Author: Chandrasekhar Kondubhotla

  • హృదయ పలకం

    ఇవి పలక, బలపాలు.
    అంటే, మనం ఒద్దూ, నా మనస్తత్వానికది పడదూని ఎంత మంచితనంగా చెప్పినా, కాదూ, నువ్వు వెళ్ళాలమ్మా, ప్లీజ్‌రా అని మనల్ని మొండితనంగా చీపురుకట్టతోటో, మూల కాడున్న కర్రతోటో, ఏడ్చి పోతూంటారే? బడి. అందుకోసం.

    ఆ బళ్ళో పడిపొయ్యాక, మన పేరూ, నాన్న పేరూ, ఎన్ని రాసినా అయిపోని తెలుగష్చరాలూ, క కొమ్ము దీర్గమిస్తే కూ చుక్ చుక్… గుడింతాలూ, ఏబీసీడీ ఇంగ్లీషు బర్లూ ఇవ్వన్నీ రుద్దుకోనీకి ఉండేదే, పలక.

    అసలు బడికి పొయ్యేకంటే ముందు మనకి ఆషాబ్యాసం చేస్తారు. మనవేమో నాన్నో, తాతో ఎవురో ఒళ్ళో కూచుని వనమోహినీ, షీ వాజ్‌ హియర్, షీ ఈజ్ ధమాల్ అని చక్కగా దిద్దబట్టేదన్నమాట. ముంగట్నే ఇవ్వన్నీ బాగా నేర్చేసుకుంటే రేపు బడికి పోయాక ఇంక ఇట్టాంటివి తెలుసుకునేది శానా తేలిక.

    ఈ పలకలు పెద్దబజార్లో సుబ్బారావు దుకాణంలో కొనుక్కోవాలి. నాన్నతో కంటే చిన్నన్నతో పోయింది మేలు. అడగకుండానే పెద్ద పలక కొనిపెడతాడు. అమ్మా నాన్నయితే, చిన్నవాడివి కదా, చిన్న పలక చాలు అంటారు. పొద్దునేమో పెద్దయినావు, రేపట్నుండీ బడికి పోవాలన్నదీ వాళ్ళే. ఇప్పుడేమో చిన్నవాళ్ళకి చిన్నపలక అనేదీ వాళ్ళే. అంతా మోసం.

    పలకలు పలు రకాలు. మనం మామూలు రకం కొనుక్కుంటాం. నాలుగు పక్కల చెక్కలు, మజ్జన పలక. మట్టితో చేస్తారంట. నునుపుగా ఉంటాయి. నువ్వు పలక పైమీదని తూ అని ఉమ్మూస్తే అది చక్కంగా కింది దాకా కారుకుంటూ రావాలిమాట. మనది మంచి పలక అవునో కాదో తెలిసిపోతుంది. ముందే చూసి పెట్టుకోవాలి. మనం చిన్న పిల్లలు, ఏం తెలీదని సుబ్బారావు పిచ్చి పలకలు మనకి అమ్మి, మంచివన్నీ అట్టే పెట్టుకుంటాడు. చింతాగాడు చెప్పాడు నాకు.

    కానీ, నేను కొనుక్కునేప్పుడు తూ అనబోతే, చిన్నన్న ఏం పన్రా వెధవా, అని నెత్తిమీద ఒక్కటిచ్చి పలక లాక్కుంటాడే! తెలీపోతే అడగాలి కానీ… నేనే ఇంకా చెప్పా. నువ్వు కూడా దబ దబా రెండు పలకలమీద ఉమ్మేమని. ఏడిశావులే. నోరుమూసుక్కూచో, అని నన్నే అనటం, పైగా.
    ఈ పెద్దవాళ్ళకసలకేం తెలీదురా. మనకే ఎక్కువ తెలుసని మనం చెప్పినా వినరు. ఎందుకంటే, కుళ్ళు! ఎట్లన్నా, చింతాగాడికి ఇట్లావన్నీ చాలా విషయాలు తెల్సు. తరవాత వాడే ఉమ్మేసి చూసి, పరవాలేదురా, మంచి పలకే అన్నాడు.

    వేరేవాళ్ళ పలకలు రేకువి. అవి అస్సలే బరువే ఉండవు. ఇంకానేం, వాటిలకి ఒక పక్క నలుపు, రొండో పక్క ఇటికి రంగు, ఆకు పచ్చ రంగు ఇట్లా. ఒక్కోవాళ్ళు ఫ్లాష్టీకు పలక కూడా తెచ్చుకుంటారు. దానికి చుట్టూ కూడా ప్లాష్టీకే. పైన బొమ్మలు కూడా ఉంటాయి. కొన్నిటికైతే కొద్దిగా చోటు వరకూ పలక ఉండదు. ఆ ఖాళీలో సువ్వలు పెట్టుంటాయి, వాటికి రంగుల్రంగుల పూసలు. ఒక సువ్వకి ఒక పూస, రెండోదానికి రెండు పూసలు, మూడోకి మూడు… పది దాకా. పలక ఊపితే పైకి కిందికీ ఎగుర్తా, పిచ పిచమని చప్పుడు కూడా. బలేగుంటాయిలే. సుశీలా టీచరుగారబ్బాయి సామియలు ప్రెసాదుకుండేది.
    మనింట్లో అవన్నీ కొని పెట్రుగా అయినా.

    సరే పలక కొనుక్కున్నాక బలపాల పొట్లం కూడ కావాలగా. మర్లేకుంటే రాసేదానికి ఎట్లా? పొడూగ్గా మన మోచెయ్యలో సంగమంతుంటాయి. వీటిల్ని కూడా మట్టితోనే చేసేది. పలకలేమో తారునీళ్ళల్లో ముంచుతారు. అందుకే నల్లగా ఉంటాయి. బలపాలు ముంచరు. అందుకే అవి మట్టిరంగు!

    ఇక్కడ బొమ్మలో ఉన్నాది పాల బలపం! ముగ్గు బలపం, తెల్ల బలపం… అన్నీ ఇదే. వీటిట్లోనే పిండి బలపం, సుద్ద బలపం అని ఇంకొద్దిగ ఫైనర్ క్వోల్టీ. పట్టుకునేదానికి, రాసేదానికి మెత్తటివి. తినేదానిగ్గుడక ఇవే బాగుంటయి. కాస్త ఉన్నోళ్ళ షోకు పిల్లులు, ఇట్టాంటివి తెచ్చుకునేవాళ్ళు.

    రంగు బలపాలు మళ్ళా ఇంకో వేరే రకం. ఒక్కోమారు ఒకే బలపంలో రెండు రంగులు; ఎరుపు, తెలుపు. అట్లే నాలుగు కూడా. రంగు పలకలూ, రంగు బలపాలూ ఇట్టాంటివి శానా రిచ్చిఇండ్ల పిల్లల దగ్గరనే అవుపడేది. రిచ్చంటే, పిర్రకతుక్కునే స్టెచ్చి నిక్కరూ, పచ్చచారల మెరుపు చొక్కా తొడుక్కోని కాలరు దగ్గరి పైగుండీ కూడా పెట్టుకునేవాళ్ళు ఉంటారే. వాసన నూనె, బెల్టు బూట్లు…

    ఒక్కో ఊర్లో వేరే పిల్లగాళ్ళు మన బలపాల్నే కణికెలంటారు.ఇంకోవాళ్ళు పలకపుల్లలంటారు. నాకు అప్పుట్లో బలే కోపం. మన బలపాన్ని ఎవుడిష్టం వొచ్చినట్లు పిలిచేందుకు వాళ్ళెవరూ? మన్ని అడిగే పనిగూడ లేకుండా?!

    నేనూ, గురవారెడ్డీ, చింతాగాడూ, గోలీ, జమాలూ, ఇంకా మావన్నీ మామూలు పలకలు, బలపాలే. బళ్ళో డిక్కేషన్ చెప్పినప్పుడూ, ఛ ఛా ఛి ఛీ అనుకుంటూ గుడింతం రాయటం, ఏడో ఎక్కం, అన్నీ పలక మీదే. ఒక్కోసారి వొంద ఒంట్లు ఇంటికాడ రాసుకరామనేవాళ్ళు. అన్నీ రాసి పొద్దున బడికి పోయి టీచరుగారి బల్లమీద పెట్టేప్పుడు చూస్తే సగం చెరిగి పోయో, అలికిపోయో ఉండేవి. పలకమీద తెలుగు వాచకం, ఎక్కాలబుక్కులన్నీ పెట్టి భుజం మీద పెట్టుకు పోయినప్పుడు రాసినవన్నీ తుడుపుకు పోయినాయన్నమాట.

    మళ్ళీ టీచరుగారు కొట్టకుండానే ఏడ్చుకుంటూ అవన్నీ తిరిగి రాయటం! అన్నీ చూసాక టిక్కులు పెట్టినవి మానేసి, ఇంటూలు పెట్టినవి మళ్ళీ ఒకోటీ పదిమాట్లు రాసి చూపీటం. వేళ్ళు నెప్పి పుట్టిందాకా ఇదే పని. బళ్ళో వేరే కూడా రాసేదుండేది. అందరూ పలకలు బాగా తుడిచేండ్రా అనేవాళ్ళు. ఉట్టుట్టినే తుడుపుతే పోదుగా? చేతిమీదా, కాలిమీదా చెమట పడితే, పలకకి రుద్ది తుడపొచ్చు. కొంతమందేమో తెలీక పలకమీద ఉమ్మేసి తుడిచేవాళ్ళు.

    రవణగాడు కూడా అలా చేస్తే నేనే చెప్పా. పలక సరస్పతీదేవిరా, కళ్ళు పోతాయి. దేవుడి మీద ఉమ్మేసి తుడుస్తే చదువురాదు నీకని. వాడు ఏడ్చాడు. చదూకోపోతే మా అమ్మ తంతానందిరా… పలక తుడవటానికే చేసా, ఇప్పుడెలా అని? కళ్ళకద్దుకోని, దణ్ణం పెట్టుకోని, చెంపలేసుకో వెదవాయా, ఇంకెప్పుడూ చైనని తల్లితోడని ఒట్టెయ్యి. పలకమీద ఉమ్మకూడదు. మన చొక్కా మీద ఇలా ఉమ్మేసి, దాంతో తుడుచుకోవాలి. నేను చూడు ఎలా చేస్తానో, పాపం తలగకుండా అని నేర్పిచ్చా. వాడికివాళ ఏ కాస్తో కూస్తో చదువబ్బినా, నా పేరు చెప్పుకు దీపం పెట్టుకుంటుంటాడు, సన్నాసి.

    ఒకసారేమైందో తెలుసూ? ఒంటి బెల్లప్పుడు అందరూ బైటికి ఉరుకుతున్నాం. గురవారెడ్డిగాడు వాడి పలక కాస్తా తొక్కాడు. ఏం కాలా. ఒక మూల మీద ఆకాశంలో జీడిపప్పు చందురుడల్లే కొంచం పగిలింది. టీచారు కూడా కొట్లే. గుడ్డి వెధవా, చూసుకో నడవలేవూ అనన్నారంతే. అమ్మ అరుస్తుందిరా అని బయపడ్డాడు కానీ వాడికే బాగైంది. రేపు బడికొచ్చేప్పుడులా, ఒక చేత్తో కంతలో వేళ్ళుపెట్టి పలక, రొండో చేత్తో పుస్తకాలు పట్టుకొచ్చాడు. అసలు భుజం మీద నెప్పే పుట్టలే. ఇంటో రాసుకొచ్చింది చెరిగి పోలే కూడా!! భలేగయింది కదా?

    వీడిని చూసి చింతాగాడు మనం కూడా చేద్దాంరా అన్నాడు. ఇంటో చూస్తే తంతారని నే వొద్దన్నా. ఒకరోజు వాడే రాయి తీసుకుని పలక మీద ఠాప్పున కొట్టాడు. పలక సగానికి పగిలింది. వాడి వీపు కూడా. బళ్ళో టీచరు గారి చేతిలో సగం, ఇంటో వాళ్ళమ్మ చేతిలో మిగిలిన్సగం! కానీ చూడు, వాడి పనే హాయి. ఊరికి పోతే పెట్టె పట్టుకున్నట్టు, ఆ పగిల్న పలకే ఊపుకుంటూ బడికొచ్చాడు. ముప్పయ్యో, డెబ్బయ్యో పట్టినన్ని ఒంట్లే రాసుకొచ్చాడు. బుక్కు చూసి పాటం రాయమంటే, మేం వొగుర్చుకుంటూ మొత్తం రాయటం. వాడికి సగం పలకేగా. సగం పాటమే రాయటం! జీతాలొచ్చాక కొత్తది కొనిస్తా, అందాకా దీంటోనే రాస్కోమన్నాడండీ మా నాన్న, అని చెప్పాడు టీచరుగారికి. అప్పుడు వాడిని మళ్ళీ కొట్టలా.

    నేను మాత్రం గుడింతాలూ, ఏడో ఎక్కం ఐదుసార్లూ అన్నీ పూర్తిగా రాసా, కానీ ఎక్కాలసైడు చెరిగిపోయింది. ఆవాళ బడి దగ్గర తాయెత్తులమ్మేవాడు పాములాడిస్తుంటే చూసి, పరిగెత్తి పోయినా బడికి ఆలీసెం అయింది. టీచరుగారేమో పలక తీసుకురామని, ఎక్కాలేవిరా అన్నారు.

    ఒట్టండీ, తుడుపుకుపోయినాయండీ అని నిజం చెప్పా. ఏరా, వీళ్ళందర్తో తిరిగి తోక పెరిగి పోతోందా నీకూ? ఇంటికొచ్చి అమ్మకి చెప్పమన్నావా? తోక కత్తిరించేస్తాను, రాస్కెల్, అని స్కేలుతో రెండు పీకారు.

    మిగిలిన మట్టి పలక
    పగిలిన హృదయ పలక
    నేను
    ఆరోజు

    #పలుకు, #వెన్నెల, #తెలుగు, #అమ్మనుడి, #బాల్యం #హాస్యం

    @Chandu1302

    2
  • ఎంత కష్టం.. ఎంత కష్టం

    ఎంత కష్టం.. ఎంత కష్టం

    జంట ఎద్దుల అరకగట్టీ
    ఎద్దువోలే ఒల్లరగదీసీ
    నెత్తురోడ్సీ సెమట గార్సీ
    రేయిపొగులూ నేలతల్లికి
    దీటుగానూ *పొగులుకుంటా (1)
    ఎండవానల దుక్కిదున్నీ
    కొద్దిగైనా గింజ పండితే
    పట్టెడంతా కూటి కొరకై
    పుట్ల పంట దళారికమ్మితే
    చేతికందిన ఒక్క డబ్బూ
    జేబు దంకా చేర్చబోతే
    జాలి చూపక అప్పులయ్య
    ఒడిసిపుచ్చుకు ఎల్లిపోతే
    ఇంటిల బుడ్డోడి ఆకలి
    ఆసగా నిన్నెదుకుతుంటే
    ఎండుపానం నీదు పెండ్లము
    కన్నీరె సన్నుగ గుడుపుతుంటే
    కండ్ల ఎదటన చేను తల్లి
    సుక్క నీటికి అలమటిస్తే
    కుప్ప నూర్సిన కొత్త ధాన్యం
    వరద తాకి బురదలైతే
    జోరు వానకి *కొట్టమెల్లా (2)
    కుప్పకూలీ *తొక్కటైతే (3)
    తాలలేకా గొడ్డు గోదా
    ఊపిరొదిలే *కాయిలైతే (4)
    తాత తండ్రుల ఒక్క సెక్కా
    కబ్జదారుడు నూకుతుంటే
    సాయమడిగితె నేతలంతా
    ఓట్లునొక్కీ మాయమైతే
    నాయమిచ్చే కోరట్ల జడ్డిలు
    కుంబకర్నుని నిదరలైతే
    అడగబోతే లాటీల కొడుకులు
    సదునుగా ఒల్లిరగదీస్తే
    *బొంకులమ్మే వార్తవదినెలు (5)
    వెతల కతలను అమ్ముతుంటే
    పడ్డ కస్టము పాడెగట్టుక
    పొలములోనే హరీమంటే
    ఆస కరవై బతుకు బరువై
    *ఒలికిమిట్టే నెలకువైతే (6)
    ఏడ జూసిన యాడె జీవుడు
    నెర్రెలిచ్చిన నేల అయితే
    గడసిపోయిన నిన్న *కల్లై (7)
    ఎదురూ చూసే రేపు కలయై
    ఉన్న నిజమీ ఒక్క దినమూ
    వొల్లకాడుల సిందులైతే
    కడుపు నించని గొడ్డుశాకిరి
    *కొడిగట్టు దీపపు *యాతనైతే (8, 9)
    దినము రేతిరి ఒక్క తీరుగ
    *మనికి మంటల కొలిమిలైతే (10)
    నిన్ను తలుసుకు నీలో *నివ్వే (11)
    *యాసిరై సీ గొట్టుకుంటే (12)
    *ఉడ్డుకుడుసుకుపోయి జీవము (13)
    *సాయనీకే *ఎదుకాడుతుంటే (14, 15)
    ఎంత కష్టం ఎంత కష్టం ||

    చెమటలోడ్చుకు రక్తమార్చుకు
    నాకు నీకూ కంచాలు నింపీ
    పట్టెడన్నం కంట చూడని
    సేద్యగాడికి ఏది లాభం
    రైతు డొక్కకి ఏది అన్నం
    కడుపు నింపే ధరణి పుత్రా
    ఎవరు నీకిక దన్ను ధైర్యం
    ఎంత కష్టం ఎంత కష్టం ||

    **** **** **** **** ****

    కొన్ని పదాలు తికమక పెడుతున్నవని మిత్రుల ద్వారా విని ౼
    1. పొగులు = తీవ్రమైన బాధ
    2. కొట్టము = గుడిసె
    3. తొక్కట = తొక్కిసలాట, తొక్కిడి
    4. కాయిలా = రోగము, జబ్బు
    5. బొంకు = అబద్ధము
    6. ఒలికిమిట్ట = శ్మశానము
    7. కల్ల = అబద్ధము
    8. కొడిగట్టు = ఆరిపోవు
    9. యాతన = కష్టము
    10. యాతన = కష్టము
    11. నివ్వు = నీవు
    12. యాసిర, యాసరిక = విసుగు, చీకాకు
    13. ఉడ్డుకుడుచు = ఊపిరాడక
    14. సాయనీకె = చావుట కొరకు
    15. ఎదుకాడు = వెతుకులాడు
    **** **** **** **** **** ****
    #పలుకు, #వెన్నెల, #తెలుగు, #అమ్మనుడి, #బతుకుభారం #పేదరికం

    @Chandu1302

  • ‘మిడిల్’క్లాస్

    ‘మిడిల్’క్లాస్

    మొన్నో, ఇంకేదో ఈమధ్యనో ట్విట్టర్‌లో ఒక మెసేజ్ చూసా. నువ్వు చిన్నప్పుడు టూత్‌పేస్టు ట్యూబు చివరికంటా నొక్కి వాడావా, సబ్బంతా అరగదీసాక మిగిల్న ముక్క కొత్త సబ్బుకతికించావా, బొగ్గుల బాయిలర్లో వేణ్ణీళ్ళు కాచుకున్నావా, సరుకుల కొట్లో బెల్లం ముక్కడిగావా, కిరసనాయిలు కోసం క్యూలో నించున్నావా… ఇలా. ఇవన్నీ చేసుంటే నువ్వు డెబ్భైలు ఎనభైల్నాటి మిడిల్ క్లాసు తెలుగోడని అర్థం! నవ్వొచ్చింది. ఆశ్చర్యం కూడా!
    ఏడిసినట్టుంది. ఇవన్నీ చెయ్యనోడూ, సినిమాల్చూడనోడూ తెలుగు నేల మీద పుట్టటమెందుకూ?

    అసలు వీటన్నిటికన్నా మిడిలెస్టు క్లాసు కథ అప్పట్లో ఇంకోటుంది, చెప్పనా..? పండగనో, బళ్ళు తెరుస్తుండంగాన్నో కొత్త లాగూ చొక్కాలు కుట్టీటం. దీ వరస్టంటే అదే!

    ఎదిగే వయసు, ఊరూర్కెనే బట్టలు చిన్నవైపోతాయని, బాఘా దిట్టంగా ఐదులో తొడుక్కున్న లాగూయే ఎనిమిదిలో కూడా సరిపోయేట్టు; మోకాళ్ళకి నాలుగించీలు కిందికీ, నడుం ఎనిమిదంగుళాలు ఎక్కువుండేట్టు ఇంత పెద్దగా లుడంగం మోస్తరు కుట్టీటం.

    ఈ విషయంలో అమ్మలన్నీ ఉత్తర కొరియా నియంతలకన్నా కనాకష్టం! ఇదిగో, తీరా షాపుదాకా వెళ్ళాక ఈ బడుద్ధాయి గునిసాడనో, ఫాషనుగా లేదన్నాడనో రెడీమేడు లాగూల్లాగా తొడల్దాకా టైటుగా కుట్టిచ్చేరు గనక. అయినా అంతంత పోసి కొని, సంక్రాంతిక్కుట్టిచ్చినవి శివరాత్రికే పొట్టివైపోతే ఏవిట్సుఖం? బట్ట దండగా కుట్టుకూల్దండగా తప్పిచ్చీ, అని పెద్దంతరం చిన్నంతరం యంతమాత్రవూ పాటిచ్చకుండా, యావండీగారంటే శ్రీ. ప్రత్యక్ష D అన్న సంగతి కూడా పట్టిచ్చుకోకుండా తమ యజమానిగారిమీన్నే ధాష్టీకం! ఇక మనకీ మనోబీగార్లనేకవుంటాయనీ, సాటి మనిషిగా మన చొక్కాలాగూలు ఎలా వుండాలన్నది మన పెరసన్లనీ విషయం అసలు ఎరగనట్టే ఉంటాయవి. (అవంటే మొత్తంగా అమ్మలన్నీ అంతే!) చిన్నవయసులోనే జై ఆంధ్ర ఇంకిలాబ్ జిందాబాద్ అని గట్టిగా మనసులోనే అరిచావంటే, అందులో నీ తప్పేం లేదన్నమాటే.

    సరే, ఎంతేనా మననాన్న కదా మన పక్షం వుంటారన్నమ్మేవో, ఖాళీయే. ఆయనేవోఁ, కుట్టీమన్నదొకరూ, కుట్టేవాడింకొకడూ, తొడుక్కుతిరిగే చెవలాయ వీడొకడూ, మజ్ఝిన మనకేలన రొష్టనే మెట్టవేదాంతం మాటునో, లేక మొన్న హాఫెర్లీకి లెక్కల్లో పంతొమ్మిది మార్కులే వొచ్చాయిగనుక వీడికీ శాస్తి జరిగి తీరాల్సిందనే అన్‌డాడీ లైక్ నిర్దాక్షిణ్యం వల్లనో, మన్ని దీ న్యూ ఫాషన్ టైలర్స్ అనబడే వీరయ్య కొట్లోకి తీసుకెళ్ళి ఇదిగో చొక్కా లాగూ గుడ్డలని వాడికిచ్చేసి, మన్ని వాడి ముందుకు తోసేసి, ఏదో రేపే దాఖల్చెయ్యాల్సిన యమర్జెంటు కోర్టు కాయితాల్చదూతున్నంత పోజుగా నిన్నటి ఆంధ్రప్రభో, మొన్నటి ఈనాడు సంపాదకీయం వెనకో దాక్కోటం!

    ఈవీరయ్యగాడున్నాడే.. పరమ నాస్టీఫెలో. అసలు వీడో టైల్రే కాదు నన్నడిగితే. చెవులో ఒకేపు నీలం ఇంకో వైపు ఎరుపూ ఉంటాయే, అట్టాంటి రెండు రంగుల పెన్సిలు, మెళ్ళో కండవా రీతిన టేపూ తగిలిచ్చుకోని, వెధవ పోజు మళ్ళీ! మనం, చొక్కా నడుంకి ఒక్క అంగుళం కిందికీ, లాగూ మోకాలుకి రెండంగుళాలు పైకీ ఉంచాల్రా అని ముందే సీక్రెట్టుగా ఇన్ట్రష్షన్ ఇస్తామా, ముందంతా పరమ నైసుగా, నాకు తెల్సు కదా బాబూ అంతా కొత్త ఫాషనుగా కుట్టి పెడతాగా, లాగూ ఎనికిట జోబు కూడా ఉంటాది నీకెందుకు చూడంటాడా, నాన్నొచ్చి మరీ అంత పైకేంటయ్యా ఎదిగే పిల్లాడు కదా అనంగాల్నే టేపు ఏడంగుళాలు సర్రున కిందికి జారుస్తాడు… మాట నిలకడలేని కుంక!! ఇంక లాగూ కొలతలు. రామ రామ! అది వాడి నడుమూ మన్నడుమూ కలిపి కొలిచేసి, ఈ మాత్రం చాల్లెండి అయగారూ, కాళ్ళకాడ మాత్రం ఒక రెండంగుళాలు ఇదిగో ఈ మాత్రముంచీ, ఇంకొంచం లోపటికి మడిచి కుట్టేస్తా. నడుమూ, కాళ్ళూ ఇంకా ఎక్కువ కొలతైతే బాగా లూజయిద్దని మనేపు చూసి కన్నుమలపటం, అక్కడికేదో మనల్ని ఉద్ధరిచ్చినట్టు. డబ్బు కోసం గడ్డితింటవంటే ఇది కదూ… దొంగ భడవ.

    రెండోసారి కూడా మనం వెళ్ళి అడిగిన ఆర్రోజులకి ఆ లాగూలు మన్చేతికి రావటం. ఎలా ఉన్నా, ఇవి కొత్తవీ అచ్చంగా మనవీనన్న ఆదర వాత్సల్య సంతోషాది భావాలతో చిరునవ్వు మన మొహాన విరబూస్తుండగా, ఇంటికెళ్ళి ఆ కొత్త వలువలు తొడుక్కునే ప్రయత్నం!
    అద్గద్దీ విషయం… సరిగ్గా అక్కడొస్తుంది, శాక్యమునికొచ్చినంత జ్ఞానం, మనకి కూడా!

    జేబులో చేతులు పెట్టుకున్నా సరే, నీపాదాల చెంత నాకు చోటివ్వు దేవదా అని కాళ్ళంటుకున్న పారోకిమల్లే, ఆ లాగూ లంపటం మనం నించున్నకాడి దక్షిణం వెంపు జారిపోటమే కాని పైకిరాన్దే!! మరిహను దాన్తోటి జనబాహుళ్యంలోకి మనవంటి సిగ్గరి, పరూగల్లా మోమాటస్తుడుగారెలా రాడవంటే, దానికి మరో నీచతుచ్ఛత్యంతమర్రేత్తక్కూపాయవోటి మనం గుడ్లనీళ్ళు కక్కుకుంటూ డెబ్భైమార్లు ఛీయన్చిందుల్తొక్కినా సరే, ఏడిశావులే కుంకాయా, చొక్కాకిందనుండేదానికెలా ఏడుస్తే ఏం, దానికింతేడుపేవిటనంటూ, అటో రెండూ ఇటో రెండూ పిన్నీసులు పెట్టడం!

    దీనికన్నా అధ్వాన్నం మనకంటే ఓ రెండేళ్ళో మూడేళ్ళో ముందు పుట్టినందుకు అదో పేద్ధ అక్కగారైనట్లు మనమీద అక్ఖలేని అధికారజులుం ప్రదర్శించే అక్కరాక్షసిలుంటాయే, వాటి వెలిసిపోయిన పచ్చరిబ్బనో, మాసిపోయిన తెల్ల పీటీ యూనీఫాము రిబ్బనో మన లేని నడుం నెప్పెట్టీదాకా బిగిచ్చీ, ఇహపో వెధవాయా అని మనల్నే కసురుకోని బడికి పంపీటం!

    వీటన్నిటికంటే అతి దారుణ పరమభయంకర ఒవరికీ చెప్పుకోలేని మజ్ఝాతిమజ్జతరగతి ఓటుంటుంది. అంటే, నీ లాగూ జారిపోతుంటుంది కదా. దాని కోసం, నీ మొల్తాడిప్పి దానికి ఒక నులకతాడు ముడేసి లాగూ బిగిచ్చటం. లాపోతే మీ అన్నయ్య పైజామానో అక్కయ్య పరికీణీయో చిరిగిపోయేకా ఆ బొందు (చదూరానోళ్ళు నాడా అంటార్లే..) దాచి పెడుతుందిగా మీ అమ్మ! బట్టల బీరువాలో ఏ మూల్నించో దాన్ని తెచ్చి గుండ్రాయితో నాలుగు మోది ఓ మూరెడు ముక్క తెగ్గొట్టి అదేసి నడుంకి కట్టటం!

    నువ్వొళ్ళు పొగర్తోనో, శ్ట్రాటజీ ప్లానింగుల్లో వీకు అయినందువల్ల అగ్నానంకొద్దీ ముందస్తుగా ఒకటో కాసినో అక్కల్నీ అన్నల్నీ సంపాయిచ్చుకున్నాక వెళ్ళితే ఒక్కగానొక్క ఆఖరి కొడుకన్న మర్యాదా గౌరవం గారాబం దక్కుతాయన్న రాంగ్కాల్క్లేషన్తో తాపీగా మరికాస్త సోమరసం, మరొక్క రంభ డాన్సు అనుకుంటూ లేటు చేసావో, తరవాత అతి తీవ్ర దుఃఖద పరిణామాలుంటయి. తస్మాజ్జాగర్త.

    నీ జారిపోయే లాగూక్కట్టిన రిబ్బనూ, నులకతాడూ చూసి నీ మీదాళ్ళెవ్వరూ నీమీద్జాలి పడరు. మొహం గంభీరంగా పెట్టటం అంతా వుట్టుట్టి నటన. అటుతిరిగి ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ, ఏదో పుట్టిములిగిపోతున్నట్లు పెరట్లోకి ఉరికి కసిగా నవ్వుతుంటారు. పాపం వెర్రి వెధవ, మరీ ఏంటమ్మా, లాంటి ఒకటో అరో వాక్యం వినిపించినా దాంట్లో హానెష్టీ శాతం ఎంతన్నది, ఆవెంట వినపడే వికటాట్టహాసాల తీవ్రతను కూడా పరిగణనలోకి తీసుకుని నిర్ణయించుకో.

    మజ్ఝతరగతి మిడిలు క్లాసిళ్ళల్లో ఏకైక చివరాఖరి మగపిల్లడై పుట్డవంత దుర్భర భయానక సీను అగ్గిరాముడు సినిమాలో కూడా ఉండదు! మగాడై పుట్టేకంటే అడవిలో మానై పుట్టటం మేలన్న సామెత విన్లా? యజ్జాగ్ట్లీ ఇందుకే!

    #వెన్నెల, #తెలుగు, #అమ్మనుడి #బాల్యం #హాస్యం

    @vennela

  • “పుల్లంపేట జరీచీర” – శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి

    ఆంధ్రభూమి 1940 నాటి సంచికలో వచ్చిన శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారి చిన్నకథ “పుల్లంపేట జరీ చీర.”

    సాధారణ కుటుంబాలలోని, అత్యంత సాధారణమైన సన్నివేశం, పండగలకో, మరొక శుభసందర్భానికో కొత్త బట్టలు కోరుకోవటం. ఆ ఆశ కొన్నిమార్లు తీరటం, ఎన్నోమార్లు మరొక పండగనాటికో, మరుసటేడాదికో వాయిదా పడటం. ఇది మామూలే అనేకంటే, ఇదే మామూలు అనుకోవచ్చేమో.

    ఇప్పటికి ఒక యాభై సంవత్సరాల క్రితం, లేదా అంతకు పూర్వంనాటి జీవితం పరిచయమున్న మధ్యతరగతి జీతాల జీవితాలన్నిటికీ, బహుశా ఇది పరిచయమైన అనుభవమే అయుంటుంది. ఆనాటి ఇల్లాళ్ళు భర్త ప్రేమను నిర్వచించమంటే, బహుశా, ఒక నూలు చీర, రెండు మూరల మల్లెలు/సన్నజాజులు, గూడు రిక్షాలో మొగుడితో రెండో ఆట సినిమా కెళ్ళిరావటం, వరకే చెప్పుకునేవారేమో!
    ఆనాడవే ఎంతో పెద్ద ఆశలు. ఎందరు జంటలకో ఎన్నడో కాని పెదవి జారని ఊసులు.

    సంసార బాటలో కుటుంబ బాధ్యతల బండి ఒరిగిపోకుండా, కాడికెత్తుకుని లాగే ఎలపట దాపట జోడెద్దులకు ఆగి అలసట తీర్చుకునే వెసులుబాటే లేని ప్రయాణం. ఇక తీరికగా కూర్చుని తిన్నది నెమరేసుకునే కోరికా, కొమ్ములకీ, తోకకీ తోరాలు కట్టుకుని, మొహాన పసుపు రాసుకునేంత ఓపికా కూడానా?!

    ఆ యాతనలో సగపాలు తనదీనంటూ తనతో వాటా పంచుకున్న జీవిత భాగస్వామిపైని ఆపేక్షంతా మనసులోనే పోగువేసుకుంటూ, అవకాశమూ, అదృష్టమూ కలిసొచ్చిన ఒక మంచి ముహూర్తాన ఆ దాచుకున్ళ అనురాగాన్ని దించుకుని, దొరికిన ఆ ఒక్కనాడో, కొద్దిసమయాన్నో ఆనందమయం చేసుకుని, దాంపత్య జీవితానికి అదే కైవల్యమనుకునే ఘడియలు…

    శ్రీ పాదవారి, రాధమ్మగారి యాజులుగారు సార్థకం చేసుకున్న వైనం ఇది.

    కథా రచనంటే ఇదే, ఈ పరిమితులకు కట్టుబడి వుండినది, ఈ స్థాయికి ఎదగగలిగినది మాత్రమే రచనా ప్రక్రియ అనిపించుకోగలదన్నంత ఘనంగా తెలుగు కథను నిర్దేశించిన, శాసించిన, మార్గదర్శనం చేసిన మహారచయితలలో శాస్త్రిగారిది అగ్రపీఠం. సిరాలో మునిగి వారి కలం విదిల్చిన ప్రతి అక్షరమూ నిస్సందేహంగా తరువాతి తరం కథకులు, పఠనాసక్తి గల చదువరులు పదే పదే మననం చేసుకోవలసిన పాఠమే.

    నిన్నటి రోజున ప్రపంచ పుస్తక దినోత్సవం జరుపుకున్నాం. ఆ సందర్భంగా మీకోసం శ్రీపాదవారి ఈ కథ. చదివి మీ అభిప్రాయం పంచుకోండి. 

    “పుల్లంపేట జరీచీర”
    రచయిత: శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి

    యాజులు నెల్లూరి జిల్లా కోర్టులో గుమస్తాగా వుండినప్పటి సంగతి

    ఇక నెలా పదిహేనురోజులుందనగా, సంకురాత్రి పండుక్కి రాధమ్మని పుట్టింటివారు తీసుకెళ్లరని తేలిపోయింది.అప్పటికామె పద్ధెనిమిదేళ్ల పిల్ల. పండుగులనీ, పబ్బాలనీ, అచ్చట్లనీ, ముచ్చట్లనీ కిందా మీదా పడిపోతూ ఉండే వయస్సు.దగ్గిరగా ఉన్నంత కాలమూ పుట్టింటివారామెకి లాంఛనాలన్నీ బాగానే తీర్చేవారు. కానీ నెల్లూరికి, పిఠాపురానికీ రానూ పోనూ కూతురికీ, అల్లుడికీ కావలసిన రైలు ఖర్చుల మొత్తం తెలిసేటప్పటికి వారికి గుండెలాగిపోయాయి.

    ఇది ఆలోచించి చివరికి రాధమ్మ కూడా సరిపెట్టుకుంది.మొదట మాత్రం తండ్రి రాసిన ఉత్తరం చూసుకొని ఆమె నిర్ఘాంతపడిపోయింది.ఇది యాజులు గుర్తించాడు. అతని హృదయం దడదడ కొట్టుకుంది. కాని ఒక్క క్షణంలో తేరుకుని, ఆమె కళ్లల్లోకి జాలిగా చూసి, తన వెచ్చని పెదవులతో తాకి ఆమె పెదవులకు చలనం కలిగించుకున్నాడు.తరువాత ‘మడి కట్టుకోండి’ అంటూ ఆమె వంటింట్లోకి వెళ్లిపోయింది.అతను తాపితా కట్టుకున్నాడు.

    కుచ్చెళ్లు పోసుకునేటప్పుడు ‘‘రెండేళ్ల కిందట విజయదశమినాడు నీ అత్తవారిచ్చారు నీకిది. ఇంత గొప్పవి కాకపోయినా, ప్రతీ సంవత్సరమూ నువ్వు నీ అత్తవారి బహుమతులు కట్టుకుంటూనే ఉన్నావు. కానీ పుట్టింటి వారిస్తూనే ఉన్నారు గదా, లోటు లేదు గదా అనుకుంటున్నావే కాని రాధకి నువ్వొక్క చీర అయినా కొనిపెట్టావా పాపం? చిలక వంటి పెళ్లానికి మొగుడు చూపించవలసిన మురిపెం ఇదేనా? చివరకి వొక్క రైక అయినా కుట్టించావా? నీకిది బాగుందనిపించిందా?’’ అని ఎవరో నిలవతీసి అడిగినట్టనిపించింది.

    దీంతో వల్లమాలిన సిగ్గు వచ్చి ఊదర గొట్టేసింది.దాని మీది ‘ఇప్పుడైనా రాధకొక మంచి చీర కొనిఇవ్వాల’నుకున్నాడు. ‘ఇచ్చి తీరాలి. పండుక్కి కొత్త చీర లేని లోటు కలగనివ్వకూడదు’ అని దృఢపరుచుకున్నాడు.కానీ, డబ్బేది?ఏనెల జీతం ఆనెలకే చాలీచాలనట్టుంది. అక్కడికీ నెల్లూరిలో ఇంటి అద్దెలు చౌక కనుక సరిపోయింది. కాని లేకపోతే ఎన్ని చేబదుళ్లు చేస్తూ ఎన్ని వొడిదుడుకులు పడవలసి వచ్చేదో?రాధమ్మ కూడా పొదుపయిన మనిషి కనక ఆటసాగుతోంది. కానీ కాకపోతే, ఆ చేబదుళ్లకు సాయం ఎన్ని అరువులు పెరిగిపోయి ఉందునో?ఏమైనా చీర కొనితీరాలని శపథం పట్టుకున్నాడు.ఖర్చులు తగ్గించుకోడం తప్ప మార్గాంతరం కనపడలేదు. ఆ ఖర్చులలో నేనా సంసారం కోసం రాధమ్మ చేసేవాటిలో తగ్గించడానికి వీలు కనపడదు.దీని మీద ‘నా ఖర్చులు తగ్గించుకుంటా’నని అతను నిశ్చయించుకున్నాడు.అది మొదలు, అతను నాటకాలకి వెళ్లడం కట్టిపెట్టేశాడు. పుస్తకాలు కొనడం మానేసి భాండాగారానికి వెళ్లసాగాడు. ఒకటి రెండు వినోదయాత్రలు చాలించుకున్నాడు. కోర్టుకి వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడూ బండెక్కడం తగ్గించుకున్నాడు. మధ్యాహ్నం కోర్టు దగ్గర ఫలహారం ఒక్కటే కాదు, కాఫీ కూడా మానుకొన్నాడు.

    పొద్దుటి పూట మాత్రం యింటి దగ్గర కాఫీసేవ మానుకోలేదు. అంచేత రాధమ్మ కిదేమీ తెలవకుండా జరిగిపోయింది.

    ఆవేళ పెద్దపండుగ.

    మధ్యాహ్నం. రెండు గంటల సమయంలో యాజులు, రాధమ్మ యేం చేస్తోందో చూద్దామని వసారాలోకి వెళ్లి జంట వెదురుకుర్చీలో కూర్చున్నాడు.

    ఉన్న చీరల్లో మంచివి నాలుగు పట్టుకువచ్చి ‘వీటిలో యేది కట్టుకోను చెప్పండీ’ అంటూ రాధమ్మ పక్కని కూచుంది.

    ‘నన్నడగడం యెందుకూ?’

    ‘మంచిచీర కట్టుకోవడం మీకొసమా, నా కోసమా?’

    ‘నా కోసమే అయితే, ఆ చీరలన్నీ మీవాళ్ళిచ్చినవి, వాటిమీద నాకేమీ అధికారం లేదు’

    ‘అదేమిటండీ?’

    ‘ఎకసెక్కం చెయ్యడం లేదు నేను’.

    ‘చె-ప్పండీ పెడర్ధాలు తియ్యకా.’

    ఇలా గునుస్తూ ఆమె కుడిచెయ్యి అతని నడుముకి చుట్టేసింది.

    దానిమీది, ఆనందమూ, వుద్వేగమూ అతికష్టం మీద అణుచుకుంటూ అతను ‘నేను మానెయ్యమన్నది మానేసి కట్టుకోమన్నది కట్టుకుంటావా?’ అని గంభీరంగా ప్రశ్నించాడు.

    ‘ఆ’

    ‘అయితే అవన్నీ పెట్టిలో పెట్టేసి రా’

    ఆమె కేమీ అర్ధం కాలేదు. అయినా, యేదో లేకుండా అతనలా చెప్పడని యెరుగును కనుక, అతనికి అడ్డుమాట చెప్పలేదు కూడా కనిక, వొక్కమాటు గంభీరంగా చూసి అవి యింట్లో పెట్టేసి వచ్చి, మళ్ళీ పక్కని కూచుని ‘మరి చెప్పండి’ అని అడిగింది.

    వెంటనే అతనొక్కమాటు మందహాసం మొలిపించి, అతి తాపీగా లేచి, అతిదర్జాగా వాకిట్లోకి వెళ్ళి, మేజా సొరగులోనుంచి వొక పొట్టం తీసుకువచ్చిఅతిప్రేమతో ఆమెకందించి దగ్గిరగా కూచున్నాడు.

    ఆమె చేతులు గబగబలాడిపోయాయి.

    విప్పిచూడగా, అల్లనేరేడుపండు ఛాయతో నిగనిగ మెరిసిపోతూ పుల్లంపేట జరీచీర.

    ‘ఇదెలా వచ్చిందండీ?’ అని అడుగుతూ ఆమె మడత విప్పింది. వెంటనే మైజారు కొంగున వున్న జరీ నిగనిగ, ఆమె కళ్లలోనూ, చెక్కిళ్ళమీదా, పెదవులమీదా తళుక్కుమంది.

    దాంతో అతని మొగం మరీ గంభీరముద్ర వహించింది.

    ‘చెప్పండీ’.

    ‘వెళ్ళి కట్టుకురా’.

    ‘మానేస్తానా యేవిటి చె-ప్పండీ’

    ‘చెప్పనా యేవిటి కట్టుకురా’.

    ‘ఆమె గదిలోకి వెళ్ళి మడత పూర్తిగా విప్పగా యేదో కింద పడింది.

    ‘ఇందిలో పట్టు జాకెట్టు కూడా వుందండీ!

    ‘ఇంకేం తొడుక్కురా’.

    యాజులిక్కడ మాట్టాడకుండానే కూచున్నాడు. కాని ‘మామిడిపిందె లించక్కున్నాయో! బాబోయ్ పద్దెనిమిది మూళ్ళ పొడుగున్నట్టుంది. మా అమ్మాయిలాంటిది వొక్కటీ పెట్టలేకపోయింది. ఎన్నాళ్ళనుంచో మనసుపడుతున్నా నీరంగుకోసం. పాపం, చెప్పినట్టు తెచ్చిపెట్టారు’ అంటూ అక్కడ రాధమ్మ రిమార్కులమీద రిమార్కులు దొర్లించేసింది.

    అదివిని తన కష్టం పూర్తిగా ఫలించినందుకతను చాలా సంతోషించాడు.

    తరువాత ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ వచ్చి వొళ్లోకూచుని ఆమె ‘యిదెలా వచ్చింది చెప్పరూ?’ అని మళ్ళీ అడిగింది.

    ‘పుల్లంపేటలో వొక దేవాంగి నేశాడు’.

    ‘ఊహూ’.

    ‘అది తెప్పించి నాతా సుదర్శనశెట్టి నెల్లూరి పెద్దబజారులో పెట్టి అమ్మాడు’.

    ‘సరే’

    ‘నేను కొన్నాను’.

    ‘బాగుంది’.

    ‘నువ్వు కట్టుకున్నావు’.

    ‘ఎలా వచ్చిందీ?’

    ‘మళ్ళీ మొదలా?’

    ‘మరి నా ప్రశ్న అలాగే వుండిపోయింది. కదూ!’

    ‘లేదు, బాగా ఆలోచించుకో’.

    ‘పోనీ, యిది చెప్పండి డబ్బెక్కడిదీ?’

    ‘మిగిలిస్తే వచ్చింది.’

    ‘ఎవరూ?’

    ‘నేను.’

    ‘ఎలా మిగిల్చారూ?’

    అతను రెప్పవెయ్యకుండా చూశాడు.

    ‘చెప్పరు కాదూ? అయితే నన్ను -‘

    ‘ఆగు ఆగు. ఇవాళ పెద్ద పండుగ. అలాంటి మాటలు రాకూడదు.

    ‘అయితే మరి చెప్పండి’.

    ‘యాజులు జరిగిందంతా చెప్పాడు; కానీ, నమ్మలేక, ఆమె ‘నిజంగా?’ అని చెయ్యి చాపింది.

    ‘అక్షరాలా నిజం. ముమ్మాటికీ నిజం’ అంటూ అతనాచేతిలో చెయ్యివేసి, ఆ చెయ్యి గిల్లాడు.

    ఆమె మనస్సు గుబగుబలాడిపోయింది. హృదయం నీరయిపోయింది. కళ్ళు చెమ్మగిల్లాయి.

    ‘చూశారా? నా చీరకోసం కారెండలో నడిచివెళ్ళారా?’ అక్కడ కడుపు మాడ్చుకుని వుసూరుమంటూ పని చేశారా? చీర లేకపోతే నాకు పండుగ వెళ్ళగనుకున్నారా? నేను రాకాసినా?’ అని యిక మాట్టాడలేక చేతులు అతని కంఠానికి పెనవేసి తన శిరస్సు అతని భుజం మీద ఆనికుని దుఃఖించసాగింది.

    అది చూసి, మొదట అతను నిర్విణ్ణుడయిపోయాడు; కాని తరువాత ఛా! ఏడుస్తున్నావా? నేను ఏది వద్దనుకున్నానో అదే చేస్తావా? ఇలా చూడూ, అబ్బే! అయితే నాకూ నీకూ మాటల్లేవు. నాకూ నీకూ జతలేదు, అని బెదిరిస్తూ మూతి బిడాయించుకుని ఆమె మొగం పైకెత్తి కొంటెచూపులు చూశాడు.

    ఏడ్పల్లా ఆమెకి నవ్వయిపోయింది.

    ‘మరి నాతో యెందుకు చెప్పారు కారూ? నేను మాత్రం కాఫీ మానుకోకపోదునా? దాంతో మీక్కూడా జామారు రాకపోవునా?’

    ‘ఇప్పుడు రాకపోతేనా?’

    ‘ఏదీ, చూపించరూ?’

    ఇద్దరూ లేచారు. ఒకర్ని వొకరు పొదిపి పట్టుకుని వాకిట్లో మేజా దగ్గరికి వెళ్ళారు. యాజులు సొరగులాగి వెంకటగిరి సరిగంచు చాపు పైకి తీశాడు.

    అది చూసి, ఆమె సంతోష విహ్వాల అయి మరి తొరగా కట్టేసుకోండి’ అంటూ అతని భుజాలు వూపేసింది.

    ***

    ఇది ప్రత్యేకించి నేను ఎన్నుకున్న కథేమీ కాదు. నా ట్విట్టర్ మిత్రులు శ్రీ. ఎమ్.వీ.రావుగారు, ఐఏఎస్ (@mvraoforindia), వాట్సప్ ద్వారా తమకందిన ఈ కథను నాతో పంచుకున్నారు. వేవేల కృతజ్ఞతలు, సర్. మీ పుణ్యమా అని, శాస్త్రిగారి ప్రాభవం మరికొందరు నేస్తులకు చేరుతుందన్న ఆశతో… 

  • హరహరో… చేదుకో కోటయ్యా!

    హరహరో… చేదుకో కోటయ్యా!

    కోటప్ప కొండపై
    కోటి వ్రేల్పుల రేడు
    కోటయ్య యని మ్రొక్క
    చేదుకొను హరుడు

    ఏమన్న ప్రభలు నవి ఎంత జాతరలు
    త్రికూట రాయుడికి కోటి దండాలు
    వేయి సంబారాలు వేవేల పూజలు
    కోటి ప్రభలా వేల్పు మేలు సల్పు

    శివుడె దిక్కని మ్రొక్క నొక్క గొల్ల వారింట
    వరపుత్రి వెలసె ఆనందవల్లి యను పేరిట
    బాల మనమున యెపుడు బాలేందుడే యగుట
    ముక్కంటికే తన్ను తాను అర్పితమంట

    ఆది జంగమ దాహమ్ము దీర్పంగ
    చెలమ నీరే ఆమె కడవ నింపంగ
    శంభు తలపై గంగ విస్తుబోవంగ
    భక్తి భావనకి యా ముక్కంటి లొంగంగ

    కొండ చేరెడు వేళ కాళ్ళు నొవ్వగరాగ
    కడవ నీరొక తాన తాను పండె వేరొక తాన
    పాపమా కాకమా కడవపై వ్రాలంగ
    కుండ దొణికెను నీరు మ్రొక్కవోవంగ

    కుపిత ఆనంది ఆ గొల్లలింటి చాన
    కొండ వ్రాలకు నీవు మరల రాకను యెడల
    నాటి కాలము దాటి నేటికబ్బురమెంత
    కోటప్ప కొండపై కాకి వాలదు వింత

    గొల్ల దెచ్చెను పాలు
    నెలలు నిండిన చూలు
    కొండ దిగవలె శూలి
    తా తిరిగి జూడదు మరలి

    అయ్య వేసిన అడుగు
    ఘన ఓంకార నాదమ్ము
    భీతహరిణయి గైత
    తల ద్రిప్ప బొమ్మయె వింత

    అచటె ఆగెను భవుడు
    రాతి బొమ్మయి నిలుడు
    భక్త సులభుండతడు
    పరమేష్ఠి యతడు

    అడగకిచ్చును వరము
    అడుగుటెవ్వని తరము
    ఇహము నుండీ పరము
    శివుడె మోక్ష మార్గమ్ము

    సత్యమనగా శివుడు
    శివమన్నదే వాడు
    సుందరమ్మగు హరుడు
    త్రికూటాద్రి విభుడు

    ప్రణవ నాదమె వాడు
    ఆది గురువని చూడు
    సృష్ఠి స్ఠితియును లయుడు
    త్రికూటాద్రి విభుడు


    మార్చి 2016 లో కాబోలు రాసుకున్నానిది.
    గుంటూరు జిల్లా, నరసరావు పేట దగ్గర కోటప్ప కొండ పైన వెలసిన శ్రీ త్రికూటేశ్వర స్వామివారికి మహా శివరాత్రి సందర్భంగా, భక్తితో.