Author: RaayRao

  • యాదమ్మింట్లా మామిడిచెట్టు

    “వారీ! ఎవల్లల్ల ఆకెల్లి? మీ నోట్లల్లా మన్నుబడ, ఏం గత్తరొచ్చినాదిరా, నాగ్గాన దొరికిండ్రా? బిడ్డా! ఒక్కోనికి బొక్కలిరిపి బొంద పెడ్తా మళ్ళా” యాదమ్మ నోరు సగమూరిదాంక ఇనబడుతుండె.
    “అయ్యా! ఏమాయినే యాదమ్మ? పోరలను బొందలోపెడ్త నంటుంటివి, ఏంజేస్తిరే అంతమాగం?” శాయన్న సర్దిజెప్ప బోయిండు.
    “ఇంగో సూడు శాయన్న! సెట్టు మీద మామిడికాయల్ని బతకనిస్తలేరు, పొద్దాకుల గడ్డలిచ్చుక్కొడుతుండ్రు మంద,  గడ్డలొచ్చి ఇంట్ల పడుతుండే, ఏం జెయ్యాలె, ఆళ్ళింట్ల పీనుగలెల్ల” మళ్ళా తిట్లు సురూజేసింది యాదమ్మ.
    “సాల్దియ్! ఆ తిట్లేంది? ఈ ఆగమేంటిది? సిన్న పోరలు కాయలు కొట్టనీకి గడ్డలిసిరిండ్రని గసుంటి గలీజ్ మాటలేంటిది? ఆళ్ళ నే మందలిస్త గానీ, నువ్ లోపటకు పో యిక, చేసినాగం సాలన్నట్లు” శాయన్న అరుపులకి యాదమ్మ ఇంట్లకి పొయ్యి సణుగుతుండె.

    యాదమ్మ తిట్లు ఆపేటిది లేదు, పోరలు గడ్డలిసురుడు ఆపేటిదీ లేదు.  దినాలు గడుస్తనే ఉన్నాయి.

    ఓ పొద్దుటేళ యాదమ్మ ఇంటికాడ మంది పోగయిండ్రు, ఏదన్న పోరగాళ్ళ తోన లొల్లి గిట్లయినదేమోనని పోయిన, యాదమ్మ మంచమ్మీద పండుకొనుండె, సుట్టూ కాయల కోసమొచ్చేటి పోరలు కూసోనుండ్రు. పక్కనుండె మల్లేసం నడిగినా ఏమయిందని…
    “పొద్దుటేళ పోరలు కాయలకొచ్చిండ్రంట, అప్పటికే యాదమ్మ ఇంట్లా కింద పడి ఉన్నదంట, పాపం పోరలు లేపి మంచమ్మీదట పండుకోబెట్టి, ఆ రమేష్ డాక్టర్ని పిలుచుకొచ్చిండ్రు, డాక్టర్ సూది మందేసి, మింగనీకి గోళీలు యిచ్చి పోయిండంట.
    అప్పటి సంధి ఆ పోరలే ధూపిచ్చి, ఇడ్లీ గిట్టా పెట్టి చూస్తన్నరు, ఆళ్ళని గెసుంటి తిట్లు తిట్టె సూడు కడకి ఆళ్ళే కాపాడిండ్రన్నట్టు” మల్లేసం మాటలింటా యాదమ్మని చూస్తున్నా…
    “యాదమ్మా! నువ్వు లేచినేళ మంచిదన్నట్టు, ఆ దేవుడే పోరల్లెక్క వచ్చి కాపాడిండు, లేపోతే రేపీయాల్టికి నిన్ను బొందలో పెట్టేటోళ్శు” మందిలో నుండి ఎవరో అన్నారు.
    యాదమ్మ సుట్టూ ఉన్న పోరలొంక చూస్తాంది, పోరడొకడు ఆమె చెయ్యి మీద నిమురుతా కూర్చుండు.
    “రేయ్ అయ్యా! మిమ్మల్ని గెసుంటి మాటలంటి కదరా! అయినా ఈ ముసల్దాని మీద కోపం లేకపోయె, ఆ గోడ పక్క పెద్ద గెడ ఉండాది, తెచ్చుకోండ్రి, మీకేం కాయలు కావాల్నో కోసుకోండ్రి, ఎప్పుడు కావాల్నన్నా లోనకొచ్చి తెంపుకోండి బిడ్డా” యాదమ్మ కళ్ళలో పోరల్ని తిట్టినానన్న బాధ కనబడుతుండే.

  • ఊరెమ్మటి మల్లెతోట

    ( సాయంత్రం ఐదు గంటలకు )
    ఏంటి బాబాయ్ రమ్మన్నారంట? యేసుబాబు గాడు చెప్తే బండిటు తిప్పా, ఏం బాపినీడు గారు, సత్తిబాబు! అందరూ కచేరీ కాడికి చేరరేంది సంగతి?
    నిజమే బాబాయ్! మొన్నాపక్కగా పోతా చూసా, ఊర్లో బడి పడిపోయేట్టుగానే ఉంది, పిల్లకాయలకి ఏమైనా అయితే ఊరికి మాటొస్తది…
    ఎంత పని బాబాయ్! తలా ఓ చెయ్యేస్తే రేపు ఎండాకాలంలో కట్టేయచ్చు… కానీ….
    ఊర్లో పిల్లలు ఎక్కువగానే ఉన్నారు, రాబోయే రోజుల్ని కూడా ఆలోచిస్తే స్థలం సరిపోదేమో అనిపిస్తుంది…
    ఎవరో ఒకరు పెద్ద మనసు చేసుకోపోతే సమస్య ఎట్లా తీరుద్ది చెప్పండి?
    సరే! ఓ పన్జేద్దాం, నాకు ఆ ఊరెమ్మట మల్లెతోట ఉందిగా?
    సరిగా కాపు కూడా రాటం లేదు, ఆ స్థలం మనూరి పంచాయతీకి రాసిస్తాలే, విపులంగా బడీ అమరుద్ది, పోరలు ఆడుకుంటానికి జాగా కూడా సరిపోద్ది. కట్టుబడికి ఓ రెండు లక్షలిస్తాలే!
    అమాసెళ్ళగానే కాగితాలు రాసిస్తా! పంతుల్నడిగి మంచి రోజు మొదలెడదాం
    దాన్దేముంది బాబాయ్! నేను సంపాయించింది ఏముంది? వాళ్లిచ్చి పోయిందేగా?
    నేను తినే ప్రతి గింజ మీద వాళ్ల పేర్లేగా ఉండేది,
    అట్టాగే కానీయండి, అమ్మా నాయన్ల పేర్లే పెడదాంలే!
    ఊరున్నంత కాలం వాళ్లని జనం తలచుకుంటారు,
    నా కట్టెన్నుంత వరకూ కళ్ళారా చూసుకుంటూ తృప్తి పడతాను. బయల్దేరతాను బాబాయ్, నమస్కారం 🙏

  • జుట్టు పోలిగాడు

    ” ఒరేయ్ తింగరి సన్నాసి! ఆ పిల్లకేం తక్కువరా? మనూరి బళ్లో పదో తరగతి పాసయింది. మొన్న జానకమ్మ గారింట్లో పేరంటానికెళ్తే ఎంత చక్కగా త్యాగరాయ కీర్తనలు పాడిందో? వంటా వార్పూ దివ్యంగా చేస్తుందట, పిల్ల కూడా కుందనపు బొమ్మల్లే ఉంటుంది, నీ మొహానికి ఆ పిల్లని చేసుకోవడమే ఎక్కువరా బడుద్దాయ్, ఆ జుట్టు చూడు? జుట్టు పోలిగాడన్నా నయం!! “

    బామ్మ కేకలకి ఉలిక్కిపడి లేచాను, ఒక్కక్షణం చుట్టూ చూసి “హమ్మయ్య! కలే కదా” అనుకొని కిటికీలోనుండి కనిపిస్తున్న సూర్యుని చూస్తూ వళ్ళు విరుచుకుంటూ నిద్ర లేచాను. అన్నట్టు నా పేరు సూర్యమండీ, పూర్తి పేరు సూర్యనారాయణ మూర్తి, హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాను,  ఈరోజు మా ఊరెళ్ళాలి, రేపు నేను మొట్టమొదటి సారిగా పెళ్ళిచూపులకి వెళ్ళబోతున్నాను.
    బస్సులో ఒంగోలుకి టిక్కెట్ తీసుకుని కిటికీ పక్కన కూర్చుని పరిసరాల్ని గమనిస్తుంటే రేపు నేను పెళ్ళిచూపులు చూడబోతున్న కృష్ణమూర్తి మాస్టారి పెద్దమ్మాయి లలిత గుర్తొచ్చింది.

    ” దాదాపు రెండేళ్ళయింది తనని చూసి, మా చెల్లెలు పెళ్ళిలో చూసాను, అప్పట్లోనే చాలా బాగుండేది, మనిషి నిధానస్తురాలే గానీ అప్పుడప్పుడు కొంచెం కోపధారని అంటుండేవారు. ఇప్పుడెలా ఉంటుందో? ” అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాను.

    టౌను నుండి మా ఊరెళ్ళే ఆటో ఎక్కి లైబ్రరీ సెంటర్లో దిగి ఇంటి దారి పట్టాను. వీధి పంపు దగ్గర అందరూ నా వైపే చూస్తున్నారు. ” సీతమ్మ గారి మనవడు, పెద్దాయన కొడుకు, హైదరాబాద్లో ఉద్యోగమంట, ఆ కిట్టమూర్తి పంతుల్లేడూ వాళ్ళ పెద్దమ్మాయిని ఈ అబ్బాయి కిత్తారంట, పెళ్ళిచూపులకి వచ్చాడేమో? ఈడూ జోడూ బానే ఉంటదిలే” మొట్టమొదటి సారి మా ఊళ్లో మా యింటికి వెళ్ళటానికి చాలా కొత్తగా, సిగ్గుగా అనిపించింది.
    గుమ్మంలోకి వెళ్ళగానే ఎదురుగా వరండాలో నవ్వారు మంచమ్మీద కూర్చొని తాంబూలం నములుతూ బామ్మ కనిపించింది. ” ఏరేయ్ వెర్రి నాగన్న! ఇదేనా రావడం? ఏవమ్మా! నీ కొడుకొచ్చాడు చూడు ” అంటూ అమ్మని కేకేసింది. ఆ పిలుపులో దర్పమో, పెద్దరికమో, ఆప్యాయతో ఏముందో నాకు ఇప్పటికీ అర్థం కాదు.
    ” రా రా! ఎలా ఉన్నావు? ” అంటూ చేతిలో సూట్కేస్ తీసుకుని లోపలికి వెళుతున్న అమ్మ వైపే చూస్తూ కాళ్ళు కడుక్కొని బామ్మ పక్కన మంచమ్మీద కూర్చున్నాను. అమ్మ యిచ్చిన కాఫీ తాగుతుంటే ఏదో తెలియని ప్రశాంతత ఆవహించినట్లయింది. నా పెళ్ళిచూపులని నెల్లూరు నుండి చెల్లి బావగారు కూడా వచ్చారు.
    స్నానం చేసి అలా చిన్నప్పటి స్నేహితుడు మురళీ వాళ్ళింటిదాకా వెళ్లొద్దామని బయల్దేరాను. మురళీ వాళ్ళింటికి కృష్ణమూర్తి మాస్టారి ఇంటి ముందు నుండే వెళ్ళాలి, వాళ్ళ సందులోకి తిరిగాను, మాస్టారి ఇంటి ముందు అరుగుల మీద ఆడవాళ్ళు అందరూ కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. కొంచెం బెరుకుగా అనిపించింది, ఇంతలో ఎవరో హడావిడిగా మాస్టారి ఇంట్లోకి పరిగెత్తారు. బహుశా లలితే అయ్యింటుందని అనుకుంటూ ఎలాగో మురళీ వాళ్ళింటికి చేరుకున్నాను.
    కాసేపు పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుని ఇల్లు జేరి భోజనాలు అయినాక ఆరు బయట మంచమేసుకుని రేపటి పెళ్ళిచూపులను తలుచుకుంటూ నిద్రపోయాను.

    పొద్దున్నే నిద్ర లేచేసరికి బామ్మ హడావుడి అంతా ఇంతా కాదు. అమ్మ చేతి కాఫీ తాగి తల స్నానం చేసొచ్చాను. రాహు కాలం, వర్జ్యం లెక్కలేసి ఉదయం 10 గంటలకి బయలుదేరమని హుకుం జారీ చేసింది బామ్మ.
    అమ్మ, నాన్న, చెల్లి, బావగారు, నేను బయల్దేరాం. బామ్మని కూడా రమ్మంటే “శుభమాని వెళుతూ నేనెందుకురా వెర్రి సన్నాసి, నేను రోజూ చూస్తూనే ఉంటాగా? మీరు వెళ్లి రండి” అంటుంటే “ఈ మూఢాచారాలు ఎవడు కనిపెట్టాడురా” అనుకుంటూ మాస్టారింటికి బయలుదేరాం.
    గుమ్మంలోకి ఎదురొచ్చిన మాస్టారు ” ఏం బాబూ! బాగున్నావా? ” అంటే ” బాగున్నాను మాస్టారు ” ఎప్పటిలానే అనేసాను. “ఇంకా మాస్టారు ఏంటి? మావయ్య గారూ అనాలి” పక్క నుండి ఎవరో కైంటరేసారు.  అందరం నవ్వుకుంటూ ముందు గదిలో ఏర్పాటు చేసిన కుర్చీల్లో కూర్చున్నాం. మాస్టారి భార్య ఫలహారాలు తీసుకొచ్చారు, నేను మొహమాట పడుతుంటే అమ్మ ” పర్వాలేదు తీసుకోరా” అని చిన్నగా చెవిలో గొణిగింది.
    ” అమ్మాయిని తీసుకుని రమ్మంటారా? ” మాస్టారి గొంతులో ఆడపిల్ల తండ్రి వినయం ఏదోలా అనిపించింది.
    ఎవరో పెద్దావిడ పక్కన చిన్నగా నడుచుకుంటూ వచ్చి ఎదురుగా ఉన్న చాప మీద కూర్చుంది లలిత. నాకు తెలియకుండానే తల వంచుకుని నేల చూపులు చూస్తున్నాను.  అటు చివర్న కూర్చున్న మా చెల్లి లేచి నా కుర్చీ వెనక్కు వచ్చి నా చెవిలో  ” ఏరా! మా ఫ్రెండ్ ఎలా ఉందిరా” అంది, ” నువ్వుండవే తల్లీ! నా కసలే సిగ్గుగా ఉంది” గొణిగాను. ” మా అన్నయ్య అమ్మాయితో పర్సనల్ గా మాట్లాడాలంట” అనేసింది చెల్లి, నా గుండె ఆగినంత పనైంది. ” దాన్దేముందమ్మా! అలాగే ” అంటూనే ” ఉమా! వెనుక వసారాలో రెండు కుర్చీలు వేసి మంచినీళ్లు పెట్టమ్మా” అంటూ కేకేసారు మాస్టారు.

    ” అలాగే నాన్నగారు! ” లోపల నుండి మాస్టారి రెండో అమ్మాయి అనుకుంటా.
    మా చెల్లితో వెళ్లి వెనక కుర్చీలో కూర్చున్నాను. వాళ్ళమ్మ గారితో వచ్చి నా ఎదురుగా కుర్చీలో కూర్చుంది లలిత.
    మరుక్షణంలో మా వెంట వచ్చిన వాళ్లు మాయమైపోయారు. కాస్త ధైర్యం చేసి పైకి చూసాను, తల వంచుకుని కూర్చుంది లలిత, ” యాక్చువల్గా మా చెల్లితో నేనేమి చెప్పలేదు లలితా” అన్నాను. “నాకు తెలుసు” చాలా కాలం తర్వాత లలిత గొంతు విన్నాను. “ఏమన్నా మాట్లాడు లలిత” అన్నాను.
    “మిమ్మల్నొక విషయం అడగొచ్చా? ” అంది లలిత,
    “అడుగు లలిత” అన్నాను, “మీకూ….. తిరుపతి మొక్కేమైనా ఉందా? అహా! మరేం లేదు, బయట మిమ్మల్ని అందరూ జుట్టు పోలిగాడు అంటున్నారు, నాక్కూడా అలాగే అనిపించింది, ఒకవేళ మొక్కేమైనా ఉందేమో అలా అనుకుంటే పాపం తగులుతుందని అడిగాను” అని పెద్దగా నవ్వేసింది.
    ఒక్క క్షణం నా బుర్ర తిరిగి పోయింది. రెండంటే రెండే అంగల్లో బయట కుర్చీలోకి వచ్చి కూర్చున్నాను. “ఏరా ఏంటి సంగతి? ” అంటూ దగ్గరికి వచ్చింది చెల్లి.
    ” నిన్నూ….! భలే ఇరికిస్తావే తల్లీ నువ్వు” అని కళ్ళు పెద్దవి చేసాను. “మా అన్నయ్యకి లలిత నచ్చిందంట” గట్టిగా అరిచేసింది చెల్లి రాక్షసి.
    ” ఒంగోలు, ఒంగోలు ” కండక్టర్ కేకతో కళ్ళు తెరిచి చుట్టూ చూసాను, ఒంగోలు బస్టాండ్, అయ్యో! ఇదంతా కలేనా అనుకుంటూ పైన పెట్టిన సూట్కేస్ తీసుకుని బస్ దిగి బస్టాండ్ బయటకొచ్చి టీ స్టాల్ దగ్గరికి నడిచాను. వేడిగా టీ తాగి చుట్టూ వెతుక్కుంటున్నాను ఎక్కడుందా? అని..
    ఏంటండీ! దేనికోసం వెతుకుతున్నానో అర్థం కాలేదా?
    సెలూన్ షాప్ కోసం, హెయిర్ కట్ చేయించుకోవాలిగా”

    2
  • మళ్ళీ పండుగ ఎప్పుడొస్తుంది?

    అందరికీ నమస్కారం 🙏
    నా పేరు డాక్టర్ రాఘవ, ముగ్గురు అమ్మాయిల తర్వాత పుట్టిన వంశాకురాన్ని అని మా తాత గారి పేరు పెట్టారు రాఘవ నారాయణ అని. 🤔
    ఎమ్.ఎ(ఎకనామిక్స్) పూర్తయిన తర్వాత అర్థ శాస్త్రంలో అద్వితీయమైన పరిశోధన చేసానని యూనివర్సిటీ వారు పిహెచ్.డి పట్టాతో పాటుగా ఇచ్చిన గౌరవం నా ముందు ఉన్న డాక్టర్ గారు. నిజానికి ఈ డాక్టర్ గారికి ఇప్పటికీ సూది మందు అంటే కించిత్ భయమే.😃
    మాది ప్రకాశం జిల్లాలో ఒక చిన్న గ్రామం, ఒంగోలు నుండి యిరవై నిమిషాల ప్రయాణం. మా నాన్నగారు అప్పట్లో డిగ్రీ వరకూ చదుకున్నా ఊరి మీద ప్రేమతో, తన తండ్రి గారి పట్ల గౌరవంతో వ్యవసాయానికే మొగ్గు చూపారు. తాత గారి మరణానంతరం పూర్తిగా వ్యవసాయానికే అంకితం అయిపోయారు. ముగ్గురు అక్కలకి సలక్షణమైన సంబంధాలు చూసి పెళ్లిళ్లు చేసారు. నా కోరిక మేరకు నన్ను చదివించారు. ఒక రైతుగా ఈనాటికీ సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతున్నారు. 👍
    అమ్మ, భర్త అడుగుజాడల్లో నడుస్తున్న సాధారణ గృహిణి. మా ఊర్లో ఉన్న కోదండ రామాలయంలో ఉన్న రాముడంటే వల్లమాలిన భక్తి. ☺️
    ఇక మా బామ్మ, తాత గారు కాలం చేసాక ఇంటి బాధ్యతలు అమ్మకి అప్పజెప్పి నిరంతర దైవ నామస్మరణే కాలక్షేపంగా రోజులు వెళ్ళదీస్తుంది.🙏

    ఇదండీ! క్లుప్తంగా మా కుటుంబ చరిత్ర.
    ఇక నా స్వవివరాల లోకి వెళితే…..

    చదువు అయిపోగానే గ్రూప్ వన్ సెలక్షన్స్ కి పట్టు వదలని విక్రమార్కుని లాగా రెండు సార్లు పోటీ పడి ఒకసారి వ్రాత పరీక్షలో, మరోసారి ఇంటర్వ్యూలో భంగపడి మన అదృష్టం ఇంతే అనుకుని గ్రూప్ టూ సర్వీసుకే పరిమితమై కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దేశదిమ్మరిగా తిరుగుతూ కేంద్ర ప్రభుత్వ కార్యాలయంలో ఓ మోస్తరు బరువైన, గౌరవప్రదమైన ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. ప్రస్తుతానికి ఢిల్లీలో మకాం. 😉

    నా భార్య పేరు శ్యామల. బి.యస్సీ(కంప్యూటర్స్) చదువుకుంది. నా దృష్టిలో గృహిణిగా నూటికి నూరు మార్కులు సాధించిన మహిళ.👏
    శ్యామలని మొదటిసారి మా చిన్నక్క పెళ్ళిలో చూసాను. తను మా చిన్న బావగారికి పిన్ని గారి కూతురు. చూడగానే నచ్చేసింది. పెళ్లిలో ఆమెనే ఫాలో అవుతూ చూస్తూనే ఉన్నాను. నా చూపులు గమనించిన శ్యామల మొదట సందేహంగా చూసింది. కాసేపటికి ఒక చిరునవ్వు విసిరింది. ఇద్దరం కళ్ళతోనే పలకరించుకున్నాము. పలకరించే ధైర్యం చేసే లోపే పెళ్లి తంతు ముగిసింది, అప్పగింతలు పూర్తవగానే పెళ్లి వారితో పాటు శ్యామల కూడా వెళ్ళిపోయింది. చిన్న పలకరింపు కూడా లేకుండానే మా మొదటి కలయిక ముగిసింది. పెళ్లి పనులు అయిపోగానే నేను కూడా అప్పుడు ఉద్యోగం చేస్తున్న బెంగళూరు వెళ్ళిపోయాను. కానీ, శ్యామల ప్రతిరోజూ గుర్తుకొస్తూనే ఉంది. ఆమెని మర్చిపోవడం నాకు సాధ్యపడలేదు. 😟

    నాలుగు నెలలు గడిచాయి, కానీ శ్యామలను మాత్రం మర్చిపోలేక పోతున్నాను.
    చిన్నక్కకి ఫోన్ చేసి విషయం చెప్పేసాను. చిన్నక్క అంతా విని “సర్లే! నేను మీ బావగారికి చెప్పి వాళ్ళ నాన్నగారితో మాట్లాడమంటాను, ఆయన మాట్లాడినాక ఏ సంగతీ ఫోన్ చేస్తాలే” అంది.
    చిన్నక్క దగ్గర నుండి ఫోన్ కోసం ఎదురుచూస్తుంటే నాలుగు రోజుల తర్వాత చిన్నక్క ఫోన్ చేసి శుభవార్త చెప్పింది, వాళ్లింట్లో ఒప్పుకున్నారని, త్వరలోనే వెళ్లి నాన్నగారితో మాట్లాడతారని చెప్పింది.
    అలా ఇరువైపుల పెద్దల్ని ఒప్పించి వాళ్లందరి ఆశీస్సులతో ఓ శుభముహూర్తాన శ్యామల నా జీవిత భాగస్వామి అయింది.
    కాలం గిర్రున తిరిగిపోతోంది, మా మొదటి వెడ్డింగ్ యానివర్సరీ వచ్చేసింది. ఆ రోజు సాయంత్రం శ్యామల ఒంట్లో నలతగా ఉందంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, చెకప్ రూం లోకి వెళ్లి వచ్చిన శ్యామల నవ్వుతూ వచ్చి నా ప్రక్కన కూర్చుంది.
    తన భుజం మీద చెయ్యేసి “ఎలా ఉంది శ్యామల? డాక్టర్ గారు ఏమన్నారు” కొంచెం కలవరపడుతూనే అడిగాను.
    తను నవ్వుతూ “థాంక్స్ రాఘవా! నాకు మాతృత్వాన్ని ప్రసాదించినందుకు” అంటూ తన భుజమ్మీద ఉన్న నా చేతిని తన చేతిలోకి తీసుకుని ముద్దు పెట్టుకుంది.
    నేను తండ్రి కాబోతున్నానని తెలిసే సరికి చాలా గర్వంగా అనిపించింది. “టేక్ కేర్ ఆఫ్ హర్ హెల్త్”అని చెప్పిన డాక్టర్ గారికి థాంక్స్ చెప్పి యిద్దరం ఇల్లు చేరుకున్నాం.

    మర్నాడు ఉదయం నాన్నగారికి ఫోన్ చేసి విషయం చెప్పాను, చాలా సంతోషించారు, ఫోన్ అమ్మకి ఇవ్వమన్నాను,
    “రాఘవా! మీ నాన్నగారు చెప్పింది నిజమేనా? ఎంత మంచి శుభవార్త చెప్పావురా? అమ్మాయి ఎలా ఉంది?” అమ్మ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది.
    “తను బాగానే ఉంది, అమ్మా! నీతో ఒక విషయం చెప్పాలి, అది మేమిద్దరం ఆలోచించి తీసుకున్న నిర్ణయం, పుట్టబోయే బిడ్డ ఎవరైనా ఒకరితో ఆపేద్దాం అనుకుంటున్నాం”
    “అదేంట్రా! ఒకవేళ ఆడపిల్ల పుడితే మన వంశాంకురం లేకుండా ఎలారా?” అమ్మ మాటలు నిరుత్సాహంగా వినబడుతున్నాయి.
    “అదేదో మగబిడ్డే పుట్టేలా చూడమని నీ రాముడికి చెప్పుకోవే” పక్కనుండి నాన్న గొంతు వినబడింది.
    మొత్తానికి మా అమ్మ కోరిక రాముడు విన్నాడేమో?
    2011వ సంవత్సరం ఏప్రియల్ నెల 12వ తారీఖున స్వస్తిశ్రీ ఖర నామ సంవత్సర చైత్ర శుద్ధ నవమి అనగా శ్రీరామనవమి పర్వదినాన ఉదయం 10 గంటల 17 నిమిషాలకు శ్యామల పండంటి మగబిడ్డకు జన్మ నిచ్చింది.
    నా ఆనందానికి అవధులు లేవు. అమ్మ సంతోషం పట్టలేక నన్ను గట్టిగా హత్తుకొని ఆనంద బాష్పాలు రాల్చింది.
    అలా పుట్టాడు మా అబ్బాయి, అన్నట్టు వాడి పేరు “తేజోరాం”. మేము ముద్దుగా ‘తేజూ’ అని పిలుస్తాం.
    వాడికి ఇప్పుడు తొమ్మిదేళ్లు. ఇతర రాష్ట్రాలలో చదవడం, కేంద్రీయ విద్యాలయాల్లో చదువు వాడికి తెలుగు భాష మీద పట్టు లేకుండా పోయింది. అర్థం చేసుకోగలడు కానీ స్పష్టంగా మాట్లాడలేడు.

    మాయింట్లో నేనే ఆఖరి వాడిని కావడంతో నా పెళ్లి తర్వాత పెద్దగా కార్యక్రమాలు ఎమీ జరగలేదు. తేజూకి ఊహ తెలియనప్పుడు మూడు నాలుగుసార్లు మా ఊరెళ్ళాం. వాడు స్కూల్ కి వెళ్ళడం మొదలయ్యాక వాడినీ, శ్యామలని తీసుకుని మా ఊరికి వెళ్ళలేదు. అప్పుడప్పుడు నేను మాత్రమే వెళ్తున్నాను.
    ఇప్పుడు తేజూకి ఊహ తెలుస్తున్న వయసు, చదువు పేరుతో వాడికి చెందవలసిన ఆనందాలు మిస్ చేయడం తప్పనిపించింది.
    అందుకే ఈ యేడాది సంక్రాంతి పండుగకి అందరం మా ఊరెళదామని నిర్ణయించుకున్నాం. తెల్లవారితే భోగి పండుగ అనంగా ముందు రోజు సాయంత్రానికి మా ఊరు చేరుకున్నాం.
    ఆటో దిగి సామాన్లు దింపుకొని ఇంట్లోకి వెళుతుంటే పరిసరాల్ని ఆశ్చర్యంగా చూస్తున్నాడు తేజూ. మమ్మల్ని చూసి ఆనందంతో ఎదురొచ్చింది అమ్మ. తేజూ ఆమె వంక కొత్తగా చూస్తున్నాడు. “తేజూ! గ్రాండ్ మా” అన్నాను. అమ్మకి దగ్గరగా వెళ్ళి నిల్చున్నాడు. వాడ్ని దగ్గరకు తీసుకొని ముద్దు చేసింది అమ్మ.
    బామ్మ దగ్గరకు తీసుకొని వెళ్ళాను, ఆమె మంచం మీద కూర్చుని నవ్వుతూ చూస్తున్నాడు.
    “నాన్నగారు ఎక్కడికి వెళ్ళారమ్మా” అమ్మని అడిగాను.
    “చేను వైపు వెళ్ళినట్లున్నారు, వచ్చేస్తారులే” అంది అమ్మ.
    పండక్కి చిన్నక్క, బావ వాళ్ళ ఐదేళ్ల పాప జానకీ కూడా వచ్చారు. పెద్దక్క, రెండో అక్క వాళ్ళు అమెరికాలో ఉంటారు. వాళ్ళు ఇండియాకి వచ్చినప్పుడు చూసి వెళుతుంటారు.

    చీకటి పడే వేళకి నాన్నగారు వచ్చారు. పెద్ద మీసాలు, ఆరడుగుల మనిషి, పంచెకట్టుతో కనిపిస్తున్న నాన్నగారిని చూసి తేజూ భయంగా వాళ్ళమ్మ పక్కకి వెళ్ళి నిల్చున్నాడు. నాన్నగారు తేజూ వంక చూస్తూ “ఏవిట్రా! మీ అమ్మ చాటున దాక్కుని చూస్తున్నావు” అనగానే వాడు ఇంకొంచెం వాళ్ళ అమ్మ వెనక్కు జరిగాడు.
    “తేజూ! హి ఈజ్ యువర్ గ్రాండ్ పా, గో అండ్ విష్ హిమ్” చెప్పింది శ్యామల. నాన్నగారు నా వంక అదోలా చూసారు.
    “హాయ్ గ్రాండ్ పా”అంటూ నాన్నగారి దగ్గరకు వెళ్ళాడు. వాడి తల మీద ఆప్యాయంగా నిమిరి మౌనంగా ఇంట్లోకి వెళ్ళిపోయారు నాన్నగారు. భయంభయంగా, అందర్నీ కొత్తగా చూస్తూ ఆ పూట గడిపేసి రాత్రికి నా పక్కనే పడుకున్నాడు.
    తెల్లవారుజామున ఇంటి ముందు భోగి మంటలను వేస్తున్నారు. కాసేపు అక్కడ కూర్చుందామని వెళ్తుంటే తేజూ కూడా వచ్చాడు. వాడికి అన్నీ కొత్తగా అనిపిస్తున్నాయి.
    హరిదాసు, గంగిరెద్దుల వాళ్ళు, ఇంటి ముందు ముగ్గులు, వాటి మధ్యలో పెట్టిన గొబ్బెమ్మలను చూస్తుంటే వాడికి ఏదో వేరే ప్రపంచం లోకి వెళ్ళినట్లుగా అనిపించింది.
    తలకి నూనె రాసి, వంటికి నలుగు పిండి పట్టించి స్నానం చేయించడం, అమ్మ చేసిన పిండివంటలు, తలపైన పోస్తున్న భోగిపళ్లు, అన్నింటినీ మించి చిన్నక్క వాళ్ళమ్మాయి జానకితో ఆటలు, వీటన్నింటినీ ఆస్వాదిస్తూ తేజూ మొహంలో కనిపిస్తున్న ఆనందం నాకు, శ్యామలకి చెప్పలేని సంతోషాన్ని కలిగిస్తోంది. మొదటి రోజు వాడిలో ఉన్న బెరుకు, భయం కనుమ పండుగ నాటికి పూర్తిగా పోయింది. నాన్నగారి దగ్గరకు కూడా స్వతంత్రంగా వెళ్లి పక్కనే కూర్చుంటున్నాడు.

    కానీ, వాడు ఇంగ్లీషులో అడుగుతున్న ప్రశ్నలకు నేను, శ్యామల ఇంగ్లీషులో సమాధానాలు చెప్తుంటే నాన్నగారు మా వంక చూస్తున్న చూపులు మాత్రం బాణాల్లాగా గుచ్చుకుంటున్నాయి.
    మొత్తానికి పండుగ మూడు రోజులు చాలా ఉల్లాసంగా గడిచాయి. కనుమ వెళ్ళిన మరుసటి రోజు చిన్నక్క వాళ్ళు వాళ్ళ ఊరికి బయలుదేరారు. తేజూ జానకి వంక దిగులుగా చూస్తూ వాళ్ళమ్మ పక్కనే నిల్చున్నాడు. ఇంతలోనే ఒక్క ఉదుటున ఇంట్లోకి పరిగెత్తాడు. శ్యామలకు అర్థం కాక ఆశ్చర్యంగా చూస్తుంది.
    లోపల్నుండి తేజూ వాడి కిష్టమైన టాకింగ్ డాల్ బొమ్మని తీసుకొచ్చి జానకి చేతిలో పెట్టాడు. జానకి సంతోషంతో ఆ బొమ్మ తీసుకుని గుండెలకి హత్తుకుంది. మడతకుర్చీలో కూర్చొని నాన్నగారు అన్నీ గమనిస్తున్నారు. వాళ్ళ ఆటో వీధి మలుపు తిరిగేవరకూ గుమ్మంలోనే నిల్చుని చేయి ఊపి దిగాలుగా లోపలికి వచ్చాడు. రేపు ఢిల్లీకి తిరిగి వెళ్ళిన తర్వాత కొంపదీసి వీడు వీళ్ళందరి కోసం దిగులు పడడు కదా అనుకుంటూ నేను కూడా లోపలికి నడిచాను.
    ఆ మరుసటి రోజు మా తిరుగు ప్రయాణం. శ్యామల వాళ్ళ నాన్నగారు రిటైరైన తర్వాత వాళ్ళు విజయవాడలో స్థిరపడ్డారు. వాళ్ళింట్లో రెండు రోజులుండి ఢిల్లీ చేరుకోవాలి.
    “శ్యామలా! అన్నీ సర్దుకున్నావా? ఏమీ మర్చిపోలేదుగా?” అంటూ శ్యామలకు గుర్తు చేస్తూ ఆటో ఇంకా రాలేదని గుమ్మం వంక చూస్తున్నాను.

    లగేజ్ అంతా వరండాలోకి చేర్చిన తర్వాత నేను, శ్యామల బామ్మకి, అమ్మకి కాళ్ళకి నమస్కరించి నాన్నగారి దగ్గరకు వెళ్ళాం. ఇద్దరం ఆయన పాదాలు తాకగానే తన రెండు చేతులతో మా తలపైన నిమిరి మౌనంగా ఉండిపోయారు.
    భారమైన హృదయంతో అమ్మని చూస్తుంటే,
    “రాఘవా”అంటూ నాన్నగారు గొంతు వినబడింది, నాన్నగారికి దగ్గరగా వెళ్ళి నిలబడ్డాను, నాతో పాటే శ్యామల కూడా వచ్చింది.
    “మనం దేశాంతరాలలో ఉన్నా, రాష్ట్రేతరంగా ఉన్నా, విధి నిర్వహణలో ఎన్ని వత్తిడులున్నా, మన ఇంట్లో మాతృభాషలో మాట్లాడటం, మన పిల్లలకి మాతృభాషని నేర్పడం, సంస్కృతి, సాంప్రదాయల పట్ల అవగాహన కల్పించే ప్రయత్నం చేయడం తల్లిదండ్రుల బాధ్యత అని ఉన్నత చదువులు చదువుకున్న మీకు నేను గుర్తు చేయనవసరం లేదను కుంటున్నాను.
    రాఘవా! నువ్వు సంపాదిస్తున్న దానితో వాడు కోరుకున్న ఏ వస్తువునైనా కొనీయగలవేమో కానీ అమ్మ ప్రేమ లాంటి మాతృభాషని మాత్రం ఎంత ద్రవ్యం వెచ్చించినా అందించలేవు. అది కేవలం మీ ఇద్దరి వలనే సాధ్యం.
    శ్యామలా! చదువుకున్న దానివి, మాతృభాష యొక్క ఆవశ్యకత నీకు నేను వేరే చెప్పాలామ్మా? రోజుకి ఒక గంటసేపు పిల్లలకి మన మాతృభాష గురించి, సంస్కృతి సాంప్రదాయల గురించి చెబితే అది మనం తీర్చుకునే మాతృఋణం లాంటిదేనని మాతృత్వం పొందిన తర్వాత కూడా విస్మరించావు.
    అందుకే మీరు ఎంత పని ఒత్తిడిలో ఉన్నా ఏడాదికి ఒకసారి ఇలా పిల్లలతో స్వగ్రామానికి వస్తుంటే మాకు ఈరోజు ఇలా వాడి నోటితో గ్రాండ్ పా అనో, గ్రాండ్ మా అనో పిలిపించుకునే దౌర్భాగ్యం తప్పేది.

    తల్లిదండ్రులుగా మీరు విస్మరించిన విషయాన్ని ఇంటి పెద్దగా గుర్తు చేద్దామని చెప్పాను. ఈసారి మళ్ళీ మీరు వచ్చేనాటికి వాడు మమ్మల్ని చూసి తాతయ్య నానమ్మ అంటూ అక్కున చేరే అదృష్టాన్ని ప్రసాదించండి, అది చాలు మా జన్మ సార్థకం అవటానికి”
    నాన్నగారి మాటలకి ఏమని జవాబివ్వాలో తెలియక మా అసమర్థతను నిందించుకుంటూ మౌనంగా ఉండిపోయాను.
    “క్షమించండి మామయ్య గారు! మీరు చెప్పింది అక్షర సత్యం, తేజూ విషయంలో నేను చేస్తున్న పొరపాటును గుర్తు చేశారు. వాడు కడుపులో పడ్డాడని తెలిసిన రోజు కలిగిన ఆనందం ఇప్పుడు నాకు కలగడం లేదు. మీరు చెప్పినట్లు వాడికి మన భాష, సంస్కృతులను నేర్పగలిగిన రోజు నా మాతృత్వానికి అర్థం, తప్పకుండా నేర్పిస్తానండి” కళ్ళ నీళ్ళు చెంగుతో తుడుచుకుంటూ భావోద్వేగంతో చెప్పింది శ్యామల.
    దూరంగా సూట్కేస్ మీద కూర్చుని ఆసక్తిగా చూస్తున్నాడు తేజూ. నిధానంగా లేచి మౌనంగా బామ్మకి, అమ్మకి నమస్కారం చేసాడు. నాన్నగారి దగ్గరకు వెళ్ళి “తాతయ్య గారూ! అని పిలిచాడు. నాన్నగారి ఆనందానికి అవధుల్లేవు, వాడ్ని గట్టిగా హత్తుకొని సంబరపడి పోయారు.
    గుమ్మంలో ఆటో వచ్చింది. అమ్మ దిగులుగా చూస్తుంది. సామాన్లన్నీ ఆటోలో సర్ది “వెళ్ళొస్తాం నాన్నగారు” అన్నాను. మంచిదన్నట్లుగా తలూపారాయన.
    “తాత గారూ! మళ్ళీ పండుగ ఎప్పుడొస్తుంది?” అడిగాడు తేజూ. “మీరెప్పుడొస్తే అప్పుడే మాకు పండుగరా” అంటున్న నాన్నగారి మాటల్లో అంతరార్థం గ్రహించి నాలో నేను సిగ్గుపడుతూ ఆటో ఎక్కాను.
    1