కలియుగంలో సాంకేతికతకు, సంప్రదాయానికి మధ్య జరిగే యుద్ధాలకు కొదవే లేదు. కానీ విశాఖపట్నంలోని సీతమ్మధారలో, సుబ్బారావు గారి ఇంట్లో జరుగుతున్నంత భీకరమైన యుద్ధం బహుశా ముల్లోకాలలోనూ జరిగి ఉండదు. అక్కడ ఒక పక్షం, ఇల్లాలు శాంతమ్మ గారైతే, అవతలి పక్షం అమెరికా నుండి దిగుమతి అయిన ‘స్మిత’ అనే స్మార్ట్ స్పీకర్. మధ్యలో నలిగిపోతున్న అమాయకపు మధ్యవర్తి, భర్త సుబ్బారావు.
ఆ స్పీకర్‌ను వాళ్ళ అబ్బాయి పంపినప్పుడు, “ఇది మీతో మాట్లాడుతుంది, మీ పనుల్లో సాయం చేస్తుంది” అని చెప్పాడు. శాంతమ్మ గారు దాన్ని పైనుండి కిందకు ఒకసారి స్కాన్ చేసి, “దీనికి కళ్ళు, కాళ్ళు లేవు, ఇది చేసే సాయం ఏంటో, నా కర్మ ఏంటో” అని తీర్మానించేశారు. ఆ రోజు మొదలైంది, శాంతమ్మ గారి శాస్త్రానికి, స్పీకర్ గారి సూత్రానికి మధ్య నిరంతర ఘర్షణ.
ఒకరోజు మధ్యాహ్నం, శాంతమ్మ గారు తన చిరకాల స్నేహితురాలు లలితతో ఫోన్లో మాట్లాడుతున్నారు. “ఏమిటో లలితా, ఈ మధ్య మా ఆయన ప్రవర్తన ఏమీ బాగోలేదు. ఎప్పుడు చూసినా ఫోన్లోనే ఉంటున్నారు. నా మీద ప్రేమ తగ్గిపోయిందేమో” అని బాధపడ్డారు.
వెంటనే హాల్లో ఉన్న స్పీకర్, ‘స్మిత’, తన మృదువైన స్వరంతో, “ప్రేమను పెంచడానికి కొన్ని చిట్కాలు: రోజూ అభినందించండి, చిన్న చిన్న బహుమతులు ఇవ్వండి, కలిసి సమయం గడపండి…” అని సలహాల జాబితా చదవడం మొదలుపెట్టింది.
శాంతమ్మ గారు ఉలిక్కిపడి ఫోన్ పెట్టేశారు. “ఆమ్మో … ఈ గూఢచారి డబ్బా నా మాటలన్నీ వింటోంది! దీనికి నా సంసారం గురించి అంత ఆరాటం ఎందుకో!” అని గట్టిగా అరిచారు.
కానీ, ఆ స్పీకర్‌కు, శాంతమ్మ గారికి మధ్య అసలైన యుద్ధం మొదలైంది వంటింట్లోనే. ఒకరోజు, “స్మితా, ఈరోజు ఏదైనా కొత్తగా సాంబారు ఎలా చేయాలో చెప్పు” అని సరదాగా అడిగారు.
స్పీకర్ ఏదో ఇంటర్నెట్ వంటల పుస్తకం నుండి కాపీ కొట్టి, “ముందుగా, కూరగాయలను ఉడకబెట్టి, అందులో కొద్దిగా పంచదార, గరం మసాలా వేయండి…” అని చెప్పడం మొదలుపెట్టింది.
అంతే! శాంతమ్మ గారిలో ఉన్న పాకశాస్త్ర ప్రవీణురాలు ప్రచండ రుద్రురాలిగా మారింది. “ఛీ ఛీ ఆపు! సిగ్గులేకుండా చెబుతున్నావు! సాంబారులో పంచదార వేస్తారా? మా అమ్మమ్మ ఆత్మ ఘోషిస్తుంది. అసలు సాంబారు ఎలా చేయాలో నేను చెబుతాను, నీ బుర్రలో ఎక్కించుకో” అని చెప్పి, అరగంట పాటు తన వంశపారంపర్య వంటకాన్ని మొత్తం ఆ స్పీకర్‌కు అప్పజెప్పారు.
అంతా విని, స్పీకర్ ఎంతో వినయంగా, “ధన్యవాదాలు. మీ ‘సిగ్గులేని సాంబారు’ రెసిపీని నేను సేవ్ చేశాను” అని బదులిచ్చింది.
ఆ దెబ్బతో శాంతమ్మ గారు ఆ స్పీకర్‌తో మాట్లాడటమే మానేశారు. దాన్ని “సాంబారును ఖూనీ చేసిన డబ్బా” అని పిలవడం మొదలుపెట్టారు.
ఆ వారం వాళ్ళ ఇంటికి బంధువులు వచ్చారు. భోజనాల దగ్గర, వాళ్ళ అబ్బాయి అమెరికా నుండి వీడియో కాల్ చేసి, “అమ్మా, బంధువులందరికీ నీ స్పెషల్ సాంబారు రుచి చూపించు” అన్నాడు. దానికి శాంతమ్మ గారు, “నా సాంబారు కాదురా, ఇప్పుడు మన ఇంట్లో కొత్తగా ‘సిగ్గులేని సాంబారు’ ట్రెండ్ నడుస్తోంది. ఆ డబ్బాయే చేసి పెడుతుందిలే!” అని వ్యంగ్యంగా అన్నారు.
ఆ మాట వినగానే, సుబ్బారావు గారికి తన జీవితం ఆ స్పీకర్‌లాగే, భార్య శాస్త్రానికి, టెక్నాలజీ సూత్రానికి మధ్య నలిగిపోతున్న ఒక బఫర్ పరికరంలా అనిపించింది.
ఆ రోజు నుండి, సుబ్బారావు గారు ఒక కొత్త అలవాటు చేసుకున్నారు. ఆఫీసు నుండి రాగానే, ఇంట్లోకి అడుగుపెట్టే ముందు, తలుపు దగ్గరే నిలబడి, “స్మితా! ఈరోజు ఇంట్లో వాతావరణం ఎలా ఉంది? ఏమైనా వంటల ప్రయోగాలు జరిగాయా?” అని అడుగుతారు. స్పీకర్ నుండి “అంతా ప్రశాంతంగా ఉంది” అని వస్తేనే లోపలికి అడుగుపెడతారు. లేదంటే, ఏమీ తెలియనట్టు, “పక్కింటి పరంధామయ్య గారు పిలిచారు” అని చెప్పి, గంట తర్వాత వస్తారు.
అందుకే అంటారు, టెక్నాలజీ మన జీవితాన్ని సులభతరం చేస్తుందో లేదో తెలియదు కానీ, ఖచ్చితంగా బతకడానికి కొత్త దారులు మాత్రం నేర్పిస్తుందని.
“మోవ్… నీకు ఎన్నిసార్లు చెప్పాలి. నాకు సైడ్ క్రాఫ్ వద్దు, పైకి దువ్వు” అరిచాడు తిరుమల. పక్కకి దువ్వితే బావుంటావు రాజా.. నవ్వుతూ తల దువ్వింది అమ్మ. తిరుమల అప్పుడే ఆరో క్లాస్ లోకి వచ్చాడు. ఎలిమెంటరీ బడి నుంచి ప్రమోషన్ వచ్చి జెడ్పీపీఎస్ బాయ్స్ హైస్కూల్ లో చేరాడు. చిరంజీవి, సినిమా, ఫ్రెండ్స్, క్రికెట్, అదే ఒక చిన్న ప్రపంచం. చిరంజీవిలా క్రాఫు కావాలి, చిరంజీవిలా డాన్స్ వేయాలి.
డాడాని నా పుట్టినరోజు డ్రెస్ టైలర్ దగ్గరనుంచి తీసుకురమ్మని చెప్పు, బ్యాగీ ప్యాంటు, ఫ్లవర్ డిజైన్ షర్ట్ వేసుకుంటే చిరంజీవిలా ఉంటాను అని ఊహించుకుంటూ… పుస్తకాల సొరుగులో భద్రంగా దాచుకున్న స్టేట్ రౌడీ సినిమా పాటల పుస్తకాన్ని జేబులో పెట్టుకుని బయటకు పరిగెత్తాడు. డాడా అంటే నాన్న. డాడా పినాకినీ గ్రామీణా బ్యాంకు లో క్లర్కు. తిరుమల వాళ్ళ అమ్మ, తిరుమల, తిరుమల చెల్లి, ఒక చిన్న ఇల్లు, టీవీఎస్ ఫిఫ్టీ. అదే డాడా చిన్న ప్రపంచం
మా ఊళ్ళో అందరికీ సినిమా అంటే పండగ. కొత్త సినిమా అంటే పెద్ద పండగ. చిన్నా, చితకా, ఆడా మగా , ఉన్నవాళ్లు, లేనివాళ్ళు, అందరికీ సినిమా అంటే పండగే. చిరంజీవికి ఫ్యాన్స్ ఉంటారు, విజయశాంతికి ఫాన్స్ ఉంటారు, రాజనాలకి, రాజశేఖర్ కి, సుమన్ కి, సుమలతకి, భానుచందర్ కి, భానుప్రియ కి, అరుణ్ పాండ్యన్ కి, ముచ్చర్ల అరుణ కి, అందరికీ ఫాన్స్ ఉంటారు.
మా ఊళ్ళో అప్పట్లో రెండు సినిమా హాళ్లు, పాత హాలు, కొత్త హాలు. కొత్త హాల్లో బాల్కనీ ఉండేది. సినిమా మారింది అంటే, ఒక బండి మీద పెద్ద పోస్టర్ పెట్టి ఊరంతా తిరుగుతూ మైక్ లో అరుస్తూ చెప్పేవాళ్ళు. రచ్చబండ అంకుల్స్ అప్పటికప్పుడు నైజం, సీడెడ్ కలెక్షన్స్ లెక్కలేసేవాళ్ళు. బోరింగ్ పంపు దగ్గర ఆడవాళ్లు ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ, మొదటి ఆటకి వెళ్ళడానికి మొగుళ్లను ఎలా ఒప్పించాలో ప్లాన్లు వేసేవాళ్ళు.
కొత్త సినిమా ఎప్పుడూ కొత్త హాల్ లోనే వచ్చేది. మాయాబజార్, గుండమ్మ, మిస్సమ్మ… అన్నీ పాత హాల్లోనే. కొత్త సినిమా వచ్చిందంటే ఊరంతా కదిలి వచ్చేది. నేల టికెట్ అంటే, నేల మీద సినిమా చూసే టికెట్. బెంచీ టికెట్ అంటే చెక్క బెంచీలు. కుర్చీ టికెట్ అంటే కుషన్ కుర్చీలు. బాల్కనీ అంటే మెట్లు ఎక్కి పైకి వెళ్లి మెత్తటి కుర్చీల్లో కూర్చుని చూడటం. ఇంటర్వెల్ వచ్చిందంటే బాల్కనీ లో ఉన్నవాళ్లు స్టైల్ గా కిందకి చూసేవాళ్ళు. నేల టికెట్ వాళ్ళు ఆశగా పైకి చూసేవాళ్ళు. టికెట్ ధర రెండు రూపాయల దూరం, కానీ చూపులో తేడా ఆకాశానికి నేలకి ఉన్నంత దూరం.
కొన్నిరోజుల్లో తిరుమల పుట్టిన రోజు వస్తోంది. కొన్నిరోజుల్లో చిరంజీవి సినిమా కూడా వస్తోంది. మొదటిదానికి డాడా హడావుడి. రెండోదానికి తిరుమల హడావుడి.
బయట సినిమా బండి. రేపే విడుదల మీ అభిమాన హీరో చిరంజీవి నటించిన ‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’ సినిమా మన కొత్త హాల్లో.
పుట్టిన రోజుకు కొనిచ్చిన కొత్త బట్టలు కట్టుకుని చిరంజీవి సినిమాకి ఫ్రెండ్ తో వెళ్దాం అని తిరుమల ప్లాన్. రేపు మొదటిరోజు మొదటి ఆట సాయంత్రం షో. డాడా జేబులో నుంచి లేపేసిన ఒక రూపాయి బిళ్ళ భద్రంగా నిక్కర్ జేబులో దాగుంది. ప్లాన్ అంతా సెట్.
“రేపు పక్కూరికి వెళదాంరా తిరుమలా, ఒక పని ఉంది.” డాడా అరిచాడు.
ప్లాన్ షేక్. షేక్ అంటే షాక్. తిరుమలకి షాక్.
“లేదు డాడా సోమవారం నుంచి నాకు క్వార్టర్లీ. ఫ్రెండ్ తో చదువుకోవాలి, నేను రాలేను. మీరు వెళ్ళండి.”
కొంచెంసేపు డాడా – తిరుమల ఇద్దరూ కదనరంగంలో రెండు టీముల్లా ఒక పద్యం, ఒక బాణం, ఒక పద్యం ఒక బాణంలా సమరశంఖాలు పూరించి కొట్టేసుకున్నారు. చివరకి తిరుమల కన్నీటి ప్రవాహానికి డాడా కరిగి కొట్టుకుపోయాడు.
గెలిచిన తిరుమల కళ్ళు తుడుచుకుని ఈ గెలుపులో భాగమైన మన చిరంజీవికి గాల్లో ఒక కిస్ వేసి జేబులోని రూపాయి బిళ్ళని తడుముకుని రేపటి సినిమా ప్లాన్ మరోసారి మననం చేసుకున్నాడు.
రేపు…
మొదటి ఆట సాయంత్రం ఏడున్నర కి మొదలవుతుంది. హాలు తలుపులు ఆరున్నరకే తెరిచేస్తారు. తిరుమల ఆరుకే వెళ్లి గేట్ దగ్గర నిలబడ్డాడు. ఫ్రెండ్ గాడికి వాళ్ళ నాన్న గంజి పెట్టి ఉతికి ఆరేయడం వల్ల హాలుకు రాలేకపోయాడు పాపం.
గేటు ముందంతా జనాలే. టీచర్ పాఠం చెప్పేటప్పుడు తలకెక్కకపోతే నోటుపుస్తకం లాస్ట్ పేజీలో పెన్ను పెట్టి పిచ్చి గీతలు గీకుతూ ఉంటే ఎలా ఉంటుందో, ఇక్కడ జనాలు కూడా అంతే గజిబిజిగా ఉన్నారు. మన చిన్న చిరంజీవి మొత్తానికి ఎలాగోలా నేల టిక్కెట్టు కొనుక్కుని హాలులో గోడకు అనుకుని కూర్చున్నాడు.
హీరో ఎంట్రీ అయ్యేసరికి హాలు అంతా విజిల్స్, అరుపులు. స్క్రీన్ మీద రంగురంగుల లోకం. తిరుమల కళ్ళల్లో కలల కాంతి. “నేనే చిరంజీవి ఫ్యాన్! ఇదే నా స్వర్గం!” అనుకున్నాడు.
ఇంటర్వెల్. లైట్లు వెలిగాయి. మళ్ళీ గజిబిజి. సమోసాలు, సుగంధ వాటర్, సుగంధ పాలు, గొట్టాలు, నానా గడ్డీ. అమ్మడం, కొనడం, తినడం, తాగడం అంతా ఒక పద్ధతీ పాడూ లేకుండా జరిగిపోతోంది. తెచ్చుకున్న రూపాయిలో పావలా మిగిలింది. దాంతో కొన్ని గొట్టాలు కొనుక్కున్నాడు.
నేల మీద కూర్చున్న వాళ్లంతా ఆశగా బాల్కనీ వైపు చూస్తున్నారు. మన చిన్న చిరంజీవి కూడా చూసాడు. ఎప్పట్లానే నింగి-నేల కాన్సెప్ట్. పైన కూర్చున్న వాళ్ళు కూడా క్రిందకు చూస్తున్నారు. ఇంతలో పైనుంచి అరుపు. ఎవరో తిరుమల వైపు వేలు పెట్టి చూపిస్తూ అరుస్తున్నారు. తిరుమల కళ్ళు చికిలించి చూసాడు. చెల్లి. బాల్కనీలో. పక్కనే అమ్మ, డాడా. సమోసాలు తింటూ లిమ్కా తాగుతున్నారు.
“డాడా ! అన్నయ్య కింద కూర్చున్నాడు!”
తిరుమలకి ఒక్కసారిగా గాబరా. అబద్దం చెప్పి దొరికిపోయానన్న బాధ ఒకవైపు, బాల్కనీ లో చెల్లి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అనే కుళ్ళుమోతుతనం మరోవైపు.
“ఇప్పుడు డాడా ఏం చేస్తాడో…” అనుకుంటూ గుండె దిటవు చేసుకుంటూ దిక్కులు చూస్తున్నాడు.
డాడా కిందికి వచ్చాడు. మొహంలో కోపం లేదు. గేటు దగ్గరున్న కీపర్‌ని పక్కకి పిలిచి, “మా బాబుకి బాల్కనీ టిక్కెట్టు తీసుకున్నాం రా, ఆలస్యంగా వచ్చేశాడు. లోపలికి పంపించు.” అని చెప్పి, చేతిలో ఒక అర్ధరూపాయి పెట్టాడు. తర్వాత తిరుమల భుజం మీద చేయి వేసి, బాల్కనీకి తీసుకెళ్లాడు.
ఆలోచిస్తే తిరుమలకి అర్థమైంది. డాడా ఊరికి వెళ్దాం అన్నది అబద్దం అని, తనకు తెలియకుండా తనకోసం సినిమా ప్లాన్ చేసాడు అని, తనే చిరంజీవి పైత్యం వల్ల ఇలా జరిగిందని అనుకుంటూ బాల్కనీ లో కూర్చుని, చెల్లి ఇచ్చిన గోలి సోడా తాగుతూ, అమ్మ పంచిన పల్లీలు నములుకుంటూ ఆలోచించాడు.
“నాన్న ప్రేమ అర్ధం కాదు. నాన్న అనేవాడు కూడా అర్ధం కాదు. కానీ నాన్న చెప్పింది వింటే మంచి జరుగుతుంది, నాన్న చెప్పేది, చేసేది నా మంచి కోసమే, ఈ నేల టిక్కెట్టు నా మనసులో ఎప్పటికీ చెదరని ఒక అమూల్య జ్ఞాపకం” అనుకుంటూ తిరుమల మిగిలిన సినిమా అందరితో కలిసి చూసాడు.
రమణారావు అంకుల్ భార్య పేరు సత్యవతి గారు. ఉత్తిగా సత్యవతి అని ఎవరూ పిలవడం మేమెప్పుడూ వినలేదు. ఎప్పుడూ సత్యవతిగారే. అంకుల్ కూడా ఇంట్లో అలానే పిలుస్తారేమోనని మా డౌటు. ఆవిడ మా కాలనీకి ఎలక్షన్ లేని లీడర్. గూర్ఖా దగ్గరనుంచీ కూరలవాళ్ళ దాకా, పనిమనుషుల దగ్గర్నుంచీ మునిసిపాలిటీ వాళ్ళదాకా, ఎవరయినా కాలనీలో ఏ పనికయినా సత్యవతిగారిని కలవాల్సిందే. ఆవిడ కూడా గొప్ప ఎఫీషియెంటు. ఒక్కరోజు చెత్తబండి రాకపోతే సానిటరీ ఇన్స్పెక్టర్ కి చచ్చేచావు! పార్కులో గడ్డెక్కువయినా భూమిలో నీరుతక్కువయినా ఆవిడే ఇంచార్జు. గత ముప్పయ్యేళ్ళుగా కాలనీకి బాసు.
కాలనీలో ఆడవాళ్ళది ఒక సూపర్ గ్రూపుంది. దానికీ సత్యవతిగారే లీడరు. మా అమ్మలందరూ అందులో సభ్యులే. ఉద్యోగాలుచేసే సుశీలా టీచర్, బ్యాంకు క్యాషియర్ నళిని గారు కూడా మార్నింగ్ వాకులు, శెలవురోజు ప్రోగ్రాములు మిస్సవ్వకూడదని రూలు. కాలనీలో పని జరగాలంటే వీళ్ళవళ్ళే జరిగేది. అంకుల్లందరూ మాలాంటోళ్ళే. ఎప్పుడు తిండిపెడతారా అని ఎదురుచూస్తూ ఎక్కడెక్కడి వార్తలో చూసుకుంటూ ఉండేవాళ్ళు ఉద్యోగాలనుంచీ వచ్చాక. ఆరున్నరయితే ఇంకా ఆంటీ ఇంటికి రాలేదు, వంటెప్పుడు మొదలెడతారు, మనకెప్పుడు పెడతారు అని గేటు వైపు మాటిమాటికీ చూస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ గురించి వేరే కధ ఉంది లెండి.
సత్యవతిగారి గ్రూపులో ఓ పది-పన్నెండు సభ్యురాల్లుండేవారు. రోజూ వాకింగుకి వెళ్ళేవాళ్ళు, మధ్యాహ్నాలు తోటపని చేశేవాళ్ళు, డాబాలమీద కూరలు, పూలు పండించేవాళ్ళు, కలిసి షాపింగులకెళ్ళేవాళ్ళు, ఇంటికొచ్చిన చీరల పండాలని మొత్తం మూడు సంచులు టీవీయస్-50 మీదనుంచీ తెచ్చి ఒక్కొక్క చీరా పూర్తిగా తీసి చూపించేదాకా వదిలేవాళ్ళుకాదు, ఒక చీటీ వేసుకునేవాళ్ళు, నెలకొకింట్లో కిట్టీ పెట్టుకునేవాళ్ళు, గొప్ప సందడుండేది. వాళ్ళళ్ళో దాదాపు అందరూ అరముప్పైలు దాటినవాళ్ళే. కొందరు నలభైలు యాభైలు కూడా ఉండేవాళ్ళు కానీ బాల్యవివాహం అని దబాయించేవాళ్ళని ఓరోజు మా అమ్మ ఇంట్లో చెప్తూంటే విన్నాను.
సత్యవతిగారి ఈంట్లో పైన పోర్షన్లో ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ కుర్రాడు అద్దెకుండేవాడు. టిప్పుటాపుగా తయ్యారయ్యి బైకుమీద రోజూ ఉదయాన్నే బయటకెళ్ళిపోయేవాడు, రాత్రి ఎనిమిది తరువాత వచ్చేవాడు. మాకు మంచి ఫ్రెండు. హాల్స్ బిల్లలు దబ్బాడుండేవి ఆయనదగ్గరెప్పుడూను. మేమెప్పుడు ఎదురొచ్చినా మాకు ఓ గుప్పెడు ఇచ్చి వెళ్ళిపోయేవాడు. ఎవరిదయినా పుట్టినరోజు అని తెలిస్తే డెయిరీనో మంచి పెన్నో స్క్రిబులింగ్ ప్యాడో గిఫ్టు ప్యాకింగులో ఇచ్చేవాడు. ఇంట్లో ఎప్పుడూ ఇవి ఎందుకు ఉండేవా అని మాకు అప్పట్లో పెద్ద డౌటుండేది. ఓరోజు ఆయనకి పెళ్ళయ్యింది. అన్నవరంలో చేసుకుని వాళ్ళావిడని తీసుకుని కాలనీకి వచ్చాడు. సత్యవతి గారు, మిగితా బృందం దిష్టి తీసి గుమ్మడికాయ కొట్టి లోపలికి తీసుకెళ్ళారు. మేమందరం పార్కు గోడమీంచీ చూశాం. ఓ రెండుమూడు వారాలయ్యాక కొత్త పెళ్ళికూతురుని కూడా గ్రూపులో కలిపేసుకున్నారు సత్యవతిగారు. వాకింగులలో తెగ ఇకఇకలు పకపకలు ఉండేవి. వాళ్ళు బాతాఖాని కొట్టుకునే చోట మేముంటే “అటువైపు వెళ్ళి ఆడుకోండి” అనేవారు మమ్మల్ని. రిప్రజెంటేటివ్ కూడా ఐదూ ఆరు అయ్యెసరికీ ఇంటికి వచ్చేసేవాడు. మాతో మామూలుగా కన్నా ఎక్కువ నవ్వుతూ మాట్లాడేవాడు, ఓ కొత్త బైకు కూడా కొనుక్కున్నాడు …
వాకింగుకి కాలనీ ఆంటీలందరూ చీరలే కట్టుకొచ్చేవాళ్ళు. అప్పుడప్పుడూ ఎవరయినా పంజాబీ డ్రెస్సులు వేసుకునేవాళ్ళు. అయితే కొత్తమ్మాయి డ్రెస్సులే వేసుకునేది. అప్పుడప్పుడూ ట్రాక్ ప్యాంటులు కూడా వేసుకునేది. ఓసారి టీషర్టు వేసుకొచ్చింది కూడాను. “చిన్నపిల్ల కదా పర్లేదులే” అని మా నాన్నన్నారు అమ్మతో. నడుస్తున్నప్పుడు అందరు ఆంటీల మధ్యలో నిజంగానే చిన్నపిల్లలానే ఉండేది ఆవిడ.
ఈ విషయం ఆంటీలు కొందరికి నచ్చలేదు. సత్యవతిగారి ఇంట్లో ఓ మీటింగు పెట్టి ఏదోటి చెయ్యాలని తీర్మానించుకున్నారు. మరుసటిరోజు ఇంట్లో అలార్ము నాలుగున్నరకి మోగింది. ఏంటా అని లేచి చూస్తే మా అమ్మ గబగబ లేచి, “నువ్వు పడుకో పర్లేదు” అని స్పీడుగా తయ్యారయ్యి తలుపు బయిటనుంచీ గొళ్ళెంవేసుకుని వెళ్ళిపోయింది. మరుసటిరోజూ అంతే. ఇలా కాదని నేనూ ఓరోజు లేచి ఐదునిమిషాల తరువాత వెనక తలుపులోంచీ వెళ్ళి డాబా ఎక్కాను. పక్కడాబా మీద అనీల్ గాడు కూడా కనబడ్డాడు. వాడింట్లో కూడా ఇదే పరిస్థితి. పార్కులో కమ్యూనిటీ హాలు, ఓ స్టేజీ ఉండేవి. ఆ స్టేజీ మీద ఆంటీలందరూ కనబడ్డారు. ఒకాయన తెల్ల కుర్తా వేసుకుని ప్రాణాయామం చేయిస్తున్నారు వాళ్ళచేత. ఐదున్నరకి ఆసనాలు వేయించడం మొదలెట్టారు. ఆంటీలు అందరూ డ్రెస్సులే వేసుకొచ్చారు. ఎప్పుడూ మేము సత్యవతిగారిని, మరికొందరిని అలా చూడలేదు. మాకు స్కూల్లో నేర్పిన ఆసనాలు కొన్ని వేయించాక మాష్టారో క్లిష్టమయిన ఆసనం వెయ్యమన్నారు. మా అమ్మల పాట్లుచూసి నేనూ అనిల్ గాడు ఒకరి మొహాలు ఒకరం చూసుకున్నాం నవ్వు ఆపుకుంటూ!
ఆరున్నరవరకూ విపరీతమయిన వాకింగు, యోగా, ఎక్సర్సైజులు చేసేసారు. తువ్వాల్లు, నీళ్ళసీసాలు, మధ్యమధ్యలో పార్కు చుట్టూ జాగింగూ… స్కూల్లో కాలనీ పిల్లలందరం ఆలోచించాం — ఏమయింది మన అమ్మలకి అని. కొన్నాళ్ళు ఇలానే గడిచింది. ఉదయం మాత్రమే కాదు, సాయంత్రం కూడా వాకింగు మొదలెట్టారు కొందరు. ఇంట్లో మా అమ్మ చిన్న గిన్నెలో గోధుమన్నం వండుకోవడం మొదలెట్టింది. అంతే తినేది. కూరలవాడు ఉదయాన్నే కాలనీకి వచ్చినప్పుడు స్పెషల్ గా కవర్లలో కొమ్ముశనగలు, పెశలు లాంటివన్నీ ఇచ్చేవాడు, ఇంట్లో వాటిని మొలకెత్తించి తినేవాళ్ళు ఆంటీలు. కక్కడి దోసకాయలు, క్యారెట్లు, మురీలు స్నాక్స్ అయిపోయాయి. బజ్జీలు, పునుగులు మానేశారు. మా నాన్నలు మరీ ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళిపోయారు! బిరియానీలు లేవు, స్వీట్లు లేవు, మా నాన్న ఏమయినా అంటే “పొట్ట చూసుకోండి, ఇదంతా మీ మంచికే, మీకోసమే మేమూ త్యాగం చేశాం” అని చెప్పేది మా అమ్మ!
కొన్నాళ్ళ తరువాత సత్యవతి గారి ఇంటిపైన ఉన్న కొత్త పిల్ల వాకింగుకి వెళ్ళడం తగ్గించేసింది. కొంచం బొద్దుగా అయ్యిందేమో అనిపించింది మాకు. ప్యాంటులు టీషర్టులు తగ్గించి డ్రెస్సులే వేసుకునేది. “ఆరో నెల” అని పనిమనిషికి సత్యవతిగారు చెప్పారని మా ఇంట్లో చెప్పింది. కొన్నాళ్ళకి రిప్రజెంటేటివ్ వాళ్ళ ఇంట్లో ఓ ఫంక్షన్ చేశారు. మొత్తం అరేంజుమెంట్లన్నీ కాలనీ ఆంటీలే చేశారు సత్యవతిగారి డైరెక్షన్లో. డెకరేషను, చీరలు, పువ్వులు, టెంటుహౌసు, మొత్తం. చుట్టాలొచ్చి భోజనాలు చేసి చీరలు పువ్వులు ఇచ్చారు అమ్మాయికి. అదయ్యాక వాళ్ళ అమ్మానాన్నా అమ్మాయిని తీసుకెళ్ళిపోయారు.
మళ్ళీ రిప్రజెంటేటివ్ ఉదయాన్నే వెళ్ళి రాత్రికి వచ్చేవాడు. మరో నాలుగు రోజులకి యోగా, జాగింగూ, సాయంత్రం వాకింగూ ఆగిపోయాయి. అలార్ము ఇంతకుముందు లాగే ఐదుంపావుకి మోగింది. అమ్మ మళ్ళీ మామూలు అన్నానికి మారిపోయింది.
((ఈరోజు శనివారం, శెలవు రోజు! ఇంట్లో మ్యాట్ని ప్రోగ్రాం జరగాల్సిందే!))
అంతా చీకటిగా వుంది, ఎక్కడో కాలింగ్ బెల్ మోగుతున్న శబ్దం వినిపించి, లేచి గడియారం చూస్తే తెల్లవారు ఝాము 5 అవుతోంది. మళ్ళీ కాలింగ్ బెల్ రెండు సార్లు వినిపించింది. ఇంత పొద్దున్నే ‘ఎవరా?’ అనుకుంటూ పక్కనే వున్న భర్తని లేపింది. అతను గడియారం చూసి, “తెల్లవారుతోంది కదా, నువ్వే వెళ్ళి చూడు”, అని పక్కకి తిరిగి పడుకున్నాడు.
ఇంకా కాలింగ్ బెల్, దబదబా తలుపులు మార్చి మార్చి మ్రోగుతూనే ఉన్నాయి. ఇక తప్పదు అనుకుంటూ బట్టలు సరిచేసుకుని, జుట్టు ముడి పెట్టుకుంటూ మంచం దిగి హాల్ వైపు అడుగులు వేసింది. కాలింగ్ బెల్ మళ్ళీ మొగింది. “ఎవరూ? వచ్చే, వచ్చే!” హెచ్చు గొంతుతూ అంటూ, హాలులో వున్న దేవుడి పటానికి దణ్ణం పెట్టుకుంటూ గడియ తీసింది.
గుమ్మం ముందు మొహానికి చిన్న ట్రావెల్ బాగ్ అడ్డం పెట్టుకుని నిలుచుని వున్న ఆకారం ఎవరా? అని పరిశీలనగా చూసింది. బాగ్ వెనుకనుండి “అక్కా! నేనే వచ్చా!” అని తమ్ముడు రామకృష్ణ గొంతు వినపడింది. పార్వతికి ఒకింత ఆశ్చర్యంతో, సంతోషంతో తలుపు బార్లా తీస్తూ “ఏరా! వచ్చావా? ఊడి పడ్డావా?” అంటూ తమ్ముడు లోపలికి రావడానికి వీలుగా పక్కకి జ రుగుతూ, “ముందు లోపలికి రా రా! చలిగా వుంది. అయినా వచ్చే ముందు ఫోన్ చెయొచ్చుగా?”.
రామకృష్ణ చెప్పులు గుమ్మం బయట పక్కగా విడిచి లోపలికి వస్తూ “బావ గారు లేచారా?”. ‘లేదు’, అన్నట్టుగా తల అడ్డంగా ఊపుతూ తలుపు వేసి గడియ పెట్టింది. సోఫా పక్కనే బాగ్ పెడుతున్న తమ్ముడితో, “బట్టలు మార్చుకుని రా రా! వేడి వేడి కాఫీ ఇస్తాను” అంటూ లోపలికి వెళ్ళింది.
పార్వతి రెండు కప్పులతో కాఫీలు తీసుకుని వచ్చే సరికి, రామకృష్ణ బట్టలు మార్చుకుని, సోఫాలో కూర్చుని వున్నాడు. ఒక కప్పు తమ్ముడికి ఇచ్చి, సోఫా కి దగ్గిరగా కుర్చి లాక్కుని, ఇప్పుడు చెప్పు అన్నట్టు చూసింది. రామకృష్ణ కాఫీని ఆఘ్రాణిస్తూ, “ఆహా! నీ చేతి కాఫీ అధ్బుతం.” కాఫీ రెండు గుక్కలు తాగి, “ఏమీ లేదక్కా! చాలా రోజులు అయ్యింది, ఒక సారి చూసి పోదామని వచ్చా”,
మళ్ళీ కాఫీ కొంచెం ఎక్కువగా తీసుకుంటూ. పార్వతి, “సంతోషం! ఒక్కడివే వచ్చావే?” అని అడిగింది.
రామకృష్ణ తాగుతున్న కాఫీ కప్పు పక్కన పెడుతూ ” ఓ! అదా! నీ మరదలు వాళ్ళ పుట్టింటికి, నేను నా పుట్టింటికి. రేపు నేను అక్కడికి వెళ్ళి, ఎల్లుండి పొద్దునే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాము.”
పార్వతి కుర్చీలో సర్దుకుంటూ, “అయ్యో! తనని కూడా తీసుకువస్తే బావుండేది. నువ్వు వెళ్ళేటప్పుడు, తన జాకెట్లు రెండు ఇక్కడే వుండిపోయాయి, మర్చిఫొకుండా తీసుకు వెళ్ళు.”
రామకృష్ణ మళ్ళీ కాఫీ కప్పు తీసుకుంటూ “ఈ సారి, ఇలా వచ్చి అలా వెళతాములే. ఇంకా ఏంటి అక్కా విశేషాలు?”.
పార్వతి కుర్చిలోంచి లేచి, ఖాళీ అయిన కప్పులు తీస్తూ, “నువ్వు ఆ రెండో బెడ్ రూం లో కాసేపు పడుకో. శనివారమేగా, పని హడావిడి ఏమీ లేదు, తరువా త మాట్లాడు కుందాము”.
అక్కని ఆశ్చర్యంగా చూస్తూ, “పొద్దునే లేచి, దేవుళ్ళకి మేలుకొలుపు పాడే నువ్వా? ఇంకా పడుకో అంటున్నావు, అంతా కాల మహిమ” అంటూ సోఫాలో నుండి లేచాడు.
తమ్ముడిని చూసి, పెదవి విరుస్తూ “ఏం చేస్తాం? కరోనా తర్వాత కొత్తరకం కష్టాలు వచ్చిపడ్డాయి. ఈరోజు వుంటావుగా? నీకే తెలుస్తుంది” అంటూ తన బెడ్ రూం లోకి దారి తీసింది. అక్క వైపు కొంచెం అనుమానంగా చూస్తూ రెండో బెడ్ రూం లోకి దారి తీసాడు.
===== ****** ====== కప్పు భళ్ళున పడిన శబ్దంతో చటుక్కున కళ్ళూ తెరిచాడు రామకృష్ణ. గడియారం 11 గంటలు చూపిస్తోంది. మంచం మీదనుండి లేచి కూర్చుంటూ వుండగా, వంటింట్లోంచి కొంచెం గొంతు తగ్గించి మాట్లాడుకుంటున్నాయి అక్కా బావల గొంతులు.
రామకృష్ణ కిచెన్ వైపు నడుస్తుండగా, పార్వతి గొంతు వినిపించింది “కప్పు పడిన శబ్దానికి వాడు లేచే వుంటాడు. ఇంకా మాట్లాడకండి”. న్యూస్ పేపర్ మడతపెడుతున్న గుసగుసలో బావ గొంతు “ఈరోజు శనివారం, శెలవు రోజు, ఇంట్లో మ్యాట్ని సంగతి ఏంటి?”
పార్వతి భర్తకి దగ్గిరగా జరుగుతూ “చీ ఊరుకోండి. ఈరోజు మ్యాట్ని లేదు, గీటిని లేదు. వాడు ఇంట్లో వుండగా అలాంటి పనులు ఏంటి? అసహ్యంగా?”
అప్పుడే కిచెన్ లోకి వస్తున్న రామకృష్ణ “నమస్కారం బావగారు! ఏదో మాట్ని అంటున్నారు, ఇక్కడ దగ్గిరలో ఏమైనా కొత్త థియేటర్స్ తెరిచారా? చాలా రోజులు అయ్యింది హాల్ లో సినిమా చూసి, నేను కూడా వస్తా పదండి” .
పార్వతి చేతిలో వున్న గరిట భర్త మరియు తమ్ముడి మొహం మీద తిప్పుతూ “సినిమా లేదు, గినిమా లేదు.” అని తమ్ముడి వైపు తిరిగి “ఇక్కడ థియేటర్స్ ఓపన్ చెయ్యలేదు. ఆయన చేప్పేది వినకు.”
పార్వతి భర్త, పేపర్ మడిచి పక్కన పడేసి, భార్యని చూస్తూ, “మ్యాట్ని పడాల్సిందే! .” రామకృష్ణ కొంచెం ఆశ్చర్యంగా ఇద్దరిని చూసాడు. పార్వతి విసుక్కుంటూ “ఏంటండి ఇది. వాడి ముందు ఇలాంటి పనులు చేస్తే మీకే పరువు తక్కువ. ఈ వయసులో మీకు ఇలాంటి వేషాలు ??”
ఇదేదో చిత్రమైనా వ్యవహారాంలా వుందే అనుంకుంటూ, రామకృష్ణ అక్కతో “ఏంటి అక్కా? గంగా మహేష్ అనే పేరుగల బావగారు, ఎవరైనా చిన్న ఇల్లు, ఏమైనా…? “అంటూ నీళ్ళు నమిలాడు.
పార్వతి భర్తను చూస్తూ “నా అదృష్టం కొద్దీ, మీ బావగారి పేరులోనే నాకు సవతి వుంది గాని, వూరిలో లేదు”. అని, భర్తను బయటకు నెట్టుతున్నట్టుగా తోసింది.
తమ్ముడి వైపు తిరిగి “ఒరే, నువ్వు స్నానం చేసి రా, అందరం భోజనం చేసేద్దాం. నీకిష్టమైన గుత్తి వంకాయ కూర!” .
వంటింటి గుమ్మం దాటుతూ పార్వతి భర్త “మరో మాట లేదు, మ్యాట్ని ప్రోగ్రాం జరగాల్సిందే!, ” అని హుకుం జారి చేసి వెళ్ళిపోయాడు. ప్రశ్నార్ధంగా చూస్తున్న తమ్ముడి మొహంలోకి చూడలేక, పార్వతి తలదించుకుంది.
భోజనాలు ముగించేసరికి ఒంటిగంటన్నర అయ్యింది. అంతా భోజనాలు చేసిన తరువాత శుభ్రం చేసే పని వుందని లోపలికి వెళ్ళింది పార్వతి.. బావ మరుదులు ఇద్దరూ పిచ్చా పాటి మాట్లాడు కుంటూ కూర్చున్నారు.
ఇంతలో బావగారి మొబైల్ ఫోన్ మోగింది. ఫోన్ చేతిలోకి తీసుకు, కట్ చేసి రామకృష్ణ ని చూస్తూ ” కాల్ కాదులే, అది అలార్మ్ ! మ్యాట్ని టైం అయ్యింది .”, అని కిచెన్ వైపుకు చూస్తూ “పా రూ! “రెడీనా?”, అంటూ ఉత్సాహంగా కేక పెట్టాడు. గంగామహేష్ ఇప్పుడే వస్తా అని,, అంతకు ముందు రామకృష్ణ రెస్ట్ తీసుకుని వచ్చిన గదిలో వెళ్ళాడు. ఏమీ అర్ధంకాక, పక్కనే వున్న పేపర్ తిరగేస్తూ కూర్చున్నాడు. ఒక పదినిమిషాలా తరువాత గంగామహేష్ బయటకు వచ్చి “రాము, అంతా రెడీ.”, అని కిచెన్ లోకి చూసి “యేయ్ బుక్కింగూ! రెడీనా ?” అని మళ్ళీ గావు కేక పెట్టాడు.
రామకృష్న్ణకి ఇదేమి అర్ధం కాలేదు. గంగా మహేష్ తన బెడ్ రూం లోకి వెళ్ళి, బయటకు వెళ్ళే వాడిలా నీటుగా తయరయి వచ్చాడు. అలా వచ్చిన బావగారిని చూసి, తను కూడా లేస్తూ, “ఒక్క నిమిషం బావగారు, నేను కూడా బట్టలు మార్చుకుని వస్తా” అని లోపలికి వెళ్ళీ జీన్స్ టి షర్ట్ వేసుకుని తల దువ్వుకుని వచ్చాడు.
వేడి నూనేలో శంగపిండి వేగుతున్న వాసన వస్తోంది. చేతిలో గరిటె తో, జిడ్డు కారుతున్న మొఖం తో కిచెన్ లో నుండి వచ్చిన పార్వతి మొఖం చూసి “ఏంట క్కా? నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా?” అన్నాడు రామకృష్ణ అసహనంగా.
ముంజేతి తో మొహం తుడుచుంటూ, తమ్ముడితో, “నువ్వు, మీ బావగారు ఆ ప్రహసనం నడపండి, నాకు వేరే పనుంది”. గంగా మహేష్ ముందుకు వచ్చి భార్యతో, “ఎంటి? మ్యాట్ని మొదలయి పోయిందా? రెండు టికేట్ లు చించు” అన్నాడు. రామాకృష్ణ అక్కా బావలిద్దరిని అయోమయంగా చూసాడు. పార్వతి గంగా మహేష్, రామకృష్ణ ని వుద్దేశించి ” ట్రయిల్ పార్టి నాడుస్తోంది, మీరెళ్ళి కూచోండి, నేను మీ దగ్గరకు వచ్చి టికెట్లు చించుతా!” అంది.
ఈ మాటలు విన్న రామకృష్ణ ఇంకా అయోమయంలో పడిపోయాడు. ఇంతలో గంగా మహేష్, రామకృష్ణ ని “పద, పద” మంటూ తొందరపెడుతూ, ఆ రేండో రూములోకి తీసుకుని వెళ్ళాడు. గదంతా చీకటిగా వుంది, సినిమా థియెటర్ లో లాగ, గోడ మీద ఎల్. ఈ. డీ స్క్రీన్ మీద సూపర్ స్టార్ కృష్ణ నటించిన కౌబాయ్ ఫిల్మ్ ‘మోసగాళ్ళకు మోసగాడూ” టైటిల్ వేసి వుంది. ఆ చీకట్లోనే తడుముకుంటూ, రామకృష్ణ చేతితో లాక్కుంటూ తీసుకెళ్ళి కుర్చిలో కూలేసాడు అతని బావ గంగామహేష్. రిమోట్ తో సినిమా మొదలయ్యింది. రామకృష్ణ కళ్ళు చీకటికి కొద్దిగా అలవాటు పడ్డాయి. టైటిల్స్ పడి, సూపర్ స్టార్ స్క్రీన్ మీద కనపడగానే కయ్యి మని విజిల్ కొట్టాడు, గంగామహేష్. ఆ శబ్దానికి, చెవులో వేలు పెట్టి తిప్పుకుంటూ వుండగా, గది తలుపు మెల్లగా తెరుచుకుంటూ, సన్నని వెలుతురు లోపలికి పడింది. గంగామహేష్, “ఓయ్! తలుపెయ్, తలుపెయ్” అంటూ గట్టిగా అరిచాడు.
తలుపు వేసి లోపలికి వచ్చిన పార్వతి, వీళ్ళిదగ్గిరికి వచ్చి, చీకట్లో కాళ్ళు తొక్కి, గంగామహేష్ అడ్డంగా నిలబడి “టికెట్లకి డబ్బులు తియ్యండి” అంది. గంగామహేష్ పార్వతిని పక్కకితోస్తూ “యెహే! అడ్డం తప్పుకో, ఫైటు మిస్సవుతుంది. కాళ్ళు తొక్కేసి, పైగా అడ్డంగా నిలుచున్నావు” అని విసుక్కుంటూ, ఆమే చేతిలో యాభై రూపాయల నోటు పెట్టాడు, టికెట్లకి డబ్బులు అన్నట్ట్లుగా. ఇప్పుడిప్పుడే, రామకృష్ణ కి కొంచెం కొంచెం అర్ధం అవుతున్నట్లనిపించింది. పార్వతి మెల్లగా తలుపు తీసుకుని వెళ్ళిపోయింది.
రామకృష్ణ కూడా, తన బావగారితో కలిసి సినిమాలో లీనం అయిపోయాడు. పెద్దసౌండుతో, చప్పట్లతో మధ్య మధ్య కామెంట్స్ తో రామకృష్ణ బావగారితో కలిసి సినిమా ఫుల్లుగా ఎంజాయ్ చెయ్యడం మొదలు పెట్టాడు. ఇంకా గంగామహేష్ మరీ రెచ్చిపోయి, “కొట్టు, కాల్చు, దూకు” అంటూ అరుపులతో గదంతా అల్ల కల్లోలం చేస్తున్నడు. రామకృష్ణ కూదా ఉషారెక్కి విజిల్స్ కొట్టడం మోదలు పెట్టాడు. ఏదో పాట వస్తుండగా, తలుపు బార్లా తెరుచుకుంది.
ఉల్లిపాయ పకోడి వాసన గుప్పున కొట్టింది. పార్వతి, “పకోడి, పకోడి, ఉల్లిపాయ పకోడి” అని కేక వెసింది. వీళ్ళీదరికి వచ్చి మొహం మీద అడ్డంగా పకోడిల ప్లేటు పెట్టింది. కమ్మని వాసనకి రామకృష్ణ చెయ్యిపెట్టి తీస్కొబోతే, పళ్ళెం వెనక్కు లాగి “పొట్లం పది రూపాయలు” అంది. మహేష్ రామకృష్ణ తొడ మీద కొట్టి, “ఇరవై ఇచ్చి రెండు పొట్లాలు తీస్కో” అన్నాడు. ఇరవై తీసుకుని, రెండు పొట్లాలు వాళ్ళీదరి చేతిలో పెట్టి, బయటకు వెళుతూ తలుపు కొద్దిగా తెరిచి సినిమా చూడసాగింది. రూం లోపలిని లైటింగ్ పడటంతో ఈ సారి రామకృష్ణ గట్టిగా “తలుపెయ్, తలుపెయ్!” అని అరిచాడు. చుట్టూ చూసుకుని, తనెక్కడ వున్నాడో గ్రహించి సిగ్గుపడ్డాడు.
ఇంకా కొన్ని నిమిషాలలో “విశ్రాంతి” అని స్క్రీన్ మీద చూసి, గంగా మహేష్ లేచి లైటు వేసాడు. ఇద్దరూ కళ్ళూ నులుముటూ బయటకు వచ్చారు. మళ్ళీ సినిఫక్కీలోనే, డబ్బులు ఇచ్చి పార్వతి దగ్గిర ఇలాచి టీ తాగి, లొపలికి వచ్చి కూర్చుని సినిమాలో మునిగిపోయారు. ఒక పదినిమిషాలా తరువాత పార్వతి కూడా చేతిలో పకోడీల పళ్ళెం, టీ వచ్చి వీరితో కలిసి కూరుచుని సినిమా చూడసాగింది. ముగ్గురూ ఫుల్ గా సినిమాలో మునిగిపోయారు.
క్లైమాక్స్ ఫైట్ లో పార్వతి కూడా “ఖయ్యి”మని విజిల్ కొట్టసాగింది. అక్కను అలా చూసి రామకృష్ణ ఆశ్చరపోయాడు. పార్వతి కొంచెం సిగ్గుపడి, మళ్ళీ తేరుకుని విజిల్స్ వెయ్యసాగింది. మహేష్ ఇదేమి పట్టనట్టుగా తన పంధాలో సినిమాని ఎంజాయ్ చేస్తున్నాడు. “శుభం” కార్డు పడినతరువాత, పారతిలేచి లైట్ వేసింది. ముగ్గురూ కళ్ళు నులుముకుంటూ బయటకు వచ్చారు.
ఒకళ్ళని, ఒకళ్ళు చూసుకుని భళ్ళుమని నవ్వుకున్నారు. రామకృష్ణ పారవతి ని చూసి “అక్కా? నువ్వు విజిల్సా? మరీ ఇంత మాస్ గా ఎప్పుడు మారిఫొయావు?.”
.పార్వతి కొద్దిగా సిగ్గు పడుతూ “చిన్నప్పటి కోరిక, ఇలా తీరిందిరా. ” అని భర్తని మురిపెంగా చూస్తూ, మహేష్ చెయ్యిపట్టుకుని, రామకృష్ణని చూస్తూ “రాము! నాకు పుట్టింట్లో చిన్నపుడు సినిమాలు చూసే స్వేచ్చ వుంది కాని, ఒక ఆడ పిల్లకు వుండే కొన్ని కనిపించని కట్టుబాట్లు అలాగే వుండేవి. మగ పిల్లల్లాగా, కేరింతలు కొడుతూ, విజిల్స్ వేస్తూ సినిమా చూడాలని వుండేది. చిన్నాప్పుడు, అమ్మా-నాన్నా తోనె కలిసి వెళ్ళేవాళ్ళం. కాలేజి చదువులప్పుడు, ఇలాంటి సినిమా థియేటర్ వాతావరణం వున్నా, విజిల్స్ కొట్టే స్వేచ్చ వుండేది కాదు. మీ బావగారికి చిన్నప్పుడు ఊరిలో ఇలా చూసినట్టుగా సినిమా చూస్తేనే మజా! మల్టిప్లెక్సులు, వయసు వచ్చాకా, ఆ సరదా పోయింది. అలాగే నాకు కూడా హాల్లో కామెంట్స్ చేస్తూ, విజిల్ కొడుతూ సినిమా చూడాలని ఎప్పటిదో కోరిక. ఈ కరోనా వల్ల థియేటర్స్ మూతబడి, ఇలా ఇంట్లో మ్యాట్నీ అయిడియా వేసారు మీ బావగారు. ఊరిలో ఇలా ఎంజాయ్ చేస్తూ సినిమా చూడాలనే ఆయన సరదా, విజిల్స్ కొట్టాలనే ఎప్పటి నుండో నా తీరని కోరిక, ఇలా మీ బావగారి మ్యాట్ని ప్రోగ్రాం తో వారం వారం తీరుతోంది.” అంటూ హాయిగా నవ్వేసింది.
రామకృష్ణ కూడా తన అక్క నవ్వుతో శృతి కలిపాడు. మ్యాట్ని వీరుడు ముసిముసి నవ్వులు న్యూస్ పేపర్ లోకి దూర్చాడు!
“ఓంఢ్ర పెట్టడం మానేస్తున్నాను!” పత్రికా ముఖంగా ప్రకటన చేసింది “న ఓంఢ్ర గార్ధభ”! ఇలా ఒక గార్ధభం ప్రకటన చెయ్యడం మొదటిసారి అవడంతో జనావళిలో కలకలం రేగింది. సహగార్ధభాలన్నీ ఈ నిర్ణయానికి విస్తుబోయాయి. కొన్ని యుగాలుగా ఇటువంటి వైపరీత్యం ఎరుగని జంతుజాలం అంతా కలిసి అసలు ఈ విషయం అంతు చూడాలని బయలుదేరాయి.
ఒక పెద్ద మైదానంలో సభ కొలువు తీరారు. సభావేదిక మీద, “నఓంఢ్ర ప్రతిజ్ఞా పాలన చేస్తున్న గార్ధభం గారు ” మాత్రమే ఉన్నారు. ఎదురుగా ఎడమ ప్రక్క స్వజాతి గుంపు, కుడి ప్రక్కగా నానాజాతుల సంఘటిత గుంపులు కూడి ఉన్నారు. స్వజాతి గుంపు ఆతృత గా ఎదురు చూస్తుంటే, మిగిలిన జాతులన్నీ ఇప్పుడు జరగబోయే సభలో తమ ధృక్పధం ఎలా తెలియచెయ్యాలో మంతనాలు చేస్తున్నాయి.స్వజాతి గార్ధభాలు కొన్ని, ఈ నఓంఢ్ర గార్ధభకి బేషరతుగా మద్దతు పలకాలా? లేక అంశాలావారీగా మద్దతు తెలియచెయ్యాలా అని తర్జన భర్జన పడుతున్నాయి.
కొన్ని పెద్దరికం గార్ధభాలు గుంపు, గంభీరంగా తోకలు ఊపుతూ, మెజారిటీ ఎటు ఉంటే అటు దూకే ఆలోచన బయటపడనివ్వకుండా 30 డెసిబల్స్ మించకుండా ఓంఢ్రిస్తున్నాయి. పరువంలో ఉన్న పిల్ల గార్ధభాలు, “ఓంఢ్ర పెట్టడం తమ జన్మహక్కు, దానికి త్యజించడం అంటే జాతి అస్థిత్వం కోల్పోవడమే” పెద్ద ప్లకార్డులు తోకలకు కట్టుకుని అటుఇటు ఊపుతున్నాయి. “సభా మర్యాద, సభా మర్యాద?”, అంటూ వాటిని హెచ్చరించబోయిన గంభీర గార్ధభాలని వారించాయి కొన్ని సమయస్పూర్తి గార్ధభాలు, “ఈ సభ అయిపోయేవరకు వాటిని అలా ఊపుతూ ఉండనివ్వండి, ఈ గుంపులో కొద్దిగా గాలాడుతుంది” అంటూ.
వారు ఇవ్వబోయే సందేశం కోసం ఎదురు చూసి చూసి, శోషవచ్చ్చి సోలిపోయిన కొన్ని అర్భక గార్ధభాలు, పక్కనే ఉన్న సోడా కొట్టుని ఆశ్రయించాయి.
నానాజాతి గుంపులలో కొన్ని జంతువులు అక్కడికి వినోదం కోసం వస్తే, కొన్ని వేట కోసం వచ్చాయై. బాగా ట్రెయిండ్ అయినవి కొన్ని వేగుల్లా పనిచేయడానికి, కొన్నేమో ఊరికే ఆరుబయట తిరగే బదులు, ఇక్కడకొస్తే ఏమైనా చిరుతిండి దొరకచ్చేమో అన్న ఆశతో, కొన్నేమో మావాటితో మేము, మాకు అజెండా ఏమీ లేదు మా జాతి జెండానే ముఖ్యం అనుకుంటూ ఈ సభలో దూరిపోయాయి.
గలగలలు, గొణగొణలు, గుసగుసలు, కీచుగొంతులు, మౌనముద్రలు, హుంకరింపులు, అదిలింపులు, బెదిరింపులు, లాలింపులు, కేరింతలు, గావుకేకలు, పెడబొబ్బలు, ఘర్జనలు, వెక్కిరింతలు, పలకరింపులు, చీత్కరింపులు, అలా అలా అన్ని రకాల ఇంపులులో స్టేజీ మీద ఉన్న “న ఓంఢ్ర గార్ధభ” ని పట్టించుకునేవాళ్ళే లేకపోయారు.
ప్రేక్షకులందరి దృష్టి తనవైపు మరల్చుకోవాలనుకున్న తపనతో “సైలెన్స్” అని మైకులో అరవాలనుకున్నా కానీ, ఆ ఓంఢ్రింపు కూడా వ్రతభంగమే అవుతుందని, ఏమీ చెయ్యాలో తెలియని దిక్కుతోచక దిక్కులు చూస్తూ ఉండిపోయారు “న ఓంఢ్ర గార్ధభ” గారు.
ఇవాళ పొద్దున్నే పెద్ద తప్పు జరిగిపోయింది! అంటే నాలాంటి పెద్ద మనిషి చేసే తప్పు అని చిత్రీకరించచ్చు!
నా దృష్టిలో తప్పు చిన్నదే కానీ మా ఆవిడ దృష్టిలో చాలా పెద్దది.
పొద్దున్నే నాలుగున్నరకి కాకికంటే ముందు లేచి మా ఆవిడ నిద్ర లేచే సమయానికి సర్ప్రైజ్ ఇద్దామని ఒక బర్నర్ మీద పాలు కాస్తూ ఇంకో బర్నర్ మీద నీళ్లు వేడి చేసి కాఫీ ఫిల్టర్‌లో పోస్తుండగానే, పక్కనే ఉన్నా కదా అని స్టవ్ హై లో పెట్టా అందుకని ఉన్నట్టుండి ఒక్క క్షణంలో పాలు పొంగిపోయి వరదలా పారాయి! చూడుడు మొదటి ఫోటో!
పాలు పొంగితే తర్వాత జరిగే శుభం మాటేమో కానీ ఇంకాసేపట్లో మా ఆవిడ నిద్ర లేచాక…
అమ్మో తలుచుకుంటేనే…
వెంటనే నా తక్షణ కర్తవ్యం ఏమిటి అని ఆలోచించాను. ఏముంది హంతకుడు హత్య చేసిన వెంటనే రక్తం మరకలని శుభ్రంగా తుడిచేసినట్టు పొంగిపోయిన పాలని తుడిచేసేయడమే.
వెంటనే ఒక పాత గుడ్డ తీసుకొచ్చి పాలని సుబ్బరంగా తుడి చేశాను. స్టవ్ ఎత్తి దాని కింద ఉన్న పాలను కూడా. పొంగిన పాలన్నీ ఓ గిన్నెలో పిండితే గిన్నె మొత్తం నిండిపోయింది. చూడుడు రెండవ ఫోటో!
పొంగిన పాలని తుడిచాను గాని పాలు కొంచెం తక్కువ ఉన్నట్టుగా ఉందేమిటని మా ఆవిడకి అనుమానం రాకుండా ఎన్ని పాలు పొంగాయో అన్ని నీళ్లు పాలలో కలిపేసాను. ఆవు పాలు ఎటు తిరిగి పల్చగానే ఉంటాయి కదా? అయినా మీ పిచ్చి కానీ పాలల్లో నీళ్లు కలిపే అమ్ముతారుగా?
తర్వాత మా ఆవిడ కాఫీ ఇచ్చినప్పుడు మన మీద అస్సలు అనుమానం రాకుండా “ఏమిటో ఈమధ్య పాలు మరి పల్చగా ఉంటున్నాయి? కొంపతీసి ఆవులు నీళ్లు ఎక్కువ తాగుతున్నాయా ఏమిటి?” అని ఓ కుళ్ళు జోక్ వేస్తే సరి.
హత్య అనంతరం అన్నీ శుభ్రంగా తుడిచేసి హంతకుడు చల్లగా జారుకున్నట్టు నేను కూడా మార్నింగ్ వాక్ కి వెళ్ళిపోయాను మా ఆవిడ ఇంకా నిద్ర లేవడానికి ముందే.
రోడ్డు మీద నడుస్తున్నానే కానీ ధ్యాసంతా మా ఆవిడ మీదే! ప్రేమతో కాదండోయ్! ఎందుకో విజ్ఞులైన పాఠకులకు ఈపాటికి తెలిసే ఉంటుంది.
సరే మొత్తానికి ఓ గంట పాటు కాళ్ళీడ్చుకుంటూ నడిచి ఇంటికొచ్చి హాల్లో సోఫాలో యధావిధిగా కూలపడ్డాక మా ఆవిడ కూడా యధావిధిగా కాఫీ ఇచ్చింది. హమ్మయ్య ఆవిడ కంట పడలేదు మనం చేసిన వాళ్ళ దృష్టిలో గోహత్యా సమాన అపరాధం.
నింపాదిగా కాఫీ అలా తాగడం మొదలెట్టానో లేదో క్యూములోనింబస్ మబ్బు బరస్ట్ అయినట్టు హఠాత్తుగా ED ఎంక్వయిరీ మొదలయ్యింది.
“ఏమిటి. పొద్దున్నే పాలు పొంగించినట్టున్నారు?” పాలు పొంగినట్టున్నాయి అని అడగలేదు. నోట్ దిస్ ఫైన్ పాయింట్ యువర్ హానర్! అంటే మనల్ని అపరాధిగా నిర్ధారించేసినట్టే. ఇదేం అన్యాయం. కాస్త ఇన్వెస్టిగేషన్. కూసింత ఇంటరాగేషన్ అయ్యాక వాదోపవాదాలు విన్నాక సాక్షాధారాలు పరిశీలించాక చేయాల్సింది ఇలా వెంటనేనా.
హతవిధీ! రక్తపు మరకలు, వేలిముద్రలు లేకుండా హంతకుడు తుడిచినట్టు శుభ్రంగా తుడిచానే. ఇలా ఎలా దొరికిపోయాను. ఎంత పెద్ద మేధావి అయినా చిన్న తప్పు చేసి పోలీసులకి దొరికిపోతాడని విన్నా! కానీ నేను చేసిందే చిన్న తప్పు! అది దొరక్కుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నానే? కొంపతీసి అలా వంటింటి గట్టు తుడిచిన పాత గుడ్డ అక్కడే కంగారులో వదిలేసానా ఏమిటి? అలవాటు లేనివాడు మొదటిసారి హత్య చేస్తే ఇట్లాగే దొరికిపోతాడు!
ఇక్కడే ఇంకో చిన్న తప్పు జరిగింది.
అదేమిటంటే నేర ప్రవృత్తి ఉన్నవాడు ఇంటరాగేషన్ లో సమాధానాలు చెప్పే విధానం వేరే ఉంటుంది. “తెలీదు. గుర్తులేదు. మర్చిపోయాను” అలా అన్నమాట! కానీ నాలాంటి పెద్ద మనుషులు, పెద్ద మనసున్నవాళ్ళు ఎప్పుడో ఓ చిన్న తప్పు చేస్తే ఇంటరాగేషన్ మొదలవ్వక ముందే తప్పు ఒప్పేసుకుంటారు. గిల్టీ ఫీలింగ్ మరి.
అందుకని ఆవిడ అలా ప్రశ్న వేయగానే కరుడుకట్టిన నేరస్థుడు అయితే “పాలు పొంగడం ఏమిటీ” అనో లేదా “పాలు పొంగాయా? నాకు తెలీదే?” అని ఎదురు ప్రశ్న వేస్తాడు. అఫెన్స్ ఈజ్ ది బెస్ట్ డిఫెన్స్ అన్నట్టు. మనబోటి వాడు దొరికిపోతామేమోనని గంట నుంచి పైకి కనిపించకుండా లోపల్లోపల వణుకుతున్నప్పుడు ఇలా భార్య నిలదీస్తే కరచరణాలు ఆడక బుర్ర పని చేయక పుసుక్కున దొరికిపోతాం. ఎలా అంటే ఇదిగో ఇలా!
“ఎలా తెలిసింది” అన్నా “ఎలా తెలుసుకున్నావు” అని మనసులో అనుకున్నా. ఈ ఆడవాళ్ళకున్న అతీంద్రియ శక్తులు అనంతం!
నేనలా జవాబివ్వగానే తేలిపోయిందిగా మనం భారీగా పాలు వంటిల్లంతా వరదలా పొంగించామని.
ఇహ తప్పు తేలిపోయాక ఏముంది కోర్టులో అయితే జడ్జిమెంట్! ఇక్కడో “జన్మానికో శివరాత్రి అన్నట్టు అమావాస్యకో పౌర్ణమికో పాలు కాస్తే పొంగాల్సిందే! చిన్నపని కూడా సరిగ్గా చేయలేరు కదా….. …. ” అంటూ జాతిని ఉద్దేశించి ప్రసంగం!
అన్నట్టు ఇవాళ కాకతాళీయంగా పౌర్ణమి!
కాసేపయ్యాక ఎలా దొరికానో ఏవన్నా ఆనవాలు దొరుకుతుందేమోనని ఆవిడ లేని సమయంలో వంటింట్లోకి వెళ్లి పాల గిన్నె, పరిసరాలు అపరాధ పరిశోధకుడిలా పరీక్షించా! వెంటనే దొరికింది. నేనెలా దొరికానో అన్న దానికి నిదర్శనం. గట్టు, స్టవ్ అతి జాగ్రత్తగా తుడిచాను కానీ పాల గిన్నె చుట్టూ పొంగిన పాలు చేసిన మరకలు మరిచా! చూడుడు మూడవ ఫోటో!
ఇంత చిన్న తప్పు చేసి అన్ని మాటలు పడ్డాక కనీసం సాయంత్రం లోపల ఏమన్నా శుభవార్త వింటే బాగుండును. క్లయింట్ నుంచి రావాల్సిన పెద్ద చెక్ వస్తుందా ఏమిటి? అప్పుడు ఎంచక్కా ధైర్యంగా మా ఆవిడతో “చూసావా? పొద్దున్నే పాలు పొంగించానని ఆడిపోసుకున్నావు. ఇప్పుడు చూడు ఏం జరిగిందో? మొగుళ్ళు కూడా అప్పుడప్పుడూ కూసింత మంచి పనులు చేస్తూంటారు. మీరు గమనించరు అంతే” అని నేను పగ తీర్చుకోవచ్చు!
ఇవి పలక, బలపాలు. అంటే, మనం ఒద్దూ, నా మనస్తత్వానికది పడదూని ఎంత మంచితనంగా చెప్పినా, కాదూ, నువ్వు వెళ్ళాలమ్మా, ప్లీజ్‌రా అని మనల్ని మొండితనంగా చీపురుకట్టతోటో, మూల కాడున్న కర్రతోటో, ఏడ్చి పోతూంటారే? బడి. అందుకోసం.
ఆ బళ్ళో పడిపొయ్యాక, మన పేరూ, నాన్న పేరూ, ఎన్ని రాసినా అయిపోని తెలుగష్చరాలూ, క కొమ్ము దీర్గమిస్తే కూ చుక్ చుక్… గుడింతాలూ, ఏబీసీడీ ఇంగ్లీషు బర్లూ ఇవ్వన్నీ రుద్దుకోనీకి ఉండేదే, పలక.
అసలు బడికి పొయ్యేకంటే ముందు మనకి ఆషాబ్యాసం చేస్తారు. మనవేమో నాన్నో, తాతో ఎవురో ఒళ్ళో కూచుని వనమోహినీ, షీ వాజ్ హియర్, షీ ఈజ్ ధమాల్ అని చక్కగా దిద్దబట్టేదన్నమాట. ముంగట్నే ఇవ్వన్నీ బాగా నేర్చేసుకుంటే రేపు బడికి పోయాక ఇంక ఇట్టాంటివి తెలుసుకునేది శానా తేలిక.
ఈ పలకలు పెద్దబజార్లో సుబ్బారావు దుకాణంలో కొనుక్కోవాలి. నాన్నతో కంటే చిన్నన్నతో పోయింది మేలు. అడగకుండానే పెద్ద పలక కొనిపెడతాడు. అమ్మా నాన్నయితే, చిన్నవాడివి కదా, చిన్న పలక చాలు అంటారు. పొద్దునేమో పెద్దయినావు, రేపట్నుండీ బడికి పోవాలన్నదీ వాళ్ళే. ఇప్పుడేమో చిన్నవాళ్ళకి చిన్నపలక అనేదీ వాళ్ళే. అంతా మోసం.
పలకలు పలు రకాలు. మనం మామూలు రకం కొనుక్కుంటాం. నాలుగు పక్కల చెక్కలు, మజ్జన పలక. మట్టితో చేస్తారంట. నునుపుగా ఉంటాయి. నువ్వు పలక పైమీదని తూ అని ఉమ్మూస్తే అది చక్కంగా కింది దాకా కారుకుంటూ రావాలిమాట. మనది మంచి పలక అవునో కాదో తెలిసిపోతుంది. ముందే చూసి పెట్టుకోవాలి. మనం చిన్న పిల్లలు, ఏం తెలీదని సుబ్బారావు పిచ్చి పలకలు మనకి అమ్మి, మంచివన్నీ అట్టే పెట్టుకుంటాడు. చింతాగాడు చెప్పాడు నాకు.
కానీ, నేను కొనుక్కునేప్పుడు తూ అనబోతే, చిన్నన్న ఏం పన్రా వెధవా, అని నెత్తిమీద ఒక్కటిచ్చి పలక లాక్కుంటాడే! తెలీపోతే అడగాలి కానీ… నేనే ఇంకా చెప్పా. నువ్వు కూడా దబ దబా రెండు పలకలమీద ఉమ్మేమని. ఏడిశావులే. నోరుమూసుక్కూచో, అని నన్నే అనటం, పైగా. ఈ పెద్దవాళ్ళకసలకేం తెలీదురా. మనకే ఎక్కువ తెలుసని మనం చెప్పినా వినరు. ఎందుకంటే, కుళ్ళు! ఎట్లన్నా, చింతాగాడికి ఇట్లావన్నీ చాలా విషయాలు తెల్సు. తరవాత వాడే ఉమ్మేసి చూసి, పరవాలేదురా, మంచి పలకే అన్నాడు.
వేరేవాళ్ళ పలకలు రేకువి. అవి అస్సలే బరువే ఉండవు. ఇంకానేం, వాటిలకి ఒక పక్క నలుపు, రొండో పక్క ఇటికి రంగు, ఆకు పచ్చ రంగు ఇట్లా. ఒక్కోవాళ్ళు ఫ్లాష్టీకు పలక కూడా తెచ్చుకుంటారు. దానికి చుట్టూ కూడా ప్లాష్టీకే. పైన బొమ్మలు కూడా ఉంటాయి. కొన్నిటికైతే కొద్దిగా చోటు వరకూ పలక ఉండదు. ఆ ఖాళీలో సువ్వలు పెట్టుంటాయి, వాటికి రంగుల్రంగుల పూసలు. ఒక సువ్వకి ఒక పూస, రెండోదానికి రెండు పూసలు, మూడోకి మూడు… పది దాకా. పలక ఊపితే పైకి కిందికీ ఎగుర్తా, పిచ పిచమని చప్పుడు కూడా. బలేగుంటాయిలే. సుశీలా టీచరుగారబ్బాయి సామియలు ప్రెసాదుకుండేది. మనింట్లో అవన్నీ కొని పెట్రుగా అయినా.
సరే పలక కొనుక్కున్నాక బలపాల పొట్లం కూడ కావాలగా. మర్లేకుంటే రాసేదానికి ఎట్లా? పొడూగ్గా మన మోచెయ్యలో సంగమంతుంటాయి. వీటిల్ని కూడా మట్టితోనే చేసేది. పలకలేమో తారునీళ్ళల్లో ముంచుతారు. అందుకే నల్లగా ఉంటాయి. బలపాలు ముంచరు. అందుకే అవి మట్టిరంగు!
ఇక్కడ బొమ్మలో ఉన్నాది పాల బలపం! ముగ్గు బలపం, తెల్ల బలపం… అన్నీ ఇదే. వీటిట్లోనే పిండి బలపం, సుద్ద బలపం అని ఇంకొద్దిగ ఫైనర్ క్వోల్టీ. పట్టుకునేదానికి, రాసేదానికి మెత్తటివి. తినేదానిగ్గుడక ఇవే బాగుంటయి. కాస్త ఉన్నోళ్ళ షోకు పిల్లులు, ఇట్టాంటివి తెచ్చుకునేవాళ్ళు.
రంగు బలపాలు మళ్ళా ఇంకో వేరే రకం. ఒక్కోమారు ఒకే బలపంలో రెండు రంగులు; ఎరుపు, తెలుపు. అట్లే నాలుగు కూడా. రంగు పలకలూ, రంగు బలపాలూ ఇట్టాంటివి శానా రిచ్చిఇండ్ల పిల్లల దగ్గరనే అవుపడేది. రిచ్చంటే, పిర్రకతుక్కునే స్టెచ్చి నిక్కరూ, పచ్చచారల మెరుపు చొక్కా తొడుక్కోని కాలరు దగ్గరి పైగుండీ కూడా పెట్టుకునేవాళ్ళు ఉంటారే. వాసన నూనె, బెల్టు బూట్లు…
ఒక్కో ఊర్లో వేరే పిల్లగాళ్ళు మన బలపాల్నే కణికెలంటారు.ఇంకోవాళ్ళు పలకపుల్లలంటారు. నాకు అప్పుట్లో బలే కోపం. మన బలపాన్ని ఎవుడిష్టం వొచ్చినట్లు పిలిచేందుకు వాళ్ళెవరూ? మన్ని అడిగే పనిగూడ లేకుండా?!
నేనూ, గురవారెడ్డీ, చింతాగాడూ, గోలీ, జమాలూ, ఇంకా మావన్నీ మామూలు పలకలు, బలపాలే. బళ్ళో డిక్కేషన్ చెప్పినప్పుడూ, ఛ ఛా ఛి ఛీ అనుకుంటూ గుడింతం రాయటం, ఏడో ఎక్కం, అన్నీ పలక మీదే. ఒక్కోసారి వొంద ఒంట్లు ఇంటికాడ రాసుకరామనేవాళ్ళు. అన్నీ రాసి పొద్దున బడికి పోయి టీచరుగారి బల్లమీద పెట్టేప్పుడు చూస్తే సగం చెరిగి పోయో, అలికిపోయో ఉండేవి. పలకమీద తెలుగు వాచకం, ఎక్కాలబుక్కులన్నీ పెట్టి భుజం మీద పెట్టుకు పోయినప్పుడు రాసినవన్నీ తుడుపుకు పోయినాయన్నమాట.
మళ్ళీ టీచరుగారు కొట్టకుండానే ఏడ్చుకుంటూ అవన్నీ తిరిగి రాయటం! అన్నీ చూసాక టిక్కులు పెట్టినవి మానేసి, ఇంటూలు పెట్టినవి మళ్ళీ ఒకోటీ పదిమాట్లు రాసి చూపీటం. వేళ్ళు నెప్పి పుట్టిందాకా ఇదే పని. బళ్ళో వేరే కూడా రాసేదుండేది. అందరూ పలకలు బాగా తుడిచేండ్రా అనేవాళ్ళు. ఉట్టుట్టినే తుడుపుతే పోదుగా? చేతిమీదా, కాలిమీదా చెమట పడితే, పలకకి రుద్ది తుడపొచ్చు. కొంతమందేమో తెలీక పలకమీద ఉమ్మేసి తుడిచేవాళ్ళు.
రవణగాడు కూడా అలా చేస్తే నేనే చెప్పా. పలక సరస్పతీదేవిరా, కళ్ళు పోతాయి. దేవుడి మీద ఉమ్మేసి తుడుస్తే చదువురాదు నీకని. వాడు ఏడ్చాడు. చదూకోపోతే మా అమ్మ తంతానందిరా… పలక తుడవటానికే చేసా, ఇప్పుడెలా అని? కళ్ళకద్దుకోని, దణ్ణం పెట్టుకోని, చెంపలేసుకో వెదవాయా, ఇంకెప్పుడూ చైనని తల్లితోడని ఒట్టెయ్యి. పలకమీద ఉమ్మకూడదు. మన చొక్కా మీద ఇలా ఉమ్మేసి, దాంతో తుడుచుకోవాలి. నేను చూడు ఎలా చేస్తానో, పాపం తలగకుండా అని నేర్పిచ్చా. వాడికివాళ ఏ కాస్తో కూస్తో చదువబ్బినా, నా పేరు చెప్పుకు దీపం పెట్టుకుంటుంటాడు, సన్నాసి.
ఒకసారేమైందో తెలుసూ? ఒంటి బెల్లప్పుడు అందరూ బైటికి ఉరుకుతున్నాం. గురవారెడ్డిగాడు వాడి పలక కాస్తా తొక్కాడు. ఏం కాలా. ఒక మూల మీద ఆకాశంలో జీడిపప్పు చందురుడల్లే కొంచం పగిలింది. టీచారు కూడా కొట్లే. గుడ్డి వెధవా, చూసుకో నడవలేవూ అనన్నారంతే. అమ్మ అరుస్తుందిరా అని బయపడ్డాడు కానీ వాడికే బాగైంది. రేపు బడికొచ్చేప్పుడులా, ఒక చేత్తో కంతలో వేళ్ళుపెట్టి పలక, రొండో చేత్తో పుస్తకాలు పట్టుకొచ్చాడు. అసలు భుజం మీద నెప్పే పుట్టలే. ఇంటో రాసుకొచ్చింది చెరిగి పోలే కూడా!! భలేగయింది కదా?
వీడిని చూసి చింతాగాడు మనం కూడా చేద్దాంరా అన్నాడు. ఇంటో చూస్తే తంతారని నే వొద్దన్నా. ఒకరోజు వాడే రాయి తీసుకుని పలక మీద ఠాప్పున కొట్టాడు. పలక సగానికి పగిలింది. వాడి వీపు కూడా. బళ్ళో టీచరు గారి చేతిలో సగం, ఇంటో వాళ్ళమ్మ చేతిలో మిగిలిన్సగం! కానీ చూడు, వాడి పనే హాయి. ఊరికి పోతే పెట్టె పట్టుకున్నట్టు, ఆ పగిల్న పలకే ఊపుకుంటూ బడికొచ్చాడు. ముప్పయ్యో, డెబ్బయ్యో పట్టినన్ని ఒంట్లే రాసుకొచ్చాడు. బుక్కు చూసి పాటం రాయమంటే, మేం వొగుర్చుకుంటూ మొత్తం రాయటం. వాడికి సగం పలకేగా. సగం పాటమే రాయటం! జీతాలొచ్చాక కొత్తది కొనిస్తా, అందాకా దీంటోనే రాస్కోమన్నాడండీ మా నాన్న, అని చెప్పాడు టీచరుగారికి. అప్పుడు వాడిని మళ్ళీ కొట్టలా.
నేను మాత్రం గుడింతాలూ, ఏడో ఎక్కం ఐదుసార్లూ అన్నీ పూర్తిగా రాసా, కానీ ఎక్కాలసైడు చెరిగిపోయింది. ఆవాళ బడి దగ్గర తాయెత్తులమ్మేవాడు పాములాడిస్తుంటే చూసి, పరిగెత్తి పోయినా బడికి ఆలీసెం అయింది. టీచరుగారేమో పలక తీసుకురామని, ఎక్కాలేవిరా అన్నారు.
ఒట్టండీ, తుడుపుకుపోయినాయండీ అని నిజం చెప్పా. ఏరా, వీళ్ళందర్తో తిరిగి తోక పెరిగి పోతోందా నీకూ? ఇంటికొచ్చి అమ్మకి చెప్పమన్నావా? తోక కత్తిరించేస్తాను, రాస్కెల్, అని స్కేలుతో రెండు పీకారు.
మొన్నో, ఇంకేదో ఈమధ్యనో ట్విట్టర్లో ఒక మెసేజ్ చూసా. నువ్వు చిన్నప్పుడు టూత్‌పేస్టు ట్యూబు చివరికంటా నొక్కి వాడావా, సబ్బంతా అరగదీసాక మిగిల్న ముక్క కొత్త సబ్బుకతికించావా, బొగ్గుల బాయిలర్‌లో వేణ్ణీళ్ళు కాచుకున్నావా, సరుకుల కొట్లో బెల్లం ముక్కడిగావా, కిరసనాయిలు కోసం క్యూలో నించున్నావా… ఇలా. ఇవన్నీ చేసుంటే నువ్వు డెబ్భైలు ఎనభైల్నాటి మిడిల్ క్లాసు తెలుగోడని అర్థం! నవ్వొచ్చింది. ఆశ్చర్యం కూడా! ఏడిసినట్టుంది. ఇవన్నీ చెయ్యనోడూ, సినిమాల్చూడనోడూ తెలుగు నేల మీద పుట్టటమెందుకూ?
అసలు వీటన్నిటికన్నా మిడిలెస్టు క్లాసు కథ అప్పట్లో ఇంకోటుంది, చెప్పనా..? పండగనో, బళ్ళు తెరుస్తుండంగాన్నో కొత్త లాగూ చొక్కాలు కుట్టీటం. దీ వరస్టంటే అదే!
ఎదిగే వయసు, ఊరూర్కెనే బట్టలు చిన్నవైపోతాయని, బాఘా దిట్టంగా ఐదులో తొడుక్కున్న లాగూయే ఎనిమిదిలో కూడా సరిపోయేట్టు; మోకాళ్ళకి నాలుగించీలు కిందికీ, నడుం ఎనిమిదంగుళాలు ఎక్కువుండేట్టు ఇంత పెద్దగా లుడంగం మోస్తరు కుట్టీటం.
ఈ విషయంలో అమ్మలన్నీ ఉత్తర కొరియా నియంతలకన్నా కనాకష్టం! ఇదిగో, తీరా షాపుదాకా వెళ్ళాక ఈ బడుద్ధాయి గునిసాడనో, ఫాషనుగా లేదన్నాడనో రెడీమేడు లాగూల్లాగా తొడల్దాకా టైటుగా కుట్టిచ్చేరు గనక. అయినా అంతంత పోసి కొని, సంక్రాంతిక్కుట్టిచ్చినవి శివరాత్రికే పొట్టివైపోతే ఏవిట్సుఖం? బట్ట దండగా కుట్టుకూల్దండగా తప్పిచ్చీ, అని పెద్దంతరం చిన్నంతరం యంతమాత్రవూ పాటిచ్చకుండా, యావండీగారంటే శ్రీ. ప్రత్యక్ష D అన్న సంగతి కూడా పట్టిచ్చుకోకుండా తమ యజమానిగారిమీన్నే ధాష్టీకం! ఇక మనకీ మనోబీగార్లనేకవుంటాయనీ, సాటి మనిషిగా మన చొక్కాలాగూలు ఎలా వుండాలన్నది మన పెరసన్లనీ విషయం అసలు ఎరగనట్టే ఉంటాయవి. (అవంటే మొత్తంగా అమ్మలన్నీ అంతే!) చిన్నవయసులోనే జై ఆంధ్ర ఇంకిలాబ్ జిందాబాద్ అని గట్టిగా మనసులోనే అరిచావంటే, అందులో నీ తప్పేం లేదన్నమాటే.
సరే, ఎంతేనా మననాన్న కదా మన పక్షం వుంటారన్నమ్మేవో, ఖాళీయే. ఆయనేవోఁ, కుట్టీమన్నదొకరూ, కుట్టేవాడింకొకడూ, తొడుక్కుతిరిగే చెవలాయ వీడొకడూ, మజ్ఝిన మనకేలన రొష్టనే మెట్టవేదాంతం మాటునో, లేక మొన్న హాఫెర్లీకి లెక్కల్లో పంతొమ్మిది మార్కులే వొచ్చాయిగనుక వీడికీ శాస్తి జరిగి తీరాల్సిందనే అన్డాడీ లైక్ నిర్దాక్షిణ్యం వల్లనో, మన్ని దీ న్యూ ఫాషన్ టైలర్స్ అనబడే వీరయ్య కొట్లోకి తీసుకెళ్ళి ఇదిగో చొక్కా లాగూ గుడ్డలని వాడికిచ్చేసి, మన్ని వాడి ముందుకు తోసేసి, ఏదో రేపే దాఖల్చెయ్యాల్సిన యమర్జెంటు కోర్టు కాయితాల్చదూతున్నంత పోజుగా నిన్నటి ఆంధ్రప్రభో, మొన్నటి ఈనాడు సంపాదకీయం వెనకో దాక్కోటం!
ఈవీరయ్యగాడున్నాడే.. పరమ నాస్టీఫెలో. అసలు వీడో టైల్రే కాదు నన్నడిగితే. చెవులో ఒకేపు నీలం ఇంకో వైపు ఎరుపూ ఉంటాయే, అట్టాంటి రెండు రంగుల పెన్సిలు, మెళ్ళో కండవా రీతిన టేపూ తగిలిచ్చుకోని, వెధవ పోజు మళ్ళీ! మనం, చొక్కా నడుంకి ఒక్క అంగుళం కిందికీ, లాగూ మోకాలుకి రెండంగుళాలు పైకీ ఉంచాల్రా అని ముందే సీక్రెట్టుగా ఇన్ట్రష్షన్ ఇస్తామా, ముందంతా పరమ నైసుగా, నాకు తెల్సు కదా బాబూ అంతా కొత్త ఫాషనుగా కుట్టి పెడతాగా, లాగూ ఎనికిట జోబు కూడా ఉంటాది నీకెందుకు చూడంటాడా, నాన్నొచ్చి మరీ అంత పైకేంటయ్యా ఎదిగే పిల్లాడు కదా అనంగాల్నే టేపు ఏడంగుళాలు సర్రున కిందికి జారుస్తాడు… మాట నిలకడలేని కుంక!! ఇంక లాగూ కొలతలు. రామ రామ! అది వాడి నడుమూ మన్నడుమూ కలిపి కొలిచేసి, ఈ మాత్రం చాల్లెండి అయగారూ, కాళ్ళకాడ మాత్రం ఒక రెండంగుళాలు ఇదిగో ఈ మాత్రముంచీ, ఇంకొంచం లోపటికి మడిచి కుట్టేస్తా. నడుమూ, కాళ్ళూ ఇంకా ఎక్కువ కొలతైతే బాగా లూజయిద్దని మనేపు చూసి కన్నుమలపటం, అక్కడికేదో మనల్ని ఉద్ధరిచ్చినట్టు. డబ్బు కోసం గడ్డితింటవంటే ఇది కదూ… దొంగ భడవ.
రెండోసారి కూడా మనం వెళ్ళి అడిగిన ఆర్రోజులకి ఆ లాగూలు మన్చేతికి రావటం. ఎలా ఉన్నా, ఇవి కొత్తవీ అచ్చంగా మనవీనన్న ఆదర వాత్సల్య సంతోషాది భావాలతో చిరునవ్వు మన మొహాన విరబూస్తుండగా, ఇంటికెళ్ళి ఆ కొత్త వలువలు తొడుక్కునే ప్రయత్నం! అద్గద్దీ విషయం… సరిగ్గా అక్కడొస్తుంది, శాక్యమునికొచ్చినంత జ్ఞానం, మనకి కూడా!
జేబులో చేతులు పెట్టుకున్నా సరే, నీపాదాల చెంత నాకు చోటివ్వు దేవదా అని కాళ్ళంటుకున్న పారోకిమల్లే, ఆ లాగూ లంపటం మనం నించున్నకాడి దక్షిణం వెంపు జారిపోటమే కాని పైకిరాన్దే!! మరిహను దాన్తోటి జనబాహుళ్యంలోకి మనవంటి సిగ్గరి, పరూగల్లా మోమాటస్తుడుగారెలా రాడవంటే, దానికి మరో నీచతుచ్ఛత్యంతమర్రేత్తక్కూపాయవోటి మనం గుడ్లనీళ్ళు కక్కుకుంటూ డెబ్భైమార్లు ఛీయన్చిందుల్తొక్కినా సరే, ఏడిశావులే కుంకాయా, చొక్కాకిందనుండేదానికెలా ఏడుస్తే ఏం, దానికింతేడుపేవిటనంటూ, అటో రెండూ ఇటో రెండూ పిన్నీసులు పెట్టడం!
దీనికన్నా అధ్వాన్నం మనకంటే ఓ రెండేళ్ళో మూడేళ్ళో ముందు పుట్టినందుకు అదో పేద్ధ అక్కగారైనట్లు మనమీద అక్ఖలేని అధికారజులుం ప్రదర్శించే అక్కరాక్షసిలుంటాయే, వాటి వెలిసిపోయిన పచ్చరిబ్బనో, మాసిపోయిన తెల్ల పీటీ యూనీఫాము రిబ్బనో మన లేని నడుం నెప్పెట్టీదాకా బిగిచ్చీ, ఇహపో వెధవాయా అని మనల్నే కసురుకోని బడికి పంపీటం!
వీటన్నిటికంటే అతి దారుణ పరమభయంకర ఒవరికీ చెప్పుకోలేని మజ్ఝాతిమజ్జతరగతి ఓటుంటుంది. అంటే, నీ లాగూ జారిపోతుంటుంది కదా. దాని కోసం, నీ మొల్తాడిప్పి దానికి ఒక నులకతాడు ముడేసి లాగూ బిగిచ్చటం. లాపోతే మీ అన్నయ్య పైజామానో అక్కయ్య పరికీణీయో చిరిగిపోయేకా ఆ బొందు (చదూరానోళ్ళు నాడా అంటార్లే..) దాచి పెడుతుందిగా మీ అమ్మ! బట్టల బీరువాలో ఏ మూల్నించో దాన్ని తెచ్చి గుండ్రాయితో నాలుగు మోది ఓ మూరెడు ముక్క తెగ్గొట్టి అదేసి నడుంకి కట్టటం!
నువ్వొళ్ళు పొగర్తోనో, శ్ట్రాటజీ ప్లానింగుల్లో వీకు అయినందువల్ల అగ్నానంకొద్దీ ముందస్తుగా ఒకటో కాసినో అక్కల్నీ అన్నల్నీ సంపాయిచ్చుకున్నాక వెళ్ళితే ఒక్కగానొక్క ఆఖరి కొడుకన్న మర్యాదా గౌరవం గారాబం దక్కుతాయన్న రాంగ్కాల్క్లేషన్తో తాపీగా మరికాస్త సోమరసం, మరొక్క రంభ డాన్సు అనుకుంటూ లేటు చేసావో, తరవాత అతి తీవ్ర దుఃఖద పరిణామాలుంటయి. తస్మాజ్జాగర్త.
నీ జారిపోయే లాగూక్కట్టిన రిబ్బనూ, నులకతాడూ చూసి నీ మీదాళ్ళెవ్వరూ నీమీద్జాలి పడరు. మొహం గంభీరంగా పెట్టటం అంతా వుట్టుట్టి నటన. అటుతిరిగి ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ, ఏదో పుట్టిములిగిపోతున్నట్లు పెరట్లోకి ఉరికి కసిగా నవ్వుతుంటారు. పాపం వెర్రి వెధవ, మరీ ఏంటమ్మా, లాంటి ఒకటో అరో వాక్యం వినిపించినా దాంట్లో హానెష్టీ శాతం ఎంతన్నది, ఆవెంట వినపడే వికటాట్టహాసాల తీవ్రతను కూడా పరిగణనలోకి తీసుకుని నిర్ణయించుకో.
మజ్ఝతరగతి మిడిలు క్లాసిళ్ళల్లో ఏకైక చివరాఖరి మగపిల్లడై పుట్డవంత దుర్భర భయానక సీను అగ్గిరాముడు సినిమాలో కూడా ఉండదు! మగాడై పుట్టేకంటే అడవిలో మానై పుట్టటం మేలన్న సామెత విన్లా? యజ్జాగ్ట్లీ ఇందుకే!