Category: భక్తి, ఆధ్యాత్మికం / Spirituality & Divine

  • శివోఽహమ్

    శివోఽహమ్

    ఏంది నాసుట్టు నేనేంది ఈడని
    రోజు సదమద మైతరొ శివిగా
    సదువూ గురువూ ఎరగని జీవిర
    ఇవరం నివ్వే దెలుపరొ శివిగా

    యాడ నీ ఇల్లు యేది నీ కొలువంట
    బగు ఆత్రము ఆగమైతరో శివిగా
    పురుగు బుట్రకే నీ ఆదరమాయెన
    నేనీడ నీ నీడ గోరి అల్లాడగ శివిగా

    సేదుకో నన్నని అడిగినంతనే
    అదుకుంటవని పేరుర శివిగా
    శివ శివాయంటె సెవికినపడదా
    నీకు సెవుఁడా ఏందిర శివిగా

    నిన్ను దలపకుండ నా దినమేడుందిర
    గుండె సెలమ జేసి అబిసేకము శివిగా
    మరి నే ఓయని పిలిసితే కోయనవేందిర
    బక్తసులబుడంట ఎచ్చులేందిర శివిగా

    కరువు దీర నిను రెండు కండ్ల జూడ
    నా కండ్లు జాలవంట గద శివిగా
    నీ దరిసెనమానని సూపు నాకేల
    నీ అగ్గికన్ను దెరుసు నాదిక్కుర శివిగా

    ఆట నీది ఆటగాడు నీవటర
    నీమనిబందము నీ మాయట శివిగా
    నీ కుశాలు నువు జూసుకుంటవా
    ఇందిల నా తపన ఎంచవా శివిగా

    నివ్వే సత్యము నివ్వే నిత్యము
    సకలము నివ్వేనంటగ శివిగా
    అంతా నివ్వే అయ్యిన కాడికి
    నేనెవురన్న కౌతు నాకేలర శివిగా

    ఎవ్వురు నివ్వని ఎదికిన దంకా
    ఎన్నెన్ని ప్రశ్నలు నివ్వుర శివిగా
    ఎఱిక దెలియుకై ఎదను తడిమితే
    నా ఉనికి నీవని అరసిర శివిగా

    పలుకు, #తెలుగు #అమ్మనుడి, #శివోహం #ఆధ్యాత్మికం, #భక్తి, #కవిత 

    @vennela

    1
  • “…శివా రుద్రస్య భేషజీ…”

    కాల,దురితాల నడుమ నలిగి,
    ఈతి బాధలు పడుతు చెలగి,
    తనవారికి తక్క, పరులమేలు తలవక
    ఇహపరాల తలపు పొసగక
    మాయ మాటున ఉబుసుపోక,
    కాయమున హంస పైకెగరగ..

    కట్టెతోబాటు కాటికేగి
    తోబుట్టువులు సైతం
    తోడరాని పయనం
    రుధిర,దేహ బాంధవులైనా
    చేష్టలుడిగి చూడగా

    తను బతికిన గతమున
    సలిపిన గమనమున
    మరలిన పలుమలుపుల
    కలిగిన తలపుల నెమరి
    భ్రాంతి పెరిగి విలవిలలాడి
    తనవారి చుట్టు తనకలాడి..

    కర్మ వాసనలు మూటకట్టి
    బొటనవేలంత జీవుడింక
    మది నిలబడిన చింతనలబట్టి
    ఆ తోలుతిత్తి నుండి
    తోచిన బొఱ్ఱ నుండి
    బయటపడు వైనముల

    ఆరునాల్కల అగ్గిబ్రాహ్మడు
    కట్టెను సమిధగ కాల్చేయ
    పుర్రె పగుల్చూసి
    మరుభూమి నుండి మరలి
    నా అనుకున్న వారు తరలి
    వెళ్ళిపోవుట చూసి

    ఛిద్రమయ్యే జీవుడికై
    రుద్రుడక్కడే నిలిచెను
    జీవాత్మ గుండె పగలనీక
    పరమాత్మ నిండుగ నవ్వెను.

  • హరహరో… చేదుకో కోటయ్యా!

    హరహరో… చేదుకో కోటయ్యా!

    కోటప్ప కొండపై
    కోటి వ్రేల్పుల రేడు
    కోటయ్య యని మ్రొక్క
    చేదుకొను హరుడు

    ఏమన్న ప్రభలు నవి ఎంత జాతరలు
    త్రికూట రాయుడికి కోటి దండాలు
    వేయి సంబారాలు వేవేల పూజలు
    కోటి ప్రభలా వేల్పు మేలు సల్పు

    శివుడె దిక్కని మ్రొక్క నొక్క గొల్ల వారింట
    వరపుత్రి వెలసె ఆనందవల్లి యను పేరిట
    బాల మనమున యెపుడు బాలేందుడే యగుట
    ముక్కంటికే తన్ను తాను అర్పితమంట

    ఆది జంగమ దాహమ్ము దీర్పంగ
    చెలమ నీరే ఆమె కడవ నింపంగ
    శంభు తలపై గంగ విస్తుబోవంగ
    భక్తి భావనకి యా ముక్కంటి లొంగంగ

    కొండ చేరెడు వేళ కాళ్ళు నొవ్వగరాగ
    కడవ నీరొక తాన తాను పండె వేరొక తాన
    పాపమా కాకమా కడవపై వ్రాలంగ
    కుండ దొణికెను నీరు మ్రొక్కవోవంగ

    కుపిత ఆనంది ఆ గొల్లలింటి చాన
    కొండ వ్రాలకు నీవు మరల రాకను యెడల
    నాటి కాలము దాటి నేటికబ్బురమెంత
    కోటప్ప కొండపై కాకి వాలదు వింత

    గొల్ల దెచ్చెను పాలు
    నెలలు నిండిన చూలు
    కొండ దిగవలె శూలి
    తా తిరిగి జూడదు మరలి

    అయ్య వేసిన అడుగు
    ఘన ఓంకార నాదమ్ము
    భీతహరిణయి గైత
    తల ద్రిప్ప బొమ్మయె వింత

    అచటె ఆగెను భవుడు
    రాతి బొమ్మయి నిలుడు
    భక్త సులభుండతడు
    పరమేష్ఠి యతడు

    అడగకిచ్చును వరము
    అడుగుటెవ్వని తరము
    ఇహము నుండీ పరము
    శివుడె మోక్ష మార్గమ్ము

    సత్యమనగా శివుడు
    శివమన్నదే వాడు
    సుందరమ్మగు హరుడు
    త్రికూటాద్రి విభుడు

    ప్రణవ నాదమె వాడు
    ఆది గురువని చూడు
    సృష్ఠి స్ఠితియును లయుడు
    త్రికూటాద్రి విభుడు


    మార్చి 2016 లో కాబోలు రాసుకున్నానిది.
    గుంటూరు జిల్లా, నరసరావు పేట దగ్గర కోటప్ప కొండ పైన వెలసిన శ్రీ త్రికూటేశ్వర స్వామివారికి మహా శివరాత్రి సందర్భంగా, భక్తితో.