Blog

  • మనసు ఛెళ్ళుమంది!

    (నిజ జీవిత సంఘటనల ఆధారంగా)

    కొన్ని సంవత్సరాల క్రిందట, పూనే లో జరిగిన అనుభవం. బైకు మీద ఇంటి నుండి ఆఫీసుకి వెళ్ళే దారిలో, ఒక పెద్ద ఆసుపత్రి ముందు ఉన్న రోడ్డుని రెండుగా చీలుస్తూ ఒక గుడి ఉండేది. నేను రోజు వారిగా, ఆ గుడి ముందు బైకు ఆపి, క్రిందకు దిగకుండా “హలో సార్! / నమస్తే సార్!/ కొంచెం హడావిడిలో ఉన్నా సార్!/ ఏంటి సార్, బావున్నారా?” ఇలా రక రకాల పలకరింపులతో ఆంజనేయస్వామిని పలకరించి పోతూ ఉండే వాడిని.

    ఆ గుడి ముందు, యాధావిధిగా ఒకరిద్దరు యాచకులు ఉండేవారు. ఎప్పుడైనా, ఏమైనా ఇచ్చేవాడిని లేదా మాములుగా, నా పలకరింపులతో సాగిపోయేవాడిని.

    1. కొత్త బిచ్చగాడు – మొదటి సంఘటన

    ఒక రోజు, కుష్టు వ్యాధి తగిలిన ఒక కొత్త బిచ్చగాడు అక్కడ కూర్చుని ఉన్నాడు. అతనిని చూసి జాలి కలిగి నా దగ్గిర ఉన్న లంచ్ బాక్స్ లోది తీసి అతనికి ఇచ్చేసాను. ఒకింత సంతోషంగానే తెస్సుకున్నాడు. అలా రోజూ ఆఫీసుకి వెళ్తూ, అతను కనిపిస్తాడేమోనని చూస్తూ ఉండేవాడిని.

    2. అదే బిచ్చగాడు – రెండో సంఘటన.

    ఈ సారి, మళ్ళీ అతను కనపడగానే, నా దగ్గిర బాక్సు తీసాను. అతను అన్య మనస్కంగా తన ముందు ఉన్న పళ్ళాన్నీ ముందుకు తోసాడు. నా దగ్గిర ఉన్న బాక్సులో ఉన్నది, అతని పళ్ళెం లోకి ఒంపి ముందుకు సాగిపోయాను. అలా రోజులు నడుస్తూ ఉండగా,

    3. బిచ్చగాడు – “అంతా వద్దులే, సగం చాలు”

    మరో సారి, బాక్సు తీసి అతని పళ్ళెం లో వేయబోతుంటే, అతను నోరు తెరిచి, “అంతా వద్దులే, సగం చాలు!”. అతని మాటలు తూచా తప్పకుండా పాటించి, సమన్యాయం పాటించాను. రోజులు నడుస్తున్నాయి…,

    4. మొహం తిప్పుకుంటున్న బిచ్చగాడు.

    ఆ తర్వాత, నేను ఎప్పుడు కనపడినా, అతను మొహం తిప్పుకోవడం మొదలు పెట్టాడు. నా బాక్సు బయటకు రాలేదు, అతను పళ్ళెం ముందుకు చాచలేదు.

    రోజులు నడుస్తున్నాయి,

    5. బిచ్చగాడు – “అంతా నాకే పెడితే, నువ్వేం తింటావ్?”

    ఈ సారి, నేను పట్టు వదలని విక్రమార్కుడిలా, బైకు దిగి బాక్సు తీసుకుని, అతని దగ్గిరకి వెళ్ళాను. అతను పళ్ళెం వెనక్కి లాక్కుంటూ, “అంతా నాకే పెడితే, నువ్వేం తింటావ్?” అని అడిగాడు. నేను, “పర్వా లేదు. నేను ఏదైనా కొనుక్కుని తింటాను.” అతను, “నీ డబ్బా నువ్వే ఉంచుకో. డబ్బు లివ్వు, నేనే వేడి వేడి గా కొనుక్కుని తింటాను. ” “డబ్బులు ఇవ్వను!” అక్కడి నుంది హూంకరిస్తూ నిష్క్రమించాను.

    ఆ తర్వాత,

    6. బిచ్చాగాడి వెక్కిరింత!

    ఆ తర్వాత, అతను నేను ఆ గుడి ముందు ఎప్పుడు తారసపడినా, అతను తన పక్కనే ఉన్న సంచి ఓపెన్ చేసి చూపిస్తూ ఉండేవాడు. దానిలో ఉన్న పళ్ళు, బ్రెడ్, బిస్కట్లు, ఇంకా ఏవో, “ఏమైనా కావాలంటే తీసుకో…”, అంటూ అతని కళ్ళు మాట్లాడుతూ ఉండేవి. “ఫన్నీ గై”, అనుకుంటూ, ఇద్దరం నవ్వులు ఎక్స్చేంజ్ చేసుకుంతూ ఉండేవాళ్ళం.

    7. బిచ్చగాడు తూట్లు పొడిచిన నా అహంకారం.

    ఆలోచించగా, అతనిలో ఏదో విషయం ఉంది అనిపించింది. ఒక సెలవు రోజు పనిగట్టుకుని, అతనిని కలవడానికి వెళ్ళాను. ముందుగా ఒక పదిరూపాయల నోటు చేతిలో పెట్టి, మాట కలిపాను. నేను, “ఫుడ్ ఇస్తే, ఎందుకు తీసుకోవు? డబ్బులే ఎందుకు అడుగుతావు?” అతను, “తిండి ఎవడైన ఫ్రీ గా పెడతాడు. బాత్-రూం కి వెళ్ళంటే డబ్బులు కావాలి. సులభ్ కాంప్లెక్ష్ వాడు, అవసరం తీర్చుకునే అవకాశం బిచ్చం వెయ్యడు.” నా తల గిర్రున తిరిగింది.

    అతను చెప్పిన మిగిలిన విషయాలు ఇలా, “నాకు ఎప్పుడూ చల్లారిన కూడేనా, వేడిగా తినాలనిపిస్తుంది కదా. అది కొనుక్కోవాలంటే డబ్బు కావాలి. జ్వరం వస్తుంది, తగ్గాలంటే, ఒక మందు బిళ్ళ, వేడి వేడి టీ కావాలి. బట్టలు ఇస్తారు, జోలే తప్ప ఇంకేమీ లేను, ఎక్కడా దాచుకోవాలి? అప్పుడప్పుడు స్నానం చెయ్యాలనిపిస్తుంది, మరి దానికి కూడా సబ్బూ కావాలి, డబ్బూ కావాలి. చలిగాలి కొడుతూ ఉంటుంది, వెచ్హగా ఒక బీడినో / సిగరెట్టో దమ్ము లాగాలనిపిస్తుంది. అసలు నువ్వు నన్ను బిచ్చాగాడిగా కాదు, మనిషిగా చూడు, నా అవసరలేమిటో, నాకు డబ్బెందుకు కావాలో తెలుస్తుంది. ఒక్క పూట తిండి పెట్టి, నన్ను జీవితాంతం ఉద్దరించే వాడిలా గర్వపడకు. అసలు నాలాగా డబ్బు లేకుండా, ఒక్క రోజు బ్రతికి చూపించు. చివరగా ఒక విషయం గుర్తుపెట్టుకో, ‘నాకు ఇది ఇచ్చినవాడే, నీకు అది ఇచ్చాడు.”

    నా మనసు ఛెళ్ళుమంది!.

    #అంతర్వాహిని_కథలు

    2
  • 5. నంది పాడ్యమి

    5. నంది పాడ్యమి

    కొన్నాళ్ళకి మా కాలనీకి బబ్లూ వచ్చాడు.

    మా కాలనీ జీవితం రెండు భాగాలుగా చేస్తే బిబి, ఆబి అని విడగొట్టుకోవచ్చు. బిఫోర్ బబ్లూ, ఆఫ్టర్ బబ్లూ.
    లేడీసందరికీ సత్యవతిగారు ఎలాగో మాకు బబ్లూ గాడు అలాగ. అప్పటినుంచీ మేము చేసిన రచ్చకి ఒక క్లాసుండేది. ‘అబ్బ, వీళ్ళేంటిరా ఇంత పద్ధతిగా అల్లరి చేస్తున్నారు’ అనిపించేంత!
    బబ్లూ ఇంట్లో వాళ్ళ అమ్మ, నాన్నగారు, బామ్మ ఉండేవారు. గాడ్జిల్లా అనే నల్ల కుక్క కూడా ఉండేది.

    మా కాలనీలో ముఖ్యమయిన పండుగ వినాయక చవితి. స్టేజీ మీద బొమ్మ పెట్టేవాళ్ళం. సత్యవతిగారి ఆర్గనైజేషన్ మొత్తం. కల్చరల్ ప్రోగ్రాములు, పాటలు, డాన్సులు (మావే), ఆటలు, లైటింగు, పార్కు మొత్తం ఒక పరస వాతావరణం వచ్చేసేది ఆ ఐదురోజులు.

    ఓ సంవత్సరం బబ్లూకి ఓ ప్రశ్నొచ్చింది. ఎన్నో సంవత్సరాలుగా వినాయక చవితి జరుపుకుంటున్నారు కదా, అది ఎవరు మొదలుపెట్టారా అని! వాళ్ల బామ్మ ని అడిగాడు, ఆవిడ “శివుడు మొదలు పెట్టాడు” అంది. నాన్నని అడిగాడు, ఆయన “ఋషులు మొదలెట్టారు” అని చెప్పారు. వీళ్ళలో ఎవరు కరెక్ట్ అని అమ్మని అడిగితే “వ్రత కథ సరిగ్గా వినమన్నాను అందుకే” అనో మొట్టికాయేసింది.
    ఫైనల్ గా వాడు తెలుసుకున్న విషయం ఏంటంటే, ఎవరికీ తెలియదు అని.
    ఐతే వాడికి ఒక ఆలోచన వచ్చింది. మనం కూడా ఒక పండగ కనిపెట్టి దానిని బాగా జరిపితే పాపులర్ అయిపోతాము కదా! ముఖ్యంగా ఓ రెండురోజులు స్కూల్ కి వెళ్ళక్కర్లేదు కదా!

    మమ్మల్నందరినీ కూర్చోబెట్టాడు మరుసటి రోజు. ఐడియా మాకూ బ్రహ్మాండంగా నచ్చింది! మన సొంత పండుగ, మనమే కనిబెడుతున్నాం! ఐతే ఎప్పుడు చెయ్యాలి, ఎవరికి చెయ్యాలి? ప్రతీ వారం ఏదోటి చేస్తూనే ఉంటారుగా మనోళ్ళు. మనోజుని ఏ రోజు ఖాళీగా ఉంటుందో చెప్పు పంచాంగంచూసి అనడిగాము. వాడి జ్ఞానంతో “ఒరేయ్ పాడ్యమి ఏ పండుగలు ఉండవురా” అన్నాడు. ఎండాకాలంలో చెయ్యలేము. మిగిలనిది దీపావళికి సంక్రాంతికి మధ్య రెండు నెలలు. క్రిస్ట్మస్ లోపే అయిపోవాలి. ఫిక్స్ ఐతే!

    ఓ నాలుగురోజులు ప్లాన్ చేసి ఒక ఉదయం వాళ్ళ అమ్మని, నాన్నని లేపి చెప్పాడు, “నాన్నగారు, నాకు నిన్న రాత్రి నిద్రలో నంది వచ్చింది. అది చాలా బాధ పడింది. ఇన్ని యుగాల నుంచి శివుడిని లోకాలన్నీ తిప్పుతున్నాను కదా, నాకు ఒక్క పండగ కూడా లేదా అని కంట తడి పెట్టుకుంది”! బామ్మ గబగబావచ్చి వాళ్ల నాన్నతో అంది “ఒరేయ్ నానీ, నేను చెప్పాను కదా, చిన్నప్పుడు వీడు పుట్టిన నక్షత్రం ఎంతో దివ్యమైనది అని! చూశావా, వీడికి నంది కలలోకి వచ్చిందట!! తరచూ మీ నాన్నగారికి కూడా నంది కలలోకి వచ్చేది రాఆఆఆ!” అని బబ్లూ గాడి ప్లాన్ ని పాస్ చేసేసింది.

    నవంబర్లో ఒక సాయంత్రం పిల్లలందరం కలిసి చందా డబ్బాలు పట్టుకుని బయలుదేరాం కాలనీ లో, వానర సేన లంక మీద పడ్డట్టు. ఒక్కొక్క ఇంటి వాళ్ళకీ టెన్షన్! ‘ఇప్పుడే కదా దసరా అయ్యింది, చందాల వాళ్లు ఏమైనా వదిలితే దీపావళి కి కల్చేసామాయే, ఇప్పుడు ఈ కొత్త కలక్షన్ ఏంటిరా భగవంతుడా’ అని!
    మన కాలనీ లో ప్రపంచం లోనే మొదటి సారి గా నంది పాడ్యమి జరుపుకుంటున్నాము, మీ వొంతు చందా ఇవ్వండి అని పాంప్లేట్లు లాగ మేమే రంగురంగు కాగితాలమీద రాసేశాం! ఒక్కొక్కళ్ళ మొహాలూ చూడాలి! నంది పాడ్యమి ఏమిటి, చందా ఏమిటి! పిల్లలు ఇలా రామదండు లాగా బయలుదేరడమేమిటి!
    అందరినీ పట్టుకుని పీడించి ఓ మోస్తరు కలక్షన్ చేశాం.

    అక్కడ వచ్చింది చిక్కు. గణపతి, దుర్గ బొమ్మలు చేసిన బెంగాళీ వాడు “నాకు నంది బొమ్మ నహీ ఆతా” అన్నాడు! మరెలా అంటే “ముఝే బొమ్మ దిఖాయేగా మే బనాయేగా” అన్నాడు. అనిల్ గాడి ఇంట్లో పాత చందన బ్రదర్స్ క్యాలెండర్ ఒకదాంట్లో పెద్ద నంది బొమ్మ కనబడింది. అది చింపుకొచ్చాం. అందులో నవ్వుతున్న నందిని చూపించి, “ఇదిగో, ఇప్పుడు చెయ్యి” అన్నాడు బబ్లూ. గోడకి అంటించాడు బెంగాళి.

    మన గుడి పంతులు ప్రసాదు గారిని “నంది పూజ మీకొచ్చా?” అనడిగితే ఆయన గాబరా పడిపోయి “నాకు రాదు బబోయి” అన్నారు. మరేంచెయ్యాలని అడిగితే “పక్క కాలనీలో అయ్యప్ప దేవాలయం ఉంది కదా, అందులో మలయాళం పంతులు గారొకాయనుంటారు, ఆయన్నడగండి” అన్నారు. ఆయనకూడా “అంబలం పూజయితే చేస్తానుగానీ నంది పూజేమిటి? నేనెప్పుడూ వినలేదు” అన్నారు. బామ్మ అందరినీ భీబత్సమైన తిట్లు తిట్టింది “షోడశోపచార పూజ చేసెయ్యడమే, నందికేశునోము లోవి కొన్ని వాడేస్తాం! అష్టోత్తరం శివుడిది చదివినా పర్లేదు… మిడిమిడి జ్ఞానం గాళ్ళందరూ పంతుళ్ళయిపోయారు, ఇందులో కష్టమేముంది..” అని!

    అయితే మన పంతులుగారి కొడుకు మనోజ్ ఓ ఐడియా ఇచ్చాడు. “మా నాన్నగారు చెయ్యనన్నా మా బాబాయొకాయనున్నారు. చిన్నప్పుడు ఇష్టంలేకపోయినా మా తాతగారు బలవంతంగా స్మార్తం నేర్పించారు. ఏదో సాఫ్ట్వేర్ ఉద్యోగాలని ట్రై చేస్తున్నాడిప్పుడు ఖాళీనే” అన్నాడు. అంతే! “వామ్మో వార్నాయనో” అని విలపిస్తున్నా వినకుండా బామ్మ గారి అజమాయిషీలో పిల్లలు అందరం కలిసి బాబాయిని ఎత్తుకొచ్చాం! “ఎలాగో ఉద్యోగం లేదు కదా రా, నంది పూజ చేస్తే బిల్ గేట్స్ ఉద్యోగం వస్తుంది అని కేనోపనిషత్ లో ఉంది” అని బబ్లూ వాళ్ళ బామ్మ బాబాయిని కన్విన్స్ చేసేసింది. “ఎలాగో ఎవరూ ఇంతకుముందు ఇది చెయ్యలేదు కదా, ఆ పేటెంటు నీదే” అంది! మరేమి మాట్లాడతాడు?

    ఒక వారం అయ్యాక బెంగాళీ దగ్గరనుంచీ ఒక రకంగా చూస్తున్న నంది (లాంటి) బొమ్మని పిల్లలందరం చిన్నారావు ఆటోలో తెచ్చాం. దానికి కూడా కళ్ళకి గుడ్డ కట్టి! మరి పూజ కి ముందు తీయకూడదు కదా! బాబాయి కష్టపడి పంచ కట్టుకుని, (అది జారిపోకుండా లోపల బెల్ట్ పెట్టుకుని) నామాలు పెట్టుకు వచ్చేడు. ఓ మూడురోజులకి సరిపడా ప్రసాదాల లిస్టు, పూజల లిస్టు పట్టుకొచ్చేసారు సత్యవతిగారు. అందరు లేడీసుకి డ్యూటీ వేసేసారు. షాజూ వాళ్ళ అమ్మగారి దగ్గరనుంచీ క్రిస్ట్మస్ లైట్లు పట్టుకొచ్చేసాం నంది స్టేజికోసం. మన మెడికల్ రిప్రజెంటేటివ్ ని పట్టుకుని కాటను థర్మకోలు ఫ్రీగా తెప్పించుకున్నాం. ఒక చిన్న కైలాసం లాగ వాటితో మంచుకొండలు కట్టాం బ్యాక్డ్రాప్ లో. అందరం కలిసి ఓ రోజు స్కూలు ఎగ్గోట్టాం.

    ఒహొ! ఏమి పూజలనుకున్నారూ? బాబాయి మంత్రాలు గబ గబా చదివేస్తున్నాడు (మరి …..) నంది పాడ్యమి అన్న విషయం తెలిసేసరికి పక్కన ఉన్న కాలనీ వాళ్ళూ, చుట్టాలూ అందరూ వచ్చేసారు ! కేరళ పంతులు గారు, అయ్యప దీక్షలో ఉన్న ఓ యాభైమంది కలిసొచ్చి ఓ రాత్రంతా కైలాసానికి వినబడేలా భజనలు చేశారు. మూడోరోజు అన్నదానం కూడా సెట్ చేశారు మా పార్కులో. హుండీ నిండింది!

    నిమజ్జనానికి మళ్ళీ చిన్నారావు ఆటో, బాబాయి మంత్రాలు (ఇప్పుడు కొంచం గట్టిగా చదివాడు లెండి — అలవాటు అయ్యింది కదా!), వెనకాల బబ్లూ గాడు ‘మాయదారి మైసమ్మ’ పాటలు, డాన్సులు, భలే అయ్యింది! బీచ్ రోడ్డులో జనాలకి అర్ధం అవ్వలేదు. ఇప్పుడేం నిమజ్జనం అని! అదీను బొమ్మచూస్తే గణపతి కాదు, దుర్గమ్మ కాదు. నంది అని గుర్తుపట్టడానికి వాళ్ళకీ కొంచం కష్టమయ్యుంటుంది.

    సంవత్సరం తిరిగింది. బాబాయికి నిజంగా అమెరికా లో ఉద్యోగం వచ్చింది, బబ్లూ గాడు అన్ని సబ్జక్టులలో మంచిమార్కులు తెచ్చేసుకున్నాడు. కాలనీ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న మంచినీటి పైపు ఇంకొకటి బిగించారు, రోడ్లు మరమ్మతు చేశారు. పార్కు గోడలకి మునిసిపాలిటీ వాళ్ళే రంగులేసారు.
    “అంతా నంది పాడ్యమి మహిమ” అని బామ్మగారు మొత్తం చాటేసారు. ఈ సారి చందా డబ్బా తియ్యకుండానే అందరూ ముందుకొచ్చారు!

    మరుసటి సంవత్సరం బెంగాళీ బొమ్మలో నంది నవ్వింది 😊

    _______________________________

    ఈ శీర్షిక లో మరి కొన్ని కాలనీ కథలు 🩷

    _______________________________

    ఈ పేరుతో ఓ కథ పన్నెండేళ్ళ క్రితం గంభోళజంబ అనే నా పాతబ్లాగులో రాసుకున్నాను. దాన్ని రీరైట్ చేసి మన కాలనీలోకి పట్టుకొచ్చాను.

  • గమనం

    గమనం

    అనిత, సుజాత, ప్రమీల, శైలజల  స్నేహం చాలా బలమైనది. వాళ్ళ నలుగురి స్నేహాం ఆరో తరగతి విజయనగరంలో మొదలైంది. ఒకే బెంచ్ మీద నలుగురు కూర్చునేవారు. ఒకేసారి మధ్యాహ్నం భోజనానికి డబ్బాలు తెరిచేవారు, వారు తెచ్చుకున్న వాటిని పంచుకొని తినేవారు. ఆస్తిపాస్తుల్లో తేడాలు ఉన్నప్పటికీ పెద్దగా అభిప్రాయాలూ కానీ వాటి బేధాలు కానీ ఏమి లేవు వారిలో. పదో తరగతిలో ఓ రోజు క్లాసులో ఖాళీగా కూర్చొని భవిష్యత్తు కోసం మాట్లాడుకుంటున్నారు.

    “నేను డాక్టర్ అవుదామని అనుకుంటున్నా” అన్నాది అనిత

    “నువ్వు అవుతావే, మీ ఇంట్లో అందరు డాక్టర్లే కదా” అన్నాది ప్రమీలా, “అందరు కాదు, మగవాళ్ళు మాత్రమే. ఆడవాళ్ళూ డాక్టర్లు అవ్వలేరు అంటారు మా తాతయ్య. అందుకైనా నేను డాక్టర్ని అవుతాను” అన్నాది పంతంగా.

    “నేను టీచర్ అవుదామని అనుకుంటున్నా” అన్నాది సుజాత

    “ఏమే, సెలవులు ఎక్కువ వస్తాయి అనా” ఉడికిస్తూ అడిగింది శైలజ. “ఆలా కాదె, ఏమో చిన్నప్పటి నుండి టీచర్స్ అంటే ఒక అభిమానం” అంది.

    “నేను త్వరగా పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నా” అన్నాది ప్రమీల

    మిగతా ముగ్గురు వింతగా చూసారు. “నా చదువు, పెళ్లి, తమ్ముళ్ల చదువులు ఇవన్నీ కష్టమట. మా అమ్మ ఎప్పుడూ అంటూంటాది” అన్నాది ప్రమీల కొంచం బాధగా.

    “నాకు పెద్ద కోరికలు ఏమి లేవు, ఏమౌతానో నాకు ఏమి తెలియదు” అంటూ శైలజ నవ్వింది.

    “ఏమౌతావో తెలియకుండా ఎలాగే” అడిగింది సుజాత. “ఏమో, అంతే”

    నలుగురు టెన్త్లో మంచి మర్క్స్ వచ్చాయి, తరువాత అందరు ఒకే కాలేజీలో ఇంటర్ సైన్స్ తీసుకున్నారు. అనిత, ప్రమీల బైపీసీ తీసుకోగా సుజాత, శైలజ ఎంపీసీ తీసుకున్నారు.

    ఇంటర్ రెండో సంవత్సరం వచ్చేవరకు ఎక్స్ట్రా కోచింగ్ కోసం అనిత వెళ్లడం మొదలు పెట్టింది, ప్రమీలాని కూడా రమ్మంది. అమ్మ నాన్న దగ్గర అంత డబ్బులు లేవు తాను రాలేను అని చెప్పేసింది. అనిత మిగతా ఇద్దరి స్నేహితురాళ్ళని వెంట పెట్టుకొని కష్టం మీద ప్రమీల అమ్మ నాన్నలను కోచింగ్ కి వేరేగా డబ్బులు కట్టనవసరంలేదు అని ఒప్పించింది. ఆ డబ్బులు కూడా తన పాకెట్ మనీ నుండి కట్టింది.

    నలుగురూ ఎంసెట్ కోసం బాగానే కాదు చాలా బాగా చదివారు. పరీక్షలు సమయం రావడం, వ్రాయడం, ఫలితాలు రావడం కూడా నెమ్మదిగా జరిగిపోయింది.

    అనితాకి చాలా పెద్ద రాంక్ వచ్చింది. ప్రమీలాకి మంచి రాంక్ వచ్చింది, ఎంత మంచిది అంటే ఫ్రీ సీట్ వచ్చేటంత. సుజాతకి వ్రాయకుండా ఉండడమే మంచిదేమో అనిపించేటంత వచ్చింది. ఇక శైలజాకి కూడా పర్లేదు అనుకునే రాంక్ వచ్చింది.

    శైలజకు ఎక్కడో వేరే ఊరిలో సీట్ వచ్చింది, పంపించడం కష్టమన్నారు శైలజ అమ్మానాన్న. సుజాత కూడా బుద్దిగా శైలజతోపాటు ఊరిలోనే డిగ్రీలో చేరింది.

    ఫ్రీ సీట్ వచ్చినా మెడికల్ అంటే మళ్ళి పెళ్లి, కట్నాలు ఎక్కువ ఇచ్చుకోవాలి తమ్ముళ్లు చదువులు ఎలా అని ఆలోచనలో పడిపోయారు ప్రమీల తల్లితండ్రులు. అనిత అమ్మానాన్న వచ్చి “ఇటువంటి మంచి అవకాశం మళ్ళి మళ్ళి రాదు, ఆర్ధికంగా సహాయం కావాలి అంటే చూసుకుంటాం” అన్నారు. “ఇంకా పెళ్లి కట్నాలు కోసం చింత వద్దు అవన్నీ తానే సొంతంగా చదువయ్యాక చూసుకుంటాది, మీరు వాటికోసం అంతగా ఇప్పుడు పట్టించుకోవద్దు” అని నచ్చచెప్పారు.

    మళ్ళి లాంగ్ టర్మ్ చేస్తాను అంటే వద్దని అనిత నాన్నగారు తన పరపతి వాడి మేనేజ్మెంట్ సీట్ సంపాదించారు.

    ఆలా ఇద్దరు ఒక ఊరిలో మరో ఇద్దరు వేరే వేరే ఊళ్లలో పై చదువులు మొదలయ్యాయి.

    కాలంతో పాటు చదువులు పూర్తవుతూ వచ్చాయి. మొదట్లో వేసవికాలం సెలవులకు కలిసేవారు. నెమ్మదిగా అది కూడా తగ్గ సాగింది.

    టీచర్ కావాలి అనుకున్న సుజాత పెళ్లి చేసుకొని US వెళ్ళిపోయింది.

    త్వరగా పెళ్లి చేసుకుంటాను అన్న ప్రమీల హైద్రాబాద్లో ఓ పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో కన్సల్టింగ్ గైనకాలజిస్ట్, తన క్లాసుమేట్ కార్డియాలజిస్ట్ని పెళ్లిచేసుకొంది. తమ్ముళ్లు కూడా పెద్ద చదువులు చదివారు.

    అనిత పై చదువులకోసం కెనడా వెళ్లి అక్కడే పెళ్లి చేసుకొని ఉండిపోయింది.

    ఏమి అవుతానో తెలియదు అన్న శైలజ పెళ్ళై భర్త చనిపోయాక అతను చేసే ఉద్యోగం వచ్చింది. గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్లో టీచర్గా ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేస్తుంది. స్నేహితులందరికీ వారధి, అందరిని వాట్సాప్లో కలిపి ఉంచుతుంది.

    అందరూ బిజీ, ఎవరి జీవితాలు వారివి. పాత స్నేహితులు గుర్తు ఉన్నప్పటికినీ పిల్లలు వారి చదువులు, ఉద్యోగాలు, కొత్త స్నేహాలు, ఒకదానికి ఇంకొకటి తోడై కలుసుకోడానికి వీలు కూడా కుదరని పరిస్థితులు.

    ఓ ఇరువై ఏళ్ళ తరువాత అందరు కలుద్దామని నిశ్చయించుకున్న రోజు వచ్చింది. నలుగురు విజయనగరంలో అనిత ఇంట్లో కలిశారు.

    అన్నేళ్లు తరువాత చూసుకునేసరికి అందరికి కొంచం వింతగానూ, చాలా ఆనదంగాను అనిపించింది.

    “ఎంత మారిపోయామో అందరం” అంది అనిత కొంచం యాక్సెంట్తో .

    “యా” అంటూ సుజాత వంత పాడింది.

    “యు గైస్ ఫుట్ ఆన్ లాట్ అఫ్ వెయిట్, బట్ శైలజ అలాగే ఉంది కదా” అంది ప్రమీల.

    “మనం మారలేదే, మన సహజత్వం ఇప్పుడు బయటకు వచ్చిందేమో” అంటూ శైలజ నవ్వింది.

    అందరి బట్టలు వేష భాషలతో పోలిస్తే శైలజ చాలా నిరాడంబరంగా ఉంది.

    కాఫీ, స్నాక్స్ అన్ని అక్కడకే వచ్చాయి. స్నాక్స్ తింటూ చిన్ననాటి విషయాలు ఎన్నో గుర్తు చేసుకున్నారు. నవ్వుతూ గడిపిన క్షణాలు, ఆటలు, పోటీలు అన్నీ.

    “చెప్పండి లైఫ్ ఎలా ఉంది” అని అడిగింది శైలజ కాఫీ తాగుతూ.

    “క్షణం తీరికలేని జీవితం నాది. హాస్పిటల్ ఇల్లు పిల్లలు. మావారు కార్డియాలజి సర్జన్ నేను గైనిక్ సర్జన్, సో ఎవరికి ఎప్పుడు ఫోన్ వస్తే అప్పుడు పరిగెత్తడమే. సంవత్సరానికి ఒకటి రెండు ఫారిన్ ట్రిప్స్ కోసం తప్పనిసరిగా సెలవు పెడతాము, లేకపోతె అస్సలు ఖాళి దొరకదు. పిల్లలు కూడా మెడిసిన్ చేస్తాము అంటున్నారు కాబట్టి చూడాలి” అంది ప్రమీల కొంచం గర్వంగా.

    “నాకైతే పర్లేదు, వీకెండ్స్ మా వారికీ సెలవు. సంవత్సరానికి ఒకటో రెండో ఫారిన్ ట్రిప్స్. మొన్ననే ఒక రెండో విల్లా తీసుకున్నాం, అల్ కూల్” అన్నాది సుజాత తాను ఎక్కడ తగ్గను అన్నట్టు.

    “నేను నా హస్బెండ్ అర్ ఇంటూ టీచింగ్. అక్కడే మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్స్, సెమినర్స్ అంటూ ఎప్పుడూ ఎక్కడకొ ఒక దగ్గరకి తిరుగుతూనే ఉంటాం, సో లైఫ్ హాయిగా వెళ్ళిపోతుంది. మరి నీ సంగతి ఏమిటి చెప్పు శైలు” అని అడిగింది అనిత దర్పం దాస్తూ.

    “మా వారు చనిపోయాక నాకు ఆ ఉద్యోగం వచ్చింది. చుట్టూ కొండలు అడవులు, పిల్లలిని పట్టుకు వచ్చి చదివించాలిదాని కోసం వారానికి ఒక్కసారైనా చుట్టుపక్కల ఊళ్లు తిరుగుతూ ఉంటాను. వంద మందిలో ఓ ఇరువై ముఫై మంది టెన్త్ వరకు చదివితే గొప్ప. నాకు పిల్లలు లేరు కాబట్టి అక్కడే లైఫ్ గడుస్తుంది, సెలవల్లో అక్కడ మెడికల్ క్యాంప్స్ గట్రా చేస్తూ నాకు తోచిన సాయం చేస్తూ ఉంటాను” అన్నాది శైలజ నెమ్మదిగా.

    “అయినా అక్కడ ఎలా ఉంటున్నావే, మలేరియా ఎక్కువ కదా. మన ఊరి వైపు ట్రాన్స్ఫర్ పెట్టించుకోవచ్చుగా ” అడిగింది ప్రమీల.

    “అందరూ ఆలా అంటే ఎలాగే” తిరిగి ప్రశ్నించింది శైలజ

    “ఇండియా ఇంకా మారలేదు” అంటూ సుజాత ఏదో చెప్పబోతే అడ్డుకుంటూ “మనం చదువుకున్నాం, మనం అదృష్టవంతులం. ఆ విషయంలో నాకన్నా అదృష్టం ఎవరికి ఉండదు, ఆలా అని అందరికి ఆ ఛాన్స్ రాదు. నువ్వు US, అది కెనడా కాబట్టి మీకు మార్పు కనిపించదు” అంది ప్రమీల కొంచం ఆవేశంగా.

    సుజాత మాటకు, ప్రమీల వివరణకు అనిత, శైలజలు మౌనంగా ఉండిపోయారు. పాత కబుర్లు, నవ్వులు ఒక్కసారిగా ఆగిపోయాయి. వాళ్ళ మధ్య చిన్నపాటి నిశ్శబ్దం అలుముకుంది. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ శైలజ నెమ్మదిగా అంది, “అవును ప్రమీలా, నువ్వు చెప్పింది నిజం. మనం అదృష్టవంతులం. కాని మనల్ని అదృష్టవంతుల్ని చేసింది మన కష్టం, మన చదువు మాత్రమే కాదు… మన స్నేహం కూడా.”

    “అది మాత్రం నిజం, నేను టీచర్ని అవుదామనుకున్న కాలేకపోయా. కానీ మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందో తెలుసా. మీ గెలుపులు నావిగా భవిస్తూ ఉంటాను. అసలు మనం శైలజాకి పెద్ద థాంక్స్ చెప్పాలి అందరిని కట్టి ఉంచినందుకు” అంటూ సుజాత కన్నీళ్లు పెట్టుకుంది.

    ఈ మాటలు అనిత, ప్రమీల, శైలజలకు ఒక మెరుపులా అనిపించాయి. వాళ్లకి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. టెన్త్ క్లాస్‌లో భవిష్యత్తు గురించి మాట్లాడుకున్న రోజు, ఎంసెట్ కోచింగ్‌కు ప్రమీలను ఒప్పించిన సందర్భం, ప్రమీల తల్లిదండ్రులను అనిత, ఆమె తండ్రి కలిసి ఒప్పించిన సంఘటన, శైలజకు సీటు వచ్చినా దూరప్రాంతం అని వెళ్లలేకపోయిన బాధ, సుజాత తనకు కూడా అక్కడే డిగ్రీలో చేరడం – ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి కళ్ళ ముందు మెదిలాయి.

    ప్రమీల కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. “క్షమించండి. నాది చాలా స్వార్థపూరితమైన జీవితం. నా గురించి, నా కుటుంబం గురించి తప్ప నేను ఎప్పుడూ పెద్దగా ఆలోచించలేదు. నా మెడికల్ సీటు కోసం మీరు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ఇన్ని రోజులు ఆ విషయాన్ని నేను దాదాపుగా మర్చిపోయాను. నా జీవితం మీరు పెట్టిన భిక్ష. మీ అందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను.” అంటూ భావోద్వేగంతో ప్రమీల మాట్లాడింది.

    శైలజ నవ్వుతూ, “అలా అనకు ప్రమీలా… మనకి ఎవరు ఎవరికి ఇచ్చిందేమీ లేదు. మనం మనలో ఒకరికొకరం సహాయం చేసుకున్నాం అంతే. ఇదే స్నేహం, ఇదే జీవితం సాగుతుంది అంతే.”

    “పోనీ నలుగురం కలసి ఏదైనా ఎన్జిఓ పెడదామా. శైలజ ఏరియాలో పనిచేయడానికి” అంటూ అనిత అందరి వైపు చూసింది పెద్ద కళ్ళతో.

    “వద్దు లేవే, నలుగురం వచ్చాము కలుద్దాం, హాయిగా ఈ రెండు రోజులు టైం స్పెండ్ చేద్దాం, మళ్ళీ వీలున్నప్పుడు కుదిరినప్పుడు మళ్ళీ కలుద్దాం. ఏదైనా అవసరం ఉంటె నేనే చెబుతాను” అంది శైలజ నెమ్మదిగా.

    “అదేమిటే, అనిత ఏదో చేద్దాం అంటే నువ్వు వద్దంటావు, మేము దేశం కోసం ఏదో చెయ్యాలని అనుకుంటాం కదా. నీ అంత కాకాపోవచ్చు, ఏదో ఉడతా భక్తి సాయం” అంది సుజాత

    “అవునే మీకు నేను చెప్పేది నచ్చకపోవచ్చు కానీ నిజం. నేను జాబ్ చెయ్యాలా, ఇక్కడ గవర్నమెంట్ పధకాలు అమలు చెయ్యడానికి సాయం చెయ్యాలా, ఎలక్షన్ డ్యూటీస్ ఉంటాయా, ఇంకా స్కూల్ ఫంక్షన్స్ అన్ని కలిపి నాకు సంవత్సరానికి ఒక పదిహేను ఇరువై రోజులు సెలవు దొరుకుతుంది. అందులో ఇంకో పని నెత్తిన పెట్టుకోవడం అంటే కష్టం. స్నేహం మధ్యలోకి డబ్బులు విషయాలు వచ్చాయి అంటే బంధాలు ఇంకా జఠిలమైపోతాయి. అందుకే ఆలా అన్నాను. అయినా మీకు వీలు కుదిరినప్పుడల్లా రండి, వచ్చి తోచింది చెయ్యండి. దానికోసం NGO మళ్ళి పెట్టి హుంగామా ఎందుకు అని నా ఉద్దేశం అంతే” నిదానంగా సమాధానం చెప్పింది.

    మళ్ళీ నలుగురు కొంత సేపటికి ఇవ్వన్నీ పక్కన పెట్టి వారి వారి చిన్ననాటి విషయాలు మాట్లాడుకుంటూ నవ్వుల్లో ములిగిపోయారు.

    ఎవరో మహానుభావుడు అన్నట్టు జీవితం యొక్క గమ్యం గమనమే.

    1
  • గాజు కిటికీ – రెండు ప్రపంచాలు


    A view from my Office window

    నీలాకాశం, నీరు, చల్ల గాలి –
    అన్నీ కవితలు రాస్తుంటే
    నా కీబోర్డ్ మాత్రం
    డెడ్‌లైన్‌ లను లెక్కపెడుతోంది

    కిటికీ ఆవతల ప్రకృతి పాడుతున్న గీతం
    కానీ నా మనసు ఆ మెలోడీ ని మ్యూట్ చేసి
    ఒక టీంస్ కాల్ లో చేరిపోతుంది

    శరదృతువు బయట రంగుల కేళి ఆడుతుంటే
    లోపల మనసు ఒకే నీలిమ లో మునిగిపోయింది

    ప్రకృతి ప్రతి రోజూ కొత్త పాఠం రాస్తుంటే
    మనసు మాత్రం పాత పేజీ తిరగేయలేక తడబడుతోంది.

    3
  • “తెలుగు(అనువాద) సాహిత్యం – విడువవలసిన మౌనాలు – జరుపవలసిన అన్వేషణలు” ప్రసంగంపై వ్యాసము – అభిప్రాయము

    అంతర్జాల వేదికగా “హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి” వారు నిర్వహించిన సదస్సులో “తెలుగు(అనువాద) సాహిత్యం – విడువవలసిన మౌనాలు – జరుపవలసిన అన్వేషణలు” అనే శీర్షిక పైన శ్రీ హేలీ కళ్యాణ్ గారి ప్రసంగంపై చిన్న వ్యాసము. ఇటువంటి విషయంపై వినడము కొత్త అనుభవం. కవితలు, అలంకారాలు, భక్తి సాహిత్యం , కావ్యాలు వంటి ప్రక్రియలపై మక్కువ తో తెలుగు-నుడిలో భాగాలుగా కూడా దాదాపు అదే కోవకు చెందినవి కావడం పరిపాటి అయింది . కానీ సాహిత్యంలో మౌనాలు, అన్వేషణలు కొత్తగా అగుపించి కొంత క్షుణ్ణంగానే ఈ ప్రసంగాన్ని విని ఒక వ్యాసము తెలుగు నుడిలో ప్రకటించాలని అనిపించింది. ఈ ప్రయత్నం కొత్తది కాబట్టి లోటుపాట్లు ఉంటవి.

    ప్రసంగంలో మాట్లాడిన విషయాలు :

    శీర్షికలోని “మౌనం” మాటను నిర్వచిస్తూ – తెలిసినా వ్రాయకపోవడం/మాట్లాడకపోవడం గానూ – తెలుగులో విస్తృతంగా లేనివి అనువదించుకోవలసినదిగా “అన్వేషణ” గా నిర్వచించారు. ముందుగా మౌనం వహిస్తున్న విషయాలు చర్చిస్తూ , ప్రస్తుతం చదువుతున్న లేక విరివిగా (Popular)గా లభ్యమవుతున్న పుస్తకాలు/ రచనలు Word cloud లో చూపెట్టారు.

    యండమూరి- అయాన్ రాండ్ – ఖలీల్ గిబ్రాన్ – కాఫ్కా – జర్మన్ జానపద కథలు – విశ్వనాథ – వెండి డోనిగర్ – రోమీల – ముళ్ళపూడి – క్రైస్తవ సాహిత్యం – వసు చరిత్ర – మనుచరిత్ర – షేక్స్పియర్

    ఇలా ఎంతో వైవిధ్యత తెలుగులో ఉంది. ఎవరికి నచ్చినవి వారు చదవాలి, వ్రాయాలి . కానీ ఒక జాతి సాంస్కృతిక విషయాలకు సంబంధించిన పుస్తకాల గురించి, భారతీయతపై ఆసక్తి/ ఉత్సాహం ఉన్న చదువరులకు/ రచయితలకు ఉన్న అవకాశాల గురించి కళ్యాణ్ గారు ప్రస్తావించారు. అలా ప్రస్తావించిన పుస్తకాలు

    – “అరుణాచలంలో చలం” – సాంప్రదాయానికి దీటుగా వ్రాసిన వ్యక్తి తన జీవిత చివరిదశ లో భగవాన్ స్మృతులతో గడిపిన వ్యక్తి గా మిగిలి పోక, ఆ దశ ప్రస్తావన చాలా అరుదుగా ఉండడం సాహిత్యంలో మౌనంగా చక్కని ఉదాహరణలతో వివరించారు.

    – “కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి” గారి రచనలు – హిందూమతంపై నిరసనలను, వ్యాసాలను, తిప్పికొడుతూ సహేతుకంగా చేసిన సాహిత్య సృజన , వీరేశలింగం పంతులు గారికీ కాశీభట్ట వారికీ జరిగిన కలహము , పాఠశాల స్థాయి నుంచీ ప్రజలకు అందించకపోవడం, సాహిత్య లోకం విస్మరించిన తీరు కూడా ఒక మౌనంగా ఉదహరించారు శ్రీ హేలీ కళ్యాణ్ గారు.

    ఇక కొన్ని అన్వేషించ అవసరం ఉన్న సందర్భాలూ, పుస్తకాలకు ఉదాహరణలు చూపెడుతూ –

    “ఆర్య సామాజికులకు సాంప్రదాయవాదులకు జరిగిన చర్చలు” – ఒకే వేదికపై వారికి జరిగిన వాగ్వివాదాలను తెలుగు సాహిత్యంలో అందకపోవడం పైన అన్వేషణ జరగవలసిన అవసరం ఉంది. ఈ కోవలో హిందీలోని ” పురాణ దిగ్దర్శన్” , “క్యోఁ” వంటివి ఉటంకిస్తూ, శ్రీ చిర్రావూరి శివ రామకృష్ణ శర్మ గారూ ఉప్పల రాధాకృష్ణ గార్ల “నాలుగు శాస్త్రాల చర్చ” ప్రస్తుతం లభిస్తున్న పుస్తకం అనీ, అటువంటి పుస్తకాలు ధ్యేయంగా తెలుగు సాహిత్యంలో కూడా పుస్తకాలు రావాలి అని కోరుకున్నారు. – కరపాత్ర స్వామి వారి “రామాయణం మీమాంస”, “హిందూ కోడ్ బిల్ “, “భక్తి సుధా”,”భాగవతసుధా”, “రాధా సుధా” వంటి పుస్తకాలు ఉదహరిస్తూ, సాంప్రదాయవాదాన్ని సమర్ధించడానికి గానీ ,విమర్శించడానికి గానీ కావాల్సిన పాండిత్య అవసరాన్ని తెలిపారు. ఒక వాదాన్ని అంగీకరించినా, అంగీకరించకపోయినా ఉభయపక్షములూ తెలుసుకొని వాదప్రతివాదాల విధానాన్నీ అవసరాన్నీ తెలియజేశారు ఈ ప్రసంగంలో .

    – చెరువులు ,నీటి సంరక్షణ సంబంధించిన “ఆజ్ భీ ఖరే హే తలాబ్ “అనే పుస్తకం నీటికీ సంస్కృతికి గల సంబంధం తెలుసుకోగలిగే అవకాశం ఉన్న పుస్తకంగా తెలుపుతూ , దాదాపు ఎనిమిది భాషలలో ఉన్న ఈ పుస్తకం తెలుగులో లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది అంటూ, ఇటువంటివి తెలుగులో కూడా ఉండడం ఒక అవసరమని తెలిపారు. ఒక జాతి సాంస్కృతిక విలువలను సమర్ధిస్తూ అందుకు దోహదపడే ఆంగ్ల సాహిత్యంలోని క్రింది పుస్తకాలు ప్రస్తావించారు. వెండెల్ బెర్రీ వారి ” వరల్డ్ ఎండింగ్ ఫైర్ ” , “అన్సెట్లింగ్ ఆఫ్ అమెరికా” పుస్తకాలు , రోజర్ స్క్రూటన్ వంటి రచయితలను పరిచయం చేశారు.

    చివరిలో “గురూజీ రవీంద్ర శర్మ ” గారి “ఆదిలాబాద్ కళాశ్రమం” గురించి వారి ప్రసంగాల కృషి తెలుగులో కూడా లభించవలసిన అవసరం ఉందని తెలిపారు. ప్రసంగం ఆద్యంతమూ చక్కని ఉదాహరణలతోనూ తార్కికమైన ఆలోచనలతోనూ అందించారు శ్రీ హేలీ కళ్యాణ్ గారు. వారి కృషి అభినందనీయం, అనుసరణీయం.

    ఈ ప్రసంగం పై శ్రీకస్తూరి మురళీకృష్ణ గారు వారి అభిప్రాయాన్ని తెలుపుతూ అనువాదం ఎంత ముఖ్యమో ఆ అనువాదం చేసేవారు ఎంత న్యాయం చేశారు అన్నది కూడా తగు జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి అని సూచించారు.

    అభిప్రాయం:

    “మనవాళ్లు వట్టి వెధవలోయి” అని తేలికగా తీసిపారేసే విధంగా సాహిత్యం మనలను రూపుదిద్దింది, అందులో సందేహం లేదు. ప్రస్తుత భారతీయ సనాతన ధార్మిక పరిస్థితి అందుకు సాక్ష్యం. అలా కాదు అని నిరూపించడానికి ప్రతీ భారతీయుడూ ,తెలుగువారమైన మనము చేతనైనంత కృషి ఏ రూపంలో అయినా నెరవేర్చవలిసిన ఆవశ్యకత ఉన్నది. యజ్ఞం , కర్మ , దానం, ధర్మం ,వంశ పరంపరాగత దేవతారాధన, సాహిత్య సేవ, పండుగలు, దేవాలయ పునరుద్ధరణ, ఇంకా ఎన్నో..

    ఇన్ని పార్శ్వాలలో ఎంతో కొంత చేస్తున్న సామాన్యులూ, వ్యవస్థలూ, తారసపడుతూ ఉంటారు(యి). ఇంతమంది ఇన్ని చేస్తూ ఉన్నా ప్రయత్నంలో పరిపూర్ణత కోసమై , మన దేశ ధార్మిక వ్యవస్థ పై వెలువెత్తే ప్రశ్నలకు నా వంటి సామాన్యులు సిద్ధంగా ఉండాలి అని అంటే పుస్తకములే ఆధారం. కాబట్టి ఎంతో శ్రమకు ఓర్చి వ్రాసిన అటువంటి పుస్తకములు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మన దేశ సాంస్కృతిక పరిస్థితికి వస్తున్న ప్రశ్నలకు తగు సమాధానంగా అలోచన చేసి తెలుగులో కూడా అందించవలసిన అవసరం ఉంది అని చెప్పడం ఈ ప్రసంగంలోని ఉద్దేశంగా తోచింది. అలాగే ముఖ్యమైన విషయం, మన దేశ సాంస్కృతిక సంబంధమైన, ధర్మ మీమాంసాలపైన కొన్ని పుస్తకాలు/వ్యాసాలు/ విషయాలు గత కొన్ని దశాబ్దాలుగా భారతీయ రాజకీయ / సామాజిక పరిస్థితులకు అనుగుణంగా చారిత్రక విషయాలను మరుగున పెట్టే ప్రయత్నం కూడా జరిగింది. ఉద్దేశ పూర్వకంగా మరుగున పెట్టలేదు అని అనుకున్నా, జాతీయతా భావాలున్న వారు కూడా విస్మరించిన విషయంగా కూడా కనపడుతుంది. పైన వివరించిన పరిస్థితికి ప్రసంగంలో ఉదాహరణగా తెలుగు వారికి వీరేశలింగం గారితో ఉన్నంత సామాన్య పరిచయం వారి సమకాలీనులు, సమఉజ్జీలు, అయిన కాశీభట్ట వారి పరిచయం లేకపోవటం గమనించవచ్చు. ఇటువంటి మహనీయులు ఎంతమందో!

    కాబట్టి నిందలతో పని లేకుండా ధార్మిక సాంస్కృతిక విషయములలో మన అభిప్రాయాలు సరిచేసుకుంటూ ఉండాలి. తెలుగు సాహిత్య పోషకులు, ఔత్సాహికులు ప్రసంగంలోని “మౌనం – అన్వేషణ” ల పైన దృష్టి సారించవలసినదిగా దిశా నిర్దేశం చేసుకొని,తగు విధంగా భారతీయతను పరిపుష్టం చేసుకోవలసిన బాధ్యత భారతీయులుగా ,తెలుగువారిగా మనకి ఎంతో ఉంది. ఇటువంటి సాహిత్యానికి కూడా తెలుగు నుడి నెలవు కాగలదని భావిస్తూ మీరు కూడా ఈ ప్రసంగాన్ని వినాలని కోరుకుంటున్నాను.

    0
  • సంక్షేమ పధకాల ద్వారా అభివృద్ధి – ఇదొక వినూత్న ఆర్ధిక సూత్రం

    ఈ మధ్య ఆంధ్రజ్యోతి పత్రిక ఒక కధనం ప్రచురించింది. జీఎస్టీ రేట్లు తగ్గటం, అంతేగాక “తల్లికి వందనం” పథకం ద్వారా దాదాపు అన్ని కుటుంబాలకి డబ్బులు రావడం వల్ల అంధ్రాలో అనేక రకాల వస్తు సామాగ్రుల అమ్మకాలు పెరిగాయని, ఆఖరికి ఆ డబ్బుతో బంగారం కూడా కొని దాచుకుంటున్నారని. ఆ విధంగా కూటమి ప్రభుత్వం విధానాల వల్ల ప్రజల కొనుగోలు శక్తి పెరిగి ఆర్ధిక వ్యవస్థ బలపడుతున్నదని.

    ఏడవాలో నవ్వాలో అర్ధంకాలేదు. ప్రజలు “తల్లికి వందనం” సొమ్ముతో అనేక రకాల వస్తు సామాగ్రులు కొనుక్కుంటున్నారంటే దాని అర్ధం వాళ్ళు ఆ డబ్బుని పొదుపు చేసుకుని తమ పిల్లల చదువుకి వాడుకోవాల్సిన అవసరం లేకపోటం వల్లే కదా. అంటే ఈ పధకం కింద వేలకోట్ల రూపాయల డబ్బు ప్రభుత్వం అనర్హులకి లేదంటే అవసరం లేని వారికి కూడా ఇస్తున్నట్టే కదా. పైగా ఇదేదో గొప్ప ఆర్ధిక విధానమన్నట్టు ఆంధ్రజ్యోతి బాకాలు ఊదటం. ఐతే మీలో కొంతమందికి ఈ కొనుగోలుశక్తి పెరుగుదల అనేది సబబైన వాదనగా అనిపించొచ్చు. అది ఎందుకు డొల్ల వాదనో వివరిస్తాను. దీన్ని ఆర్ధిక శాస్త్ర నిపుణులు the fallacy of broken window గా అభివర్ణిస్తారు.

    ఒక ఆకతాయి కుర్రాడు ఒక షాపుకున్న గాజు కిటికీని రాయి విసిరి పగలకొట్టి పారిపోయాడనుకోండి. ఆ షాపు యజమాని ఆ తర్వాత ఏమి చేస్తాడు? కొత్త గాజు కిటికీ పెట్టించు కుంటాడు. గాజు కిటికీలు అమ్మే వ్యాపారికి అదనంగా రాబడి వచ్చింది కాబట్టి అతను ఆ డబ్బుతో వాళ్ళావిడకి చీర కొనిపెట్టాడు. ఈ ఆంధ్రజ్యోతి లాజిక్ ప్రకారం ఆకతాయి చేసిన పని వల్ల కిటికీలు అమ్మేవాడు, చీరలు అమ్మే వాడు ఎక్కువ వ్యాపారం చేయగలిగారు, అలా ఆ పట్టణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ది చెందింది. కానీ ఇక్కడ గమనించాల్సిందేంటంటే కొత్త గాజు కిటికీ కోసం ఆ షాపు యజమాని పెట్టిన ఖర్చు (ఐదు వేల రూపాయలనుకుందాం) అతను అకారణంగా కోల్పోయినట్లేగా. సరే అతను కోల్పోయిన ధనం సమాజం వేరెవరికైనా పూర్తిగా దక్కిందా? కిటికీలమ్మే వ్యాపారికి ఆ 5 వేలు ముట్టాయి, కానీ అతను 4 వేల ఖరీదయిన కిటికీని షాపు యజమానికి అప్పజెప్పాడు కదా. అంటే అతనికి నికరంగా వెయ్యి రూపాయిలు దక్కాయి. మరి షాపు యజమానికి 5 వేల రూపాయిలు పోయాయి కదా. ఆ మిగిలిన నాలుగు వేల రూపాయలు ఆ పగిలిన కిటికీ విలువ అన్నమాట. అంటే ఆ ఆకతాయి వల్ల అక్కడి ఆర్థిక వ్యవస్థలోంచి నాలుగు వేల రూపాయల విలువున్న ఆస్తి వృథాగా నష్టమయింది.

    ఇప్పుడు ఇంకో సన్నివేశం ఊహించుకోండి. కిటికీలు అమ్మే వ్యాపారి కొంత సొమ్ము R&D పై వెచ్చించి కొత్త డిజైన్ల కిటికీలు తయారు చేశాడు. షాపు యజమాని అలాంటి కొత్త కిటికీ ఒకటి  8 వేల రూపాయలకి కొనుక్కుని, పాత కిటికీని OLX లో 4 వేలకి అమ్మేశాడు. ఈ మొత్తం వ్యవహారంలో షాపు యజమానికి నికరంగా 4 వేల రూపాయల ఖర్చయినా ఆ కొత్త కిటికీ వల్ల తన షాపుకి కొత్త అందాలు వచ్చి ఎక్కువ కస్టమర్లు రావటం మొదలెట్టారు, దానివల్ల అతని ఆదాయం పెరిగింది. ఈ సన్నివేశంలో షాపు యజమాని, కిటికీల వ్యాపారి ఇద్దరికీ నికర ఆదాయం పెరిగింది. ఇదీ ఆర్థిక వ్యవస్థ పెరగాల్సిన పద్ధతి.

    మళ్ళీ ప్రభుత్వ సంక్షేమపథకాల దగ్గరికి వద్దాం. ఒక అంచనా ప్రకారం ప్రభుత్వాలు ఖర్చుపెట్టే ప్రతి రూపాయి అక్కడి ఆర్థిక వ్యవస్థ నుండి 2-3 రూపాయలు పీల్చేస్తేనే ప్రభుత్వానికి సమకూరుతుంది. ఎలా అంటే, ప్రభుత్వం  సమాజం నుంచి పన్నుల రూపేణా, అప్పుల రూపేణా 2 రూపాయలు లాగేసుకుని, ప్రభుత్వ యంత్రాంగం నడవటానికి కొంత ఖర్చుపెట్టు కుని మిగిలిన డబ్బంతా సంక్షేమ పధకాలద్వారా మళ్ళీ  ప్రజలకి ప్రభుత్వానికి సహజంగా ఉండే inefficiency తో వెనక్కిచ్చినా మిగిలేది ఒక్క రూపాయే. ఆ అసలు రెండు రూపాయలు ప్రజల దగ్గరే ఉండనిస్తే వారు జాగ్రత్తగా దాన్ని మూడు రూపాయలు చేసేవారు. ప్రభుత్వం కూడా సరైన అభివృద్ధి పధకాలమీద ఖర్చు పెడితే ఇలాంటి మంచిఫలితాలే వస్తాయి

    ప్రభుత్వానికీ ఈ విషయం తెలుసు, అందుకే ఆర్ధిక వ్యవస్థ పుంజుకోటానికి వేరే ఉపాయాలు లేనప్పుడు పన్నులు తగ్గిస్తారు, మొన్న GST రేట్లు తగ్గించినట్టు. అలా ప్రజల జేబుల్లో ప్రభుత్వం అదనంగా ఉండనిచ్చిన డబ్బు ఆర్థికవృద్దికి దోహదం చేస్తుంది (discretionary spending పెరగటం వల్ల). అంటే ప్రభుత్వం అస్సలు ఖర్చు పెట్ట కూడదా అంటే, లేదు పెట్టాలి. ఉద్యోగుల జీతాలు, ఇతర ప్రభుత్వ యంత్రాంగమ్మీద ఖర్చు సాధ్యమైనంత తక్కువగా, capital expenditure (రోడ్లు, పోర్టులు, విద్య వైద్యం లాంటి Public goods మీద) సాధ్యమైనంత ఎక్కువగా, అలాగే సంపాదించే శక్తి లేని అభాగ్యులకిచ్చే పెన్షల్ల మీద ఖర్చు పెట్టాలి. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటో మీకు తెలుసు. ఇబ్బడిముబ్బడిగా సంక్షేమ పధకాల మీద ఖర్చు పెట్టడమే కాక, అలా ఖర్చుపెడుతున్నామన్న సంగతి ప్రచారం చేసుకోటానికి కూడా ఖర్చు పెడుతున్నారు. ఈ ప్రచారహోరుకి సామాన్య ప్రజలూ పత్రికల వారు కూడా గొంతు కలపనక్కర్లేదు. అక్కడ ఖర్చుపెడుతుంది మన డబ్బే.

  • నోరు లేని బంగారు బాతు

    స్విగ్గీ డెలివరీ బాయ్, సాఫ్ట్ వేర్ ఇంజనీర్, ఇంకా… యమలోకంలోని యమకింకరులకి ఒక పోలిక ఉంది. వీళ్ళల్లో ఎవరికీ యూనియన్లు లేవు. రేపు జీతాలు పెంచటానికి బదులు తగ్గించినా, లేదా అసలు ఉద్యోగాలే పోయినా అడిగేవాడు లేడు.  సరే, మిగతావారి సంగతి పక్కనపెట్టి IT/KPO రంగం లోని ఉద్యోగుల గురించే కాసేపు మాట్లాడుకుందాం. అసలు వీళ్ళ బాగోగుల గురించి సమాజం, ప్రభుత్వం ఆలోచించాలా వద్దా అన్నది ప్రశ్న. దేశం మొత్తంలో సుమారు 2-3 కోట్ల మంది ఈ రంగం లో ఉద్యోగులుగా, కన్సల్టెంట్స్ గా పని చేస్తున్నారని అంచనా. వీళ్ళందరూ శుభ్రంగా సంపాయించుకోటమే గాక, ప్రధానంగా వీరి మీదే ఆధారపడి ఎన్నో రంగాలు ఎదుగుతూ ఉన్నాయి. ఉదాహరణకి రియల్ ఎస్టేటు, ఆటోమెబైల్, టూరిజమ్, కన్జూమరిజమ్. మరీముఖ్యంగా ప్రభుత్వానికి వచ్చే డైరెక్ట్ టాక్సుల్లో వీరి వాటా గట్టి గానే ఉంటుంది. అయినప్పటికీ వీరి సాదకబాధకాల గురించి ప్రభుత్వం పెద్దగా పట్టించుకున్నట్టు కనపడదు. ఈ వర్గం వారి కంటే ఎంతో తక్కువ సంఖ్య ఉన్న ఆటో డ్రైవర్లు, చేనేత కార్మికులు, ఆఖరికి లాయర్లకి కూడా ఆంధ్రా లాంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఏవేవో వరాలు ప్రకటిస్తుంటాయి. ప్రసుత భారత ఆర్ధిక రంగానికి ఉన్న చోదకశక్తుల్లో ఒకటైన IT/KPO రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకి ప్రభుత్వాలు ఏమేమి చేయొచ్చో ఒకసారి ఆలోచిద్దాం.

    ఈ రంగంలో ఉన్న కంపెనీలు తప్పనిసరిగా ఉద్యోగ సంఘాలని రిజిస్టర్ చేయాలని, అలాగే Performance ఆధారంగా కాక వేరే కారణాలతో ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులని తీసి వేయాలనుకున్నప్పుడు గానీ, ప్రతి సంవత్సరం వేతన విధానం నిర్ణయించేటప్పుడు గానీ ఉద్యోగ సంఘాలతో పారదర్శకంగా చర్చించాలని ప్రభుత్వం నిర్దేశించాలి. ఇలాంటి చట్టాలకి భయపడి కంపెనీలు పారిపోతేనో? ఇలాంటి పద్ధతులే బాంకింగ్, ఇన్సూరెన్స్, ఆటోమొబైల్ రంగాల్లో ఉన్నాయి, మరి విదేశీ కంపెనీలు ఆ రంగాల్లోంచి పారిపోలేదేం? నిజం చెప్పాలంటే IT, KPO రంగాల్లో ఎక్కువ శాతం కంపెనీలు – ముఖ్యంగా విదేశీ కంపెనీలు – ఉద్యోగుల పట్ల చాలా మానవీయంగానే వ్యవహరిస్తాయి, ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులని తొలగించినప్పుడు పరిహారం కూడా బాగానే ముట్టజెపుతాయి. కానీ ఈ నిర్ణయాలు అన్ని కంపెనీల్లోనూ మానవీయంగా ఉండవు. పారదర్శకంగా ఐతే అస్సలుండవు. అందుకే ఈ విషయాల గురించి మనం పత్రికల్లో ఊహాగానాలు, సోషల్ మీడియాలో బాధిత ఉద్యోగుల ఆర్తనాదాలు మాత్రమే చూస్తుంటాం. కంపెనీ యాజమాన్యాలు పొడిపొడిగా ఏదొకటి చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటాయి.   అందుకే చట్టాల అవసరముంది. చాలా సార్లు ఈ కంపెనీల్లో ఉద్యోగాల కోతలు స్టాక్ మార్కెట్లని సంతృప్తి పరచటానికి చేస్తుంటారు. ఏ సంవత్సరమైనా కంపెనీ అభివృద్ది రేటు కుంటుపడిందనుకోండి, స్టాక్ మార్కెట్లని సంతృప్తి పరచాలంటే సులభమైన ఉపాయం ఖర్చులు తగ్గిస్తున్నట్టూ, కొత్త టెక్నాలజీలు కొత్త మార్కెట్లమీద బాగా ఇన్వెస్ట్ చేస్తున్నట్టూ చూపించటమే. ఖర్చులు తగ్గించటానికి దాదాపు ప్రతిసారి కంపెనీలు ఎంచుకునే మార్గం ఉద్యోగాల్లో కోత విధించటం. ఒక వ్యాపార సంస్ధ విధానాల్ని ప్రణాళికల్నీ ప్రభుత్వం కట్టడి చేయాలని ఎవరూ కోరుకోరు కానీ, ఉద్యోగులు ప్రభావితం అయ్యే నిర్ణయాలు మానవీయంగా, పారదర్శకంగా ఉండేలా చట్టాలుండటం మంచిదే   .

    చట్టాలు చేయటమే కాదు, ఈ రంగంలోని ఉద్యోగుల కోసం ప్రభుత్వం ఇంకా చాలా చేయాలి. ఒక స్థాయి దాటి ఆదాయపు పన్ను కడుతున్న వ్యక్తెవరైనా ఉద్యోగం కోల్పోతే గరిష్టంగా ఆరు నెలల పాటు ప్రభుత్వం నిరుద్యోగభృతి కల్పించాలి. ఆ నిరుద్యోగభృతి ఆ వ్యక్తి గత సంవత్సర కాలంలో కట్టిన ఆదాయపు పన్ను నెలసరి సగటుతో సమానంగా ఉండాలి. ఆ డబ్బు కనీసం ఈఎమ్మైలు కట్టుకోటానికైనా పనికొస్తుంది. ఆ వ్యక్తి ఉద్యోగం ఎప్పుడు కోల్పోయాడు, ఎప్పుడు కొత్త ఉద్యోగం లభించిందీ అనే విషయం అతని పీఎఫ్ ఎకౌంట్లో డిపాజిట్లని బట్టి ప్రభుత్వం తెలుసుకోవచ్చు.

    ఉద్యోగ భద్రత తో సమానంగా IT/KPO రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులని ప్రతిరోజూ కలవరపెట్టేవి: కాలుష్యపూరితమైన నీరూ గాలీ, అధ్వాన్నమైన రోడ్లు, కుంటుతూ నడిచే ప్రజా రవాణా వ్యవస్థ, రోజురోజుకీ ఖరీదౌతున్న విద్య-వైద్యం. ఈ బాధ్యతల్లో ఎక్కువ శాతం స్థానిక ప్రభుత్వాలకి బదిలీ చేసి, వారికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసే పన్నుల్లో సరిపోయినంత శాతం బదలాయిస్తే జవాబుదారీ తనం పెరుగుతుంది. కానీ పిల్లి మెడలో గంట కట్టేదెవరు? బాధితులే. ఎప్పుడూ కులం, మతం లాంటి అంశాల ఆధారంగా రాజకీయ పార్టీలకి మీ వోట్లు, డబ్బు, సమయం సమర్పించుకోటం తగ్గించుకుని అన్ని పార్టీలని, ముఖ్యంగా మీరు అభిమానించే పార్టీ నాయకత్వాన్ని ప్రశ్నించండి లేదా అభ్యర్థించండి ఈ క్రింది అంశాల మీద

    1. knowledge based industries లో పని చేస్తున్న ఉద్యోగుల సంక్షేమం కోసం పార్టీకి ఒక అనుబంధ సంస్థ ఏర్పాటు చేసి ఈ రంగంలో ఉద్యోగ భద్రత, ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన విధాన నిర్ణయాల్లో పాలుపంచుకునే అవకాశమివ్వటం
    2. స్థానిక సంస్థలకి ఎక్కువ బాధ్యతలని, పన్నుల ఆదాయాన్నిబదిలీ చేయటం

    మనం కోరుకున్నవన్నీ లభించకపోవచ్చు, కానీ తరచూ అడగటం గట్టిగా అడగటం చెయ్యాలికదా. ఇవి మీరే అడగాలి. వేరే రంగాల్లోని కార్మిక సంఘాలో, రైతు సంఘాలో, కుల సంఘాలో అడగవు.

    3
  • పుస్తక సమీక్ష: గుడ్ స్ట్రాటజీ / బ్యాడ్ స్ట్రాటజీ (మంచి వ్యూహం / చెడు వ్యూహం)

    రచయిత: రిచర్డ్ పి. రమెల్ట్


    మనలో చాలామంది “వ్యూహం” (Strategy) అనే పదాన్ని రోజూ వింటూనే ఉంటాం. బిజినెస్ మీటింగ్‌ల నుండి క్రికెట్ మ్యాచ్‌ల వరకు, చివరికి ఇంట్లో ఏ కూర వండాలో నిర్ణయించుకోవడానికి కూడా “స్ట్రాటజీ” అనే పదాన్ని సరదాగా వాడేస్తాం. కానీ, నిజమైన వ్యూహం అంటే ఏమిటి? కేవలం పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకోవడమా? లేక స్ఫూర్తిదాయకమైన మాటలు చెప్పడమా?

    రిచర్డ్ రమెల్ట్ తన “గుడ్ స్ట్రాటజీ/బ్యాడ్ స్ట్రాటజీ” పుస్తకంలో ఈ గందరగోళాన్ని పటాపంచలు చేసారు. ఆయన దృష్టిలో, చాలా కంపెనీలు, సంస్థలు, చివరికి ప్రభుత్వాలు కూడా అనుసరించేది అసలు వ్యూహాలే కాదని, కేవలం వ్యూహంలా కనిపించే ఒక భ్రమ మాత్రమే అని, దానినే ఆయన “చెడు వ్యూహం” (Bad Strategy) అని చెప్తారు.

    పుస్తకంలో ఏముంది? అసలు కథేంటి?

    ఈ పుస్తకం చదవడం మొదలుపెట్టాక, మనకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది: మనం ఇన్నాళ్లూ వ్యూహం అనుకుంటున్నది కేవలం మన కోరికల లాంటి జాబితా మాత్రమే. ఉదాహరణకు, “మనం నంబర్ 1 అవ్వాలి,” “మన అమ్మకాలు రెట్టింపు చేయాలి” వంటివి లక్ష్యాలు మాత్రమే, వ్యూహాలు కావు. రమెల్ట్ ప్రకారం, ఇది చెడు వ్యూహానికి మొదటి సంకేతం.

    మంచి వ్యూహానికి మూడు ముఖ్యమైన భాగాలు ఉంటాయని ఆయన వివరించారు. దీనిని ఆయన “కెర్నల్” (Kernel) లేదా వ్యూహానికి గుండెకాయ లాంటిదని అంటారు:

    1. నిర్ధారణ (Diagnosis): అసలు సమస్య ఎక్కడ ఉందో స్పష్టంగా గుర్తించడం. డాక్టర్ రోగాన్ని నిర్ధారించినట్లు, మనం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు ఏమిటో తేల్చుకోవాలి.
    2. మార్గదర్శక విధానం (Guiding Policy): ఆ సవాలును ఎలా ఎదుర్కోవాలో చెప్పే ఒక విస్తృతమైన ప్రణాళిక. ఇది గమ్యానికి దారి చూపే ఒక దిక్సూచి లాంటిది.
    3. పక్కా ఆచరణ (Coherent Actions): ఆ ప్రణాళికను అమలు చేయడానికి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న స్పష్టమైన, ఆచరణ సాధ్యమైన పనులు.

    రమెల్ట్ చెప్పేది చాలా సులభంగా అనిపించవచ్చు, కానీ ఆచరణలో పెట్టడం చాలా కష్టం. ఎందుకంటే, చాలామంది నాయకులు కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇష్టపడరు. అందరినీ సంతోషపెట్టాలని చూస్తారు. ఫలితంగా, ఏ పనీ పూర్తికాని ఒక “డాగ్స్ డిన్నర్” (అన్నింటినీ కలిపిన గందరగోళం…తెలుగులో కలగాపులగం అనుకుందాం) లాంటి ప్రణాళిక తయారవుతుంది.

    సరదా ఉదాహరణలతో సూపర్ అనాలిసిస్!

    ఈ పుస్తకంలో నాకు బాగా నచ్చిన విషయం ఏమిటంటే, రచయిత కేవలం సిద్ధాంతాలు చెప్పి వదిలేయలేదు. డేవిడ్-గోలియత్ కథ నుండి వాల్‌మార్ట్ విజయ రహస్యం వరకు, చివరికి యాపిల్‌ను స్టీవ్ జాబ్స్ ఎలా కాపాడటం వరకు ఎన్నో ఆసక్తికరమైన ఉదాహరణలు ఇచ్చారు.

    • గాలిలో మేడలు కట్టడం: చాలా కంపెనీలు “మేం కస్టమర్-సెంట్రిక్ ఇన్నోవేషన్‌తో మార్కెట్‌ను శాసిస్తాం” లాంటి పెద్ద పెద్ద పదాలతో నిండిన మిషన్ స్టేట్‌మెంట్‌లు తయారుచేస్తాయి. రమెల్ట్ దీన్ని “ఫ్లఫ్” (Fluff) అంటారు. అంటే, వినడానికి బాగుంటుంది కానీ లోపల విషయం శూన్యం.
    • గెలుపు మనదే బ్రదర్: “గెలిచే వరకు వదిలిపెట్టకు” అనేది ఒక మంచి ప్రేరణాత్మక నినాదం కావచ్చు, కానీ అది వ్యూహం కాదు. సరైన ఆయుధాలు లేకుండా యుద్ధానికి వెళ్తే, ఎంత పట్టుదల ఉన్నా ఓటమి తప్పదు.
    • సినిమాటిక్ టచ్: హన్నిబాల్, రోమన్ సైన్యాన్ని ఎలా ఓడించాడో చెప్తూ, వ్యూహం అంటే కేవలం బలం కాదు, తెలివి అని నిరూపిస్తారు. శత్రువు బలాన్ని కాకుండా, వారి బలహీనతను దెబ్బకొట్టడమే అసలైన వ్యూహం.

    ఎవరు చదవాలి?

    • మీరు ఒక వ్యాపారవేత్త అయినా, మేనేజర్ అయినా, విద్యార్థి అయినా, చివరికి మీ వ్యక్తిగత జీవితంలో ఒక స్పష్టమైన మార్గాన్ని ఎంచుకోవాలనుకున్నా ఈ పుస్తకం మీకు కచ్చితంగా ఉపయోగపడుతుంది.
    • మీరు మీ టీమ్‌తో కలిసి పనిచేస్తున్నప్పుడు, “అసలు మనం ఏం చేస్తున్నాం? ఎటు వెళ్తున్నాం?” అనే గందరగోళంలో ఉంటే, ఈ పుస్తకం మీకు ఒక టార్చ్‌లైట్‌లా దారి చూపిస్తుంది.
    • కార్పొరేట్ ప్రపంచంలోని బూటకపు మాటలు, పనికిరాని ప్రజెంటేషన్‌లతో విసిగిపోయిన వారికి ఈ పుస్తకం ఒక స్వచ్ఛమైన గాలిలా అనిపిస్తుంది.

    చివరిగా ఒక్క మాట:

    “గుడ్ స్ట్రాటజీ/బ్యాడ్ స్ట్రాటజీ” కేవలం ఒక బిజినెస్ పుస్తకం మాత్రమే కాదు. ఇది స్పష్టంగా ఆలోచించడం ఎలాగో నేర్పే ఒక గైడ్. చదవడం పూర్తి చేశాక, మీరు మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, ముఖ్యంగా కంపెనీలు, సంస్థలు పనిచేసే విధానాన్ని ఒక కొత్త కోణంలో చూడటం ప్రారంభిస్తారు. ఇకపై ఎవరైనా మీటింగ్ రూమ్‌లో “మన వ్యూహం ఏమిటి” అని అడిగినప్పుడో లేదా చెప్పినప్పుడు, మీ పెదవులపై ఒక చిన్న నవ్వు కనిపిస్తుంది, ఎందుకంటే ఈపాటికే ఈ వ్యూహం కథ మీకు తెలుసు!

    సంక్షిప్తంగా, ఇది ప్రతి ఒక్కరూ తమ షెల్ఫ్‌లో ఉంచుకోవాల్సిన పుస్తకం. సరదాగా, సూటిగా, ఆలోచింపజేసే విధంగా ఉంటుంది. తప్పక చదవండి

    1
  • 4. గులేబకావళి పూలు

    4. గులేబకావళి పూలు

    ఎనిమిదో క్లాసులో షాజు అని ఓ ఫ్రెండుండేవాడు. మళయాళి. పూర్తి పేరు షాజు జోస్ అబ్రహం కైపన్ప్లాకల్. ఆ స్పెలింగు నేర్చుకోడానికే మాకు సగం సంవత్సరం పట్టింది. క్లాసుకి కొత్త టీచర్ వస్తే భలే ఉండేది అటెండన్సప్పుడు! వాళ్ళ నాన్నగారు ఫెడరల్ బ్యాంకు ఆఫీసర్. ట్రాన్స్ఫర్ మీద ఇక్కడికొచ్చారు.

    మేమందరం పగలూ రాత్రీ క్రికెట్టాడుతూంటే వాడు ఫుట్బాల్ పట్టుకుని పార్కుకొచ్చేవాడు. మొదట్లో నవ్వేవాళ్ళం — ఫుట్బాలేంటిరా అని. లగాన్ సినిమాలో పల్లెటూరోళ్ళలాగ రూల్సన్నీ నేర్చుకుని ఆడేమనుకోండి….

    అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది షాజు వాళ్ళ అమ్మగారి గురించి. లైఫ్ లో మొదటిసారి , ‘పద్ధతి’ అనే పదానికి అర్ధం ఆవిడ దగ్గర చూశాం. అంటే మేము కూడా కొద్దోగొప్పో నీటుగానే ఉండేవాళ్ళమనుకోండి, కానీ ఆవిడ భయంకరం! షాజు గాడు ఎప్పుడూ ఇస్తిరీ చేసిన బట్టలు మాత్రమే వేసుకొచ్చేవాడు. కనీసం ఆడుకోడానికి కూడా ఇస్తిరీ లేని బట్టలలో వాడిని మేమెప్పుడూ చూడలేదు. షూస్ లేకుండా ఇంటి బయటకు వచ్చేవాడే కాదు. స్కూలు యూనీఫార్మ్ మెడ దగ్గర పైబటన్ ఎప్పుడూ పెట్టుకునే వచ్చేవాడు. ఎంత ఎండాకాలం అయినా, క్లాసులో ఫ్యాన్ తిరగకపోయినా ఆ గుండీ మాత్రం తీసేవాడుకాదు. బ్రేకు పీరియడ్ లో మేము చొక్కాలు చింపేసుకుని, జుట్టు రేపేసుకుని మట్టిలో దొర్లుతున్నాకూడా వాడు నీటుగా టక్కుతోనే ఉండేవాడు!

    వాళ్ళ ఇల్లుకూడా ఓ హోటల్ లాగ మైంటైన్ చేసేవారు ఆంటి. అంటే మనింటికి బాగా డబ్బున్న చుట్టాలొచ్చినప్పుడు అమ్మ ఇళ్ళంతా మనచేత దులిపించి, లోపలినుంచీ మంచి ఇస్తిరీ దుప్పట్లుతీసి పరిచి, పెళ్ళికి గిఫ్టొచ్చిన కాస్ట్లీ కప్పులసెట్టు తీసి, ర్యాకులో మంచి పుస్తకాలు మాత్రమే కనబడేలా సర్ది…. వాళ్ళిల్లు ఎప్పుడూ అలానే ఉండేది! ఇల్లు చిన్నదే, లోపల మాత్రం కార్పెట్టు, ఛాండెలియరు, అద్భుతమయిన పుస్తకాల ర్యాకు, పింగానీ కప్పులు, డిమ్ము లైటింగు, తెల్ల టేబుల్ క్లాతు, కప్పుల కింద కోస్టర్లు, ఏది తెచ్చినా కింద ట్రే కంపల్సరీ, బయట మొక్కలు, మొత్తం గోడంతా పాకేసిన మనీప్లాంటు, ఆవిడే గీసి ఫ్రేము కట్టించిన బొమ్మలు, క్రాఫ్టులు, గ్లాసు పెయింటింగులు…. ఒక మూల జెరుసలేంలో జీసస్ పుట్టిన దృశ్యం మొత్తం పర్మనెంటుగా ఇంట్లో కట్టేసారు — మట్టి, కాటన్, గడ్డీ, లైట్లు వాడి. (రాత్రంతా అందులో లైటు వెలుగుతూనే ఉంటుందట!)

    అవకాశం వస్తే వాడి ఇంట్లోకి వెళ్ళడానికి చూసేవాళ్ళం — కొత్తగా ఏమి పెట్టారో అని! ఆడుకునేటప్పుడు మంచినీళ్ళు కావాలని దూరమయినా అక్కడికి వెళ్ళి అడిగేవాళ్ళం. గ్రౌండు పక్కనున్న అనిల్ గాడి ఇంటికెళ్తే ఉత్తి నీళ్ళొచ్చేవి, నాలుగు తిట్లుకూడా పడేవి “ఇంకా ఎంతసేపురా” అని! అదే షాజు వాళ్ళింట్లోంచైతే నీళ్ళడిగితే రస్నా వచ్చేది మరి! అదీ కాక ఒక ప్లేటులో పసుపు రంగులో ప్రపంచంలోకళ్ళా గొప్ప చిప్స్ వచ్చేవి! అసలు అరటికాయతో చిప్స్ చెయ్యొచ్చని ఐడియా వచ్చినవాడికి నోబుల్ బహుమతి ఇవ్వాలి వెంటనే. ఆ ఉప్పుడు టేస్టు నాలుకమీద ఉన్నంతసేపూ మైమరుపే! ఎక్కడయిపోతాయో అని మెల్లగా చప్పరించి తినేవాళ్ళం. కానీ పక్కోడు మనకన్నా ఎక్కడ లాగించేస్తాడా అని అదో టెన్షను!

    షాజు పుట్టినరోజు క్రిస్ట్మస్ కి మూడురోజుల తరువాత. అయితే చిన్నప్పటినుంచీ రెండూ కలిపేసి ఒకేరోజు జరిపేవారట. ఆ సంవత్సరం పర్టీకి మమ్మల్ని కూడా పిలిచారు. మామూలుగా కాదు, ఓ అందమైన డెకరేషన్లున్న లెటర్ ప్రింటుతీసి ఎన్వలప్ లో పెట్టి మరీ పిలిచాడు! ఆ కవరు చాలారోజులు దాచుకున్నాం. షాజు వాళ్ళింటికని మా అమ్మలు మమ్మల్నందరినీ నీటుగా తయ్యారుచేసి, పాపిడితీసి దువ్వి, షూసేసిమరీ పంపించారు. అందరం తలో పెద్ద గిఫ్టూ ప్యాకింగుచేసి తెచ్చాం. అప్పట్లో ఎవరిది పెద్ద పెట్టైతే వాడిదే గొప్ప గిఫ్టు మరి! మామూలుగానే క్షణక్షణం సినిమాలో ‘ఐబాబోయి గదా ఇది, స్వర్గమేమో కదా ఇది’ అన్నట్టుంటుంది వాళ్ళిళ్ళు. క్రిస్ట్మస్, ఒకే కొడుకు పుట్టినరోజు అనేసరికీ మరీ డెకరేట్ చేసేశారు! సోఫా కవర్లు కూడా కొత్తవేసి, ఎక్కడచూసినా సీరియల్ లైట్లుపెట్టి, ఓ అద్భుతమయిన రెండంతస్థుల కేకు చేయించి, అసలు భీబత్సం! కేకు, కేరళ చిప్సు, సమోసా, కూల్ డ్రింక్సు (రస్నా కాదు, నిజమైనవి), మ్యూజికల్ చెయిర్సు, హౌసీ, గొప్ప సందడయ్యింది!

    మూడేసి గ్లాసుల కూల్ డ్రింకులు లాగించేశాం, ట్యాంకు ఫుల్లయిపోయింది. షాజు గాడిని పక్కకి పిలిచి చిటికినవేలు చూపించి ఒరేయ్ ఎక్కడ అని అడిగాడు అభయ్. షాజు తీసుకెళ్ళాడు. వాడో నిమిషం తరువాత వెనక్కొచ్చి ఒరేయ్ బయటకిరండి అని మమ్మల్ని తీసుకెళ్ళి జేబులోంచీ ఓ బ్రౌను రంగు పువ్వు లాంటిది చూపించాడు. “ఇవేవో బాత్రూం లో గిన్నెలో పెట్టారురా, వాసన చూడండి” అన్నడు. భలే వాసన! ఇది పువ్వు లాగ మెత్తగాలేదు, ఈ వాసన ఎప్పుడూ ఏ పువ్వుకి మేము చూడలేదు, అందరం లోపలిదాకా పీల్చుకుని వాసన చూసేశాం! మనోజు వాళ్ళ ఇంట్లో ఓ బామ్మగారున్నారు. ఎప్పుడూ పాత సినిమాలు చూసేవారు. వాడు చెప్పాడు — “అన్నయ్య, గులేబకావళి అని ఒక పువ్వుంది, దాని వాసన ఇలాగే ఉంటుంది” అని. “నువ్వెప్పుడు చూశావురా” అనడిగితే “వాసన చూడలేదు గానీ సినిమాలో చూపించినప్పుడు ఇలాగే ఉందా పువ్వు” అన్నాడు. వెంటనే లోపలికెళ్ళి ముందు నేను తరువాత అనిల్, మనోజ్, మరోసారి అభయ్, అందరం లైనులో బాత్రూంలోకి వెళ్లిపోయాం. తలో పువ్వు జేబులోపెట్టుకొచ్చేసాం, గిన్నె ఖాళీ! పార్టీ అయిపోయింది, ఇంటికెళ్ళిపోయాం, జేబులోంచి జాగ్రత్తగా తీసి స్కూలు బ్యాగులో పెట్టేశానది. ఓ నాల్రోజులు సూపర్ వాసనొచ్చింది బ్యాగంతా, అలా తగ్గిపోయింది. మమ్మల్ని మరుసటిరోజు అదోలా చూశాడు షాజు.

    సంక్రాంతి సెలవులలో ఆడుకుంటున్నప్పుడు అభయ్ కి ఐడియా వచ్చి వాళ్ళ ఇంటిదగ్గర సైకిల్ ఆపి “ఒరేయ్ అర్జెంట్, ఒక్కసారి”… అన్నాడు. అలాగే అని లోపలికి తీసుకెళ్ళాడు షాజు. బాత్రూములో ఈ సారి గిన్నెలేదు, పువ్వులు లేవు.

    చాలా ఏళ్ళతరువాత తెలిసింది ఇవి టాయిలెట్లలో మంచి వాసన కోసం ఉంచుతారని, వీటి పేరు గులేబకావళి పూలు కాదని, మేము వాళ్ళకి బాత్రూములో వాసనకోసం పెట్టిన పూలు, కలరా ఉండలు పట్టుకుపోయేవాళ్ళ లాగ కనిపించుంటామని 🤭

    ___________________________________

    ఈ శీర్షిక లో మరి కొన్ని కాలనీ కథలు 🩷

  • స్మృతులు-1

    నాకు ఎవరో పంపారు.. మీతో ఇక్కడ పంచు కొంటున్నా …..

    ====================

    రైల్వే స్టేషన్ లో వెయింగ్ మిషన్ ఎక్కడానికి 10 పైసల బిళ్ల కోసం మారాం చేసిన జెనరేషన్ మనది . ఇంటి ముందు కొచ్చే పాల ఐసు 10 పైసలూ, ఫ్రూట్ ఐసు 5 పైసలూ నూ.

    SSC పాసవగానే టైప్ ఇన్ స్టిట్యూట్ కి పేపర్లు గుండ్రంగా చుట్టుకుని వెళ్లిన తరం మనది . అద్దెకి బుక్స్ (నవలలు ) తెచ్చుకుని చదువుకున్న తరం మనది. సినిమా హాలు క్యూలో పాటల పుస్తకాలు కొనుక్కుని బట్టీలు పట్టిన కాలం మనది.

    గెజిటెడ్ ఆఫీసర్లు అయినా, కాలేజీ లెక్చరర్స్ అయినా సైకిళ్లు తొక్కుకుని ఆఫీస్ లకు వెళ్లిన రోజులవి. అందుకే డ్రాయింగ్ రూమ్ జిమ్ములలో సైకిల్ తొక్కే అవసరం పడేది కాదు.

    చేబదుళ్లకి కాదేదీ అనర్హం. పిన్నిగారింట్లోంచి గ్లాస్ తో చెక్కర అయినా, స్పున్ తో కాఫీ పొడైనా, బాబాయ్ గారి రేలీ సైకిల్ అయినా, పక్కింటి అన్నయ్య జామెంట్రీ బాక్సూ , స్కూల్లో డ్రామాకి ఎదురింటి అక్కయ్య జడగంటలూ అయినా.

    అప్పు పుట్టని పచారీ షాపులూ బట్టల కొట్టులూ వుండేవే కావు. రేషన్ షాపుల్లో పంచదార కోసం, కిరసనాయిల్ కోసం క్యూ లో నిలబడి డ్యూయెట్లూ, పాలసీసా కోసం బూతుల దగ్గర నిలబడినప్పుడు లవ్ లెటర్స్ ఎక్స్చేంజ్ లు జరిగేవి.

    ఇంటి ముందుకు కోతులాడించేవాడు, పాములాడించేవాడు, గంగిరెద్దులాడించేవాడు,ఎలుగు బంటిని తెచ్చేవాడు, చిలక జోస్యం చెప్పేవాడు, వానల్లు పడాలి వాన దేవుడా అని కప్పలకి పెళ్లిళ్లు చేసే వాళ్లు కాలాన్ని బట్టి వచ్చి వినోదం అందించే వాళ్లు. మేకప్పులు అంటే తెలీని రోజుల్లో మొహాలకి గులాబీ రంగులేసుకునొచ్చి, ఇళ్ల ముందు సినిమా పాటలకి డాన్స్ లాడే వారు. గారడీల వాళ్లు బాలన్సింగ్ ఎలాగో పైన తాడు మీద చిన్న పిల్లలని నడిపిస్తూ చూపించే వాళ్లు. మూలికలూ, పసర్లూ అమ్మేవాళ్లు తాము నయం చెయ్యలేని రోగం లేదనే వాళ్లు. బస్టాండ్ లో చెవి గులిమిలు తీస్తామనే పెట్టెలతో తిరిగే వాళ్లూ. ఇళ్లముందు కొచ్చి సవరాలు కడతాం అనే వాళ్లూ.

    వాళ్ల కోసం టిన్నుల్లో జుట్టు వూడితే దాచుకున్న వాళ్లూ వుండేవారు. “దువ్వెన్నలు, బొట్లు, కాటుక పెట్లు, ఇయర్ పిన్లు, రబ్బర్ గాజులు, రిబ్బన్లహో”. అంటూ పెట్టె నెత్తిన పెట్టుకొచ్చే వాళ్ల దగ్గర దొరకని ఫ్యాన్సీ వస్తువుండేది కాదు. “పాత బట్టలకి స్టీల్ సామాన్లిస్తాం”. అన్న వాళ్లు వచ్చి ఎన్నేసినా, ముందు చూపించినా గంగాళం కాకుండా, ఆఖర్న చూపించిన గిన్నె ఇచ్చి పోయేవాళ్లు. గోతాముడు పాత బట్టలొదిలిపోయేవి. కత్తికి సాన పెడ్తాం, నవార్లు నేస్తాం. పరుపులేకుతాం. గిన్నెలకి సొట్టలు తీస్తాం. బంగారు వెండి వస్తువులకి పాలిష్ పెడతాం. అరువు మీద చీరలిస్తాం అంటూ ఇంటి ఇల్లాళ్లని ఊపిరి తీసుకోనిచ్చే వాళ్లు కారు. ఇంక ముగ్గు అమ్మే వాళ్లూ, ఉప్పు అమ్మేవాళ్లూ, కూరలూ పండ్లూ అమ్మే వాళ్లూ సరేసరి.

    మాదా కబళం వాళ్లు “అన్నం వుంటే పెట్టమ్మా నీ కొడుకులు, బిడ్డలు, మనవలు సల్లంగుండ” అంటూ టైముల వారీగా వచ్చే వాళ్లు… సాయంత్రం 8 గంటల బిచ్చగాడొచ్చి వెళితే మా నానమ్మ మాత్రలేసుకునేది..

    రేడియోలో బినాకా గీత్ మాలా ఊహల రెక్కలు విప్పేది. భూలే భిస్రే గీత్ అమర లోకాల్లో విహరింప చేసేది. రహస్య ప్రేమలు, అచ్చట్లు, ముచ్చట్లు… “ఏమిటో” అనుకోవడాలు ప్రొద్దుట సంస్కృత వార్తలు ‘ఇతి బలదేవానంద సాగరహా ‘తో ప్రారంభం అయితే ఈ మాసం పాటలూ కార్మికుల కార్యక్రమాలూ సంక్షిప్త శబ్ద చిత్ర ప్రసారాలూ..వివిధ భారతి మీరుకోరిన పాటలూ..పండితులచే నిర్మించబడ్డ నాటకాలూ..వావ్ రేడియో స్వర్ణ యుగం అది!

    అప్పట్లో పేపరు చదువుతూ కాఫీ తాగని మనుషులు అరుదు..ఇంగ్లీష్ పేపర్ చదువుతే లాంగ్వేజ్ ఇంప్రూవ్ అయినట్లే, దూర్దర్శన్ లో ఇంగ్లీష్ వార్తల వల్ల ప్రొనౌన్సియేషన్ నేర్చుకున్నాం.. తాతయ్యలకీ దూరపు చుట్టాలకీ ఉత్తరాలు రాస్తూ లెటర్ రైటింగులు నేర్చుకున్నాం…. ఉభయకుశలోపరి ఎక్కడ పెట్టాలో, గంగాభాగీరధీ సమానురాలైన ఎప్పుడు వాడాలో తెలుసు కున్నాం!

    ఎన్నని చెప్పగలం ఆ పాత మధురమైన జ్ఞాపకాలు…. ఇప్పటికి ఎప్పటికి మా గుండెల్లో నిలిచిపోయి మా గుండెలు అగిపోయేవరకు మాతో వెన్నుండి మమ్మల్ని నడిపిస్తున్న గుర్తులు.

    సశేషం