మొదట్లో వేసవికాలం సెలవులకు కలిసేవారు. నెమ్మదిగా అది కూడా తగ్గ సాగింది.

    టీచర్ కావాలి అనుకున్న సుజాత పెళ్లి చేసుకొని US వెళ్ళిపోయింది.

    త్వరగా పెళ్లి చేసుకుంటాను అన్న ప్రమీల హైద్రాబాద్లో ఓ పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో కన్సల్టింగ్ గైనకాలజిస్ట్, తన క్లాసుమేట్ కార్డియాలజిస్ట్ని పెళ్లిచేసుకొంది. తమ్ముళ్లు కూడా పెద్ద చదువులు చదివారు.

    అనిత పై చదువులకోసం కెనడా వెళ్లి అక్కడే పెళ్లి చేసుకొని ఉండిపోయింది.

    ఏమి అవుతానో తెలియదు అన్న శైలజ పెళ్ళై భర్త చనిపోయాక అతను చేసే ఉద్యోగం వచ్చింది. గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్లో టీచర్గా ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేస్తుంది. స్నేహితులందరికీ వారధి, అందరిని వాట్సాప్లో కలిపి ఉంచుతుంది.

    అందరూ బిజీ, ఎవరి జీవితాలు వారివి. పాత స్నేహితులు గుర్తు ఉన్నప్పటికినీ పిల్లలు వారి చదువులు, ఉద్యోగాలు, కొత్త స్నేహాలు, ఒకదానికి ఇంకొకటి తోడై కలుసుకోడానికి వీలు కూడా కుదరని పరిస్థితులు.

    ఓ ఇరువై ఏళ్ళ తరువాత అందరు కలుద్దామని నిశ్చయించుకున్న రోజు వచ్చింది. నలుగురు విజయనగరంలో అనిత ఇంట్లో కలిశారు.

    అన్నేళ్లు తరువాత చూసుకునేసరికి అందరికి కొంచం వింతగానూ, చాలా ఆనదంగాను అనిపించింది.

    “ఎంత మారిపోయామో అందరం” అంది అనిత కొంచం యాక్సెంట్తో .

    “యా” అంటూ సుజాత వంత పాడింది.

    “యు గైస్ ఫుట్ ఆన్ లాట్ అఫ్ వెయిట్, బట్ శైలజ అలాగే ఉంది కదా” అంది ప్రమీల.

    “మనం మారలేదే, మన సహజత్వం ఇప్పుడు బయటకు వచ్చిందేమో” అంటూ శైలజ నవ్వింది.

    అందరి బట్టలు వేష భాషలతో పోలిస్తే శైలజ చాలా నిరాడంబరంగా ఉంది.

    కాఫీ, స్నాక్స్ అన్ని అక్కడకే వచ్చాయి. స్నాక్స్ తింటూ చిన్ననాటి విషయాలు ఎన్నో గుర్తు చేసుకున్నారు. నవ్వుతూ గడిపిన క్షణాలు, ఆటలు, పోటీలు అన్నీ.

    “చెప్పండి లైఫ్ ఎలా ఉంది” అని అడిగింది శైలజ కాఫీ తాగుతూ.

    “క్షణం తీరికలేని జీవితం నాది. హాస్పిటల్ ఇల్లు పిల్లలు. మావారు కార్డియాలజి సర్జన్ నేను గైనిక్ సర్జన్, సో ఎవరికి ఎప్పుడు ఫోన్ వస్తే అప్పుడు పరిగెత్తడమే. సంవత్సరానికి ఒకటి రెండు ఫారిన్ ట్రిప్స్ కోసం తప్పనిసరిగా సెలవు పెడతాము, లేకపోతె అస్సలు ఖాళి దొరకదు. పిల్లలు కూడా మెడిసిన్ చేస్తాము అంటున్నారు కాబట్టి చూడాలి” అంది ప్రమీల కొంచం గర్వంగా.

    “నాకైతే పర్లేదు, వీకెండ్స్ మా వారికీ సెలవు. సంవత్సరానికి ఒకటో రెండో ఫారిన్ ట్రిప్స్. మొన్ననే ఒక రెండో విల్లా తీసుకున్నాం, అల్ కూల్” అన్నాది సుజాత తాను ఎక్కడ తగ్గను అన్నట్టు.

    “నేను నా హస్బెండ్ అర్ ఇంటూ టీచింగ్. అక్కడే మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్స్, సెమినర్స్ అంటూ ఎప్పుడూ ఎక్కడకొ ఒక దగ్గరకి తిరుగుతూనే ఉంటాం, సో లైఫ్ హాయిగా వెళ్ళిపోతుంది. మరి నీ సంగతి ఏమిటి చెప్పు శైలు” అని అడిగింది అనిత దర్పం దాస్తూ.

    “మా వారు చనిపోయాక నాకు ఆ ఉద్యోగం వచ్చింది. చుట్టూ కొండలు అడవులు, పిల్లలిని పట్టుకు వచ్చి చదివించాలిదాని కోసం వారానికి ఒక్కసారైనా చుట్టుపక్కల ఊళ్లు తిరుగుతూ ఉంటాను. వంద మందిలో ఓ ఇరువై ముఫై మంది టెన్త్ వరకు చదివితే గొప్ప. నాకు పిల్లలు లేరు కాబట్టి అక్కడే లైఫ్ గడుస్తుంది, సెలవల్లో అక్కడ మెడికల్ క్యాంప్స్ గట్రా చేస్తూ నాకు తోచిన సాయం చేస్తూ ఉంటాను” అన్నాది శైలజ నెమ్మదిగా.

    “అయినా అక్కడ ఎలా ఉంటున్నావే, మలేరియా ఎక్కువ కదా. మన ఊరి వైపు ట్రాన్స్ఫర్ పెట్టించుకోవచ్చుగా ” అడిగింది ప్రమీల.

    “అందరూ ఆలా అంటే ఎలాగే” తిరిగి ప్రశ్నించింది శైలజ

    “ఇండియా ఇంకా మారలేదు” అంటూ సుజాత ఏదో చెప్పబోతే అడ్డుకుంటూ “మనం చదువుకున్నాం, మనం అదృష్టవంతులం. ఆ విషయంలో నాకన్నా అదృష్టం ఎవరికి ఉండదు, ఆలా అని అందరికి ఆ ఛాన్స్ రాదు. నువ్వు US, అది కెనడా కాబట్టి మీకు మార్పు కనిపించదు” అంది ప్రమీల కొంచం ఆవేశంగా.

    సుజాత మాటకు, ప్రమీల వివరణకు అనిత, శైలజలు మౌనంగా ఉండిపోయారు. పాత కబుర్లు, నవ్వులు ఒక్కసారిగా ఆగిపోయాయి. వాళ్ళ మధ్య చిన్నపాటి నిశ్శబ్దం అలుముకుంది. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ శైలజ నెమ్మదిగా అంది, “అవును ప్రమీలా, నువ్వు చెప్పింది నిజం. మనం అదృష్టవంతులం. కాని మనల్ని అదృష్టవంతుల్ని చేసింది మన కష్టం, మన చదువు మాత్రమే కాదు… మన స్నేహం కూడా.”

    “అది మాత్రం నిజం, నేను టీచర్ని అవుదామనుకున్న కాలేకపోయా. కానీ మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందో తెలుసా. మీ గెలుపులు నావిగా భవిస్తూ ఉంటాను. అసలు మనం శైలజాకి పెద్ద థాంక్స్ చెప్పాలి అందరిని కట్టి ఉంచినందుకు” అంటూ సుజాత కన్నీళ్లు పెట్టుకుంది.

    ఈ మాటలు అనిత, ప్రమీల, శైలజలకు ఒక మెరుపులా అనిపించాయి. వాళ్లకి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. టెన్త్ క్లాస్‌లో భవిష్యత్తు గురించి మాట్లాడుకున్న రోజు, ఎంసెట్ కోచింగ్‌కు ప్రమీలను ఒప్పించిన సందర్భం, ప్రమీల తల్లిదండ్రులను అనిత, ఆమె తండ్రి కలిసి ఒప్పించిన సంఘటన, శైలజకు సీటు వచ్చినా దూరప్రాంతం అని వెళ్లలేకపోయిన బాధ, సుజాత తనకు కూడా అక్కడే డిగ్రీలో చేరడం – ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి కళ్ళ ముందు మెదిలాయి.

    ప్రమీల కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. “క్షమించండి. నాది చాలా స్వార్థపూరితమైన జీవితం. నా గురించి, నా కుటుంబం గురించి తప్ప నేను ఎప్పుడూ పెద్దగా ఆలోచించలేదు. నా మెడికల్ సీటు కోసం మీరు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ఇన్ని రోజులు ఆ విషయాన్ని నేను దాదాపుగా మర్చిపోయాను. నా జీవితం మీరు పెట్టిన భిక్ష. మీ అందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను.” అంటూ భావోద్వేగంతో ప్రమీల మాట్లాడింది.

    శైలజ నవ్వుతూ, “అలా అనకు ప్రమీలా… మనకి ఎవరు ఎవరికి ఇచ్చిందేమీ లేదు. మనం మనలో ఒకరికొకరం సహాయం చేసుకున్నాం అంతే. ఇదే స్నేహం, ఇదే జీవితం సాగుతుంది అంతే.”

    “పోనీ నలుగురం కలసి ఏదైనా ఎన్జిఓ పెడదామా. శైలజ ఏరియాలో పనిచేయడానికి” అంటూ అనిత అందరి వైపు చూసింది పెద్ద కళ్ళతో.

    “వద్దు లేవే, నలుగురం వచ్చాము కలుద్దాం, హాయిగా ఈ రెండు రోజులు టైం స్పెండ్ చేద్దాం, మళ్ళీ వీలున్నప్పుడు కుదిరినప్పుడు మళ్ళీ కలుద్దాం. ఏదైనా అవసరం ఉంటె నేనే చెబుతాను” అంది శైలజ నెమ్మదిగా.

    “అదేమిటే, అనిత ఏదో చేద్దాం అంటే నువ్వు వద్దంటావు, మేము దేశం కోసం ఏదో చెయ్యాలని అనుకుంటాం కదా. నీ అంత కాకాపోవచ్చు, ఏదో ఉడతా భక్తి సాయం” అంది సుజాత

    “అవునే మీకు నేను చెప్పేది నచ్చకపోవచ్చు కానీ నిజం. నేను జాబ్ చెయ్యాలా, ఇక్కడ గవర్నమెంట్ పధకాలు అమలు చెయ్యడానికి సాయం చెయ్యాలా, ఎలక్షన్ డ్యూటీస్ ఉంటాయా, ఇంకా స్కూల్ ఫంక్షన్స్ అన్ని కలిపి నాకు సంవత్సరానికి ఒక పదిహేను ఇరువై రోజులు సెలవు దొరుకుతుంది. అందులో ఇంకో పని నెత్తిన పెట్టుకోవడం అంటే కష్టం. స్నేహం మధ్యలోకి డబ్బులు విషయాలు వచ్చాయి అంటే బంధాలు ఇంకా జఠిలమైపోతాయి. అందుకే ఆలా అన్నాను. అయినా మీకు వీలు కుదిరినప్పుడల్లా రండి, వచ్చి తోచింది చెయ్యండి. దానికోసం NGO మళ్ళి పెట్టి హుంగామా ఎందుకు అని నా ఉద్దేశం అంతే” నిదానంగా సమాధానం చెప్పింది.

    మళ్ళీ నలుగురు కొంత సేపటికి ఇవ్వన్నీ పక్కన పెట్టి వారి వారి చిన్ననాటి విషయాలు మాట్లాడుకుంటూ నవ్వుల్లో ములిగిపోయారు.

    ఎవరో మహానుభావుడు అన్నట్టు జీవితం యొక్క గమ్యం గమనమే.

    1
  • గాజు కిటికీ – రెండు ప్రపంచాలు


    A view from my Office window

    నీలాకాశం, నీరు, చల్ల గాలి –
    అన్నీ కవితలు రాస్తుంటే
    నా కీబోర్డ్ మాత్రం
    డెడ్‌లైన్‌ లను లెక్కపెడుతోంది

    కిటికీ ఆవతల ప్రకృతి పాడుతున్న గీతం
    కానీ నా మనసు ఆ మెలోడీ ని మ్యూట్ చేసి
    ఒక టీంస్ కాల్ లో చేరిపోతుంది

    శరదృతువు బయట రంగుల కేళి ఆడుతుంటే
    లోపల మనసు ఒకే నీలిమ లో మునిగిపోయింది

    ప్రకృతి ప్రతి రోజూ కొత్త పాఠం రాస్తుంటే
    మనసు మాత్రం పాత పేజీ తిరగేయలేక తడబడుతోంది.

    3
  • “తెలుగు(అనువాద) సాహిత్యం – విడువవలసిన మౌనాలు – జరుపవలసిన అన్వేషణలు” ప్రసంగంపై వ్యాసము – అభిప్రాయము

    అంతర్జాల వేదికగా “హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి” వారు నిర్వహించిన సదస్సులో “తెలుగు(అనువాద) సాహిత్యం – విడువవలసిన మౌనాలు – జరుపవలసిన అన్వేషణలు” అనే శీర్షిక పైన శ్రీ హేలీ కళ్యాణ్ గారి ప్రసంగంపై చిన్న వ్యాసము. ఇటువంటి విషయంపై వినడము కొత్త అనుభవం. కవితలు, అలంకారాలు, భక్తి సాహిత్యం , కావ్యాలు వంటి ప్రక్రియలపై మక్కువ తో తెలుగు-నుడిలో భాగాలుగా కూడా దాదాపు అదే కోవకు చెందినవి కావడం పరిపాటి అయింది . కానీ సాహిత్యంలో మౌనాలు, అన్వేషణలు కొత్తగా అగుపించి కొంత క్షుణ్ణంగానే ఈ ప్రసంగాన్ని విని ఒక వ్యాసము తెలుగు నుడిలో ప్రకటించాలని అనిపించింది. ఈ ప్రయత్నం కొత్తది కాబట్టి లోటుపాట్లు ఉంటవి.

    ప్రసంగంలో మాట్లాడిన విషయాలు :

    శీర్షికలోని “మౌనం” మాటను నిర్వచిస్తూ – తెలిసినా వ్రాయకపోవడం/మాట్లాడకపోవడం గానూ – తెలుగులో విస్తృతంగా లేనివి అనువదించుకోవలసినదిగా “అన్వేషణ” గా నిర్వచించారు. ముందుగా మౌనం వహిస్తున్న విషయాలు చర్చిస్తూ , ప్రస్తుతం చదువుతున్న లేక విరివిగా (Popular)గా లభ్యమవుతున్న పుస్తకాలు/ రచనలు Word cloud లో చూపెట్టారు.

    యండమూరి- అయాన్ రాండ్ – ఖలీల్ గిబ్రాన్ – కాఫ్కా – జర్మన్ జానపద కథలు – విశ్వనాథ – వెండి డోనిగర్ – రోమీల – ముళ్ళపూడి – క్రైస్తవ సాహిత్యం – వసు చరిత్ర – మనుచరిత్ర – షేక్స్పియర్

    ఇలా ఎంతో వైవిధ్యత తెలుగులో ఉంది. ఎవరికి నచ్చినవి వారు చదవాలి, వ్రాయాలి . కానీ ఒక జాతి సాంస్కృతిక విషయాలకు సంబంధించిన పుస్తకాల గురించి, భారతీయతపై ఆసక్తి/ ఉత్సాహం ఉన్న చదువరులకు/ రచయితలకు ఉన్న అవకాశాల గురించి కళ్యాణ్ గారు ప్రస్తావించారు. అలా ప్రస్తావించిన పుస్తకాలు

    – “అరుణాచలంలో చలం” – సాంప్రదాయానికి దీటుగా వ్రాసిన వ్యక్తి తన జీవిత చివరిదశ లో భగవాన్ స్మృతులతో గడిపిన వ్యక్తి గా మిగిలి పోక, ఆ దశ ప్రస్తావన చాలా అరుదుగా ఉండడం సాహిత్యంలో మౌనంగా చక్కని ఉదాహరణలతో వివరించారు.

    – “కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి” గారి రచనలు – హిందూమతంపై నిరసనలను, వ్యాసాలను, తిప్పికొడుతూ సహేతుకంగా చేసిన సాహిత్య సృజన , వీరేశలింగం పంతులు గారికీ కాశీభట్ట వారికీ జరిగిన కలహము , పాఠశాల స్థాయి నుంచీ ప్రజలకు అందించకపోవడం, సాహిత్య లోకం విస్మరించిన తీరు కూడా ఒక మౌనంగా ఉదహరించారు శ్రీ హేలీ కళ్యాణ్ గారు.

    ఇక కొన్ని అన్వేషించ అవసరం ఉన్న సందర్భాలూ, పుస్తకాలకు ఉదాహరణలు చూపెడుతూ –

    “ఆర్య సామాజికులకు సాంప్రదాయవాదులకు జరిగిన చర్చలు” – ఒకే వేదికపై వారికి జరిగిన వాగ్వివాదాలను తెలుగు సాహిత్యంలో అందకపోవడం పైన అన్వేషణ జరగవలసిన అవసరం ఉంది. ఈ కోవలో హిందీలోని ” పురాణ దిగ్దర్శన్” , “క్యోఁ” వంటివి ఉటంకిస్తూ, శ్రీ చిర్రావూరి శివ రామకృష్ణ శర్మ గారూ ఉప్పల రాధాకృష్ణ గార్ల “నాలుగు శాస్త్రాల చర్చ” ప్రస్తుతం లభిస్తున్న పుస్తకం అనీ, అటువంటి పుస్తకాలు ధ్యేయంగా తెలుగు సాహిత్యంలో కూడా పుస్తకాలు రావాలి అని కోరుకున్నారు. – కరపాత్ర స్వామి వారి “రామాయణం మీమాంస”, “హిందూ కోడ్ బిల్ “, “భక్తి సుధా”,”భాగవతసుధా”, “రాధా సుధా” వంటి పుస్తకాలు ఉదహరిస్తూ, సాంప్రదాయవాదాన్ని సమర్ధించడానికి గానీ ,విమర్శించడానికి గానీ కావాల్సిన పాండిత్య అవసరాన్ని తెలిపారు. ఒక వాదాన్ని అంగీకరించినా, అంగీకరించకపోయినా ఉభయపక్షములూ తెలుసుకొని వాదప్రతివాదాల విధానాన్నీ అవసరాన్నీ తెలియజేశారు ఈ ప్రసంగంలో .

    – చెరువులు ,నీటి సంరక్షణ సంబంధించిన “ఆజ్ భీ ఖరే హే తలాబ్ “అనే పుస్తకం నీటికీ సంస్కృతికి గల సంబంధం తెలుసుకోగలిగే అవకాశం ఉన్న పుస్తకంగా తెలుపుతూ , దాదాపు ఎనిమిది భాషలలో ఉన్న ఈ పుస్తకం తెలుగులో లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది అంటూ, ఇటువంటివి తెలుగులో కూడా ఉండడం ఒక అవసరమని తెలిపారు. ఒక జాతి సాంస్కృతిక విలువలను సమర్ధిస్తూ అందుకు దోహదపడే ఆంగ్ల సాహిత్యంలోని క్రింది పుస్తకాలు ప్రస్తావించారు. వెండెల్ బెర్రీ వారి ” వరల్డ్ ఎండింగ్ ఫైర్ ” , “అన్సెట్లింగ్ ఆఫ్ అమెరికా” పుస్తకాలు , రోజర్ స్క్రూటన్ వంటి రచయితలను పరిచయం చేశారు.

    చివరిలో “గురూజీ రవీంద్ర శర్మ ” గారి “ఆదిలాబాద్ కళాశ్రమం” గురించి వారి ప్రసంగాల కృషి తెలుగులో కూడా లభించవలసిన అవసరం ఉందని తెలిపారు. ప్రసంగం ఆద్యంతమూ చక్కని ఉదాహరణలతోనూ తార్కికమైన ఆలోచనలతోనూ అందించారు శ్రీ హేలీ కళ్యాణ్ గారు. వారి కృషి అభినందనీయం, అనుసరణీయం.

    ఈ ప్రసంగం పై శ్రీకస్తూరి మురళీకృష్ణ గారు వారి అభిప్రాయాన్ని తెలుపుతూ అనువాదం ఎంత ముఖ్యమో ఆ అనువాదం చేసేవారు ఎంత న్యాయం చేశారు అన్నది కూడా తగు జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి అని సూచించారు.

    అభిప్రాయం:

    “మనవాళ్లు వట్టి వెధవలోయి” అని తేలికగా తీసిపారేసే విధంగా సాహిత్యం మనలను రూపుదిద్దింది, అందులో సందేహం లేదు. ప్రస్తుత భారతీయ సనాతన ధార్మిక పరిస్థితి అందుకు సాక్ష్యం. అలా కాదు అని నిరూపించడానికి ప్రతీ భారతీయుడూ ,తెలుగువారమైన మనము చేతనైనంత కృషి ఏ రూపంలో అయినా నెరవేర్చవలిసిన ఆవశ్యకత ఉన్నది. యజ్ఞం , కర్మ , దానం, ధర్మం ,వంశ పరంపరాగత దేవతారాధన, సాహిత్య సేవ, పండుగలు, దేవాలయ పునరుద్ధరణ, ఇంకా ఎన్నో..

    ఇన్ని పార్శ్వాలలో ఎంతో కొంత చేస్తున్న సామాన్యులూ, వ్యవస్థలూ, తారసపడుతూ ఉంటారు(యి). ఇంతమంది ఇన్ని చేస్తూ ఉన్నా ప్రయత్నంలో పరిపూర్ణత కోసమై , మన దేశ ధార్మిక వ్యవస్థ పై వెలువెత్తే ప్రశ్నలకు నా వంటి సామాన్యులు సిద్ధంగా ఉండాలి అని అంటే పుస్తకములే ఆధారం. కాబట్టి ఎంతో శ్రమకు ఓర్చి వ్రాసిన అటువంటి పుస్తకములు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మన దేశ సాంస్కృతిక పరిస్థితికి వస్తున్న ప్రశ్నలకు తగు సమాధానంగా అలోచన చేసి తెలుగులో కూడా అందించవలసిన అవసరం ఉంది అని చెప్పడం ఈ ప్రసంగంలోని ఉద్దేశంగా తోచింది. అలాగే ముఖ్యమైన విషయం, మన దేశ సాంస్కృతిక సంబంధమైన, ధర్మ మీమాంసాలపైన కొన్ని పుస్తకాలు/వ్యాసాలు/ విషయాలు గత కొన్ని దశాబ్దాలుగా భారతీయ రాజకీయ / సామాజిక పరిస్థితులకు అనుగుణంగా చారిత్రక విషయాలను మరుగున పెట్టే ప్రయత్నం కూడా జరిగింది. ఉద్దేశ పూర్వకంగా మరుగున పెట్టలేదు అని అనుకున్నా, జాతీయతా భావాలున్న వారు కూడా విస్మరించిన విషయంగా కూడా కనపడుతుంది. పైన వివరించిన పరిస్థితికి ప్రసంగంలో ఉదాహరణగా తెలుగు వారికి వీరేశలింగం గారితో ఉన్నంత సామాన్య పరిచయం వారి సమకాలీనులు, సమఉజ్జీలు, అయిన కాశీభట్ట వారి పరిచయం లేకపోవటం గమనించవచ్చు. ఇటువంటి మహనీయులు ఎంతమందో!

    కాబట్టి నిందలతో పని లేకుండా ధార్మిక సాంస్కృతిక విషయములలో మన అభిప్రాయాలు సరిచేసుకుంటూ ఉండాలి. తెలుగు సాహిత్య పోషకులు, ఔత్సాహికులు ప్రసంగంలోని “మౌనం – అన్వేషణ” ల పైన దృష్టి సారించవలసినదిగా దిశా నిర్దేశం చేసుకొని,తగు విధంగా భారతీయతను పరిపుష్టం చేసుకోవలసిన బాధ్యత భారతీయులుగా ,తెలుగువారిగా మనకి ఎంతో ఉంది. ఇటువంటి సాహిత్యానికి కూడా తెలుగు నుడి నెలవు కాగలదని భావిస్తూ మీరు కూడా ఈ ప్రసంగాన్ని వినాలని కోరుకుంటున్నాను.

    0