Author: Ghouse Hyd

  • నా ఇంటావిడ

    నేను , శ్రీమతి ఢిల్లీ లో 1978 లో లజ్పత్ నగర్ లో సంసారం మొదలుపెట్టాం.బుడ్డోడు పాకుతున్నాడు.

    భుజానికి వేళ్ళాడే సంచి లో రోజూ లంచ్ బాక్స్ , ఒక నవల , 2 రూపాయల చేంజ్.

    వెళ్తానికి 60 పైసలు,రావటానికి 60 పైసలు. ఓ పది రూపాయలు రిజర్వు.పొద్దున్నే 6 కు లేచి ప్లాస్టిక్ జార్ తీసుకొని MOTHER DIARY వెండింగ్ మెషిన్ క్యూ లో నిలబడి అర లీటర్ పాలు తీసుకొని వచ్చి కాలకృత్యాలు +టిఫిన్ అవగొట్టి 9 కి బయలు దేరి రాత్రికి 8 కి వచ్చేవాడిని. ఇది దిన చర్య. ఆది వారం ఇంటి క్రింద మార్కెట్ లో మృణ్మయ పాత్రలో వడ సాంబార్.. నెల-రెండు నెలలకోసారి సినిమా . అప్పుడు చూసినవి akhion ke jharokon se +వేటగాడు +సిరిసిరి మువ్వ etc

    ఇంతకుముందు చెప్పినట్లు మెయిన్ బ్రాంచ్ కనాట్ ప్లేస్ -మహా సముద్రం.

    ఓ ఆరు నెలల తర్వాత నేను ఫారిన్ ఎక్స్చేంజి డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నప్పటి సంఘటన :

    నేను బ్రాంచ్ లో అందరితో చాలా కలివిడిగా ఉండేవాడిని. హిందీ తెలుసు కాబట్టి ( మిగతా ఆరవ ఆఫీసర్ల కాకుండ )

    తొందరగా “తలలో నాలుక ” (?) లా అయిపోయాను.

    ఫారిన్ ఎక్స్చేంజి డిపార్ట్మెంట్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉండేది. మేజనైన్ లో పెర్సొనెల్ +డే బుక్ +అకౌంటింగ్ సెక్షన్లు ఉండేవి. గ్రౌండ్ ఫ్లోర్ లో పెద్ద బ్యాంకింగ్ హాల్.

    లిఫ్టులు లేవు.

    ఒక రోజు మేనేజర్ తో గ్రౌండ్ ఫ్లోర్ లో ఏదో వాదించి మేజనైన్ ఫ్లోర్ ద్వారా ఫస్ట్ ఫ్లోర్ కు పోతుంటే, పెర్సొనెల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ఒక అమ్మాయి ( ఢిల్లీ లో జన్మం + చదువు ఢిల్లీ యూనివర్సిటీ ) నన్ను ఆట పట్టించాలని చాలా కాజువల్ గా — గౌసు , Your upper floor is to let” అని కామెంట్ చేసింది.( అంటే నా బుర్ర ఖాళీ -అక్కడ ఏమి లేదనే అర్ధం ) .అది harmless funny కామెంట్. మేనేజర్ తో వాదులాట మైండ్ లో ఉండటం వల్ల,నేను అసంకల్పితంగా ఒక Inappropriate కామెంట్ చేశా. ఎప్పుడు నేను అలా చేయను. ఆడవాళ్ళ దగ్గర అసలు చేయను. కానీ చేశాను.అక్కడ ఉన్న 15 మంది staff లో ఓ పది మంది విన్నారు. ఆ అమ్మాయి కూడా విని,తల వంచుకొంది కానీ పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. నేను పైకి వెళ్లి పోయా. సాయంత్రానికి మర్చి పోయా..

    ఆ రోజు బస్సు లో ఇంటికి పోతుంటే ఇది గుర్తు కొచ్చింది. నేను తప్పు చేసానని అని ఎక్కడో గిలి. సరే, ఇంటికి వెళ్లి , స్నానం, భోజనం కానిచ్చిన తరువాత, శ్రీమతి తో ఈ సంఘటన పూర్వాపరాలు చెప్పాను. మా ఆవిడ నన్ను తీవ్రంగా మందలించింది.మీరు ఎప్పుడూ అలా మాట్లాడరు కదా?. ఏమైంది మీకు అని క్లాసు పీకి, మర్నాడు నన్ను”ఆ మేజనైన్ ఫ్లోర్ కు వెళ్లి , ఆ అమ్మాయి ఒంటరి గా ఉన్నప్పుడు కాదు, అందరూ ఉన్నప్పుడు ఆ అమ్మాయికి బేషరతు గా క్షమాపణ చెప్పండి. క్షమించమని అడగండి. మీరు చెప్పక పోతే మర్నాడు నేను వచ్చి క్షమాపణ చెప్పాల్సి వస్తుంది ” అని అల్టిమేటం జారీ చేసింది. ఆలోచించగా సబబే అనిపించింది.

    మర్నాడు నేను వెళ్లి ఆ అమ్మాయి ముందు నిల్చొని అందరూ చూస్తుండగా క్లియర్ గా ” నేను నిన్న చాలా inappropriate గా కామెంట్ చేశాను.మై సిన్సియర్ apologies . ప్లీజ్ నన్ను క్షమించు ” అని చెప్పాను. ఆ అమ్మాయి shocked . తను ఊహించ లేదు.. toxic work environs అని సమాధాన పడి ఉండిపోయినట్టుంది.

    అప్పుడు something strange happened.. ఆ అమ్మాయి గబుక్కన కుర్చీ లో నుంచి లేచి నా దగ్గరకు వచ్చి నన్ను hug చేసుకొని,” నేను ఇలాంటి కామెంట్లు చాలా విన్నాను. నీలాగా వచ్చి ఎవ్వరూ apologise చెయ్యలేదు. you are a Gentleman” అని చెప్తూ కన్నీళ్లు పెట్టుకొంది. ఆ ఘటన తర్వాత ఆ అమ్మాయి నాకు చాలా మంచి నేస్తం అయింది.

    ఆ రోజు రాత్రి నేను జరిగిన విషయం శ్రీమతి తో చెప్పగా ” మా వారు చాలా మంచి వారని” సంతోషం గా నన్ను కౌగిలి లో పొదువుకొంది.

    Admitting mistake is graciousness.

    ====

  • COMPLIMENT

    1977 ఏప్రిల్ 25.

    బ్యాంక్ ఆఫీసర్ గా సెలెక్ట్ అయ్యి మద్రాస్ బీచ్ రోడ్ లో ఉన్న ట్రైనింగ్ కాలేజీ లోకి అడుగు పెట్టా.

    మనకు టక్ చేయటం అలవాటు లేదు.అందరూ టిప్ టాప్ గా ఉన్నారు. దేశం నలుమూలల నుండి,మొదటి 30 రాంకర్లతో ఫస్ట్ బ్యాచ్.. నేను గారిది 9 రాంక్. మద్రాస్ విల్లివక్కంలో నా యూనివర్సిటీ లో సీనియర్ రామకృష్ణ ఫామిలీ తో ఉండేవారు.ఆయన ఇంట్లోనే మకాం. యూనివర్సిటీ నుండి ఆయన్ని నేను మామాజి అనే పిలేచేవాడిని. (ఆ ముచ్చట మరొక్కప్పుడు).

    రోజు 49 బస్ అనుకుంటా ఎక్కటం బీచ్ రోడ్ లో దిగటం.మధ్యాన్నం తంబుచెట్టి స్ట్రీట్ లో హోటల్ భోజనం. ఆ వచ్చిన బ్యాచ్ లో నాతో బాటు విజయవాడ ఇంటర్వ్యూ లో పరిచయమైనఅమ్మాయి (తనది మొదటి రాంక్ ) కూడా ఉంది. ట్రైనింగ్ చాలా సీరియస్ గా ఉండేది. ఆ 30 మందిలో, సౌత్ నుండి 18, నార్త్ నుండి 12 మంది ఉండేవారు. 8 గురు అమ్మాయిలు ఉండేవారు. ట్రైనింగ్ లో అందరూ మహా చురుకు గా ఉండేవారు. కాఫీ బ్రేకుల్లో మెల్ల మెల్ల గా స్నేహితులయ్యారు.

    అందులో మద్రాస్ లో ఉంటున్న అమ్మాయి నిండు చూలాలు.

    ఆ అమ్మాయి మూవ్మెంట్స్ మెల్లగా ఉండేవి.అందరూ గబ గబ పనులు చక్కబెడుతుంటే తను వెనక బడి పోయేది.మొదటి రెండు రోజులు చూసాను. ఇక నేను నా చైర్ ను తన పక్కన వేసుకొని కూర్చున్నా. అందరూ వెళ్ళి పోతున్నా, నేను తనతో మెల్లగా వెళ్ళటం,తనకు ఏదైనా కావాలంటే నేను fetch చేయటం,వాటర్ బాటిల్ నింపి పట్టటం లాంటి చిన్ని చిన్ని పనులు చేసేవాడిని. బయటకు కాఫీ కి వెళ్ళాలంటే అందరూ గబ గబ వెళ్ళేవాళ్ళు. నేను మెల్లగా తనతో వెళ్ళేవాడిని.

    ఇలా 4 వారాలు గడిచాయి.

    ఇంకో రెండు రోజుల్లో ట్రైనింగ్ ముగుస్తుందనగా ఆ అమ్మాయి నన్ను ఇంటికి డిన్నర్ కు పిలిచి భర్త,అత్త మామలు,ఆడపడుచు లను పరిచయం చేసి,వాళ్ళతో డిన్నర్ అయ్యాక నాకు ఓ పార్కర్ పెన్ గిఫ్ట్ ఇచ్చింది.

    లాస్ట్ రోజు ,అందరూ బై బై చెప్పుకుంటుంటే,తను నాదగ్గరకు వచ్చి నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి, గౌస్,నాకు నీలాంటి అబ్బాయి పుట్టాలని రోజు దేవుణ్ణి ప్రార్థిస్తున్నా” అని చెప్పింది. నా కళ్ళు తడి అయ్యాయి.

    A finest compliment!

    కదా?

  • హిందీ పాటలు -లిరిక్స్

    Roman Script

    Hamne Dekhi Hai Un Aankho Ki Mehekti Khushboo
    Haath Se Chhoo Ke Ise Rishton Ka Ilzaam Na Do
    Sirf Ehsaas Hai Ye, Rooh Se Mehsoos Karo
    Pyar Ko Pyar Hi Rehne Do, Koi Naam Na Do

    Hindi

    हमने देखी है उन आँखों की महकती ख़ुशबू
    हाथ से छू के इसे रिश्तों का इल्ज़ाम न दो
    सिर्फ़ एहसास है ये रूह से महसूस करो
    प्यार को प्यार ही रहने दो कोई नाम न दो

    Translation

    I have seen the fragrance emanating from those eyes.
    Do not stain it by labeling it as a relationship.
    It is only realization; experience it with your soul.
    Let love be love, do not ascribe it a label.

    Roman Script

    Pyar Koi Bol Nahi, Pyar Aawaaz Nahi
    Ek Khamoshi Hai, Sunti Hai Kaha Karti Hai
    Na Ye Bujhti Hai Na Rukti Hai, Na Thehri Hai Kahi
    Noor Ki Boond Hai, Sadiyon Se Baha Karti Hai

    Hindi

    प्यार कोई बोल नहीं, प्यार आवाज़ नहीं
    एक ख़ामोशी है सुनती है कहा करती है
    न ये बुझती है न रुकती है न ठहरी है कहीं
    नूर की बूँद है सदियों से बहा करती है

    Translation

    Love is not lyrics, love is not sound (or voice).
    It is a silence that listens and speaks by itself.
    It does not die, it does not stop, it does not pause.
    It is a drop of bliss that flows for eons.

    Roman Script

    Muskurahat Si Khili Rehti Hai, Aankhon Mein Kahi
    Aur Palkon Pe Ujaale Se Jhuke Rehte Hain
    Honth Kuchh Kehte Nahi, Kaanpte Hothon Pe Magar
    Kitne Khaamosh Se Afsaane Ruke Rehte Hain

    Hindi

    मुस्कुराहट सी खिली रहती है आँखों में कहीं
    और पलकों पे उजाले से झुके रहते हैं
    होंठ कुछ कहते नहीं, काँपते होंठों पे मगर
    कितने ख़ामोश से अफ़साने रुके रहते हैं

    Translation

    It blooms like a smile somewhere in the eyes.
    It adorns the eyelashes with a glow.
    Lips do not say much but on quivering lips,
    many silent stories remain suspended (waiting to be told).

    గుల్జార్ పాటల్లో ఓ గొప్ప పాట. ఖామోషి చిత్రం-1969

    ప్రేమ కు నిర్వచనం, పేరు,భాందవ్యం అనేవి ఉండవు. మౌనంగా, ఆత్మ తో ముడిపడి ఉంటుంది

    నిర్వచనాలు ఆపాదించి దాని స్వచ్చతను మలినం చేయకూడదు. – ఇది సెంట్రల్ థీమ్.

    Sometimes, two people are drawn to each other but their relationship has no name .By giving a label to a relationship, expectations to conform to the norms of that label set in. (అలాంటి భావన సమాజపు రీతుల్లో ఫిట్ అవుతుందా – అనేది ప్రశ్న ? – ఇది నా సొంత అభిప్రాయం )

    ఇకపోతే : ఈ పాటలో డిఫరెంట్ layers గురించి.:

    • “పరిమళ భరిత చూపులు ” – రెండు ఇంద్రియాల క్వాలిటీస్ ను బ్లెండ్ చేసిన ప్రయోగం. ఇలాంటి ప్రయోగం జగ్జిత్సింగ్ ఘజల్ లో కూడా ఉంది.(నీ రాక కబురు తో నా ఇల్లు పరిమళ భరితం అయింది . పలుకు (శబ్దం ) + పరిమళం బ్లెండ్.)
    • ” కాంతి బిందువు ” ( నూర్ కి బూంద్ ) : ప్రేమ – యుగాల నుండి ప్రవహిస్తున్న ఒక అనిర్వచనీయమైన కాంతి అని అర్ధం.
    • ప్రేమ ఒక బ్రతికే జీవి లా చెప్పటం : It is a silence that listens and speaks by itself. –ఇక్కడ నిశ్శబ్దం మాట్లాడుతుందనే ప్రయోగం.
    • physicality ని దూరంగా పెట్టాడు కవి. ప్రేమ ఒక ఎహసాస్ ( అనుభూతి ) అని ,అత్మ తో దానిని ఆస్వాదించాలి అని చెప్పిన వైనం ఒక spiritual tinge ను సూచిస్తుంది.
    • పెదవులు మాట్లాడక పోయినా , వణికే పెదవులు చాలా కథలు మౌనం గా చెప్తాయి .. అంటే వణికే పెదవుల వెనుక చెప్పలేని ఫీలింగ్స్ ఉంటాయని అర్ధం.
    • ఇందులో సూఫీ తత్వం :: నిజమైన అనుబంధాలు ఆత్మ నుంచి ఆత్మకి అనుభూతి చెందుతాయి, “స్నేహం”, “ప్రియుడు”, “భర్త/భార్య” వంటి బిరుదులు అవసరం లేదు

    ఇలా చెప్పు కుంటే పోతే ఈ పాట లోని ప్రతి పదం గురించి ఒక పేరా రాయొచ్చు. నాకు తెలిసింది రాసాను.

    హేమంత్ కుమార్ సంగీతం/లత పాట ..

    ఓ 50 సార్లు విని ఉంటా ఈ పాటను .

    మీరు ఆలకించండి

    😍

  • కనాట్ ప్లేస్ కథలు (ఎండీ నుండి లేఖ)

    బ్యాంక్ ఉద్యోగంలో కఠిన మైనది,అందరూ కోరుకునేది foreign Exchange(Forex) dept. అంతా రూల్స్ మయం. అందులోకి వెళ్ళాలంటే అప్పట్లో తెల్లజుట్టు అధమం. అటువంటి dept కు నన్ను పోస్ట్ చేశారు. అందులోనూ probation లో.నాకప్పుడు 25 ఏళ్ళు నిండలేదు.అందులో న్యూఢిల్లీ మెయిన్ బ్రాంచ్. వామ్మో ! అసలు ఎవరూ ఊహించలేని పరిణామం..ఇంపోర్ట్స్ హెడ్ గా వెళ్ళా.

    నా పక్కన తల నెరిసిన ఓ అరవతను ఎక్సపోర్ట్స్ హెడ్. పొద్దున వెళ్తే సాయంత్రం 7 వరకు పని అంతా ఔపోసన పట్టటం. ఓ రెండు నెలలు గడిచాయి. 16 బ్రాంచీలు నాకు reporting (jk నుండి mp వరకు.) .పని మీద పట్టు బాగా సంపాదించా.

    ఆ సమయంలో ఒక సమస్య వచ్చింది. ఘజియాబాద్ HCL అకౌంట్ నా పరిధి లోనిది. అప్పుడు వాళ్ళు ఏనుగంత కంప్యూటర్లు చేసేవారు. వాళ్ళ పర్చేస్ హెడ్ వచ్చి మేనేజర్ కేబిన్ లో వెళ్ళి imports అని అన్నాడట. మానేజర్ కుముదం మ్యాగజిన్ చదువుతూ గో టు ghouse అన్నాడట.వాడికి కోపం నెత్తి కెక్కి నాట్యమాడింది. कौन से गधा को बिठाया అని చిందులు.నేను “77” కూల్ డ్రింక్ తెప్పించి విషయం అడిగా. నువ్వు కొత్తవాడివి.నీకు తెలియదు పో అన్నాడు.

    సంగతి : సీకో జపాన్ నుండి పార్టులు import చేయటానికి HCL తరపున మా బ్యాంక్ ఒక LC ఇష్యూ చేసింది. అది yen currency లో ఉన్నా కూడా సీకొ కు నష్టం వస్తుందని(విదేశీ మారక ద్రవ్యం వల్ల) imports ఆపేస్తామని టెలెక్స్. వాళ్ళకి yen లో నే డబ్బు కావాలంట. మాకా జపాన్ బ్యాంకులలో yen acct లేదు. మాకున్న పౌండ్ అకౌంట్ నుండి మారకం వల్ల వాళ్లకు నష్టం వస్తుందని సప్లై ఆపేశారు. నేను విని నాకు 4 రోజులు టైం ఇప్పించండి అని బామాలి పంపించేశాను.

    నాకు ఏమి పాలుపోలేదు. పక్కన ఎక్సపోర్ట్స్ వాడికి చీమ కుట్టినట్టు కూడా లేదు.ఆ రోజంతా ఆలోచించా.

    మా బ్యాంక్ పౌండ్ అకౌంట్ NatWest bank లో ఉంది.మా సుత్తి బ్యాంక్ అకౌంట్ NatWest లో ఉండగా లేంది, NatWest లాంటి పెద్ద బ్యాంక్ వాళ్ల yen acct అతి పెద్దదైన బ్యాంక్ ఆఫ్ టోక్యో లో ఉండదా అని ఆలోచించా.

    feeble logic.

    నాకు ఎవరూ ఊహించని ఆలోచన వచ్చింది. నేను NatWest bank వాళ్ళ yen acct ను ఆపరేట్ చేస్తే ఎలాగుంటుంది?

    ఎలా..అని సంశయం. సరే మూడు పేజీల ఉత్తరం NatWest కు రెడీ చేశా.telex ద్వారా పంపాలి. నాకా telex టైపింగు రాదు. మేనేజర్ కు చూపిస్తే ఇది కుదరదు అని అంటారు. ఎలా?

    మా బ్రాంచ్ బ్యూటీ(నాకు బులుగు స్వేట్టర్ అల్లి గిఫ్ట్ ఇచ్చిన అమ్మాయి- ఆముచ్చట మరో సారి ) దగ్గరకు వెళ్ళి Cavendish లో ఐస్ క్రీం ఇప్పిస్తా..నాకు మెసేజ్ టైప్ చేసి పెట్టు అన్నా. మేనేజర్ సంతకం పట్రా అంది.లేదన్నా.

    నాకు టైపు చేసి perforated paper ribbon పంచ్ చేసి ఇవ్వు. నేనే ట్రాన్స్మిట్ చేసుకొంటా.. అని అడిగా..సరే అని ఒక మెలిక పెట్టింది. తనను సినిమా కు తీసుకొని వెళ్ళాలి అంది నవ్వుతూ. నేను కుదరదు.ఐస్క్రీమ్ మాత్రమే అన్నా.ముందు ఒప్పుకోలేదు. సినిమా అంది. I was firm. చివరకు నేను బండోడు అని నిర్ధారించుకొని సరే అని పేపర్ రిబ్బన్ కట్ చేసి పద ఐస్ క్రీం ఇప్పించు అంది.

    నేను ఐస్ క్రీం తనతో బాటు గబగబ తింటుంటే అలా తినకూడదు అని నాకు క్లాసు పీకింది. అమ్మాయి తో వచ్చినప్పుడు కొంప లంటుకు పోతున్నాయని ఐస్ క్రీమ్ తిన కూడదు. కబుర్లు చెపుతూ ఒక గంట స్పెండ్ చేట్టాలి అని ఎలిమెంటరి క్లాసు పీకింది. వింటం తప్పదుగా..

    గంట తర్వాత Cavendish నుండి బయట పడి , బ్రాంచ్ కు వచ్చి నా దగ్గర ఉన్న code book నుంచి కోడ్ కంప్యూట్ చేసి telex రూం కు వెళ్ళి మెసేజ్ ట్రాన్స్మిట్ చేసేసా.. దాని కాపీ బ్యాంక్ ఆఫ్ టోక్యో కు కూడా పంపేశా.

    మూడురోజులు గడిచాయి.నాకు నిద్ర పట్ట లేదు. నాలుగో రోజు రెండు telex మెసేజ్ లు వచ్చాయి. ఒకటి NatWest నుండి. వాళ్లు “ మీ problem అర్థం అయింది. As a special case మీరు ఈ క్రింద తెలిపిన 16 కరెన్సీల బ్యాంక్ అకౌంట్లు మా తరపున ఆపరేట్ చేయవచ్చు కాని ఒక రోజు ముందు తెలియపరచండి.” నేను ఎగిరి గంతు వేశా.

    రెండో టెలెక్స్ బ్యాంక్ అఫ్ టోక్యో నుండి. “మాకు NatWest నుండి అనుమతి వచ్చింది.వాళ్ళ అకౌంట్ మీ తరపున డెబిట్ చేశాము.శీకో కు నిన్ననే అమౌంట్ క్రెడిట్ చేసాము”. నేను గాల్లో తేలుతున్న ఫీలింగ్.

    ఇంతలో ఘజియాబాద్ నుండి ఫోన్. HCL purchase హెడ్ సంతోషం గా నా parts airlift అయ్యాయి అంటూ రేపు అశోక లో లంచ్ అన్నారు. సున్నితంగా రాలేను అని చెప్పా.

    ఇక నేను జరిగిన కథ అంతా సెంట్రల్ ఆఫీస్ కు 4 పేజీల foolscape టైప్ చేయించి,telex కాపీలు జత చేసి మేనేజర్ దగ్గరకు వెళ్ళాను.ఆయన ఒక పేజీ చదివి అగ్గి మీద గుగ్గిలం అయ్యారు.నువ్వు ఫ్రాడ్ చేశావు.నేను సంతకం చెయ్యను. అన్నారు.నేను లేని ఓపిక తెచ్చుకుని మొత్తం వివరంగా చెప్పాను..వింటేగా? NatWest ను ఒప్పించగలిగా.. నా మే నేజర్ ను ఒప్పించలేక పోతున్నా.కోపం వచ్చేస్తుంది.

    ఇక లాభం లేదని.. సర్ fraud అని సెంట్రల్ ఆఫీస్ తేలిస్తే నన్ను ఉద్యోగం నుండి పీకేస్తారు.మీకెంటి అన్నా. ఊహు! సంతకం పెట్టనన్నారు. నేను ఆయన పెన్ను టేబుల్ పై నుండి తీసుకొని “yours truly ..Manager “ దగ్గర Slash పెట్టి నేను నా ఫుల్ సంతకం చేసి పేరు రాసి పక్కన Probationary officer అని రాశా. (PO అదేదో పెద్ద designation అయినట్టు). ఆయన నన్ను ఎంత ధైర్యం? వెంటనే Forex deptనుండి వెళ్ళిపో అన్నారు. నేను సెంట్రల్ ఆఫీస్ నుండి జవాబు వచ్చిన తర్వాత వెళ్తాను అని బయటకు వచ్చి ఆ లెటర్ despatch లో ఇచ్చేసా.

    ఒక వారం తర్వాత సెంట్రల్ ఆఫీస్ నుండి ఒక పెద్ద లెటర్. Ghouse గారికి .”మీరు ఇలా మాకు ముందు చెప్పకుండా చెయ్యటం పద్ధతి గాదు. ఇక ముందు మా పెర్మిషన్ తీసుకోండి. మీరు సజెస్ట్ చేసినట్టు మేము yen acct Japan లో Dai-ichi Kogyan బ్యాంక్ లో ఓపెన్ చేశాము.దాని నంబర్ క్రింద ఇస్తున్నాం”

    Manager లెటర్ చదివి చూసావా..నే చెప్పాగా. నా మాట వింటేగా? అన్నారు. నేను వెంటనే నేను చేసింది ఫ్రాడ్ కాదు గా అన్నాను.ఆయన గుర్రుగా చూశారు.

    రెండో లెటరు నా పేరు మీద సీల్డ్. MD ఆఫీస్ నుండి.ఓపెన్ చేశా. నేను చేసిన పని ఔట్ Of box అని మెచ్చుకొన్నారు. చివరన అన్నివేళలా అప్రమత్తం గా ఉండాలి ఇటువంటి undocumented protocols attempt చేస్తున్నపుడు అని ముగించారు. ఆ లెటరు మేనేజర్ చూసి అరే MD letter నాకు ఇంతవరకు రాలేదు. నీకు వచ్చింది అని అంటూనే చూసావా నువ్వు చేసింది రూల్ ప్రకారం కాదు అన్నారు .

    నువ్వు రూల్ ప్రకారం ముందస్తుగా నా అనుమతి తీసుకో లేదు. కాబట్టి Forex నుండి నిన్ను FD dept కు ట్రాన్స్ఫర్ చేస్తున్నా అని చెప్పారు. నేను కూడా నిశ్చయించుకొన్నా ఇంక అక్కడ కుదరదు అని. Ok sir అన్నా.

    కానీ మేము నలుగురు PO లం చంద్రశేఖర్ అని ఓ Forex guru ఉండేవారు. ఆయనను ఒప్పించి రోజూ Office hours తర్వాత 6–8pm Forex ఓ 5 నెలలు నేర్చుకున్నాం.

    కొసమెరుపు: కట్ చేస్తే. ఆ మే నేజర్ గారు 1987 లో Hyd కు జోనల్ మేనేజర్ గా వచ్చారు.అప్పుడు నేను నల్లకుంట బ్రాంచ్ మేనేజర్ .అందరూ airport కు వెళ్ళాం. ఆయన అందరికీ షేక్ హ్యాండ్ ఇస్తూ నా దగ్గరికి వచ్చి నువ్వు ఇక్కడున్నావా ? అని కొంచెం సేపు నా చేతిని వదల్లేదు. తర్వాత భుజం మీద చెయ్యి వేసి కారు వరకు నాతో నడిచారు.

    ( వీడు ఇక్కడ కూడా దాపురించాడా అని మనసులో అనుకోని ఉంటారేమో ఆయన ) .

  • కనాట్ ప్లేస్ కథలు – ఫ్లయింగ్ కిస్

    మా బ్యాంక్ పక్కనే BOAC ఆఫీస్ ఉండేది.( బ్రిటిష్ ఎయిర్వేస్ కంటే ముందు BOAC అనే పేరు )

    ఆ రోజుల్లో(1977 ) Compulsory Deposit Scheme ( CDS) లో yearly 20pct refund ఉండేది. లెడ్జర్లు వెతకటం,అప్పుడు calculate చేయటం,వోచర్లు వేయటం,టోకెన్ ఇవ్వటం,ఆఫీసర్లు సైన్ చెయ్యటం, cashier ఇవ్వటం ఓ పెద్ద తతంగం నడిచేది. 30 నిమిషాలు పట్టేది.

    ముగ్గురు మగ క్లర్క్ లుఉన్న dept కు నన్ను ఆఫీసర్ గా వేసారు..చాలా మటుకు efficiency పెంచినా కొన్ని పాతుకుపోయిన వాటిని పెకలించలేము.

    సరే..refund సీజన్ మొదలైంది.

    Air hostess ల తాకిడి ఎక్కువైంది.టేబుల్ దగ్గరకు వచ్చిన ఏర్ హోస్టెస్ల ను ఎక్కువ సేపు కూర్చో బెట్టమని మా క్లర్క్ ల అభిలాష.నేను ససేమిరా అనేవాడిని.

    ఇలా కాదని,ఓ కొత్త సిస్టమ్ పెట్టా. అన్నీ అకౌంట్లలో refund calculate చేసి డేట్ లేకుండా వోచర్లు వేసేసి ఆయా ఫోలియోల్లో ఉంచేసే ప్రక్రియ.. పేపర్స్ కొంచెం బయటకు కనబడుతుంటాయి.కొంచెం untidy గా ఉంటుంది.కానీ efficient గా కస్టమర్ ను సర్వ్ చేయొచ్చు.

    మేనేజర్ మర్నాడు చూసి పేపర్లు బయటకి కనబడుతున్నాయి.లోపలపెట్టమని ఆదేశం.నేను కుదరదన్నా.నన్ను చాలా adamant అని అన్నారు.

    ఈ process లో 15 నిమిషాలు తగ్గించాము.

    ఓ రోజు చాలా అందమైన airhostess suitcase లాక్కుంటూ నా సీట్ దగ్గరకు వచ్చింది.కుర్చీ ఖాళీగా ఉంటే కూర్చోమని చెప్పా. టైం లేదు. టాక్సీ వెయిటింగ్. 5 నిమిషాల్లో లో వెళ్లిపోవాలి అన్నది.5000 రూపాయల refund.

    మా క్లర్కు గొణుగుతూ కొంచెంసేపు ఉంచండి అంటున్నాడు.

    వాడిచే ఆ లెడ్జర్ తియ్యించి,డెబిట్ వోచర్ వెనకాల ఆ అమ్మాయితో సంతకం చేయించా. నా సీట్ కు దగ్గరగా ఉన్న క్యాషియర్ పేరు Mrs Thailambaal. నేను 5000 తైలంబాల్ అని గట్టిగా అన్నా. ఆవిడ గాల్లో 5000 కట్ట అలా విసిరేసింది. నేను ఒడుపుగా పట్టుకొని ఆ అమ్మాయికి ఇచ్చాను. అమ్మాయిని టైం అడిగాను. అప్పటికి 3ని 50 సెకండ్స్ అయింది అని చెప్పింది.

    థాంక్స్ చెప్పి బయలుదేరుతూ నా పేరు అడిగింది.నేను చెప్పా. గేట్ దగ్గరకు వెళ్లి బిగ్గరగా ghouse you are a star అని గట్టిగా చెప్పింది. నేను అటు తిరగ్గానే ఒక ఓ ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది.

    బ్యాంక్ హాల్ మెత్తం Stunned. హాల్ లో ఉన్న కోలీగ్లు అందరూ పార్టీ పార్టీ అని ఒకటే గోల.40 కాఫీలు సమర్పయామి. ఖర్చు 40 రూపాయలు.

    మర్నాడు నన్ను పిలిచి బ్రాంచ్ మేనేజర్, ఈ కిస్సులు అవి ఏమిటి అని అన్నారు.

    ఇంట్లో శ్రీమతికి చెప్పా.అవిడ గారు “ఫ్లయింగ్ కిస్ 40 రూపాయలా” అని నన్ను ఆట పట్టించేది చాలా రోజులు.

  • కనాట్ ప్లేస్ కథలు

    Oct 1977.కనాట్ ప్లేస్ న్యూఢిల్లీ మెయిన్ బ్రాంచ్ లో పోస్టింగ్.. మేము నలుగురు PO లం. నేను,ఫస్ట్ ర్యాంక్ అమ్మాయి,ఇంకో ఇద్దరం.నాకు ఏదో చెత్త పెండింగ్ పని ఇచ్చారు. యమ స్పీడ్ గా చేశా.ఇంకోటి ఇచ్చారు.అదీ అంతే. ఓ నెల్లాళ్ళకీ “బాబు బాగా చురుకు” అనే బిరుదాంకితుడయ్యాను.

    నన్ను savings సెక్షన్ కు ఆఫీసర్ గా వేశారు. L shaped counter.18 మంది అమ్మాయిల అతిపెద్ద dept. నేనొక్కడినే ఆఫీసర్. పంజాబీ ,తమిళ్ అమ్మాయిలు.సగం మంది PG లు. పొద్దున్నుంచి 2pm వరకు భలే రష్. అందరితో చక్కటి rapport.

    ఓ సారి అందరూ నా table దగ్గరకొచ్చి ఓ డౌట్ అడిగారు.

    ప్ర: మీ భార్య మీకంటే ఫెయిర్ గా ఉంటారా?

    నే: ఉండరు

    ప్ర: మీకంటే ఎక్కువగా చదివారా?

    నే: లేదు

    ప్ర: మీ కంటే డబ్బు కలవారా?

    నే : కాదు

    ప్ర: మీది లవ్ మ్యారేజా?

    నే: కాదు

    ప్ర: why the hell did you marry her ?

    నే: చిరునవ్వు.

    శ్రీమతి గారిని పరిచయం చెయ్యి coming Saturday అని ఏకగ్రీవ డిమాండ్.

    Saturday మధ్యాహ్నం లజ్పత్ నగర్ నుండి తీసుకొచ్చి బ్రిటిష్ క్వీన్ కు పరిచయం చేస్తారే అలా వరుసగా నిల్చోబెట్టి అందరికీ పరిచయం చేశా.కాఫీలు సమోసాలు అమ్మాయిలదే బిల్లు.

    ఓ గంట గడిచిన తర్వాత ఇంటికి వెళ్ళాం.ఏమి అడిగారు అని నేను ఆరా తీసా.నిన్ను బాగా చూసుకొంటాడా అని డౌట్ express చేశారట.

    నా దస్తూరి ఆ రోజుల్లో బాగుండేది. అమ్మాయిల్లో చాలామంది నా దస్తూరి కోసం FD (nominal amount కి) చేసే వారు. ఆరోజుల్లో అది చేత్తో వ్రాయాలి కదా..

    నా టేబుల్ సొరుగు లో రెగ్యులర్ గా ఎవరో చాక్లెట్లు పెట్టేవారు.మా ఆఫీస్ ప్యూన్ ను కనిపెట్టమని చెప్పాను. అతను ఓ రోజు రహస్యాన్ని ఛేదించాడు. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న అమ్మాయిలలో చాలా అందమైన పంజాబీ అమ్మాయి పెట్టుతుందని తెలిసింది. . అస్తమానం చూస్తూ ఉండేది. ఆ అమ్మాయి తో నేను కొంచెం ఇబ్బంది పడ్డా

    ఒకసారి తనని కాఫీ కి తీసుకొని వెళ్ళి , ఇది మంచిది కాదు. ఇలా చేయవద్దు అని polite and firm గా చెప్పా. అర్థం చేసుకొందేమో మరి, ఆబ్రాంచ్ లో నేనున్న మిగతా సంవత్సరం నాతో తను మరల మాట్లాడలేదు.

    (వచ్చే సంచికలో. ఫ్లయింగ్ కిస్ విశేషాలు)

  • హిందీ పాటలు – లిరిక్స్-2

     Chaudvi ka chand ho -Rafi-Shakeel-Ravi

    चौदवीं का चाँद हो या आफ़ताब हो?
    जो भी हो तुम ख़ुदा की क़सम, लाजवाब हो
    పున్నమి చంద్రవదనమా లేక సూర్య బింబమా ?
    ఏమైనా గాని,నీవు అసమాన సౌందర్య వతివి

     
    ज़ुल्फें हैं जैसे काँधों पे बादल झुके हुए
    आँखें हैं जैसे मय के प्याले भरे हुए
    मस्ती है जिसमें प्यार की, तुम वो शराब हो
    కురులు భుజాల పై వాలిన మేఘం లా

    నయనాలు నిండైన మధు పాత్ర లా

    ప్రేమ రంగరించిన మధువు లా


    चेहरा है जैसे झील में हँसता हुआ कँवल
    या ज़िंदगी के साज़ पे छेड़ी हुई ग़ज़ल
    जान-ए-बहार, तुम किसी शायर का ख़्वाब हो

    ముఖారవిందం సరస్సు సరస్సు లోని వికసిత పద్మమా

    బతుకు వీణపై పలికించిన గీతమా

    వసంత రూపమా.. కవి స్వప్నమా ..

    होंठों पे खेलती हैं तबस्सुम की बिजलियाँ
    सजदे तुम्हारी राह में करती है कहकशाँ
    दुनिया-ए-हुस्न-ओ-इश्क़ का तुम ही शबाब हो

    అధరాల పై చిరునవ్వులు తటిల్లతలా

    నీ కోసం శిరస్సు వంచిన పాలపుంతలు
    జగత్తు లో అందానికి యవ్వనానికి నీవే చిరునామా

    షరా :: పాట లోని కొన్ని పదాలకు సరిగ్గా అనువాదం కుదర లేదు.

    ఈ పాట లోని ఉర్దూ పదాలు :

    Chaudhvin ka chand = పొర్ణమి

    Aaftaab = సూర్యుడు

    Lajawab = అసమానమైన

    Maey = మధువు

    Saaz = వాయిద్యం

    Jaane bahaar = వసంత శోభ

    Khwaab = స్వప్నం

    Tabassum = చిరునవ్వు

    Sajda = శిరస్సు వంచి ప్రమాణం

    Kaikashaan = పాలపుంత

    Duniya-e-husno-ishq = మిస్ వరల్డ్

    Shabaab = యవ్వనo

    పాట గురించి :

    షకీల్ బదాయూని రాసిన గీతాల్లో అజరామరం ఇది.

    పాటలో ప్రకృతి భాగాలైన చంద్రుడు,సూర్యుడు, మేఘాలు,సరస్సు,పాల పుంతలు దర్శన మిస్తాయి.ప్రేయసిని వీటితో పోల్చి, ఆమె అందానికి సూపర్ ఎలివేషన్ ఇచ్చాడు కవి.(ఎలివేషన్ అంటే ఇప్పటి హీరో లకు ఇచ్చేయేది కాదు సుమా !)

    ప్రతి వాక్యం ప్రేయసి అందానికి సలాం చేస్తుంది.

    మొదట్లో చంద్ర బింబమా /సూర్య బింబమా అని మీమాంస ఉన్నా — ఏదైనా సరే ఆమె వదనం matchless అంటే ఎవరికీ సాటిరానిదని చెప్పటం లో she is unique అని భావం.

    ఇకపొతే కురులు,చిరువవ్వు, కనుదోయి ల ను మేఘాలు,తటిల్లతలు ,మధు పాత్రలతో పోల్చటం సూపర్.

    Duniya-e-husno-ishq = జగత్తు లో అందం +ప్రేమ కలబోసినా ఇంతి – అని చెప్పటం – ఓహ్!

    పాట పాడిన రఫీ గురించి చెప్పే సాహసం, ఆ గొంతులో మాధుర్యం , పలికించిన భావాలు విశ్లేషణ నాఊహకు కూడా అందనిది.

    ఈ పాట 65 ఏళ్ళ నాటిది. ఇంకా నిత్యయవ్వనం గా, ప్రేమిక అందాన్ని వర్ణించే పాటలలో తల మానికంగా నిలిచిపోయింది. https://youtu.be/uAsM_D5oO9c?si=BAd7NPU4vnARWL5Q

    -ghouse

  • Evening

    While flipping through life’s pages

    My gaze fell on a page brimming with joy

    That quiet evening amidst garden of roses

    We both holding hands watching world go by

    Mirth and vibrance in abundance around

    Accentuated our compatible silence.

    The earth stood still in those mesmerizing moments

    And our unison of souls blessed by a rainbow therein.

    Alone now, after many decades,

    I am stuck at that life’s page

    Looking forlorn, with throbbing emotions to handle.

    -Ghouse

  • హిందీపాటలు – లిరిక్స్.

    హిందీ పాటల్లో నాకు నచ్చిన కొన్ని పాటల అర్ధాలు,వర్ణనలు పరిచయం చేద్దామనే తలంపుతో, నాకు వీలైనప్పుడు మీతో పంచుకొందామనే ప్రయత్నం ఇది. ఇది కేవలం నాకు నచ్చిన పాటల గురించే.

    మొదటగా అబ్దుల్లా చిత్రం లోని ఈ పాట.

    అతివ వర్ణన కి పరాకాష్ట,

    LYRICS:

    मैंने पूछा चाँद से कि देखा है कहीं
    मेरे यार सा हसीं?
    चाँद ने कहा, “चाँदनी की क़सम
    नहीं, नहीं, नहीं”

    నా సఖి లాంటి అందగత్తె ను చూసావా అని చంద్రుణ్ణి అడిగా..

    అబ్బే , వెన్నెల మీద ఒట్టేసి చెప్తున్నా – చూడలేదని అన్నాడు.

    -వెన్నెల జగమంతా కురుస్తుంది కదా. కాబట్టి .. మొత్తం జగత్తు లో తన సఖి లాంటి అందగత్తె లేదని భావం.

    मैंने ये हिजाब तेरा ढूँढा
    हर जगह शबाब तेरा ढूँढा
    कलियों से मिसाल तेरी पूछी
    फूलों में जवाब तेरा ढूँढा

    मैंने पूछा बाग़ से फ़लक हो या ज़मीं
    ऐसा फूल है कहीं?
    बाग़ ने कहा, “हर कली की क़सम
    नहीं, नहीं, नहीं”

    నీ లాంటి సిగ్గరి ను ( hijab: ఇంకో అర్ధం shyness )

    నీ లాంటి యవ్వనవతి ను

    పూమొగ్గలలో,విరిసిన పూవుల్లో వెతికాను.

    భూమ్యాకాశాలలో ఎక్కడైనా చూసావా అని తోటను అడగ్గా ( falak = ఆకాశం )

    ప్రతి పువ్వు మీద ఒట్టేసి చెప్తున్నా .. ఎక్కడా చూడలేదు.అని తోట శెలవిచ్చింది.

    భూమ్యాకాశాలలో అలాంటి యవ్వనవతి,అందగత్తె – లేదని కవి గారి అభిప్రాయం.

    हो, चाल है कि मौज की रवानी
    ज़ुल्फ़ है कि रात की कहानी
    होठ हैं कि आईने कँवल के
    आँख है कि मयकदों की रानी

    मैंने पूछा जाम से फ़लक हो या ज़मीं
    ऐसी मय भी है कहीं?
    जाम ने कहा, “मयकशी की क़सम
    नहीं, नहीं, नहीं”
    అది నడకా లేక నాట్య మాడే అలయా ?

    అవి కురులా లేక రాత్రి కబుర్లా?

    అవి ఆధరాలా లేక పంకజపు ప్రతిబింబాలా?

    భూమ్యాకాశాలలో నా సఖి లాంటి మధువును

    ఎక్కడైనా చూసావా అని మధుపాత్రను అడగ్గా

    నిషా మీద ఒట్టేసి చెప్తున్నా

    ఎక్కడ చూడలేదని మధుపాత్ర సెలవిచ్చింది.

    భూమ్యాకాశాలలో అలాంటి మత్తెక్కించే అందమైన సుందరి లేదని కవి గారి అభిప్రాయం.

    .

    ख़ूबसूरती जो तूने पाई
    लुट गई खुदा की बस खुदाई
    मीर की ग़ज़ल कहूँ तुझे मैं
    या कहूँ ख़य्याम की रुबाई?

    मैं जो पूछूँ शायरों से ऐसा दिल-नशीं
    कोई शेर है कहीं?
    शायर कहें, “शायरी की क़सम
    नहीं, नहीं, नहीं”

    నీ కున్న అసమాన సౌందర్యం వల్ల

    దేవుడి కి కూడా తన కటాక్షం పై నమ్మకం పోయిందట !

    నువ్వు మీర్ గజల్ , ఖయ్యాం రుబాయీ ల్లా ఉంటావేమో నని

    కవులందర్నీ అడిగా

    కవిత్వం పై ఒట్టేసి చెప్తున్నాం.. ఎవ్వరు లేరని కవులు అన్నారుట .

    కవిత్వం అంటేనే ఊహా జనితం. అలాంటి ఊహల్లో కూడా ఎవ్వరూ తన సఖి కు సాటిరారని భావం.

    ఈ పాట వింటున్న సేపూ అతివ అందాల వర్ణన శ్రోతలను ఒక స్వప్న లోకాన్ని పరిచయం చేస్తుంది.

    ఇంత చక్కటి వర్ణన ,ఆనంద్ బక్షి పాటల్లోని ఒక ఆణిముత్యం. రఫీ తన గాత్రం తో మనల్ని వేరే లోకాలకు తీసుకొని వెళ్తాడు.

    మీ కామెంట్స్ పంచుకోండి

    భవదీయుడు

    –ghouse

    ( కొన్ని పదాలకు సరైన తర్జుమా దొరకలేనప్పుడు , భావం చెడకుండా నేను వేరే తెలుగు పదాలు వాడాను .గమనించగలరు )

  • గురువు గారు

    హైదరాబాద్ .
    ఇండియన్ బ్యాంక్ నల్లకుంట బ్రాంచ్ మేనేజర్ గా ఉన్నప్పుడు,ఒక సీనియర్ సిటిజన్ ఏదో పనిమీద బ్యాంక్ కు వచ్చారు. నేను లోపలక్యాబిన్ లో ఉన్నా. ఆయన కొంచెం ఎక్కువ సేపు కౌంటర్ దగ్గర నిల్చుని ఉంటే నేను బయటకు వచ్చి, సంగతి ఏమిటో కనుక్కొందామని వెళ్ళాను. ఆయన్ను ఎక్కడో చూసినట్టు లీలగా గుర్తు.కౌంటర్ లో పేరు కనుక్కొన్నా. ఆయన Retd ప్రో.శేషాద్రి, JNU Head of Pol Sc. నేను వెంటనే కౌంటర్ బయటకు వెళ్లి, ఆయనను తోడ్కొని నా క్యాబిన్ లో కూర్చోబెట్టి కాఫీ అదీ ఇచ్చాను.

    నేను: సార్. మీరు 1975 నా ఢిల్లీ ట్రిప్ లో తీన్మూర్తి లైబ్రరీ temp card కోసం రికమండేషన్ లెటర్ ఇచ్చారు. దానివల్ల నాకు 1947 Aug 15 న్యూస్ పేపర్లు+కాశ్మీర్ హరిసింగ్,నెహ్రూ,పటేల్ ఉత్తరాల కాపీలు వగైరా చదివే భాగ్యం కలిగింది. అని చెప్పాను

    ప్రో: బ్యాంక్ ఉద్యోగం లో చేరావా? PhD చేసి అకడమిక్స్ choose చేసుకోవాల్సింది అన్నారు.

    నే: అంత అదృష్టం లేదు సార్ అన్నాను. ఆయన పని నేను స్వయం గా చేసి పెట్టి సాగనంపాను.

    ఒక వారం తర్వాత పని గట్టుకొని వచ్చి నన్ను వాళ్ళ ఇంటికి భోజనానికి తీసుకొని వెళ్లారు. ఇంట్లో చాల పెద్ద లైబ్రరీ. పై అరలో పుస్తకాల కోసం ఒక చెక్క నిచ్చెన. నిజంగా ఒక ప్రో.గారి ఇల్లు అనిపించింది. చక్కటి భోజనం చాల ఆప్యాయంగా వడ్డించారు మేడం.


    మీరు ఆయన దగ్గర అంత వినయంగా ఎందుకు ప్రవర్తించారు అని స్టాఫ్ అడిగితే… నాకు తెలిసినప్పుడు అయన (JNU HOD )గురువు గారు. గురువుల దగ్గర వినయంగా ఉండాలి కదా అన్నాను. (నేనేదో చాదస్తపు వాడిని అని అనుకొని ఉంటారు)