Category: అభిప్రాయం, ఆలోచన / Opinion & Views

  • ఒక 40+ ఏళ్ళ సగటు సాఫ్ట్వేర్ ఉద్యోగి కంపెనీకి భారమా ?

    ఒక 40+ ఏళ్ళ సగటు సాఫ్ట్వేర్ ఉద్యోగి కంపెనీకి భారమా ?

    ఇది కూడా తెలుగు కోరా లో ఒకప్పుడు రాసిన చాలానే వ్యూస్ వచ్చిన సమాధానమే

    భారం అన్న బరువైన మాట మాట్లాడారు కదా ఒక చాలా పాత పాట గుర్తుకు వచ్చింది 😉

    ధరణికి గిరి భారమా

    గిరికి తరువు భారమా

    తరువుకు కి కాయ భారమా

    తల్లికి పిల్ల భారమా

    గూగుల్ చేస్తే ఈ పాట విషయాలు ఇలా కనపడ్డాయి

    చిత్రం: మంచిమనసుకు మంచిరోజులు (1958)

    సంగీతం: ఘంటసాల

    గీతరచయిత: సముద్రాల రామానుజాచార్య (సముద్రాల Junior)

    నేపధ్య గానం : రావు బాలసరస్వతి దేవి

    స్ఫూర్తి కలిగించే గానమే కానీ ఈ పాట అంతా ప్రకృతి గురించి వర్ణన కదా (This is all about Nature)

    కానీ మీరడిగిన ప్రశ్నకి సమాధానం మాత్రం వేగవంతంగా రూపాంతరం చెందుతున్న పోటీ ప్రపంచంలో అటు మార్కెట్లు దాంట్లో పోటీ పడే కంపెనీలు (తాటిచెట్టు అంత వాడు ఉంటే దాని తల తన్నే వాడు వేరే వాడు ఉన్నట్లు) అందులో పని చేసే వివిధ స్థాయిలకు చెందిన ఉద్యోగులు ఉద్యోగినులు బృందనాయకత్వ్యం ప్రవృత్తి పై ఆధారపడే విషయం (This is all part of Culture you and I are participating in and shaping everyday)

    నా ఆన్సర్ కొంచం వేదాంత ధోరణిలో కనపడచ్చు – కానీ ఈ ( ఇలాంటి) పరిస్థితులు ఎంతోకాలంగా ఎదుర్కొన్నాను, ఇంకా ఎదుర్కొంటూనే వున్నాను – కాబట్టి నేను ఈ విషయంలో చెప్పగలిగేది ఏంటి అంటే

    బాగా ముగ్గిన పళ్ళని ప్రకృతి లో చెట్టు కూడా అంటి పెట్టుకోదు(అవి ఎప్పుడో అప్పుడు రాలి పోతాయి) కాబట్టి అలాంటి విషయం మనం ప్రైవేట్ కంపెనీ లలో ఒక స్థాయి కి మించి ఆశించలేము. మనం గవర్నమెంట్ ఉద్యోగాలతో ఈ విషయం ఎంత కంపేర్ చేసుకుంటే అంతే ఆశాభంగం మనకు ఎదురు అవుతుంది.

    కాబట్టి మనం ప్రైవేట్ కంపెనీ ఎదుగుదల కి అవసరమయ్యే విషయాలలోనే మన క్రియాశీల వ్యవహారాలు ముడిపడి ఉండేలా చూసుకోవాలి

    మన ఎక్సపీరిన్స్ ఇంకొరికి ఏ విధంగా ఉపయోగపడగలదు అనే కన్నా

    అది ఉపయోగపడేలా నేను నన్ను ఎలా మలచుకోగలను అన్న ఆలోచనే మీకు మీ షెల్ఫ్ లైఫ్ (Shelf Life) పెంచే సాధనం (ఆయా కంపెనీ లోనే కాకపోయినా మొత్తం ఇండస్ట్రీని ఒక ప్లాట్ఫారం గా మీరు భావించగలిగితే )

    ఇది చాలా సులువుగా అయిపోతుంది అని మాత్రం అనను – ఎవరి దారి వారు వెతుక్కోవాల్సిందే (It is definitely an important TRANSITION to make during mid life/career stages)

    నేను 2019 సెప్టెంబర్ లో అమెజాన్ కిండిల్ లో సొంతంగా ప్రచురించిన పుస్తకం (Self Published Self help book) విల్, స్కిల్ అండ్ ఛిల్ల్ (క్లూస్ ఫర్ ఓవర్ కమింగ్ యువర్ ట్రాన్సిషన్ బ్లూస్) (Will, Skill & Chill – Clues for overcoming your transition blues) అన్న పుస్తకం కొంత ముడి సరుకుని అందించగలదేమో? దాదాపు 6 ఏళ్ళ తర్వాత ఈ విషయంలో మరొక అప్డేటెడ్ ఎడిషన్ with over 30% more content (జులై 2025) లో విడుదల చేయడం జరిగింది కూడా

    వంటకపు తయారీ మీ బాధ్యతే సుమీ ! 😉

    1
  • నా పెళ్ళి – నా జీవితం.

    (15-08-2020) పునస్సమీక్ష.

    పెళ్ళి.

    “ఆరోజు అలా చేసి ఉంటే…ఈరోజు ఇలా ఉండేది కాదు, అని మీరు అనుకునే సంఘటన ఏంటి?”
    పొద్దున్న ట్విట్టర్లో వచ్చిన పై ప్రస్తావనకు నా సమాధానం నా పెళ్ళి అని ఇచ్చాను.

    దానికి వివరణ అని కాదు కానీ, కొన్ని భావాలు, అనుభవాలు పంచుకోవడానికే ఈరోజు ఈ రాత.

    చిన్నప్పట్నుంచీ కూడా పెళ్ళి అంటే సదభిప్రాయం లేని మాట వాస్తవం. దానికి తోడు, ఇంట్లో దైవభక్తి, అందుకు సంబంధించిన ఆచార వ్యవహారాలు ఎక్కువగా ఉండడం చేత అసలు పెళ్ళి కంటే దైవభక్తి మార్గమే చాలా గొప్పదీ, ఉపయోగమైనదీ, మానవ జన్మను సార్థకపరచేదీ అని ఇలా రకరకాల అభిప్రాయాలు కలగడమూ, కొండొకచో, కొన్నింటిని కొంతమంది బుర్రలోకి జొప్పించడం కూడా జరిగింది.

    పెళ్ళి అంటే కేవలం పిల్లలూ, సంసారం, బరువూ, బాధ్యతా తప్పించి అందులో మరే ఇతర ఉపయోగమూ లేదని బాగా గట్టిగా అల్ట్రాటెక్ సిమెంటు ముద్రలు బుర్రలో బాగానే పడ్డాయి. పైగా, అటువంటి అభిప్రాయాలకు బలం చేకూరుస్తూ పద్ధెనిమిదో యేటనుంచే ఉద్యోగం చేయవలసి రావడం, కుటుంబ భారం కాస్తంత నెత్తిన పడడం లాంటివి కూడా జరిగాయి. అందువల్ల పెళ్ళి ప్రసక్తి తెచ్చినపుడల్లా అమ్మ మీద కోపం తెచ్చుకునేవాణ్ణి.

    కానీ, “ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులో జరగాలిరా” – “నాకు ఓపిక ఐపోతోంది నేను పూర్తిగా మూల పడితే నువ్వు ఇబ్బంది పడతావురా” ఇవి మా అమ్మ రికార్డులు అరిగిపోయేదాకా వాడగా వాడగా, నిజంగా ఒకానొక సమయంలో ఆవిడ అనారోగ్యం చూసి, ఓహో, తల్లిదండ్రులు పెద్దవాళ్ళవుతూ ఉన్న సమయంలో నేను ఉద్యోగానికి వెళ్ళిపోతే వారికి సహకరించడానికైనా ఇంకొక మనిషిని నేను నమ్మి నా జీవితంలోకి తెచ్చుకోవాలని నాకు కలిగిన ఆలోచన ద్వారా, నేను పెళ్ళికి ఒప్పుకోవలసి వచ్చింది.

    నిజానికి నా ప్రణాళిక ఏమిటంటే, ఉద్యోగం చేసుకుంటూనే దేశం మొత్తం తిరగాలనీ, అందులోని సర్వ జీవరాశులనూ పరికించి, పరిశీలించి, పరిశోధించి అర్థం చేసుకుని, మిగతా ప్రజలందరికీ నన్ను నేను ఉపయోగించే అవకాశాలు వెతుక్కుంటూ, పనిలో పనిగా దేశంలో ఉన్న అన్ని క్షేత్రాలూ, చారిత్రక ప్రదేశాలూ కూడా చూసేసి సంతృప్తి చెందిన పిమ్మట, చివరగా అంత్యకాలంలో, శేషజీవితాన్ని అరుణాచలంలో గడిపివేయాలని నేను నా ఇరవై రెండవ యేట 1995లో నిర్ణయించుకున్నాను.

    అయితే, ఆ నిర్ణయం తీసుకునే సమయానికి, పెళ్ళి అనే విషయంలో భార్యాభర్తల మధ్య గొడవలే కాక ప్రేమలు, త్యాగాలు కూడా ఉంటాయనీ, పిల్లలు అనే రత్నాలు, మోయగలిగే బరువునే కాకుండా మరువలేనంత ప్రేమను కూడా ఇస్తారనీ, టోకు మొత్తంగా చేదు గుళికలే కాక చాలా తీపి జ్ఞాపకాలు కూడా ఉంటాయనీ తెలియదు (మేం ముగ్గురు పిల్లలమూ మా తల్లిదండ్రుల పట్ల అలానే ఉన్నా కూడా, స్వీయానుభవమే గురువు కాబట్టి). తెలిపేందుకు ఇంట్లో ఆ వాతావరణమూ లేదు.

    తర్వాత, పైన చెప్పుకున్న విధంగా పెళ్ళి అయిపోయిన తర్వాత, ఏమేమి ఉంటాయని తెలియదో అవన్నీ ఉంటాయని అర్థమైన తర్వాత, పెళ్ళి కూడా అవసరమేనూ, మనిషి జీవితంలో లెక్కించదగ్గ అనుభవమే అని అర్థమైంది. పెళ్ళి కాకుండా ఉండి ఉంటే, నేను అనుకున్న ప్రకారమే నా జీవితం ఉండేదో లేదో తెలియదు కానీ, పెళ్ళి అయిన తర్వాత కూడా అప్పటి లక్ష్యాలను కొద్దిగా అటూ ఇటుగా సాధించుకోవచ్చని మాత్రం స్పష్టంగా అర్థమైంది.

    నా తమ్ముడు ఆదిత్య ఇంగ్లీష్ లో వ్రాసిన Struggle for Acceptance అనే బ్లాగుపోస్టు కూడా https://twitter.com/vizagobelix/status/1250325190493368321?s=09  ఈరోజే రావడం కేవలం యాదృచ్ఛికమే అయినా కూడా చాలా సమయానుకూలంగా వచ్చిందని సంతోషిస్తూ, జీవితంలో ఎలా వచ్చినదాన్ని అలా అనుభవిస్తూ అనుభూతి చెందడంలోని సంతృప్తిని సంతృప్తిగా స్వీకరిస్తూ..

    ఈరోజు ఈ బ్లాగుపోస్టు వ్రాసేటందుకు కారణమైన  https://twitter.com/avasaramledu/status/1249898596712845312?s=09   ఈ ప్రశ్న అడిగినవారికి కృతజ్ఞతలతో..

    కందర్ప కృష్ణమోహన్.

    0